ᐅ అంతా బావుందా ?
అంతా బావుంది. అన్నీ బాగున్నాయి. ఈ ప్రపంచం బాగుంది. అందరూ బాగున్నారు అని అనుకోవటం బాగుంటుంది. నిజానికి భగవంతుడు సృష్టి చేసి ఇచ్చినప్పటిలా ప్రపంచం ఉందా? చాలా మారిపోయింది. మార్పు సహజం. ప్రకృతి పరంగా చాలా మార్పులు వచ్చాయి. నాగరికత రూపంలో అభివృద్ధి పేరిట మానవుడు ప్రపంచాన్ని చాలా మార్పులకు గురి చేశాడు.
తల్లి, బిడ్డల క్షేమం కోరుకుంటుంది. మహానుభావులు లోకక్షేమం కోరుకుంటారు. దేశాధినేతలు ప్రజల క్షేమం కోరుకుంటారు. కవులు, కళాకారులు, రచయితలు, భావుకులు అందరి మంచీ కోరుకుంటారు. కోరుకోవటంలో తప్పులేదు. కాని, వాస్తవిక పరిస్థితులను విస్మరించి ఆలోచనల్లో ఉన్నంత మాత్రాన భగవంతుడి ఆశీర్వాదం పొందగలమా?
ఒక గొప్ప భావాన్ని చక్కనైన పదాల్లో పొందుపరచి, నయం కాని గాయానికి లేపనం పూసినట్లుగా అందిస్తే- అది సత్యమా, అసత్యమా? కథలు బాగుంటాయి. కావ్యాలు బాగుంటాయి. మానవ జీవితాన్ని శనిలా పట్టిపీడిస్తున్న ఉపద్రవాలు, ఘోరకలుల గురించి కథనాలు ఎందుకు బావుంటాయి? బావుండవు. ఎందుకంటే అవి చరిత్ర మరువని సత్యాలు.
రావణాసురుణ్ని పూజించేవాళ్లు లేకపోయినా, ఇప్పుడు పెట్టుకుందామని ఎవరైనా ముందుకువస్తే, ఎక్కడ చూసినా అతడికి అభిమాన సంఘాలు పుట్టుకొచ్చేవి. నాయకుడిగా శ్రీరాముణ్ని మరిచిపోయేవారు. అయితే అతడి కార్యాలు మరచిపోగలమా? అంతా బావుందిలే అని రుషులు, మునుల ప్రార్థనలు పెడచెవిన పెడితే మహావిష్ణువు ప్రతి యుగంలో ఒక అవతారం ఎత్తేవాడా, ధర్మసంస్థాపన చేసేవాడా?
సంస్కరించడం, సంస్కరణ పొందడం నిజమైన నాగరికత. అందులో సౌందర్యం ఉంది. అది ఆత్మసౌందర్యం. మాటలు నేర్చిన చిలుక పండితుడి ఇంట్లో పద్యాలు వల్లించగలదు. కాని, దాని వాస్తవ స్వరూపం- పిల్లి దాని మెడను కొరికినప్పుడు వెలువడే శబ్దాలనుబట్టే తెలుస్తుంది.
భగవంతుడు మనకు ఇచ్చిన ఇంద్రియాలను తెరచి ఉంచుకోవాలి. జ్ఞాన సముపార్జన చేస్తూ లోకానికి దారి చూపించటమే కాకుండా ఏమాత్రం అవకాశం వచ్చినా బరిలోకి దిగాలి. ఉపన్యాసాలు, ప్రవచనాలు కొంచెం తర్ఫీదు పొందితే ఎవరైనా ఇస్తారు. ఆచరణలో ముందుకు వెళ్లేవాళ్లు ఎంతమంది ఉంటారు? అవసరమైతే దైవాన్ని కూడా ప్రశ్నించడానికి వెనకడుగు వెయ్యనివాడే ఆయన ప్రియ భక్తుడు అవుతాడు. అర్జునుడు శక్తిమంతుడైన విలుకాడు. అంతా బాగుంది, నాకేం ఫరవాలేదు అని అతడు సరిపెట్టుకోలేదు. శ్రీకృష్ణుడి అండదండలు పొంది కౌరవసేన మీదకు వెళ్లాడు. విజయం సాధించాడు. అంచనాలు వేసినప్పుడు ప్రజ్ఞ కలిగి ఉండాలి. చిన్న వానరమే అయినా సమయం వచ్చినప్పుడు పెద్ద హనుమంతుడిగా మారి ఆకాశమంత అయిపోయి, రావణాసురుణ్ని గడగడలాడించలేదా?
స్తోత్రాలు, స్తుతులు దేవుళ్లకు బాగుంటాయి. రాక్షసులను ఎదుర్కొనే పద్ధతులు వేరుగా ఉంటాయి.
సుందరమైన తోటలో అందమైన గులాబీపై తుమ్మెదలాగా విహరించాలని అందరికీ ఉంటుంది. కానీ, ఆ తోటను జంతువులు ధ్వంసం చేయకుండా చుట్టూ కంచె వేసుకుని రక్షించుకోవాలనే బాధ్యత కూడా ఉండాలి. అప్పుడే అంతా బాగుంటుంది. అలా అనుకోవడమూ బాగుంటుంది.
ప్రపంచంలో మంచిని చూడాలి. చెడ్డను విడిచిపెట్టాలి అంటారు. మంచిని చూడాలంటే మంచిని నిర్మించాలి. చెడ్డను విడిచిపెట్టాలంటే దానికి అవకాశమే ఇవ్వని పరిస్థితులు కల్పించుకోవాలి. దేవాలయానికి రోజూ వెళ్లాలంటే దాని పక్కన కొత్తగా వచ్చిన మద్యం దుకాణాన్ని మరచిపోయి, వస్తూ పోతూ ఉండటమే కాకుండా అక్కడ దాన్ని లేకుండా చేసే ప్రయత్నంలో ఎందుకు భాగస్వామి కాకూడదు? అలా అయితే భగవంతుడు మనలను నిందిస్తాడా? కానే కాదు. ఆ పనిచేసేవాళ్లకు తప్పక సహాయం చేస్తాడు. ప్రయత్నించి చూడాలి. దైవశక్తి తెలుస్తుంది.
సరిగ్గా అర్థం చేసుకొనకపోవడంలో, అన్వయించుకొనకపోవడంలో మంచిమాటల అర్థాలు మారిపోతుంటాయి. అందుకే చేసేవాళ్లకంటే చూసేవాళ్లు ఎక్కువైపోతుంటారు. వ్యాఖ్యానాలు చేసేవాళ్లకంటే లోకకల్యాణం కోసం శ్రమించేవాళ్లే చరితార్థులుగా మిగులుతారు. అందుకే రామాయణంలో అతి చిన్నవైన జటాయువు, గుహుడు, శబరి, ఉడుత పాత్రలూ శాశ్వతంగా నిలిచిపోయాయి.
- ఆనందసాయి స్వామి