ᐅ పంచభూతాత్మకుడు
ᐅ పంచభూతాత్మకుడు
ప్రకృతిశోభ మనిషికి పులకింపు కలిగిస్తుంది. మనోహరమైన ఆకుపచ్చని తివాచీ పరచినట్లుండే మైదానాలు, విరగబూసిన పూల చెట్లు, ఏపుగా పెరిగిన వృక్ష సంపద చూసినప్పుడు- ఎలాంటివారికైనా మనసు ఆహ్లాదభరితం కాక మానదు. అందుకు కారణం మనిషి ప్రకృతిలో భాగం కావడమే! అతడి అణువణువూ ఇతర ప్రకృతి మూలపదార్థాల్లా పంచభూతాత్మకమై ఉండటమే! అందువల్లే మనిషంటే మనిషికి ఆకర్షణ కలుగుతుంది. తోడులేక మనిషి బతకలేడు. సాహచర్యం లోపించినప్పుడు సాంగత్యం కోసం మానవుడు పరితపిస్తాడు. లభించినది సత్సాంగత్యమైతే, ఆ సంగమం మరీ శోభిల్లుతుంది. పెంపుడు జంతువులూ మనిషికి నేస్తాలవుతాయి. కొందరు మొక్కలతోనూ అనుబంధం పెంచుకుంటారు. పంచభూతాత్మకుడు కాబట్టే మనిషి పశుపక్షి వృక్షాదులతో అనుబంధం పెంచుకొని ఆనందం అనుభవించడానికి ఇష్టపడతాడు.
ఆత్మానుబంధం ఎల్లలు లేనిది. ఖండాంతర వాసులైనా ఓ మహాత్ముడు అక్కడ ఉన్నాడంటే రెక్కలు కట్టుకొని మరీ వాలతారు. కలిసి ఆశీస్సులు పొందడానికి ఉత్సాహం చూపుతారు. ఆత్మతత్వానికున్న శక్తి అదైతే, మనిషి మనిషికి మధ్య బంధాన్ని పంచభూతతత్వం పరిపుష్టం చేస్తుంది. ఆ తత్వం సమపాళ్లలో ఉన్నప్పుడు అది ఆనందం ఆవిర్భావానికి కారణమవుతుంది. పాళ్లు వికటించినపుడు అశాంతి పుట్టుకొస్తుంది. ప్రకృతిలో అగ్నితత్వం ప్రకోపించి అగ్ని ప్రమాదాలు, వరుణతత్వం ప్రకోపించి వానలు-వరదలు, భూతత్వం ప్రకోపించి భూకంపాలు-సునామీలు, ఆకాశతత్వం ప్రకోపించి ఉరుములు-పిడుగులు, వాయుతత్వం ప్రకోపించి తుపానులు-హరికేన్లు ఏర్పడటానికి కారణం కావడం చూస్తున్నాం. హోమియోవైద్యంలో మూల ఔషధ పదార్థ నిష్పత్తిని తగ్గించుకుంటూపోయి, పొటెన్సీల విలువ పెంచుకొని ఔషధ నిర్మాణం చేసినట్లు- పంచభూతతత్వంలోని మౌలిక అంశాన్ని కట్టడిచేసుకొని మానవుడు ఆనందాన్ని ఆవిర్భవింపజేసుకోవచ్చు. ఆకాశతత్వమైన శబ్దాన్ని నియంత్రించి పరమ పవిత్రమైన ప్రశాంత వాతావరణాన్ని కల్పించుకొని సాధకుడు మౌని కావచ్చు. మౌనతత్వాన్ని ఇంకా నియంత్రించి రుషి, రుషితత్వాన్ని నియంత్రించి మహర్షి, ఆ తత్వం నుంచి బ్రహ్మర్షిత్వాన్ని మనిషి పొంది సాధనను పరిపక్వం చేసుకోవచ్చు. ఒక తత్వం నుంచి వేరొక తత్వం వైపు పయనించే క్రమంలో మనిషి మహోన్నతుడిగా రూపాంతరం చెందుతాడు.
రక్త సంబంధానికి అతీతంగా చిన్నపిల్లలు పెద్దల వాత్సల్యానికి పాత్రులవుతారు. సంబంధ బాంధవ్యాలు లేకపోయినా స్పందించి చిన్నారులను ఆప్యాయంగా పలకరించి, చేరదీసి ఆనందం అనుభవించేందుకు పెద్దలు ఇష్టపడతారు. కారణం వారందరిలో మూర్తీభవించి ఉండే పంచభూత తత్వమే. అదే దివ్యత్యానికి చిరునామా! పంచభూత ప్రకృతిలో భాగమైన మానవుడూ సహజంగా పంచభూతాత్మకుడే! ఆ అమరిక అద్దంలో ప్రతిబింబంలా మనిషి ప్రకృతిలో స్వస్వరూప దర్శనం చేయడానికి ఉపకరిస్తుంది. ఆ అనుభవం సకల ప్రాణికోటికీ ప్రేమానురాగాలు పంచేందుకు తోడ్పడుతుంది. ఆత్మసాక్షాత్కారానికి అది తొలిమెట్టు. ఆ లక్ష్యం సాధించిన సాధకుడి అణువణువునా ఆత్మానందం వెల్లివిరుస్తుంది. తనకంటూ ఓ ప్రత్యేక ఉనికి ఉన్నా, జాతి కుల మత వర్ణాలకు అతీతమైన ఎల్లలు లేని పంచభూతాత్మక విశ్వంభరశక్తిలో సాధకుడు లీనమైనప్పుడు తనకు ఓ ఉపాధీ, ఉనికీ ఉండీ లేనివాడే! పంచభూతాత్మకమైన విశ్వశక్తిలో మనిషి ఓ పరమాణువు కావడమే అందుకు కారణం!
- గోపాలుని రఘుపతిరావు