ᐅ లోపాలు
ᐅ లోపాలు
ప్రతి మనిషిలో లోపాలు ఉంటాయి. లోపాలు లేనివాడు ప్రపంచంలో లేడు, ఉండడు. లోపాలు ఏ విధంగా వచ్చాయి, ఎందుకు వచ్చాయి? ఎవరివల్ల ఏర్పడ్డాయనే విషయం వాదించుకుని, చర్చించుకుని ప్రయోజనం లేదు. వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలి. నీ లోపాలతో నువ్వు అలాగే ఉండు అని భగవంతుడు ఎన్నటికీ అనడు.
తన లోపాలు తాను తెలుసుకుని జీవితాన్ని సరిదిద్దుకోవాలనుకునేవాడికి సహాయపడటానికే గురువులు, శాస్త్రాలు! ఏ ఒక్కరూ పుట్టుకతో పరిపూర్ణులు కారు.
మానవ జీవన పరమార్థం తెలుసుకొని తన అంతరంగం వైపు తాను నడిచినవాడికి లోపాలు తేటతెల్లమవుతాయి. పరిష్కారాలు కనిపిస్తాయి.
దేహంలో ఏర్పడిన అనారోగ్యం సరిజేసుకుంటున్నట్లు మనసులో ఏర్పడిన వంకర బుద్ధులనూ సరి చేసుకోవచ్చు. మనం ఎప్పుడూ వాళ్లకు లోపాలున్నాయి, వీళ్లకు లోపాలున్నాయని రంధ్రాన్వేషణ చేస్తూ ఉంటాం. వాళ్లు మారితే మనం మారిపోదాం అనీ అంటూ ఉంటాం. అన్నింటికంటే సులువైనది, వెంటనే చెయ్యగలిగే పని... మనలను మనం మార్చుకోవటం. మన లోపాలు గుర్తించి సరిచేసుకోవటానికి ప్రయత్నించటం.
రకరకాల వ్యసనాలతో దారి తప్పిన ఒక మనిషి చివరి దశలో కుళ్లు కాలవలో దొరికాడు. అతడిని మదర్ థెరెసా దగ్గరకు చేర్చినప్పుడు ఆమె అతడి గురించి ఒక్క ప్రశ్నా వెయ్యలేదు. వెంటనే సేవ మొదలుపెట్టింది. చచ్చిన శవంలాంటి మనిషి గురించి ఎందుకింత ప్రయాస అనే ఆలోచన ఇతరులకు వచ్చినా- ఆమె లక్ష్యపెట్టకుండా అహర్నిశలు ప్రేమను పంచింది. అతడిలో కూడా ప్రభువును చూసింది. కాపాడింది. ఆ తరవాతా అతడి లోటుపాట్లను ప్రస్తావించలేదు.
మన పొరపాట్లను మనమే గుర్తించాలి. మన లోపాలను మనమే సరిజేసుకోవడానికి ప్రయత్నించాలి. సరిదిద్దుకోవాలి.
మీ లోపాలను నేను సరిదిద్దడానికి వచ్చాను. నేను సరిదిద్దుతాను రండి- అని అవతార పురుషుడైన శ్రీరాముడు అనలేదు. లోపాలు లేకుండా ఎలా జీవించాలో, ఎవరైనా మన లోపాలు ఎత్తిచూపితే ఎలా సరిదిద్దుకొని జీవించాలో... అలా జీవించి చూపించాడు. అది దైవ జీవనం. అందుకే అతడు ఆదర్శనీయుడైనాడు. లోక పూజ్యుడయ్యాడు.
మట్టి రకరకాలుగా ఉంటుంది. ఎన్నో లోపాలు ఉంటాయి. కుండ తయారు చేయడానికి వెంటనే అనువుగా ఉండదు. కాని, ఎంతో కష్టపడి వ్యయప్రయాసలతో ఘటాకారాన్ని ఇస్తాడు కుమ్మరి. లోపాలున్నాయి కదా అని మట్టిని విదిలించుకోడు. మనమూ అంతే. లోపాలు సరిదిద్దుకుంటే మంచి మనుషులమవుతాం. చక్కటి మనుగడ సాగిస్తాం.
ఈ విశాల విశ్వం అందరూ ఒప్పుకొనే విధంగా ఎంత మాత్రమూ లేదు. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక లోపం కనపడుతుంది. కొందరికైతే ఈ సృష్టిని నేను అయితే ఇలా చేసి ఉండను అనే భావమూ కలుగుతూ ఉంటుంది. తనదాకా వస్తే కాని తగవు గురించి తెలియదు. దేవుడు అవకాశం ఇచ్చినా స్వార్థపరుడైన మనిషి నిర్మించే భువన భవనం ఎప్పటికీ లోపభూయిష్ఠంగానే ఉంటుంది.
చంద్రుడిని చూస్తే మచ్చలు కనిపించవు. మచ్చలనే చూస్తే చంద్రుడు అందంగా కనిపించడు. వేడిని తలచుకుంటే సూర్యుడి మీద కోపం వస్తుంది. ఆ సూర్యకాంతే మన జీవన ఆధారమని తెలుసుకుంటే- రెండో మాట ఉండదు. బురదమట్టి, గులకరాళ్లు చూస్తే నది గొప్పగా అనిపించదు. విశాలమైన ప్రవాహం, దాహార్తిని తీర్చే గుణం చూస్తే- తల్లిలాగ అనిపిస్తుంది.
తెల్ల ఆవే కాదు, మచ్చలున్న ఆవూ తెల్లటి పాలిస్తుంది. మహా మహా వృక్షాలే కాదు, చిన్న చిన్న ఔషధ మొక్కలూ మనుషులకు ఉపయోగపడతాయి. ప్రాణాలను కాపాడతాయి. లోపాలను పక్కనపెట్టి సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రతి ఒక్కరూ ఈ విశ్వ యంత్రం నడపడానికి పనిముట్టులే.
బిడ్డ అంగవైకల్యంతో పుట్టాడని తల్లి పారెయ్యదు. పెంచి పెద్ద చేస్తుంది. మిగతా పిల్లల కంటే జాగ్రత్తగా ఎక్కువ ప్రేమతో చూస్తుంది. భగవంతుడూ అంతే. ఎన్ని లోపాలతో మనలను ఈ భూమ్మీదకు తీసుకువచ్చినా వాటికి కావలసిన రక్షణ ఏర్పరుస్తూనే ఉంటాడు.
అందుకే 'నాలో ఎన్నో లోపాలున్నాయి. ఉండనీ, నేనేం చెయ్యను? విధి ఫలకంపైన చిత్ర జగత్కారుడు నన్నావిధంగా రూపొందించాడు' అంటాడు ఉమర్ ఖయ్యామ్.
- ఆనంద సాయిస్వామి