ᐅ హృదయ సౌందర్యం
ప్రపంచం వైవిధ్యభరితం. జంతువులకు తమ జాతిలో పుట్టినవన్నీ సమానమే. మనుషులు మాత్రం ఎర్రటివాళ్లను ఇష్టపడతారు. నల్లగా ఉంటుందని కాకిని అసహ్యించుకుంటారు. కాకిపిల్ల కారు నలుపు. దాని అరుపు మనుషులకు కర్ణకఠోరం. కానీ, ఆ కాకిపిల్లను దాని తల్లి మాటిమాటికి ముద్దు పెట్టుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. మాతృహృదయం సహజ స్వభావం అంతే! అది జగజ్జనని హృదయం. జగదీశ్వరికి ప్రతి జీవీ కన్నబిడ్డే!
బాహ్య సౌందర్యానికైతే పరిమితులుంటాయి. హృదయ సౌందర్యమో? అపరిమితం! హృదయ సౌందర్యంలో కరుణ, ప్రేమ, సానుభూతి ఉంటాయి. అవి దైవాంశలు. తల్లిలేని పిల్లి పిల్లకు పాలిచ్చి పెంచే కుక్కను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.
నలుపు నారాయణుడు అని సామెత చెబుతాం. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీవెంకటేశ్వరుడు... అందరి విగ్రహాలూ నలుపే! వారిని శ్యామసుందరులని స్తుతిస్తాం. కానీ, అమ్మాయికి సంబంధం చూసేటప్పుడు మాత్రం 'రంగు తక్కువ' అని తిరస్కరిస్తాం. మనవాడు పాండురంగని విగ్రహంలా ఉన్నా, పెళ్ళికూతురు నల్లటిదైతే మాత్రం వల్లగాదు!
సృష్టిలో ఏ ప్రాణి అందం దానిదే! అయినా సరే, కొన్ని ప్రాణులు అందంగా ఉంటాయంటే మనుషులు అంగీకరించరు. వానరాలు సుందరంగా ఉంటాయంటే అంగీకరించేవారు తక్కువ. కానీ, హనుమంతుడు సుందరుడని ప్రతీతి. ఆయన పాత్ర ప్రధానంగా ఉన్న భాగానికి సుందరకాండ అని పేరు. ఎక్కడున్నది హనుమ అందం? ఆయనది హృదయ సౌందర్యం! అతిలోక సుందరుడైన శ్రీరామచంద్రుడు ఆయన హృదయంలో ఉన్నాడు. సముద్రాన్ని లంఘించడం, సీతజాడ కనుగొనడం, లంకాదహనం చేయడం, సంజీవని తెచ్చి లక్ష్మణుని బతికించడం, సమరంలో వీరవిహారం గావించడం... ఇవన్నీ ఆంజనేయుడి భౌతిక విజయాలే! అంతటి వీరహనుమాన్ స్థానం ఎక్కడ? శ్రీరాముని పాదాల చెంత! నిరహంకారుడై, తన హృదయంలోనే సీతారాముల్ని ప్రతిష్ఠించుకొని, గుండెను చీల్చి వారిని చూపగల 'భక్త హనుమాన్'గా రామాయణ గాథలో సుస్థిరస్థానం సంపాదించిన ఆంజనేయుడు మనకు పూజనీయుడు. హృదయ సౌందర్యానికి నిదర్శనంగా నిలిచాడు. మాటలకంటే మనసు ముఖ్యం.
మహాత్ములు తమ ప్రబోధాలను ఆచరణలో పెట్టి చూపారు. రమణ మహర్షికి మోకాళ్ల నొప్పి ఎక్కువగా ఉండేది. ఆయన కాళ్లు ఒత్తితే తమకు పుణ్యం వస్తుందని భక్తులు పోటీ పడేవారు. రమణ మహర్షి వారిని వారిస్తూ ఇలా అన్నారు- 'ఉండడయ్యా, పుణ్యం అంతా మీకేనా? నాకూ కొంచెం మిగలనివ్వండి. నా కాళ్లు నేనే ఒత్తుకొని కాస్త పుణ్యం సంపాదించుకుంటాను!' ఈ మాటలతో శ్రీరమణుల హృదయ వైశాల్యమూ, సంస్కారమూ ఎలాంటివో భక్తులకు తేటతెల్లమైంది. ఆత్మ సౌందర్యంతో అందరినీ అలరించిన భగవాన్ రమణ మహర్షిని లోకం ఎన్నటికీ మరచిపోదు- హృదయ సౌందర్యం అమరం గనుక!
మహాత్ముల్లో ఎక్కువమంది భౌతికంగా సుందరాకారులు కాదు. 'లోకంలో ముగ్గురు వికార స్వరూపులు పేర్లు చెబుతా' అని 'లింకన్, గాంధీ, లెనిన్' అని ముగ్గురు మహాపురుషుల పేర్లు చెప్పాడు ఒక చమత్కారి. అవును, వారు సుందరాంగులని కాదు ప్రపంచం అభిమానిస్తున్నది. వాళ్లు అందగాళ్లు కారనే విషయం ఎవరికీ స్ఫురించదు. వారి సిద్ధాంతాలూ జీవితాలూ నచ్చినవాళ్లు ఆ మహాపురుషులు గొప్ప ఆకర్షణగల దివ్యమూర్తులని భావిస్తారు. వారిలో ఒక సౌందర్యాన్ని దర్శిస్తారు. అదే హృదయ సౌందర్యం. బాహ్య సౌందర్యాన్ని దర్శించడం, ఆనందించడం, అభినందించడం సులభం. హృదయ సౌందర్యాన్ని అర్థం చేసుకోవాలంటే సంస్కారం ఉండాలి. అందం తక్కువవాళ్లు కూడా ఆభరణాలూ, వస్త్రాలూ, అలంకరణలచేత ఆకర్షణీయంగా కనబడవచ్చు. ఇవన్నీ భౌతిక సౌందర్య సాధనాలు. ఇవన్నీ తాత్కాలికమైనవి. నిష్కాపట్యం, కరుణ, సహాయగుణం... ఇలాంటివి హృదయ సౌందర్య సాధనాలు. ఇవి శాశ్వతమైనవి.
దయగల హృదయమే సౌందర్య నిలయం!
- డాక్టర్ పులిచెర్ల సాంబశివరావు