ᐅ ప్రేమప్రయాణం
మానవులకూ జంతువులకూ 'ప్రేమించే గుణం' పుట్టుకతోనే అబ్బుతుంది. మనిషిలోని మహిత శక్తి, అభివృద్ధి చెందితే అతడి 'ప్రేమ' కూడా విస్తరిస్తుంది. పశుప్రాయస్థితి నుంచి దివ్యత్వంవైపు అతడి బుద్ధి వికసిస్తుంది. ఇంద్రియ సుఖాలకూ విషయ లాలసతకూ స్వస్తి చెబుతాడు. శునకం తనకిష్టమైన ఆహారాన్ని భుజించేటప్పుడు అమృతం పెట్టినా ఆరగించదు. సర్వేంద్రియాలనూ తన ఆహారంపైనే కేంద్రీకరించి, అమితానందంతో ఆరగిస్తుంది. పశుప్రాయస్థితిలో మానవుడూ అలాగే ప్రవర్తిస్తాడు. కానీ, పరమాత్మ దివ్యసౌందర్యం వైపు మనసు మళ్లిందో... అమరకాంత వచ్చినా కన్నెత్తి చూడడు!
ఒకదశలో యువతీయువకులకు 'ప్రేమ' అనేది ఒక అద్భుత భావనగా కనపడుతుంది. తమ ప్రేమ అమలినమైనదని, అమరమైనదనీ వర్ణిస్తారు. ప్రేమకోసం త్యాగాలు, ఆత్మార్పణలు... ఎన్నో కథలూ గాథలూ! 'నీవు నా ప్రాణాధికురాలివి' అంటూ ప్రేయసి ముందు మోకరిల్లాడు ఒక ప్రియుడు. అతడి ఆరాధన అతి పవిత్రమనీ, మహత్తర ఆదర్శమనీ కవివరేణ్యులు భావగీతాలు ఆలపించారు. ఒక భక్తుడు తన ఇష్టదైవం పాదాలపై సాగిలపడ్డాడు. మూఢత్వమని ఆధునికులొకరు అపహసించారు. ప్రేమకు ఎన్నో రూపాలున్నాయి. లౌకిక జీవితమే పరమ పదంగా భావించేవారికి స్త్రీ పురుషుల ప్రణయమే పరమావధి. అలౌకిక ప్రేమ భగవంతుడిపై లగ్నమవుతుంది. అది పలువిధాలుగా వ్యక్తమవుతుంది!
విగ్రహంలో తన ఇష్టదైవాన్ని దర్శించడం ఒక మార్గం మాత్రమే! సీతారామ లక్ష్మణులకు ఆభరణాలు చేయించి రామదాసు మురిసిపోయాడు. త్యాగరాజు తన ఇష్టదైవం శ్రీరామచంద్రుడి విగ్రహం కానరాక కన్నీరు మున్నీరుగా విలపించాడు. తిరుప్పాణి ఆళ్వారు శ్రీరంగడి దివ్యమంగళ విగ్రహాన్ని చూసే భాగ్యం తనకు లేదే అని బాధపడ్డాడు. భగవంతుడిపై ఆ మహాత్ములకుగల అద్భుత ప్రేమకు అవి నిదర్శనాలు.
వివేకానంద స్వామి ఒక పర్యాయం గురువుగారిని 'స్వామీ! ఈ ప్రజలు గుడ్డి నమ్మకాలతో జీవిస్తున్నారే! వీరికి మోక్షం ఎలా వస్తుంది?' అని ప్రశ్నించాడు. రామకృష్ణ పరమహంస కాసేపు మౌనం వహించి, ఇలా సమాధానమిచ్చాడు- 'ప్రతి ఇంటికీ ఒక సింహద్వారం, ఒక దొడ్డిద్వారం ఉంటాయి. అవకాశాన్నిబట్టి, అవసరాన్నిబట్టి ఎవరికిష్టమైనదాన్ని వాళ్లు ఉపయోగించుకుంటారు. భగవంతుడి విషయంలో అంధవిశ్వాసం అనేది లేదు!'. గురువుగారి బోధననుసరించి వివేకానందుడు విశాల దృక్పథాన్ని ఏర్పరచుకున్నాడు. ప్రతిమలను పూజించడం దేవతారాధనలో ఒక పద్ధతి అని గ్రహించాడు.
ఆలోచిస్తే ఐహిక ప్రేమల అశాశ్వతత్వం తెలుస్తుంది. ఒక జంట ప్రేమించి పెండ్లి చేసుకొన్నది. భార్య తన భర్తపై అంతులేని ప్రేమానురాగాలను వర్షించింది. కొంతకాలానికి ఆమె తల్లి అయింది. సగమో... అంతకంటే ఎక్కువో... ఆమె ప్రేమను బిడ్డ దక్కించుకున్నది. సహజంగానే భర్తపై ఆమె ప్రేమ ప్రదర్శన తగ్గుముఖం పట్టింది- ఇది లోకంలో అంతటా కనబడే విషయమే, విచిత్రం ఏమీలేదు! పటిష్ఠమైన మన వివాహా వ్యవస్థ భార్యాభర్తల నడుమ ఉండే ప్రేమను పవిత్రీకృతం చేయగలుగుతోంది. లౌకిక వాసనలకు దూరమైన వృద్ధదంపతుల ప్రేమ ఆది దంపతుల ప్రేమలా దివ్యత్వాన్ని సంతరించుకొంటుంది.
అల్పమైన వాటిని ప్రేమిస్తూ అనల్పమైన ముక్తిసాధన చేయగలమా? చూస్తూ ఉండగానే కాలం గడచిపోతుంది. నదిలో పడవ అవతలి ఒడ్డును చేరుతుంది. పడవ లోపల కూర్చున్నవారికి అది అసలు కదిలినట్లే కనపడదు. ఆయుష్షు కూడా అలాంటిదే! యముడు ప్రత్యక్షమై రారమ్మని పిలుస్తాడు. 'ఆగు, కొంచెం ఓపిక పట్టు. నా మనవరాలి పెళ్లి చూసివస్తా!' అంటే సమవర్తి 'సరే' అని వెనక్కి మళ్లిపోతాడా? యమపాశం విసురుతాడు. అప్పుడు 'అయ్యో! పనికిమాలిన విషయాలను ప్రేమిస్తూ బంగారంలాంటి కాలమంతా వ్యర్థం చేశానే' అని చింతిస్తే ఏం ప్రయోజనం? మనలో ఉన్న సహజమైన ప్రేమ ఈశ్వర స్వరూపమైన సమాజ ప్రేమ వైపు పయనించాలి. 'ఎవరినీ ద్వేషించకుండా ఉండటం, అందరిపై కరుణ చూపడం, అహంకార మమకారాలు త్యజించడం, నిత్య సంతుష్టులై జీవించడం, పవిత్ర జీవనం గడపడం...' ఇవి దైవభక్తుడి లక్షణాలుగా చెబుతారు. మన ప్రేమప్రయాణం ఆ వైపే సాగాలి!
- డాక్టర్ పులిచెర్ల సాంబశివరావు