ᐅ మాతా పితా దైవం
ᐅ మాతా పితా దైవం
దైవమంటే అమ్మ. దైవమంటే నాన్న. అమ్మ లాలనలో, నాన్న పాలనలో అంతర్లీనంగా మనకు కనబడేది ఆ దైవతత్వమే.
ఒక్క అమ్మలోనే త్రిమాతలున్నారు. తన బిడ్డలకు విద్యాబుద్దులు నేర్పేటప్పుడు సరస్వతి, పోషణ బాధ్యత వహించేటప్పుడు లక్ష్మి, సకల శుభాలను ఆకాంక్షించేటప్పుడు పార్వతి- ఇలా త్రిమాతల త్రివేణి సంగమమే అమ్మ. అలాగే ఒక్క నాన్నలోనే త్రిమూర్తులున్నారు. తన బిడ్డలకు సకల సౌకర్యాలను సృష్టించి, సమకూర్చేటప్పుడు బ్రహ్మగాను, రక్షణ, పోషణ వహించేటప్పుడు విష్ణువుగాను, కోప్పడి, మందలించేటప్పుడు శివుడిగాను త్రిమూర్తుల అవతారాలెత్తుతాడు నాన్న.
అమ్మ ప్రియం కోరుతుంది. నాన్న హితం కోరుతాడు. అమ్మ నీకేది ఇష్టమో అదే కోరుతుంది. నాన్న నీకేది మంచో అదే కోరుతాడు. కానీ దేవుడు నీకేది ప్రాప్తమో అదే నీకు లభించేటట్లు చూస్తాడు. నువ్వు కోరినది నీకివ్వటం గాదు. నువ్వు దేనికి యోగ్యుడివో చూసి, నీకేది తగినదో, నీకేది తగనిదో ఆలోచించి అదే నీకిస్తాడు.
తల్లిదండ్రులు ఏ విధంగానైతే తమ బిడ్డల క్షేమాన్నీ, సంక్షేమాన్నీ, అభ్యున్నతినీ ఆకాంక్షిస్తారో అదేవిధంగా భగవంతుడు కూడా తన భక్తుల క్షేమాన్నీ, సంక్షేమాన్నీ, అభ్యున్నతినీ ఆకాంక్షిస్తాడు. తల్లిదండ్రులు ఏ విధంగానైతే తమ బిడ్డలు తప్పు చేసినప్పుడు క్షమించి, సహిస్తారో అదే విధంగా భగవంతుడు కూడా తన భక్తులు తప్పు చేసినపుడు క్షమించి, సహిస్తాడు.
భగవంతుడికీ, భక్తుడికీ అనుసంధానమైనది అపారమైన, అమృతతుల్యమైన అనురాగం. మనం దేవుడిపై చూపే అనురాగానికి వంద రెట్లు వాత్సల్యాన్ని దేవుడు మనపై కురిపిస్తాడు. అలాగే బిడ్డలు తల్లిదండ్రులపై చూపే అనురాగానికి వందరెట్ల వాత్సల్యాన్ని తల్లిదండ్రులు తమ బిడ్డలపై కురిపిస్తారు.
మనం దేవుడిని చూస్తే చాలదు. దేవుడు మనల్ని చూసేటట్లుగా నడచుకోవాలి. అలాగే మనం దేవుడిని ప్రేమిస్తే చాలదు. దేవుడు మనల్ని ప్రేమించేటట్లుగా నడచుకోవాలి. ఆ విధంగా ప్రేమను పొందాలంటే, ముందుగా మనం ప్రేమను పంచాలి. అయితే మనం ప్రేమించినా, ప్రేమించకపోయినా అటు దేవుడుగానీ, ఇటు తల్లిదండ్రులుగానీ మనల్ని ప్రేమిస్తూనే ఉంటారు.
మనం ఆర్తితో భగవంతుడిని చూడాలే కానీ, కంటిపాపను కంటిరెప్ప చూసుకున్నట్లుగా మనల్ని ఆయన చూసుకుంటాడు. ఒక్కోసారి మనకు కనబడినా, ఒక్కోసారి మనకు కనబడకపోయినా మన నీడ మనల్ని వెన్నంటే ఉంటుంది. అదేవిధంగా ఒక్కోసారి మనకు కనబడినా, ఒక్కోసారి మనకు కనబడకపోయినా భగవంతుడు మనల్ని వెన్నంటి ఉంటాడు. అలాగే తమ బిడ్డలు తమ దగ్గర ఉన్నా, లేకపోయినా తల్లిదండ్రులు కూడా అనుక్షణం తమ బిడ్డల గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఆరాటపడుతూ ఉంటారు.
తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు, ప్రథమ దైవాలు. ఆ దైవం ద్వితీయ తల్లిదండ్రులు. కానీ అద్వితీయమైన, అనంతమైన కరుణా వాత్సల్యాలను మనపై విస్తారంగా వర్షిస్తాడు.
సృష్టిలో అత్యంత మధురమైనది మాతా పితల ప్రేమ. దానికంటే మధురమైనది, మధురాతి మధురమైనది ఆ దైవ ప్రేమ. ఆ విధంగా తల్లిదండ్రుల్లో దేవుడిని చూడాలి. దేవుడిలో తల్లిదండ్రులను చూడాలి. ఎందుకంటే తల్లిదండ్రులు, దేవుడు వేర్వేరు కాదు. భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. అంతర్యామియై ఉన్నాడు.
- గుజ్జుల వీరనాగిరెడ్డి