ᐅ మత్స్య జయంతి

 ᐅ మత్స్య జయంతి

ధర్మరక్షణ కోసం శ్రీమహావిష్ణువు ధరించిన అవతారాల్లో దశావతారాలు ప్రసిద్ధమైనవి. భగవంతుడి దశావతారాలు సృష్టి పరిణామాన్ని వ్యక్తంచేసే సంకేతాలుగా గ్రహించిన ఆధునికులు మొదటిదైన మత్స్యావతారాన్ని జలావిర్భావానికి సూచనగా చెబుతారు.
బ్రహ్మకు ఒక పగలు, అంటే- వేయి మహాయుగాలు గడిస్తే... ఆయన సృష్టిని ఆపి నిద్రకు ఉపక్రమిస్తాడు. అప్పుడు ఈ సృష్టి అంతా ప్రళయం వచ్చి నాశనమవుతుందంటారు. దీన్ని నైమిత్తిక ప్రళయంగా చెబుతారు. ఈ ప్రళయ స్థితిలో వేయి మహాయుగాలు గడిచాక బ్రహ్మ మరల యథాపూర్వంగా సృష్టిని ఆరంభిస్తాడంటారు. దీనికి 'కల్పం' అని పేరు.

వరాహ కల్పంలో ద్రవిడ దేశంలో సత్యవ్రతుడనే రాజు ఉండేవాడు. అతడు ధర్మాత్ముడు. విష్ణుభక్తుడు. ఒకసారి అతడు కృతమాలానదికి వెళ్లి స్నానానంతరం సూర్యుడికి అర్ఘ్యం ఇస్తుండగా దోసిట్లో చేపపిల్ల పడింది. రాజు దాన్ని నీటిలోకి జారవిడిచాడు. మళ్ళీ నీటిని తీస్తున్నప్పుడు చేప చేతిలోనికి వచ్చి 'రాజా! నన్ను పెద్దచేపలు తినివేస్తాయి. రక్షించు' అని కోరింది. రాజు దాన్ని ఒక పాత్రలో వేశాడు. మర్నాటికి ఆ చేప, పాత్ర పట్టనంత పెద్దదైంది. అప్పుడు చెరువులో విడిచాడు. మర్నాటికి చెరువు కూడా పట్టలేదు. అప్పుడు రాజు దాన్ని సముద్రంలో వదిలాడు. ఆ మత్స్యం శతయోజన ప్రమాణానికి విస్తరించింది. తాను శ్రీమన్నారాయణుడినని, నాటికి ఏడు రోజుల్లో ప్రళయం రానున్నదని, సర్వజీవరాసులు నశించిపోతాయని, ఈ లోకమంతా మహాసాగరమవుతుందని, నీవంటి సత్యవ్రతుడు నశింపరాదని పలికింది. ఒక పెద్ద నౌకను నిర్మించి, దానిలో పునఃసృష్టికి అవసరమైన ఓషధులు, బీజాలు వేసుకొని సిద్ధంగా ఉండమని, సప్తర్షులు కూడా ఆ నావలోకి రాగలరని చెప్పింది. మీనరూపుడైన నారాయణుడు తన కొమ్ముకు మహాసర్పరూపమైన తాటితో నావను కట్టి ప్రళయాంతం వరకు రక్షిస్తాడు. సాంఖ్యయోగ క్రియాసహితమైన పురాణ సంహితను రాజుకు ఉపదేశిస్తాడు. సత్యవ్రతుడు వివస్వతుడైన సూర్యుడికి శ్రద్ధదేవుడిగా జన్మించి 'వైవస్వత మనువు'గా ప్రసిద్ధికెక్కాడు.

బ్రహ్మ మేల్కొని సృష్టి చేయాలని సంకల్పించగా వేదాలు అపహరణకు గురయ్యాయి. పరమేష్ఠి నిద్రావస్థలో ఉన్నప్పుడు సోమకాసురుడు నాలుగు వేదాలను అపహరించి మహాసముద్ర గర్భంలోకి వెళ్లిపోయాడు. బ్రహ్మ శ్రీమన్నారాయణుని ధ్యానించగా ఆయన మత్స్యరూపంలో జలనిధిని అన్వేషించి సోమకుడితో పోరాడి ఆ రాక్షసుడి కడుపుచీల్చి వేదాలను, దక్షిణావర్త శంఖాన్ని తీసుకుని బ్రహ్మవద్దకు వచ్చాడు. శంఖాన్ని తాను గ్రహించాడు. శిథిలమైన వేదభాగాలను పూరించమని బ్రహ్మను ఆజ్ఞాపించాడు. ఇది రెండో మత్స్యావతారం.

వేదాలను అపహరించడమంటే విజ్ఞాన ప్రకాశాన్ని తమోగుణ అహంకారశక్తిని తనలో లయం చేయడమని సంకేతం. రాక్షస నాశనంతో చతుర్ముఖుడి సృష్టికార్య ప్రతిబంధరూపకమైన తమస్సు అంతరిస్తుంది. బ్రహ్మ సహజమైన స్వరూపం పొందడమే వేదాలు మరల గ్రహించడమని తత్వార్థం. పరబ్రహ్మ చైతన్యాత్మ సర్వవ్యాపకమని, విశ్వంలో కనిపించే తేజమే పరమాత్మ స్ఫురణమని గ్రహించాలి.

- డాక్టర్‌ దామెర వేంకటసూర్యారావు

ᐅ కోకిలలు

 ᐅ కోకిలలు

కళ్లకు కనిపించలేదు. చెవులకు వినిపించలేదు. తెల్లవారు జామున మెలమెల్లగా రాలింది. ఆ కోమల నీహార వర్షానికి లేత గులాబీలు రెక్కలు విచ్చుకున్నాయి. తెల్లవారగానే మంచు మటుమాయమై పోయింది! అది అజ్ఞాతంలోకి వెళుతూ వెళుతూ, మనకు మాత్రం దివ్య సౌందర్యాన్ని అందించిపోయింది. పేరు ప్రతిష్ఠల కోసం సమాజసేవ చేసే వారెందరో ఉంటారు. అజ్ఞాతంలో ఉండి అందరికీ మేలు చేసేవారు ఇంకా ఎందరెందరో! 'ఎవరో మహానుభావుడు... దేవుడిలాగా నాకు సాయం చేశాడు!' అని వాళ్లు కృతజ్ఞతతో అనుకునే మాటలను వినడానికి కూడా ఆసక్తి చూపరు.
దేవుడి హుండీలో కోటిరూపాయలు వేశాడొక అజ్ఞాత భక్తుడు. హరికథా కళాకారుడి చేతిలో, తన పేరు కూడా చెప్పకుండా వందరూపాయల నోటు ఉంచి, తలెత్తకుండా వెళ్లిపోయాడొక వ్యక్తి. ఆకలితో నకనకలాడే భిక్షగాడికి పంచభక్ష్య పరమాన్నాల పాత్రనందించి అదృశ్యమైంది ఒక ఇల్లాలు. సమాజంలో ఇవన్నీ ఎప్పుడూ జరుగుతూ ఉండేవే. ఈ సహాయాలు చేసేవారికి తమ పేరు ప్రచారంలోకి రావడం ఇష్టం ఉండదు. ఇతరులకు మేలు జరగడమే ముఖ్యం! సహాయం చేసిన వ్యక్తి కనబడి, తన పేరు చెబితే- అతడొక 'మంచి మనిషి' అనుకుంటారు. కనబడకుండా సహాయం చేస్తే? అతడినొక దేవుడిగా కొలుస్తారు! మన జీవితంలో ఎన్ని ఆపదలు వచ్చి పడ్డాయి? ఎన్ని కష్టనష్టాలను ఎదుర్కొన్నాము? ఆపన్న హస్తమేదో మనల్ని ఆదుకొన్నది! అది భగవంతుడిది. మానుష రూపంలో దైవం మనకు అండగా ఉన్నది. అలా సాయం అందించిన మనిషి కూడా అజ్ఞాతంగానే ఉండిపోవచ్చు! నిజానికి ఇదొక అజ్ఞాత శక్తి. యుగయుగాలుగా తోటివారికి ఈ శక్తే సాయపడుతోంది.

కాపుకొచ్చిన చేనులో, మంచెపై నుంచి పడతి పాడే 'పదం' విని ప్రకృతి పరవశిస్తున్నది. ఆ పదకర్త ఎవరు? ఎవరికీ తెలియదు! పదపదాన అమృతం చిందే ఎన్ని పదాలు, ఆఖరికి ఎన్నెన్ని తేనెలొలికే భాషలు చడీచప్పుడు లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాయో? సరిగమలు పలికే రాతిస్తంభాల శిల్పులెవరో? తెలియదు! ఇంతెందుకు? మన పూర్వకావ్యాల రచయితల పేర్లు అనేకం మనకు తెలియవు. యుగయుగాలుగా మనకు స్ఫూర్తిప్రదాతలైన ఆ మహాకవులెందరో నేడు అజ్ఞాత వ్యక్తులు! మన తత్వశాస్త్రాలు ఎవరు రాశారు? పురాణాలు ఎవరు రాశారు? కర్మ చేయడమే తప్ప దాని ఫలంపై తమకు అధికారం లేదని విశ్వసించారు ప్రాచీనకవులు. అందుకే అజ్ఞాతంలో ఉండడానికే ఇష్టపడ్డారు. తమ చరిత్రలు రాసుకోలేదు. గణితం, ఆయుర్వేదం, ఖగోళం, భాష, వ్యాకరణం, సాహిత్యం, లలితకళల రూపేణా పూర్వులు వేసిన పునాదులపై మనం మహాసౌధాలు నిర్మించుకున్నాం. ఆ అజ్ఞాత మహాత్ములు మనకొక విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు- 'పేరు ముఖ్యం కాదు; చేసిన పని ముఖ్యం' అని.

పాండవులు ఏకచక్రపురంలో ఉన్నారు. మారువేషాలు ఎవరూ గుర్తు పట్టలేదు. ఆ ఇంటి వాళ్లు ఏడుస్తున్నారు. బకాసురుడికి ఆహారంగా తమ ఏకైక కుమారుణ్ని పంపవలసి వచ్చింది. వారి దుఃఖాన్ని చూసి, కుంతీదేవి హృదయం కరిగిపోయింది. కారణం తెలుసుకున్నది. తామే పలు కష్టాల్లో ఉన్నప్పటికీ, సాయం చేసే మనసు వూరుకోదు గదా! 'నాకు అయిదుగురు కుమారులున్నారు. ఒక్కణ్ని పంపిస్తే నాకు కొదవ కాదు... మీరు శోకించవద్దు! మా అబ్బాయిని పంపిస్తాను' అని వారిని ఓదార్చింది. అసలే అజ్ఞాతంలో ఉన్నారు. ఏ మాత్రం గుట్టు బయటపడినా ప్రమాదం. అయినా ఆమె వెనకాడలేదు. తామెవరో తెలియకూడదు. భీముడు బకాసురుడి పీచం అణుస్తాడు. ఆ తరవాత కూడా ఇంకొన్నాళ్లు వారు అజ్ఞాతంలోనే కొనసాగారు. అజ్ఞాత వ్యక్తుల ఆత్మ విశ్వాసానికి, ధర్మబుద్ధికి, పరోపకారానికి భారతోదాహరణ ఇది. 'కుహూ కుహూ' రావాలు వినబడుతున్నాయి. కన్నులు పెద్దవి చేసుకొని, ఏ చెట్టువైపు చూసినా ఆ పిట్ట కనబడటంలేదు. వినేవాళ్లందరికీ శ్రుతి హితంగా మాత్రం ఉంది. 'ఆకులందున అణగిమణగి కవిత కోకిల పలకవలెనోయ్‌' అన్నారు కవీంద్రులు. తాము అజ్ఞాతంలో ఉండి లోకానికి హితం కలగజేస్తున్నవారు ఆ కోకిలలాంటి వారే!

- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు

ᐅ అంతా బావుందా

 ᐅ అంతా బావుందా ?

అంతా బావుంది. అన్నీ బాగున్నాయి. ఈ ప్రపంచం బాగుంది. అందరూ బాగున్నారు అని అనుకోవటం బాగుంటుంది. నిజానికి భగవంతుడు సృష్టి చేసి ఇచ్చినప్పటిలా ప్రపంచం ఉందా? చాలా మారిపోయింది. మార్పు సహజం. ప్రకృతి పరంగా చాలా మార్పులు వచ్చాయి. నాగరికత రూపంలో అభివృద్ధి పేరిట మానవుడు ప్రపంచాన్ని చాలా మార్పులకు గురి చేశాడు.
తల్లి, బిడ్డల క్షేమం కోరుకుంటుంది. మహానుభావులు లోకక్షేమం కోరుకుంటారు. దేశాధినేతలు ప్రజల క్షేమం కోరుకుంటారు. కవులు, కళాకారులు, రచయితలు, భావుకులు అందరి మంచీ కోరుకుంటారు. కోరుకోవటంలో తప్పులేదు. కాని, వాస్తవిక పరిస్థితులను విస్మరించి ఆలోచనల్లో ఉన్నంత మాత్రాన భగవంతుడి ఆశీర్వాదం పొందగలమా?

ఒక గొప్ప భావాన్ని చక్కనైన పదాల్లో పొందుపరచి, నయం కాని గాయానికి లేపనం పూసినట్లుగా అందిస్తే- అది సత్యమా, అసత్యమా? కథలు బాగుంటాయి. కావ్యాలు బాగుంటాయి. మానవ జీవితాన్ని శనిలా పట్టిపీడిస్తున్న ఉపద్రవాలు, ఘోరకలుల గురించి కథనాలు ఎందుకు బావుంటాయి? బావుండవు. ఎందుకంటే అవి చరిత్ర మరువని సత్యాలు.

రావణాసురుణ్ని పూజించేవాళ్లు లేకపోయినా, ఇప్పుడు పెట్టుకుందామని ఎవరైనా ముందుకువస్తే, ఎక్కడ చూసినా అతడికి అభిమాన సంఘాలు పుట్టుకొచ్చేవి. నాయకుడిగా శ్రీరాముణ్ని మరిచిపోయేవారు. అయితే అతడి కార్యాలు మరచిపోగలమా? అంతా బావుందిలే అని రుషులు, మునుల ప్రార్థనలు పెడచెవిన పెడితే మహావిష్ణువు ప్రతి యుగంలో ఒక అవతారం ఎత్తేవాడా, ధర్మసంస్థాపన చేసేవాడా?

సంస్కరించడం, సంస్కరణ పొందడం నిజమైన నాగరికత. అందులో సౌందర్యం ఉంది. అది ఆత్మసౌందర్యం. మాటలు నేర్చిన చిలుక పండితుడి ఇంట్లో పద్యాలు వల్లించగలదు. కాని, దాని వాస్తవ స్వరూపం- పిల్లి దాని మెడను కొరికినప్పుడు వెలువడే శబ్దాలనుబట్టే తెలుస్తుంది.

భగవంతుడు మనకు ఇచ్చిన ఇంద్రియాలను తెరచి ఉంచుకోవాలి. జ్ఞాన సముపార్జన చేస్తూ లోకానికి దారి చూపించటమే కాకుండా ఏమాత్రం అవకాశం వచ్చినా బరిలోకి దిగాలి. ఉపన్యాసాలు, ప్రవచనాలు కొంచెం తర్ఫీదు పొందితే ఎవరైనా ఇస్తారు. ఆచరణలో ముందుకు వెళ్లేవాళ్లు ఎంతమంది ఉంటారు? అవసరమైతే దైవాన్ని కూడా ప్రశ్నించడానికి వెనకడుగు వెయ్యనివాడే ఆయన ప్రియ భక్తుడు అవుతాడు. అర్జునుడు శక్తిమంతుడైన విలుకాడు. అంతా బాగుంది, నాకేం ఫరవాలేదు అని అతడు సరిపెట్టుకోలేదు. శ్రీకృష్ణుడి అండదండలు పొంది కౌరవసేన మీదకు వెళ్లాడు. విజయం సాధించాడు. అంచనాలు వేసినప్పుడు ప్రజ్ఞ కలిగి ఉండాలి. చిన్న వానరమే అయినా సమయం వచ్చినప్పుడు పెద్ద హనుమంతుడిగా మారి ఆకాశమంత అయిపోయి, రావణాసురుణ్ని గడగడలాడించలేదా?

స్తోత్రాలు, స్తుతులు దేవుళ్లకు బాగుంటాయి. రాక్షసులను ఎదుర్కొనే పద్ధతులు వేరుగా ఉంటాయి.

సుందరమైన తోటలో అందమైన గులాబీపై తుమ్మెదలాగా విహరించాలని అందరికీ ఉంటుంది. కానీ, ఆ తోటను జంతువులు ధ్వంసం చేయకుండా చుట్టూ కంచె వేసుకుని రక్షించుకోవాలనే బాధ్యత కూడా ఉండాలి. అప్పుడే అంతా బాగుంటుంది. అలా అనుకోవడమూ బాగుంటుంది.

ప్రపంచంలో మంచిని చూడాలి. చెడ్డను విడిచిపెట్టాలి అంటారు. మంచిని చూడాలంటే మంచిని నిర్మించాలి. చెడ్డను విడిచిపెట్టాలంటే దానికి అవకాశమే ఇవ్వని పరిస్థితులు కల్పించుకోవాలి. దేవాలయానికి రోజూ వెళ్లాలంటే దాని పక్కన కొత్తగా వచ్చిన మద్యం దుకాణాన్ని మరచిపోయి, వస్తూ పోతూ ఉండటమే కాకుండా అక్కడ దాన్ని లేకుండా చేసే ప్రయత్నంలో ఎందుకు భాగస్వామి కాకూడదు? అలా అయితే భగవంతుడు మనలను నిందిస్తాడా? కానే కాదు. ఆ పనిచేసేవాళ్లకు తప్పక సహాయం చేస్తాడు. ప్రయత్నించి చూడాలి. దైవశక్తి తెలుస్తుంది.

సరిగ్గా అర్థం చేసుకొనకపోవడంలో, అన్వయించుకొనకపోవడంలో మంచిమాటల అర్థాలు మారిపోతుంటాయి. అందుకే చేసేవాళ్లకంటే చూసేవాళ్లు ఎక్కువైపోతుంటారు. వ్యాఖ్యానాలు చేసేవాళ్లకంటే లోకకల్యాణం కోసం శ్రమించేవాళ్లే చరితార్థులుగా మిగులుతారు. అందుకే రామాయణంలో అతి చిన్నవైన జటాయువు, గుహుడు, శబరి, ఉడుత పాత్రలూ శాశ్వతంగా నిలిచిపోయాయి.

- ఆనందసాయి స్వామి

ᐅ సహజీవన సౌభాగ్యం

 ᐅ సహజీవన సౌభాగ్యం

తోడులేని జీవితం నీడలేని ఎడారి నడక లాంటిది. జీవనయానం ఒంటరిగా చెయ్యటం సాధ్యం కాదు. ఇలా చెయ్యాలంటే ఎంతో ఆత్మబలం కావాలి. రమణ మహర్షి, వివేకానంద వంటి కొద్దిమంది మహాత్ములు బ్రహ్మచారులుగా, ఆత్మానంద భరితమైన జీవితాన్ని గడిపారు. భగవంతుడూ జంటగానే కనిపిస్తాడు. వాణి-విరించి, లక్ష్మీ-నారాయణులు, శివాని-శివుడు ఇందుకు ఉదాహరణలు.
భావలోక నివాసిని, సర్వోన్నత శక్తి, అనంత ఆహ్లాదినిగా వేదాలు ప్రస్తుతించే రాధామాత, తనకు తోడుగా గోలోకంలో శ్రీకృష్ణుణ్ని తనలోంచి సృజించుకుందని రసికయోగి, బృందావన వాసి, రాధికాప్రసాద్‌ మహరాజ్‌ తన గ్రంథంలో పేర్కొన్నారు. సృష్టి ప్రారంభ బిందువు గోలోకంలో ఉందంటారు. అందుకే శ్రీకృష్ణుని పరమాత్మగా చెబుతారు.

రాధ తేజస్సు నుంచి శివుడు, శ్రీకృష్ణుడి తేజం నుంచి పార్వతి ఆవిర్భవించి, ఆదిదంపతులైనట్లు రాధామాత చరితం చెబుతుంది. ఆనందానికి మరొకపేరు రసం. రాధాకృష్ణుల ఆనంద నృత్యానికే 'రాస' అని పేరు. 'రాసలీల' అంటే రాధాకృష్ణులు తమ దివ్యలీల ద్వారా సర్వలోకాలకు ఆనందప్రసారం చెయ్యటం. అయితే, మన ప్రవృత్తులు, అర్హతలనుబట్టి- వెన్నెల్లాంటి హాయి, తేనెలాంటి తియ్యదనం కలిగిన ఆనందం అనుభవానికి వస్తుందంటారు.

