ᐅ ఎవరా సృష్టికర్త
ᐅ ఎవరా సృష్టికర్త?
మనం విజ్ఞానయుగంలో ఉన్నాం. నేను, నాది, నాచేత- అన్న అహంభావం ఆకాశందాకా విస్తరించింది.
మనిషి పక్షిలా ఎగురుతున్నాడు. చేపలా నీటిలో మునకలు వేస్తూ ఆనందిస్తున్నాడు. చంద్రుడిపై అడుగుపెట్టాడు. అనూహ్యమైన విజయాలను సాధించాడు. ఇంత గొప్పగా ఎదిగిన మనిషి రక్తాన్ని తయారు చేయగలడా? ఎముకలను సృష్టించగలడా? పోనివ్వండి- చిన్న చీమను సజీవంగా సృష్టించగలడా? మన చుట్టూ ఉన్న విస్మయకారక పరిసరాల ఆంతర్యాన్ని తెలుసుకోగలడా? అయితే- నేను, నావల్ల అన్న మాటలన్నీ అర్థహీనం కదా?
ఒక ఆశ్రమం ఉండేది. ఎందరో విద్యార్థులు, శిష్యులు, ఆశ్రమాధిపతి అనురాగాన్ని అందుకొన్నారు. ఒక సాయంత్రం, స్వామి పూలతోటలో తిరుగుతూ, ఒక పూవు మీద కూర్చున్న తుమ్మెదను చూస్తూ నిలుచున్నారు. అరగంట దాకా ఉండటం గమనించి, శిష్యులు స్వామి చుట్టూ చేరారు. 'స్వామీ, సీతాకోక చిలుకలను చూస్తున్నారా? వాటి రంగులను చూస్తున్నారా?' అని అడిగారు.
స్వామి సమాధానమిస్తూ 'చిత్ర విచిత్రాలైన సీతాకోక చిలుకలను సృష్టించిన భగవంతుడి కళాత్మకతను ఆశ్చర్యంతో గమనిస్తున్నాను. ఇటువంటి జీవులను సృష్టించే శక్తి మానవుడికి ఉందా? ఒకవేళ సృష్టించినా అది నిర్జీవంగానే ఉంటుంది. దేవుడు ఈ సీతాకోక చిలుకకు వర్ణవైవిధ్యాన్ని, విహరించే శక్తిని ప్రసాదించాడు. ఈ పూవులకు వివిధ రంగులు, లోపల మకరందం, సువాసన ప్రసాదించాడు. సృష్టికర్త చాతుర్యం అద్భుతం. అనన్యం, అపారం' అన్నారు.
స్వామివారి మాటలు విని శిష్యులు అవాక్కయ్యారు. 'మేము ప్రతి దినం తుమ్మెదలను చూస్తున్నాం. కానీ, ఏనాడూ మీలాగా పరిశీలించలేదు. వీటిని సృష్టించిన దేవుడి గురించి కూడా ఆలోచించలేదు. ఇంత ఆనందం ప్రసాదించగలరని ఏనాడూ వూహించలేదు' అన్నారు. అప్పుడు స్వామి అందరినీ కలయచూసి, 'దేవుడు పూజామందిరంలో మాత్రమే ఉన్నాడని భావించరాదు. అతడు విశ్వమంతటా వ్యాపించి ఉన్నాడు. సూర్య, చంద్ర, భూమి, ఆకాశం, చెట్టు, చేమ, నది, సముద్రం, పశుపక్ష్యాదులు అన్నింటా, అంతటా వ్యాపించి ఉన్నాడు... వాటిని చూసి ఆనందించే అభ్యాసాన్ని అలవరచుకోవాలి. అప్పుడు జీవితం నిత్యోత్సవం కాగలదు. ప్రతి నిమిషం ఆనందమయమవుతుంది' అంటూ వివరించారు స్వామి.
విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ నోబెల్ బహుమతి అందుకొని తిరిగి వస్తున్నారు. నౌకలో ప్రయాణం చేస్తూ, పైభాగంపై నిలుచుని సముద్రాన్ని చూస్తున్నారు. ఐన్‌స్టీన్ ప్రతిభను గురించి దేశదేశాలవారు ప్రశంసలు గుప్పిస్తున్నారు. తోటి ప్రయాణికులు వారిని మాటల్లోకి దించారు.
