ᐅ జ్ఞానప్రాప్తి

 ᐅ జ్ఞానప్రాప్తి

లోకం తీరు చాలా విచిత్రంగా ఉంటుంది. ధర్మం, అధర్మం మన బుద్ధికి సులభంగా అందవు. అందుకే తికమక పడుతుంటాం. ఏదో మంచి ఉందనుకుంటాం. దాని మరుగునే చెడు దాగి ఉంటుంది. మనసు ఒక విషయంపై దృఢంగా నిలవదు. మనసుకు నిలకడ లేదు. ప్రతినిమిషం చంచలంగా ప్రవర్తిస్తాం. మనం ధర్మం అనుకున్నది ఉన్నట్లుండి అధర్మంగా మారిపోతుంది. న్యాయబద్ధంగా ప్రవర్తిస్తున్నామనుకుంటూ అధర్మ ప్రవర్తకులం అయిపోతాం. దయ ఎంతో మంచి గుణమే. కానీ, సందర్భాన్ని బట్టి అది దోషంగా మారిపోయే ప్రమాదం ఉంది. స్వధర్మాన్ని తెలుసుకోవాలి. ఎవరి స్వధర్మానికి వారు కట్టుబడి ప్రగతి సాధించాలి.
ప్రతిరోజూ మనకు తెలియకుండానే ఎన్నెన్నో పాపాలు జరిగిపోతుంటాయి. పైకి మంచిగా కనిపించినా ఆ మంచి ముసుగులో పాపం పేరుకుపోతుంది. మన బుద్ధికి యోచన చేసే శక్తి ఉంది. మనకు విచక్షణ జ్ఞానం ఉంది. ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మం, ఏది అధర్మం అనేది తెలుసుకోగలం. అయినా 'నేను', 'నాది' అనే భావాలు అహంకారం, అభిమానం మబ్బుకమ్మినట్లు మనసును కప్పేస్తాయి.

రంగుటద్దంలో చూస్తున్నట్లు మనకు ఎప్పుడూ చెడు మంచిగానే కనిపిస్తుంది. ఈ భ్రమతో అహంకారం పెరిగిపోతుంది. ఈ అహంభావం పెరగడం వల్ల మనకు మన దోషాలు కనిపించవు.

మానవులు క్రోధం, లోభం, మోహం అనే దోషాలకు లొంగిపోయి ఉంటారు. ఈ త్రిదోష స్వభావంలోనే ప్రపంచాన్ని పరిశీలిస్తారు. కాబట్టి ఎదుటివారి అభిప్రాయాలకు వాస్తవమైన విలువ ఉండదు.

మానవాతీతులైన మహాత్ముల దృష్టి నిర్దోషంగా ఉంటుంది. ఇటువంటి మహాత్ములను అనసరిస్తే జీవితం నిరామయంగా ఉంటుంది. కానీ, ఇటువంటి మహాత్ములు సులభంగా కనిపించరు.

భగవంతుడు గుణరహితుడు, దయామయుడు. పసిబిడ్డ తల్లికోసం విలపించినట్లు మనం భగవంతుడి కోసం విలపిస్తే చేతులు చాచుకొని ఆయన మనలను ఆదరిస్తాడు.

భగవంతుని పొందాలనే ఇటువంటి తపన మనలో బయలుదేరాలి. ఇతర వ్యామోహాలు లేకుండా కేవలం ఆ పరబ్రహ్మను పొందాలనే కాంక్షను ప్రబలం చేసుకోవాలి. ప్రప్రథమంగా విశ్వాసం లేకుండా ఏ పనీ సాధించలేం. పూర్తి విశ్వాసంతో కాంక్షను పెంచుకోవాలి. ఆ భగవంతుడే సర్వసమర్థుడు, ఆ భగవంతుడే ఆనంద స్వరూపుడనే విశ్వాసం ఏర్పరచుకోవాలి.

ఇటువంటి విశ్వాసం ఏర్పడితే కాంక్ష దానంతటదే ఏర్పడుతుంది. కానీ, 'కావాలని' కోరుకునే కాంక్ష కూడా దోషమే. సాత్విక, రాజసిక, తామసిక గుణాలు సదా మనల్ని ప్రభావితం చేస్తుంటాయి. సాత్విక గుణంతో కూడిన కాంక్షను పెంచుకోవాలి. లౌకిక సుఖాలను అనుభవించడానికి కాదు పరమాత్మ; పరమాత్మ కోసమే పరమాత్మ కావాలి. అలాగని ప్రయత్నిస్తే జీవితం ఆనందమయంగా ఉంటుంది. ఇదే సుఖమయ జీవితానికి సులభమార్గం. చిత్తశుద్ధితో జ్ఞానసిద్ధిని కలిగించుకోవాలి!

- రాంబాబు