మన మనసు పాత్రలో అనునిత్యం భావకాలుష్యం దట్టంగా అలుముకుంటుంది. మన గృహాల్లో దుమ్ము, ధూళి, సాలెగూళ్లు ఏ విధంగా పేరుకుంటాయో, అలాగే మనకు తెలియకుండా భావకాలుష్యం మనసులో ఆవరిస్తుంది. దాన్ని ఎప్పటికప్పుడు తొలగించుకోకపోతే, చివరికది వల్మీకమవుతుంది. అందులోకి పాముల్లా పిశాచ, రాక్షసభావాలు వచ్చి చేరతాయి. మనిషి చేత అనేక అకృత్యాలను, నేరాలను, పాపాలను చేయిస్తాయి. సంఘంలో నేరాలు-ఘోరాలు జరగటానికి ఇవే ప్రేరణాశక్తులు. వీటిని వదిలించుకునేందుకు, ఆధ్యాత్మికంగా చేయదగిన ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. నిత్యం స్నానం చేస్తూ, శరీరాన్ని ఎలా శుభ్రంగా ఉంచుకుంటున్నామో, అలాగే మనసునూ కాలుష్యరహితంగా ఉంచుకునేందుకు గట్టి ప్రయత్నం చేయాలి. రుషులు భార్యను సహధర్మచారిణి, అర్ధాంగి, సహచరి, సమభాగిని- ఇలా సమాన గౌరవం సూచించే మాటలతో సత్కరించారు. భార్యాసమేతంగా చేసే యజ్ఞయాగాలకు అధిక ఫలాలు లభిస్తాయంటారు. శ్రీరాముడు సీత పరోక్షంలో స్వర్ణసీతతో అశ్వమేధయాగం చేశాడు. ఉద్దాలక మహర్షి భార్య చండిక, వ్యతిరేక బుద్ధి కలదైనా, ఉపాయంగా ఆధ్యాత్మిక విధులు నిర్వర్తించాడు.

శివుడు తన పత్ని సతీదేవికి అవమానం జరిగినప్పుడు వీరభద్రుణ్ని సృష్టించి, బాధ్యులైన అందర్నీ శిక్షించాడు. స్వయంగా సతీదేవి దేహాన్ని మోస్తూ వ్యగ్రుడై విహరించాడంటారు. విష్ణువు ఆ దేహాన్ని తన చక్రాయుధంతో ఖండించగా, ఆమె దేహశకలాలతో ఏర్పడినవే అష్టాదశ పీఠాలనేది పురాణగాథ. బ్రహ్మ తన భార్యకు నాలుకస్థానంలో, విష్ణువు హృదయస్థానంలో, శివుడు ఏకంగా తన అర్ధశరీరంలో స్థానం కల్పించి లోకాలకు ఆదర్శాన్ని ఆచరణాత్మకంగా చూపారు.

భార్యను ఎవరు తన వాగ్దేవిగా గౌరవిస్తారో, వారు బ్రహ్మజ్ఞానప్రాప్తినీ, హృదయేశ్వరిగా భావించేవారు సిరిసంపదల్నీ, అర్ధాంగిగా తలచేవారు అరుదైన మోక్షప్రాప్తినీ పొందుతారన్నది పెద్దలమాట. కష్టసుఖాలను, సిరిసంపదలను భర్తతో సమంగా పంచుకుంటూ, జీవితకాలం స్నేహితురాలిగా ఉండగల వ్యక్తి భార్య మాత్రమే. 'నాతిచరామి'- అయిదు అక్షరాలుగా చూడకూడదు. ఆ వాగ్దానం- పంచప్రాణాలకు సమంగా మనం భావించి, ప్రేమతప్ప ద్వేషం తెలియని వ్యక్తిత్వంతో జీవిస్తే, దాంపత్య జీవితం ఆనందవాహినిలా సాగిపోతుంది. దాంపత్యం ఏడు జన్మల బంధంగా తెలుసుకునేందుకే, దంపతులచేత వివాహకాలంలో ఏడడుగులు(సప్తపది) వేయిస్తారు.
వివాహం సహజీవనానికి ఒక ఆహ్వానం.
సహజీవనం జీవన సౌభాగ్యానికి ఒక ఆలంబనం.
ఈ పరమసత్యాన్ని గ్రహించి, భార్యను బానిసగా కాకుండా పరమ మిత్రురాలిగా చూడగలిగితే, ఆ కాపురంలో కలతలు తలెత్తవు. జీవితం ఆనందమయమవుతుంది.

- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌

ᐅ ఉత్సాహం

 ᐅ ఉత్సాహం

'జీవితం ఒక బంధం. ఒక పాశం. మృత్యువు ఒక్కటే ముక్తి మార్గం. ఈ మర్త్య జీవనం ఒక అశ్రు సరోవరం' అని కొందరు నిరుత్సాహాన్ని ప్రబోధిస్తారు. 'నిద్ర ఎంత తీయన, మరణమే మేలు. పుట్టకుండా ఉండటం ఇంకా మంచిది' అని ఒక ఆధునిక కవి అంటాడు. ఇవన్నీ నిరాశ నుంచి పుట్టిన నిర్‌వేదాలు.
అసలు జీవితం భగవంతుడి బహూకృతి. ప్రకృతి అందించిన నిక్షేపం. లోపల, బయట ఎన్ని తుపానులు చెలరేగినా, దైవత్వంపై ప్రగాఢ విశ్వాసం ఉంటే భద్రంగా నిశ్చలతీరం చేరవచ్చు. భూమిపై జీవనానికి అర్థం ఉంది. ప్రయోజనం ఉంది. మనిషిలో అంతర్గతంగా దివ్యత్వం ప్రదీప్తిస్తుందని, ప్రపంచం అంతా ఆధ్యాత్మిక అంతర్వాహినులు ప్రవహిస్తున్నాయని ఈశావాస్యోపనిషత్‌ ప్రబోధించింది. భవితవ్యం పిలిచేవరకు జీవితం ద్విగుణీకృత ఉత్సాహంతో ప్రయాణించాలి. ప్రపంచం నాశనం అవుతుందని తెలిసినా- ఒక చెట్టును నాటాలి, ఒక మంచి పనికి బీజ నిక్షేపం చేయాలి.

జీవితాన్ని వూహాజనితమైన భవిష్యత్‌ దినానికి వాయిదా వేయడం మంచిది కాదు. ఉత్సాహ జ్వాలతో ముందడుగు వేయాలి. 'జీవన అగ్నిశిఖ ముందు కూర్చొని రెండు చేతులకు వెచ్చదనం కలిగించుకున్నా' అంటాడు ల్యాండర్‌ అనే రచయిత. క్షణకాల జీవితాన్ని విలాసాలకు వ్యర్థం చేయమని దీని అర్థం కాదు. జీవిత అమృతసారాన్ని పూర్తిగా ఆస్వాదించాలని భౌతికవాదులు అంటారు. ఆధ్యాత్మికవేత్తలూ అదే మాట చెబుతారు.

రెండూ భిన్నమైన దృక్పథాలు. జీవితం గులాబీలు పరచిన హంసతూలికా తల్పం అని, జీవితాన్ని 'మధు'మయం చేసుకోవాలని ఒకరి అభిప్రాయం. అదికాదు జీవితం. జీవితం సౌజన్యపథంలో సవ్య ప్రస్థానం అని మరొకరి ప్రబోధం. జీవితం నూరేళ్లూ నిండుగా బతకడమే కాదు, సుసంపన్నంగా జీవించాలి. అడుగడుగునా అంతరావలోకనంతో మన చర్యల్ని సమీక్షించుకోవాలి. మనలో దివ్యత్వం ఉందన్న స్పృహ నిత్యం వెన్నాడుతుండాలి. అప్పుడు మనసు చెడువైపు మళ్లదు. మానవతకు అంతిమ కిరీటం దైవత్వమే. మనిషి ఆనాడు అంతస్సామ్రాజ్య నేత.

బలమైన మనశ్శరీరాలు ఉన్నప్పుడే మానవ మనోక్షేత్రంలో ఆధ్యాత్మిక కాంతి బీజాలు నాటగలం. 'గీత కన్నా ఫుట్‌బాల్‌ ఆడటం వల్లనే భగవంతుణ్ని సమీపించగల'మని వివేకానందుల మాటల్ని గుర్తు పెట్టుకోవాలి. బలమైన మనసుతో గీత మరింత బాగా అర్థం అవుతుందని ఆయన ఉద్దేశం. నిరుత్సాహంతో నిర్విణ్నుడైన అర్జునుణ్ని 'గీత' అనే నిప్పుల కొరడాతో రణరంగంలోనే శ్రీకృష్ణుడు మేల్కొలిపాడు.

వృద్ధాప్య దశ చేరినవారు వారి శక్తికి అనుగుణమైన సత్కర్మలు ఆచరించాలి. వృద్ధాప్యంవల్ల శరీరానికి ముడతలు పడతాయి. ఉత్సాహాన్ని పోగొట్టుకొంటే, వారి ఆత్మలపై ముడతలు పడతాయి.

ఒక భక్తుడు అమృతత్వం కావాలని భగవంతుణ్ని కోరాడు. భగవంతుడు అతడికి అమృతత్వం ప్రసాదించాడు. సంవత్సరాలు గడుస్తున్నాయి. ఉత్సాహం తగ్గింది. చావు రాదు. ప్రపంచం విసుగనిపిస్తోంది. తన తప్పు తెలుసుకొని 'నాకు అమృతత్వం వద్దు' అని భగవంతుణ్ని వేడుకొన్నాడు. కాని, భగవంతుడు తన వరాన్ని వెనక్కు తీసుకోలేదు. ఇప్పుడు ఆ భక్తుడి చిరునామా ఎవరికీ తెలియదు.

ఉపపాండవుల్ని హతమార్చిన అశ్వత్థామకు శ్రీకృష్ణ భగవానుడు ఏకాంత అమరత్వం ప్రసాదించాడు. అది వరమా, శాపమా?

చిగురాకు చివర మెరిసే మంచుబిందువులాగా, కాలతీరాల్లో అందమైన జీవన నాట్యం హాయిగా ఉన్నంతకాలం సాగితే అంతే చాలు!

- కె.యజ్ఞన్న

ᐅ హృదయ సౌందర్యం

 ᐅ హృదయ సౌందర్యం

ప్రపంచం వైవిధ్యభరితం. జంతువులకు తమ జాతిలో పుట్టినవన్నీ సమానమే. మనుషులు మాత్రం ఎర్రటివాళ్లను ఇష్టపడతారు. నల్లగా ఉంటుందని కాకిని అసహ్యించుకుంటారు. కాకిపిల్ల కారు నలుపు. దాని అరుపు మనుషులకు కర్ణకఠోరం. కానీ, ఆ కాకిపిల్లను దాని తల్లి మాటిమాటికి ముద్దు పెట్టుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. మాతృహృదయం సహజ స్వభావం అంతే! అది జగజ్జనని హృదయం. జగదీశ్వరికి ప్రతి జీవీ కన్నబిడ్డే!
బాహ్య సౌందర్యానికైతే పరిమితులుంటాయి. హృదయ సౌందర్యమో? అపరిమితం! హృదయ సౌందర్యంలో కరుణ, ప్రేమ, సానుభూతి ఉంటాయి. అవి దైవాంశలు. తల్లిలేని పిల్లి పిల్లకు పాలిచ్చి పెంచే కుక్కను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.

నలుపు నారాయణుడు అని సామెత చెబుతాం. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీవెంకటేశ్వరుడు... అందరి విగ్రహాలూ నలుపే! వారిని శ్యామసుందరులని స్తుతిస్తాం. కానీ, అమ్మాయికి సంబంధం చూసేటప్పుడు మాత్రం 'రంగు తక్కువ' అని తిరస్కరిస్తాం. మనవాడు పాండురంగని విగ్రహంలా ఉన్నా, పెళ్ళికూతురు నల్లటిదైతే మాత్రం వల్లగాదు!

సృష్టిలో ఏ ప్రాణి అందం దానిదే! అయినా సరే, కొన్ని ప్రాణులు అందంగా ఉంటాయంటే మనుషులు అంగీకరించరు. వానరాలు సుందరంగా ఉంటాయంటే అంగీకరించేవారు తక్కువ. కానీ, హనుమంతుడు సుందరుడని ప్రతీతి. ఆయన పాత్ర ప్రధానంగా ఉన్న భాగానికి సుందరకాండ అని పేరు. ఎక్కడున్నది హనుమ అందం? ఆయనది హృదయ సౌందర్యం! అతిలోక సుందరుడైన శ్రీరామచంద్రుడు ఆయన హృదయంలో ఉన్నాడు. సముద్రాన్ని లంఘించడం, సీతజాడ కనుగొనడం, లంకాదహనం చేయడం, సంజీవని తెచ్చి లక్ష్మణుని బతికించడం, సమరంలో వీరవిహారం గావించడం... ఇవన్నీ ఆంజనేయుడి భౌతిక విజయాలే! అంతటి వీరహనుమాన్‌ స్థానం ఎక్కడ? శ్రీరాముని పాదాల చెంత! నిరహంకారుడై, తన హృదయంలోనే సీతారాముల్ని ప్రతిష్ఠించుకొని, గుండెను చీల్చి వారిని చూపగల 'భక్త హనుమాన్‌'గా రామాయణ గాథలో సుస్థిరస్థానం సంపాదించిన ఆంజనేయుడు మనకు పూజనీయుడు. హృదయ సౌందర్యానికి నిదర్శనంగా నిలిచాడు. మాటలకంటే మనసు ముఖ్యం.

మహాత్ములు తమ ప్రబోధాలను ఆచరణలో పెట్టి చూపారు. రమణ మహర్షికి మోకాళ్ల నొప్పి ఎక్కువగా ఉండేది. ఆయన కాళ్లు ఒత్తితే తమకు పుణ్యం వస్తుందని భక్తులు పోటీ పడేవారు. రమణ మహర్షి వారిని వారిస్తూ ఇలా అన్నారు- 'ఉండడయ్యా, పుణ్యం అంతా మీకేనా? నాకూ కొంచెం మిగలనివ్వండి. నా కాళ్లు నేనే ఒత్తుకొని కాస్త పుణ్యం సంపాదించుకుంటాను!' ఈ మాటలతో శ్రీరమణుల హృదయ వైశాల్యమూ, సంస్కారమూ ఎలాంటివో భక్తులకు తేటతెల్లమైంది. ఆత్మ సౌందర్యంతో అందరినీ అలరించిన భగవాన్‌ రమణ మహర్షిని లోకం ఎన్నటికీ మరచిపోదు- హృదయ సౌందర్యం అమరం గనుక!

మహాత్ముల్లో ఎక్కువమంది భౌతికంగా సుందరాకారులు కాదు. 'లోకంలో ముగ్గురు వికార స్వరూపులు పేర్లు చెబుతా' అని 'లింకన్‌, గాంధీ, లెనిన్‌' అని ముగ్గురు మహాపురుషుల పేర్లు చెప్పాడు ఒక చమత్కారి. అవును, వారు సుందరాంగులని కాదు ప్రపంచం అభిమానిస్తున్నది. వాళ్లు అందగాళ్లు కారనే విషయం ఎవరికీ స్ఫురించదు. వారి సిద్ధాంతాలూ జీవితాలూ నచ్చినవాళ్లు ఆ మహాపురుషులు గొప్ప ఆకర్షణగల దివ్యమూర్తులని భావిస్తారు. వారిలో ఒక సౌందర్యాన్ని దర్శిస్తారు. అదే హృదయ సౌందర్యం. బాహ్య సౌందర్యాన్ని దర్శించడం, ఆనందించడం, అభినందించడం సులభం. హృదయ సౌందర్యాన్ని అర్థం చేసుకోవాలంటే సంస్కారం ఉండాలి. అందం తక్కువవాళ్లు కూడా ఆభరణాలూ, వస్త్రాలూ, అలంకరణలచేత ఆకర్షణీయంగా కనబడవచ్చు. ఇవన్నీ భౌతిక సౌందర్య సాధనాలు. ఇవన్నీ తాత్కాలికమైనవి. నిష్కాపట్యం, కరుణ, సహాయగుణం... ఇలాంటివి హృదయ సౌందర్య సాధనాలు. ఇవి శాశ్వతమైనవి.

దయగల హృదయమే సౌందర్య నిలయం!

- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు

ᐅ ప్రేమసాగరమే భక్తి

 ᐅ ప్రేమసాగరమే భక్తి

మన మహర్షులు మోక్షసాధనకు మూడు యోగమార్గాలను చూపారు. అవే భక్తి, కర్మ, జ్ఞాన యోగాలు. ఈ మూడింటిలో అందరికీ అందుబాటులో ఉండేది భక్తియోగం. భక్తి అంటే నిర్వ్యాజంగా, త్రికరణ శుద్ధిగా ప్రేమించటం. భక్తి ప్రేమ స్వరూపం. హృదయపూర్వకమైన భక్తిని భగవంతుడిపై అచంచలంగా నిలిపినప్పుడు, అది మరొకరి మీదకు మరలదు. ఆదికవి రచించిన రామాయణంలో ఇందుకు పెక్కు ఉదాహరణలు కానవస్తాయి.
శ్రీరాముడు తండ్రి ఆనతి మేరకు రాజ్యాధిపత్యాన్ని వదలుకొన్నాడు. నారచీరలు ధరించి అడవులకు వెళ్లాడు. సీతాదేవి, లక్ష్మణులు శ్రీరాముణ్ని అనుసరించారు. తాతగారి నగరం నుంచి తిరిగివచ్చిన భరతుడు- తండ్రి మరణం, శ్రీరాముడి అరణ్యవాసం గురించి తెలుసుకొన్నాడు. ఏ విధంగానైనా అన్న రామయ్యను మరల అయోధ్యకు పిలుచుకొని వస్తానన్నాడు. అన్న అరణ్యానికి వెళ్లిన మార్గంలోనే వెళ్లాడు. చిత్రకూటంలో రాత్రి తన అన్న, అయోధ్య సామ్రాజ్య చక్రవర్తి, ఎండుటాకుల శయ్యపై ఉండటం గమనించాడు. 'ప్రభూ, హంస తూలికాతల్పంపై పడుకొని నిద్రించవలసిన తాము, పండుటాకులపై పడుకోవటం బాధ కలిగించదా?' అంటూ కన్నీరు కార్చాడు. పక్కనే చెట్టుకు ఆరవేసిన నారచీరలను గమనించాడు. 'కోమలమైన తమ దేహం, ముతక వస్త్రాలను ఎలా సహించగలదు. నా తల్లికి నాపైగల వ్యామోహమే ఇంతకూ కారణం. నేను అపరాధిని. నేను మీలాగే జీవిస్తాను' అంటూ తాను ధరించిన పట్టువస్త్రాలను వదలి నారచీరలు ధరించి పాదరక్షలను విడిచిపెట్టి శ్రీరాముడి పాదుకలను తలపై ఉంచుకొని అయోధ్యకు మరలాడు. ఇది ప్రేమభక్తికి పరాకాష్ఠ!

శ్రీరాముడు చిత్రకూటం వదలి దండకారణ్యంలో కొంతకాలం ఉండదలచాడు. దారిలో గంగానదిని దాటాల్సి వచ్చింది. గిరిజన నాయకుడైన గుహుడు స్వయంగా సీతారామలక్ష్మణులున్న పడవను ఆవలిగట్టుకు చేర్చాడు. శ్రీరాముడు గుహుడి వినయానికి సంతోషించి, నదిని దాటించినందుకు అయిన శుల్కమెంతో తెలుపమన్నాడు. 'ప్రభూ, వాస్తవంగా మనిద్దరిదీ ఒకే వృత్తి- దాటించడం. నేను ఇహంలో దాటించాను... తాము భవాన్ని దాటించగలరు. మీ శరణుజొచ్చాను. మీ నుంచి శుల్కం అందుకోవడం శాస్త్రసమ్మతంకాదు. కానీ ఒక విన్నపం. కాలక్రమంలో నన్ను భవసాగరం దాటించమని వేడుకొంటున్నాను...' అన్నాడు. అదీ, ప్రేమమయమైన ముగ్ధభక్తి.

శ్రీరామచంద్రుడి దర్శనం కోసం జీవితాంతం వేచిన భక్తురాలు శబరి. వేకువనే లేచి, ఆయా కాలాల్లో లభించిన పళ్లను కొరికి, రుచిచూసి సేకరించేది. మధురమైన పళ్లను మాత్రమే భద్రపరచేది. దినమొక యుగంగా రాముడి రాకను నిరీక్షిస్తూ ఉండేది. కొన్నేళ్లు దొర్లాయి. శరీరం కృశించింది. తల ముగ్గుబుట్ట అయిపోయింది. రామచంద్రుని నిరీక్షణ దీపం వెలుగుతూ ఉంది. ఒక రోజున రాముడు రానేవచ్చాడు. శబరి కళ్లు మసకబారాయి. శబరి హృదయం రాముని చూసింది. ఆమె కళ్లలో ఆనందబాష్పాలు రాలుతూ ఉన్నాయి. తాను రుచిచూసి దాచిన రేగుపళ్లను స్వయంగా ఒక్కొక్కటే తినిపించింది. ఆ ఆరాధ్య దైవానికి ఎంగిలిపళ్లను తినిపిస్తున్నానన్న ఆలోచనే లేదా ముసలి శబరికి!

అదీ భగవంతుడికి భక్తుడికి మధ్య అనుబంధం. ఆమె సర్వస్వం శ్రీరాముడికే.

