ᐅ నిజం నిప్పులాంటిది
ᐅ నిజం నిప్పులాంటిది
నిజాన్ని నిప్పుతో పోల్చటం కొంత ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. తరచి చూస్తే ఆ పోలిక సరైనదేననిపిస్తుంది. దార్శనికులు, వేదాంతులు, రుషులు, దైవజ్ఞులు- వీరంతా ఎంతో లోతుగా ఆలోచించాక, బహుశా నిజం నిప్పులాంటిదన్న ఉపమానానికి వూపిరిపోసి ఉండాలి. వారి దివ్యదృష్టికి, ఆధ్యాత్మిక ఆత్మావలోకనానికి ఈ ప్రపంచం ఒక మాయా మందిరం. ఒక విరిసిన హరివిల్లు. ఒక మెరిసే పొదరిల్లు.
చీకట్లో నడుస్తున్న మనిషి దారికి అడ్డంగా పడివున్న తాడును చూసి 'పాము పాము' అని కేకలు వేస్తూ వెనక్కు పరుగు లంకించుకుంటాడు. వెంటనడుస్తున్న నేస్తం అగ్గిపుల్ల వెలిగించి అటువైపు వెలుతురు కేంద్రీకరించగానే, అక్కడ దారికి అడ్డంగా కనిపించింది పాము కాదని, ఉత్త తాడేనని తెలుస్తుంది. భయంతో పరుగు లంకించుకున్న వ్యక్తి వెనక్కు తిరిగి వచ్చి 'ఓస్! తాడే. పాము అనుకుని కంగారుపడ్డాను' అంటూ సమర్థించుకోవటానికి ప్రయత్నం చేస్తాడు.
కంటికి కనిపించేదంతా నశించిపోయేదేనని బుద్ధుడు చెప్పాడు. ఈ అందమైన ప్రకృతి, ఆకృతివున్న సకల చరాచర వస్తుసముదాయం ఏదో ఒకరోజు కంటికి కనిపించకుండాపోతాయి. అందుకే బ్రహ్మసత్యం, జగత్తు మిథ్య అన్న మహావాక్యం... విశ్వాన్ని నడిపించే చైతన్యం ఒక రూపంలేని రూపంగా నిర్వచిస్తోంది. జనించి గతించే జగతి, జనన మరణాలమధ్య నలిగే మనిషి- ఈ రెండూ ఆ చైతన్యపు స్థితిగతుల ప్రతినిధులుగానే మనం అర్థం చేసుకోవాలి.
పంచభూతాల్లో ఒకటైన అగ్ని ఒక తన్మాత్ర.ఆకాశం నుంచి వాయువు, దాని నుంచి అగ్ని, అందులోనుంచి నీరు ఆ నీటినుంచి నేల- ఇవన్నీ బ్రహ్మనుంచి బయటికివచ్చాయంటారు. వాటికి ధర్మం తప్ప కర్మతో సంబంధం లేదు. ఆకాశ భూతం ఆవలిస్తుంది, వాయుభూతం విహరిస్తుంది, అగ్ని భూతం విజృంభిస్తుంది, జలభూతం ప్రవహిస్తుంది, పృథ్వీ భూతం సహిస్తుంది. అగ్నికి ఒక నిర్దిష్టమైన రూపం అంటూ లేదు. ఎదురుపడ్డ వస్తువు ఏదైనా సరే కాల్చి బూడిద చేస్తుంది. అది దాని ధర్మం. శవమైనా, ఖాండవమైనా దానికి ఒకటే. నివురుకప్పిన నిప్పు ఎప్పుడో ఒకసారి గుప్పు మంటుంది. గుప్పిట్లో దాన్ని దాచటానికి ప్రయత్నిస్తే నిలువునా దహించివేస్తుంది. నాల్కలు సాచి పైపైకి ఎగసి ప్రజ్వలించటం తప్ప తలవాల్చి కిందకు దిగటం అగ్నికి తెలీదు.
నిజాన్ని కప్పిపుచ్చటానికి ఎంత ప్రయత్నించినా అది ఏదో ఒకరోజు బయటపడి తీరుతుంది. అందుకే నిజం నిలకడమీద తెలుస్తుంది అంటారు. నిప్పులా దహించటమే కాదు, నిగ్గు తేల్చటం ఎలాగో నిప్పునకు బాగా తెలుసు. పుటం పెడితేనే అసలైన బంగారం వన్నె తేలుతుంది. అగ్నిపునీత సీత తన పాతివ్రత్యాన్ని చాటి చెప్పింది. నిజం నమ్ముకుని అన్నీ పోగొట్టుకున్న హరిశ్చంద్రుడి కీర్తిచంద్రిక ఆచంద్రతారార్కం వెలుగుతూనే ఉంటుంది. అందుకే, నిజాన్ని నిప్పుతో పోల్చటంలో ఆశ్చర్యం ఏముంది?
- ఉప్పు రాఘవేంద్రరావు