ᐅ పరీక్ష-ఫలితం
పరీక్షలు దగ్గర పడ్డాయంటే- విద్యార్థులపై ఒత్తిడి; ఉపాధ్యాయుల హడావుడి, తల్లిదండ్రుల్లో కలవరం. ఒక పరీక్ష కాగానే ఇంకో పరీక్ష. రోజులు గిర్రున తిరిగిపోతాయి. పాఠ్యప్రణాళికలో లేని ప్రశ్నలు ఇచ్చారని విమర్శలు. ఫలితాలు తెలిసేదాకా నరాలు తెగే ఉత్కంఠ- ఇవన్నీ సామాన్య దృశ్యాలు.
ఈ లోకమే ఒక పరీక్ష స్థానం. అందులో మనమందరం అభ్యర్థులం. ప్రతిదినం, ప్రతిదానికీ పరీక్షే! దీనికి పాఠ్యప్రణాళికే లేదు. దీన్ని విమర్శించడానికి వీల్లేదు; విమర్శించినా నిరుపయోగం. జీవిత పరీక్షలో ప్రశ్నలకు సమాధానాలు తప్పనిసరి! ఏవో కొన్నింటిని ఎన్నుకొని, తక్కినవి వదిలేయడానికి వీల్లేదు. జీవిత పరీక్షతో పోలిస్తే విద్యార్థుల పరీక్షలు చాలా సులభం. జీవిత పరీక్షకు మనమిచ్చే సమాధానానికి ఫలితం ఎప్పుడు? వెంటనే రావచ్చు; ఆలస్యమూ కావచ్చు! ఒక జీవితకాలం పట్టవచ్చు! సమాధానం బట్టే ఫలితం. రాత పరీక్షలు, మౌఖిక పరీక్షలు ఉన్నట్లే 'చేతల' పరీక్షలూ ఉంటాయి. వాటిల్లో చెడ్డవి, మంచివి ఉండొచ్చు. సత్కార్యాలకు సత్ఫలితాలు, దుష్కార్యాలకు దుష్ఫలితాలు!
ఇతిహాసాల్లో ఇటువంటి పరీక్షలు, వాటి ఫలితాల గురించి అద్భుతరీతిలో చెప్పారు. సీతమ్మ అగ్నిపరీక్ష నెగ్గింది. అది లోకం కోసం జరిగిన పరీక్ష! సత్యహరిశ్చంద్రుడి జీవితంలో అడుగడుగునా పరీక్ష. పరీక్షాధికారి విశ్వామిత్రుడు. అన్ని ప్రశ్నలకూ హరిశ్చంద్రుడి సమాధానం మాత్రం ఒకటే- 'సత్యం'. విశ్వామిత్రుడు తన యాగానికి ధనం కావాలని హరిశ్చంద్రుని కోరాడు. ఇస్తాను తీసుకుపొమ్మన్నాడు. తరవాత వస్తానని వెళ్లిపోయాడు విశ్వామిత్రుడు.
హరిశ్చంద్రుడు వేటకు వెళ్లినప్పుడు మాతంగ కన్యలు తమను వివాహమాడమని కోరారు. హరిశ్చంద్రుడు అంగీకరించలేదు. విశ్వామిత్రుడు వచ్చి అడిగాడు. 'నా రాజ్యమైనా ఇస్తానుగాని, ఏకపత్నీ వ్రతం తప్పను!' అన్నాడు హరిశ్చంద్రుడు. 'అయితే నీ రాజ్యం ఇచ్చేయ'మన్నాడు మహర్షి. ఆడిన మాటకోసం తన రాజ్యాన్నే ధారపోశాడు హరిశ్చంద్రుడు. అక్కడినుంచి పరీక్షల పరంపర ప్రారంభమైంది. 'లోగడ నాకు ధనం ఇవ్వాలి గదా! ఇప్పుడు అవసరం వచ్చింది! ఇవ్వు!' అన్నాడు విశ్వామిత్రుడు. 'నేను అలా అనలేదు!' అనే సమాధానం ఇస్తే... ఇక కష్టాలే ఉండవు. కానీ, కష్టాలను ఇష్టంగా ఎదుర్కొని సత్యాన్ని కాపాడటానికే సంసిద్ధుడయ్యాడు హరిశ్చంద్రుడు.