ఒక భక్తురాలుండేది. చాలాకాలం సంతానం కలగలేదు. తన బాధను ఆలయ అర్చకస్వామికి విన్నవించింది. అర్చకులు 'అదిగో ఈ గర్భగుడిలోని కృష్ణుని 'బిడ్డా, రా' అని పిలువు, వస్తాడు' అన్నాడు అర్చకుడు. ఆ ముగ్ధురాలప్పటికే శ్రీకృష్ణుడి పట్ల అనన్యమైన భక్తురాలిగా ఉండేది. ఇంటికివెళ్లి భక్ష్యాలను తయారుచేసుకొని, కృష్ణుడి ముందు ఉంచి 'రా, నాన్నా... రా, త్వరగా రా... నీ కోసం తియ్యని భక్ష్యాలు తెచ్చాను. తినిపిస్తాను. నాకు వేరే పనులున్నాయి, త్వరగా రా!' అన్నది. కృష్ణుడు బాలుడై వచ్చాడు. భక్తురాలు సంతోషంతో ఆయన నోటిలో భక్ష్యాలను ఉంచి, పూర్తిగా తిన్న తరవాత ఇంటికి వెళ్లేది. ఒక రోజున ఆలయంలోని శ్రీకృష్ణుడి మూతికి అంటుకొన్న మెతుకులను అర్చకులు గమనించారని, ఈ వార్త వూరంతా వ్యాపించిందని, అర్చకుడు రహస్యంగా జరుగుతున్న తంతును చూశాడని చెబుతారు. ఇది కర్మాబాయి అనే భక్తురాలి కథ. ఇది భక్తుడికి భగవంతుడికీ మధ్య ప్రేమానుబంధం.

- జానమద్ది హనుమచ్ఛాస్త్రి

ᐅ మధుర వాక్కు

 ᐅ మధుర వాక్కు

మాట మధురాతిమధురంగా ఉండాలంటారు. మాటొక తూటా కాకూడదు. ఎదుటివారిని బాధపెట్టకూడదు. పరుషంగా ఉండకూడదు. చాలా సరళంగా ఉండాలి. స్పష్టంగా ఉండాలి. మాటల పొందిక నేర్చుకోవాలి. క్లుప్తంగా, సూటిగా ఉండాలి. తెలుగు భాషకు ఈ సందర్భాలన్నీ కలుస్తాయి. అదే పనిగా మాట్లాడుకుంటే- రసం మాట దేవుడెరుగు, నీరసం వస్తుంది.
అ అమ్మాయి మాట మధురంగా పాటలా ఉంటుంది. పెళ్ళాడుతా అన్నాడట వెనకటికొకడు. మౌనం కొన్నిసార్లు పెడార్థాల్నిస్తుంది. మౌనంకన్నా మాట ఎన్నోవిధాల మన సమస్యల్ని పరిష్కరిస్తుంది. మాట భాష తాలూకు సౌందర్యాన్ని, మనిషి సంస్కారాన్ని తెలుపుతుంది. మెదడు పంపుతున్న సంకేతాల్ని పెదాలమీద శబ్దతరంగాలుగా మార్పు కావడంలో మన నేర్పరితనం కనిపిస్తుంది. ఇది నా మాటగా చెబుతున్నాను అని అంటే- అతడి వ్యక్తిత్వం గోచరిస్తుంది. కొందరు ఆవేశంతో ఏదో మాట్లాడేసి- నేనలా అనలేదు, మీరు వక్రీకరిస్తున్నారు అని అంటారు. నిజానికి మాట ఒకసారి నాలుక జారితే దాన్ని వెనక్కు తీసుకోవడం అసంభవం. ప్రజాహితం కోరి మాట్లాడాలేతప్ప సొంత లాభంకోసం ఉపన్యసించకూడదు.

కొంతమంది వ్యాపారస్తులు వినియోగదారుల్ని ఆకర్షించడానికి 'నవ్వు'ను ముఖానికి పులుముకొని మాటను జోడిస్తారు. కార్యసిద్ధి పొందుతారు. నిజానికి అది పెద్ద నేరం కాకపోయినా, మాటలు కోటలు దాటితే అసందర్భ ప్రేలాపన కింద పరిగణించే సందర్భాలూ లేకపోలేదు. మాట భావావేశంలో పరిపరి విధాల పోతుంది. బోలెడన్ని ద్వంద్వార్థాలు, ఎత్తిపొడుపులు వేగంగా దొర్లుకుపోతుంటాయి. అప్పుడు మాటకు విలువ, అర్థం మారిపోయి మనం తికమక అయిపోతాం. చాలా శక్తిమంతమైన మన మాటను, మెల్లగానూ సుతిమెత్తగానూ చెప్పవచ్చు.

మాట మనుషుల మధ్య చుట్టరికాన్ని, స్నేహతత్వాన్ని సమకూరుస్తుంది. నిలకడ నేర్పుతుంది. అవతలి వ్యక్తి అర్థం చేసుకొని వినిపించుకునే స్థితిని మనకు మనమే మాట ద్వారా కల్పన చెయ్యాలి. ఆ రీతి రివాజులోనే అర్థం, పరమార్థం ఉన్నాయి. మనకు ఎన్నో ఒత్తిళ్లు, కక్షలు, కావేశాలు ఉండవచ్చు. వాటినన్నింటినీ కడుపులోనే దాచేసి పైకి 'శబ్దం' ద్వారా వెల్లడించే మాట మనకు, అవతలి వ్యక్తికి ఉపయోగపడాలి. అలా చిన్నతనం నుంచి అలవాటుగా, ఒరవడిగా రూపొందించుకుంటే 'మాట' చక్కదనాల మూటలా తయారై తలమీద జుట్టు నెరిసే సమయానికి మనిషినొక వేదాంతిగా, సుభాషితుడిగా, పెద్దమనిషిగా, సంఘసంస్కర్తగా నిలబెడతాయి. ఒక మనిషి ఆలోచనా సరళి, జీవిత విధానం, బతుకు పుస్తకం అంతా 'మాట' అనే పుటల్లో ఇమిడి ఉంటుంది. దాన్ని ఆచితూచి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిమీదా ఉంది!

- గుడిమెట్ల గోపాలకృష్ణ

ᐅ ఇవ్వడమే మిన్న

 ᐅ ఇవ్వడమే మిన్న

ఇతరులకు ఇవ్వడంవల్ల కలిగే ఆనందం స్వీకరించడంలో ఉండదు. ఇతరుల నుంచి మనం దేన్ని తీసుకొన్నా తిరిగి చెల్లించకతప్పదు. తిరిగి ఇవ్వలేనప్పుడు కనీసం కృతజ్ఞతనైనా వ్యక్తం చేయాల్సిందే! కనుక స్వీకరించడంకన్నా దాతృత్వంలోనే ఆనందమూ పరమార్థమూ ఉంటాయి. మన తాహతుకు అర్హతకు మించినదాన్ని ఎవరైనా ఇవ్వజూపితే తీసుకోకూడదని కశ్యపుడు రాసిన వినయ చంద్రిక సూచిస్తోంది.
పూట గడిస్తే చాలు... అంతకన్నా అవసరం లేదనే వ్యక్తికి బంగారు ముద్ద ఇస్తే తీసుకోవడానికి జంకుతాడు. అందుకు బదులుగా పట్టెడు బియ్యం, దానికి సరిపడా అపరాలు అందజేస్తే అతడి ఆనందానికి అవధులే ఉండవు. మనసారా దాతను దీవిస్తాడు. స్థితప్రజ్ఞుడైన మహాపండితుడి వద్దకు వెళ్లి అతడి వ్యక్తిత్వాన్ని ఏదైనా స్వార్థ చింతనతో ప్రశంసించి చూడండి. అతడి వదనంలో అయిష్టత వ్యక్తమవుతుంది. భరించలేక ఇక చాలు ఆపమంటూ చిరాకు ప్రదర్శిస్తాడు. కాని, గౌరవ భావంతో అమలిన హృదయంతో ఆ పండితుడిలోని ప్రజ్ఞను మెచ్చుకొంటే కొంత సంతోషిస్తాడు. మనం అడగకుండానే తనవల్ల మనకేదైనా సహాయం అవసరమేమోనని వాత్సల్యంతో వాకబు చేస్తాడు. మనకు అవసరమైంది ఆ పండితుడి వద్ద ఉంటే ఆనందంగా ఇస్తాడు.

ఆ పరాత్పరుడి తత్వం ఇలాంటిదే. మన నుంచి తీసుకోవడం కన్నా మనకు ఇవ్వడానికే ఆరాటపడతాడు. స్వీకరించగలిగే అర్హత ఉండాలిగాని... ఏదైనా ఇచ్చేస్తాడు! స్వార్థంతో కూడిన స్తుతులు, నుతులు దేవదేవుని సంతృప్తిపరచవు. నిరామయంగా ఆత్మను అనుసంధానం చేసి ఆరాధిస్తే మనకు ఏది అవసరమో గ్రహించి మేలు చేస్తాడు. శ్రీకృష్ణుడు సుదాముడి పట్ల కనబరచిన భగవత్‌ తత్వం ఇదే!

పరమాత్మ తత్వాలు అర్థం చేసుకొని ఆచరించే ప్రయత్నం మనం చేయాలి. దైవం ప్రశాంతతకు ప్రతిరూపం. ఆయనలో మూర్తీభవించిన శాంతం సహనం మన దైనందిన జీవన విధానానికి చాలా అవసరం. పరమాత్మను నిందించండి... సహిస్తాడు. ఆయనపై క్రోధం కనబరుస్తే ముగ్ధమనోహరంగా నవ్వుతాడు. ఎందుకో తెలుసా? ఇతరుల నుంచి స్వీకరించడం తెలియని వాడు కనుక దూషణలను సైతం స్వీకరించడు. ఆయన విగ్రహంపట్ల ఆక్రోశం కనబరిస్తే దైవం నిగ్రహం కోల్పోడు. ఆగ్రహం అసలు రాదు. భగవంతుడి ముందు కుచేలుడిలా ఉండాలని రమణ మహర్షి చెప్పేవారు.
క్షేత్రాల్లోని గుళ్లో భగవంతుని మూర్తి ముందు నిలబడి ఆరాధించేవాడికి అవసరాలు పరిసరాలు కనిపించకూడదు. మనకేదైనా ఇవ్వాలా వద్దా అనేది పరమాత్మ ఇష్టం! ఇతరులకు సహాయం చేస్తూ ఆపన్నులను ఆదుకునే తృష్ణ మనలో ఉంటే మనలను శ్రీమంతులను చేస్తాడు. దోచుకొని దాచుకోవాలనుకునే వారికి తన శిక్షాస్మృతిని అనుసరించి తగిన సమయంలో శిక్షిస్తాడు. గుడ్డివాడిని రంగురంగుల చిత్రాలను విచిత్రాలను చూడమంటే ఏం లాభం? వాడికి కావలసింది దృష్టి. దాన్ని ప్రసాదించేవాడే భగవంతుడు. అజ్ఞాని చేతికి కోట్ల రూపాయల విలువైన వజ్రం ఇస్తే... ఇతరులపైకి దాన్ని విసిరి గాయపరుస్తాడు. అతడికి ఇవ్వాల్సింది జ్ఞానమే కాని, ధనం కాదు. అలా ఎవరికి ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఆ పరమాత్మకు తెలుసు.

సర్వం విడచి తననే శరణన్న వాడిని దైవం ఆదరిస్తాడు. తనను కాదన్నవాడి పట్ల చక్రి అసహనం ప్రదర్శించడు. శ్రీరాముడు సర్వం సహా చక్రవర్తి. ఆయన పాలనలోని ఒక సామాన్యుడు తన భార్య సీతపై వేసిన నిందనైనా భరించాడు కాని, అతణ్ని శిక్షించలేదు. శ్రీ రామచంద్రుని వనవాసం పంపే సందర్భంలో కైకేయి దశరథుణ్ని ఇలా ప్రశ్నిస్తుంది- 'పట్టాభిషిక్తుని చేయకుండా వనవాసం పంపుతున్న రామచంద్రుడి వదనంలో దరహాసమే కనిపిస్తోంది. నావైపు అపహాస్యంగానైనా చూడటంలేదు. అతడి మొహంలో ప్రశాంతత నిండి ఉంది... ఎందుకు?' అని. దశరథుడంటాడు- 'శ్రీరామచంద్రుడికి దూషణలు భూషణలు రెండూ సమానమే! అసూయను స్వీకరించే తత్వం అతడిలో లేదు. శ్రీరాముడు నా కుమారుడు మాత్రమే అనుకొన్నాను. దైవమే మానవ రూపంలో అవతరించాడని విశ్వామిత్రుడు చెప్పాడు. ఈ లోకాలన్నీ ఆయన సృష్టిలోనివే! అరణ్యాలైనా జనారణ్యాలైనా అతడి సృష్టిలోని అంతర్భాగాలే. అలాంటి కరుణాపయోనిధికి జనవాసాలకూ వనవాసాలకూ వ్యత్యాసం ఉండదు. రాజ్యాభిషేకం చేస్తానంటే నగుమోముతో అంగీకరించాడు. వనాలకు వెళ్ళాలని ఆజ్ఞాపించినా అలా నవ్వుతూనే వెళ్తున్నాడు...'

ఇదం శరీరం పరిణామ పేశలం (ఈ శరీరం మార్పు చెందుతూ వుంటుంది). బాల్య కౌమార యౌవన ప్రౌఢ వృద్ధ్యాప దశలను మనిషి అనుభవించక తప్పదు. ఈ లోకంలో మనం ఇలా సంపాదించి అలా అవసరార్థులకు ఇవ్వగలగాలి. నేనెవరికైనా అవసరమైంది ఇస్తే శ్రీరాముడు నాకు అవసరమైన మోక్షం ఇస్తాడని అంటాడు తులసీదాసు. మానవులమైన మనం పరమాత్మ తత్వాన్నే సాధన చేయాలి. పరులకు ఇవ్వడమే మనం నేర్చుకొంటే పరమాత్మ మనకు జన్మరాహిత్యం కల్పిస్తాడు. అదే కదా చివరికి మనకు కావలసింది!

- అప్పరుసు రమాకాంతరావు

ᐅ లాలనా లోలుడు

 ᐅ లాలనా లోలుడు

భగవంతుడు భక్త సులభుడు. భగవంతుడు అత్యంత గహనమైనవాడు. అంత సులభంగా అందుబాటులోకి రాడు. ఎముకలు అరిగిపోవాలి. కండలు కరిగిపోవాలి. కన్నీళ్లు కడలినిండి పొంగిపొరలాలి. నిజమేనా, ఏది నిజం? ఒక విషయంలో ఇంత విభిన్న ధోరణి సాధకుణ్ని బెంబేలెత్తించదా? అసలే భగవంతుడి ఉనికి పట్ల అంతంతమాత్రపు విశ్వాసం మనకు. సాధనలో సగం దూరం ప్రయాణించాక కూడా 'కలడు కలండనెడివాడు కలడో లేడో!' అని పక్కచూపులు, బిత్తరచూపులు చూస్తూ డోలాయమాన స్థితిలో ఉంటాం. పాలు తెల్లగా ఉంటాయని ఒకరు, లేదు- నల్లగా ఉంటాయని మరొకరు పూర్తి వ్యతిరేకాభిప్రాయాలు వెల్లడిస్తే మన గతేం కాను! కనీసం పాలు కంటికి కనిపిస్తూ ఉంటాయి. తెల్లగానే ఉన్నాయిలే అని మనకు మనం నిర్ధారించుకునే అవకాశం ఉంది. మరి భగవంతుడు? చివరాఖరికైనా మనమే భగవంతుడైపోవాలి తప్ప 'ఇదిగో ఇది నేను' అని ఆయన కనిపించే అవకాశమే లేదు. అలాంటివాడి గురించి స్పష్టమైన, సత్యమైన నిర్వచనాన్ని ఇచ్చేవారెవరు? ఎవరూ లేరు. ఉన్నా మనం అసత్యాన్నే ఎక్కువగా నమ్ముతాం. మనకు అనుకూలమైన అభిప్రాయాన్నే పరిగణనలోకి తీసుకుంటాం. అయినా దేనికైనా వేదాలు శాశ్వత ప్రమాణాలు. ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, రామాయణ భారత భాగవతాది గ్రంథాలు, గీత... భారతీయ వాఞ్మయ సర్వస్వం భగవంతుడి ఉనికిని, వైభవాన్ని కీర్తించటానికే ఆవిర్భవించింది. సరే. 'కలడో లేడో' అనేవాడు కలడు. ఒప్పుకొందాం. మరి భక్త సులభుడేనా? యుగాల పర్యంతం ఎముకలు కూడా శిథిలమయ్యే స్థాయిలో తపస్సు చేసిన తపోధనుల మాటేమిటి? తలమీద పక్షుల గూళ్లు, శరీరం చట్టూ పాముల పుట్టలు... ఏమిటి?!
నిజానికి మనకు ఏ ఉదాహరణలు, ఉపమానాలు అవసరం లేదు. ఎవరి హామీలతో పనిలేదు. ఇచ్చి పుచ్చుకో అనే సూత్రం ప్రకృతి మనకు ప్రసాదించిన అమూల్యపాఠం. భగవంతుడి పట్లా ఈ సూత్రమే వర్తిస్తుంది. అహేతుక ప్రేమమయుడైన భగవంతుడు మనకు జన్మతో సహా అన్నీ ఇచ్చినా జన్మ సార్థక్యాన్ని సాధించుకునే విషయంలో మాత్రం మనకు స్వేచ్ఛను, ఇచ్ఛాపూర్వక ఎంపిక అవకాశాన్ని ఇచ్చాడు. ఆయన కావాలా, వద్దా అన్నది మాత్రం మనమే నిర్ణయించుకోవాలి. ఆయన ప్రమేయంగానీ, ప్రయత్నంగానీ ఏమీ ఉండదు. నడక నేర్చుకుంటున్న పసివాణ్ని కిందపడినా తండ్రి పట్టించుకోకుండా కేవలం పరిశీలిస్తూ ఉండిపోయినట్లు మనం చేసే ప్రయత్నాలను నిర్వికారంగా, నిర్లిప్తంగా చూస్తూ ఉంటాడు. స్వప్రయత్నాన్ని, స్వప్రయోజకత్వాన్ని ప్రోత్సహిస్తాడు. ఔను. ఈ దశలో మనమే ముందుగా ఆయనకు మన ప్రేమను, ఆరాధనను అందివ్వాలి. తడబడే అడుగులను కూడగట్టుకుని తపస్సు చేసేదాకా ఎదగాలి. మనం ఆ ప్రయత్నంలో ఉన్నామనే విశ్వాసాన్ని ఆయనకు కలిగించాలి. అదే సాధన. అదే ఎముకలు అరిగించటం, కండలు కరిగించటం. బాహ్యమైన సాధనలు ఎన్ని చేసినా, నిజంగానే ఆ ప్రక్రియల్లో ఎముకలు విరిగినా, అరిగినా ఆంతరిక భావ ప్రధానం కాని సాధనలు ఫలితాన్నందించటంలో వెనకబడతాయి. మాధవుడితో మనసు కలిపినవాడికి, అనంతుడితో అంతరంగాన్ని నింపుకొన్నవాడికి భగవంతుడు - నిజంగానే భక్తసులభుడు.

అంటే, భగవంతుడు అందిపోయాడా? లేదు. అంత పనీ, అందినంత పనీ చేశాడు. అనుక్షణం భావముఖంలో ఉంటూ భగవంతుడితో అనుసంధానమై జీవితాన్ని ప్రేమ రసమయ రాగరంజితం చేసుకున్నవాడికి భగవంతుడు ప్రత్యేకంగా కనిపించనక్కర్లేదు. అణువణువునూ ఆయనగా అనుభూతి పొందేవాడికి ప్రత్యేకం ఒక స్పర్శా సదృశ ఘన పదార్థం అక్కర్లేదు. దృశ్యమాన వస్తువు అవసరం లేదు. భగవంతుడు అంతర్లీన కేంద్రం. అనుభూతి సాంద్రం. 'శ్రీ రామ నీ నామ మెంత రుచిరా' అనగలిగినవాడు, 'నిధిచాల సుఖమా రాముని సన్నిధి సుఖమా?' అని ప్రశ్నించగలిగినవాడు, బంగారాన్నీ, మట్టిపెడ్డనూ సమ సదృశంగా గంగలో పడేయ గలిగినవాడు, ఈ స్థాయిలో భగవంతుణ్ని ప్రేమించలిగినవాడు... వాడు, వారు... ఆ సౌలభ్యం ఎరిగినవారు. యుగాల తపమాచరించినా వారు అంధకారంలో వెలుగును వెదికినవారు కారు. వెదికే పనిలో లేరు. ఆ ప్రకాశాన్ని ఆస్వాదిస్తూ యుగాలు మరచినవారు, మైమరచినవారు. ప్రకాశంతో మమేకమైనవారు. యుగాల తపో రహస్యం ఇదే.

ఔను. భగవంతుడు భక్తసులభుడు. మనం పిల్లల్ని ప్రేమిస్తే పిల్లలూ మనల్ని ప్రేమిస్తారు. మన రూప లావణ్యాలతో పని లేదు. ధనం, హోదాలతో పనిలేదు. మనమిచ్చే విలువైన కానుకలతో పనిలేదు. దేవుడైనా అంతే. పసివాడు. అంతకంటే మరీ పసివాడు. లాలనా లోలుడు. ఇక్కడ అందమైన రహస్యం ఏమిటంటే- ఈ సుకుమారుడు, ఈ శిశు సమానుడు అటుకులకు అనంత సంపదలిచ్చేవాడు. పండిపోయిన ఉసిరికాయకు పసిడి ఉసిరి రాశులను కురిపించేవాడు.

