ᐅ ఆధ్యాత్మిక ఆడంబరాలు


 ᐅ ఆధ్యాత్మిక ఆడంబరాలు

లేమిని కప్పిపుచ్చుకోవటానికి మనిషి పడరాని పాట్లు పడటం మనం చూస్తుంటాం.
కొంతమంది ధనహీనులు మెరిసిపోయే వస్త్రాలు, నకిలీ నగలు ధరించి ఆడంబరాన్ని ప్రదర్శిస్తుంటారు. కొంతమంది సంపన్నులు సాధారణ దుస్తులతో నిరాడంబరంగా కనిపిస్తుంటారు. భక్తులు కానివారు ప్రదర్శన కోసం అనేక వేషాలు వేస్తారు. రంగస్థలం మీద కృష్ణ పాత్రధారి, నిజజీవితంలో సామాన్య వ్యక్తిగానే దర్శనమిస్తాడు.

ఆడంబరాలన్నీ ప్రపంచం మెప్పుకోసం పడే పాట్లు.

వాస్తవంలో ఎవరూ వాటిని విశ్వసించరు. పట్టించుకోరు. కొంతమంది అవకాశవాదులు, తమపని నెరవేర్చుకునే ప్రయత్నంలో ఆడంబరస్వాముల్ని అతిశయోక్తులతో ఉబ్బి తబ్బిబ్బులుగా చేసేందుకు ప్రయత్నిస్తారు. వారు ఆషాఢభూతులనే నిజం తెలిశాక ఆడంబరం కోసం అవస్థలు పడినవాళ్లు పశ్చాత్తాపం చెందక తప్పదు.

మనలో చాలామందికి భగవంతుడి నిజతత్వం అర్థం కావటం లేదు. దైవసేవ అంటే ఆడంబరం, ఆర్భాటం, ప్రచారం ప్రధాన అంశాలుగా చలామణీలో ఉన్నాయి.

వీటన్నింటికీ తాను అతీతుడననే సత్యాన్ని పరమాత్మ పలు సందర్భాల్లో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను తెలియజేస్తున్నా మనం వాటిమీద మనసు పెట్టడంలేదు.

నిజంగా భగవంతుడు ఆడంబరాలకు అర్రులు చాచేవాడైతే, శబరిని అనుగ్రహించడు. గుహుణ్ని మిత్రుడిగా చెప్పుకోడు. మారుతిని 'భరతుడితో సమానమైనవాడివి' అని అభినందించడు. నారచీరలు ధరించి, పాదరక్షలు లేకుండా వనసీమల్లో సంచరించడు. కుచేలుడికి పాదసేవ చేసి, అటుకులు తిని ఆనందించడు.

ఇలాంటి ఉదాహరణలు మనకు దైవగాథల్లో ఎన్నో కనిపిస్తాయి. సాధారణంగా మనం వాటిని పట్టించుకోం. పువ్వులోని మకరందాన్ని, పండులోని రుచిని, మనసులోని మంచితనాన్ని మనం గుర్తించగలగాలి.

పూజతంతు ఒక బాహ్యప్రక్రియ.

భక్తి అందులో అనివార్యంగా ఉండాల్సిన ఆధ్యాత్మిక పరిమళం.

భగవంతుడు మనం సమర్పించే వాటిలో దేన్నీ ఆరగించకపోవటం మనం చూస్తూనే ఉన్నాం. కానీ, ఆయన భక్తి అనే ఫలాన్ని ఆప్యాయంగా స్వీకరిస్తుంటాడని మనం గ్రహించలేకపోతున్నాం.

భక్తికి మూడు దశలుంటాయి.

పువ్వు-కాయ-ఫలం.

పువ్వుగా పరిమళిస్తుంది.

కాయగా దృఢపడుతుంది.

పండుగా పరమాత్మ కైంకర్యానికి అర్హత పొందుతుంది.

ఈ మూడోదశకు చేరుకోవాలంటే కొందరికి జీవితకాలం పట్టవచ్చు. అదృష్టవంతులు, ఏకాగ్రతతో అత్యల్పకాలంలో సాధించవచ్చు. అసలు ముందుగా భక్తి అంటే ఏమిటో, దాన్ని ఎలా సొంతం చేసుకోవాలో మనకు తెలియాలి.

అందుకు వేషభాషల అవసరం ఉండదు. ఆడంబరాలతో పని ఉండదు. కేవలం అపార విశ్వాసం, అనంతమైన ప్రేమ, స్థిరబుద్ధి... వీటిని ఆశ్రయిస్తే- భక్తిమార్గం మన ఎదుట సాక్షాత్కరిస్తుంది.

సముద్రాలను సృష్టించిన పరమాత్మ కేవలం ఉద్ధరిణెడు నీటితో ఆనందిస్తాడు. ఏకతర్పణతో తృప్తి పడతాడు. సకల జీవరాసులకు ఆహారాన్ని ఏర్పాటు చేసిన చిదానందుడు చింతాకంత నైవేద్యంతో సంతృప్తి చెందుతాడు. అక్షయపాత్రలోని ఒక్క మెతుకుతోనే తన స్వభావం వ్యక్తంచేస్తూ పరమాన్నంగా స్వీకరించిన సర్వేశ్వరుడికి మనం ఏమిచ్చి ఆనందింపజేయాలి? పరమాత్మకు మనం ఇవ్వాల్సినవి ప్రాపంచిక వస్తువులు కానేకాదు. ఏ వస్తువూ భక్తికన్నా గొప్పది కాదు. కాబట్టి, కేవలం మన భక్తిఫలాన్ని ఆయనకు సమర్పించుకుందాం. అప్పుడు ఆధ్యాత్మిక ఆడంబరాలతో మనకు అవసరం ఉండదు.

- కాటూరు రవీంద్రత్రివిక్రమ్‌