ᐅ అభినందన
ᐅ అభినందన
మనమున్న సమాజంలో మంచి పనిచేసి యశస్వి అయిన వ్యక్తిని అభినందించడానికి ఎటువంటి పెట్టుబడీ అవసరం లేదు. కావాల్సిందల్లా హృదయవైశాల్యం. ప్రశంసకు పాత్రుడైన వ్యక్తి మిత్రుడు కావచ్చు. పొరుగింటివాడు కావచ్చు. అతడి ప్రతిభను మెచ్చుకొని రెండు మాటల్లో అభినందించడం వల్ల మన వ్యక్తిత్వానికి ఎలాంటి లోటూ ఉండదు. ఏర్పడదు.
ప్రతిష్ఠ, వయసు, పదవి మొదలైన పరిమితులను మరచి ముక్తకంఠంతో అభినందించడం మన ధర్మం. తన ప్రత్యేకతను ప్రశంసించాలని, గుర్తించాలని ప్రతి మనిషీ కోరుకుంటాడు. కాళిదాసు చెప్పినట్లు- తనలోని ప్రత్యేక గుణానికి ప్రశంస లభించినప్పుడు సాధకుడి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యక్తిలోని మాత్సర్యం, రంధ్రాన్వేషణ- ఇతరులను అభినందించడం వల్ల నశిస్తాయి. ఇతరుల సద్గుణాలను లేదా ప్రతిభను గుర్తించి, అది కొద్దిదైనా గొప్పదిగా భావించి ప్రశంసించేవారు ఎందరున్నారు? అలాంటివారు అరుదుగా ఉండవచ్చు.
వాల్మీకి రామాయణంలో ఒక సుమధుర సన్నివేశాన్ని ఇక్కడ ప్రస్తావించాలి. బాలకులైన లవకుశులు రామాయణాన్ని శ్రావ్యంగా భక్తితత్పరతతో తన్మయులై పాడుతున్నారు. జ్ఞానవృద్ధులూ వయోవృద్ధులూ అయిన మహర్షులు శ్రోతలుగా ఉన్నారు. ఆ కవల బాలల మధురగానం మహర్షులను మైమరపించింది. మహర్షులు ఆనంద బాష్పాలు రాలుస్తూ ముక్తకంఠంతో అభినందించారు. ఆలింగనం చేసుకొన్నారు. ఆ బాలకులకు ఏదైనా కానుక ఇవ్వాలనుకొన్నారు. వనవాసులు ఏమి ఇవ్వగలరు? సృష్టించి ఇవ్వగల సామర్థ్యమున్నా కాలవిలంబనం సహించలేకపోయారు. ఒక్కొక్క మహర్షి తన వద్దనున్న కమండలం, కౌపీనం, వల్కలం, కృష్ణాజినం మొదలైనవాటిని కానుకగా సమర్పించి సంతోషించారు.
ముద్దులొలికే బాలప్రతిభను ప్రశంసిస్తూ అభినందించిన ఆ మహర్షుల హృదయ సంపద అపారం. తమ తపస్సాధన, వయసు, జ్ఞానరాశి మహర్షుల అభినందనలకు అడ్డురాలేదు. వారు అందజేసిన కానుకల విలువలకు మించి వారిలోని మానవీయ విలువలు అత్యంత ప్రశస్తమైనవి. అనుకరణీయాలైనవి.
కుటుంబంలో భాగస్వామి అయిన గృహిణి విసుగు, చీకాకు లేకుండా ఇంటిగౌరవాన్ని పెంపొందిస్తుంది. కాని, చాలామంది ఆమె సేవలను గుర్తించరు. ఆమె రుచికరమైన వంటలు చేసినప్పుడు సంగీతం, నృత్యం లేదా మరే కళలోనైనా ప్రతిభను కనబరచినప్పుడు ఆమెను మనసారా అభినందిస్తే వారి జీవితాలు ఆనందమయంగా మారతాయి.
- డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి