ᐅ అగ్నిబీజం
ᐅ అగ్నిబీజం
మనది వ్యవసాయ భారతం. వ్యవసాయం శ్రమకు, నిజాయతీకి, తిరుగులేని ఫలితానికి మారుపేరు, చిరునామా. మనం శ్రామికులం, వ్యవసాయ కార్మికులం. జీవన వ్యవసాయ క్షేత్రంలో బండలు మోసి కండలు తిరిగిన బలాఢ్యులం.
బీజం భరోసాకు చిహ్నం. ఒక బీజం లక్షలాది బీజాలకు తల్లి. భూమిలో బీజం నాటనిది ఫలాలనాశించే తత్వం కాదు మనది. ఎందుకంటే బీజం మనకు బలం. భరోసా. నిన్న మొన్నటి వరకూ మన సంస్కృతి అది. సంస్కారం అది. నేడు ఏమయింది?
ఏమిటీ దేశం! ఎలాంటిదీ దేశం! నీతి కోసం బతికిన జాతి ఇది. నీతికోసమే బలి అయిపోయే వినీతి ఇది. ఏమయిపోయింది? అవినీతి చీడపట్టి, పట్టించి నీతి బీజాన్ని నిర్వీర్యం చేశాం. నిస్తేజమైన జాతిగా మిగిలిపోయాం. 'డబ్బు జబ్బు' చేసి అవినీతిని ఔషధంగా సేవిస్తున్నాం. మనకు మనమే 'మకిలి అంటిన డబ్బు' అనే మాదక ద్రవ్యాన్ని సేవిస్తూ మత్తులో జోగుతున్నాం.
వ్యవసాయం అంటే కేవలం క్షేత్ర వ్యవసాయం కాదు. మన జీవితమే ఒక వ్యవసాయ ప్రయాణం. కలుపు తొలగించుకుంటూ, దుక్కితో దున్నుకుంటూ, నాగలితో నాటుకుంటూ, భూదేవిని, ఆకాశరాజును ఆరాధిస్తూ, జలయజ్ఞం (నేటి రాజకీయ యజ్ఞంకాదు) జీవితాన్ని స్వేచ్ఛగా పండించుకుంటున్నాం. అడుగడుగునా సంక్రాంతి పండుగ చేసుకుంటున్నాం. ఇప్పుడా? కాదు. ఎప్పుడో. అప్పుడెప్పుడో. బీజం నాటాక తప్ప పంట ఆశించని మనం, కష్టంతో మాత్రమే కండలు పెంచుకునే మనం అవినీతి మట్టి ఎత్తుకుని దొంగ కండలను కండలుగా భ్రమపడుతున్నాం. భ్రమ పెడుతున్నాం. ఎవరిని మెప్పించాలని, ఎవరిని మాయపుచ్చాలని? మన పిల్లలనా? అవినీతి అన్నంతో పెరిగిన పిల్లలు అజీర్తి పాలు కారా, అన్యాయమైపోరా? వాళ్లు నిజాన్ని గ్రహించిన రోజు, మనను నిలదీసే రోజు తల ఎక్కడ దాచుకుంటాం?
అవినీతి మన ఆనవాయితీ కాదు. ప్రతి ఐశ్వర్యాన్నీ 'నేటి నీతి' అంటూ తిరస్కరిస్తూ ఆత్మవరకూ సాగిన, సాగాలని ప్రపంచానికి నేర్పిన ఆత్మ ద్రష్ఠలం మనం. ఆత్మావశిష్ఠులం మనం. అలాంటిదిప్పుడు అవినీతి శునకాన్నా మనం ఆత్మ సింహాసనం మీద అధిష్ఠింపజేస్తున్నాం! మన ఆత్మ గౌరవానికీ, మన ఆభిజాత్యానికీ అది అవమానం! మన పెద్దలు శ్రమైక జీవన సౌందర్యాన్నెరిగినవారు. దాన్ని ఆరాధించినవారు. కండల కొండల మధ్య కష్టానికి నిదర్శనంగా జాలువారిన చెమట బిందువును అమృత సింధువులా ఆరాధించారు. అది శ్రమైక గంగ చిందిన బిందువు. అది చాలు మనకు.
