ᐅ జిహ్వ చాపల్యం


 ᐅ జిహ్వ చాపల్యం

నాలుక రుచులను కోరుకొంటుంది. రుచి నోటివరకే పరిమితం. గొంతు దిగితే... పదార్థానికి రుచి ఉండదు. బొడ్డూడని బిడ్డకు సైతం రుచులు తెలుస్తాయి. పుట్టి, నేల మీద పడ్డ లగాయతు, కట్టె కాలేదాకా రుచులపై యావ చావదు. దీన్నే ముచ్చటగా 'జిహ్వచాపల్యం' అంటారు. ఏదో ఒక రుచినే ఇష్టపడేవారు కొందరైతే, అన్ని రుచుల్నీ ఆప్యాయంగా ఆస్వాదించే రసజ్ఞులు మరి కొందరు! శశిరేఖా పరిణయం చేయడానికి వచ్చిన ఘటోత్కచుడు వంటగదుల్లోంచి వెలువడ్డ భోజన పరిమళాలను ఆఘ్రాణించి తట్టుకోలేకపోయాడు. వివాహ భోజనంలోని లడ్లు, అరిసెలు, బూరెలు, గారెలు... గోంగూర పచ్చడితో సహా తృప్తిగా లాగించేసి గర్రున తేన్చాడు. రామాయణం కుంభకర్ణుణ్ని 'తిండిపోతు' అని అభివర్ణించింది. నాలుకకు తృప్తిగా భోజనం చేయడం, నేత్రాలకు పరితృప్తిగా నిద్రపోవడం- ఇవే జీవిత పరమార్థంగా భావించేవారిని 'కుంభకర్ణులు'గా సమాజం పరిహసిస్తుంది.
జిహ్వచాపల్యమే చేప ఉసురుకు ఎసరు తెస్తుంది. గేలం కొక్కానికున్న వానపామును భక్షించడానికి వచ్చిన మత్స్యం చివరికి మనిషి కుక్షికి బలి అవుతుంది. ఎడారిలో ఒంటెకు తిండి దొరకదు. అక్కడుండే ముళ్ల పొదలనే ఆరగిస్తుంది. వాటిని నమిలేటప్పుడు నోట్లో ముళ్లు గుచ్చుకొని రక్తం స్రవిస్తుంది. ఆ నెత్తుటినే గుటకలేస్తూ 'ఆహా! ఈ ముళ్ల పొదలెంత రుచిగా ఉన్నాయి! ఇంకా తింటా!' అంటూ ఒంటె ముట్టె ముందుకు చాపుతుంది. మేక మాంసం రుచి మరిగిన మృగరాజు, అది తనకు ఎర అయిన విషయం ఎరుకలేక, వేటగాడి వలలో చిక్కుకుంటుంది. జీవులను భక్షించే వృక్షాలూ ఉన్నాయి. పూలలోని తేనెకోసం ఆశపడి వాలిన కీటకాలను హతంగావిస్తాయి. ఇవన్నీ స్వాహా కావడానికి కారణం వాటి జిహ్వచాపల్యమే! ప్రాణులన్నీ నాలుక కోరికకు దాసోహమంటున్నాయి. తుదకు బలి అవుతున్నాయి. నాలుకను జయిస్తే నలుదిక్కులనూ జయించినట్లే! కొన్ని అభిరుచులు వయసుతో పుడతాయి. వయసుతోనే అంతరించి పోతాయి. చచ్చేదాకా చావనిది ఏదీ? రుచులపై కోరికే!

మహాత్ములు సైతం రుచులను చంపుకోలేక వంపులు తిరిగారు. శ్రీనాథ కవి సార్వభౌముడు జీవిత చరమాంకంలో బతకడానికి నానా పాట్లు పడ్డాడు. కర్ణాటకం పర్యటించాడు. అక్కడ అసలు భోజనమే కరవైంది. ఒకప్పుడు బంగారు పళ్లెంలో, రాజుల సరసన, రసవత్తరమైన రుచుల్ని ఆస్వాదించిన రసన ఆయనది. కడకు, చల్లా అంబలి తాగాల్సి వచ్చింది. వెల్లుల్లి తెలకపిండి కలుపుకొని మింగాల్సి వచ్చింది. వాటితోనే సర్దుకొని భోజనం అయిందనిపించాడు. 'తల్లీ! కన్నడ రాజ్యలక్ష్మీ దయలేదా నేను శ్రీనాథుడన్‌' అని ఎంత వేడుకున్నా ఫలితం లేకపోయింది. పలనాడుకు పోతే అక్కడ సొద్దజొన్న కూళ్లు తప్ప సన్నన్నం సున్నా! 'రుచులు దోషం'- అని గ్రహించినవారే ధన్యాత్ములు. ఆ మహాత్ములు బతకడానికే భుజిస్తారు. భుజించడంకోసం బతకరు. కాబట్టే వాళ్లకు రుచులతో పనిలేదు. ఈ సూక్తి చెప్పడం సులభమే! ఆచరించడం చాలా కష్టం. రుచులు మరచి పొమ్మని చెప్పినంత తేలికకాదు ఆచరించడం.

