ᐅ మధుర వాక్కు

 ᐅ మధుర వాక్కు

మాట మధురాతిమధురంగా ఉండాలంటారు. మాటొక తూటా కాకూడదు. ఎదుటివారిని బాధపెట్టకూడదు. పరుషంగా ఉండకూడదు. చాలా సరళంగా ఉండాలి. స్పష్టంగా ఉండాలి. మాటల పొందిక నేర్చుకోవాలి. క్లుప్తంగా, సూటిగా ఉండాలి. తెలుగు భాషకు ఈ సందర్భాలన్నీ కలుస్తాయి. అదే పనిగా మాట్లాడుకుంటే- రసం మాట దేవుడెరుగు, నీరసం వస్తుంది.
అ అమ్మాయి మాట మధురంగా పాటలా ఉంటుంది. పెళ్ళాడుతా అన్నాడట వెనకటికొకడు. మౌనం కొన్నిసార్లు పెడార్థాల్నిస్తుంది. మౌనంకన్నా మాట ఎన్నోవిధాల మన సమస్యల్ని పరిష్కరిస్తుంది. మాట భాష తాలూకు సౌందర్యాన్ని, మనిషి సంస్కారాన్ని తెలుపుతుంది. మెదడు పంపుతున్న సంకేతాల్ని పెదాలమీద శబ్దతరంగాలుగా మార్పు కావడంలో మన నేర్పరితనం కనిపిస్తుంది. ఇది నా మాటగా చెబుతున్నాను అని అంటే- అతడి వ్యక్తిత్వం గోచరిస్తుంది. కొందరు ఆవేశంతో ఏదో మాట్లాడేసి- నేనలా అనలేదు, మీరు వక్రీకరిస్తున్నారు అని అంటారు. నిజానికి మాట ఒకసారి నాలుక జారితే దాన్ని వెనక్కు తీసుకోవడం అసంభవం. ప్రజాహితం కోరి మాట్లాడాలేతప్ప సొంత లాభంకోసం ఉపన్యసించకూడదు.

కొంతమంది వ్యాపారస్తులు వినియోగదారుల్ని ఆకర్షించడానికి 'నవ్వు'ను ముఖానికి పులుముకొని మాటను జోడిస్తారు. కార్యసిద్ధి పొందుతారు. నిజానికి అది పెద్ద నేరం కాకపోయినా, మాటలు కోటలు దాటితే అసందర్భ ప్రేలాపన కింద పరిగణించే సందర్భాలూ లేకపోలేదు. మాట భావావేశంలో పరిపరి విధాల పోతుంది. బోలెడన్ని ద్వంద్వార్థాలు, ఎత్తిపొడుపులు వేగంగా దొర్లుకుపోతుంటాయి. అప్పుడు మాటకు విలువ, అర్థం మారిపోయి మనం తికమక అయిపోతాం. చాలా శక్తిమంతమైన మన మాటను, మెల్లగానూ సుతిమెత్తగానూ చెప్పవచ్చు.

మాట మనుషుల మధ్య చుట్టరికాన్ని, స్నేహతత్వాన్ని సమకూరుస్తుంది. నిలకడ నేర్పుతుంది. అవతలి వ్యక్తి అర్థం చేసుకొని వినిపించుకునే స్థితిని మనకు మనమే మాట ద్వారా కల్పన చెయ్యాలి. ఆ రీతి రివాజులోనే అర్థం, పరమార్థం ఉన్నాయి. మనకు ఎన్నో ఒత్తిళ్లు, కక్షలు, కావేశాలు ఉండవచ్చు. వాటినన్నింటినీ కడుపులోనే దాచేసి పైకి 'శబ్దం' ద్వారా వెల్లడించే మాట మనకు, అవతలి వ్యక్తికి ఉపయోగపడాలి. అలా చిన్నతనం నుంచి అలవాటుగా, ఒరవడిగా రూపొందించుకుంటే 'మాట' చక్కదనాల మూటలా తయారై తలమీద జుట్టు నెరిసే సమయానికి మనిషినొక వేదాంతిగా, సుభాషితుడిగా, పెద్దమనిషిగా, సంఘసంస్కర్తగా నిలబెడతాయి. ఒక మనిషి ఆలోచనా సరళి, జీవిత విధానం, బతుకు పుస్తకం అంతా 'మాట' అనే పుటల్లో ఇమిడి ఉంటుంది. దాన్ని ఆచితూచి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిమీదా ఉంది!

- గుడిమెట్ల గోపాలకృష్ణ