ᐅ అహంకారమే అంధకారం
ᐅ అహంకారమే అంధకారం
లోకమంతా చీకటిగా, ప్రపంచం ఒక దుఃఖసముద్రంలా కనిపించటానికి అసలు కారణం అహంకారం. అహంకారం అనేది ఒక రకమైన జబ్బు. నేను వేరు అనుకోవటం, ఇది నాది అనుకోవటం- ఈ రెండూ భవరోగ లక్షణాలు. ఏదైనా మూలకారణం లేనిది జబ్బు రాదు. భవరోగానికి అసలు కారణం దృష్టిలోపం. ఉన్నది ఉన్నట్లుగా చూడలేకపోవటంవల్ల, చూడలేనిది సహించలేకపోవటంవల్ల భవరోగం మరింతగా విషమిస్తుంది.
అర్జునుడు కురుక్షేత్ర రణరంగాన అడుగుపెట్టగానే అతడికి భీష్మద్రోణాది గురువులు, బంధువులు, స్నేహితులు కనిపించారు. శత్రువుల్ని చీల్చి చెండాడాలని ఉవ్విళ్లూరుతూ కృష్ణపరమాత్మను ఉభయ సేనల మధ్య రథం ఆపమని ఆజ్ఞాపించడం ఈ అహంకారపూరితమైన చర్యకు ఒక చక్కని ఉదాహరణ అని చెప్పవచ్చు. సంసారం అంటే ఇల్లు, ఇల్లాలు, పిల్లలు, తోట, పొలం, ఆస్తిపాస్తులు, చుట్టాలు, స్నేహితులు- ఇవేవీ కాదు. కనిపించేవాటితో మానసికమైన సంబంధం పెట్టుకోవటమే సంసారానికి సరైన నిర్వచనం. సన్యాసం పుచ్చుకొని హిమాలయాల్లో ముక్కు మూసుకుంటే సరిపోదు. ఇప్పుడు కనువిందు చేసి మరుక్షణం కనుమరుగైపోతున్నా వాటిని పట్టుకుని వేళ్ళాడే మనస్తత్వానికి సంసారం అని పేరు. గృహస్థుగా, కర్తవ్య కర్మలు అనుష్ఠించి తామరాకుపై నీటిచుక్కలా, నీటిమీద పయనిస్తున్న నావలా మసలుకొనే వ్యక్తికి సంసారమనే బురద అంటదు. అలాంటి వ్యక్తిని జీవన్ముక్తుడు అంటారు. మోక్షాన్ని వెతుక్కుంటూ అతడు ఎక్కడికీ వెళ్లడు. స్వర్గం అతడి భావాల్లోనే ప్రవర్తిస్తుంది.
దేహాభిమానం వదిలేసి, వస్తు విశేషాలతో మానసిక సంబంధం పెట్టుకోకపోవటంవల్లే విదేహమనే రాజ్యానికి రాజయ్యాడు జనకుడు. సచ్చిదానంద ఘనుడు అయిన పరమాత్మ ఈ జగత్తుకు మూలపురుషుడు. ఆయన సృష్టిలో భాగం అయిన మనుషులూ ఆనంద స్వరూపులే. కాని, ఈ భూమి మీద కళ్లు విప్పిన వెంటనే ఏడుపు వినిపిస్తుంది. అన్ని జీవరాశుల్లో ఒక్క మనిషికి మాత్రమే ఏడ్వటంకాని, నవ్వటంకాని సాధ్యం. అంటే, ఈ రెండూ మనిషి కొని తెచ్చుకున్నవే కాని, స్వతహాగా, జన్మతః సంక్రమించలేదన్నమాట. ఆహారం, నిద్ర, మైథునం, భయం- ఈ నాలుగూ మనిషికీ మిగతా జీవరాశులకు సమానం. తేడా ఉన్నదల్లా ఒక్క మనసు వల్లే. ఈ మనసు రెండువైపులా పదునున్న కత్తి లాంటిది. తెలివిగా ఉపయోగిస్తే, హాయిగా జీవించవచ్చు. అతితెలివిగా మితిమీరితే పీక తెగిపోవచ్చు. అందుకే, బంధానికి మోక్షానికి మనసే కారణం అంటుంది భగవద్గీత.