- చక్కిలం విజయలక్ష్మి

ᐅ జ్ఞానప్రాప్తి

 ᐅ జ్ఞానప్రాప్తి

లోకం తీరు చాలా విచిత్రంగా ఉంటుంది. ధర్మం, అధర్మం మన బుద్ధికి సులభంగా అందవు. అందుకే తికమక పడుతుంటాం. ఏదో మంచి ఉందనుకుంటాం. దాని మరుగునే చెడు దాగి ఉంటుంది. మనసు ఒక విషయంపై దృఢంగా నిలవదు. మనసుకు నిలకడ లేదు. ప్రతినిమిషం చంచలంగా ప్రవర్తిస్తాం. మనం ధర్మం అనుకున్నది ఉన్నట్లుండి అధర్మంగా మారిపోతుంది. న్యాయబద్ధంగా ప్రవర్తిస్తున్నామనుకుంటూ అధర్మ ప్రవర్తకులం అయిపోతాం. దయ ఎంతో మంచి గుణమే. కానీ, సందర్భాన్ని బట్టి అది దోషంగా మారిపోయే ప్రమాదం ఉంది. స్వధర్మాన్ని తెలుసుకోవాలి. ఎవరి స్వధర్మానికి వారు కట్టుబడి ప్రగతి సాధించాలి.
ప్రతిరోజూ మనకు తెలియకుండానే ఎన్నెన్నో పాపాలు జరిగిపోతుంటాయి. పైకి మంచిగా కనిపించినా ఆ మంచి ముసుగులో పాపం పేరుకుపోతుంది. మన బుద్ధికి యోచన చేసే శక్తి ఉంది. మనకు విచక్షణ జ్ఞానం ఉంది. ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మం, ఏది అధర్మం అనేది తెలుసుకోగలం. అయినా 'నేను', 'నాది' అనే భావాలు అహంకారం, అభిమానం మబ్బుకమ్మినట్లు మనసును కప్పేస్తాయి.

రంగుటద్దంలో చూస్తున్నట్లు మనకు ఎప్పుడూ చెడు మంచిగానే కనిపిస్తుంది. ఈ భ్రమతో అహంకారం పెరిగిపోతుంది. ఈ అహంభావం పెరగడం వల్ల మనకు మన దోషాలు కనిపించవు.

మానవులు క్రోధం, లోభం, మోహం అనే దోషాలకు లొంగిపోయి ఉంటారు. ఈ త్రిదోష స్వభావంలోనే ప్రపంచాన్ని పరిశీలిస్తారు. కాబట్టి ఎదుటివారి అభిప్రాయాలకు వాస్తవమైన విలువ ఉండదు.

మానవాతీతులైన మహాత్ముల దృష్టి నిర్దోషంగా ఉంటుంది. ఇటువంటి మహాత్ములను అనసరిస్తే జీవితం నిరామయంగా ఉంటుంది. కానీ, ఇటువంటి మహాత్ములు సులభంగా కనిపించరు.

భగవంతుడు గుణరహితుడు, దయామయుడు. పసిబిడ్డ తల్లికోసం విలపించినట్లు మనం భగవంతుడి కోసం విలపిస్తే చేతులు చాచుకొని ఆయన మనలను ఆదరిస్తాడు.

భగవంతుని పొందాలనే ఇటువంటి తపన మనలో బయలుదేరాలి. ఇతర వ్యామోహాలు లేకుండా కేవలం ఆ పరబ్రహ్మను పొందాలనే కాంక్షను ప్రబలం చేసుకోవాలి. ప్రప్రథమంగా విశ్వాసం లేకుండా ఏ పనీ సాధించలేం. పూర్తి విశ్వాసంతో కాంక్షను పెంచుకోవాలి. ఆ భగవంతుడే సర్వసమర్థుడు, ఆ భగవంతుడే ఆనంద స్వరూపుడనే విశ్వాసం ఏర్పరచుకోవాలి.

ఇటువంటి విశ్వాసం ఏర్పడితే కాంక్ష దానంతటదే ఏర్పడుతుంది. కానీ, 'కావాలని' కోరుకునే కాంక్ష కూడా దోషమే. సాత్విక, రాజసిక, తామసిక గుణాలు సదా మనల్ని ప్రభావితం చేస్తుంటాయి. సాత్విక గుణంతో కూడిన కాంక్షను పెంచుకోవాలి. లౌకిక సుఖాలను అనుభవించడానికి కాదు పరమాత్మ; పరమాత్మ కోసమే పరమాత్మ కావాలి. అలాగని ప్రయత్నిస్తే జీవితం ఆనందమయంగా ఉంటుంది. ఇదే సుఖమయ జీవితానికి సులభమార్గం. చిత్తశుద్ధితో జ్ఞానసిద్ధిని కలిగించుకోవాలి!

- రాంబాబు

ᐅ అనేక రూపాల రాముడు

 ᐅ అనేక రూపాల రాముడు

భగవంతుడు తనను తాను అవతారమూర్తిగా వ్యక్తపరచుకున్నప్పుడు తద్వారా ఎన్నో మహాప్రయోజనాలు సాధిస్తాడు. ఒకవైపు ధర్మప్రతిష్ఠ, మరోవైపు యోగ్యులైన సాధకులను అనుగ్రహించడం అవతారంలో ప్రత్యేకత.
నృసింహ, రామ, కృష్ణ అవతారాలు- అవతారానికి పూర్వమే మంత్రాధిదేవతలు, రుషులు, వేల్పులు కలిసి లోకోపకారం కోసం ఆ మంత్ర స్వరూపాలను ఉపాసించి, ధర్మోద్ధరణకై అవతరించమని ప్రార్థించడంవల్ల భువిపై ఆవిష్కరించుకున్నారు.

ఒక మంత్రంలో ఉన్న అనేక శక్తులు, ఉపాస్యమూర్తులు అన్నీ ఆ అవతార కాలంలో కథారూపంగా గోచరిస్తాయి. భౌతిక దృష్టికి అవి కథాఘట్టాలు. ఉపాసనా దృష్టికి మంత్రరూపాలు. వేదాంత దృష్టికి పరబ్రహ్మతత్వ ప్రతిపాదకాలు.

'సచ్చిదానంద' స్వరూపమైన పరబ్రహ్మ నారాయణుడే రాముడిగా అవతరించాడు. తారకమంత్రమైన 'రామ'వైభవం ఆయన లీలల్లో వెలుగులీనుతూ ఉంటుంది. కేవలం కథాపరమైన ఆదర్శాలను చూసేవారు, ఆ వెలుగులను గమనించటం క్లిష్టమే.

కానీ, ఆయా ఘట్టాల స్మరణ, పఠన, మనన, శ్రవణాల ద్వారా మనకు తెలియకుండానే ఆ మంత్రమహిమా రూపాల ప్రభావాలను పొందగలం. అందువల్లనే వారి చరితను పవిత్ర గ్రంథంగా పారాయణ చేసి అద్భుత ఫలితాలు సాధిస్తున్న వారున్నారు. ఆయా సన్నివేశాల్లోని రూపాలను విగ్రహాలుగా, చిత్రాలుగా మలచి, ఆరాధించి వాటి సాఫల్యాలను సాధించినట్లుగా వారి వారి అనుభవాలు- ప్రమాణాలు.

ఆనందతత్వాన్ని తెలియజేసే అర్థం 'రామ' నామ మంత్రంలో ఉంది. ఆ మంత్రాధిదేవతయైన జ్ఞానానందమూర్తి విష్ణువు చైత్రశుద్ధ నవమినాడు ఆవిర్భవించినట్లుగా రామకథా కావ్యాలు స్పష్టపరుస్తున్నాయి.

సంభవించింది మొదలుకొని అవతార పరిసమాప్తి వరకు బహువిధాల రామరూపాలు సాక్షాత్కరిస్తాయి.

1. బాలరాముడిగా కౌసల్యా దశరథులను సంతోషపెట్టిన మూర్తి. 2. విశ్వామిత్రుడివెంట యాగరక్షణకై బయలుదేరిన యజ్ఞరక్షక స్వరూపం. 3. శివధనుర్భంగం చేసి, సీతమ్మను చేపట్టిన కల్యాణరాముడు. 4. సీతాలక్ష్మణ సమేతుడై అరణ్యవాసం చేస్తూ అనేకమంది రుషులను అనుగ్రహించిన కృపాస్వరూపం 5. హనుమంతుణ్ని ఆదరించిన లక్ష్మణ సమేత రామమూర్తి. 6. ఖర దూషణాది రాక్షసులను, వాలి, రావణాది దనుజులను సంహరించిన వీరరాముడు. 7. విభీషణుడికి అభయమిచ్చిన శరణాగత వత్సలుడు. 8. పుష్పకాధిరూఢుడై అయోధ్యకు విచ్చేసిన విజయరాముడు. 9. అహల్యా శబరీ గుహాదులను అనుగ్రహించిన వాత్సల్యమూర్తి. 10. పరివారంతో సీతాసమేతుడై నెలకొన్న పట్టాభిరాముడు. 11. వేదాంత తత్వాన్ని చిన్ముద్రతో బోధిస్తూ దేవ, ముని సమూహాల నడుమ తేజరిల్లే తారకరాముడు.

... ఇలా కొన్ని రామరూపాలు రామగాథల్లో కనిపించే ధ్యానయోగమైన సుందరమూర్తులు.

మానవాతీతమైన సౌందర్యం, చెక్కుచెదరని ధర్మనిష్ఠ, కారుణ్యాన్ని వర్షించి కాపాడగలిగే అభయ తత్వంతో కూడిన ప్రసన్నత, అద్భుత మేధాశక్తి, పాలనాపటుత్వం కలిగిన రాజనీతిజ్ఞత, దుష్టత్వాన్ని నిగ్రహించగలిగే వీరప్రతాపం, ధర్మనిర్వహణ కోసం తన భోగాన్ని త్యాగం చేయగలిగే వైరాగ్యం... ఇలా అరుదైన ఎన్నో దివ్యగుణాలను వ్యక్తపరచిన రామకథా రీతిలో ఆ గుణాలతోపాటు ప్రస్ఫుటంగా భగవత్తత్వం ప్రకాశిస్తూనే ఉంది.

రామనవమి సందర్భంగా దేశం నలుచెరగులా రామారాధనలు వివిధ విధాలుగా జరుగుతుంటాయి. ప్రత్యేకించి, భద్రాద్రిరాముడి ప్రభావాన తెలుగునాట వాడవాడలా సీతారామ కల్యాణమూర్తులు చలువ పందిళ్లలో కొలువుతీరి అనుగ్రహిస్తుంటారు.

అటూ ఇటూ సీతాలక్ష్మణులు, పాదాల చెంత హనుమ... నడుమ కొలువున్న రామభద్రుడు- ఇది ప్రసిద్ధి చెందిన రామమూర్తి. మచ్చుకు ఈ మూర్తి ధ్యానంలోని సంకేత భావాలు గ్రహిస్తే, అన్ని మూర్తుల్లోనూ ఏవో పరమార్థాలు ఉంటాయనీ, ధ్యానించేవారిని ఆదుకుంటాయనీ బోధపడుతుంది.

'వామభాగాన సీతమ్మ, కుడివైపు లక్ష్మణస్వామి, ఆ వైపునే పాదాల వద్ద కూర్చున్న ఆంజనేయస్వామి... మధ్యన భాసిల్లే రాముడు'- అని భావం కలిగిన ధ్యానశ్లోకాలు ఉన్నాయి.

కుడివైపు శక్తికి, ఎడమవైపు భక్తికి రాముడే ఆలంబన. అందుకే వాటికి కేంద్రమై నడుమ ఉన్నాడు. ఆశ్రయించుకున్న శక్తి, అర్పించుకున్న భక్తీ ఆ జగదేక సార్వభౌముడి సొంతం. ఈ రమ్యభావమే ఈ నాలుగు మూర్తుల కొలువులో ధ్వనించే తత్వం.

ఈ విధంగా ప్రతి రామమూర్తీ శాస్త్ర సమ్మతమైన దివ్యభావాలకు సాకారమే. లక్ష్మణ సమేతంగా ఉన్న రాముడు రక్షాస్వరూపమని ఉపాసనా శాస్త్రాల హృదయం. 'నమోస్తు రామాయ సలక్ష్మణాయ' అని హనుమంతుడు నమస్కరించుకున్నాడు. హనుమత్సమేత రాముడు జ్ఞానానికీ, అభయానికీ వ్యక్తీకరణ. సీతమ్మతో రాముడు సర్వసంపదలకు అధినాథుడని భావం. మన జీవితాలను ధర్మసమ్మతంగా పాలించి, కరుణించే విష్ణుభావమే పట్టాభి రాముడు.

అన్ని భావాల రామచంద్రమూర్తి, మన హృదయాకాశంలో భాసించి అనుగ్రహించుగాక.

- సామవేదం షణ్ముఖశర్మ

ᐅ సాధనాత్రయం

 ᐅ సాధనాత్రయం

దైవాన్ని అన్వేషించడానికి మార్గాలేమిటి? పరమాత్మను తెలుసుకోదలచే సాధకులకు మార్గాలేమిటి? ఎలాంటి ప్రక్రియల్ని అవలంబించడం ద్వారా ఆత్మ దృష్టి పొందవచ్చు? ఏ విధివిధానాల్ని ప్రధానంగా ఆచరించడంవల్ల ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సాధకులు కొనసాగించవచ్చు? వీటన్నింటికీ సమాధానం- సాధనాత్రయం. అవే మౌనం, ధ్యానం, యోగం. ఈ మూడింటి సమ్మేళనం ద్వారా సాధకులకు ఆధ్యాత్మిక మార్గం సుగమం అవుతుంది. మౌన ధ్యాన యోగాలనే సాధనాత్రయం ద్వారా గుర్తించే విష్ణువు స్వరూపమే మాధవుడని మహాభారతం తెలియజెబుతోంది. సాధనా సంపత్తిని సాధకులు అందుకుని భక్తి సోపానాల్ని అధిరోహించడానికి మౌన ధ్యాన యోగాలు ఆలంబనగా నిలుస్తాయి.
మౌనమనేది నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఉపకరించే మహత్తర సాధనమని రమణమహర్షుల ఉవాచ. మాటలు నిగ్రహించి, మనలోకి మనం ప్రవహించడానికి, ఆత్మ వివేచనకు మౌనం దోహదపడుతుంది. దుఃఖాల్లో కలవరపడకుండా, సుఖాలపై ఆశ లేకుండా, అనురాగ భయ క్రోధాల్ని విడిచి, స్థిరమైన జ్ఞానం ఉన్న వ్యక్తిని 'ముని' అంటారని భగవద్గీత పేర్కొంది. ముని అవలంబించే కార్యం మననం. శాస్త్రబద్ధంగా, తర్కహితంగా చింతన చేయడమే మననం. శ్రవణం చేసినదాన్ని, పఠించినదాన్ని మననం చేయడం, వాక్కును వశంలో ఉంచుకోవడం- పరమాత్మ ఉనికిని తెలుసుకోవడానికి సాయపడే మొదటి సాధనగా విశ్లేషిస్తారు.

మనసుకు రాగద్వేషాది మలినాలు అంటడానికి కారణం లౌకికమైన వ్యవహారాల పట్ల అత్యాశ, అధిక ఆసక్తి. ఆ కల్మషాల్ని నిర్మూలించి మనసును శుద్ధిచేయడానికి ఉపకరించేదే ధ్యానమని పతంజలి యోగసూత్ర నిర్వచనం. ఆత్మ స్వరూపాన్ని ఏకాగ్రతతో చింతన చేయడమే ధ్యాన ప్రక్రియ అని ఆదిశంకరులు భాష్యం చెప్పారు. ధ్యాన సాధనవల్ల బుద్ధిలో ప్రసన్నత ఏర్పడి, మనసులో నిర్మలత్వం చోటు చేసుకుంటుంది. దీనిద్వారా భగవంతుడి దర్శనానికి అర్హత పొందవచ్చని ముండకోపనిషత్తు చెబుతోంది. 'మీ సమక్షం నుంచి నేను దూరంగా ఉండటానికి కారణం, మీరు నన్ను ఎల్లప్పుడూ ధ్యానం చేయడం కోసమే'నంటూ గోపికలకు ఉద్ధవుడి ద్వారా శ్రీకృష్ణుడు సందేశం పంపాడు. మననానికి సార్థకత చేకూర్చే ధ్యానం తత్వాన్ని మనసులో తదేకంగా నిలిపిఉంచుతుంది. అలౌకికమైన బ్రహ్మానంద స్థితిని పొంది, దైవంతో ఆత్మానుసంధానం చేసుకోవడానికి ధ్యానం ముఖ్య సాధనం.

ఆత్మలో చిత్తాన్ని ఏకాగ్రం చేయడమే యోగం. ఆత్మలో నిలిచిన చిత్తాన్ని చెదరకుండా, చిత్తవృత్తిని నిరోధించడం యోగంలో ప్రధాన భాగం. సమదర్శనమే యోగంగా భగవద్గీత చెప్పింది. బంకమట్టినీ, బంగారాన్నీ సమదృష్టితో చూసే తత్వమే యోగం. ఆ యోగాన్ని సాధించినవాడే యోగి. యోగీశ్వరుడైన వాసుదేవుణ్ని చేరే మూడోసాధనం యోగం. మౌన ధ్యాన యోగాలతోపాటు మనిషి మాననీయ, మానవీయ విలువల్ని పాటించినప్పుడే దైవానికి దగ్గరవుతాడు. మనో బుద్ధులు పవిత్రంగా, చిత్తం నిర్మలంగా ఉండాలి. నడవడి ఆదర్శంగా, ఆలోచనలు అభినందనీయంగా ఉండాలి. ఇతరులకు ప్రియకరంగా హితకరంగా భాసిల్లే సంభాషణల్ని పలకాలి. గర్వం, అసూయ, కపటం లేకుండా వ్యవహరించాలి. సేవాతత్పరత, దానం, ఉదారత, భూతదయ, అహింస వంటి లక్షణాల్ని వ్యక్తులు సహజాభరణాలుగా ధరించాలి. 'సర్వసుగుణాలు కలిగిన వ్యక్తులు, నా గురించి సాధన చేయాల్సిన అవసరం లేదు. నన్ను అన్వేషించే పనిలేదు. నేనే వారి హృదయంలో సదా నివసిస్తాను'- అని పరంధాముడు విష్ణుపురాణంలో పేర్కొన్నాడు. మనిషి, మనీషిగా మారడానికి చేసే ప్రస్థానమే- అసలైన ఆధ్యాత్మిక సాధన.

- డాక్టర్‌ కావూరి రాజేశ్‌పటేల్‌

ᐅ ఆనందో బ్రహ్మ

 ᐅ ఆనందో బ్రహ్మ

సుఖదుఃఖాలు శారీరక మానసిక అనుభూతులు. శారీరకమైనది సుఖం, మానసికమైనది దుఃఖం, ఆత్మకు చెందినది ఆనందం. ఆత్మానందమే బ్రహ్మానందం. ప్రతి మనిషీ ఆనందంగా ఉండాలనుకుంటాడు. కానీ, ఉండలేకపోతున్నాడు. ఎందుకని? ఆనందం తన సహజ స్వభావమనీ, తన సొంత సొత్తు అనీ మనిషి మరచిపోవడమే అతడి జీవితంలో విషాదానికి మూలకారణం.
పసిపిల్లల్ని చూడండి... ఎంత స్వచ్ఛంగా, ఆనందంగా నవ్వుతారో! మనం ఎందుకు అలా ఉండకూడదు? మనలో ఉన్న చిన్నపిల్లల మనస్తత్వాన్ని ఎప్పుడైతే, ఎక్కడైతే మనం వ్యక్తం చేయగలమో అప్పుడు, అక్కడ కూడా మనం సంతోషంగా ఉండవచ్చు. ఆనందం వెంటపడితే దొరికేది కాదు. అన్ని రుతువుల్లోనూ కోయిల కూయదు. వచ్చిన వసంత రుతువు అలాగే ఉండిపోదు. అదే విధంగా జీవితంలో అన్ని వేళలా ఆనందం లభించదు. అటువంటి అరుదైన ఆనందాల్ని వెతుక్కోవడం, సొంతం చేసుకోవడమే జీవితం!

మెదడు ఆనందాన్ని కేవలం గణించగలదు, గుణించగలదు. హృదయం మాత్రమే ఆనందాన్ని సృష్టించగలదు. ప్రేమను పొందాలంటే ముందుగా ప్రేమను పంచాలి. అలాగే ఆనందం పొందాలంటే ముందుగా ఆనందాన్ని పంచాలి. విషాదాన్ని పంచుకుంటే సగమవుతుంది. అదే ఆనందాన్ని పంచుకుంటే రెట్టింపు అవుతుంది.

