ᐅ కొత్త చిగుళ్లు
సత్యం సనాతనమైనది. నిత్యనూతనమైనది. ఇప్పుడు మనందరికీ కొత్తదనం కావాలి. కొత్తగా చెప్పాలి. కొత్త కోణాలు తెరుచుకోవాలి. కొత్త భావాలతో అలరించాలి. పాతగా ఉంటే మనసు అంగీకరించదు. నమ్మదు. పురాతనమైన విషయమైనా నూతనంగా కనిపించాలి.
పాత సూర్యుడే. రోజూ కొత్తగా ఉదయిస్తాడు. కొత్తగా కనిపిస్తాడు. చంద్రుడూ పాతవాడే. ఒక్కో వెన్నెల ఒక్కోలాగా అనిపిస్తుంది. ఆ కొత్తదనం లేకపోతే హాయి ఉండదు. హాయి లేకపోతే సుఖం ఉండదు. సుఖం లేకపోతే అది ఎంత గొప్పదైనా ఎవరికి కావాలి?
కొత్తగా భూమ్మీదకు వచ్చిన శిశువుకు ఉండే సంరంభం వృద్ధుడైన పాత మనిషికి ఎలా ఉంటుంది? దేవాలయం ఎంత గొప్పదైనా శిథిలాలయం దగ్గరకు ఎవరు వెళతారు? శక్తి లేకపోయినా కొత్తగా కట్టిన ఆలయం వైపు పరుగులు తీస్తారు. కొత్త పాత అనే ఆలోచన మనిషిది కాదు. అతడి మనసుది. తైలధార లాగా ధ్యానం కొనసాగించాలి అంటే, కొన్నాళ్లకు ఆ ధ్యానం యాంత్రికమైపోతుంది. కొత్తయుక్తులతో, కుయుక్తులతో మనసును మభ్యపెట్టి ధ్యానంలో పెడితే అది ఎన్నోసార్లు కొత్త కొత్తగా మోసపోతుంది. అణిగిపోవడానికి సిద్ధపడుతుంది. చేస్తున్న పనిని పదేపదే చేయడం మనసుకు అసలు ఇష్టం ఉండదు. అందుకే అది కొత్తదనాన్ని కోరుకుంటుంది.
ద్వాపరయుగం నాటి పాత కృష్ణుడు కాకుండా ప్రస్తుత ఎలక్ట్రానిక్ యుగంలో అమిత వేగంతో ఆత్మజ్ఞానాన్ని బోధించే అధునాతన శ్రీకృష్ణావతార్ కావాలి. లేకపోతే త్రేతాయుగం నాటి నార బట్టల రాముడు కాకుండా మరో వంద సంవత్సరాలను దృశ్యీకరించే మెగా శ్రీరాముడు కావాలి.
రూపాలు కొత్తవి కావచ్చు. కాని వాటిని నడిపించే ఆత్మ పాతది. దీన్ని తెలుసుకోవాలనుకునే మనం మాత్రం కొత్త భావాలతోనే ఉండాలి. నిత్యం జీవధార లాగా ఉప్పొంగే విశ్వశక్తిని ఎప్పుడూ కొత్తగానే అనుభవించాలి. సరికొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండాలి.
ఎన్నిసార్లు చెప్పినా, విసుగురాని పాతపడని పదం ఒకటుంది. దాని పేరు దేవుడు. అదే సత్యం. అదే ప్రేమ. దాన్ని అందించే చేతులు కొత్తగా కనిపించాలి. దాన్ని పలికే నోరు అందంగా ఉండాలి. దాన్ని మనకు చూపించే వ్యక్తి మనలాగే ఇప్పటి దేశకాల పరిస్థితులకు సరిపోయినవాడై ఉండాలి. అప్పుడే ఆ సత్యం మన బుర్రకు ఎక్కుతుంది. అప్పుడే ఆ ప్రేమ మన శరీరంలోకి ప్రవహిస్తుంది. అప్పుడే ఆ దేవుడు మన స్నేహితుడు అవుతాడు.
అప్పటివరకు సంస్కృతంలో ఉన్న గొప్ప భావాలను తెలుగులో రచించి, శ్రీహరిని ఎంతో నూతనంగా ఆవిష్కరించి తీయనైన పద్యాలతో భాగవతాన్ని భక్తిరసామృతంగా మార్చి కొత్తదనాన్ని వెలయించిన పోతన ఎన్ని నూతన భావాలను దర్శించాడు!
కాలం మారుతుంది. తదనుగుణంగా సత్యం మారదు. కాని సత్యసారథులు మారుతుంటారు. మార్గాలు మార్చుతుంటారు. మన బుద్ధికి అనువైన రీతిలో కొత్తదారులు సృష్టిస్తూనే ఉంటారు. అర్జునుడిపై శ్రీకృష్ణుడికి ఉన్న ప్రేమ భగవద్గీతను సృష్టించింది.
కొత్తదనం తప్పూ కాదు. పాతదనం ఒప్పూ కాదు. పాతదనం అంగీకరించే కొత్తదనం కావాలి. అవ్యక్త, అనంత, అదృశ్య శక్తిమీదే అన్నీ ఆధారపడి ఉన్నాయి. ఆ శక్తి పాతదంటే పాతది కాదు. అలా అని కొత్తదీ కాదు. రెండింటికీ అతీతమైనది. కాలాతీతమైనది. మన అనుభవంలోకి రానంతవరకూ ఎన్నటికి తెలియనిది.
కొత్త చిగుళ్లు తిని కోయిల వసంత రాగాలు ఆలపించినట్లే మధుర భావాలు హృదయాన్ని ఆకట్టుకుంటాయి. ఏ విషయమైనా కొత్తగా చెప్పినప్పుడు ఎక్కువ మన్ననలు పొందుతుంది. కొన్నాళ్లకు అదే ప్రామాణికమవుతుంది. కొత్తనీరు రావటం, పాత నీరు పోవటం మనం చూస్తున్నదే కదా. నిత్యసత్యాలైన పరమ సత్యాలైనా ప్రకృతికి అనుగుణంగా నడవవలసిందే. కాదనలేం.
- ఆనందసాయి స్వామి