ᐅ చింత-నిశ్చింత



 ᐅ చింత-నిశ్చింత

చింత మనసును దహించివేస్తుంది. నిశ్చింతగా ఉండాల్సిన మనసు చింతతో స్థిరత్వాన్ని కోల్పోతుంది. పాతాళానికి జారిపోతుంది. భవిష్యత్తును నిరాశానిస్పృహలతో నింపుతుంటుంది.
ప్రధానంగా పన్నెండురకాలైన దుర్లక్షణాలవల్ల చింత కలుగుతుంది. వేదనకు గురి చేస్తుంది.
సాధు, సజ్జనులను దూషించడం, కపట సాక్ష్యం చెప్పటం, చేసినమేలును దెప్పటం, సాయంమందిస్తానని తప్పించుకుపోవడం, శరణన్నవారిని వ్యాధిగ్రస్తులను స్త్రీలను పండితులను తూలనాడటం, పరసతులను కూడటం, శత్రువుల దగ్గర తలవాల్చటం, సరిసాటి వారిదగ్గర మానధనాన్ని వీడటం, జ్ఞానవంతులను తిరస్కారభావంతో చూసి అగౌరవపరచటం, పిల్లలకు వృద్ధులకు పెట్టకుండా తన ఆకలి చల్లార్చుకోవడం, నీవే దిక్కు అనుకున్నవారిని విడిచిపెట్టడం, పరుల విత్తాన్ని దొంగిలించడం... ఇవన్నీ చింతకు గురిచేస్తాయి- ఏదో ఒకనాడు. తప్పదు.
దైనందిన జీవితంలో తెలిసో తెలీకో, ఆవేశకావేషాలవల్ల, సరిగ్గా సరైన దృష్టి సారించకపోవడంవల్ల పొరపాట్లు, తప్పులు జరిగిపోతూనే ఉంటాయి.
అందుకే ప్రతిరోజూ 'మనోసమీక్ష' అవసరం. నిదురించే సమయంలో ఆ రోజు చేసిన మంచి చెడులను విశ్లేషించుకోవాలి. ఇదొక దిద్దుబాటు చర్య. దొర్లిన పొరపాట్లు మరుసటిదినం నుంచి పునరావృతం కాకుండా చూసుకోవడం వివేకవంతుల లక్షణం. ప్రవర్తనలో ఏ మార్పు అవసరమో గుర్తెరగాలి. మానవుడు ధర్మంపట్ల అనురక్తి కలిగి ఉండాలి.

ధర్మ జీవనం నిశ్చింతను కలగజేస్తుంది. ధర్మజీవనానికి అంతరభేదాలు, కలిమిలేములు ప్రతిబంధకాలు కావు. అగ్నిలా దహించివేసే చింతను దూరంచేసుకోవాలంటే సత్‌ ప్రవర్తన ఒక్కటే మార్గం. అందచందాలు, ఆలుబిడ్డలు, ఆస్తిపాస్తులు కలిగినంత మాత్రాన చింతలకు దూరం కాలేరు. ఏదో ఒకచింత కాలుస్తూనే ఉంటుంది. ఇది నాణేనికి రెండో పార్శ్వం. తీరనికోర్కెలూ చింతకు గురిచేయక మానవు.

పురాణేతిహాసాల్లోనూ, చరిత్రలోనూ ఎన్నో పాత్రలు దర్శనమిస్తాయి. సామ్రాజ్యాధీశులు సైతం చింతతో కునారిల్లిన ఘట్టాలు కనిపిస్తాయి.
దశరథుడు శ్రీరాముణ్ని అరణ్యవాసానికి వెళ్ళమని ఆజ్ఞాపించాక, ఎడతెగని చింత ఆ తండ్రి మనసును దహించివేసింది. వరాలడిగిన కైకేయి సైతం సుఖించినదేమీలేదు. చింతతోనే కాలం గడిపింది.

అమేయ పరాక్రముడైన ఇంద్రజిత్తు యుద్ధరంగంలో మరణించాడు. కుమారుడు దూరమైన చింతే రావణుణ్ని తొంభైశాతం చంపేసింది. పుత్రవ్యామోహ పీడనం, లక్ష్యాలు సాధించలేకపోయామన్న అసంతృప్తి, సుఖ సౌఖ్యాలు పొందలేకపోయామన్న బాధ బతుకంతా గానుగెద్దు చందంగానే గడిచిపోతోందన్న వేదన... చింతకు సవాలక్ష కారణాలు!!
చాలామంది వైరాగ్యంతో జీవితాన్ని గడిపేస్తుంటారు. నిజానికది వైరాగ్యచింతన కానేకాదు.
వైరాగ్యచింతన జ్ఞానసిద్ధులకు మాత్రమే కలుగుతుంది. సుఖదుఃఖాలు అంటకపోవడం, వైరాగ్యస్థితి. అది అహంకార, మమకారాలకు చిక్కుపడని స్థితి. పరమహంస పరివ్రాజకాచార్యులకు మాత్రమే ఆ మాట వర్తిస్తుంది.

జీవితంలో ఎదురయ్యే చింతలకు 'దేవుడా, నీదేభారం!' అంటూ వాపోవడం కూడా సరైంది కాదు.
సుఖమైనా, దుఃఖమైనా, చింతైనా, నిశ్చింతైనా మన కర్మల ఫలితమేనన్న సత్యాన్ని గుర్తెరగాలి.
ఉన్నంతలో తృప్తిపడుతూ, ఆశలకు, వ్యామోహాలకు లొంగకుండా సదాచరణతో జీవనం సాగించేవారు ఎందరు లేరు!
నిశ్చలతత్వాన్ని మించిన సుగుణం మరొకటి లేదు. ఓ సాధువు చేస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమాలను వీక్షించిన ఓ మహారాజు 'సంవత్సరానికి సరిపడా ద్రవ్యాన్ని పంపిస్తాను. మీ కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగించండి' అన్నాడు. సాధువు సున్నితంగా తిరస్కరిస్తూ- 'రోజుకొకరు అన్నదానానికి సహకరిస్తున్నారు. అందరికీ తృప్తిగా ఉంటుంది. అందరూ భాగస్వాములైనట్టుగా ఉంటుంది... మన్నించండి!' అన్నాడు.

'అయితే స్వామీ! మా ఆస్థానంలో ప్రజాసంక్షేమాధికారిగా ఉండండి. విస్తృతంగా సేవాకార్యక్రమాలు నిర్వహించండి' అని సూచించాడు రాజు.
'అధికారం నా మనసును ఎప్పుడెలా మారుస్తుందో తెలీదు మహారాజా! నన్ను ఇలాగే ఉండనివ్వండి' అన్నాడు.
సూక్ష్మాన్ని గ్రహించిన మహారాజు సాధువును అభినందించాడు. మనసుకు కట్టుబాటు, లోటుపాట్ల దిద్దుబాటు- నిశ్చింతతో కూడిన జీవితాన్ని ప్రసాదిస్తుంది. దాన్ని మించిన స్వర్గం ఏముంటుంది!

- దానం శివప్రసాదరావు