ᐅ పరాభక్తి

 ᐅ పరాభక్తి

భగవంతుని చేరుకునే మార్గాల్లో భక్తి ఒకటి. యోగమార్గంలో ప్రయాణించడం కష్టం. యోగసాధనకు శారీరక బలం కావాలి. ప్రపంచ బంధాలకు దూరంగా జీవించాలి. జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా భక్తిమార్గాన్ని అనుసరించవచ్చు. భయంనుంచి, లోభత్వంనుంచి ప్రభవించేది భక్తి కాదు. 'భగవంతుడా! నాకు ప్రాపంచిక సుఖాలపై మనసులేదు. నాకు జ్ఞానం వద్దు, ముక్తి వద్దు. అనేక వందల జన్మలు ప్రాప్తించినా నాకు కావలసింది నీ సేవలోని మాధుర్యం. అటువంటి వినిర్మల భక్తిసుధాధారలతో నా జీవితం పునీతం కావాలి. ఆ వరం మాత్రం ప్రసాదించు' అని నిజమైన భగవంతుడు తనలో తాను అంతరంగ ప్రార్థన చేస్తాడు.
భగవంతుడి పట్ల ప్రేమ అక్కడే ఆగిపోతుందని చెప్పలేం. అది ఇంకా పెరిగి, పరాభక్తిగా రూపాంతరం చెందుతుంది. పరాత్పరుడి పట్ల పరమోన్నత భక్తి అది. రూపాలు నశిస్తాయి. క్రతువులు అవసరం లేదు. పుస్తకాలను దాటిపోయే దశ అది. పరాభక్తి దివ్య భూమిక అందుకున్నవాడికి ఆలయాలు, మతాలు, విగ్రహాలు, శాఖలు, దేశాలు, కాలాలతో నిమిత్తం లేదు. ఈ అల్ప పరిమితులు, బంధాలు వాటంతట అవే రాలిపోతాయి. పరాత్పరుడు, పరాభక్తి తప్ప మరేమీ కనిపించదు. అతడి స్వేచ్ఛను ప్రపంచంలో ఏదీ హరించలేదు. ఏదీ అతణ్ని బంధించలేదు.

శక్తిమంతమైన అయస్కాంత పర్వతాన్ని ఒక ఓడ సమీపించినప్పుడు- ఇనుప వూచలు, తీగలు, మేకులు అన్నీ వాటంతటవే వూడిపోయి పర్వతానికి అతుక్కుంటాయి. చెక్క ఓడ మాత్రం నీటిపై తేలుతుంటుంది. అదేవిధంగా భగవంతుడి కృపవల్ల ఆత్మను బంధించిన కాంక్షావలయాలన్నీ తెగిపోతాయి. ఈ భక్తిమార్గంలో పోరాటం లేదు. కోరికల్ని అణచివేయాలన్న ఒత్తిడి లేదు. కాఠిన్యం లేదు.

భక్తుడు తన ఉద్వేగాలను అణగదొక్కాల్సిన అవసరం లేదు. వాటినన్నింటినీ తీవ్రతరం చేసి భగవంతుడి వైపు ప్రవహించేటట్లు చేస్తే చాలు. అంతకుమించిన పరాభక్తి లేదు. పరాభక్తిలో ఆత్మహింస లేదు. ఈ వల నుంచి దేన్నీ బలవంతంగా విడదీయనవసరంలేదు. పరాభక్తిలోని పరిత్యాగం స్వేచ్ఛగా ప్రవహించే స్రవంతి లాంటిది.

భక్తుడు తాను నివసించే నగరాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని ప్రగాఢంగా ప్రేమించవచ్చు. ఈ ఉదాత్త ఉద్వేగాలు, భావాలు తనకు అపకారం చేయకుండా ఏమాత్రం హింసించకుండా పరాభక్తిలో అంతర్ధానం అవుతాయి. ఎందరో దేశభక్తులు యోగులుగా మారి, సముజ్జ్వల జ్ఞానయోగంలో భక్తియోగంలో సమున్నత శిఖరాలు అధిరోహించారు.

భగవన్నామాన్ని జపించడం, క్రతువులు, రూపాలు, ప్రతీకలు, వాటి ఆరాధన- ఇవన్నీ ఆత్మను పరిశుద్ధం చేయడానికి మాత్రమే. అవే అంతిమ తీరాలు కావు. అన్నింటికన్నా మించినది ఆత్మ పరిత్యాగం. అది లేకపోతే పరాభక్తి కాంతిసీమల్లో అడుగుపెట్టడం అసంభవం. అదీ లేకపోతే మనిషి ఆధ్యాత్మికంగా పెరగలేడు. పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మనశ్శాంతి లభిస్తుంది. సత్యం, సౌందర్యం పలకరించి వెళ్లిపోతాయి. ఆత్మ మాత్రం ఉన్నచోటే ఉండిపోతుంది. ఎటువంటి పెరుగుదలా ఉండదు.

ఆధ్యాత్మిక సంస్కృతికి సోపానం, నిజమైన కేంద్ర పరిత్యాగం. అదే పరాభక్తి మూలవిరాట్‌ రూపం.

-  కె.యజ్ఞన్న