ᐅ ఇవ్వడమే మిన్న

 ᐅ ఇవ్వడమే మిన్న

ఇతరులకు ఇవ్వడంవల్ల కలిగే ఆనందం స్వీకరించడంలో ఉండదు. ఇతరుల నుంచి మనం దేన్ని తీసుకొన్నా తిరిగి చెల్లించకతప్పదు. తిరిగి ఇవ్వలేనప్పుడు కనీసం కృతజ్ఞతనైనా వ్యక్తం చేయాల్సిందే! కనుక స్వీకరించడంకన్నా దాతృత్వంలోనే ఆనందమూ పరమార్థమూ ఉంటాయి. మన తాహతుకు అర్హతకు మించినదాన్ని ఎవరైనా ఇవ్వజూపితే తీసుకోకూడదని కశ్యపుడు రాసిన వినయ చంద్రిక సూచిస్తోంది.
పూట గడిస్తే చాలు... అంతకన్నా అవసరం లేదనే వ్యక్తికి బంగారు ముద్ద ఇస్తే తీసుకోవడానికి జంకుతాడు. అందుకు బదులుగా పట్టెడు బియ్యం, దానికి సరిపడా అపరాలు అందజేస్తే అతడి ఆనందానికి అవధులే ఉండవు. మనసారా దాతను దీవిస్తాడు. స్థితప్రజ్ఞుడైన మహాపండితుడి వద్దకు వెళ్లి అతడి వ్యక్తిత్వాన్ని ఏదైనా స్వార్థ చింతనతో ప్రశంసించి చూడండి. అతడి వదనంలో అయిష్టత వ్యక్తమవుతుంది. భరించలేక ఇక చాలు ఆపమంటూ చిరాకు ప్రదర్శిస్తాడు. కాని, గౌరవ భావంతో అమలిన హృదయంతో ఆ పండితుడిలోని ప్రజ్ఞను మెచ్చుకొంటే కొంత సంతోషిస్తాడు. మనం అడగకుండానే తనవల్ల మనకేదైనా సహాయం అవసరమేమోనని వాత్సల్యంతో వాకబు చేస్తాడు. మనకు అవసరమైంది ఆ పండితుడి వద్ద ఉంటే ఆనందంగా ఇస్తాడు.

ఆ పరాత్పరుడి తత్వం ఇలాంటిదే. మన నుంచి తీసుకోవడం కన్నా మనకు ఇవ్వడానికే ఆరాటపడతాడు. స్వీకరించగలిగే అర్హత ఉండాలిగాని... ఏదైనా ఇచ్చేస్తాడు! స్వార్థంతో కూడిన స్తుతులు, నుతులు దేవదేవుని సంతృప్తిపరచవు. నిరామయంగా ఆత్మను అనుసంధానం చేసి ఆరాధిస్తే మనకు ఏది అవసరమో గ్రహించి మేలు చేస్తాడు. శ్రీకృష్ణుడు సుదాముడి పట్ల కనబరచిన భగవత్‌ తత్వం ఇదే!

