ᐅ శని త్రయోదశి
ᐅ శని త్రయోదశి
నవగ్రహాల్లో అతిశక్తిమంతుడిగా, ప్రభావశీలిగా శనీశ్వరుణ్ని పరిగణిస్తారు. శని మకర కుంభరాశులకు అధిపతి. మార్గశిర బహుళ నవమి రోహిణీ నక్షత్రంలో శని జన్మించినట్లు పురాణ కథనం. శనీశ్వరుడి గురించి వివిధ పురాణాలు భిన్న గాథలు వివరిస్తున్నాయి. నవగ్రహాలు సూర్యుడివల్ల ఉద్భవించినవేవని, యముడే శనైశ్చరుడని వాయుపురాణం చెబుతోంది. సూర్యుడి కిరణాలు అనంతమని, వాటిలో ఏడు ప్రధాన కిరణాల నుంచి ఏడు గ్రహాలు అవతరించాయని, స్వరాట్టు అనే కిరణం నుంచి శనైశ్చరుడు ప్రభవించాడని వాయుపురాణం వివరిస్తోంది.
బ్రహ్మపురాణం ప్రకారం సూర్యుడి భార్య సంజ్ఞాదేవి. సూర్యుడికి ఆమెకువైవస్వతుడు, శ్రాద్ధదేవుడు, యముడు-యమున అనే కవలలు జన్మించారు. సంజ్ఞాదేవి సూర్యుడి తేజాన్ని భరించలేక తననుంచి ఛాయను సృజించి తాను పుట్టింటికి వెళ్లిపోయిందట. ఛాయ ద్వారా సూర్యుడికి సావర్ణుడు, శనైశ్చరుడు జన్మించారు. ఆలెక్కన శని సూర్యపుత్రుడే. శని మందగమనం గలవాడు కనుక 'మందుడు' అంటారు. అతడి వాహనం కాకి. ఇష్టమైనవి జిల్లేడు ఆకులు, నువ్వులు, తైలాభిషేకం. శని భార్య జ్యేష్ఠాదేవి.
సర్వజీవరాశిని సత్యమార్గంలో నడిపించడానికి శని అవతరించాడని విజ్ఞుల భావన. సాధారణంగా శని కష్టాలకు పర్యాయపదమని, విఘ్నాలు కలిగిస్తాడని భయపడతారు. శని చీకటిని, రహస్యాలను, కప్పినవాటిని, వయస్సు మళ్లినవారిని ఆవేశిస్తాడని, శని శ్రమసూచక గ్రహమని, దేహంలోని ఎముకలు, మూత్రపిండాల ఆరోగ్యంపై శనిప్రభావం ఉంటుందని విశ్వాసం. వాస్తవంలో- శని శుభకరుడేనని, శని దూషణ కూడదని పెద్దలు చెబుతారు. శనీశ్వర దూషణ సర్వదేవతా దూషణతో సమానమని, శని కృప సకలదేవతా కృపతో సమానమని పండితాభిప్రాయం. సత్యాహింసలు ఆచరిస్తూ, పవిత్రంగా మానవధర్మాన్ని అనుసరించేవారికి శని ఎల్లప్పుడూ అండగా ఉండి శుభాలు కలిగిస్తాడని, ఆ కారణంగా ఎవరినీ బాధించడని విజ్ఞులంటారు. శని బాధ ఆయా మానవుల పూర్వ కర్మ ఫలమని, వారి వారి కర్మలను అనుసరించి శని ఆయా వ్యక్తులను ప్రేరేపించి వారితో ఆ కర్మల ఫలితాలను అనుభవింపజేస్తాడని చెబుతారు.
గనులు, బావులు తవ్వేవారికి, చమురు అన్వేషణ చేసేవారికి శని అనుకూలత లభించగలదని విశ్వాసం. శనిదానంలో ఇనుము, ఆవనూనె, చెప్పులు, గేదె, నల్లటి వస్త్రం, నల్ల ఆవు ప్రాముఖ్యం వహిస్తాయి. త్రయోదశి తిథి, శనివారం శనీశ్వరుడికి ప్రీతిపాత్రం. లోహమయమైన శని ప్రతిమను తైలంగల పాత్రలో ఉంచి నల్లని వస్త్రం కప్పి, నీలిపుష్పాలు, తిలాన్నాలతో పూజించి ప్రతిమను దానం చేయాలంటారు. పద్మపురాణంలో దశరథకృత శనిస్తోత్రం ఉంది. భృగు సంహితలోనూ ఉంది. పరమేశ్వరుడు మునులకు 'శనైశ్చర కవచం' బోధించాడు. అందుకే శనీశ్వరుని 'శివశక్తి'గా కొందరు పేర్కొంటారు. దశరథుడు, నలమహారాజు, ధర్మరాజు మొదలైనవారు శనిని పూజించి తరించారని పురాణాలు చెబుతున్నాయి.
నవగ్రహ యజ్ఞంలో శనిగ్రహ మండలం ధనురాకారంలో ఉంటుంది. జమ్మి ఆకులు సమిధలని, అప్పాలు నైవేద్యమని అగ్ని పురాణం చెబుతోంది. నువ్వులు శని సంబంధ ధాన్యవిశేషం. శనిగ్రహప్రీతి కోసం ఇంద్రనీలం ధరిస్తారు.
సింగణాపురంలో శిలామూర్తిగా వెలసి గుడి గోపురాలు లేని దేవతగా శని భక్తుల పూజలందుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో తూర్పుగోదావరి జిల్లాలోని మందపల్లి శనీశ్వరాలయం ప్రసిద్ధం. ద్రావిడ శైలిలో నల్లరాతిపై మలచిన ఈ విగ్రహాన్ని శని త్రయోదశినాడు అభిషేకిస్తారు.
- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు