ᐅ రాజ్యాంతే నరకం ధ్రువమ్
ᐅ రాజ్యాంతే నరకం ధ్రువమ్
మహాభారతంలో ఉన్న పద్దెనిమిది పర్వాల్లో ఆఖరిది స్వర్గారోహణ పర్వం. తన తమ్ముళ్లు నలుగురు, భార్య ద్రౌపదీ మృతులైన తరవాత, ధర్మరాజు సశరీరంగా స్వర్గం చేరటం ఈ పర్వంలో విషయం.
ధర్మరాజు లాంటి ధర్మపరుడికి కూడా కొద్దిపాటి నరకానుభవం తప్పలేదు. ఆ సందర్భంలో యముడు ధర్మరాజుతో 'నాయనా! రాజ్యపాలన చేసిన తరవాత ఎవరికైనా, నరకానికి కొంతకాలమైనా వెళ్లక తప్పదు. 'రాజ్యాంతే నరకం ధ్రువమ్' అని చెబుతాడు. ఇంద్రుడూ ఆ మాటే అంటాడు.
రాజు అంటే రాజే కాదు. ఏ రకమైన అధికారం అనుభవించినవారికైనా ఇది కొంచెం హెచ్చుతగ్గుల్లో వర్తిస్తుంది.
'అధికారాంతమునందు చూడవలెరా, ఆ అయ్య సౌభాగ్యముల్' అంటాడొక కవి- దంభం, భేషజం, అహంభావం, ఆడంబరం ప్రదర్శిస్తూ అధికారం చలాయించే అల్పబుద్ధులను గురించి. అధికార దర్పంతో లేనిపోని దర్జాలు వెలగబెట్టి, ఆ అధికారం పోయిన తరవాత ఆ సుఖాలూ సదుపాయాలూ అంతమైపోయి, అడుగులకు మడుగులొత్తే భృత్యులు లేక నానా నరక యాతనలూ భూమి మీదే అనుభవించేవాళ్లు లోకంలో కనిపిస్తూనే ఉంటారు. కానీ 'రాజ్యాంతే నరకం ధ్రువం' అంటూ చెప్పిన నరకం ఇది మాత్రమే కాదు.
అసలు రాజ్యాధికారమన్నా, అధికారమన్నా అర్థం ఏమిటి? సంక్రమించిన అధికారాన్ని న్యాయంగా, నీతి సమ్మతంగా, ధర్మబద్ధంగా నిర్వహిస్తేనే అది విధి నిర్వహణ. అందుకే అధికార నిర్వహణ కత్తిమీద సాము; విధుల నిర్వహణ సవ్యంగా చేస్తే సరే సరి. పుచ్చుకొన్న జీతభత్యాలకూ దానికీ సరిపోతుంది. పొరపాట్లు చేస్తే మాత్రం వాటికి శిక్ష తప్పదు! అన్ని బలహీనతలకూ ఆలవాలమైన సామాన్య మానవుడు, అధికార విధి నిర్వహణలో అత్యుత్సాహం వల్లో, ఆడంబర ప్రీతి వల్లో, ధర్మాధర్మ విచక్షణ మరచిపోవడం వల్లో పొరపాట్లూ తప్పులూ చేయడం చాలా సహజం. ఈ పొరపాట్లకు, అధికారాంతంలో ఏదో విధమైన శిక్ష అనుభవించాల్సి వస్తుంది. విధి అనే న్యాయమూర్తి న్యాయ నిర్ణయంలో, ప్రతి చర్యకూ ప్రతిచర్య తప్పదు కనుకనే 'రాజ్యాంతే నరకం ధ్రువం' అన్న సూక్తి.