మనం సుఖసంతోషాల్ని పూర్తిగా అనుభవించలేకపోవడానికి కారణం- దానిపై మనకున్న నిర్లక్ష్యం, లేనిదానిపై వ్యామోహం. కోరికలే దుఃఖ హేతువులు. కోరికలు ఎంత పెరిగితే, ఆనందం అంత తరుగుతుంది. కోరికలు ఎంత తరిగితే, ఆనందం అంత పెరుగుతుంది. కోరుకున్నదాన్ని పొందగలగడం అదృష్టమైతే, పొందగలిగినదాన్నే కోరుకోవడం ఆనందం. అసలు ఆనందమనేది, ఏమేమి పొందామనేదానికన్నా, ఏమేమి వదులుకోగలిగామన్నదానిపైనే ఆధారపడి ఉంటుందంటారు గాంధీజీ. దుర్యోధనుడికి అందరూ చెడ్డవాళ్లలాగా కనబడితే, ధర్మరాజుకు అందరూ మంచివాళ్లలాగా కనబడ్డారు. చెడు స్వభావంగలవాళ్లకు అందరూ చెడ్డవాళ్లలాగా కనబడితే, మంచి స్వభావంగలవాళ్లకు అందరూ మంచివాళ్లలాగానే కనిపిస్తారు. సౌందర్యం లేని లోటును మంచి స్వభావం భర్తీ చేస్తుంది. మంచి స్వభావం లేని లోటును సౌందర్యం ఎప్పుడూ భర్తీ చెయ్యలేదు. వయసు పెరిగేకొద్దీ ఇతరులకు మంచి చెయ్యడంలోనే ఆనందం ఉందన్న సంగతి తెలిసి వస్తుంది. ఇతరులకు సేవ చేయ్యడం ద్వారా ఆనందాన్నీ, తద్వారా ఆరోగ్యాన్నీ పెంచుకోవచ్చు. ప్రేమ ఉన్నచోట సేవ కూడా ఉంటుంది. రెండూ ఉన్నచోట ఆనందం ఉండి తీరుతుంది. నిజమైన ఆనందం ఇతరులను ఆనందపరచడంలోనే ఉందంటారు అవతార్‌ మెహర్‌ బాబా. ఆనందం పదవిలోనో, సంపదలోనో, వైభవంలోనో లేదు. నీ మనసులో, నీ ఆలోచనల్లో ఉంది. మనసును జయించినవారే ప్రపంచాన్ని జయిస్తారు. నరకంలో స్వర్గాన్ని, స్వర్గంలో నరకాన్ని సృష్టించుకునే శక్తి కేవలం మనసుకే ఉందంటాడు మిల్టన్‌.

ఏది జరిగినా సరే, అంతా మన మంచికే అనుకోవడమే ఆనందానికి అడ్డదారి. దొరికినదానితో తృప్తిపడితే అదే సంతృప్తి. సంతృప్తే ఆనందం, ఆనందమే ఆరోగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం.

అందాన్నీ, ఆనందాన్నీ, ఆరోగ్యాన్నీ పెంచి పోషించే అద్భుతమైన ఔషధం నవ్వు. అత్యంత అందమైన, అమూల్యమైన ఆభరణం చిరునవ్వు. రణాలను దూరంగా ఉంచే ఆభరణం చిరునవ్వు. ధరించినవారినే కాకుండా, దర్శించినవారిని ఆనందింపజేయగల మహత్తర మంత్రదండం చిరునవ్వు. పెదవుల మీద చిరునవ్వును చెరిగి పోనివ్వకుండా ఉంచుకోగలిగితే ఈ ప్రపంచంలో ఎవ్వరూ నీకంటే అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండరు. చిన్నపాటి సంతోషమైనా సరే- మనిషి జీవితకాలాన్ని పెంచుతుంది. అందుకే ఆనందమే అందం, అందమే ఆనందం. ఆనందమే జీవిత మకరందం.

జీవితం చలనచిత్రం లాంటిది. అది ఎంత పెద్దది అనేదానికన్నా, ఎంత బాగున్నది అనేదానికి ప్రాముఖ్యమిస్తే అంత హాయిగా జీవించగలుగుతాం. జీవితం ఓ సుందర సుమధుర స్వప్నం. దాన్ని సాకారం చేసుకోవడానికి- 'సంతోషాలను కూడు, దిగుళ్లను తీసివెయ్యి, స్నేహితులను హెచ్చించు, విరోధులను భాగించు.'

ఇదే, సుమధుర జీవనానికి సులభ సాధ్యమైన సూత్రం.

- గుజ్జుల వీర నాగిరెడ్డి

ᐅ కొత్త చిగుళ్లు

 ᐅ కొత్త చిగుళ్లు

సత్యం సనాతనమైనది. నిత్యనూతనమైనది. ఇప్పుడు మనందరికీ కొత్తదనం కావాలి. కొత్తగా చెప్పాలి. కొత్త కోణాలు తెరుచుకోవాలి. కొత్త భావాలతో అలరించాలి. పాతగా ఉంటే మనసు అంగీకరించదు. నమ్మదు. పురాతనమైన విషయమైనా నూతనంగా కనిపించాలి.
పాత సూర్యుడే. రోజూ కొత్తగా ఉదయిస్తాడు. కొత్తగా కనిపిస్తాడు. చంద్రుడూ పాతవాడే. ఒక్కో వెన్నెల ఒక్కోలాగా అనిపిస్తుంది. ఆ కొత్తదనం లేకపోతే హాయి ఉండదు. హాయి లేకపోతే సుఖం ఉండదు. సుఖం లేకపోతే అది ఎంత గొప్పదైనా ఎవరికి కావాలి?

కొత్తగా భూమ్మీదకు వచ్చిన శిశువుకు ఉండే సంరంభం వృద్ధుడైన పాత మనిషికి ఎలా ఉంటుంది? దేవాలయం ఎంత గొప్పదైనా శిథిలాలయం దగ్గరకు ఎవరు వెళతారు? శక్తి లేకపోయినా కొత్తగా కట్టిన ఆలయం వైపు పరుగులు తీస్తారు. కొత్త పాత అనే ఆలోచన మనిషిది కాదు. అతడి మనసుది. తైలధార లాగా ధ్యానం కొనసాగించాలి అంటే, కొన్నాళ్లకు ఆ ధ్యానం యాంత్రికమైపోతుంది. కొత్తయుక్తులతో, కుయుక్తులతో మనసును మభ్యపెట్టి ధ్యానంలో పెడితే అది ఎన్నోసార్లు కొత్త కొత్తగా మోసపోతుంది. అణిగిపోవడానికి సిద్ధపడుతుంది. చేస్తున్న పనిని పదేపదే చేయడం మనసుకు అసలు ఇష్టం ఉండదు. అందుకే అది కొత్తదనాన్ని కోరుకుంటుంది.

ద్వాపరయుగం నాటి పాత కృష్ణుడు కాకుండా ప్రస్తుత ఎలక్ట్రానిక్‌ యుగంలో అమిత వేగంతో ఆత్మజ్ఞానాన్ని బోధించే అధునాతన శ్రీకృష్ణావతార్‌ కావాలి. లేకపోతే త్రేతాయుగం నాటి నార బట్టల రాముడు కాకుండా మరో వంద సంవత్సరాలను దృశ్యీకరించే మెగా శ్రీరాముడు కావాలి.

రూపాలు కొత్తవి కావచ్చు. కాని వాటిని నడిపించే ఆత్మ పాతది. దీన్ని తెలుసుకోవాలనుకునే మనం మాత్రం కొత్త భావాలతోనే ఉండాలి. నిత్యం జీవధార లాగా ఉప్పొంగే విశ్వశక్తిని ఎప్పుడూ కొత్తగానే అనుభవించాలి. సరికొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండాలి.

ఎన్నిసార్లు చెప్పినా, విసుగురాని పాతపడని పదం ఒకటుంది. దాని పేరు దేవుడు. అదే సత్యం. అదే ప్రేమ. దాన్ని అందించే చేతులు కొత్తగా కనిపించాలి. దాన్ని పలికే నోరు అందంగా ఉండాలి. దాన్ని మనకు చూపించే వ్యక్తి మనలాగే ఇప్పటి దేశకాల పరిస్థితులకు సరిపోయినవాడై ఉండాలి. అప్పుడే ఆ సత్యం మన బుర్రకు ఎక్కుతుంది. అప్పుడే ఆ ప్రేమ మన శరీరంలోకి ప్రవహిస్తుంది. అప్పుడే ఆ దేవుడు మన స్నేహితుడు అవుతాడు.

అప్పటివరకు సంస్కృతంలో ఉన్న గొప్ప భావాలను తెలుగులో రచించి, శ్రీహరిని ఎంతో నూతనంగా ఆవిష్కరించి తీయనైన పద్యాలతో భాగవతాన్ని భక్తిరసామృతంగా మార్చి కొత్తదనాన్ని వెలయించిన పోతన ఎన్ని నూతన భావాలను దర్శించాడు!

కాలం మారుతుంది. తదనుగుణంగా సత్యం మారదు. కాని సత్యసారథులు మారుతుంటారు. మార్గాలు మార్చుతుంటారు. మన బుద్ధికి అనువైన రీతిలో కొత్తదారులు సృష్టిస్తూనే ఉంటారు. అర్జునుడిపై శ్రీకృష్ణుడికి ఉన్న ప్రేమ భగవద్గీతను సృష్టించింది.

కొత్తదనం తప్పూ కాదు. పాతదనం ఒప్పూ కాదు. పాతదనం అంగీకరించే కొత్తదనం కావాలి. అవ్యక్త, అనంత, అదృశ్య శక్తిమీదే అన్నీ ఆధారపడి ఉన్నాయి. ఆ శక్తి పాతదంటే పాతది కాదు. అలా అని కొత్తదీ కాదు. రెండింటికీ అతీతమైనది. కాలాతీతమైనది. మన అనుభవంలోకి రానంతవరకూ ఎన్నటికి తెలియనిది.

కొత్త చిగుళ్లు తిని కోయిల వసంత రాగాలు ఆలపించినట్లే మధుర భావాలు హృదయాన్ని ఆకట్టుకుంటాయి. ఏ విషయమైనా కొత్తగా చెప్పినప్పుడు ఎక్కువ మన్ననలు పొందుతుంది. కొన్నాళ్లకు అదే ప్రామాణికమవుతుంది. కొత్తనీరు రావటం, పాత నీరు పోవటం మనం చూస్తున్నదే కదా. నిత్యసత్యాలైన పరమ సత్యాలైనా ప్రకృతికి అనుగుణంగా నడవవలసిందే. కాదనలేం.

- ఆనందసాయి స్వామి

ᐅ మాటే మంత్రం

 ᐅ మాటే మంత్రం

మనసు, వాక్కు, శరీరం ఈ మూడింటికీ త్రికరణాలు అని పేరు. వీటిలో వాక్కుకు ఉన్న స్థానం విశిష్టమైనది.
వాక్కే అన్నింటికీ కారణమని రుషివచనం.
ఓ చల్లని మాట, ఓ హితమైన మాట వ్యక్తి జీవనవిధానాన్నే మార్చి, బాధాతప్త హృదయానికి శాంతిని ప్రసాదిస్తుంది. మనిషి మాట్లాడే మాట కేవలం జనులను మెప్పించడమే కాదు, ఆ భగవంతుణ్ని కూడా మెప్పించాలి. మాట్లాడే తీరును బట్టి మన సంస్కారం, సభ్యత బయటపడతాయి. అందుకే ఎవరి గురించి మాట్లాడినా చెడుగా మాట్లాడకూడదు.
జ్ఞానాభివృద్ధికి భాష ఎంతగానో ఉపయోగపడుతుంది. మంచి మాట జ్ఞానజ్యోతిని వెలిగిస్తుంది. భారతీయ పురాణాలు, ధర్మశాస్త్రాలు మాట మీద నిలబడాలనే ధర్మ నియమాన్ని నొక్కి వక్కాణిస్తున్నాయి.

సంభాషణ వల్లనే సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి అంటాడు రఘువంశ సృష్టికర్త కాళిదాసు. ముఖ్యంగా మాట సత్యంగా ఉండాలి. మాటలు మధురంగా ఉంటే ఎదుటివారు ఎంతసేపైనా వింటారు. అందుకే సంభాషణ ఒక కళగా చెబుతారు.

నీరు, అన్నం, మనిషికి ఎలా ప్రాణశక్తిని ఇస్తాయో, సుభాషితం కూడా అంతే విలువైనది. ఇతరులకు శాంతి కలుగుతుందని నమ్మకం ఏర్పడితేనే మన అభిప్రాయాలు చెప్పాలి.

శ్రీరాముడికి 'పూర్వభాషి' అనే పేరుంది. అంటే ముందుగా తానే పలకరించడమనే గొప్ప సుగుణం. అంతేకాదు 'వాక్య విశారదుడు' అని రాముణ్ని వర్ణిస్తాడు వాల్మీకి. మాటను మంత్రంలా భావించిన శ్రీరాముడు పితృవాక్యపరిపాలకుడిగా లోకంలో వాసికెక్కాడు. అందరికీ ఆదర్శ పురుషుడయ్యాడు. వాక్కుకు వ్యవహార ప్రయోజనమే కాక జీవితాలను బాగుచేసే శక్తి కూడా ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు ఏర్పడినా చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాలని పురాణాలు బోధిస్తున్నాయి. అందుకే ప్రతి మనిషి మాట మీద నిలబడి అందరి మన్ననలందుకోవాలి. సత్యవాక్కు నిలుపుకోవడం కోసం హరిశ్చంద్రుడు ఆలుబిడ్డలను అమ్మడానికి కూడా వెనకాడలేదు.

వాక్య కోవిదుడిగా హనుమంతుడు పేరు గడించాడు. అతడి మాటలకు శ్రీరాముడే ఆశ్చర్యపోయాడు. వెంటనే లక్ష్మణుడితో 'ఈ వ్యక్తి వేద వేదాంగాలను అభ్యసించాడని తెలుస్తోంది. మాటల్లో ఎక్కడా అపశబ్దం లేదు. ఇటువంటి వాణ్ని మంత్రిగా, దూతగా పొందిన పాలకుడు భాగ్యవంతుడు!' అంటాడు.

వాక్కుల ద్వారా గొప్ప పనులు సాధించిన వాళ్లున్నారు. హనుమంతుడు సీతాదేవికి తన వాక్కుల ద్వారా సాంత్వన కలిగించి ఆమె దుఃఖభారాన్ని పోగొట్టాడు. అలాగే శ్రీరాముడితో 'చూశాను సీతమ్మ తల్లిని...' అంటూ ఒక్క మాటలో విషయమంతా చెప్పి రాముడి మనసును తేలికపరుస్తాడు.

మాటల్లో శబ్దశక్తి కూడా ఉంది. ఆ శబ్దశక్తి రహస్యాలను గ్రహించి తద్వారా మంత్రాలను దర్శించారు రుషులు. అందుకే మాట ఓ ఆశీస్సుగా ఉండాలి. ఎవరైనా మధురంగా మాట్లాడాలి. మన మాట ఎదుటి వ్యక్తికి ధైర్యాన్ని, ఓదార్పును, స్పూర్తిని కలిగించాలి.

యుద్ధసమయంలో శరీరానికి తగిలే బాణాలను తెలివిగా తొలగించవచ్చు. కాని మనసును గాయపరచిన బాణాలను ఎవరూ తొలగించలేరని మహాభారతం చెబుతోంది. అందుకే ఎదుటి వ్యక్తి మనసును గాయపరిచేలా, హింసించేలా మాట్లాడకూడదు. అలాగే అశుభాలను శంకిస్తూనైనా మాట్లాడరాదు.

మూర్ఖుని హృదయం అతని నోట ఉంటుంది. జ్ఞాని నోరు అతడి హృదయంలో ఉంటుంది అంటాడు బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌. మాటను బట్టి వ్యక్తిత్వాన్ని, మనసును అంచనా వేయవచ్చు. సత్యంతో కూడిన వాక్కు దైవంతో సమానం. అలాంటి వాక్కును శ్రద్ధగా, జాగ్రత్తగా, అర్థవంతంగా అందరూ వినియోగించుకోవాలి. అప్పుడే వాక్‌సిద్ధి లభిస్తుంది. మన వాక్కు అందరికీ ప్రియమవుతుంది.

- విశ్వనాథ రమ

ᐅ పరీక్ష-ఫలితం

 ᐅ పరీక్ష-ఫలితం

పరీక్షలు దగ్గర పడ్డాయంటే- విద్యార్థులపై ఒత్తిడి; ఉపాధ్యాయుల హడావుడి, తల్లిదండ్రుల్లో కలవరం. ఒక పరీక్ష కాగానే ఇంకో పరీక్ష. రోజులు గిర్రున తిరిగిపోతాయి. పాఠ్యప్రణాళికలో లేని ప్రశ్నలు ఇచ్చారని విమర్శలు. ఫలితాలు తెలిసేదాకా నరాలు తెగే ఉత్కంఠ- ఇవన్నీ సామాన్య దృశ్యాలు.
ఈ లోకమే ఒక పరీక్ష స్థానం. అందులో మనమందరం అభ్యర్థులం. ప్రతిదినం, ప్రతిదానికీ పరీక్షే! దీనికి పాఠ్యప్రణాళికే లేదు. దీన్ని విమర్శించడానికి వీల్లేదు; విమర్శించినా నిరుపయోగం. జీవిత పరీక్షలో ప్రశ్నలకు సమాధానాలు తప్పనిసరి! ఏవో కొన్నింటిని ఎన్నుకొని, తక్కినవి వదిలేయడానికి వీల్లేదు. జీవిత పరీక్షతో పోలిస్తే విద్యార్థుల పరీక్షలు చాలా సులభం. జీవిత పరీక్షకు మనమిచ్చే సమాధానానికి ఫలితం ఎప్పుడు? వెంటనే రావచ్చు; ఆలస్యమూ కావచ్చు! ఒక జీవితకాలం పట్టవచ్చు! సమాధానం బట్టే ఫలితం. రాత పరీక్షలు, మౌఖిక పరీక్షలు ఉన్నట్లే 'చేతల' పరీక్షలూ ఉంటాయి. వాటిల్లో చెడ్డవి, మంచివి ఉండొచ్చు. సత్కార్యాలకు సత్ఫలితాలు, దుష్కార్యాలకు దుష్ఫలితాలు!

ఇతిహాసాల్లో ఇటువంటి పరీక్షలు, వాటి ఫలితాల గురించి అద్భుతరీతిలో చెప్పారు. సీతమ్మ అగ్నిపరీక్ష నెగ్గింది. అది లోకం కోసం జరిగిన పరీక్ష! సత్యహరిశ్చంద్రుడి జీవితంలో అడుగడుగునా పరీక్ష. పరీక్షాధికారి విశ్వామిత్రుడు. అన్ని ప్రశ్నలకూ హరిశ్చంద్రుడి సమాధానం మాత్రం ఒకటే- 'సత్యం'. విశ్వామిత్రుడు తన యాగానికి ధనం కావాలని హరిశ్చంద్రుని కోరాడు. ఇస్తాను తీసుకుపొమ్మన్నాడు. తరవాత వస్తానని వెళ్లిపోయాడు విశ్వామిత్రుడు.

హరిశ్చంద్రుడు వేటకు వెళ్లినప్పుడు మాతంగ కన్యలు తమను వివాహమాడమని కోరారు. హరిశ్చంద్రుడు అంగీకరించలేదు. విశ్వామిత్రుడు వచ్చి అడిగాడు. 'నా రాజ్యమైనా ఇస్తానుగాని, ఏకపత్నీ వ్రతం తప్పను!' అన్నాడు హరిశ్చంద్రుడు. 'అయితే నీ రాజ్యం ఇచ్చేయ'మన్నాడు మహర్షి. ఆడిన మాటకోసం తన రాజ్యాన్నే ధారపోశాడు హరిశ్చంద్రుడు. అక్కడినుంచి పరీక్షల పరంపర ప్రారంభమైంది. 'లోగడ నాకు ధనం ఇవ్వాలి గదా! ఇప్పుడు అవసరం వచ్చింది! ఇవ్వు!' అన్నాడు విశ్వామిత్రుడు. 'నేను అలా అనలేదు!' అనే సమాధానం ఇస్తే... ఇక కష్టాలే ఉండవు. కానీ, కష్టాలను ఇష్టంగా ఎదుర్కొని సత్యాన్ని కాపాడటానికే సంసిద్ధుడయ్యాడు హరిశ్చంద్రుడు.

హరిశ్చంద్రుడి వెంట నక్షత్రకుణ్ని పంపాడు రుషి. నక్షత్రకుడెన్ని విధాల చెప్పినా ఆడిన మాట తప్పడానికి హరిశ్చంద్రుడు అంగీకరించలేదు. నక్షత్రకుడు పెట్టిన బాధలను తట్టుకొని నిలిచాడు. కాశీనగరంలో కౌశికుడికి భార్యాపుత్రులను అమ్మి, అప్పటికీ- 'అప్పు' తీరక తనను కూడా అమ్ముకున్నాడు. వీరబాహువు అనే కాటికాపరి హరిశ్చంద్రుణ్ని కొనుక్కొని, ఆయనను శ్మశానంలో కాపలాగా ఉంచాడు. ఇంకోవైపు కుమారుడు లోహితుడు పాముకాటుకు ప్రాణాలు కోల్పోయాడు. భార్య చంద్రమతి కొడుకు కళేబరాన్ని శ్మశానానికి తెచ్చింది. కాటి సుంకం చెల్లించమన్నాడు హరిశ్చంద్రుడు. తన మంగళసూత్రం అమ్మి సొమ్ము తేవాలనిపోగా, ఆమెపై హత్యానేరం వచ్చిపడింది. శిరచ్ఛేదనం కోసం ఆమెను శ్మశానానికి తెచ్చి హరిశ్చంద్రుడి ఎదుట నిలుచోబెట్టారు భటులు... ఎన్ని పరీక్షలు! ఈ పరీక్షల పరంపర చూస్తే మనం పడే కష్టాలు ఏ మూలకు అనిపిస్తుంది ఎవరికైనా. విధిపెట్టే పరీక్షలు అవి. తానే భార్యకు శిరచ్ఛేదనం చేయవలసిన దుస్థితి హరిశ్చంద్రుడిది. దేవతలు ప్రత్యక్షమై హరిశ్చంద్రుడి సత్యవ్రతాన్ని ప్రశంసించారు. ఆయన అన్ని పరీక్షల్లోనూ నెగ్గి తుదకు 'సత్యహరిశ్చంద్రుడు' అనే ఖ్యాతిని యుగయుగాలుగా నిలుపుకొన్నాడు! 'అంతటి హరిశ్చంద్రుడికే తప్పలేదు తిప్పలు... మామూలు మనుషులం... మనమెంత!' అని తమకు తామే ధైర్యం తెచ్చుకోవడానికి ప్రతి వ్యక్తికీ ఉపకరించే చరిత్ర ఇది.