ఈ ప్రపంచంలో, సమాజంలో మనం ఒక్కరమే వ్యాపారులం కాదు. ఉద్యోగులం కాదు. అధికారులం, నాయకులం కాదు. మనలాంటి ఎందరో. మనం అవినీతిని ఆశ్రయిస్తే, పెంచి పోషిస్తే, ఐశ్వర్యానికి పెట్టుబడిగా మలచుకుంటే, సమాజం మీద ఆ విషాన్ని చిందిస్తే మరి మనలాగే ఇతరుల ఆశల మాటేమిటి? అవినీతి సంగతేమిటి? మన పిల్లలు నెయ్యి మాత్రమే తింటారు. నూనె తినరని భరోసాతో మనం నూనె కల్తీచేస్తే, నెయ్యి వ్యాపారి మాటేమిటి? అతడి దురాశ సంగతేమిటి? మన పిల్లలు తినే నెయ్యి కల్తీచేయడా? మనం రోడ్ల నిర్మాణ రంగంలో ఉండి అవినీతికి పాల్పడితే, ఏదోరోజు ఆ రోడ్లమీదే మన పిల్లలు ప్రయాణించాలని మనకు అర్థంకాదా? మందుల తయారీ వ్యాపారంలో ఉన్న మనం మందులు కల్తీచేస్తే మన పిల్లల వ్యాధుల మాటేమిటి? ప్రభుత్వం పెట్రోలు, సిమెంట్, సరకులు, కూరలు, మందులు, మద్యం, పాలు, నీళ్లు... అవినీతిలో తప్ప కల్తీచేయని వస్తువే లేదు. పరిస్థితే లేదు. మనం మనుషులం కాదు. భస్మాసురులం. మన తలపై మనమే చేయి పెట్టుకుని భస్మమైపోతున్న భస్మాసురులం. మన చుట్టూ మనమే అవినీతి గూడు అల్లుకుని అందులోనే చిక్కుకుపోయి మరణిస్తున్న అకాల మర్త్యులం. వ్యర్థులం. ప్రపంచ దేశాలన్నీ మన నీతి, నిజాయతీ, ఆధ్యాత్మిక సంస్కృతి, వివాహ కుటుంబ వ్యవస్థలు చూసి తామూ అలా మారాలనీ, అమృతతుల్య సంస్కృతిని సొంతం చేసుకోవాలనీ మన దేశం వైపు ఆశగా ఆరాధనగా చూస్తూఉంటే- మనం ఇంత నికృష్ట స్థాయికి దిగజారుతూపోవటం ఎంత సిగ్గుచేటు!
పాలు మాత్రమే స్వీకరించి నీటిని వదిలేసే 'హంసల దీవి' మనది. ఎలాంటి పరిసరాల్లో ఉన్నా మాలిన్యం అంటకుండా పవిత్రంగా జీవించే 'తామరల కొలను' మనది. హిమాలయాలు మన కోటగోడలు. కైలాస పర్వతం మన గృహశిఖరం. గంగానది మన పవిత్ర స్నాన తీర్థం. తుంగ మన పానపాత్ర ఉదకం. కాశీ మన పూజా మందిరం. మనం జీవితాన్ని ఆచమన సదృశంగా స్వీకరించే మానసిక యతీశ్వరులం. జీవితం మనకు దైవప్రసాదం. మనకెందుకీ అవినీతి పెండలం? ప్రస్తుతం మన కర్తవ్యం మన హృదయాల్లో అవినీతికి వ్యతిరేకంగా అగ్నిబీజం నాటుకోవడం. అందరిలోనూ నాటడం. అది అవినీతిని అగ్నితప్తం చేసి అగ్నిపునీత సీతలా పవిత్రంగా తామరతంపరగా వెలికి వస్తుంది. రాబోయే కొత్త సంవత్సరానికి అవినీతి రహిత వ్యవసాయానికై అగ్నిబీజాన్ని సిద్ధం చేసుకుందాం. నాట్లకై హృదయ క్షేత్రాన్ని శుద్ధిచేసుకుందాం. మన పిల్లలకు అవినీతి రహిత సమాజాన్ని అందిద్దామని ఒట్టుపెట్టుకుందాం.
- చక్కిలం విజయలక్ష్మి