ᐅ అనేక రూపాల రాముడు

 ᐅ అనేక రూపాల రాముడు

భగవంతుడు తనను తాను అవతారమూర్తిగా వ్యక్తపరచుకున్నప్పుడు తద్వారా ఎన్నో మహాప్రయోజనాలు సాధిస్తాడు. ఒకవైపు ధర్మప్రతిష్ఠ, మరోవైపు యోగ్యులైన సాధకులను అనుగ్రహించడం అవతారంలో ప్రత్యేకత.
నృసింహ, రామ, కృష్ణ అవతారాలు- అవతారానికి పూర్వమే మంత్రాధిదేవతలు, రుషులు, వేల్పులు కలిసి లోకోపకారం కోసం ఆ మంత్ర స్వరూపాలను ఉపాసించి, ధర్మోద్ధరణకై అవతరించమని ప్రార్థించడంవల్ల భువిపై ఆవిష్కరించుకున్నారు.

ఒక మంత్రంలో ఉన్న అనేక శక్తులు, ఉపాస్యమూర్తులు అన్నీ ఆ అవతార కాలంలో కథారూపంగా గోచరిస్తాయి. భౌతిక దృష్టికి అవి కథాఘట్టాలు. ఉపాసనా దృష్టికి మంత్రరూపాలు. వేదాంత దృష్టికి పరబ్రహ్మతత్వ ప్రతిపాదకాలు.

'సచ్చిదానంద' స్వరూపమైన పరబ్రహ్మ నారాయణుడే రాముడిగా అవతరించాడు. తారకమంత్రమైన 'రామ'వైభవం ఆయన లీలల్లో వెలుగులీనుతూ ఉంటుంది. కేవలం కథాపరమైన ఆదర్శాలను చూసేవారు, ఆ వెలుగులను గమనించటం క్లిష్టమే.

కానీ, ఆయా ఘట్టాల స్మరణ, పఠన, మనన, శ్రవణాల ద్వారా మనకు తెలియకుండానే ఆ మంత్రమహిమా రూపాల ప్రభావాలను పొందగలం. అందువల్లనే వారి చరితను పవిత్ర గ్రంథంగా పారాయణ చేసి అద్భుత ఫలితాలు సాధిస్తున్న వారున్నారు. ఆయా సన్నివేశాల్లోని రూపాలను విగ్రహాలుగా, చిత్రాలుగా మలచి, ఆరాధించి వాటి సాఫల్యాలను సాధించినట్లుగా వారి వారి అనుభవాలు- ప్రమాణాలు.

ఆనందతత్వాన్ని తెలియజేసే అర్థం 'రామ' నామ మంత్రంలో ఉంది. ఆ మంత్రాధిదేవతయైన జ్ఞానానందమూర్తి విష్ణువు చైత్రశుద్ధ నవమినాడు ఆవిర్భవించినట్లుగా రామకథా కావ్యాలు స్పష్టపరుస్తున్నాయి.

సంభవించింది మొదలుకొని అవతార పరిసమాప్తి వరకు బహువిధాల రామరూపాలు సాక్షాత్కరిస్తాయి.

1. బాలరాముడిగా కౌసల్యా దశరథులను సంతోషపెట్టిన మూర్తి. 2. విశ్వామిత్రుడివెంట యాగరక్షణకై బయలుదేరిన యజ్ఞరక్షక స్వరూపం. 3. శివధనుర్భంగం చేసి, సీతమ్మను చేపట్టిన కల్యాణరాముడు. 4. సీతాలక్ష్మణ సమేతుడై అరణ్యవాసం చేస్తూ అనేకమంది రుషులను అనుగ్రహించిన కృపాస్వరూపం 5. హనుమంతుణ్ని ఆదరించిన లక్ష్మణ సమేత రామమూర్తి. 6. ఖర దూషణాది రాక్షసులను, వాలి, రావణాది దనుజులను సంహరించిన వీరరాముడు. 7. విభీషణుడికి అభయమిచ్చిన శరణాగత వత్సలుడు. 8. పుష్పకాధిరూఢుడై అయోధ్యకు విచ్చేసిన విజయరాముడు. 9. అహల్యా శబరీ గుహాదులను అనుగ్రహించిన వాత్సల్యమూర్తి. 10. పరివారంతో సీతాసమేతుడై నెలకొన్న పట్టాభిరాముడు. 11. వేదాంత తత్వాన్ని చిన్ముద్రతో బోధిస్తూ దేవ, ముని సమూహాల నడుమ తేజరిల్లే తారకరాముడు.

