ᐅ ప్రపంచ స్వరూపం

 ᐅ ప్రపంచ స్వరూపం

చరాచరాలతో కూడి ఉన్న భూగోళం ఒక ప్రపంచం. ఈ ప్రపంచం అసలు రూపం ఏదని అడిగితే వేదాంతులు ఎంతో చక్కగా చెబుతారు. అసలు ఈ ప్రపంచం ఆత్మ, అనాత్మ అని రెండు విధాలుగా ఉంటుందని అంటారు. ఈ ప్రపంచం చేతనాచేతనాత్మకంగా ఉంటుందనీ, ఆత్మ లేకుంటే ప్రపంచం ఉనికి శూన్యమే అనీ అంటారు. అదెలా అంటే కదిలే జీవులన్నీ చేతనాలు. కదలకుండా ఉండేవి అచేతనాలు. కదిలేవి జంగమాలు. కదలనివి స్థావరాలు. కదిలే జీవులూ, కదలని స్థావరాలు అనేకంగా ఉన్నప్పుడు చేతనాచేతనాలు రెండే అని ఎలా అంటాం? అదే అడిగితే, మట్టి అనే ద్రవ్యం ఒక్కటే. కానీ అది కుండగా రూపొందినప్పుడు కుండ అనీ, విగ్రహంగా సిద్ధమైనప్పుడు విగ్రహం అనీ పిలుస్తాం కదా. అలాగే చేతనాచేతనాలు మనుషులు, జంతువులు, చెట్లు, పుట్టలు, గుట్టలు, నదులు, సముద్రాల వంటి అనేక రూపాల్లో ఉంటాయి. ఆత్మ ఒక్కటే అయినా కోట్ల కొలది రూపాల్లో పరిణమిస్తుంది. ఆత్మ ఏ శరీరంలో ఉపాధిని పొందుతుందో, ఆ రూపంలో కనబడుతుందని తాత్పర్యం.
ఆకాశంలో వెలిగే సూర్యుడు సముద్రంలో, నదిలో, తటాకంలో, బావిలో, కలశంలో ఏకకాలంలోనే కనబడతాడు. ఒకే సూర్యుడు ఇలా అన్నింటిలోనూ ఎలా కనబడుతున్నాడంటే ఒకే వస్తువు ఉపాధి భేదంతో అనేక రూపాల్లో కనబడుతూ ఉంటుందనేదే సమాధానం. ఒకే సూర్యుడు అనేకంగా ఎలా కనబడతాడో ఆత్మకూడా అలాగే తాను ఒక్కటే అయికూడా, ఉపాధులనుబట్టి అనేకరూపాల్లో కనబడుతుంది. సముద్రంలో ప్రతిబింబించిన సూర్యుడు, సముద్రజలాలు కదులుతున్నా, చల్లగా ఉన్నా సూర్యుడిలో కదలికలు గానీ, చల్లదనం కానీ ఎలా అంటుకోదో, అనేక జీవులరూపాల్లో ఆత్మ ఉన్నప్పటికీ ఆ జీవుల సుఖదుఃఖాలతోనూ, పాపపుణ్యాలతోనూ, మంచిచెడులతోనూ సంబంధం లేకుండానే ఉంటుంది. ప్రతిబింబంలో కనబడే వికారాలు బింబాన్ని తాకలేవు. అలాగే జీవాత్మల్లో అగుపడే వికారాలు పరమాత్మకు ఎంతమాత్రం అంటుకోవు. అందువల్ల జీవాత్మకూ, పరమాత్మకూ భేదం లేదు.

పరమాత్మ సత్యం. జీవాత్మ కల్పితం. అలా అయినప్పుడు కల్పితమైన జీవాత్మ, సత్యమైన పరమాత్మ ఎలా అవుతాడు? సముద్రంలోని నీళ్లు ఒకటే అయినా- తరంగాలూ, నురగలుగా కల్పితమైనాయి. జలం పరమార్థం. తరంగాలు, నురగలు వ్యావహారికాలు. కనుక పరమార్థంలో, వ్యావహారికం భాసిస్తున్నట్లే కదా. అలాగే చల్లదనం అనేది నీటికి గల గుణమైనా, తరంగాల్లోనూ అదే చల్లదనం ఉంటుంది. అదే విధంగా నురగలోనూ ఉంటుంది. నురుగు కెరటం లేకుండా ఉండదు. కెరటం నీరు లేకుండా ఉండదు. కనుక నీరు ఈ రెండింటికీ ఆత్మ. పారమార్థికం (సత్యం), వ్యావహారికం (లోకవ్యవహారంలో ఉండేది), ప్రాతిభాసికం (ఉన్నట్లు భాసిస్తూ ఉండేది) ఒకదాన్ని విడిచి మరొకటి ఉండదు. కనుక చరాచరాల రూపంలో ఎన్ని కనబడుతున్నా- అవన్నీ పరమాత్మకు ప్రతిరూపాలే కానీ, మరొకటి కాదు.

కనబడుతున్న ప్రపంచంలో ఎన్నికోట్ల జీవరాసులున్నా, అచేతన పదార్థాలున్నా అవన్నీ పరమాత్మలోని అంశాలేకానీ భిన్నమైనవి కావని తెలుసుకోవడమే ప్రపంచ స్వరూప పరిజ్ఞానం. ఈ సత్యాన్ని తెలుసుకుంటే ఆత్మతత్వం బోధపడుతుంది.

- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