జంతువులకంటే భిన్నమైన గుణం మనిషిలో ఒకటి ఉంది. చెరసాలలో వేసినా 'నాకు రుచికరమైన భోజనం పెట్టాలి' అని గోల చేసే జీవి మనిషి మాత్రమే! ఏ జంతువునైనా బంధిస్తే అది ఆహారం మాని కూర్చుంటుంది. 'ధనపాలక' అనే ఏనుగు తిండి తినడం లేదని బుద్ధుడికి శిష్యులు విన్నవించుకున్నారు. 'ఏ ప్రాణినైనా బంధిస్తే దానికి మానసిక బాధ కలుగుతుంది. తిండికంటే స్వేచ్ఛ జంతువుకు ముఖ్యం' అని బుద్ధుడు ప్రబోధం గావించాడు. సామాన్యంగా మనిషి ఆలోచన ఎలా ఉంటుంది? 'నేను జీవించినన్నాళ్లూ కడుపునిండా తినాలి. నా కుటుంబానికీ ఈ విషయంలో లోటు ఉండకూడదు. నా తరవాత కూడా, తరతరాలూ కూర్చుని హాయిగా తినడానికి సరిపడా ఎడాపెడా సంపాదించాలి!' ఆ ఆలోచనే మనిషిని అవినీతి సంపాదనవైపు మళ్లిస్తుంది. అందులోనుంచే 'తిను-తినుపించు' అనే దురాలోచన ఉద్భవిస్తుంది! బుద్ధుడు ఈ ప్రమాదాన్ని పసిగట్టాడు.

'ప్రతిరోజూ భిక్షాటనకు వెళ్లి కాలం వృథా చేయడం ఎందుకు? ఆ సమయాన్ని ధ్యానానికి ఉపయోగించడం మంచిది గదా!' అనుకున్నాడు ఒక బౌద్ధ భిక్షువు. ఆరోజు ఎక్కువ ఇళ్లకుపోయి భిక్షతెచ్చుకొని, కొంత తిని, మిగతాది మూటగట్టి దాచిపెట్టుకున్నాడు. మరుసటిరోజు ఆ మిగిలిన భిక్షంపై నీరుచల్లుకొని తిన్నాడు. తోటి భిక్షువులు ఇది చూసి సహించలేక పోయారు. 'అతడు భిక్షం అధికంగా తెచ్చుకొని, దాచిపెట్టుకొని మరీ తింటున్నాడు' అని బుద్ధుడికి చెప్పారు. ఆ భిక్షువు నిజాయతీ బుద్ధ భగవానుడికి బాగా తెలుసు. కానీ, సమాజానికి తెలియదు గదా! ఎంత నిజాయతీపరుడైనా సరే, కావలసిన దానికంటె ఎక్కువ పోగు చేసుకోకూడదు. నాటినుంచి బుద్ధుడు తన శిష్యులకు నియమం పెట్టాడు. 'మనకు ఆ దినానికి కావలసినంతే భిక్షం తెచ్చుకోవాలి. అవినీతి, అన్యాయమూ కాకపోయినాసరే- కావలసినంతకంటె ఎక్కువ సేకరించి, దాన్ని దాచి పెట్టుకోకూడదు' అని!

తిండి విషయంలో ఉత్తములకు సైతం పరిమితి అవసరం. మనకు కావలసిన దానికంటె ఎక్కువ తినడం అంటే ఇతరుల ఆహారాన్ని మనం ఉపయోగించుకున్నట్లే! మహా ప్రస్థాన పర్వంలో పాండవులు వరసగా కూలిపోతూ ఉండే ఘట్టం ఉంది. నకుల, సహదేవ, అర్జునుల తరవాత భీముడూ పడిపోసాగాడు. 'అన్నయ్యా! నేను మహా బలశాలినే! అయినా ఇలా కూలిపోవడానికి కారణం ఏమిటి?' అని ప్రశ్నించాడు. 'నాయనా! నీకు తిండి యావ ఎక్కువ. అమితంగా తినడం అనే దోషం చేత నువ్వు పడిపోయావు!' అని ధర్మరాజు భీముడి మరణానికి కారణం చెబుతాడు.

- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు