ᐅ జ్ఞాన పేటికలు



 ᐅ జ్ఞాన పేటికలు

భారతీయ రుషులు... జ్ఞాన పేటికలు, త్యాగ వాటికలు. వారు పెట్టిన జ్ఞానభిక్షతో ప్రపంచం సుసంపన్నమైంది. వేదాలుతప్ప మిగిలిన భారతీయ వాంగ్మయమంతా వారి భావధార. జీవితాలకు జీవితాలను పణంగా పెట్టి వారు చేసిన ధ్యానయోగం, ఆంతరిక ప్రయోగం ద్వారా లోక కల్యాణ కారక ఫలాలను ప్రపంచానికి అందించాయి. వేదాలు కూడా నేరుగా సాధారణ మానవ మాత్రులకు అందినవి కావు. ధ్యానంలో రుషులు గ్రహించి ప్రపంచానికి అనుగ్రహించినవి.
ప్రపంచం ప్రయోజనం పొందుతున్న శాస్త్రాలు రుషులు ప్రసాదించినవే. ప్రతి విషయానికి సంబంధించిన ప్రమాణ గ్రంథాలుగా శాస్త్రాలు రూపొందాయి. అగోచర విషయాలను కూడా 'త్రీ డీ'లో భూతద్దంలో పెట్టి మన అవగాహనకు అందుబాటులో ఉంచిన ఉదారులు రుషులు. ముఖ్యంగా ప్రపంచానికే ఆచార్యత్వం వహిస్తున్న భారతీయ ఆధ్యాత్మిక జ్ఞానపీఠం భారతీయ రుషుల కృషి సదనం. వారి తపో ఫలదానం. ఆధ్యాత్మిక విషయాలే కాదు- సామాజిక రాజకీయ అంశ ప్రధానాలుగా చిత్రీకరించిన వాల్మీకి, వ్యాస మహర్షి ప్రోక్తాలైన రామాయణ, మహాభారతాది ఇతిహాసాలూ మానవ జీవన సౌభాగ్యానికి కరదీపికలు, రత్నపేటికలు, ప్రమాణ గ్రంథాలు, శాస్త్ర సమానాలు. మానవ జీవన ప్రయాణంలో ప్రతి మజిలీనే కాదు, ప్రతి ప్రయాణ పథం, పదం... వీటికి సంబంధించిన కూలంకష జ్ఞానాన్ని రుషులు శాస్త్రాల పేరిట మనకు అందించారు. ఇక ఆధ్యాత్మిక అంశాల సంగతి చెప్పనే అక్కర్లేదు. అగమ్యగోచరులైన భగవంతుని ఆనుపానులతో సహా రూప విశేషాలు, సాధనారహస్యాలు... ఒకటనేముంది? బొమ్మగా మన హృదయంలో నెలకొనివున్న భగవంతుని బ్రహ్మగా మన కట్టెదుట ప్రత్యక్షం చేసేవరకు అన్ని క్రియా సాధనలను అరటిపండులా ఒలిచి మన మనో జిహ్వకు అందించారు. ఒక వాల్మీకి, ఒక వ్యాసుడు, ఒక పతంజలి, ఒక శంకరాచార్యులు, ఒక కణ్వుడు, ఓ కణాదుడు... ఎందరు, ఎందరని! ఆ ఆధ్యాత్మిక మణి మంజూషలు, ఆ జ్ఞాన శిఖరాలు మనకేమిచ్చాయో మనకు తెలుసా? ఆ ఆధ్యాత్మిక మణి మంజూషల్లో ఎన్ని జ్ఞానమణులు! మనకోసం మనమూ అధిరోహించాలని శ్రమదమాదుల కోర్చి మెట్లు పేరుస్తూ పారమార్థిక శిఖరాగ్రాలను చేరుకున్న రుషులు నిష్కామాగ్రగణ్యులు. భగవత్‌ సమానంగా ప్రాతఃస్మరణీయులు.

