ᐅ సర్వకళామయి


 ᐅ సర్వకళామయి

దారీ తెన్నూ లేని అరణ్యాల పచ్చని నిశ్శబ్దాల్లో అంతులేని ఆనందం ఉంది. ఏకాంత తీరాల్లో నిలబడితేనే ఎంతో హాయి. ఎవరూ ప్రవేశించలేని సముద్ర నీలాల్లో తీయని సంగీతం వినిపిస్తుంది. మనిషిని ప్రేమిస్తాం సరే, ప్రకృతిని ఇంకా ప్రేమించాలి. అంతకు మించిన స్వర్గం ఎక్కడ?
ప్రకృతిని మించిన గురువు లేడు. అరణ్యవాటికల నుంచి సత్యకాముడు తిరిగి వచ్చినప్పుడు- అతడు బ్రహ్మజ్ఞాని లాగా భాసించడం అతడి తండ్రి ఉద్దాలకుడు గమనించాడు. 'నీకెవరు విద్య బోధించారు, ఈ వెలుగు ఎక్కడిది?' అని తండ్రి కొడుకును ప్రశ్నించాడు. 'మనిషి మాత్రం కాదు' అని సత్యకాముడు అన్నాడు. అంటే ప్రకృతి అని అతడి ఆంతర్యం. ఈ సంఘటన ఛాందోగ్యోపనిషత్తులోనిది.

పుష్పాలతో నవ్వే చెట్లు, గాలి తెరలతో తలలూచే పొలాలు, ప్రవక్తల వలె దివ్య ప్రబోధాలు చేస్తాయని, సుందర వనాల నుంచి వీచే ఆమని సమీరాలు మనిషిని గురించి రుషుల కన్నా ఎక్కువ బోధిస్తాయని పాశ్చాత్య కవులెందరో గానం చేశారు తమ అజరామర కవితల్లో. 'ఎందరు ముఖ్య వ్యక్తులు వచ్చినా మాట్లాడను. నాకోసం గడ్డిపరకపై మెరిసే మంచుబిందువు నిరీక్షిస్తోంది' అంటారు అమెరికన్‌ తత్వవేత్త థొరో.

ఉదయంపూట వాహ్యాళికి వెళ్తూ మరో తత్వవేత్త ఎమర్సన్‌, అందంగా విరిసిన గులాబీ పువ్వు ముందు తలవంచి అభివాదం చేసేవాడు. చెట్లు స్వర్గంవైపు భూమి చేసే ప్రార్థనలు. దురదృష్టవశాత్తు మనిషి స్వసుఖం కోసం వాటిని పడగొట్టి ప్రార్థనలు అందకుండా చేస్తున్నాడు.

పది పండ్లచెట్లను, పది పూలమొక్కలను పెంచే వ్యక్తి ఏనాటికీ నరకానికి వెళ్ళడని వరాహపురాణం చెబుతోంది.

ఉదయంవేళ చెట్ల ఆకుల సందులలోనుంచి గదుల్లోకి ప్రసరించే బంగారు కిరణాలు తత్వగ్రంథాలు చెప్పలేని దివ్యత్వాన్ని దాచుకుంటాయి.

సూర్యుణ్ని పెద్ద సోదరుడిగా, నక్షత్రాలు, చంద్రుడు, గాలి, నీరు, అగ్ని, తమ ఇతర సహోదరులుగా ఎంతమంది వూహించగలరు?

చెట్లలో, రాళ్లలో వినగలిగితే మంద్రధ్వానాలు వినిపిస్తాయి. కదిలే నదులలో కవితలు ప్రతిధ్వనిస్తాయి. నరికిన చెట్ల గుజ్జు నుంచి తెల్లకాగితాలు సృష్టిస్తాం. ఆ చెట్లకన్నా అందమైన కవిత్వాన్ని మనం ఆ కాగితాలపై రాయగలమా?

'ప్రకృతి సౌందర్యం భగవంతుడి కళావిన్నాణం. ప్రతి అందమైన వస్తువులో భగవంతుడి అదృశ్య హస్తాల అమృత స్పర్శను తనివితీరా అనుభవిద్దాం. ఆయన చేతిస్పర్శతో నదులు తుళ్లిపడుతూ ప్రవహిస్తాయి. ఆయన నవ్వినప్పుడు సూర్యుడు, చంద్రుడు కాంతులు విరజిమ్ముతారు. నక్షత్రాల్లో, పూలలో ఆయన వికాసమే ప్రకాశిస్తుంది. ఉదయించే సూర్యుడి తొలిస్పర్శకు ప్రపంచం మేలుకొంటుంది. గానం చేసే పక్షుల తీయని గీతాలతో పవనాలు పులకిస్తాయి. భగవంతుడి సృజనాత్మక వైభవం కన్న స్వప్నమే ఉదయం'- ఇంతటి అద్భుతంగా వర్ణించిన గ్రంథం రుగ్వేదమే.

అటువంటి తీయని భావసంపద జొరబడని ఉక్కు నగరాల్లో మనం వూపిరి తీస్తున్నాం. పూలపై కవితలు రాసి ఎందరో గొప్పలు చెప్పుకొంటారు. కాని, ఆ పూలను సృష్టించింది భగవంతుడే. సృష్టిలోని అందాలన్నీ భగవంతుడు నడిచి వెళ్లగా ఏర్పడిన పాద చిహ్నాలే!

- కె.యజ్ఞన్న