ᐅ ఆత్మజ్ఞానం
ᐅ ఆత్మజ్ఞానం
ఆత్మకు లింగభేదం లేదు. గాలి, నీరు, అగ్ని, ఆయుధం ఆత్మపై ప్రభావం చూపలేవు. అదో అదృశ్య శక్తి. జీవుల్లో చైతన్యంగా ఆత్మ భాసిల్లుతుంది. తనలోని ఆత్మనే గుర్తించలేని మానవుడు సహజంగా ఎదుటివాడిలోని ఆత్మనూ చూడలేకపోతున్నాడు. తనవాళ్లు, పరాయివాళ్లు, మిత్రులు, శత్రువులు అనే ద్వంద్వాలకు దాసుడై అజ్ఞాన తిమిరంలో కొట్టుమిట్టాడుతున్నాడు. కస్తూరి మృగం పరిమళభరితమైన కస్తూరి తన బొడ్డులోనే ఉందని గ్రహించలేక ఆ సువాసన ఎక్కడినుంచి వస్తోందో తెలుసుకోవాలనే తహతహ, తపనతో నలుదిక్కులకూ పరుగులెడుతుందట! మనిషి పరమ చైతన్య స్వరూపమైన ఆత్మ. దాన్ని గుర్తించడం వల్ల కలిగే ఆనందం తనలోనే ఉన్నాయని తెలుసుకోలేక ఆనందం కోసం ప్రపంచమంతా గాలిస్తూ అది లభ్యంకాక నిరాశకు గురవుతున్నాడు. ఆత్మశక్తి మహోన్నతమైనది. ఆ శక్తి వల్లనే ఇంద్రియ కలాపాలను జీవుడు గుర్తించగలుగుతాడు.
ఎన్ని మంచి పనులు చేసినా- ఒక్క తప్పుచేస్తే లోకం మంచిని మరచిపోయి, తప్పును వేలెత్తి చూపుతుంది. భగవంతుడు అలా కాదు. ఎన్ని పాపకర్మలు ఒనర్చినా పశ్చాత్తాపం చెంది ప్రార్థిస్తే కరుణ కురిపించి అనుగ్రహిస్తాడు. క్రియ చేయాలంటే మనసు తోడ్పాటు అవసరం. ఆలోచన కార్యరూపం దాల్చాలంటే కర్మ అవసరం. వివేకవంతులు కర్మకు నమస్కరించి పని ప్రారంభిస్తారు. మనసు ఎప్పుడూ ఓ ఆలంబన కోరుకుంటుంది. ఆలంబన దొరకని పక్షంలో మనిషిలో అశాంతి చెలరేగుతుంది. పండితులు సమస్త జీవుల్లోని ఆత్మ ఒక్కటే అని భావిస్తారు. ఏకనాథుడు భక్తి సాహిత్యాన్ని ఔపోసన పట్టిన సత్కవి. ఆయన రచించిన ఏకనాథ భాగవతం ఓ విశిష్ట కావ్యం. ముందుతరంవారైన ధ్యానేశ్వరుడు, నామదేవుడు, తరవాతి కాలంలో జన్మించిన తులసీదాసుకు మధ్య వారధిగా ప్రకాశించాడు ఏకనాథుడు. ఆత్మతత్వం ఆకళింపు చేసుకొని అంటరానితనం రూపుమాపేందుకు శ్రమించాడు. సర్వజీవులపట్ల ప్రేమ కనబరచిన ఏకనాథుడు మహా శివభక్తుడు. ఒకరోజు ఆయన శివాభిషేకం కోసం పవిత్ర గోదావరి జలం తీసుకు వెళుతుండగా దారిలో ఓ జంతువు దాహార్తితో బాధపడటం ఆయన కంటపడింది. హృదయం ద్రవించిన ఆయన తను తీసుకువెళుతున్న అభిషేక జలాన్ని దానికి తాగించి ఆ జీవి ప్రాణం నిలబెట్టాడు. ఆత్మజ్ఞాని అయిన ఏకనాథుడు చివరి ఘడియల్లో పవిత్ర గోదావరి నదిలో మునిగి జలసమాధి పొంది శివైక్యం చెందాడు.
ఆత్మజ్ఞాన ప్రస్తావన శ్రీకృష్ణ భగవానుడి ఉటంకింపు లేకుండా పరిపూర్ణం కాదు. కురుక్షేత్రంలో తనవారిని చంపవలసి రావటంతో విషాదంలో కూరుకుపోయిన అర్జునుడికి గీతోపదేశం చేసిన భగవానుడు అర్జున సముఖంగా మానవాళికి మహోపకారం చేశాడు. పురందరదాసు, త్యాగయ్య, అన్నమాచార్యుడు, మీరాబాయి, కబీరు, సూరదాసు, రామదాసు, తుకారాం వంటి వారందరూ భక్తకోటికి ఆత్మజ్ఞానం అందించిన మహనీయులు. పడమరకు వెళ్లేకొద్దీ తూర్పు దూరమైనట్లు ప్రాపంచిక విషయాల వైపు సాధకుడు మక్కువ చూపేకొద్దీ దైవానికి దూరమవుతాడు. ఈ స్పృహ తెలియడంవల్ల జీవుడికి దేవుడితోగల అభేదం బోధపడుతుంది. నీటిలో వృక్షం ప్రతిబింబాన్ని చూసినప్పుడు కొమ్మలు, ఆకులు కిందకు, మూలం పైకి కనబడినట్లు- భక్తి జ్ఞాన వైరాగ్యాల సహాయంతో వాస్తవాన్ని భిన్నంగా చూపే మాయను గుర్తించి, ప్రాపంచిక ఆకర్షణలపైకి మనసు మరలకుండా పరమాత్మ పైకి దృష్టి సారించమంటాడు గీతాచార్యుడు.
- గోపాలుని రఘుపతిరావు