పరమాత్మ తత్వాలు అర్థం చేసుకొని ఆచరించే ప్రయత్నం మనం చేయాలి. దైవం ప్రశాంతతకు ప్రతిరూపం. ఆయనలో మూర్తీభవించిన శాంతం సహనం మన దైనందిన జీవన విధానానికి చాలా అవసరం. పరమాత్మను నిందించండి... సహిస్తాడు. ఆయనపై క్రోధం కనబరుస్తే ముగ్ధమనోహరంగా నవ్వుతాడు. ఎందుకో తెలుసా? ఇతరుల నుంచి స్వీకరించడం తెలియని వాడు కనుక దూషణలను సైతం స్వీకరించడు. ఆయన విగ్రహంపట్ల ఆక్రోశం కనబరిస్తే దైవం నిగ్రహం కోల్పోడు. ఆగ్రహం అసలు రాదు. భగవంతుడి ముందు కుచేలుడిలా ఉండాలని రమణ మహర్షి చెప్పేవారు.
క్షేత్రాల్లోని గుళ్లో భగవంతుని మూర్తి ముందు నిలబడి ఆరాధించేవాడికి అవసరాలు పరిసరాలు కనిపించకూడదు. మనకేదైనా ఇవ్వాలా వద్దా అనేది పరమాత్మ ఇష్టం! ఇతరులకు సహాయం చేస్తూ ఆపన్నులను ఆదుకునే తృష్ణ మనలో ఉంటే మనలను శ్రీమంతులను చేస్తాడు. దోచుకొని దాచుకోవాలనుకునే వారికి తన శిక్షాస్మృతిని అనుసరించి తగిన సమయంలో శిక్షిస్తాడు. గుడ్డివాడిని రంగురంగుల చిత్రాలను విచిత్రాలను చూడమంటే ఏం లాభం? వాడికి కావలసింది దృష్టి. దాన్ని ప్రసాదించేవాడే భగవంతుడు. అజ్ఞాని చేతికి కోట్ల రూపాయల విలువైన వజ్రం ఇస్తే... ఇతరులపైకి దాన్ని విసిరి గాయపరుస్తాడు. అతడికి ఇవ్వాల్సింది జ్ఞానమే కాని, ధనం కాదు. అలా ఎవరికి ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఆ పరమాత్మకు తెలుసు.

సర్వం విడచి తననే శరణన్న వాడిని దైవం ఆదరిస్తాడు. తనను కాదన్నవాడి పట్ల చక్రి అసహనం ప్రదర్శించడు. శ్రీరాముడు సర్వం సహా చక్రవర్తి. ఆయన పాలనలోని ఒక సామాన్యుడు తన భార్య సీతపై వేసిన నిందనైనా భరించాడు కాని, అతణ్ని శిక్షించలేదు. శ్రీ రామచంద్రుని వనవాసం పంపే సందర్భంలో కైకేయి దశరథుణ్ని ఇలా ప్రశ్నిస్తుంది- 'పట్టాభిషిక్తుని చేయకుండా వనవాసం పంపుతున్న రామచంద్రుడి వదనంలో దరహాసమే కనిపిస్తోంది. నావైపు అపహాస్యంగానైనా చూడటంలేదు. అతడి మొహంలో ప్రశాంతత నిండి ఉంది... ఎందుకు?' అని. దశరథుడంటాడు- 'శ్రీరామచంద్రుడికి దూషణలు భూషణలు రెండూ సమానమే! అసూయను స్వీకరించే తత్వం అతడిలో లేదు. శ్రీరాముడు నా కుమారుడు మాత్రమే అనుకొన్నాను. దైవమే మానవ రూపంలో అవతరించాడని విశ్వామిత్రుడు చెప్పాడు. ఈ లోకాలన్నీ ఆయన సృష్టిలోనివే! అరణ్యాలైనా జనారణ్యాలైనా అతడి సృష్టిలోని అంతర్భాగాలే. అలాంటి కరుణాపయోనిధికి జనవాసాలకూ వనవాసాలకూ వ్యత్యాసం ఉండదు. రాజ్యాభిషేకం చేస్తానంటే నగుమోముతో అంగీకరించాడు. వనాలకు వెళ్ళాలని ఆజ్ఞాపించినా అలా నవ్వుతూనే వెళ్తున్నాడు...'

ఇదం శరీరం పరిణామ పేశలం (ఈ శరీరం మార్పు చెందుతూ వుంటుంది). బాల్య కౌమార యౌవన ప్రౌఢ వృద్ధ్యాప దశలను మనిషి అనుభవించక తప్పదు. ఈ లోకంలో మనం ఇలా సంపాదించి అలా అవసరార్థులకు ఇవ్వగలగాలి. నేనెవరికైనా అవసరమైంది ఇస్తే శ్రీరాముడు నాకు అవసరమైన మోక్షం ఇస్తాడని అంటాడు తులసీదాసు. మానవులమైన మనం పరమాత్మ తత్వాన్నే సాధన చేయాలి. పరులకు ఇవ్వడమే మనం నేర్చుకొంటే పరమాత్మ మనకు జన్మరాహిత్యం కల్పిస్తాడు. అదే కదా చివరికి మనకు కావలసింది!

- అప్పరుసు రమాకాంతరావు