ఉన్నదల్లా ఆనందమే. దాన్ని అన్వేషించటానికే మనిషి పుట్టాడు. ఆలోచించే శక్తి, ఎంపిక చేసుకునే అవకాశం, అనుభవించే వెసులుబాటు- అన్నీ మనిషికి ఆ భగవంతుడు ఇచ్చిన వరాలు. వాటిని పెడతోవ పట్టించి భస్మాసురుడిలా వాటికి ఆహుతి కావటమో, ప్రకృతిని జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి- ఈ మూడింటితో అదుపుచేసి శాశ్వతమైన ఆనందం అందుకోవటమో, ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. కొత్తింటి కోడల్లా ఏడుస్తూ వచ్చి, ఇంటికి దీపం ఇల్లాలిలా జీవితాన్ని తీర్చిదిద్దుకోగల అవసరం, అవకాశం ఉన్నట్లు గ్రహించటమే కాదు- వాటిని జీవితానికి అన్వయించుకోవటమే విజ్ఞానం. ప్రపంచం అంతా తనదేనని, తనకు లోబడి నడచుకోవాలని దురాశకు పోవటంవల్లే మనిషి జీవితం శోకహతం అయిపోతున్నది. తెంచుకుంటే దుఃఖం, పంచుకుంటే ఆనందం. అన్నింటినీ కలుపుకొని ఒక నిర్దిష్టమైన గమ్యం వైపు ఈ ప్రపంచం సాగుతున్నది. సౌరశక్తి వల్ల చంద్రుడు వెన్నెల సామ్రాజ్యాన్ని ఏలుతూ, అమృత కిరణాలను భూమికి అందిస్తున్నాడు. సస్యశ్యామలమైన భూమి పైన ఆధారపడి అన్నగత ప్రాణులు జీవనం సాగిస్తున్నాయి. జీవ పరిణామక్రమంలో ఒక ఉన్నత స్థానం చేరుకున్న మానవుడు తన తెలివితేటల్ని తనకే పరిమితం చేసుకుంటున్నాడు. తన సుఖం, అందరి ఆనందంలో భాగం అని, లోకం సుభిక్షంగా ఉంటే తనూ సురక్షితంగా ఉండగలనని గ్రహించకపోవటంవల్ల చివరికి దుఃఖంపాలపడవలసి వస్తోంది. తెంచుకోవటం, ఉంచుకోవటం- ఈ రెండూ అహంకారంవల్ల మనిషిలోతలెత్తిన అవగుణాలు. అర్జునుడిలా జ్ఞానఖడ్గంతో అహంకార జనితమైన చీకటి తెరను చీల్చిన తక్షణం ఆనందం అర్ణవమై వెల్లివిరుస్తుంది. తన నిజస్వరూపం ఆనందమేనని అర్థం అవుతుంది. అహంకారానికి మూలాలు రాగద్వేషాలు. వీటి జన్మస్థలం మనసు. మనసులో చెలరేగే ఆలోచనలు కోరికలై ఈరికలెత్తుతాయి. కామం అంటే కోరిక. అది తీరకపోతే కోపం. కోపంలో ఒళ్లు మరిచిపోవడం మోహం. అందరికీ, అన్నింటికీ దూరమై ఒంటిపిల్లి రాకాసిలా బతకటమే లోభత్వం. అందువల్ల, అహంకారం, దానివల్ల చుట్టుముట్టే మోహపాశం- వీటి బారిన పడకుండా గమ్యం వైపు సాగిపోవటమే జీవిత సాఫల్యం. ప్రయాణికుడు రైలులో కూచుని ఆఖరిమజిలీ చేరేదాకా అంటిపెట్టుకున్నట్లు, మనిషి తన జీవిత యానంలో వివేకాన్ని ఆశ్రయించి ముందుకు సాగితే జయం కలుగుతుంది!
- ఉప్పు రాఘవేంద్రరావు