ᐅ ప్రశ్నోపనిషత్‌



 ᐅ ప్రశ్నోపనిషత్‌

పూజించడం వల్ల, ప్రార్థించడం వల్ల, ధ్యానించడం వల్ల, జపించడం వల్లకంటే ప్రశ్నించడం వల్లనే మనం ఎక్కువ తెలుసుకోగలుగుతాం. ప్రశ్నించడం మనకు సహజంగా మనసుకు ఉండే అద్భుతమైన జ్ఞానమార్గం.
ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ప్రశ్నించడం వల్లనే మానవ పురోగతి సాధ్యపడింది. ప్రశ్నించడం వల్లనే ఎన్నో విశ్వరహస్యాలు బయటపడ్డాయి. ప్రశ్నించడం వల్లనే మానవుడు దుఃఖభూయిష్ఠమైన జీవనం లోంచి సుఖసోపానాలు అధిరోహిస్తున్నాడు. ప్రశ్నించడం వల్లనే ఒకరోజు అతడు జగత్తుపై ఎక్కుపెట్టిన తన దృష్టి బాణాన్ని తనమీదకు తిప్పుకోగలుగుతాడు. జీవనపోరాటంలో ప్రతి జీవీ నేర్చుకుంటూ ముందుకు వెళ్తుంది. ఈ నేర్చుకోవటం అనేది ప్రశ్నించటం మీదనే ఆధారపడి ఉంది. బుద్ధి ఉన్నా లేకపోయినా ప్రతి జీవిలోనూ ఆర్తి ఉంటుంది. అది మానవుడిలో ప్రశ్నించే గుణంగా బయటపడుతుంది. దాన్నే జిజ్ఞాస అంటారు. దీని ద్వారా ఎంతైనా జ్ఞానసముపార్జన చేయవచ్చు.

ఇది కొందరిలో జాగృతమై ఉద్దీపనగా భాసిస్తూ ఉంటుంది. వాళ్లను వివేకవంతులుగా చేస్తుంది. మరికొందరిలో నిద్రాణమై ఉంటుంది. దాన్ని బయటకు తెచ్చుకోవాలి. కత్తిని పదును పెట్టడానికి సానపట్టే రాయి ఎలా అవసరమో, వీళ్లకు జప, ధ్యాన, ప్రార్థనాదులు అవసరం. అక్కడే ఉండిపోకూడదు. ప్రశ్నించడం నేర్చుకోవాలి. ప్రశ్నించే ఓర్పు కావాలి. ఒక క్రమమార్గంలో సత్యదర్శనం అయ్యేంతవరకు ప్రశ్నిస్తూనే ఉండాలి.

రాళ్లు ప్రశ్నించలేవు. మొక్కలు ప్రశ్నించలేవు. జంతువులు ప్రశ్నించలేవు. మానవులు ప్రశ్నించగలరు. ప్రశ్నతో సర్వాన్ని సాధించగలరు. తమ హక్కులను తాము నిలబెట్టుకోగలరు. తమ బతుకును తాము సుస్థిరం చేసుకోగలరు. భూమి అనే ఈ గొప్ప గ్రహం మీదనే కాకుండా విశ్వమంతా తమ ఉనికిని చాటగలరు. అవసరమైతే భగవంతుడినే ప్రశ్నించగలరు.

భగవంతుణ్ని ఎదిరించి, పోరాడినవాళ్లు పురాణాల్లో చాలామంది ఉన్నారు. భగవంతుణ్ని ప్రేమతో ప్రశ్నించి, ఆర్తితో విన్నపాలు చేసి, స్తుతించి, కీర్తించినవాళ్లే విజయం సాధించారు. సత్యమార్గంలో మన ప్రశ్న మన దగ్గరకు వచ్చేంతవరకు దైవం గురురూపంలో సహాయం చేస్తూనే ఉంటాడు. మనగురించి మనకు తెలియడానికి ప్రశ్న అవసరం.

ప్రశ్నించే మనసుతో పుట్టాం. ప్రశ్నిస్తూ జీవిస్తున్నాం. ప్రశ్నలకు సమాధానాలు తెలియకుండా జీవితం ముగియకూడదు. ఆఖరిప్రశ్న, అంతిమప్రశ్న జీవన పరమార్థాన్ని తెలియజేస్తుంది. అది మనసులో ప్రభవించేంతవరకూ ప్రశ్నోపనిషత్‌ కొనసాగాలి. ఏదో విధంగా బతికి, ఎలాగోలా జీవించి వెళ్లిపోతే శరీరాలు మారుతూ ఉంటాయి. కాని, ప్రశ్నలు అలాగే మిగిలిపోతాయి. నల్లబల్లమీద రాసి ఉంచిన ప్రశ్నను తుడిచేస్తే దానికి సమాధానం దొరికినట్లు కాదు. పట్టుపట్టి ప్రయత్నించి ప్రశ్నకు ప్రశ్న అనుసంధానించి సమాధానం రాబట్టుకోవాలి.

ప్రశ్నలను ప్రేరేపించడమే కాదు, సమాధానాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది ఈ విశాల విశ్వం... దాన్ని నడిపిస్తున్న మహోన్నత పరమ తాత్వికశక్తి. మనమే మేధోమథనం జరపాలి. లౌకిక విషయాలకే ఎంతో భౌతిక, మానసిక శక్తి ఉపయోగించాల్సి వస్తున్నప్పుడు, దైవాన్ని తెలుసుకుని, కలుసుకుని, హృదయ నిరూపణ చేసుకోవాలంటే ఎన్ని వేల ప్రశ్నలు కావాలి? ఎంత ఆధ్యాత్మికత దేహంపై జాగృతం కావాలి?

ప్రశ్నించడం వల్ల బొగ్గుముక్కలాంటి మనం వజ్రాలుగా తయారవుతాం. ప్రశ్నించడం వల్ల సృజనాత్మకత పెరుగుతుంది. ప్రశ్నించడం వల్ల పొరలు విడిపోయినట్లు యోగ రహస్యాలు బయటపడి అవగాహనకు అందుతాయి.

మానవుడి ప్రశ్నలకు ఎక్కడో పైలోకాల్లో ఉన్న భగవంతుడు ప్రత్యక్షమై సమాధానాలు చెప్పనక్కర లేదు. అతడి హృదయంలో అనంతమైన దివ్యశక్తి నిక్షిప్తమై ఉంది. అదే ప్రశ్నను సృష్టిస్తుంది. కొనసాగిస్తుంది. చిట్టచివరకు సమాధానం ఇచ్చి సత్యదర్శనం చేయిస్తుంది.

ఆ అదృష్టం మొట్టమొదట మానవుడు వేసుకునే 'నేను ఎవరు?' అనే ప్రశ్నతోనే ప్రారంభమవుతుంది.

- ఆనందసాయి స్వామి