ᐅ జీవయాత్ర
ᐅ జీవయాత్ర
ఈ జీవయాత్రలో ఎన్నో మలుపులు... మరెన్నో మజిలీలు. ప్రతి మలుపులో ఏవేవో అనుభవాలు, అవరోధాలు అనుభూతులు! సుఖమొస్తే ఆనందంతో చిందులేస్తాం. కష్టం కలిగితే కలవరపడతాం. మానసికంగా కుంగిపోతాం. సమదృష్టి, స్థితప్రజ్ఞత వంటి మాటలు ఎంతగా ఒంటపట్టించుకున్నా... తనదాకా వస్తేకాని తత్వం తెలియదంటూ తల్లడిల్లిపోతాం. జీవితమంతా సుఖసంతోషాలతోనే గడిచిపోవాలని కలలు కంటాం. కాని ఆచరణలో, అనుభవంలో ఇది అసాధ్యమని తెలుసుకుంటాం.
'బాల్యం ఒక వరం... యౌవనం ప్రణయ ప్రలోభాల ప్రమాదం... వార్ధక్యం ఒక శాపం' అన్నది నానుడి. కాని తొలిదశనుంచే అప్రమత్తంగా మెలిగితే తుదిదశలో తీపి జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ హాయిగా గడపొచ్చు. ఆటపాటలతో బాల్యం గడచిపోతుంది. చదువులో ఒక్కొక్క మెట్టూ ఎక్కుతుంటే శ్రద్ధాసక్తులు పెంచుకోవాలి. కవ్వించే బలహీనతలకు లొంగిపోకూడదు. జీవితంలో స్థిరపడ్డాక పెళ్లి, పిల్లలు మన బరువు బాధ్యతలను ఒక్కసారిగా పెంచుతారు. అనుక్షణం పిల్లలు బాగా చదువుతారా లేదా ఉన్నత స్థానాలకు వెళ్తారా వెళ్లరా అన్న బెంగ పీడిస్తుంది. ఆ తరవాత మనం అనుకున్నది జరిగితే అది మనగొప్పగా భావిస్తాం. కాకుంటే ప్రాప్తం, తలరాత అంటూ విలపిస్తాం. ఖర్మకెవరూ అతీతులు కాదని వైరాగ్యాన్ని ప్రదర్శిస్తాం. కాని, చేయాల్సిన కర్మలు సకాలంలో సమర్థంగా చేస్తే ఈ 'ఖర్మ' వచ్చేది కాదుకదా అని ఆలోచించం.
దైవచింతనతో పాపభావన పటాపంచలవుతుంది. ఏ మత సంప్రదాయమైనా భగవంతుణ్ని భక్తితో కొలిస్తే మంచే జరుగుతుందని బోధిస్తుంది. విశ్వవిన్యాసంలో మానవాతీతశక్తి ఉందని గ్రంథాలు చెబుతున్నాయి. అంతవరకెందుకు? మానవుడి అంతశ్శరీర నిర్మాణమే ఒక అద్భుతం! జ్ఞాన కర్మేంద్రియాలు అవిశ్రాంతంగా పకడ్బందీగా పనిచేయడమే మానవ మేధస్సుకందని విడ్డూరం. అది చర్మచక్షువుకు గోచరించదు. మనోనేత్రంతోనే ఆ విన్యాసాన్ని వీక్షించాలి. ఆ శక్తిసామర్థ్యాలను సాధించడానికి ఎంతో ఆధ్యాత్మిక సాధన చేయాలి. నిత్యశోధన జరగాలి. కఠోర మానసిక పరిశ్రమ కావాలి. సమర్థతకు సంయమనం జతకలవాలి. దీన్ని షష్టిపూర్తి తరవాత ఆరంభిద్దామంటే ఆ జాప్యమే కాలసర్పమై కాటువేస్తుంది. ఏదో చేయాలని ఉంటుంది. ఏమీ చేయలేని నిస్సహాయత ఆవహించి మనల్ని నిర్వీర్యం చేస్తుంది.
ఈ జీవయాత్రలో ప్రతిక్షణమూ విలువైనది... అమూల్యమైనది... దీన్ని సద్వినియోగం చేసుకొన్ననాడే మానవుడు సాధకుడవుతాడు... విజేతగా నిలుస్తాడు. కాలం విలువ తెలుసుకున్నవాడే కార్యసాధకుడవుతాడు. మనం ఎంచుకున్న లక్ష్యం చేరుకోవడానికి సన్మార్గంలోనే పయనించాలి. అత్యాశకు పోయి అడ్డదారులు తొక్కితే అవి బెడిసికొట్టి మొత్తం జీవితమే నాశనమవుతుంది. ఆశల సౌధం పేకమేడలా కుప్పకూలిపోతుంది.
మనం మరణించాక కూడా ప్రజల మనసులలో మెలగాలి. శివాజీ, రామకృష్ణ పరమహంస, వివేకానంద, గాంధీ వంటివారు ఈ సూత్రాన్ని నియమబద్ధమైన ప్రణాళిక ద్వారా ఆచరించి చూపారు. ప్రతి దశలోనూ అత్యంత జాగరూకతతో వ్యవహరించి... వారు ఎంచుకున్న రంగాల్లో విజయాలు సాధించి చరిత్రలో మహనీయులు, మహాత్ములుగా మిగిలిపోయారు.
ప్రపంచంలో ఏ గ్రంథమైనా 'ధర్మమే జయిస్తుంది... అధర్మం అపజయం పాలవుతుంది' అన్న సిద్ధాంతాన్నే ప్రచారం చేసింది. సత్యం, ప్రేమ, ధర్మం వంటివి సన్మార్గంలో నడిచినవారందరూ పాటించి చూపారు. ఆ లక్షణాలు ఏ యుగంలోనైనా శాశ్వత మైలురాళ్లుగా నిలిచి భావితరాలకు దిశానిర్దేశం చేస్తాయి.
- కిల్లాన మోహన్‌బాబు