ᐅ యాదగిరి నృసింహ వైభవం


 ᐅ యాదగిరి నృసింహ వైభవం

సృష్టి స్థితి లయాత్మక బ్రహ్మ విష్ణు రుద్ర సమన్వయ నారాయణ పరబ్రహ్మమే నృసింహస్వామి. శ్రీహరి దశావతారాల్లో, సద్యోజాత స్వరూపాల్లో అంటే వెంటనే ఆవిష్కారమైన అవతార పరంపరలో నృసింహావతారం విశిష్టమైనది. 'న మృగం... న మానుషం' అని వ్యాస వచనం. మృగమూ కాకుండా, మనిషీ కాకుండా నరజంతు సమ్మిళిత రూపంలో స్వామి ఆవిర్భవించాడు. 'నరసింహం' అని పేర్కొంటున్నా రెండూ కాదు అని చెప్పడమంటే, ద్వంద్వాత్మక జగమంతా ఈశ్వర చైతన్య స్వరూపం అని వెల్లడించటమే! అవతరించిన మరుక్షణమే నృసింహుడు దుష్టశిక్షణకు సమాయత్తమై భక్తవాత్సల్యమూర్తిగా ప్రహ్లాదుణ్ని అనుగ్రహించాడు. హిరణ్యకశిపుడు దక్కించుకున్న వరాలకు ఎక్కడా భంగం వాటిల్లకుండా దనుజ సంహారం చేశాడు. ప్రహ్లాద వరదుడిగా అతడి పట్ల ప్రేమాస్పదునిగా, హిరణ్యకశిపుడిపై రౌద్రమూర్తిగా ఏకకాలంలో ద్వంద్వ ప్రవృత్తులు కనబరచాడు. దివ్యమైన, భవ్యమైన అవతారతత్వంలో ప్రసన్నత్వం, ప్రళయత్వాల్ని ఏకకాలంలో ప్రకటించి రెండు అంశాల్నీ ఏకీకృతం చేసి తన మూర్తిమత్వాన్ని స్వామి అనుగ్రహించాడు.
స్తంభోద్భవుడైన నృసింహుడు, ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుల గాథలతో ముడివడిన ప్రాంతాలు, ప్రసిద్ధ క్షేత్రాలు మనరాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. హిరణ్య కశిపుడి సంహరణకోసం విష్ణువు నారసింహుడిగా ఉగ్రరూపంలో వ్యక్తమైన క్షేత్రాన్ని అహోబిలంగా పేర్కొంటారు. హిరణ్యకశిపుని వధించిన తరవాత తన ఉగ్రరూపాన్ని ఉపసంహరించి ప్రహ్లాదుడికి ప్రసన్నమూర్తిగా స్వామి దర్శనాన్ని అనుగ్రహించిన దివ్య సన్నిధే యాదగిరిగుట్ట క్షేత్రమని చెబుతారు. జ్వాలామాలికలతో, అగ్నిశిఖలా నాలిక తేజరిల్లుతుండగా, ఫాలనేత్ర వదనంతో ప్రళయ భీకరంగా ఉన్న నరసింహుడు పరమ శాంతమూర్తిగా విలసిల్లిన సన్నిధానాన్ని యాదగిరిగా వ్యవహరిస్తున్నారు.

