ᐅ ఆనందో బ్రహ్మ

 ᐅ ఆనందో బ్రహ్మ

సుఖదుఃఖాలు శారీరక మానసిక అనుభూతులు. శారీరకమైనది సుఖం, మానసికమైనది దుఃఖం, ఆత్మకు చెందినది ఆనందం. ఆత్మానందమే బ్రహ్మానందం. ప్రతి మనిషీ ఆనందంగా ఉండాలనుకుంటాడు. కానీ, ఉండలేకపోతున్నాడు. ఎందుకని? ఆనందం తన సహజ స్వభావమనీ, తన సొంత సొత్తు అనీ మనిషి మరచిపోవడమే అతడి జీవితంలో విషాదానికి మూలకారణం.
పసిపిల్లల్ని చూడండి... ఎంత స్వచ్ఛంగా, ఆనందంగా నవ్వుతారో! మనం ఎందుకు అలా ఉండకూడదు? మనలో ఉన్న చిన్నపిల్లల మనస్తత్వాన్ని ఎప్పుడైతే, ఎక్కడైతే మనం వ్యక్తం చేయగలమో అప్పుడు, అక్కడ కూడా మనం సంతోషంగా ఉండవచ్చు. ఆనందం వెంటపడితే దొరికేది కాదు. అన్ని రుతువుల్లోనూ కోయిల కూయదు. వచ్చిన వసంత రుతువు అలాగే ఉండిపోదు. అదే విధంగా జీవితంలో అన్ని వేళలా ఆనందం లభించదు. అటువంటి అరుదైన ఆనందాల్ని వెతుక్కోవడం, సొంతం చేసుకోవడమే జీవితం!

మెదడు ఆనందాన్ని కేవలం గణించగలదు, గుణించగలదు. హృదయం మాత్రమే ఆనందాన్ని సృష్టించగలదు. ప్రేమను పొందాలంటే ముందుగా ప్రేమను పంచాలి. అలాగే ఆనందం పొందాలంటే ముందుగా ఆనందాన్ని పంచాలి. విషాదాన్ని పంచుకుంటే సగమవుతుంది. అదే ఆనందాన్ని పంచుకుంటే రెట్టింపు అవుతుంది.

మనం సుఖసంతోషాల్ని పూర్తిగా అనుభవించలేకపోవడానికి కారణం- దానిపై మనకున్న నిర్లక్ష్యం, లేనిదానిపై వ్యామోహం. కోరికలే దుఃఖ హేతువులు. కోరికలు ఎంత పెరిగితే, ఆనందం అంత తరుగుతుంది. కోరికలు ఎంత తరిగితే, ఆనందం అంత పెరుగుతుంది. కోరుకున్నదాన్ని పొందగలగడం అదృష్టమైతే, పొందగలిగినదాన్నే కోరుకోవడం ఆనందం. అసలు ఆనందమనేది, ఏమేమి పొందామనేదానికన్నా, ఏమేమి వదులుకోగలిగామన్నదానిపైనే ఆధారపడి ఉంటుందంటారు గాంధీజీ. దుర్యోధనుడికి అందరూ చెడ్డవాళ్లలాగా కనబడితే, ధర్మరాజుకు అందరూ మంచివాళ్లలాగా కనబడ్డారు. చెడు స్వభావంగలవాళ్లకు అందరూ చెడ్డవాళ్లలాగా కనబడితే, మంచి స్వభావంగలవాళ్లకు అందరూ మంచివాళ్లలాగానే కనిపిస్తారు. సౌందర్యం లేని లోటును మంచి స్వభావం భర్తీ చేస్తుంది. మంచి స్వభావం లేని లోటును సౌందర్యం ఎప్పుడూ భర్తీ చెయ్యలేదు. వయసు పెరిగేకొద్దీ ఇతరులకు మంచి చెయ్యడంలోనే ఆనందం ఉందన్న సంగతి తెలిసి వస్తుంది. ఇతరులకు సేవ చేయ్యడం ద్వారా ఆనందాన్నీ, తద్వారా ఆరోగ్యాన్నీ పెంచుకోవచ్చు. ప్రేమ ఉన్నచోట సేవ కూడా ఉంటుంది. రెండూ ఉన్నచోట ఆనందం ఉండి తీరుతుంది. నిజమైన ఆనందం ఇతరులను ఆనందపరచడంలోనే ఉందంటారు అవతార్‌ మెహర్‌ బాబా. ఆనందం పదవిలోనో, సంపదలోనో, వైభవంలోనో లేదు. నీ మనసులో, నీ ఆలోచనల్లో ఉంది. మనసును జయించినవారే ప్రపంచాన్ని జయిస్తారు. నరకంలో స్వర్గాన్ని, స్వర్గంలో నరకాన్ని సృష్టించుకునే శక్తి కేవలం మనసుకే ఉందంటాడు మిల్టన్‌.

ఏది జరిగినా సరే, అంతా మన మంచికే అనుకోవడమే ఆనందానికి అడ్డదారి. దొరికినదానితో తృప్తిపడితే అదే సంతృప్తి. సంతృప్తే ఆనందం, ఆనందమే ఆరోగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం.

అందాన్నీ, ఆనందాన్నీ, ఆరోగ్యాన్నీ పెంచి పోషించే అద్భుతమైన ఔషధం నవ్వు. అత్యంత అందమైన, అమూల్యమైన ఆభరణం చిరునవ్వు. రణాలను దూరంగా ఉంచే ఆభరణం చిరునవ్వు. ధరించినవారినే కాకుండా, దర్శించినవారిని ఆనందింపజేయగల మహత్తర మంత్రదండం చిరునవ్వు. పెదవుల మీద చిరునవ్వును చెరిగి పోనివ్వకుండా ఉంచుకోగలిగితే ఈ ప్రపంచంలో ఎవ్వరూ నీకంటే అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండరు. చిన్నపాటి సంతోషమైనా సరే- మనిషి జీవితకాలాన్ని పెంచుతుంది. అందుకే ఆనందమే అందం, అందమే ఆనందం. ఆనందమే జీవిత మకరందం.

జీవితం చలనచిత్రం లాంటిది. అది ఎంత పెద్దది అనేదానికన్నా, ఎంత బాగున్నది అనేదానికి ప్రాముఖ్యమిస్తే అంత హాయిగా జీవించగలుగుతాం. జీవితం ఓ సుందర సుమధుర స్వప్నం. దాన్ని సాకారం చేసుకోవడానికి- 'సంతోషాలను కూడు, దిగుళ్లను తీసివెయ్యి, స్నేహితులను హెచ్చించు, విరోధులను భాగించు.'

ఇదే, సుమధుర జీవనానికి సులభ సాధ్యమైన సూత్రం.

- గుజ్జుల వీర నాగిరెడ్డి