... ఇలా కొన్ని రామరూపాలు రామగాథల్లో కనిపించే ధ్యానయోగమైన సుందరమూర్తులు.

మానవాతీతమైన సౌందర్యం, చెక్కుచెదరని ధర్మనిష్ఠ, కారుణ్యాన్ని వర్షించి కాపాడగలిగే అభయ తత్వంతో కూడిన ప్రసన్నత, అద్భుత మేధాశక్తి, పాలనాపటుత్వం కలిగిన రాజనీతిజ్ఞత, దుష్టత్వాన్ని నిగ్రహించగలిగే వీరప్రతాపం, ధర్మనిర్వహణ కోసం తన భోగాన్ని త్యాగం చేయగలిగే వైరాగ్యం... ఇలా అరుదైన ఎన్నో దివ్యగుణాలను వ్యక్తపరచిన రామకథా రీతిలో ఆ గుణాలతోపాటు ప్రస్ఫుటంగా భగవత్తత్వం ప్రకాశిస్తూనే ఉంది.

రామనవమి సందర్భంగా దేశం నలుచెరగులా రామారాధనలు వివిధ విధాలుగా జరుగుతుంటాయి. ప్రత్యేకించి, భద్రాద్రిరాముడి ప్రభావాన తెలుగునాట వాడవాడలా సీతారామ కల్యాణమూర్తులు చలువ పందిళ్లలో కొలువుతీరి అనుగ్రహిస్తుంటారు.

అటూ ఇటూ సీతాలక్ష్మణులు, పాదాల చెంత హనుమ... నడుమ కొలువున్న రామభద్రుడు- ఇది ప్రసిద్ధి చెందిన రామమూర్తి. మచ్చుకు ఈ మూర్తి ధ్యానంలోని సంకేత భావాలు గ్రహిస్తే, అన్ని మూర్తుల్లోనూ ఏవో పరమార్థాలు ఉంటాయనీ, ధ్యానించేవారిని ఆదుకుంటాయనీ బోధపడుతుంది.

'వామభాగాన సీతమ్మ, కుడివైపు లక్ష్మణస్వామి, ఆ వైపునే పాదాల వద్ద కూర్చున్న ఆంజనేయస్వామి... మధ్యన భాసిల్లే రాముడు'- అని భావం కలిగిన ధ్యానశ్లోకాలు ఉన్నాయి.

కుడివైపు శక్తికి, ఎడమవైపు భక్తికి రాముడే ఆలంబన. అందుకే వాటికి కేంద్రమై నడుమ ఉన్నాడు. ఆశ్రయించుకున్న శక్తి, అర్పించుకున్న భక్తీ ఆ జగదేక సార్వభౌముడి సొంతం. ఈ రమ్యభావమే ఈ నాలుగు మూర్తుల కొలువులో ధ్వనించే తత్వం.

ఈ విధంగా ప్రతి రామమూర్తీ శాస్త్ర సమ్మతమైన దివ్యభావాలకు సాకారమే. లక్ష్మణ సమేతంగా ఉన్న రాముడు రక్షాస్వరూపమని ఉపాసనా శాస్త్రాల హృదయం. 'నమోస్తు రామాయ సలక్ష్మణాయ' అని హనుమంతుడు నమస్కరించుకున్నాడు. హనుమత్సమేత రాముడు జ్ఞానానికీ, అభయానికీ వ్యక్తీకరణ. సీతమ్మతో రాముడు సర్వసంపదలకు అధినాథుడని భావం. మన జీవితాలను ధర్మసమ్మతంగా పాలించి, కరుణించే విష్ణుభావమే పట్టాభి రాముడు.

అన్ని భావాల రామచంద్రమూర్తి, మన హృదయాకాశంలో భాసించి అనుగ్రహించుగాక.

- సామవేదం షణ్ముఖశర్మ