ᐅ కోకిలలు
కళ్లకు కనిపించలేదు. చెవులకు వినిపించలేదు. తెల్లవారు జామున మెలమెల్లగా రాలింది. ఆ కోమల నీహార వర్షానికి లేత గులాబీలు రెక్కలు విచ్చుకున్నాయి. తెల్లవారగానే మంచు మటుమాయమై పోయింది! అది అజ్ఞాతంలోకి వెళుతూ వెళుతూ, మనకు మాత్రం దివ్య సౌందర్యాన్ని అందించిపోయింది. పేరు ప్రతిష్ఠల కోసం సమాజసేవ చేసే వారెందరో ఉంటారు. అజ్ఞాతంలో ఉండి అందరికీ మేలు చేసేవారు ఇంకా ఎందరెందరో! 'ఎవరో మహానుభావుడు... దేవుడిలాగా నాకు సాయం చేశాడు!' అని వాళ్లు కృతజ్ఞతతో అనుకునే మాటలను వినడానికి కూడా ఆసక్తి చూపరు.
దేవుడి హుండీలో కోటిరూపాయలు వేశాడొక అజ్ఞాత భక్తుడు. హరికథా కళాకారుడి చేతిలో, తన పేరు కూడా చెప్పకుండా వందరూపాయల నోటు ఉంచి, తలెత్తకుండా వెళ్లిపోయాడొక వ్యక్తి. ఆకలితో నకనకలాడే భిక్షగాడికి పంచభక్ష్య పరమాన్నాల పాత్రనందించి అదృశ్యమైంది ఒక ఇల్లాలు. సమాజంలో ఇవన్నీ ఎప్పుడూ జరుగుతూ ఉండేవే. ఈ సహాయాలు చేసేవారికి తమ పేరు ప్రచారంలోకి రావడం ఇష్టం ఉండదు. ఇతరులకు మేలు జరగడమే ముఖ్యం! సహాయం చేసిన వ్యక్తి కనబడి, తన పేరు చెబితే- అతడొక 'మంచి మనిషి' అనుకుంటారు. కనబడకుండా సహాయం చేస్తే? అతడినొక దేవుడిగా కొలుస్తారు! మన జీవితంలో ఎన్ని ఆపదలు వచ్చి పడ్డాయి? ఎన్ని కష్టనష్టాలను ఎదుర్కొన్నాము? ఆపన్న హస్తమేదో మనల్ని ఆదుకొన్నది! అది భగవంతుడిది. మానుష రూపంలో దైవం మనకు అండగా ఉన్నది. అలా సాయం అందించిన మనిషి కూడా అజ్ఞాతంగానే ఉండిపోవచ్చు! నిజానికి ఇదొక అజ్ఞాత శక్తి. యుగయుగాలుగా తోటివారికి ఈ శక్తే సాయపడుతోంది.
కాపుకొచ్చిన చేనులో, మంచెపై నుంచి పడతి పాడే 'పదం' విని ప్రకృతి పరవశిస్తున్నది. ఆ పదకర్త ఎవరు? ఎవరికీ తెలియదు! పదపదాన అమృతం చిందే ఎన్ని పదాలు, ఆఖరికి ఎన్నెన్ని తేనెలొలికే భాషలు చడీచప్పుడు లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాయో? సరిగమలు పలికే రాతిస్తంభాల శిల్పులెవరో? తెలియదు! ఇంతెందుకు? మన పూర్వకావ్యాల రచయితల పేర్లు అనేకం మనకు తెలియవు. యుగయుగాలుగా మనకు స్ఫూర్తిప్రదాతలైన ఆ మహాకవులెందరో నేడు అజ్ఞాత వ్యక్తులు! మన తత్వశాస్త్రాలు ఎవరు రాశారు? పురాణాలు ఎవరు రాశారు? కర్మ చేయడమే తప్ప దాని ఫలంపై తమకు అధికారం లేదని విశ్వసించారు ప్రాచీనకవులు. అందుకే అజ్ఞాతంలో ఉండడానికే ఇష్టపడ్డారు. తమ చరిత్రలు రాసుకోలేదు. గణితం, ఆయుర్వేదం, ఖగోళం, భాష, వ్యాకరణం, సాహిత్యం, లలితకళల రూపేణా పూర్వులు వేసిన పునాదులపై మనం మహాసౌధాలు నిర్మించుకున్నాం. ఆ అజ్ఞాత మహాత్ములు మనకొక విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు- 'పేరు ముఖ్యం కాదు; చేసిన పని ముఖ్యం' అని.
పాండవులు ఏకచక్రపురంలో ఉన్నారు. మారువేషాలు ఎవరూ గుర్తు పట్టలేదు. ఆ ఇంటి వాళ్లు ఏడుస్తున్నారు. బకాసురుడికి ఆహారంగా తమ ఏకైక కుమారుణ్ని పంపవలసి వచ్చింది. వారి దుఃఖాన్ని చూసి, కుంతీదేవి హృదయం కరిగిపోయింది. కారణం తెలుసుకున్నది. తామే పలు కష్టాల్లో ఉన్నప్పటికీ, సాయం చేసే మనసు వూరుకోదు గదా! 'నాకు అయిదుగురు కుమారులున్నారు. ఒక్కణ్ని పంపిస్తే నాకు కొదవ కాదు... మీరు శోకించవద్దు! మా అబ్బాయిని పంపిస్తాను' అని వారిని ఓదార్చింది. అసలే అజ్ఞాతంలో ఉన్నారు. ఏ మాత్రం గుట్టు బయటపడినా ప్రమాదం. అయినా ఆమె వెనకాడలేదు. తామెవరో తెలియకూడదు. భీముడు బకాసురుడి పీచం అణుస్తాడు. ఆ తరవాత కూడా ఇంకొన్నాళ్లు వారు అజ్ఞాతంలోనే కొనసాగారు. అజ్ఞాత వ్యక్తుల ఆత్మ విశ్వాసానికి, ధర్మబుద్ధికి, పరోపకారానికి భారతోదాహరణ ఇది. 'కుహూ కుహూ' రావాలు వినబడుతున్నాయి. కన్నులు పెద్దవి చేసుకొని, ఏ చెట్టువైపు చూసినా ఆ పిట్ట కనబడటంలేదు. వినేవాళ్లందరికీ శ్రుతి హితంగా మాత్రం ఉంది. 'ఆకులందున అణగిమణగి కవిత కోకిల పలకవలెనోయ్' అన్నారు కవీంద్రులు. తాము అజ్ఞాతంలో ఉండి లోకానికి హితం కలగజేస్తున్నవారు ఆ కోకిలలాంటి వారే!
- డాక్టర్ పులిచెర్ల సాంబశివరావు