ᐅ రంధ్రాన్వేషకులు
ᐅ రంధ్రాన్వేషకులు
ఇతరుల తప్పులు ఎంచడంలో మనలో చాలామంది సిద్ధహస్తులు. ఎదుటివారిలోని లోపాలను విమర్శించడం చాలా తేలిక! అలా చేయడంలో కొందరు తగని ఆనందం పొందుతుంటారు. ఎదుటివాడు చేసిన మహత్కార్యాన్ని మాత్రం సులువుగా విస్మరిస్తుంటారు. ఆ వ్యక్తిలోని గొప్పతనాన్ని మెచ్చుకోవడానికి మనసు అసలు అంగీకరించదు.
ఇతరుల తప్పులు ఎత్తిచూపే అలవాటు సమాజంలో కొందరికి ఎక్కువగానే ఉంటుంది. ప్రతీ చిన్న తప్పునీ కొండంతలుగా చేసి చూపుతుంటారు. ఎదుటివాడిని మానసికంగా ఎంతో కొంత బాధించడమనే ప్రవృత్తి మంచి లక్షణం కాదు. విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ శాంతినికేతన్‌ను నిర్వహించే కాలంలో చిత్రకారుడిగా ఎంతో ఖ్యాతిని సంపాదించిన ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఒక చిన్న పిల్లవాడు తాను గీసిన చిత్రాన్ని తెచ్చి సందర్శకుడికి చూపాడు. ప్రముఖ చిత్రకారుడు ఆ పటాన్ని పూర్తిగా గమనించకుండానే- 'అబ్బాయ్! నీ చిత్రంలోని పువ్వు ఈ చెట్టుకొమ్మ కన్నా పెద్దదిగా ఉంది. అలా గీయడం తప్పు కదూ!' అన్నాడు. అక్కడే ఉన్న రవీంద్రులు- 'మహాశయా, ఆ చిట్టి తప్పును బాగానే గమనించారు కాని... ఆ పువ్వులోని జీవకళ మీ దృష్టిని ఆకర్షించలేదు... చిట్టి నాన్నా! నీ చిత్రంలోని అందాలను ఆయన ఆస్వాదించలేకపోతున్నారు. అంటే ఆయనకు మించిన చిత్రకారుడిగా ఎదిగే లక్షణాలు నీలో ఉన్నాయి!' అంటూ ప్రోత్సహించారు. చిత్రకారుడి మొహంలో చిరాకు అబ్బాయి కళ్లలోని ఆనందం ముందు చిన్నబోయింది.
తప్పులను సరిదిద్దలేని, ప్రత్యామ్నాయాలను సూచించలేని వ్యక్తులు ఇతరుల తప్పులు ఎత్తి చూపడానికి అనర్హులు. సముద్రం వంటి కౌరవ సేనను చూసి కొంత వేదనతో, కొంత నైరాశ్యంతో వెనకాడుతున్న పార్థుడిలో శ్రీకృష్ణుడు నిరాశనే చూసి ఉంటే, పాండవులను విజయం వరించి ఉండేది కాదు. అర్జునుడి నైరాశ్యాన్ని పారదోలి కర్తవ్యం ఉద్బోధించిన భగవద్గీత వల్ల అటు దుష్ట సంహారం జరిగింది. ముందుతరాల జీవితాలకు ప్రేరణ, దిశానిర్దేశం లభించాయి. మానవ సమాజంలోని తప్పులను ఎంచడమే మార్గదర్శకుడి లక్షణం కాదు. మహా మహులందరూ తప్పులను క్షమించి మంచికి మార్గం వేశారు. ఇతరుల్లోని తప్పిదాలనే వేలెత్తిచూపి, వారిని నిరాశకు గురిచేసే నైజం వల్ల మానవ సంబంధాలు వికటిస్తాయి. చివరికి వాళ్లు ఒంటరిగా మిగిలిపోతారు.
మనం ప్రేమించేవారిలో తప్పులను గమనించినా వాటికి పరిష్కారాలను సూచిస్తాం. అందరినీ ప్రేమించగలిగే మహానుభావుల వల్లే సమాజంలో గుణాత్మక విలువలు నిలిచి ఉన్నాయి. మనచుట్టూ మనను ప్రేమించే వారుండటం అదృష్టం! తప్పులనే చిన్న రేఖ కన్నా ఉత్సాహం పెంచే దీర్ఘరేఖ గీయడం- నిర్మాణాత్మకమైన పని. రక్తాలను ప్రవహింపజేసి రాజ్యాలను గెలవడం అనే తప్పిదం కన్నా, ప్రేమతో విశ్వాన్ని గెలవడం మంచిదనే బుద్ధుడి బోధనతో- అశోకుడు శాంతికాముకుడయ్యాడు.
కల్మషం లేని హృదయంతో ఇతరుల తప్పులను ప్రస్ఫుటం చేయడం మంచి ఫలితాలనిస్తుంది. జీవితంలో కిందపడినా తిరిగి లేచి సర్దుకొని ముందడుగు వేసేవాడే లక్ష్యసాధకుడు. అలాంటి వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలి. ఇతరుల తప్పులను భూతద్దంలో చూపే విమర్శకులకు దూరంగా ఉండాలని కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో సూచించాడు. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరుకదా...
- అప్పరుసు రమాకాంతరావు