ᐅ ప్రేమసాగరమే భక్తి
మన మహర్షులు మోక్షసాధనకు మూడు యోగమార్గాలను చూపారు. అవే భక్తి, కర్మ, జ్ఞాన యోగాలు. ఈ మూడింటిలో అందరికీ అందుబాటులో ఉండేది భక్తియోగం. భక్తి అంటే నిర్వ్యాజంగా, త్రికరణ శుద్ధిగా ప్రేమించటం. భక్తి ప్రేమ స్వరూపం. హృదయపూర్వకమైన భక్తిని భగవంతుడిపై అచంచలంగా నిలిపినప్పుడు, అది మరొకరి మీదకు మరలదు. ఆదికవి రచించిన రామాయణంలో ఇందుకు పెక్కు ఉదాహరణలు కానవస్తాయి.
శ్రీరాముడు తండ్రి ఆనతి మేరకు రాజ్యాధిపత్యాన్ని వదలుకొన్నాడు. నారచీరలు ధరించి అడవులకు వెళ్లాడు. సీతాదేవి, లక్ష్మణులు శ్రీరాముణ్ని అనుసరించారు. తాతగారి నగరం నుంచి తిరిగివచ్చిన భరతుడు- తండ్రి మరణం, శ్రీరాముడి అరణ్యవాసం గురించి తెలుసుకొన్నాడు. ఏ విధంగానైనా అన్న రామయ్యను మరల అయోధ్యకు పిలుచుకొని వస్తానన్నాడు. అన్న అరణ్యానికి వెళ్లిన మార్గంలోనే వెళ్లాడు. చిత్రకూటంలో రాత్రి తన అన్న, అయోధ్య సామ్రాజ్య చక్రవర్తి, ఎండుటాకుల శయ్యపై ఉండటం గమనించాడు. 'ప్రభూ, హంస తూలికాతల్పంపై పడుకొని నిద్రించవలసిన తాము, పండుటాకులపై పడుకోవటం బాధ కలిగించదా?' అంటూ కన్నీరు కార్చాడు. పక్కనే చెట్టుకు ఆరవేసిన నారచీరలను గమనించాడు. 'కోమలమైన తమ దేహం, ముతక వస్త్రాలను ఎలా సహించగలదు. నా తల్లికి నాపైగల వ్యామోహమే ఇంతకూ కారణం. నేను అపరాధిని. నేను మీలాగే జీవిస్తాను' అంటూ తాను ధరించిన పట్టువస్త్రాలను వదలి నారచీరలు ధరించి పాదరక్షలను విడిచిపెట్టి శ్రీరాముడి పాదుకలను తలపై ఉంచుకొని అయోధ్యకు మరలాడు. ఇది ప్రేమభక్తికి పరాకాష్ఠ!
శ్రీరాముడు చిత్రకూటం వదలి దండకారణ్యంలో కొంతకాలం ఉండదలచాడు. దారిలో గంగానదిని దాటాల్సి వచ్చింది. గిరిజన నాయకుడైన గుహుడు స్వయంగా సీతారామలక్ష్మణులున్న పడవను ఆవలిగట్టుకు చేర్చాడు. శ్రీరాముడు గుహుడి వినయానికి సంతోషించి, నదిని దాటించినందుకు అయిన శుల్కమెంతో తెలుపమన్నాడు. 'ప్రభూ, వాస్తవంగా మనిద్దరిదీ ఒకే వృత్తి- దాటించడం. నేను ఇహంలో దాటించాను... తాము భవాన్ని దాటించగలరు. మీ శరణుజొచ్చాను. మీ నుంచి శుల్కం అందుకోవడం శాస్త్రసమ్మతంకాదు. కానీ ఒక విన్నపం. కాలక్రమంలో నన్ను భవసాగరం దాటించమని వేడుకొంటున్నాను...' అన్నాడు. అదీ, ప్రేమమయమైన ముగ్ధభక్తి.
శ్రీరామచంద్రుడి దర్శనం కోసం జీవితాంతం వేచిన భక్తురాలు శబరి. వేకువనే లేచి, ఆయా కాలాల్లో లభించిన పళ్లను కొరికి, రుచిచూసి సేకరించేది. మధురమైన పళ్లను మాత్రమే భద్రపరచేది. దినమొక యుగంగా రాముడి రాకను నిరీక్షిస్తూ ఉండేది. కొన్నేళ్లు దొర్లాయి. శరీరం కృశించింది. తల ముగ్గుబుట్ట అయిపోయింది. రామచంద్రుని నిరీక్షణ దీపం వెలుగుతూ ఉంది. ఒక రోజున రాముడు రానేవచ్చాడు. శబరి కళ్లు మసకబారాయి. శబరి హృదయం రాముని చూసింది. ఆమె కళ్లలో ఆనందబాష్పాలు రాలుతూ ఉన్నాయి. తాను రుచిచూసి దాచిన రేగుపళ్లను స్వయంగా ఒక్కొక్కటే తినిపించింది. ఆ ఆరాధ్య దైవానికి ఎంగిలిపళ్లను తినిపిస్తున్నానన్న ఆలోచనే లేదా ముసలి శబరికి!
అదీ భగవంతుడికి భక్తుడికి మధ్య అనుబంధం. ఆమె సర్వస్వం శ్రీరాముడికే.
ఒక భక్తురాలుండేది. చాలాకాలం సంతానం కలగలేదు. తన బాధను ఆలయ అర్చకస్వామికి విన్నవించింది. అర్చకులు 'అదిగో ఈ గర్భగుడిలోని కృష్ణుని 'బిడ్డా, రా' అని పిలువు, వస్తాడు' అన్నాడు అర్చకుడు. ఆ ముగ్ధురాలప్పటికే శ్రీకృష్ణుడి పట్ల అనన్యమైన భక్తురాలిగా ఉండేది. ఇంటికివెళ్లి భక్ష్యాలను తయారుచేసుకొని, కృష్ణుడి ముందు ఉంచి 'రా, నాన్నా... రా, త్వరగా రా... నీ కోసం తియ్యని భక్ష్యాలు తెచ్చాను. తినిపిస్తాను. నాకు వేరే పనులున్నాయి, త్వరగా రా!' అన్నది. కృష్ణుడు బాలుడై వచ్చాడు. భక్తురాలు సంతోషంతో ఆయన నోటిలో భక్ష్యాలను ఉంచి, పూర్తిగా తిన్న తరవాత ఇంటికి వెళ్లేది. ఒక రోజున ఆలయంలోని శ్రీకృష్ణుడి మూతికి అంటుకొన్న మెతుకులను అర్చకులు గమనించారని, ఈ వార్త వూరంతా వ్యాపించిందని, అర్చకుడు రహస్యంగా జరుగుతున్న తంతును చూశాడని చెబుతారు. ఇది కర్మాబాయి అనే భక్తురాలి కథ. ఇది భక్తుడికి భగవంతుడికీ మధ్య ప్రేమానుబంధం.
- జానమద్ది హనుమచ్ఛాస్త్రి