ᐅ సహజీవన సౌభాగ్యం
తోడులేని జీవితం నీడలేని ఎడారి నడక లాంటిది. జీవనయానం ఒంటరిగా చెయ్యటం సాధ్యం కాదు. ఇలా చెయ్యాలంటే ఎంతో ఆత్మబలం కావాలి. రమణ మహర్షి, వివేకానంద వంటి కొద్దిమంది మహాత్ములు బ్రహ్మచారులుగా, ఆత్మానంద భరితమైన జీవితాన్ని గడిపారు. భగవంతుడూ జంటగానే కనిపిస్తాడు. వాణి-విరించి, లక్ష్మీ-నారాయణులు, శివాని-శివుడు ఇందుకు ఉదాహరణలు.
భావలోక నివాసిని, సర్వోన్నత శక్తి, అనంత ఆహ్లాదినిగా వేదాలు ప్రస్తుతించే రాధామాత, తనకు తోడుగా గోలోకంలో శ్రీకృష్ణుణ్ని తనలోంచి సృజించుకుందని రసికయోగి, బృందావన వాసి, రాధికాప్రసాద్ మహరాజ్ తన గ్రంథంలో పేర్కొన్నారు. సృష్టి ప్రారంభ బిందువు గోలోకంలో ఉందంటారు. అందుకే శ్రీకృష్ణుని పరమాత్మగా చెబుతారు.
రాధ తేజస్సు నుంచి శివుడు, శ్రీకృష్ణుడి తేజం నుంచి పార్వతి ఆవిర్భవించి, ఆదిదంపతులైనట్లు రాధామాత చరితం చెబుతుంది. ఆనందానికి మరొకపేరు రసం. రాధాకృష్ణుల ఆనంద నృత్యానికే 'రాస' అని పేరు. 'రాసలీల' అంటే రాధాకృష్ణులు తమ దివ్యలీల ద్వారా సర్వలోకాలకు ఆనందప్రసారం చెయ్యటం. అయితే, మన ప్రవృత్తులు, అర్హతలనుబట్టి- వెన్నెల్లాంటి హాయి, తేనెలాంటి తియ్యదనం కలిగిన ఆనందం అనుభవానికి వస్తుందంటారు.
మన మనసు పాత్రలో అనునిత్యం భావకాలుష్యం దట్టంగా అలుముకుంటుంది. మన గృహాల్లో దుమ్ము, ధూళి, సాలెగూళ్లు ఏ విధంగా పేరుకుంటాయో, అలాగే మనకు తెలియకుండా భావకాలుష్యం మనసులో ఆవరిస్తుంది. దాన్ని ఎప్పటికప్పుడు తొలగించుకోకపోతే, చివరికది వల్మీకమవుతుంది. అందులోకి పాముల్లా పిశాచ, రాక్షసభావాలు వచ్చి చేరతాయి. మనిషి చేత అనేక అకృత్యాలను, నేరాలను, పాపాలను చేయిస్తాయి. సంఘంలో నేరాలు-ఘోరాలు జరగటానికి ఇవే ప్రేరణాశక్తులు. వీటిని వదిలించుకునేందుకు, ఆధ్యాత్మికంగా చేయదగిన ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. నిత్యం స్నానం చేస్తూ, శరీరాన్ని ఎలా శుభ్రంగా ఉంచుకుంటున్నామో, అలాగే మనసునూ కాలుష్యరహితంగా ఉంచుకునేందుకు గట్టి ప్రయత్నం చేయాలి. రుషులు భార్యను సహధర్మచారిణి, అర్ధాంగి, సహచరి, సమభాగిని- ఇలా సమాన గౌరవం సూచించే మాటలతో సత్కరించారు. భార్యాసమేతంగా చేసే యజ్ఞయాగాలకు అధిక ఫలాలు లభిస్తాయంటారు. శ్రీరాముడు సీత పరోక్షంలో స్వర్ణసీతతో అశ్వమేధయాగం చేశాడు. ఉద్దాలక మహర్షి భార్య చండిక, వ్యతిరేక బుద్ధి కలదైనా, ఉపాయంగా ఆధ్యాత్మిక విధులు నిర్వర్తించాడు.
శివుడు తన పత్ని సతీదేవికి అవమానం జరిగినప్పుడు వీరభద్రుణ్ని సృష్టించి, బాధ్యులైన అందర్నీ శిక్షించాడు. స్వయంగా సతీదేవి దేహాన్ని మోస్తూ వ్యగ్రుడై విహరించాడంటారు. విష్ణువు ఆ దేహాన్ని తన చక్రాయుధంతో ఖండించగా, ఆమె దేహశకలాలతో ఏర్పడినవే అష్టాదశ పీఠాలనేది పురాణగాథ. బ్రహ్మ తన భార్యకు నాలుకస్థానంలో, విష్ణువు హృదయస్థానంలో, శివుడు ఏకంగా తన అర్ధశరీరంలో స్థానం కల్పించి లోకాలకు ఆదర్శాన్ని ఆచరణాత్మకంగా చూపారు.
భార్యను ఎవరు తన వాగ్దేవిగా గౌరవిస్తారో, వారు బ్రహ్మజ్ఞానప్రాప్తినీ, హృదయేశ్వరిగా భావించేవారు సిరిసంపదల్నీ, అర్ధాంగిగా తలచేవారు అరుదైన మోక్షప్రాప్తినీ పొందుతారన్నది పెద్దలమాట. కష్టసుఖాలను, సిరిసంపదలను భర్తతో సమంగా పంచుకుంటూ, జీవితకాలం స్నేహితురాలిగా ఉండగల వ్యక్తి భార్య మాత్రమే. 'నాతిచరామి'- అయిదు అక్షరాలుగా చూడకూడదు. ఆ వాగ్దానం- పంచప్రాణాలకు సమంగా మనం భావించి, ప్రేమతప్ప ద్వేషం తెలియని వ్యక్తిత్వంతో జీవిస్తే, దాంపత్య జీవితం ఆనందవాహినిలా సాగిపోతుంది. దాంపత్యం ఏడు జన్మల బంధంగా తెలుసుకునేందుకే, దంపతులచేత వివాహకాలంలో ఏడడుగులు(సప్తపది) వేయిస్తారు.
వివాహం సహజీవనానికి ఒక ఆహ్వానం.
సహజీవనం జీవన సౌభాగ్యానికి ఒక ఆలంబనం.
ఈ పరమసత్యాన్ని గ్రహించి, భార్యను బానిసగా కాకుండా పరమ మిత్రురాలిగా చూడగలిగితే, ఆ కాపురంలో కలతలు తలెత్తవు. జీవితం ఆనందమయమవుతుంది.
- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్