ఈ క్షేత్రపురాణాన్ని పరిశీలిస్తే, రుష్యశృంగ మహర్షి పుత్రుడైన యాదర్షి తపస్సు ఫలితంగా స్వామి అర్చావతారమూర్తిగా యాదగిరిపై కొలువుతీరాడంటారు. నరసింహుడి దర్శనాపేక్షతో యాదర్షి కీకారణ్యంలో సంచరించసాగాడు. తనకు మార్గాన్ని సూచించవలసిందిగా యాదర్షి ఆంజనేయుణ్ని ప్రార్థించాడంటారు. తరులు, జలసిరులు, ఫల పుష్పాదులతో శోభిల్లే ఓ గిరిపై హనుమ సూచన మేరకు యాదర్షి తపస్సుకు ఉపక్రమించాడు. ఆంజనేయుడి ఆశీస్సులతో యాదర్షి కొనసాగించిన తపస్సు వల్ల నారసింహుడు ప్రత్యక్షమయ్యాడంటారు. జ్వాల, యోగానంద, గండభేరుండ, ఉగ్ర రూపాలతోపాటు శ్రీలక్ష్మీ నరసింహస్వామిగా అయిదు రూపాల్లో దర్శనమిచ్చాడనీ చెబుతారు. లోక కల్యాణంకోసం ఇదే గిరిపై సదా విలసిల్లాలని స్వామిని యాదర్షి వేడుకోగా, ఆ పంచరూపాలతోనే నృసింహుడు ఇక్కడ వెలశాడనేది పురాణగాథ. యాదర్షి తపస్సు చేసిన ఆ గిరి యాదగిరి అయ్యింది. సింహాకార గుహలో యాదగిరిపై ఆవిష్కారమైన నరసింహస్వామి పంచరూపాలతో వర్ధిల్లుతుండటంతో దీన్ని పంచనారసింహ క్షేత్రంగా వ్యవహరిస్తారు. జ్వాల, యోగానంద, శ్రీలక్ష్మీ నరసింహ స్వరూపాలు గుహలో విలసిల్లుతున్న స్వరూపాలుగా చెబుతారు. గండభేరుండ నరసింహస్వామి ఈ క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామి సన్నిధిలో నెలకొని ఉంటాడనీ, ఇక ఉగ్రనరసింహ స్వరూపం యాదగిరి చుట్టూ వర్తులాకృతిలో అదృశ్యరూపంలో ఆవరించి ఉంటుందనీ భక్తులు విశ్వసిస్తారు.

'యాదః' అంటే జలం, విశేష జలనిధి ఉన్న ప్రదేశంపై భారీ ఏకశిలాగిరి ఉన్న క్షేత్రమే యాదగిరి. యోగశాస్త్రపరంగా చూస్తే, మన శరీరంలో నాభిచక్రం జలస్థానం. దీనిపై సమున్నతంగా ఉండే గిరివంటి ప్రదేశం మన శిరస్సు. ఈ శిరస్సులోనే సహస్రార చక్రం ఉంటుంది. ఈ సహస్రారంపై స్వామిని నెలకొల్పుకోవడమే యాదగిరిపై ఉన్న నృసింహస్వామిని దర్శించడం. భక్తుల పాలిట కల్పతరువుగా పూజలందుకుంటున్న యాదగిరి లక్ష్మీనృసింహస్వామిని కాకతీయులు విశేషంగా ఆరాధించారు. పదమూడో శతాబ్ది నుంచీ ఈ క్షేత్రం వైభవ ప్రాభవాలతో వర్ధిల్లుతున్నట్లు చరిత్ర చెబుతోంది. పదిహేనో శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలుకూడా ఈ క్షేత్రాన్ని దర్శించాడని చెబుతారు. కీసరగుట్టను రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించిన తూర్పు చాళుక్యరాజు త్రిభువన మల్లుడికి యాదగిరి నృసింహస్వామి ఆరాధ్యదైవం. పాంచరాత్ర ఆగమోక్త విధానంలో ఈ క్షేత్రంలో నిత్యోత్సవాలతో మొదలుకుని బ్రహ్మోత్సవాల వరకు నేత్రపర్వంగా పరిఢవిల్లుతాయి. ప్రతి ఏటా ఫాల్గుణమాసంలో 11 రోజులపాటు బ్రహ్మోత్సవాల్ని ఈ క్షేత్రంలో నయనానందకరంగా నిర్వహిస్తారు. నేటితో యాదగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి బ్రహ్మోత్సవ సంరంభం సుసంపన్నమవుతోంది.

సజ్జన శుభంకరుడిగా, దుర్జన భయంకరుడిగా ఉద్భవించిన యాదగిరి లక్ష్మీనృసింహుణ్ని ఆశ్రయించడం... భయ సంహరణం, భవ సంతరణం, సచ్చిదానంద దాయకం, సన్మంగళ కారకం!

- డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