హరిశ్చంద్రుడి వెంట నక్షత్రకుణ్ని పంపాడు రుషి. నక్షత్రకుడెన్ని విధాల చెప్పినా ఆడిన మాట తప్పడానికి హరిశ్చంద్రుడు అంగీకరించలేదు. నక్షత్రకుడు పెట్టిన బాధలను తట్టుకొని నిలిచాడు. కాశీనగరంలో కౌశికుడికి భార్యాపుత్రులను అమ్మి, అప్పటికీ- 'అప్పు' తీరక తనను కూడా అమ్ముకున్నాడు. వీరబాహువు అనే కాటికాపరి హరిశ్చంద్రుణ్ని కొనుక్కొని, ఆయనను శ్మశానంలో కాపలాగా ఉంచాడు. ఇంకోవైపు కుమారుడు లోహితుడు పాముకాటుకు ప్రాణాలు కోల్పోయాడు. భార్య చంద్రమతి కొడుకు కళేబరాన్ని శ్మశానానికి తెచ్చింది. కాటి సుంకం చెల్లించమన్నాడు హరిశ్చంద్రుడు. తన మంగళసూత్రం అమ్మి సొమ్ము తేవాలనిపోగా, ఆమెపై హత్యానేరం వచ్చిపడింది. శిరచ్ఛేదనం కోసం ఆమెను శ్మశానానికి తెచ్చి హరిశ్చంద్రుడి ఎదుట నిలుచోబెట్టారు భటులు... ఎన్ని పరీక్షలు! ఈ పరీక్షల పరంపర చూస్తే మనం పడే కష్టాలు ఏ మూలకు అనిపిస్తుంది ఎవరికైనా. విధిపెట్టే పరీక్షలు అవి. తానే భార్యకు శిరచ్ఛేదనం చేయవలసిన దుస్థితి హరిశ్చంద్రుడిది. దేవతలు ప్రత్యక్షమై హరిశ్చంద్రుడి సత్యవ్రతాన్ని ప్రశంసించారు. ఆయన అన్ని పరీక్షల్లోనూ నెగ్గి తుదకు 'సత్యహరిశ్చంద్రుడు' అనే ఖ్యాతిని యుగయుగాలుగా నిలుపుకొన్నాడు! 'అంతటి హరిశ్చంద్రుడికే తప్పలేదు తిప్పలు... మామూలు మనుషులం... మనమెంత!' అని తమకు తామే ధైర్యం తెచ్చుకోవడానికి ప్రతి వ్యక్తికీ ఉపకరించే చరిత్ర ఇది.
శిబి చక్రవర్తి కఠిన పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. బలి చక్రవర్తి దాన పరీక్షలో నెగ్గాడు. ప్రహ్లాదుడికి ఒక పరీక్ష పెట్టాడు హిరణ్యకశిపుడు. 'ఎక్కడ నీ హరి?' అని ప్రశ్నించాడు. 'అందు... ఇందు... ఎక్కడైనా ఉంటాడు!' అని సమాధానమిచ్చాడు ప్రహ్లాదుడు. 'ఈ స్తంభంలో ఉన్నాడా?' అని ప్రశ్నించాడు తండ్రి. 'ఉన్నాడు... చక్రి సర్వోపగతుడు' అని సమాధానం. ఇది ప్రహ్లాదుడి సిద్ధాంతం. ప్రయోగం- హిరణ్యకశిపుడే చేశాడు. ఫలితం? నరసింహస్వామి ఆవిర్భావం!
జీవిత పరీక్షలో విజయాలే కాదు. వైఫల్యాలూ ఉంటాయి. కర్ణుడు జన్మించినప్పటి నుంచీ... అన్ని పరీక్షల్లో విఫలుడయ్యాడు. అయినప్పటికీ అందరి సానుభూతి చూరగొన్నాడు. పరీక్షల్లో నెగ్గనంత మాత్రాన గుండె చెదరనవసరం లేదు; ధైర్యం దిగజారనవసరమూ లేదు. జయాపజయాలు దైవాధీనాలు. దైవోపహతులూ చరిత్రలో స్థానం సంపాదిస్తారు. ఆదర్శ జీవులుగా రూపొందుతారు. దానశీలురిలో కర్ణుడే ప్రథమగణ్యుడయ్యాడు. మైత్రీధర్మానికి అతడే గొప్ప ఆదర్శం. రాణా ప్రతాపుడు అనేక అపజయాలను ఎదుర్కొన్నాడు. ప్రియాతి ప్రియమైన 'చేతక్' అనే అశ్వరాజం యుద్ధంలో కూలిపోయింది. సర్వ సంపదలూ హరించుకొని పోయాయి. సైన్యం నాశనమైంది. అడవిలో గడ్డిరొట్టెలు తింటూ పడరాని పాట్లు పడవలసి వచ్చింది. ఇలా పాతికేళ్లు అనేక పరీక్షలు ఎదుర్కొన్నాడు. తుదకు పోయిన దుర్గాలన్నింటినీ వశం చేసుకొని, విజేతగా నిలిచాడు. నిరాశోపహతులైన వారందరికీ ప్రతాపుడి ధీరోదాత్త చరిత్ర కొండంత వూరటనిస్తుంది.
- డాక్టర్ పులిచెర్ల సాంబశివరావు