నోబెల్ పురస్కారాన్ని అందుకొన్న తాము చాలా గొప్పవారని ప్రశంసించారు. అందుకు వెంటనే ఐన్‌స్టీన్ 'మీరు నన్ను గొప్పవాడనటం సముచితం కాదు. మన చుట్టూ ఉన్న సముద్రంలోని అపార జలరాశి, ఘోషించే సముద్రం, కనిపించే సాగర తరంగాలు అపారమైన లోతు- వీటినన్నింటినీ గమనించండి... ఆ సృష్టికర్త ఎంత గొప్పవాడు! అతడి ముందు నేనెంతటివాడిని!' అంటూ సృష్టికర్త భగవంతుణ్ని కొనియాడాడు ఐన్‌స్టీన్.
'ఎందెందు వెదికి చూచిన అందందే గలడు- చక్రి సర్వోపగతుండు' అన్న పోతన మహాకవి వాక్కులో పొల్లులేదు. వైజ్ఞానిక రంగంలోని మహనీయులనూ ఈ సృష్టి వైచిత్య్రం ఆశ్చర్య చకితుల్ని చేస్తుంది.
ఒక సభలో రేడియో నిర్మాత గుగ్లెల్మొ మార్కొని 'రేడియో తరంగాలు ఆకాశంలో వేలాది మైళ్లు ఎలా పయనిస్తాయి?' అని ప్రశ్నించాడు. రేడియో తరంగాలను గురించి మరికొన్ని ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తల్లో జగదీశ్ చంద్రబోస్ కూడా ఒకరు. మార్కొని 'ఈ తరంగాలు ఎలా పయనిస్తాయో అన్న విషయాన్ని శాస్త్రీయంగా చెప్పగలను. కానీ ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేను. ఆ రహస్యం సృష్టికర్తకే తెలుసు' అన్నాడు.
ఈ ప్రపంచంలో మనం తెలుసుకోవలసిన ముఖ్యవిషయాలు రెండు... ఒకటి ప్రకృతి నిరూపించిన నియమబద్ధ వ్యవస్థ లేదా నియతి. రెండోది మానవ స్వభావం. ప్రకృతి నియమబద్ధంగా వ్యవహరిస్తుంది. మార్పునకు వీలులేదు. ఆ వ్యవస్థలో ఏమాత్రం వ్యత్యాసం కానవచ్చినా ఘోర పరిణామం తప్పదు. మనం బతకడానికి గాలి, నీరు, వెలుగు మొదలైన పంచభూతాలు నియమబద్ధంగా ఉండటం వల్లనే మనం జీవిస్తున్నాం. ప్రకృతి మనకు దేన్నీ ఉపదేశించదు. మన దారిని మనమే అన్వేషించుకోవాలి.
మనిషి అహంకారం వదిలిపెట్టి చరాచర సృష్టి అంతా పరమాత్మ శక్తి అని విశ్వసించాలి. ఈ ప్రకృతి వివిధ రూపాల్లో, వివిధ దశల్లో సాక్షాత్కరించే 'దైవశక్తి' అని అర్థమవుతుంది. ఆ దైవశక్తి సాక్షాత్కారానికి యత్నించాలి.
ఒకమారు సోక్రటీస్ దీర్ఘంగా ఆలోచిస్తూ రహదారిపై నడుస్తున్నాడు. నడుస్తున్నప్పుడు అటూ ఇటూ చూసేవాడు కాడు. పరధ్యానంగా వస్తున్న సోక్రటీసును ఒక అధికారి ఢీకొన్నాడు. 'ఎవరు నీవు' అని అధికారి కోపంతో సోక్రటీసును అడిగాడు. సోక్రటీసు నెమ్మదిగా 'నేను, ఎవరో తెలుసుకోవడానికే ప్రయత్నిస్తున్నాను!' అన్నాడు.
ఈ 'నేను' అనేది అందరిలోనూ ఉంది. కాబట్టి నేనును గుర్తిస్తే 'సర్వం' గుర్తించేవారు కాగలరు. ఈ సర్వం తనలోనే ఉన్నదని గుర్తించి అదే దివ్యత్వమని విశ్వసించి వ్యవహరించినప్పుడు నరుడు నారాయణుడు కాగలడు.
- డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి