ᐅ జీవన సాఫల్యం
ᐅ జీవన సాఫల్యం
కొందర్ని సమాజం 'ధన్యజీవి'గా చెబుతుంది. సంతానంలో అందరూ అభివృద్ధిలోకి రావటం, ఉన్నతమైన వృత్తి ఉద్యోగాలు, సమృద్ధిగా సిరిసంపదలు, ప్రేమగా తల్లిదండ్రుల్ని చూసుకునే సంతానం, బాధ్యతలన్నీ ముగించుకుని ఆలుమగలిద్దరూ తీరుబడిగా తీర్థయాత్రలకు వెళ్లిరావటం వంటి అదృష్టం ఉన్నవారిని లోకం ధన్యజీవులుగా చెప్పటం రివాజు.
వాస్తవానికి, ధన్యత అంటే ఇది కాదు.
తమ వరకు తాము సుఖసంతోషాలతో బతికేందుకు మనుషుల్ని సృజించలేదు భగవంతుడు. విస్తరించే మానవ సమాజాన్ని సృష్టించాడు. పృధివి మీద ధర్మఫలాలు పండించి అందరికీ అవి సమంగా అందేలా మనిషి ప్రవర్తించాలని పరమాత్మ అపేక్షించాడు. వృత్తులు కులాలు అయినాయి, ప్రాథమికంగా ఏ పేచీ రాలేదు. ఆధిక్యతాభావాలు, స్వార్థం పెరిగాక అన్నీ కలగలిసిపోయి అర్థాలు మారిపోయాయి. చెట్టుమీద ఉన్న కోతి గొప్పదీ కాదు. నేలమీద ఉన్న ఏనుగూ తక్కువకాదు. సమభావన కోసం ఆరాటపోరాటాలు పెరిగాయి.
శత్రుభావన లేకపోతే చాలు, అపకారం చెయ్యకపోతే చాలు- అన్నంతగా రాజీపడిపోయారు ప్రజలు. సమభావన అంటే ప్రేమభావన. అందర్నీ సమంగా ప్రేమించి, ఆదరించి గౌరవించే గొప్పగుణం. దానికి వేరే నిర్వచనాల అవసరం లేదు. మనం ఎక్కడ చూసినా కల్తీలేని స్వార్థంతో ప్రవర్తించే మనుషులే దర్శనమిస్తుంటారు. ప్రపంచం ఒక ప్రేమ ఎడారిగా మారిపోయింది. ఎక్కడో ఒక నిజాయతీగల ఆధ్యాత్మికవేత్త, ఒక పుణ్యమూర్తి ఒయాసిస్సులా కనిపిస్తుంటారు. ఇలాంటి పరిస్థితిలో కూడా పరమాత్మ అలవాటుగా కరుణవర్షం కురిపిస్తూనే ఉన్నాడు. చందన వృక్షాలతో పాటు ముళ్లచెట్లకు సైతం ఆ దయాజలం లభిస్తూనే ఉంది.
మనిషి వేగవంతమైన జీవన ప్రయాణంలో ఒక్క క్షణం నిలబడి తనను తాను ప్రశ్నించుకోవాలి. తాను సరిగ్గా జీవిస్తున్నాడో లేదో తరచి చూసుకోవాలి. నిజానికిది, నిద్రకుపక్రమించే ముందు ప్రతిరోజూ చేసుకోవాల్సిన సమీక్ష. ఉదయ ప్రార్థనలో దేవుడిముందు చేయాల్సిన వాగ్దానాల్లో నీతినిజాయతీలతో ప్రవర్తిస్తాననేది ఉండి తీరాలి.
భార్యాబిడ్డలు, మిత్రులు, బంధువులు... వీరందర్నీ సంతోషపరచేందుకు అనేక పనులు చేస్తాం. భగవంతుడు సంతోషించే పనులు ఏం చేస్తున్నాం? ఈ ప్రశ్న ప్రతిరోజూ మనకు మనం వేసుకోవాలి. భగవంతుడు తమ బిడ్డలమైన మనల్ని ఎలా చూస్తున్నాడో, మనం మనతోటివారినీ అలాగే ప్రేమ, కరుణ, దయ, ఉపకారం వంటి దైవీగుణాలతో ఆనందపరచాలి. ఇలా ప్రవర్తించాలనే దృఢసంకల్పం, నియమంతో జీవించగలవారే ధన్యులు. అలాంటివారు కొద్దిమంది ఉన్నా ఆ సమాజం వారిని ప్రత్యేకంగా గుర్తించి గౌరవిస్తుంది. ఏదో విధంగా బతకటం కాదు- ఉత్తమంగా, ఉన్నతంగా జీవించటం వల్లనే జన్మ ధన్యమవుతుంది. వారిదే జన్మసాఫల్యం. ఇతరులది కాదు.
- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్