ᐅ హోలీ
ᐅ హోలీ
దేశమంతటా వేర్వేరు రూపాల్లో, వేర్వేరు కారణాలతో, రకరకాలుగా ఉత్సవాలు జరిపే ఒకే ఒకరోజు ఉంది. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురినీ దంపతసహితంగా పూజించే రోజు కూడా సంవత్సరంలో ఈ రోజు ఒక్కటే. అదే ఫాల్గుణ పూర్ణిమ.
ఫాల్గుణోత్సవం, కల్యాణపూర్ణిమ, డోలాపున్నమి, హుతాశనీపూర్ణిమ, కామునిపున్నమి, అనంగపూర్ణిమ, హోళికాదహో, హోలికాపూర్ణిమ, వసంతపూర్ణిమ, హోలీ... ఇలా రకరకాల పేర్లతో పిలిచే రోజు ఒక్కటే. భిన్నమైన పేర్లు ఉన్నట్టే, ఈ రోజు జరిపే కార్యక్రమాలు, అనుసరించే ఆచారాలు, జరిపే పూజలు సైతం భిన్నమైనవే. అన్నింటి వెనక- ఆనందంతో పాటు, ఆరోగ్య భావన, ఆధ్యాత్మిక తత్వం, సామాజిక స్పృహ, పర్యావరణ పరిరక్షణ లాంటి అంశాలెన్నో ఇమిడి ఉన్నాయి. వాటికి అనేక కథనాలూ ఉన్నాయి.
శివపార్వతులను కలిపే ప్రయత్నంలో మదనుడు శివుడి ఆగ్రహానికి గురై దహనమయ్యాడు. అతడి భార్య అయిన రతీదేవి అభ్యర్థన మేరకు ఆమెకు మాత్రమే సశరీరుడిగా, మిగిలినవారికి అనంగుడిగా తిరిగి లేచిన దినం ఫాల్గుణ పూర్ణిమ. కాబట్టి ఈ రోజుకు కామునిపున్నమి, అనంగపూర్ణిమ అనే పేర్లు వచ్చాయని పురాణాలు వివరిస్తున్నాయి.
కళింగాంధ్ర (ఉత్తరాంధ్ర) ప్రాంతంలోని శివాలయాల్లో శివపార్వతుల (ప్రతిమల)ను డోలిక(ఉయ్యాల)లో వేసి వూపుతూ ఉత్సవం చేస్తారీరోజు. అదేవిధంగా బృందావనంలో బాలకృష్ణుడి ప్రతిమను ఉయ్యాలలో వేసి వూపుతూ రంగులు చల్లుకుంటూ ఉత్సవం చేస్తారు. పై రెండు కారణాల వల్ల డోలా (డోలికా) పూర్ణిమ అనే పేరు వచ్చింది.
మధురమీనాక్షి దేవి తపస్సుచేసి సుందరేశ్వర స్వామిని వివాహం చేసుకున్న రోజు ఫాల్గుణ పూర్ణిమే. కాబట్టి దక్షిణాది దేవాలయాల్లో ఈరోజు కల్యాణ(లక్ష్మీనారాయణ) వ్రతం చేస్తారు. కాబట్టి ఈ రోజుకు కల్యాణ పూర్ణిమ అనే పేరు వచ్చిందని విష్ణుపురాణ కథనం. ఉత్తర హిందూస్థానంలో వసంతరుతు ఆగమనాన్ని స్వాగతిస్తూ సృష్టికర్త అయిన బ్రహ్మను, జ్ఞానప్రదాత్రి అయిన సరస్వతీదేవిని పూజిస్తారు. దీనినే ఫాల్గుణోత్సవం అంటారు.
ఆ మర్నాడు (ఫాల్గుణ బహుళపాడ్యమి) కొన్ని రాష్ట్రాలకు సంవత్సరాది. కొత్త సంవత్సరానికి స్వాగత సూచకంగానూ, సంతోషాలను వ్యక్తం చేసుకునేందుకుగాను ఒకరిపై ఒకరు రంగుపొడులు, రంగు కలిపిన నీళ్ళు చల్లుకుంటారు. చల్లుకుంటూ హోలీ హోలీ రెరంగ హోలీ చమకేళిర హోలీ అని పాడతారు. ఆ పాట భావం క్లుప్తంగా- మోదుగపూలు తెచ్చి, రోట్లోదంచి, కుండలోవేసి, రసంతీసి, వెదురు గొట్టాల్లో నింపాలి (ఆ రసం ఎర్రగా ఉంటుంది). దీనికి వసంతం అనీ పేరుంది. దాన్ని వావి వరసలు పాటించకుండా అందరూ ఒకరిపై ఒకరు చల్లుకోవాలని ఆ పాట భావం. మోదుగ పూలు దంచగా ఏర్పడిన కషాయం ఈ మాస వాతావరణంలో ఒంటిమీద పడటంవల్ల శరీరానికి కాంతి, వర్ఛస్సు ఎక్కువవుతుంది. ఆరోగ్యం ఇనుమడిస్తుంది. శరీరంలో కలిగే ఉద్రేకాలు (రక్తపోటు లాంటి వాటివల్ల), మానసిక దుర్వికారాలు లాంటివి తగ్గుతాయని ఆయుర్వేదం చెబుతోంది.
- అయ్యగారి శ్రీనివాసరావు