శిబి చక్రవర్తి కఠిన పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. బలి చక్రవర్తి దాన పరీక్షలో నెగ్గాడు. ప్రహ్లాదుడికి ఒక పరీక్ష పెట్టాడు హిరణ్యకశిపుడు. 'ఎక్కడ నీ హరి?' అని ప్రశ్నించాడు. 'అందు... ఇందు... ఎక్కడైనా ఉంటాడు!' అని సమాధానమిచ్చాడు ప్రహ్లాదుడు. 'ఈ స్తంభంలో ఉన్నాడా?' అని ప్రశ్నించాడు తండ్రి. 'ఉన్నాడు... చక్రి సర్వోపగతుడు' అని సమాధానం. ఇది ప్రహ్లాదుడి సిద్ధాంతం. ప్రయోగం- హిరణ్యకశిపుడే చేశాడు. ఫలితం? నరసింహస్వామి ఆవిర్భావం!

జీవిత పరీక్షలో విజయాలే కాదు. వైఫల్యాలూ ఉంటాయి. కర్ణుడు జన్మించినప్పటి నుంచీ... అన్ని పరీక్షల్లో విఫలుడయ్యాడు. అయినప్పటికీ అందరి సానుభూతి చూరగొన్నాడు. పరీక్షల్లో నెగ్గనంత మాత్రాన గుండె చెదరనవసరం లేదు; ధైర్యం దిగజారనవసరమూ లేదు. జయాపజయాలు దైవాధీనాలు. దైవోపహతులూ చరిత్రలో స్థానం సంపాదిస్తారు. ఆదర్శ జీవులుగా రూపొందుతారు. దానశీలురిలో కర్ణుడే ప్రథమగణ్యుడయ్యాడు. మైత్రీధర్మానికి అతడే గొప్ప ఆదర్శం. రాణా ప్రతాపుడు అనేక అపజయాలను ఎదుర్కొన్నాడు. ప్రియాతి ప్రియమైన 'చేతక్‌' అనే అశ్వరాజం యుద్ధంలో కూలిపోయింది. సర్వ సంపదలూ హరించుకొని పోయాయి. సైన్యం నాశనమైంది. అడవిలో గడ్డిరొట్టెలు తింటూ పడరాని పాట్లు పడవలసి వచ్చింది. ఇలా పాతికేళ్లు అనేక పరీక్షలు ఎదుర్కొన్నాడు. తుదకు పోయిన దుర్గాలన్నింటినీ వశం చేసుకొని, విజేతగా నిలిచాడు. నిరాశోపహతులైన వారందరికీ ప్రతాపుడి ధీరోదాత్త చరిత్ర కొండంత వూరటనిస్తుంది.

- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు

ᐅ ప్రపంచ స్వరూపం

 ᐅ ప్రపంచ స్వరూపం

చరాచరాలతో కూడి ఉన్న భూగోళం ఒక ప్రపంచం. ఈ ప్రపంచం అసలు రూపం ఏదని అడిగితే వేదాంతులు ఎంతో చక్కగా చెబుతారు. అసలు ఈ ప్రపంచం ఆత్మ, అనాత్మ అని రెండు విధాలుగా ఉంటుందని అంటారు. ఈ ప్రపంచం చేతనాచేతనాత్మకంగా ఉంటుందనీ, ఆత్మ లేకుంటే ప్రపంచం ఉనికి శూన్యమే అనీ అంటారు. అదెలా అంటే కదిలే జీవులన్నీ చేతనాలు. కదలకుండా ఉండేవి అచేతనాలు. కదిలేవి జంగమాలు. కదలనివి స్థావరాలు. కదిలే జీవులూ, కదలని స్థావరాలు అనేకంగా ఉన్నప్పుడు చేతనాచేతనాలు రెండే అని ఎలా అంటాం? అదే అడిగితే, మట్టి అనే ద్రవ్యం ఒక్కటే. కానీ అది కుండగా రూపొందినప్పుడు కుండ అనీ, విగ్రహంగా సిద్ధమైనప్పుడు విగ్రహం అనీ పిలుస్తాం కదా. అలాగే చేతనాచేతనాలు మనుషులు, జంతువులు, చెట్లు, పుట్టలు, గుట్టలు, నదులు, సముద్రాల వంటి అనేక రూపాల్లో ఉంటాయి. ఆత్మ ఒక్కటే అయినా కోట్ల కొలది రూపాల్లో పరిణమిస్తుంది. ఆత్మ ఏ శరీరంలో ఉపాధిని పొందుతుందో, ఆ రూపంలో కనబడుతుందని తాత్పర్యం.
ఆకాశంలో వెలిగే సూర్యుడు సముద్రంలో, నదిలో, తటాకంలో, బావిలో, కలశంలో ఏకకాలంలోనే కనబడతాడు. ఒకే సూర్యుడు ఇలా అన్నింటిలోనూ ఎలా కనబడుతున్నాడంటే ఒకే వస్తువు ఉపాధి భేదంతో అనేక రూపాల్లో కనబడుతూ ఉంటుందనేదే సమాధానం. ఒకే సూర్యుడు అనేకంగా ఎలా కనబడతాడో ఆత్మకూడా అలాగే తాను ఒక్కటే అయికూడా, ఉపాధులనుబట్టి అనేకరూపాల్లో కనబడుతుంది. సముద్రంలో ప్రతిబింబించిన సూర్యుడు, సముద్రజలాలు కదులుతున్నా, చల్లగా ఉన్నా సూర్యుడిలో కదలికలు గానీ, చల్లదనం కానీ ఎలా అంటుకోదో, అనేక జీవులరూపాల్లో ఆత్మ ఉన్నప్పటికీ ఆ జీవుల సుఖదుఃఖాలతోనూ, పాపపుణ్యాలతోనూ, మంచిచెడులతోనూ సంబంధం లేకుండానే ఉంటుంది. ప్రతిబింబంలో కనబడే వికారాలు బింబాన్ని తాకలేవు. అలాగే జీవాత్మల్లో అగుపడే వికారాలు పరమాత్మకు ఎంతమాత్రం అంటుకోవు. అందువల్ల జీవాత్మకూ, పరమాత్మకూ భేదం లేదు.

పరమాత్మ సత్యం. జీవాత్మ కల్పితం. అలా అయినప్పుడు కల్పితమైన జీవాత్మ, సత్యమైన పరమాత్మ ఎలా అవుతాడు? సముద్రంలోని నీళ్లు ఒకటే అయినా- తరంగాలూ, నురగలుగా కల్పితమైనాయి. జలం పరమార్థం. తరంగాలు, నురగలు వ్యావహారికాలు. కనుక పరమార్థంలో, వ్యావహారికం భాసిస్తున్నట్లే కదా. అలాగే చల్లదనం అనేది నీటికి గల గుణమైనా, తరంగాల్లోనూ అదే చల్లదనం ఉంటుంది. అదే విధంగా నురగలోనూ ఉంటుంది. నురుగు కెరటం లేకుండా ఉండదు. కెరటం నీరు లేకుండా ఉండదు. కనుక నీరు ఈ రెండింటికీ ఆత్మ. పారమార్థికం (సత్యం), వ్యావహారికం (లోకవ్యవహారంలో ఉండేది), ప్రాతిభాసికం (ఉన్నట్లు భాసిస్తూ ఉండేది) ఒకదాన్ని విడిచి మరొకటి ఉండదు. కనుక చరాచరాల రూపంలో ఎన్ని కనబడుతున్నా- అవన్నీ పరమాత్మకు ప్రతిరూపాలే కానీ, మరొకటి కాదు.

కనబడుతున్న ప్రపంచంలో ఎన్నికోట్ల జీవరాసులున్నా, అచేతన పదార్థాలున్నా అవన్నీ పరమాత్మలోని అంశాలేకానీ భిన్నమైనవి కావని తెలుసుకోవడమే ప్రపంచ స్వరూప పరిజ్ఞానం. ఈ సత్యాన్ని తెలుసుకుంటే ఆత్మతత్వం బోధపడుతుంది.

- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ

ᐅ పరాభక్తి

 ᐅ పరాభక్తి

భగవంతుని చేరుకునే మార్గాల్లో భక్తి ఒకటి. యోగమార్గంలో ప్రయాణించడం కష్టం. యోగసాధనకు శారీరక బలం కావాలి. ప్రపంచ బంధాలకు దూరంగా జీవించాలి. జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా భక్తిమార్గాన్ని అనుసరించవచ్చు. భయంనుంచి, లోభత్వంనుంచి ప్రభవించేది భక్తి కాదు. 'భగవంతుడా! నాకు ప్రాపంచిక సుఖాలపై మనసులేదు. నాకు జ్ఞానం వద్దు, ముక్తి వద్దు. అనేక వందల జన్మలు ప్రాప్తించినా నాకు కావలసింది నీ సేవలోని మాధుర్యం. అటువంటి వినిర్మల భక్తిసుధాధారలతో నా జీవితం పునీతం కావాలి. ఆ వరం మాత్రం ప్రసాదించు' అని నిజమైన భగవంతుడు తనలో తాను అంతరంగ ప్రార్థన చేస్తాడు.
భగవంతుడి పట్ల ప్రేమ అక్కడే ఆగిపోతుందని చెప్పలేం. అది ఇంకా పెరిగి, పరాభక్తిగా రూపాంతరం చెందుతుంది. పరాత్పరుడి పట్ల పరమోన్నత భక్తి అది. రూపాలు నశిస్తాయి. క్రతువులు అవసరం లేదు. పుస్తకాలను దాటిపోయే దశ అది. పరాభక్తి దివ్య భూమిక అందుకున్నవాడికి ఆలయాలు, మతాలు, విగ్రహాలు, శాఖలు, దేశాలు, కాలాలతో నిమిత్తం లేదు. ఈ అల్ప పరిమితులు, బంధాలు వాటంతట అవే రాలిపోతాయి. పరాత్పరుడు, పరాభక్తి తప్ప మరేమీ కనిపించదు. అతడి స్వేచ్ఛను ప్రపంచంలో ఏదీ హరించలేదు. ఏదీ అతణ్ని బంధించలేదు.

శక్తిమంతమైన అయస్కాంత పర్వతాన్ని ఒక ఓడ సమీపించినప్పుడు- ఇనుప వూచలు, తీగలు, మేకులు అన్నీ వాటంతటవే వూడిపోయి పర్వతానికి అతుక్కుంటాయి. చెక్క ఓడ మాత్రం నీటిపై తేలుతుంటుంది. అదేవిధంగా భగవంతుడి కృపవల్ల ఆత్మను బంధించిన కాంక్షావలయాలన్నీ తెగిపోతాయి. ఈ భక్తిమార్గంలో పోరాటం లేదు. కోరికల్ని అణచివేయాలన్న ఒత్తిడి లేదు. కాఠిన్యం లేదు.

భక్తుడు తన ఉద్వేగాలను అణగదొక్కాల్సిన అవసరం లేదు. వాటినన్నింటినీ తీవ్రతరం చేసి భగవంతుడి వైపు ప్రవహించేటట్లు చేస్తే చాలు. అంతకుమించిన పరాభక్తి లేదు. పరాభక్తిలో ఆత్మహింస లేదు. ఈ వల నుంచి దేన్నీ బలవంతంగా విడదీయనవసరంలేదు. పరాభక్తిలోని పరిత్యాగం స్వేచ్ఛగా ప్రవహించే స్రవంతి లాంటిది.

భక్తుడు తాను నివసించే నగరాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని ప్రగాఢంగా ప్రేమించవచ్చు. ఈ ఉదాత్త ఉద్వేగాలు, భావాలు తనకు అపకారం చేయకుండా ఏమాత్రం హింసించకుండా పరాభక్తిలో అంతర్ధానం అవుతాయి. ఎందరో దేశభక్తులు యోగులుగా మారి, సముజ్జ్వల జ్ఞానయోగంలో భక్తియోగంలో సమున్నత శిఖరాలు అధిరోహించారు.

భగవన్నామాన్ని జపించడం, క్రతువులు, రూపాలు, ప్రతీకలు, వాటి ఆరాధన- ఇవన్నీ ఆత్మను పరిశుద్ధం చేయడానికి మాత్రమే. అవే అంతిమ తీరాలు కావు. అన్నింటికన్నా మించినది ఆత్మ పరిత్యాగం. అది లేకపోతే పరాభక్తి కాంతిసీమల్లో అడుగుపెట్టడం అసంభవం. అదీ లేకపోతే మనిషి ఆధ్యాత్మికంగా పెరగలేడు. పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మనశ్శాంతి లభిస్తుంది. సత్యం, సౌందర్యం పలకరించి వెళ్లిపోతాయి. ఆత్మ మాత్రం ఉన్నచోటే ఉండిపోతుంది. ఎటువంటి పెరుగుదలా ఉండదు.

ఆధ్యాత్మిక సంస్కృతికి సోపానం, నిజమైన కేంద్ర పరిత్యాగం. అదే పరాభక్తి మూలవిరాట్‌ రూపం.

-  కె.యజ్ఞన్న

ᐅ విజయకాంక్ష

 ᐅ విజయకాంక్ష

ఈ నూతన సంవత్సరానికి 'విజయ' అని నామం.
సూర్యతేజస్సుకు సంబంధించిన విశేషాలే అరవై సంవత్సరాల నామధేయాలు. విశేషమైన జయం 'విజయం'. 'జయం' అంటేనే అనుకున్నదీ, సాధించవలసినదీ సాధించటం. ఇదే గెలుపు. ధర్మార్థ కామ మోక్షాలను సాధించే పరిపూర్ణతే 'జయం' అని శాస్త్ర నిర్వచనం. అలాంటి జయం విశేషంగా పొందడమే విజయం.

అనుకున్నది నెరవేర్చుకోవడమే కాక, ప్రతికూలతలను అధిగమించడమూ విజయమే. జీవితంలో ప్రతివారూ విజయాన్ని సాధించాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. 'విజయవంతమైన జీవితం' అనే మాటను వింటూ ఉంటాం. దానికి ఎవరి నిర్వచనం వారిది. వృత్తిరీత్యానో, వ్యాపారపరంగానో, రాజకీయంగానో గెలుపు సాధించడమే 'విజయం' అని నిర్వచిస్తారు చాలామంది. జీవితంలో అన్ని విలువల్నీ కాపాడుకుంటూ, అన్ని ధర్మాలనీ పాటించినప్పుడే అది 'విజయం' అవుతుంది. కుటుంబ బంధాలను, సామాజిక బాధ్యతలను, వ్యక్తిగత ఆరోగ్యాన్ని, సంస్కారాలనీ- ఇలా బహుకోణాల జీవితాన్ని నిర్వహించడం సామాన్య విషయం కాదు. అన్నింటినీ విజయవంతంగా సాధించగలిగితే దిగ్విజయమే. అలాంటి విజయాన్ని సాధించడానికి మనవంతు ప్రయత్నాలెన్ని చేసినా ఈశ్వరానుగ్రహం లేనిదే సాధ్యంకాదు. ఆ ఈశ్వరానుగ్రహాన్ని ఆకాంక్షించడానికై మనల్ని మనం శుద్ధిచేసుకొని (బాహ్యంగానూ, మానసికంగానూ) ఈ ఏడాది తొలి అడుగున ఆరాధించడం ఉగాది విశేషం.

ఉగాది కల్పానికి ఆది- అనే ధార్మిక శాస్త్రాల వాక్యాన్ని అనుసరించి 'ఆరంభ'పర్వంగా దీన్ని జరుపుకొంటున్నాం. మంగళకరమైన అలంకారాలతో, పవిత్రమైన దేవపూజతో సంవత్సర కాలమంతా శుభాలు కలిగించాలని భావించడం కొత్త వత్సరాది సంప్రదాయం. ప్రతి కాలమూ సూర్య స్వరూపమే అయినా ప్రత్యేకించి ఈ సంవత్సరం 'సూర్యదేవతాకం'. విశేషించి సూర్యారాధన, సూర్యగ్రహాధిదేవత అయిన శివుని అర్చన ఈ ఏడాది శుభఫలాలను ప్రసాదిస్తుందని కాల దేవతార్చన విధి తెలిపే శాస్త్రరీత్యా గ్రహించవచ్చు. కాలాన్ని పరమేశ్వర స్వరూపంగా భావిస్తూ, కాలాంగాలైన తిథి వార నక్షత్ర యోగ కరణాలను ఈ రోజున ప్రత్యేకించి భక్తిశ్రద్ధలతో వినడంవల్ల కాలం అనుకూలమవుతుందనే సంప్రదాయ భావన నేటి పంచాంగ శ్రవణంలో ప్రస్ఫుటమవుతుంది. నిత్యమూ ప్రాతఃకాలంలో పంచాంగాలను పలకకుండా ఏ శుభకార్యమూ భారతీయులు తలపెట్టరు. ఈ వేదాంగాల అధిదేవతలు ఆ రోజును 'శుభదినం'గా పరిణమింపజేయాలని ప్రార్థించడం ఆ సంకల్పంలో భావం. అయితే- కాలభాగాలు ఈశ్వర స్వరూపాలే కనుక, అవన్నీ దివ్యమైనవే అని ఎరుక కలిగిఉండాలి. ఏ కార్యానికి ఏ కాలం అనుకూలమో తెలుసుకోవడానికే పంచాంగశాస్త్రం. అగ్ని, జలంవంటివి ఆయా సందర్భానుగుణంగా ఆవశ్యకాలైనట్లుగానే- భిన్న ప్రయోజనాలకు విభిన్న కాల విశేషాలు.

'అగ్ని మొదలైన దేవతలు విధులకు; సూర్యచంద్ర కుజాది గ్రహాలు వారాలకు; అదితి మొదలైన వేల్పులు నక్షత్రాలకు అధిదేవతలు. కార్యఫలాలపై ఆధారఫలాలపై ప్రభావం చూపగలిగే శక్తి 'యోగ' విశేషాలకుందని శాస్త్రోక్తి.

పరిణామ స్వభావం కలిగిన కాలం శుభపరిణామాలు ఇచ్చేందుకు ఈ పంచాంగ దేవతల అనుగ్రహ ప్రాప్తికై వారిని స్మరించడం ఆనవాయితీగా ఈ పండుగను పెద్దలు ఏర్పరచారు. 'తిథి' శ్రవణంవల్ల సంపద కలుగుతుందని, 'వారం'వల్ల ఆయువు వృద్ధి చెందుతుందని, 'నక్షత్రం'వల్ల పాపం తొలగుతుందని, 'యోగం'వల్ల రోగనివారణ జరుగుతుందని, కరణంవల్ల 'కార్యసిద్ధి' చేకూరుతుందని- పంచాంగ శ్రవణఫలాన్ని సంప్రదాయ శాస్త్రాలు వ్యక్తపరుస్తున్నాయి.

కార్యసాఫల్యాన్ని కాంక్షించేవాడు ఈ అయిదింటి జ్ఞానంతో కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాడని జ్యోతిర్విజ్ఞాన హృదయం. పురాణ కాలగణనం ప్రకారం- ఈ ఏడాదితో కలియుగం ప్రారంభమై 5114 సంవత్సరాలైంది. గురువు రాజుగా ఉన్న ఈ సంవత్సరం గురుస్వరూపమైన సుజ్ఞానం మన బుద్ధులను నడపాలని శుభాకాంక్షిద్దాం. 'ఈ సంవత్సరం ఎలా ఉంటుంది?' అనే కుతూహలం సహజమే. కానీ, అందరికీ 'శుభం'గా ఉండాలని ఆశించడం ఉగాది కర్తవ్యం.

- సామవేదం షణ్ముఖశర్మ

ᐅ అగ్నిబీజం


 ᐅ అగ్నిబీజం

మనది వ్యవసాయ భారతం. వ్యవసాయం శ్రమకు, నిజాయతీకి, తిరుగులేని ఫలితానికి మారుపేరు, చిరునామా. మనం శ్రామికులం, వ్యవసాయ కార్మికులం. జీవన వ్యవసాయ క్షేత్రంలో బండలు మోసి కండలు తిరిగిన బలాఢ్యులం.
బీజం భరోసాకు చిహ్నం. ఒక బీజం లక్షలాది బీజాలకు తల్లి. భూమిలో బీజం నాటనిది ఫలాలనాశించే తత్వం కాదు మనది. ఎందుకంటే బీజం మనకు బలం. భరోసా. నిన్న మొన్నటి వరకూ మన సంస్కృతి అది. సంస్కారం అది. నేడు ఏమయింది?

