ᐅ హెచ్చుతగ్గులు
ᐅ హెచ్చుతగ్గులు
'చల్లగా పలకడం సజ్జన లక్షణం. ఆడంబరంగా పలకడం అల్పుడి లక్షణం' అన్నాడు వేమన. వినయంగా ఉన్నంత మాత్రాన, అందవిహీనంగా కనబడినంత మాత్రాన వారిని తక్కువ అంచనా వేయకూడదు. కులాన్నిబట్టి స్థలాన్నిబట్టి అవివేకులు మాత్రమే అధిక గౌరవం ఇస్తారు. వస్త్రాలూ ఆభరణాలూ కొన్నిచోట్లా, కొంతమందిలో మాత్రమే గౌరవం పొందుతాయి. ఉత్తమ వ్యక్తిత్వం మాత్రం అన్నిచోట్లా మన్ననలు అందుకుంటుంది. ఒక ఆధునిక కవి 'హీనంగా చూడకు దేన్నీ' అని ఉపదేశించాడు. ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్లు చిన్న పనులు చేసుకుంటూ జీవించేవారిని చిన్నచూపు చూడటం తగదు. గౌరవం ఇస్తే, గౌరవమే తిరిగి లభిస్తుంది. అవమానకరంగా మాట్లాడితే దుష్ఫలితం అనుభవించక తప్పదు.
మహావిష్ణువు ధరించే పాదుకలను చూసి శంఖ, చక్రాలూ, కిరీటమూ అపహసించాయి. 'మేము చూడు! ఎంత ఉన్నత స్థానంలో ఉన్నామో! నీవో? పాదాల కింద పడిఉన్నావు!' అని ఎగతాళి చేశాయి. 'నేను స్వామి పాదాల కింద ఉన్నందుకు సంతోషిస్తున్నాను. మహర్షులందరూ మన స్వామి పాదాలకే గదా పూజ చేసేది! మహావిష్ణువు పాదసేవా భాగ్యం లభించాలని ఎందరో తపస్సు చేస్తుంటారు. అటువంటి పాదాలను సదా స్పృశించే భాగ్యం నాకు లభించింది కదా!' అన్నవి పాదుకలు వినయంతో! యోగనిద్రలో ఉన్న స్వామి వాటి సంభాషణ విన్నాడని కథ. శ్రీమన్నారాయణుడు త్రేతాయుగంలో శ్రీరామావతారం ధరించాడు. శంఖ చక్రాలు శత్రుఘ్న, భరతులుగా అవతరించాయి. భరతుడు శ్రీరాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి, వాటికే పట్టాభిషేకం గావించి, వాటికి కిరీటాన్ని అలంకరించాడు! భరతుడు శత్రుఘ్నుడితో కలిసి ఆ పాదుకలనే పద్నాలుగేళ్లు సేవించాడు. పాదుకలు కిరీటాన్ని ధరించి ధన్యతనందాయి. రామావతారం సమాప్తమైంది. శంఖ, చక్ర, కిరీటాలు పాదుకల ప్రాధాన్యాన్ని గుర్తించాయి. దేన్నీ హీనంగా చూడకూడదని తెలుసుకున్నాయి.
ఎన్నో కులాలు, మతాలు, జాతులూ మనుషుల్లో ఉన్నాయని భావిస్తాం. ఆలోచించి చూస్తే నిజానికి ఉన్నవి రెండే జాతులు. ఒకటి 'మంచి'. రెండోది 'చెడు'. ఎన్నో వృత్తులుంటాయి. అభిరుచులూ ఉంటాయి. వీటిలో ఏది గొప్పది, ఏది తక్కువది? 'శరీరంలో శిరస్సు పైభాగాన ఉంటుంది కాబట్టి అది ఎక్కువా కాదు. పాదాలు నేలను తాకుతూ ఉంటాయి కాబట్టి అవి తక్కువా కాదు!' అనేవారు మహాత్మాగాంధీ హెచ్చుతగ్గులను గురించి మాట్లాడుతూ.
ప్రకృతిలో ప్రతిదీ దేనికది విశిష్టమైనదే! చిన్నది కూడా కొన్నింటిలో మిన్నగానే ఉంటుందంటాడు ఆర్‌డబ్ల్యు ఎమర్సన్ తన కవితలో. పర్వతం ఉడుతను చూసి 'చిట్టి దొంగా' అని హేళన చేస్తుంది. 'నేను చిట్టి జంతువుననే బాధలేదు. నీ అంత పెద్దదాన్ని కాకపోవచ్చు. అయినా... నువ్వు నా అంత చిన్నదానివి కాగలవా? అలాగే నా అంత చురుకుదనం నీలో ఉందా? నేను నీలాగా అడవిని వీపుమీద మోయలేకపోవచ్చు. కానీ, నాలాగా నీవు గట్టికాయల్ని పటుక్కున కొరకగలవా?' అని ఉడుత పర్వతాన్ని నిలదీస్తుంది! శ్రీరామసేతువు నిర్మాణానికి మహాబలశాలురైన కపి వీరులెందరో రాళ్లు మోశారు. ఉడుత ఎంత, దాని సత్తా ఎంత? తాను అల్పజీవినని అది వెనకంజ వేయలేదు. అది మోసుకువచ్చింది కొద్దిపాటి ఇసుక రేణువుల్నే! శ్రీరాముడి కృపకు పాత్రమైంది. కేరళ దేశాధిపతి కులశేఖరుడు. పరమ భక్తాగ్రేసరుడై 'కులశేఖరాళ్వారు'గా ప్రసిద్ధుడు. 'స్వామీ! వేంకటేశ్వరా! నీ ముందు రాతి గడపగా పడి ఉంటా! అలా అయితే అనునిత్యమూ నీ ముఖారవిందాన్ని తిలకించవచ్చు!' అని ప్రార్థించాడు. నేటికీ శ్రీనివాసుడి పాదాల ముందు ఉన్న తొలి గడపను 'కులశేఖరప్పడి' అని భక్తి భావంతో అంటుంటారు. ఆధిక్యతనూ ఆడంబరతనూ నిజమైన భక్తి కోరుకోదు. ఔన్నత్యమున్నప్పటికీ ఆధ్యాత్మికవేత్తలు ఆడంబరరీతిలో ప్రచారం చేసుకోలేదు. రామానుజుడు, ఆదిశంకరుడు, గురునానక్, చైతన్య ప్రభువు, కబీరు, వేమన... నిరాడంబరంగా జీవించారు. సమాజ వికాసానికి తోడ్పడ్డారు. అందరిపై ఆశీస్సులనే వర్షించారు. ప్రభువైనా చండాలుడైనా ఒక్కటే అన్నాడు అన్నమయ్య. సూరదాస్ ఇలా గానం చేశాడు- 'ఓ స్వామీ! నా దుర్గుణాలను పరిగణించవద్దు. నీ దివ్యనామం సమదృష్టి కలది. ఒక ఇనుప ముక్క దేవాలయంలో దైవ విగ్రహంగా రూపుదాలుస్తుంది. మరొక ఇనుప ముక్క మాంస విక్రేత చేతిలో కత్తిలా తయారవుతుంది. ఆ రెండు ముక్కలూ పరసువేది తగలగానే బంగారంగా మారిపోతాయి గదా!'
అవును... దేవుడి దృష్టిలో అందరూ సమానులే- హెచ్చుతగ్గులన్నీ అల్పుల కల్పనలే!
- డాక్టర్ పులిచెర్ల సాంబశివరావు