ᐅ సాధనాత్రయం
దైవాన్ని అన్వేషించడానికి మార్గాలేమిటి? పరమాత్మను తెలుసుకోదలచే సాధకులకు మార్గాలేమిటి? ఎలాంటి ప్రక్రియల్ని అవలంబించడం ద్వారా ఆత్మ దృష్టి పొందవచ్చు? ఏ విధివిధానాల్ని ప్రధానంగా ఆచరించడంవల్ల ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సాధకులు కొనసాగించవచ్చు? వీటన్నింటికీ సమాధానం- సాధనాత్రయం. అవే మౌనం, ధ్యానం, యోగం. ఈ మూడింటి సమ్మేళనం ద్వారా సాధకులకు ఆధ్యాత్మిక మార్గం సుగమం అవుతుంది. మౌన ధ్యాన యోగాలనే సాధనాత్రయం ద్వారా గుర్తించే విష్ణువు స్వరూపమే మాధవుడని మహాభారతం తెలియజెబుతోంది. సాధనా సంపత్తిని సాధకులు అందుకుని భక్తి సోపానాల్ని అధిరోహించడానికి మౌన ధ్యాన యోగాలు ఆలంబనగా నిలుస్తాయి.
మౌనమనేది నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఉపకరించే మహత్తర సాధనమని రమణమహర్షుల ఉవాచ. మాటలు నిగ్రహించి, మనలోకి మనం ప్రవహించడానికి, ఆత్మ వివేచనకు మౌనం దోహదపడుతుంది. దుఃఖాల్లో కలవరపడకుండా, సుఖాలపై ఆశ లేకుండా, అనురాగ భయ క్రోధాల్ని విడిచి, స్థిరమైన జ్ఞానం ఉన్న వ్యక్తిని 'ముని' అంటారని భగవద్గీత పేర్కొంది. ముని అవలంబించే కార్యం మననం. శాస్త్రబద్ధంగా, తర్కహితంగా చింతన చేయడమే మననం. శ్రవణం చేసినదాన్ని, పఠించినదాన్ని మననం చేయడం, వాక్కును వశంలో ఉంచుకోవడం- పరమాత్మ ఉనికిని తెలుసుకోవడానికి సాయపడే మొదటి సాధనగా విశ్లేషిస్తారు.
మనసుకు రాగద్వేషాది మలినాలు అంటడానికి కారణం లౌకికమైన వ్యవహారాల పట్ల అత్యాశ, అధిక ఆసక్తి. ఆ కల్మషాల్ని నిర్మూలించి మనసును శుద్ధిచేయడానికి ఉపకరించేదే ధ్యానమని పతంజలి యోగసూత్ర నిర్వచనం. ఆత్మ స్వరూపాన్ని ఏకాగ్రతతో చింతన చేయడమే ధ్యాన ప్రక్రియ అని ఆదిశంకరులు భాష్యం చెప్పారు. ధ్యాన సాధనవల్ల బుద్ధిలో ప్రసన్నత ఏర్పడి, మనసులో నిర్మలత్వం చోటు చేసుకుంటుంది. దీనిద్వారా భగవంతుడి దర్శనానికి అర్హత పొందవచ్చని ముండకోపనిషత్తు చెబుతోంది. 'మీ సమక్షం నుంచి నేను దూరంగా ఉండటానికి కారణం, మీరు నన్ను ఎల్లప్పుడూ ధ్యానం చేయడం కోసమే'నంటూ గోపికలకు ఉద్ధవుడి ద్వారా శ్రీకృష్ణుడు సందేశం పంపాడు. మననానికి సార్థకత చేకూర్చే ధ్యానం తత్వాన్ని మనసులో తదేకంగా నిలిపిఉంచుతుంది. అలౌకికమైన బ్రహ్మానంద స్థితిని పొంది, దైవంతో ఆత్మానుసంధానం చేసుకోవడానికి ధ్యానం ముఖ్య సాధనం.
ఆత్మలో చిత్తాన్ని ఏకాగ్రం చేయడమే యోగం. ఆత్మలో నిలిచిన చిత్తాన్ని చెదరకుండా, చిత్తవృత్తిని నిరోధించడం యోగంలో ప్రధాన భాగం. సమదర్శనమే యోగంగా భగవద్గీత చెప్పింది. బంకమట్టినీ, బంగారాన్నీ సమదృష్టితో చూసే తత్వమే యోగం. ఆ యోగాన్ని సాధించినవాడే యోగి. యోగీశ్వరుడైన వాసుదేవుణ్ని చేరే మూడోసాధనం యోగం. మౌన ధ్యాన యోగాలతోపాటు మనిషి మాననీయ, మానవీయ విలువల్ని పాటించినప్పుడే దైవానికి దగ్గరవుతాడు. మనో బుద్ధులు పవిత్రంగా, చిత్తం నిర్మలంగా ఉండాలి. నడవడి ఆదర్శంగా, ఆలోచనలు అభినందనీయంగా ఉండాలి. ఇతరులకు ప్రియకరంగా హితకరంగా భాసిల్లే సంభాషణల్ని పలకాలి. గర్వం, అసూయ, కపటం లేకుండా వ్యవహరించాలి. సేవాతత్పరత, దానం, ఉదారత, భూతదయ, అహింస వంటి లక్షణాల్ని వ్యక్తులు సహజాభరణాలుగా ధరించాలి. 'సర్వసుగుణాలు కలిగిన వ్యక్తులు, నా గురించి సాధన చేయాల్సిన అవసరం లేదు. నన్ను అన్వేషించే పనిలేదు. నేనే వారి హృదయంలో సదా నివసిస్తాను'- అని పరంధాముడు విష్ణుపురాణంలో పేర్కొన్నాడు. మనిషి, మనీషిగా మారడానికి చేసే ప్రస్థానమే- అసలైన ఆధ్యాత్మిక సాధన.
- డాక్టర్ కావూరి రాజేశ్‌పటేల్