ఏమిటీ దేశం! ఎలాంటిదీ దేశం! నీతి కోసం బతికిన జాతి ఇది. నీతికోసమే బలి అయిపోయే వినీతి ఇది. ఏమయిపోయింది? అవినీతి చీడపట్టి, పట్టించి నీతి బీజాన్ని నిర్వీర్యం చేశాం. నిస్తేజమైన జాతిగా మిగిలిపోయాం. 'డబ్బు జబ్బు' చేసి అవినీతిని ఔషధంగా సేవిస్తున్నాం. మనకు మనమే 'మకిలి అంటిన డబ్బు' అనే మాదక ద్రవ్యాన్ని సేవిస్తూ మత్తులో జోగుతున్నాం.

వ్యవసాయం అంటే కేవలం క్షేత్ర వ్యవసాయం కాదు. మన జీవితమే ఒక వ్యవసాయ ప్రయాణం. కలుపు తొలగించుకుంటూ, దుక్కితో దున్నుకుంటూ, నాగలితో నాటుకుంటూ, భూదేవిని, ఆకాశరాజును ఆరాధిస్తూ, జలయజ్ఞం (నేటి రాజకీయ యజ్ఞంకాదు) జీవితాన్ని స్వేచ్ఛగా పండించుకుంటున్నాం. అడుగడుగునా సంక్రాంతి పండుగ చేసుకుంటున్నాం. ఇప్పుడా? కాదు. ఎప్పుడో. అప్పుడెప్పుడో. బీజం నాటాక తప్ప పంట ఆశించని మనం, కష్టంతో మాత్రమే కండలు పెంచుకునే మనం అవినీతి మట్టి ఎత్తుకుని దొంగ కండలను కండలుగా భ్రమపడుతున్నాం. భ్రమ పెడుతున్నాం. ఎవరిని మెప్పించాలని, ఎవరిని మాయపుచ్చాలని? మన పిల్లలనా? అవినీతి అన్నంతో పెరిగిన పిల్లలు అజీర్తి పాలు కారా, అన్యాయమైపోరా? వాళ్లు నిజాన్ని గ్రహించిన రోజు, మనను నిలదీసే రోజు తల ఎక్కడ దాచుకుంటాం?

అవినీతి మన ఆనవాయితీ కాదు. ప్రతి ఐశ్వర్యాన్నీ 'నేటి నీతి' అంటూ తిరస్కరిస్తూ ఆత్మవరకూ సాగిన, సాగాలని ప్రపంచానికి నేర్పిన ఆత్మ ద్రష్ఠలం మనం. ఆత్మావశిష్ఠులం మనం. అలాంటిదిప్పుడు అవినీతి శునకాన్నా మనం ఆత్మ సింహాసనం మీద అధిష్ఠింపజేస్తున్నాం! మన ఆత్మ గౌరవానికీ, మన ఆభిజాత్యానికీ అది అవమానం! మన పెద్దలు శ్రమైక జీవన సౌందర్యాన్నెరిగినవారు. దాన్ని ఆరాధించినవారు. కండల కొండల మధ్య కష్టానికి నిదర్శనంగా జాలువారిన చెమట బిందువును అమృత సింధువులా ఆరాధించారు. అది శ్రమైక గంగ చిందిన బిందువు. అది చాలు మనకు.

ఈ ప్రపంచంలో, సమాజంలో మనం ఒక్కరమే వ్యాపారులం కాదు. ఉద్యోగులం కాదు. అధికారులం, నాయకులం కాదు. మనలాంటి ఎందరో. మనం అవినీతిని ఆశ్రయిస్తే, పెంచి పోషిస్తే, ఐశ్వర్యానికి పెట్టుబడిగా మలచుకుంటే, సమాజం మీద ఆ విషాన్ని చిందిస్తే మరి మనలాగే ఇతరుల ఆశల మాటేమిటి? అవినీతి సంగతేమిటి? మన పిల్లలు నెయ్యి మాత్రమే తింటారు. నూనె తినరని భరోసాతో మనం నూనె కల్తీచేస్తే, నెయ్యి వ్యాపారి మాటేమిటి? అతడి దురాశ సంగతేమిటి? మన పిల్లలు తినే నెయ్యి కల్తీచేయడా? మనం రోడ్ల నిర్మాణ రంగంలో ఉండి అవినీతికి పాల్పడితే, ఏదోరోజు ఆ రోడ్లమీదే మన పిల్లలు ప్రయాణించాలని మనకు అర్థంకాదా? మందుల తయారీ వ్యాపారంలో ఉన్న మనం మందులు కల్తీచేస్తే మన పిల్లల వ్యాధుల మాటేమిటి? ప్రభుత్వం పెట్రోలు, సిమెంట్‌, సరకులు, కూరలు, మందులు, మద్యం, పాలు, నీళ్లు... అవినీతిలో తప్ప కల్తీచేయని వస్తువే లేదు. పరిస్థితే లేదు. మనం మనుషులం కాదు. భస్మాసురులం. మన తలపై మనమే చేయి పెట్టుకుని భస్మమైపోతున్న భస్మాసురులం. మన చుట్టూ మనమే అవినీతి గూడు అల్లుకుని అందులోనే చిక్కుకుపోయి మరణిస్తున్న అకాల మర్త్యులం. వ్యర్థులం. ప్రపంచ దేశాలన్నీ మన నీతి, నిజాయతీ, ఆధ్యాత్మిక సంస్కృతి, వివాహ కుటుంబ వ్యవస్థలు చూసి తామూ అలా మారాలనీ, అమృతతుల్య సంస్కృతిని సొంతం చేసుకోవాలనీ మన దేశం వైపు ఆశగా ఆరాధనగా చూస్తూఉంటే- మనం ఇంత నికృష్ట స్థాయికి దిగజారుతూపోవటం ఎంత సిగ్గుచేటు!

పాలు మాత్రమే స్వీకరించి నీటిని వదిలేసే 'హంసల దీవి' మనది. ఎలాంటి పరిసరాల్లో ఉన్నా మాలిన్యం అంటకుండా పవిత్రంగా జీవించే 'తామరల కొలను' మనది. హిమాలయాలు మన కోటగోడలు. కైలాస పర్వతం మన గృహశిఖరం. గంగానది మన పవిత్ర స్నాన తీర్థం. తుంగ మన పానపాత్ర ఉదకం. కాశీ మన పూజా మందిరం. మనం జీవితాన్ని ఆచమన సదృశంగా స్వీకరించే మానసిక యతీశ్వరులం. జీవితం మనకు దైవప్రసాదం. మనకెందుకీ అవినీతి పెండలం? ప్రస్తుతం మన కర్తవ్యం మన హృదయాల్లో అవినీతికి వ్యతిరేకంగా అగ్నిబీజం నాటుకోవడం. అందరిలోనూ నాటడం. అది అవినీతిని అగ్నితప్తం చేసి అగ్నిపునీత సీతలా పవిత్రంగా తామరతంపరగా వెలికి వస్తుంది. రాబోయే కొత్త సంవత్సరానికి అవినీతి రహిత వ్యవసాయానికై అగ్నిబీజాన్ని సిద్ధం చేసుకుందాం. నాట్లకై హృదయ క్షేత్రాన్ని శుద్ధిచేసుకుందాం. మన పిల్లలకు అవినీతి రహిత సమాజాన్ని అందిద్దామని ఒట్టుపెట్టుకుందాం.

- చక్కిలం విజయలక్ష్మి

ᐅ రాజ్యాంతే నరకం ధ్రువమ్‌


 ᐅ రాజ్యాంతే నరకం ధ్రువమ్‌

మహాభారతంలో ఉన్న పద్దెనిమిది పర్వాల్లో ఆఖరిది స్వర్గారోహణ పర్వం. తన తమ్ముళ్లు నలుగురు, భార్య ద్రౌపదీ మృతులైన తరవాత, ధర్మరాజు సశరీరంగా స్వర్గం చేరటం ఈ పర్వంలో విషయం.
ధర్మరాజు లాంటి ధర్మపరుడికి కూడా కొద్దిపాటి నరకానుభవం తప్పలేదు. ఆ సందర్భంలో యముడు ధర్మరాజుతో 'నాయనా! రాజ్యపాలన చేసిన తరవాత ఎవరికైనా, నరకానికి కొంతకాలమైనా వెళ్లక తప్పదు. 'రాజ్యాంతే నరకం ధ్రువమ్‌' అని చెబుతాడు. ఇంద్రుడూ ఆ మాటే అంటాడు.

రాజు అంటే రాజే కాదు. ఏ రకమైన అధికారం అనుభవించినవారికైనా ఇది కొంచెం హెచ్చుతగ్గుల్లో వర్తిస్తుంది.

'అధికారాంతమునందు చూడవలెరా, ఆ అయ్య సౌభాగ్యముల్‌' అంటాడొక కవి- దంభం, భేషజం, అహంభావం, ఆడంబరం ప్రదర్శిస్తూ అధికారం చలాయించే అల్పబుద్ధులను గురించి. అధికార దర్పంతో లేనిపోని దర్జాలు వెలగబెట్టి, ఆ అధికారం పోయిన తరవాత ఆ సుఖాలూ సదుపాయాలూ అంతమైపోయి, అడుగులకు మడుగులొత్తే భృత్యులు లేక నానా నరక యాతనలూ భూమి మీదే అనుభవించేవాళ్లు లోకంలో కనిపిస్తూనే ఉంటారు. కానీ 'రాజ్యాంతే నరకం ధ్రువం' అంటూ చెప్పిన నరకం ఇది మాత్రమే కాదు.

అసలు రాజ్యాధికారమన్నా, అధికారమన్నా అర్థం ఏమిటి? సంక్రమించిన అధికారాన్ని న్యాయంగా, నీతి సమ్మతంగా, ధర్మబద్ధంగా నిర్వహిస్తేనే అది విధి నిర్వహణ. అందుకే అధికార నిర్వహణ కత్తిమీద సాము; విధుల నిర్వహణ సవ్యంగా చేస్తే సరే సరి. పుచ్చుకొన్న జీతభత్యాలకూ దానికీ సరిపోతుంది. పొరపాట్లు చేస్తే మాత్రం వాటికి శిక్ష తప్పదు! అన్ని బలహీనతలకూ ఆలవాలమైన సామాన్య మానవుడు, అధికార విధి నిర్వహణలో అత్యుత్సాహం వల్లో, ఆడంబర ప్రీతి వల్లో, ధర్మాధర్మ విచక్షణ మరచిపోవడం వల్లో పొరపాట్లూ తప్పులూ చేయడం చాలా సహజం. ఈ పొరపాట్లకు, అధికారాంతంలో ఏదో విధమైన శిక్ష అనుభవించాల్సి వస్తుంది. విధి అనే న్యాయమూర్తి న్యాయ నిర్ణయంలో, ప్రతి చర్యకూ ప్రతిచర్య తప్పదు కనుకనే 'రాజ్యాంతే నరకం ధ్రువం' అన్న సూక్తి.

'అధికార నిర్వహణలో పాపాలు ఎలాగూ తప్పవు కాబట్టి మానవుడైనవాడు అసలు రాజ్యాధికారం, ఇతర అధికారాలూ చేపట్టనే కూడదు' అని కాదు ఈ సూక్తికి అర్థం. అధికార విధులను ప్రమత్తత లేకుండా, ధర్మాధర్మ విచక్షణ కోల్పోకుండా, కొద్దో గొప్పో వైరాగ్య బుద్ధితో నిష్కామంగా నిర్వహించేందుకు సర్వదా ప్రయత్నించు, అని ఇతిహాసం చేస్తున్న హెచ్చరిక మాత్రమే.

మనిషి ప్రవృత్తికీ, స్వభావానికీ, చర్యలకూ కారణం సత్వరజస్తమో గుణాలనే గుణత్రయం. వీటిలో సత్యం పాలు ఎక్కువ ఉన్నవాడు మోక్ష విషయంలో ఎక్కువ ఆసక్తీ, లౌకిక విషయాల్లో తక్కువ ఆసక్తీ కలిగి ఇంద్రియ నిగ్రహంతో ప్రవర్తించగలుగుతాడు. ఈ సాత్వికత దేవతల్లో, దైవస్వరూపాల్లో ఎక్కువ. ఆధ్యాత్మిక సాధనలవల్ల మనిషి తనలో సత్వగుణాన్ని వృద్ధి చేసుకోవచ్చు. చేసుకోవాలి. ఎందుకంటే ఈ సాత్వికతకు ఫలం శాంతి.

రజోగుణం పాలు ఎక్కువైనవారికి లౌకిక విషయాల్లో ఆసక్తి, రాగద్వేషాలు, ఆగ్రహానుగ్రహాలు, ఆవేశ కావేషాలు ఎక్కువ కావటం చేత మనసునూ ఇంద్రియాలనూ నిగ్రహించలేరు. వీరి చిత్తం చంచలంగా, అశాంతిగా ఉంటుంది. లౌకిక వ్యవహారాల్లో మితిలేకుండా తలమునకలై తపిస్తుంటారు. ఆశ, అహంకారం, అస్థిమిత ప్రవృత్తీ... ఇవన్నీ రజోగుణ లక్షణాలు లేక రాజస లక్షణాలు. రజోగుణ ప్రవృత్తికి ఫలం దుఃఖమే అని నిర్ద్వంద్వంగా చెబుతోంది గీత. మానవజాతి రజోగుణ ప్రధానమైన సృష్టి. ఆ రజోగుణమే మనిషి దుఃఖాలకు, దుర్మార్గాలకు హేతువు. అదే మనిషిని సుఖభ్రాంతి అనే ఎండమావి వెనక పరుగెత్తిస్తుంది.

రాజ్యభారం మోసే రాజులు, అధికార నిర్వహణ చేసే అధికారులు, ఉద్యోగపు ఒత్తిళ్లలో సతమతమయ్యేవారు తమలో రజోగుణ ప్రకోపాన్ని గమనించుకొంటూ ఉండాలి. లేకపోతే రజోగుణబద్ధులై, ఆశామోహాల ప్రవాహంలో కొట్టుకుపోతూ, ధర్మాధర్మ విచక్షణ బలహీనపడి తెలిసి తెలిసీ తప్పులు చేసే ప్రమాదం ఉంది. రావణబ్రహ్మ, దుర్యోధనుడు లాంటి ఇతిహాస పురుషుల జీవితాలు నేర్పే నీతి ఇదే. అసత్యం, మోసం, పరహింస, ఆశ్రిత పక్షపాతం, అక్రమార్జన తప్పు అని తెలియనిదెవరికి? దాని ఫలితం అనుభవించక తప్పదని తెలియనిదెవరికి? ప్రయత్నపూర్వకంగా, విధి నిర్వహణలో, ధర్మ విషయంలో అప్రమత్తులుగా ఉండని రాజులకు 'రాజ్యాంతే నరకం ధ్రువమ్‌' అని మహాభారతం గుర్తు చేస్తున్నది.

- ఎం. హనుమంతరావు

ᐅ పంచభూతాత్మకుడు


 ᐅ పంచభూతాత్మకుడు

ప్రకృతిశోభ మనిషికి పులకింపు కలిగిస్తుంది. మనోహరమైన ఆకుపచ్చని తివాచీ పరచినట్లుండే మైదానాలు, విరగబూసిన పూల చెట్లు, ఏపుగా పెరిగిన వృక్ష సంపద చూసినప్పుడు- ఎలాంటివారికైనా మనసు ఆహ్లాదభరితం కాక మానదు. అందుకు కారణం మనిషి ప్రకృతిలో భాగం కావడమే! అతడి అణువణువూ ఇతర ప్రకృతి మూలపదార్థాల్లా పంచభూతాత్మకమై ఉండటమే! అందువల్లే మనిషంటే మనిషికి ఆకర్షణ కలుగుతుంది. తోడులేక మనిషి బతకలేడు. సాహచర్యం లోపించినప్పుడు సాంగత్యం కోసం మానవుడు పరితపిస్తాడు. లభించినది సత్సాంగత్యమైతే, ఆ సంగమం మరీ శోభిల్లుతుంది. పెంపుడు జంతువులూ మనిషికి నేస్తాలవుతాయి. కొందరు మొక్కలతోనూ అనుబంధం పెంచుకుంటారు. పంచభూతాత్మకుడు కాబట్టే మనిషి పశుపక్షి వృక్షాదులతో అనుబంధం పెంచుకొని ఆనందం అనుభవించడానికి ఇష్టపడతాడు.
ఆత్మానుబంధం ఎల్లలు లేనిది. ఖండాంతర వాసులైనా ఓ మహాత్ముడు అక్కడ ఉన్నాడంటే రెక్కలు కట్టుకొని మరీ వాలతారు. కలిసి ఆశీస్సులు పొందడానికి ఉత్సాహం చూపుతారు. ఆత్మతత్వానికున్న శక్తి అదైతే, మనిషి మనిషికి మధ్య బంధాన్ని పంచభూతతత్వం పరిపుష్టం చేస్తుంది. ఆ తత్వం సమపాళ్లలో ఉన్నప్పుడు అది ఆనందం ఆవిర్భావానికి కారణమవుతుంది. పాళ్లు వికటించినపుడు అశాంతి పుట్టుకొస్తుంది. ప్రకృతిలో అగ్నితత్వం ప్రకోపించి అగ్ని ప్రమాదాలు, వరుణతత్వం ప్రకోపించి వానలు-వరదలు, భూతత్వం ప్రకోపించి భూకంపాలు-సునామీలు, ఆకాశతత్వం ప్రకోపించి ఉరుములు-పిడుగులు, వాయుతత్వం ప్రకోపించి తుపానులు-హరికేన్లు ఏర్పడటానికి కారణం కావడం చూస్తున్నాం. హోమియోవైద్యంలో మూల ఔషధ పదార్థ నిష్పత్తిని తగ్గించుకుంటూపోయి, పొటెన్సీల విలువ పెంచుకొని ఔషధ నిర్మాణం చేసినట్లు- పంచభూతతత్వంలోని మౌలిక అంశాన్ని కట్టడిచేసుకొని మానవుడు ఆనందాన్ని ఆవిర్భవింపజేసుకోవచ్చు. ఆకాశతత్వమైన శబ్దాన్ని నియంత్రించి పరమ పవిత్రమైన ప్రశాంత వాతావరణాన్ని కల్పించుకొని సాధకుడు మౌని కావచ్చు. మౌనతత్వాన్ని ఇంకా నియంత్రించి రుషి, రుషితత్వాన్ని నియంత్రించి మహర్షి, ఆ తత్వం నుంచి బ్రహ్మర్షిత్వాన్ని మనిషి పొంది సాధనను పరిపక్వం చేసుకోవచ్చు. ఒక తత్వం నుంచి వేరొక తత్వం వైపు పయనించే క్రమంలో మనిషి మహోన్నతుడిగా రూపాంతరం చెందుతాడు.

రక్త సంబంధానికి అతీతంగా చిన్నపిల్లలు పెద్దల వాత్సల్యానికి పాత్రులవుతారు. సంబంధ బాంధవ్యాలు లేకపోయినా స్పందించి చిన్నారులను ఆప్యాయంగా పలకరించి, చేరదీసి ఆనందం అనుభవించేందుకు పెద్దలు ఇష్టపడతారు. కారణం వారందరిలో మూర్తీభవించి ఉండే పంచభూత తత్వమే. అదే దివ్యత్యానికి చిరునామా! పంచభూత ప్రకృతిలో భాగమైన మానవుడూ సహజంగా పంచభూతాత్మకుడే! ఆ అమరిక అద్దంలో ప్రతిబింబంలా మనిషి ప్రకృతిలో స్వస్వరూప దర్శనం చేయడానికి ఉపకరిస్తుంది. ఆ అనుభవం సకల ప్రాణికోటికీ ప్రేమానురాగాలు పంచేందుకు తోడ్పడుతుంది. ఆత్మసాక్షాత్కారానికి అది తొలిమెట్టు. ఆ లక్ష్యం సాధించిన సాధకుడి అణువణువునా ఆత్మానందం వెల్లివిరుస్తుంది. తనకంటూ ఓ ప్రత్యేక ఉనికి ఉన్నా, జాతి కుల మత వర్ణాలకు అతీతమైన ఎల్లలు లేని పంచభూతాత్మక విశ్వంభరశక్తిలో సాధకుడు లీనమైనప్పుడు తనకు ఓ ఉపాధీ, ఉనికీ ఉండీ లేనివాడే! పంచభూతాత్మకమైన విశ్వశక్తిలో మనిషి ఓ పరమాణువు కావడమే అందుకు కారణం!

