ᐅ మహా మాఘి
చంద్రుడు మఘ నక్షత్రాన ఉండే మాసం మాఘం. యజ్ఞ యాగాది క్రతువులకు శ్రేష్ఠమైన మాసం. యజ్ఞాలకు అధిష్ఠాన దైవం ఇంద్రుడు. అందుకే ఇంద్రుణ్ని మఘవుడు అంటారు. ఇది శిశిర రుతుమాసం. చెట్లు ఆకులు రాల్చే కాలం. శూన్యమైన పుష్యమాసం తరవాత వచ్చే కల్యాణ కారక మాసం.
వైశాఖ, కార్తీక మాసాలకు మాదిరిగా మాఘమాస స్నానాలకు విలక్షణత ఉంది. మాఘస్నానం అతి పవిత్రమైనదని చెబుతారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం. ఈ మాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్య కిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరతాయి. ఆ సమయంలో సూర్యకిరణాల్లో ఉండే అతినీలలోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులు గోచరిస్తాయి. మాఘస్నాన విధులను మాఘ పురాణం పేర్కొనగా, మాఘ స్నానం మాహాత్మ్యాన్ని బ్రహ్మాండ పురాణం వివరిస్తోంది. మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహస్నానంతో ఆరు సంవత్సరాల యజ్ఞ స్నానఫలం లభిస్తుందంటారు. బావినీటి స్నానం 12 ఏళ్ల పుణ్యఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీస్నానం శతగుణం, త్రివేణీ సంగమస్నానం నదీ శత గుణఫలం ఇస్తాయని పురాణ వచనం.
మాఘపూర్ణిమను 'మహా మాఘి' అంటారు. ఇది పూర్ణిమల్లోకెల్లా ఉత్కృష్టమైనదిగా భావిస్తారు. స్నాన, దాన, జపాలకు ప్రశస్తమైన రోజు. మాఘస్నానాలన్నీ ఒక ఎత్త్తెతే, మాఘ పౌర్ణమి స్నానం ఒక ఎత్తు. ఈ పౌర్ణమి రోజున సింధుస్నానం ఆచరించాలని శాస్త్రవిధి. సింధువు అంటే సముద్రం. ఈ రోజున సముద్ర స్నానం కలుషహరమని, మహామహిమాన్వితమని విశ్వసిస్తారు. మాఘమాసంలో దివ్య తీర్థాలను స్మరించి, పౌర్ణమినాడు స్నానం చేయడం సనాతన సంప్రదాయం. స్నాన సమయంలో ప్రయాగను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం. మృకండ మహర్షి, మనస్వినిల మాఘస్నాన ఫలం వల్లనే వారి కుమారుడు మార్కండేయుడి అపమృత్యు దోషం తొలగిందని పురాణ వచనం. విష్ణ్వంశ సంభూతుడు. దేవహూతి, కర్దమ మునిల పుత్రుడు కపిల మహర్షి, అవతార మెహర్‌బాబా జయంతి మహామాఘి రోజున .
-డాక్టర్ దామెర