ᐅ ఉత్సాహం

 ᐅ ఉత్సాహం

'జీవితం ఒక బంధం. ఒక పాశం. మృత్యువు ఒక్కటే ముక్తి మార్గం. ఈ మర్త్య జీవనం ఒక అశ్రు సరోవరం' అని కొందరు నిరుత్సాహాన్ని ప్రబోధిస్తారు. 'నిద్ర ఎంత తీయన, మరణమే మేలు. పుట్టకుండా ఉండటం ఇంకా మంచిది' అని ఒక ఆధునిక కవి అంటాడు. ఇవన్నీ నిరాశ నుంచి పుట్టిన నిర్‌వేదాలు.
అసలు జీవితం భగవంతుడి బహూకృతి. ప్రకృతి అందించిన నిక్షేపం. లోపల, బయట ఎన్ని తుపానులు చెలరేగినా, దైవత్వంపై ప్రగాఢ విశ్వాసం ఉంటే భద్రంగా నిశ్చలతీరం చేరవచ్చు. భూమిపై జీవనానికి అర్థం ఉంది. ప్రయోజనం ఉంది. మనిషిలో అంతర్గతంగా దివ్యత్వం ప్రదీప్తిస్తుందని, ప్రపంచం అంతా ఆధ్యాత్మిక అంతర్వాహినులు ప్రవహిస్తున్నాయని ఈశావాస్యోపనిషత్‌ ప్రబోధించింది. భవితవ్యం పిలిచేవరకు జీవితం ద్విగుణీకృత ఉత్సాహంతో ప్రయాణించాలి. ప్రపంచం నాశనం అవుతుందని తెలిసినా- ఒక చెట్టును నాటాలి, ఒక మంచి పనికి బీజ నిక్షేపం చేయాలి.

జీవితాన్ని వూహాజనితమైన భవిష్యత్‌ దినానికి వాయిదా వేయడం మంచిది కాదు. ఉత్సాహ జ్వాలతో ముందడుగు వేయాలి. 'జీవన అగ్నిశిఖ ముందు కూర్చొని రెండు చేతులకు వెచ్చదనం కలిగించుకున్నా' అంటాడు ల్యాండర్‌ అనే రచయిత. క్షణకాల జీవితాన్ని విలాసాలకు వ్యర్థం చేయమని దీని అర్థం కాదు. జీవిత అమృతసారాన్ని పూర్తిగా ఆస్వాదించాలని భౌతికవాదులు అంటారు. ఆధ్యాత్మికవేత్తలూ అదే మాట చెబుతారు.

రెండూ భిన్నమైన దృక్పథాలు. జీవితం గులాబీలు పరచిన హంసతూలికా తల్పం అని, జీవితాన్ని 'మధు'మయం చేసుకోవాలని ఒకరి అభిప్రాయం. అదికాదు జీవితం. జీవితం సౌజన్యపథంలో సవ్య ప్రస్థానం అని మరొకరి ప్రబోధం. జీవితం నూరేళ్లూ నిండుగా బతకడమే కాదు, సుసంపన్నంగా జీవించాలి. అడుగడుగునా అంతరావలోకనంతో మన చర్యల్ని సమీక్షించుకోవాలి. మనలో దివ్యత్వం ఉందన్న స్పృహ నిత్యం వెన్నాడుతుండాలి. అప్పుడు మనసు చెడువైపు మళ్లదు. మానవతకు అంతిమ కిరీటం దైవత్వమే. మనిషి ఆనాడు అంతస్సామ్రాజ్య నేత.

బలమైన మనశ్శరీరాలు ఉన్నప్పుడే మానవ మనోక్షేత్రంలో ఆధ్యాత్మిక కాంతి బీజాలు నాటగలం. 'గీత కన్నా ఫుట్‌బాల్‌ ఆడటం వల్లనే భగవంతుణ్ని సమీపించగల'మని వివేకానందుల మాటల్ని గుర్తు పెట్టుకోవాలి. బలమైన మనసుతో గీత మరింత బాగా అర్థం అవుతుందని ఆయన ఉద్దేశం. నిరుత్సాహంతో నిర్విణ్నుడైన అర్జునుణ్ని 'గీత' అనే నిప్పుల కొరడాతో రణరంగంలోనే శ్రీకృష్ణుడు మేల్కొలిపాడు.

వృద్ధాప్య దశ చేరినవారు వారి శక్తికి అనుగుణమైన సత్కర్మలు ఆచరించాలి. వృద్ధాప్యంవల్ల శరీరానికి ముడతలు పడతాయి. ఉత్సాహాన్ని పోగొట్టుకొంటే, వారి ఆత్మలపై ముడతలు పడతాయి.

ఒక భక్తుడు అమృతత్వం కావాలని భగవంతుణ్ని కోరాడు. భగవంతుడు అతడికి అమృతత్వం ప్రసాదించాడు. సంవత్సరాలు గడుస్తున్నాయి. ఉత్సాహం తగ్గింది. చావు రాదు. ప్రపంచం విసుగనిపిస్తోంది. తన తప్పు తెలుసుకొని 'నాకు అమృతత్వం వద్దు' అని భగవంతుణ్ని వేడుకొన్నాడు. కాని, భగవంతుడు తన వరాన్ని వెనక్కు తీసుకోలేదు. ఇప్పుడు ఆ భక్తుడి చిరునామా ఎవరికీ తెలియదు.

ఉపపాండవుల్ని హతమార్చిన అశ్వత్థామకు శ్రీకృష్ణ భగవానుడు ఏకాంత అమరత్వం ప్రసాదించాడు. అది వరమా, శాపమా?

చిగురాకు చివర మెరిసే మంచుబిందువులాగా, కాలతీరాల్లో అందమైన జీవన నాట్యం హాయిగా ఉన్నంతకాలం సాగితే అంతే చాలు!

- కె.యజ్ఞన్న