ᐅ మాటే మంత్రం
మనసు, వాక్కు, శరీరం ఈ మూడింటికీ త్రికరణాలు అని పేరు. వీటిలో వాక్కుకు ఉన్న స్థానం విశిష్టమైనది.
వాక్కే అన్నింటికీ కారణమని రుషివచనం.
ఓ చల్లని మాట, ఓ హితమైన మాట వ్యక్తి జీవనవిధానాన్నే మార్చి, బాధాతప్త హృదయానికి శాంతిని ప్రసాదిస్తుంది. మనిషి మాట్లాడే మాట కేవలం జనులను మెప్పించడమే కాదు, ఆ భగవంతుణ్ని కూడా మెప్పించాలి. మాట్లాడే తీరును బట్టి మన సంస్కారం, సభ్యత బయటపడతాయి. అందుకే ఎవరి గురించి మాట్లాడినా చెడుగా మాట్లాడకూడదు.
జ్ఞానాభివృద్ధికి భాష ఎంతగానో ఉపయోగపడుతుంది. మంచి మాట జ్ఞానజ్యోతిని వెలిగిస్తుంది. భారతీయ పురాణాలు, ధర్మశాస్త్రాలు మాట మీద నిలబడాలనే ధర్మ నియమాన్ని నొక్కి వక్కాణిస్తున్నాయి.
సంభాషణ వల్లనే సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి అంటాడు రఘువంశ సృష్టికర్త కాళిదాసు. ముఖ్యంగా మాట సత్యంగా ఉండాలి. మాటలు మధురంగా ఉంటే ఎదుటివారు ఎంతసేపైనా వింటారు. అందుకే సంభాషణ ఒక కళగా చెబుతారు.
నీరు, అన్నం, మనిషికి ఎలా ప్రాణశక్తిని ఇస్తాయో, సుభాషితం కూడా అంతే విలువైనది. ఇతరులకు శాంతి కలుగుతుందని నమ్మకం ఏర్పడితేనే మన అభిప్రాయాలు చెప్పాలి.
శ్రీరాముడికి 'పూర్వభాషి' అనే పేరుంది. అంటే ముందుగా తానే పలకరించడమనే గొప్ప సుగుణం. అంతేకాదు 'వాక్య విశారదుడు' అని రాముణ్ని వర్ణిస్తాడు వాల్మీకి. మాటను మంత్రంలా భావించిన శ్రీరాముడు పితృవాక్యపరిపాలకుడిగా లోకంలో వాసికెక్కాడు. అందరికీ ఆదర్శ పురుషుడయ్యాడు. వాక్కుకు వ్యవహార ప్రయోజనమే కాక జీవితాలను బాగుచేసే శక్తి కూడా ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు ఏర్పడినా చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాలని పురాణాలు బోధిస్తున్నాయి. అందుకే ప్రతి మనిషి మాట మీద నిలబడి అందరి మన్ననలందుకోవాలి. సత్యవాక్కు నిలుపుకోవడం కోసం హరిశ్చంద్రుడు ఆలుబిడ్డలను అమ్మడానికి కూడా వెనకాడలేదు.
వాక్య కోవిదుడిగా హనుమంతుడు పేరు గడించాడు. అతడి మాటలకు శ్రీరాముడే ఆశ్చర్యపోయాడు. వెంటనే లక్ష్మణుడితో 'ఈ వ్యక్తి వేద వేదాంగాలను అభ్యసించాడని తెలుస్తోంది. మాటల్లో ఎక్కడా అపశబ్దం లేదు. ఇటువంటి వాణ్ని మంత్రిగా, దూతగా పొందిన పాలకుడు భాగ్యవంతుడు!' అంటాడు.
వాక్కుల ద్వారా గొప్ప పనులు సాధించిన వాళ్లున్నారు. హనుమంతుడు సీతాదేవికి తన వాక్కుల ద్వారా సాంత్వన కలిగించి ఆమె దుఃఖభారాన్ని పోగొట్టాడు. అలాగే శ్రీరాముడితో 'చూశాను సీతమ్మ తల్లిని...' అంటూ ఒక్క మాటలో విషయమంతా చెప్పి రాముడి మనసును తేలికపరుస్తాడు.
మాటల్లో శబ్దశక్తి కూడా ఉంది. ఆ శబ్దశక్తి రహస్యాలను గ్రహించి తద్వారా మంత్రాలను దర్శించారు రుషులు. అందుకే మాట ఓ ఆశీస్సుగా ఉండాలి. ఎవరైనా మధురంగా మాట్లాడాలి. మన మాట ఎదుటి వ్యక్తికి ధైర్యాన్ని, ఓదార్పును, స్పూర్తిని కలిగించాలి.
యుద్ధసమయంలో శరీరానికి తగిలే బాణాలను తెలివిగా తొలగించవచ్చు. కాని మనసును గాయపరచిన బాణాలను ఎవరూ తొలగించలేరని మహాభారతం చెబుతోంది. అందుకే ఎదుటి వ్యక్తి మనసును గాయపరిచేలా, హింసించేలా మాట్లాడకూడదు. అలాగే అశుభాలను శంకిస్తూనైనా మాట్లాడరాదు.
మూర్ఖుని హృదయం అతని నోట ఉంటుంది. జ్ఞాని నోరు అతడి హృదయంలో ఉంటుంది అంటాడు బెంజమిన్ ఫ్రాంక్లిన్. మాటను బట్టి వ్యక్తిత్వాన్ని, మనసును అంచనా వేయవచ్చు. సత్యంతో కూడిన వాక్కు దైవంతో సమానం. అలాంటి వాక్కును శ్రద్ధగా, జాగ్రత్తగా, అర్థవంతంగా అందరూ వినియోగించుకోవాలి. అప్పుడే వాక్‌సిద్ధి లభిస్తుంది. మన వాక్కు అందరికీ ప్రియమవుతుంది.
- విశ్వనాథ రమ