అరణ్యాల్లో ఒక చిన్న పర్ణశాలలో కౌపీనధారులై, దుంపలు, కాయకసరులు తింటూ, కటిక నేలమీద పవళిస్తూ తపమాచరించే రుషివరులు ప్రపంచ శాంతికి పవన రాజాలు సృష్టిస్తున్నారు. లోకకల్యాణానికి పవిత్ర సంబారాలు సమకూరుస్తున్నారు. వారి సాధనాసారాన్ని మన అవగాహనకోసం శాస్త్ర రూపంలో అక్షయ అక్షరబద్ధం చేశారు. ప్రాచీనులే కాదు. ఆధునిక రుషులూ మనకోసం శ్రేయోదాయక రచనలతో మన జ్ఞాన నాడిని స్పృశిస్తున్నారు. ఒక యోగి ఆత్మకథరాసి ఆధునిక ఆధ్యాత్మిక రంగాన్ని ఒక్క కుదుపు కుదిపిన పరమహంస యోగానంద, స్వామి వివేకానంద, స్వామి చిన్మయానంద, స్వామి శారదానంద, స్వామి శివానంద, స్వామి రంగనాథానంద, స్వామి రామా, మలయాళ స్వామి, దయానంద సరస్వతి, శ్రీరామకృష్ణులను యథాతథంగా ప్రపంచానికి అందించిన 'మ' (మహేంద్రనాథ్‌ గుప్త)... ఎందరో మహాపురుషులు, రుషులు! కానీ మనం వారు వండిపెట్టిన మృష్టాన్నాన్ని ఆచమనం చేసి ఆస్వాదించకుండా భిక్షుకుల్లా పరాయి కూటికి దోసిలి చాపుతున్నాం. రాచఠీవితో తపోజీవనం గడిపిన మానవోత్తములు మన పూర్వులు. ప్రపంచం ఉన్నంతకాలం వారి వారసులకు భుక్తికి, భక్తికి, ముక్తికి కూడా లోటు లేకుండా రాకుండా సాహిత్య రూపంలో, శాస్త్రాల రూపంలో నిధులను నిక్షిప్తం చేసిపోయారు. చిరునామా ఇచ్చారు. తాళం చెవీ ఇచ్చారు. కానీ... ఏమైంది మనకు? ఏమైపోతున్నాం మనం?! సనాతనం, సదా అధునాతనం అయిన మన సంస్కృతిని ప్రపంచ దేశాలన్నీ అత్యంత ఆసక్తితో, ఆరాధనతో అధ్యయనం చేస్తూ ఉంటే, ఆచరించే ప్రయత్నం చేస్తూ ఉంటే- మనం మాత్రం పాత చింతకాయ పచ్చడిలా అటకెక్కించిపెట్టాం. మన ధ్యానం, మన యోగం, మన హోమం... ఇప్పుడు ప్రపంచ ఆరాధ్యాలైనాయి. మన వేదాలు విశ్వానికే శిరోధార్యాలైనాయి- మనకు తప్ప!

డి.డి.టి, ఫినాయిల్‌ విష వాసనలు వదిలి గంధం, పసుపు, అగరొత్తులు, ఆవుపేడల పరిమళాలను ఆఘ్రాణిద్దాం. మత్తుపదార్థాలు వదిలి పాలు, తేనె, తులసితీర్థం పానం చేద్దాం. పిజ్జాలు, బర్గర్ల పిచ్చి వదిలి జొన్నరొట్టె, రాగి గంజి, పచ్చిధాన్యాల మొలకలు, తాజా పండ్లు, కూరలు ఆనందిద్దాం. 'యోగ' చేసి యోగులమైపోదాం. దేవుణ్ని అన్వేషించే శ్రమ చేయలేకపోతే ప్రత్యక్ష దైవాలు తల్లి, తండ్రి, గురువు, సూర్యుడు... ఉండనే ఉన్నారు. ప్రతి మనిషిలో ఒక రుషి దాగి ఉన్నాడు. కృషితో వెలికితీద్దాం. రుషి జీవనం సాగు చేద్దాం.

- చక్కిలం విజయలక్ష్మి