ᐅ ఆధ్యాత్మిక గురువు
'మీరు మహాజ్ఞానులు. మీ దగ్గర నా ప్రతి ప్రశ్నకూ జవాబు ఉంది. మీకింత జ్ఞానాన్ని ప్రసాదించిన మీ గురువు ఎవరు?' అని శిష్యుడు అడిగాడు. గురువు మందహాసం చేస్తూ తన కుటీరం ముందున్న చెట్టును చూపించి 'ఆ వృక్షమే నా గురువు' అన్నాడు. శిష్యుడు ఆశ్చర్యపోయాడు.
'మౌనంగా జీవన సత్యాన్ని బోధిస్తుంది. శిశిరంలో ఆకులన్నీ రాల్చేసి, వేసవిలో ఎండి మోడైపోయింది. ఇంక వంట చెరకుగా తప్ప మరిదేనికీ పనికిరాదేమో అని నిస్త్రాణపడిపోయాను. కాని, వసంతకాలం వచ్చింది. ప్రతి కొమ్మకూ చిగురేసుకు వచ్చింది. మొత్తం దృశ్యమే మారిపోయింది. చిరుగాలులకు కదిలే రెమ్మలు గుసగుసలాడుతూ నాకెన్నో బోధించాయి. చచ్చిపోయిందనుకున్న చెట్టు మళ్ళీ చిగురించి ఎట్టెదుట కనిపించడం నాకొక గొప్ప సందేశాన్ని అందించింది.
'జీవితంలో ఒడుదొడుకులు వచ్చినప్పుడు ఎన్నడూ కుంగిపోకు. ఆశాభావంతో ఎదురుచూడు. మంచిరోజు తప్పక వస్తుంది. గ్రీష్మం తరవాత వసంతాగమనం తథ్యం. ప్రతి చీకటిరాత్రి గడిచాక పరవశించే పగలు రాక తప్పదు. అలాగే దుర్భరమైన ఓటమిని వెన్నంటి మనసును ఉర్రూతలూగించే విజయమూ వరిస్తుంది... దేనికీ సంచలించిపోకూడదు. జీవితంలో ఆటుపోటుల్ని సమంగా స్వీకరించటం నేర్చుకో! ఎటువంటి కఠిన పరిస్థితులు వచ్చినా నిరాశపడకు. నీ ప్రయత్నాలను సడలించకు. నీ ధర్మం నిర్విరామంగా నిర్వర్తించుకుంటూ సాగిపో! సమయం కోసం వేచిచూడు. నీకు విజయం లభిస్తుంది... అని చెప్పిందా చెట్టు!
'అది తన నిర్ణీత స్థలంనుంచి అంగుళం కదలదు. తనకు సహజంగా లభించే భూసారాన్ని మాత్రమే తీసుకుంటుంది. వరుణుడు ప్రసాదించిన వాననీటితోనే తృప్తిపడిపోతుంది. ఆ తేమను తన వేళ్లతో భూమిలో భద్రపరచుకుంటుంది. ఎక్కడా శబ్దం చేయదు. ఎవరినీ నిందించదు. చిరుగాలులకు ఆకులు చేసే సవ్వడి కూడా ఇతరుల్ని ఆనందపెట్టడానికే! ఎవరికీ సమస్యలు సృష్టించదు. ఎవరినీ బాధపెట్టదు. సరికదా తన కొమ్మలు విరిచేవాళ్లను, పళ్లను కోసేవాళ్లను ప్రతిఘటించదు. నిర్వికారంగా, నిరంతర మౌనంతో తన మొదలును ప్రేమతో స్పృశించిన వాళ్లనూ తనపై రాళ్లు విసిరినవాళ్లనూ సరిసమాన భావనతో ఆదరిస్తుంది. తాను బొగ్గు పులుసువాయువును పీల్చుకొని అందరికీ ప్రాణవాయువు అందిస్తుంది. తన పళ్లను తాను తినదు. వాటిని అందరికీ పంచిపెడుతుంది. తన కొమ్మల వూయల నీడల్లో అలసినవాళ్లను సేద తీరుస్తుంది. పైనపడే ఎండబాధను తానే భరిస్తుంది.
'బదులుగా ఎవర్నీ ఏదీ అడగదు. మానవ జీవితానికి చక్కని మార్గదర్శి. నిగర్వి. నిస్వార్థి. త్యాగమయి. పరోపకారి. సౌజన్యమూర్తి. సత్వగుణ సంజాత. ప్రకృతి అందరికీ ప్రసాదించిన ఆధ్యాత్మిక గురువు ఈ వృక్షం!'
- తటవర్తి రామచంద్రరావు