ᐅ విజయకాంక్ష

 ᐅ విజయకాంక్ష

ఈ నూతన సంవత్సరానికి 'విజయ' అని నామం.
సూర్యతేజస్సుకు సంబంధించిన విశేషాలే అరవై సంవత్సరాల నామధేయాలు. విశేషమైన జయం 'విజయం'. 'జయం' అంటేనే అనుకున్నదీ, సాధించవలసినదీ సాధించటం. ఇదే గెలుపు. ధర్మార్థ కామ మోక్షాలను సాధించే పరిపూర్ణతే 'జయం' అని శాస్త్ర నిర్వచనం. అలాంటి జయం విశేషంగా పొందడమే విజయం.

అనుకున్నది నెరవేర్చుకోవడమే కాక, ప్రతికూలతలను అధిగమించడమూ విజయమే. జీవితంలో ప్రతివారూ విజయాన్ని సాధించాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. 'విజయవంతమైన జీవితం' అనే మాటను వింటూ ఉంటాం. దానికి ఎవరి నిర్వచనం వారిది. వృత్తిరీత్యానో, వ్యాపారపరంగానో, రాజకీయంగానో గెలుపు సాధించడమే 'విజయం' అని నిర్వచిస్తారు చాలామంది. జీవితంలో అన్ని విలువల్నీ కాపాడుకుంటూ, అన్ని ధర్మాలనీ పాటించినప్పుడే అది 'విజయం' అవుతుంది. కుటుంబ బంధాలను, సామాజిక బాధ్యతలను, వ్యక్తిగత ఆరోగ్యాన్ని, సంస్కారాలనీ- ఇలా బహుకోణాల జీవితాన్ని నిర్వహించడం సామాన్య విషయం కాదు. అన్నింటినీ విజయవంతంగా సాధించగలిగితే దిగ్విజయమే. అలాంటి విజయాన్ని సాధించడానికి మనవంతు ప్రయత్నాలెన్ని చేసినా ఈశ్వరానుగ్రహం లేనిదే సాధ్యంకాదు. ఆ ఈశ్వరానుగ్రహాన్ని ఆకాంక్షించడానికై మనల్ని మనం శుద్ధిచేసుకొని (బాహ్యంగానూ, మానసికంగానూ) ఈ ఏడాది తొలి అడుగున ఆరాధించడం ఉగాది విశేషం.

ఉగాది కల్పానికి ఆది- అనే ధార్మిక శాస్త్రాల వాక్యాన్ని అనుసరించి 'ఆరంభ'పర్వంగా దీన్ని జరుపుకొంటున్నాం. మంగళకరమైన అలంకారాలతో, పవిత్రమైన దేవపూజతో సంవత్సర కాలమంతా శుభాలు కలిగించాలని భావించడం కొత్త వత్సరాది సంప్రదాయం. ప్రతి కాలమూ సూర్య స్వరూపమే అయినా ప్రత్యేకించి ఈ సంవత్సరం 'సూర్యదేవతాకం'. విశేషించి సూర్యారాధన, సూర్యగ్రహాధిదేవత అయిన శివుని అర్చన ఈ ఏడాది శుభఫలాలను ప్రసాదిస్తుందని కాల దేవతార్చన విధి తెలిపే శాస్త్రరీత్యా గ్రహించవచ్చు. కాలాన్ని పరమేశ్వర స్వరూపంగా భావిస్తూ, కాలాంగాలైన తిథి వార నక్షత్ర యోగ కరణాలను ఈ రోజున ప్రత్యేకించి భక్తిశ్రద్ధలతో వినడంవల్ల కాలం అనుకూలమవుతుందనే సంప్రదాయ భావన నేటి పంచాంగ శ్రవణంలో ప్రస్ఫుటమవుతుంది. నిత్యమూ ప్రాతఃకాలంలో పంచాంగాలను పలకకుండా ఏ శుభకార్యమూ భారతీయులు తలపెట్టరు. ఈ వేదాంగాల అధిదేవతలు ఆ రోజును 'శుభదినం'గా పరిణమింపజేయాలని ప్రార్థించడం ఆ సంకల్పంలో భావం. అయితే- కాలభాగాలు ఈశ్వర స్వరూపాలే కనుక, అవన్నీ దివ్యమైనవే అని ఎరుక కలిగిఉండాలి. ఏ కార్యానికి ఏ కాలం అనుకూలమో తెలుసుకోవడానికే పంచాంగశాస్త్రం. అగ్ని, జలంవంటివి ఆయా సందర్భానుగుణంగా ఆవశ్యకాలైనట్లుగానే- భిన్న ప్రయోజనాలకు విభిన్న కాల విశేషాలు.

'అగ్ని మొదలైన దేవతలు విధులకు; సూర్యచంద్ర కుజాది గ్రహాలు వారాలకు; అదితి మొదలైన వేల్పులు నక్షత్రాలకు అధిదేవతలు. కార్యఫలాలపై ఆధారఫలాలపై ప్రభావం చూపగలిగే శక్తి 'యోగ' విశేషాలకుందని శాస్త్రోక్తి.

పరిణామ స్వభావం కలిగిన కాలం శుభపరిణామాలు ఇచ్చేందుకు ఈ పంచాంగ దేవతల అనుగ్రహ ప్రాప్తికై వారిని స్మరించడం ఆనవాయితీగా ఈ పండుగను పెద్దలు ఏర్పరచారు. 'తిథి' శ్రవణంవల్ల సంపద కలుగుతుందని, 'వారం'వల్ల ఆయువు వృద్ధి చెందుతుందని, 'నక్షత్రం'వల్ల పాపం తొలగుతుందని, 'యోగం'వల్ల రోగనివారణ జరుగుతుందని, కరణంవల్ల 'కార్యసిద్ధి' చేకూరుతుందని- పంచాంగ శ్రవణఫలాన్ని సంప్రదాయ శాస్త్రాలు వ్యక్తపరుస్తున్నాయి.

కార్యసాఫల్యాన్ని కాంక్షించేవాడు ఈ అయిదింటి జ్ఞానంతో కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాడని జ్యోతిర్విజ్ఞాన హృదయం. పురాణ కాలగణనం ప్రకారం- ఈ ఏడాదితో కలియుగం ప్రారంభమై 5114 సంవత్సరాలైంది. గురువు రాజుగా ఉన్న ఈ సంవత్సరం గురుస్వరూపమైన సుజ్ఞానం మన బుద్ధులను నడపాలని శుభాకాంక్షిద్దాం. 'ఈ సంవత్సరం ఎలా ఉంటుంది?' అనే కుతూహలం సహజమే. కానీ, అందరికీ 'శుభం'గా ఉండాలని ఆశించడం ఉగాది కర్తవ్యం.

- సామవేదం షణ్ముఖశర్మ