'అధికార నిర్వహణలో పాపాలు ఎలాగూ తప్పవు కాబట్టి మానవుడైనవాడు అసలు రాజ్యాధికారం, ఇతర అధికారాలూ చేపట్టనే కూడదు' అని కాదు ఈ సూక్తికి అర్థం. అధికార విధులను ప్రమత్తత లేకుండా, ధర్మాధర్మ విచక్షణ కోల్పోకుండా, కొద్దో గొప్పో వైరాగ్య బుద్ధితో నిష్కామంగా నిర్వహించేందుకు సర్వదా ప్రయత్నించు, అని ఇతిహాసం చేస్తున్న హెచ్చరిక మాత్రమే.
మనిషి ప్రవృత్తికీ, స్వభావానికీ, చర్యలకూ కారణం సత్వరజస్తమో గుణాలనే గుణత్రయం. వీటిలో సత్యం పాలు ఎక్కువ ఉన్నవాడు మోక్ష విషయంలో ఎక్కువ ఆసక్తీ, లౌకిక విషయాల్లో తక్కువ ఆసక్తీ కలిగి ఇంద్రియ నిగ్రహంతో ప్రవర్తించగలుగుతాడు. ఈ సాత్వికత దేవతల్లో, దైవస్వరూపాల్లో ఎక్కువ. ఆధ్యాత్మిక సాధనలవల్ల మనిషి తనలో సత్వగుణాన్ని వృద్ధి చేసుకోవచ్చు. చేసుకోవాలి. ఎందుకంటే ఈ సాత్వికతకు ఫలం శాంతి.
రజోగుణం పాలు ఎక్కువైనవారికి లౌకిక విషయాల్లో ఆసక్తి, రాగద్వేషాలు, ఆగ్రహానుగ్రహాలు, ఆవేశ కావేషాలు ఎక్కువ కావటం చేత మనసునూ ఇంద్రియాలనూ నిగ్రహించలేరు. వీరి చిత్తం చంచలంగా, అశాంతిగా ఉంటుంది. లౌకిక వ్యవహారాల్లో మితిలేకుండా తలమునకలై తపిస్తుంటారు. ఆశ, అహంకారం, అస్థిమిత ప్రవృత్తీ... ఇవన్నీ రజోగుణ లక్షణాలు లేక రాజస లక్షణాలు. రజోగుణ ప్రవృత్తికి ఫలం దుఃఖమే అని నిర్ద్వంద్వంగా చెబుతోంది గీత. మానవజాతి రజోగుణ ప్రధానమైన సృష్టి. ఆ రజోగుణమే మనిషి దుఃఖాలకు, దుర్మార్గాలకు హేతువు. అదే మనిషిని సుఖభ్రాంతి అనే ఎండమావి వెనక పరుగెత్తిస్తుంది.
రాజ్యభారం మోసే రాజులు, అధికార నిర్వహణ చేసే అధికారులు, ఉద్యోగపు ఒత్తిళ్లలో సతమతమయ్యేవారు తమలో రజోగుణ ప్రకోపాన్ని గమనించుకొంటూ ఉండాలి. లేకపోతే రజోగుణబద్ధులై, ఆశామోహాల ప్రవాహంలో కొట్టుకుపోతూ, ధర్మాధర్మ విచక్షణ బలహీనపడి తెలిసి తెలిసీ తప్పులు చేసే ప్రమాదం ఉంది. రావణబ్రహ్మ, దుర్యోధనుడు లాంటి ఇతిహాస పురుషుల జీవితాలు నేర్పే నీతి ఇదే. అసత్యం, మోసం, పరహింస, ఆశ్రిత పక్షపాతం, అక్రమార్జన తప్పు అని తెలియనిదెవరికి? దాని ఫలితం అనుభవించక తప్పదని తెలియనిదెవరికి? ప్రయత్నపూర్వకంగా, విధి నిర్వహణలో, ధర్మ విషయంలో అప్రమత్తులుగా ఉండని రాజులకు 'రాజ్యాంతే నరకం ధ్రువమ్' అని మహాభారతం గుర్తు చేస్తున్నది.
- ఎం. హనుమంతరావు