ᐅ హిత కార్యం


 ᐅ హిత కార్యం

సృష్టిలో అతిచిన్న జీవులు కూడా తమ తోటి ప్రాణుల కోసం ఎంత నిస్వార్థంగా పాటుపడతాయో తెలియజెప్పే హృదయార్ద్ర భరితమైన జపాను కథ ఒకటుంది.
భూకంపాలు ఎక్కువగా సంభవిస్తున్న కారణంగా ఆ దేశంలో చాలామంది తమ ఇంటిగోడల్ని తేలికపాటి కలప పలకలతో నిర్మించుకుంటుంటారు. అలాంటప్పుడు ఆ పలకల మధ్య అక్కడక్కడ కొంచెం సందులు ఏర్పడటం సహజం. కొన్నేళ్ల తరవాత వాటి మధ్య తేమ వల్లనో, పురుగుల వల్లనో కొన్ని పలకలు చీకిపోతుంటాయి. వాటిని తొలగించి కొత్త పలకల్ని మేకులతో కొట్టి బాగుచేసుకుంటుంటారు.

ఒకతను తన ఇంటిని ఇలా పునర్‌నిర్మించుకుంటుండగా ఒక పలక సందులో అతుక్కుపోయిన బల్లి ఒకటి కనిపించేసరికి గతుక్కుమన్నాడు. కొన్నేళ్ల క్రితం ఆ గోడను నిర్మించేటప్పుడు తాను కొట్టిన మేకు ప్రమాదవశాత్తు ఆ బల్లి కాలిగుండా దూసుకుపోవటం వల్ల అది కదల్లేక అలాగే ఉండిపోయిందని అతనికర్థమైంది. 'అయ్యో, నిష్కారణంగా దాని ప్రాణం తీశానే!' అని అతను విలవిల్లాడిపోయాడు. అయితే, చిత్రంగా అది వూపిరితీస్తూ కనిపించేసరికి అతను కుతూహలాన్ని ఆపుకోలేకపోయాడు. తన పనిని ఆపి ఇన్నేళ్లపాటు అది కదలకుండా ఏ ఆహారమూ దొరికే ఆధారం లేకుండా ఎలా బతికిఉందా అని ఆ అద్భుత దృశ్యాన్ని చూస్తూ శిలాప్రతిమలా నిలబడిపోయాడు. మరికాసేపటికి ఎక్కడి నుంచో మరో బల్లి ఆ పగిలిన పలకల మధ్యనుంచి దూరి దూరి వచ్చి తన వెంటతెచ్చిన ఆహారాన్ని ఈ బంధితురాలైన బల్లికి తినిపించటం కనిపించేసరికి అతడి ఆశ్చర్యానికి అంతే లేకపోయింది. ఈ సృష్టి చిత్రానికి అతని మనసు ఉప్పొంగి ఒళ్ళు పులకరించిపోయింది.

ఏమాత్రం జ్ఞానంలేని ఒక సామాన్య జీవి కష్టంలో ఉన్న తన తోటి ప్రాణిని కాపాడటానికి ఇన్నేళ్లుగా ఎంతగా శ్రమిస్తోంది! మేకువల్ల బంధితురాలైన బల్లి ఏ ఆశతో జీవిస్తోంది?

బుద్ధిజీవులైన చాలామంది మనుషులు తమ తోటివాళ్లు కష్టాల్లో ఉండగా ఎందుకు ఉపేక్ష వహిస్తుంటారు? చిన్న కష్టాలనే భరించలేని మరికొందరు నిస్పృహతో ఇంకొకరిని బాధిస్తూ తమ ప్రాణాలు తీసుకునేదాకా పోతారెందుకని?

ఈ అల్పజీవుల నుంచి మనుషులు ఎంతో నేర్చుకోవలసి ఉంది కదా అని అతనికి జ్ఞానోదయమైంది!

రుగ్వేదంలో మనుషులు సూర్యచంద్రుల్లా బతకాలని ఒక సూక్తి ఉంది. సూర్యుడు ఎవరినుంచీ ఏమీ ఆశించకుండా ప్రతిరోజూ తానిచ్చే వెలుగు, వేడివల్లనే సర్వప్రాణులూ భూమిమీద ప్రాణాలతో జీవించగలుగుతున్నాయి. చంద్రుడు తన హెచ్చుతగ్గులతో సముద్రాలకు ఆటుపోటుల్ని కలిగిస్తూ భూమిమీద ప్రకృతికి సమతుల్యత ప్రసాదిస్తున్నాడు. తనకు సహజమైన కాంతి లేకపోయినా తన మీద పడిన సూర్యరశ్మిలోని వేడిని తాను భరించి మనపై చల్లని వెన్నెల కురిపిస్తున్నాడు.

అలాగే మనిషి తన కర్మలతో మరొక ప్రాణికి హితకారకుడు కావాలి. అది ఎవరో పనికట్టుకుని చెప్పాల్సిన అగత్యం లేదు. అహంకారం విడనాడి వినయ సంపదతో తన విధ్యుక్త ధర్మంగా భావించి చేయాల్సిన పని అది. సృష్టిలో ప్రతి జీవినుంచి మనిషి నేర్చుకొని ఆచరించాల్సింది ఎంతో ఉంది!

- తటవర్తి రామచంద్రరావు