- గోపాలుని రఘుపతిరావు

ᐅ జిహ్వ చాపల్యం


 ᐅ జిహ్వ చాపల్యం

నాలుక రుచులను కోరుకొంటుంది. రుచి నోటివరకే పరిమితం. గొంతు దిగితే... పదార్థానికి రుచి ఉండదు. బొడ్డూడని బిడ్డకు సైతం రుచులు తెలుస్తాయి. పుట్టి, నేల మీద పడ్డ లగాయతు, కట్టె కాలేదాకా రుచులపై యావ చావదు. దీన్నే ముచ్చటగా 'జిహ్వచాపల్యం' అంటారు. ఏదో ఒక రుచినే ఇష్టపడేవారు కొందరైతే, అన్ని రుచుల్నీ ఆప్యాయంగా ఆస్వాదించే రసజ్ఞులు మరి కొందరు! శశిరేఖా పరిణయం చేయడానికి వచ్చిన ఘటోత్కచుడు వంటగదుల్లోంచి వెలువడ్డ భోజన పరిమళాలను ఆఘ్రాణించి తట్టుకోలేకపోయాడు. వివాహ భోజనంలోని లడ్లు, అరిసెలు, బూరెలు, గారెలు... గోంగూర పచ్చడితో సహా తృప్తిగా లాగించేసి గర్రున తేన్చాడు. రామాయణం కుంభకర్ణుణ్ని 'తిండిపోతు' అని అభివర్ణించింది. నాలుకకు తృప్తిగా భోజనం చేయడం, నేత్రాలకు పరితృప్తిగా నిద్రపోవడం- ఇవే జీవిత పరమార్థంగా భావించేవారిని 'కుంభకర్ణులు'గా సమాజం పరిహసిస్తుంది.
జిహ్వచాపల్యమే చేప ఉసురుకు ఎసరు తెస్తుంది. గేలం కొక్కానికున్న వానపామును భక్షించడానికి వచ్చిన మత్స్యం చివరికి మనిషి కుక్షికి బలి అవుతుంది. ఎడారిలో ఒంటెకు తిండి దొరకదు. అక్కడుండే ముళ్ల పొదలనే ఆరగిస్తుంది. వాటిని నమిలేటప్పుడు నోట్లో ముళ్లు గుచ్చుకొని రక్తం స్రవిస్తుంది. ఆ నెత్తుటినే గుటకలేస్తూ 'ఆహా! ఈ ముళ్ల పొదలెంత రుచిగా ఉన్నాయి! ఇంకా తింటా!' అంటూ ఒంటె ముట్టె ముందుకు చాపుతుంది. మేక మాంసం రుచి మరిగిన మృగరాజు, అది తనకు ఎర అయిన విషయం ఎరుకలేక, వేటగాడి వలలో చిక్కుకుంటుంది. జీవులను భక్షించే వృక్షాలూ ఉన్నాయి. పూలలోని తేనెకోసం ఆశపడి వాలిన కీటకాలను హతంగావిస్తాయి. ఇవన్నీ స్వాహా కావడానికి కారణం వాటి జిహ్వచాపల్యమే! ప్రాణులన్నీ నాలుక కోరికకు దాసోహమంటున్నాయి. తుదకు బలి అవుతున్నాయి. నాలుకను జయిస్తే నలుదిక్కులనూ జయించినట్లే! కొన్ని అభిరుచులు వయసుతో పుడతాయి. వయసుతోనే అంతరించి పోతాయి. చచ్చేదాకా చావనిది ఏదీ? రుచులపై కోరికే!

మహాత్ములు సైతం రుచులను చంపుకోలేక వంపులు తిరిగారు. శ్రీనాథ కవి సార్వభౌముడు జీవిత చరమాంకంలో బతకడానికి నానా పాట్లు పడ్డాడు. కర్ణాటకం పర్యటించాడు. అక్కడ అసలు భోజనమే కరవైంది. ఒకప్పుడు బంగారు పళ్లెంలో, రాజుల సరసన, రసవత్తరమైన రుచుల్ని ఆస్వాదించిన రసన ఆయనది. కడకు, చల్లా అంబలి తాగాల్సి వచ్చింది. వెల్లుల్లి తెలకపిండి కలుపుకొని మింగాల్సి వచ్చింది. వాటితోనే సర్దుకొని భోజనం అయిందనిపించాడు. 'తల్లీ! కన్నడ రాజ్యలక్ష్మీ దయలేదా నేను శ్రీనాథుడన్‌' అని ఎంత వేడుకున్నా ఫలితం లేకపోయింది. పలనాడుకు పోతే అక్కడ సొద్దజొన్న కూళ్లు తప్ప సన్నన్నం సున్నా! 'రుచులు దోషం'- అని గ్రహించినవారే ధన్యాత్ములు. ఆ మహాత్ములు బతకడానికే భుజిస్తారు. భుజించడంకోసం బతకరు. కాబట్టే వాళ్లకు రుచులతో పనిలేదు. ఈ సూక్తి చెప్పడం సులభమే! ఆచరించడం చాలా కష్టం. రుచులు మరచి పొమ్మని చెప్పినంత తేలికకాదు ఆచరించడం.

జంతువులకంటే భిన్నమైన గుణం మనిషిలో ఒకటి ఉంది. చెరసాలలో వేసినా 'నాకు రుచికరమైన భోజనం పెట్టాలి' అని గోల చేసే జీవి మనిషి మాత్రమే! ఏ జంతువునైనా బంధిస్తే అది ఆహారం మాని కూర్చుంటుంది. 'ధనపాలక' అనే ఏనుగు తిండి తినడం లేదని బుద్ధుడికి శిష్యులు విన్నవించుకున్నారు. 'ఏ ప్రాణినైనా బంధిస్తే దానికి మానసిక బాధ కలుగుతుంది. తిండికంటే స్వేచ్ఛ జంతువుకు ముఖ్యం' అని బుద్ధుడు ప్రబోధం గావించాడు. సామాన్యంగా మనిషి ఆలోచన ఎలా ఉంటుంది? 'నేను జీవించినన్నాళ్లూ కడుపునిండా తినాలి. నా కుటుంబానికీ ఈ విషయంలో లోటు ఉండకూడదు. నా తరవాత కూడా, తరతరాలూ కూర్చుని హాయిగా తినడానికి సరిపడా ఎడాపెడా సంపాదించాలి!' ఆ ఆలోచనే మనిషిని అవినీతి సంపాదనవైపు మళ్లిస్తుంది. అందులోనుంచే 'తిను-తినుపించు' అనే దురాలోచన ఉద్భవిస్తుంది! బుద్ధుడు ఈ ప్రమాదాన్ని పసిగట్టాడు.

'ప్రతిరోజూ భిక్షాటనకు వెళ్లి కాలం వృథా చేయడం ఎందుకు? ఆ సమయాన్ని ధ్యానానికి ఉపయోగించడం మంచిది గదా!' అనుకున్నాడు ఒక బౌద్ధ భిక్షువు. ఆరోజు ఎక్కువ ఇళ్లకుపోయి భిక్షతెచ్చుకొని, కొంత తిని, మిగతాది మూటగట్టి దాచిపెట్టుకున్నాడు. మరుసటిరోజు ఆ మిగిలిన భిక్షంపై నీరుచల్లుకొని తిన్నాడు. తోటి భిక్షువులు ఇది చూసి సహించలేక పోయారు. 'అతడు భిక్షం అధికంగా తెచ్చుకొని, దాచిపెట్టుకొని మరీ తింటున్నాడు' అని బుద్ధుడికి చెప్పారు. ఆ భిక్షువు నిజాయతీ బుద్ధ భగవానుడికి బాగా తెలుసు. కానీ, సమాజానికి తెలియదు గదా! ఎంత నిజాయతీపరుడైనా సరే, కావలసిన దానికంటె ఎక్కువ పోగు చేసుకోకూడదు. నాటినుంచి బుద్ధుడు తన శిష్యులకు నియమం పెట్టాడు. 'మనకు ఆ దినానికి కావలసినంతే భిక్షం తెచ్చుకోవాలి. అవినీతి, అన్యాయమూ కాకపోయినాసరే- కావలసినంతకంటె ఎక్కువ సేకరించి, దాన్ని దాచి పెట్టుకోకూడదు' అని!

తిండి విషయంలో ఉత్తములకు సైతం పరిమితి అవసరం. మనకు కావలసిన దానికంటె ఎక్కువ తినడం అంటే ఇతరుల ఆహారాన్ని మనం ఉపయోగించుకున్నట్లే! మహా ప్రస్థాన పర్వంలో పాండవులు వరసగా కూలిపోతూ ఉండే ఘట్టం ఉంది. నకుల, సహదేవ, అర్జునుల తరవాత భీముడూ పడిపోసాగాడు. 'అన్నయ్యా! నేను మహా బలశాలినే! అయినా ఇలా కూలిపోవడానికి కారణం ఏమిటి?' అని ప్రశ్నించాడు. 'నాయనా! నీకు తిండి యావ ఎక్కువ. అమితంగా తినడం అనే దోషం చేత నువ్వు పడిపోయావు!' అని ధర్మరాజు భీముడి మరణానికి కారణం చెబుతాడు.

- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు

ᐅ ఎవరా సృష్టికర్త


 ᐅ ఎవరా సృష్టికర్త?

మనం విజ్ఞానయుగంలో ఉన్నాం. నేను, నాది, నాచేత- అన్న అహంభావం ఆకాశందాకా విస్తరించింది.
మనిషి పక్షిలా ఎగురుతున్నాడు. చేపలా నీటిలో మునకలు వేస్తూ ఆనందిస్తున్నాడు. చంద్రుడిపై అడుగుపెట్టాడు. అనూహ్యమైన విజయాలను సాధించాడు. ఇంత గొప్పగా ఎదిగిన మనిషి రక్తాన్ని తయారు చేయగలడా? ఎముకలను సృష్టించగలడా? పోనివ్వండి- చిన్న చీమను సజీవంగా సృష్టించగలడా? మన చుట్టూ ఉన్న విస్మయకారక పరిసరాల ఆంతర్యాన్ని తెలుసుకోగలడా? అయితే- నేను, నావల్ల అన్న మాటలన్నీ అర్థహీనం కదా?
ఒక ఆశ్రమం ఉండేది. ఎందరో విద్యార్థులు, శిష్యులు, ఆశ్రమాధిపతి అనురాగాన్ని అందుకొన్నారు. ఒక సాయంత్రం, స్వామి పూలతోటలో తిరుగుతూ, ఒక పూవు మీద కూర్చున్న తుమ్మెదను చూస్తూ నిలుచున్నారు. అరగంట దాకా ఉండటం గమనించి, శిష్యులు స్వామి చుట్టూ చేరారు. 'స్వామీ, సీతాకోక చిలుకలను చూస్తున్నారా? వాటి రంగులను చూస్తున్నారా?' అని అడిగారు.

స్వామి సమాధానమిస్తూ 'చిత్ర విచిత్రాలైన సీతాకోక చిలుకలను సృష్టించిన భగవంతుడి కళాత్మకతను ఆశ్చర్యంతో గమనిస్తున్నాను. ఇటువంటి జీవులను సృష్టించే శక్తి మానవుడికి ఉందా? ఒకవేళ సృష్టించినా అది నిర్జీవంగానే ఉంటుంది. దేవుడు ఈ సీతాకోక చిలుకకు వర్ణవైవిధ్యాన్ని, విహరించే శక్తిని ప్రసాదించాడు. ఈ పూవులకు వివిధ రంగులు, లోపల మకరందం, సువాసన ప్రసాదించాడు. సృష్టికర్త చాతుర్యం అద్భుతం. అనన్యం, అపారం' అన్నారు.

స్వామివారి మాటలు విని శిష్యులు అవాక్కయ్యారు. 'మేము ప్రతి దినం తుమ్మెదలను చూస్తున్నాం. కానీ, ఏనాడూ మీలాగా పరిశీలించలేదు. వీటిని సృష్టించిన దేవుడి గురించి కూడా ఆలోచించలేదు. ఇంత ఆనందం ప్రసాదించగలరని ఏనాడూ వూహించలేదు' అన్నారు. అప్పుడు స్వామి అందరినీ కలయచూసి, 'దేవుడు పూజామందిరంలో మాత్రమే ఉన్నాడని భావించరాదు. అతడు విశ్వమంతటా వ్యాపించి ఉన్నాడు. సూర్య, చంద్ర, భూమి, ఆకాశం, చెట్టు, చేమ, నది, సముద్రం, పశుపక్ష్యాదులు అన్నింటా, అంతటా వ్యాపించి ఉన్నాడు... వాటిని చూసి ఆనందించే అభ్యాసాన్ని అలవరచుకోవాలి. అప్పుడు జీవితం నిత్యోత్సవం కాగలదు. ప్రతి నిమిషం ఆనందమయమవుతుంది' అంటూ వివరించారు స్వామి.

విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ నోబెల్‌ బహుమతి అందుకొని తిరిగి వస్తున్నారు. నౌకలో ప్రయాణం చేస్తూ, పైభాగంపై నిలుచుని సముద్రాన్ని చూస్తున్నారు. ఐన్‌స్టీన్‌ ప్రతిభను గురించి దేశదేశాలవారు ప్రశంసలు గుప్పిస్తున్నారు. తోటి ప్రయాణికులు వారిని మాటల్లోకి దించారు.

నోబెల్‌ పురస్కారాన్ని అందుకొన్న తాము చాలా గొప్పవారని ప్రశంసించారు. అందుకు వెంటనే ఐన్‌స్టీన్‌ 'మీరు నన్ను గొప్పవాడనటం సముచితం కాదు. మన చుట్టూ ఉన్న సముద్రంలోని అపార జలరాశి, ఘోషించే సముద్రం, కనిపించే సాగర తరంగాలు అపారమైన లోతు- వీటినన్నింటినీ గమనించండి... ఆ సృష్టికర్త ఎంత గొప్పవాడు! అతడి ముందు నేనెంతటివాడిని!' అంటూ సృష్టికర్త భగవంతుణ్ని కొనియాడాడు ఐన్‌స్టీన్‌.

'ఎందెందు వెదికి చూచిన అందందే గలడు- చక్రి సర్వోపగతుండు' అన్న పోతన మహాకవి వాక్కులో పొల్లులేదు. వైజ్ఞానిక రంగంలోని మహనీయులనూ ఈ సృష్టి వైచిత్య్రం ఆశ్చర్య చకితుల్ని చేస్తుంది.

ఒక సభలో రేడియో నిర్మాత గుగ్లెల్మొ మార్కొని 'రేడియో తరంగాలు ఆకాశంలో వేలాది మైళ్లు ఎలా పయనిస్తాయి?' అని ప్రశ్నించాడు. రేడియో తరంగాలను గురించి మరికొన్ని ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తల్లో జగదీశ్‌ చంద్రబోస్‌ కూడా ఒకరు. మార్కొని 'ఈ తరంగాలు ఎలా పయనిస్తాయో అన్న విషయాన్ని శాస్త్రీయంగా చెప్పగలను. కానీ ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేను. ఆ రహస్యం సృష్టికర్తకే తెలుసు' అన్నాడు.

ఈ ప్రపంచంలో మనం తెలుసుకోవలసిన ముఖ్యవిషయాలు రెండు... ఒకటి ప్రకృతి నిరూపించిన నియమబద్ధ వ్యవస్థ లేదా నియతి. రెండోది మానవ స్వభావం. ప్రకృతి నియమబద్ధంగా వ్యవహరిస్తుంది. మార్పునకు వీలులేదు. ఆ వ్యవస్థలో ఏమాత్రం వ్యత్యాసం కానవచ్చినా ఘోర పరిణామం తప్పదు. మనం బతకడానికి గాలి, నీరు, వెలుగు మొదలైన పంచభూతాలు నియమబద్ధంగా ఉండటం వల్లనే మనం జీవిస్తున్నాం. ప్రకృతి మనకు దేన్నీ ఉపదేశించదు. మన దారిని మనమే అన్వేషించుకోవాలి.

మనిషి అహంకారం వదిలిపెట్టి చరాచర సృష్టి అంతా పరమాత్మ శక్తి అని విశ్వసించాలి. ఈ ప్రకృతి వివిధ రూపాల్లో, వివిధ దశల్లో సాక్షాత్కరించే 'దైవశక్తి' అని అర్థమవుతుంది. ఆ దైవశక్తి సాక్షాత్కారానికి యత్నించాలి.

ఒకమారు సోక్రటీస్‌ దీర్ఘంగా ఆలోచిస్తూ రహదారిపై నడుస్తున్నాడు. నడుస్తున్నప్పుడు అటూ ఇటూ చూసేవాడు కాడు. పరధ్యానంగా వస్తున్న సోక్రటీసును ఒక అధికారి ఢీకొన్నాడు. 'ఎవరు నీవు' అని అధికారి కోపంతో సోక్రటీసును అడిగాడు. సోక్రటీసు నెమ్మదిగా 'నేను, ఎవరో తెలుసుకోవడానికే ప్రయత్నిస్తున్నాను!' అన్నాడు.

ఈ 'నేను' అనేది అందరిలోనూ ఉంది. కాబట్టి నేనును గుర్తిస్తే 'సర్వం' గుర్తించేవారు కాగలరు. ఈ సర్వం తనలోనే ఉన్నదని గుర్తించి అదే దివ్యత్వమని విశ్వసించి వ్యవహరించినప్పుడు నరుడు నారాయణుడు కాగలడు.

- డాక్టర్‌ జానమద్ది హనుమచ్ఛాస్త్రి

ᐅ లోపాలు


 ᐅ లోపాలు

ప్రతి మనిషిలో లోపాలు ఉంటాయి. లోపాలు లేనివాడు ప్రపంచంలో లేడు, ఉండడు. లోపాలు ఏ విధంగా వచ్చాయి, ఎందుకు వచ్చాయి? ఎవరివల్ల ఏర్పడ్డాయనే విషయం వాదించుకుని, చర్చించుకుని ప్రయోజనం లేదు. వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలి. నీ లోపాలతో నువ్వు అలాగే ఉండు అని భగవంతుడు ఎన్నటికీ అనడు.
తన లోపాలు తాను తెలుసుకుని జీవితాన్ని సరిదిద్దుకోవాలనుకునేవాడికి సహాయపడటానికే గురువులు, శాస్త్రాలు! ఏ ఒక్కరూ పుట్టుకతో పరిపూర్ణులు కారు.

మానవ జీవన పరమార్థం తెలుసుకొని తన అంతరంగం వైపు తాను నడిచినవాడికి లోపాలు తేటతెల్లమవుతాయి. పరిష్కారాలు కనిపిస్తాయి.

దేహంలో ఏర్పడిన అనారోగ్యం సరిజేసుకుంటున్నట్లు మనసులో ఏర్పడిన వంకర బుద్ధులనూ సరి చేసుకోవచ్చు. మనం ఎప్పుడూ వాళ్లకు లోపాలున్నాయి, వీళ్లకు లోపాలున్నాయని రంధ్రాన్వేషణ చేస్తూ ఉంటాం. వాళ్లు మారితే మనం మారిపోదాం అనీ అంటూ ఉంటాం. అన్నింటికంటే సులువైనది, వెంటనే చెయ్యగలిగే పని... మనలను మనం మార్చుకోవటం. మన లోపాలు గుర్తించి సరిచేసుకోవటానికి ప్రయత్నించటం.

రకరకాల వ్యసనాలతో దారి తప్పిన ఒక మనిషి చివరి దశలో కుళ్లు కాలవలో దొరికాడు. అతడిని మదర్‌ థెరెసా దగ్గరకు చేర్చినప్పుడు ఆమె అతడి గురించి ఒక్క ప్రశ్నా వెయ్యలేదు. వెంటనే సేవ మొదలుపెట్టింది. చచ్చిన శవంలాంటి మనిషి గురించి ఎందుకింత ప్రయాస అనే ఆలోచన ఇతరులకు వచ్చినా- ఆమె లక్ష్యపెట్టకుండా అహర్నిశలు ప్రేమను పంచింది. అతడిలో కూడా ప్రభువును చూసింది. కాపాడింది. ఆ తరవాతా అతడి లోటుపాట్లను ప్రస్తావించలేదు.

మన పొరపాట్లను మనమే గుర్తించాలి. మన లోపాలను మనమే సరిజేసుకోవడానికి ప్రయత్నించాలి. సరిదిద్దుకోవాలి.

మీ లోపాలను నేను సరిదిద్దడానికి వచ్చాను. నేను సరిదిద్దుతాను రండి- అని అవతార పురుషుడైన శ్రీరాముడు అనలేదు. లోపాలు లేకుండా ఎలా జీవించాలో, ఎవరైనా మన లోపాలు ఎత్తిచూపితే ఎలా సరిదిద్దుకొని జీవించాలో... అలా జీవించి చూపించాడు. అది దైవ జీవనం. అందుకే అతడు ఆదర్శనీయుడైనాడు. లోక పూజ్యుడయ్యాడు.

మట్టి రకరకాలుగా ఉంటుంది. ఎన్నో లోపాలు ఉంటాయి. కుండ తయారు చేయడానికి వెంటనే అనువుగా ఉండదు. కాని, ఎంతో కష్టపడి వ్యయప్రయాసలతో ఘటాకారాన్ని ఇస్తాడు కుమ్మరి. లోపాలున్నాయి కదా అని మట్టిని విదిలించుకోడు. మనమూ అంతే. లోపాలు సరిదిద్దుకుంటే మంచి మనుషులమవుతాం. చక్కటి మనుగడ సాగిస్తాం.

ఈ విశాల విశ్వం అందరూ ఒప్పుకొనే విధంగా ఎంత మాత్రమూ లేదు. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక లోపం కనపడుతుంది. కొందరికైతే ఈ సృష్టిని నేను అయితే ఇలా చేసి ఉండను అనే భావమూ కలుగుతూ ఉంటుంది. తనదాకా వస్తే కాని తగవు గురించి తెలియదు. దేవుడు అవకాశం ఇచ్చినా స్వార్థపరుడైన మనిషి నిర్మించే భువన భవనం ఎప్పటికీ లోపభూయిష్ఠంగానే ఉంటుంది.

చంద్రుడిని చూస్తే మచ్చలు కనిపించవు. మచ్చలనే చూస్తే చంద్రుడు అందంగా కనిపించడు. వేడిని తలచుకుంటే సూర్యుడి మీద కోపం వస్తుంది. ఆ సూర్యకాంతే మన జీవన ఆధారమని తెలుసుకుంటే- రెండో మాట ఉండదు. బురదమట్టి, గులకరాళ్లు చూస్తే నది గొప్పగా అనిపించదు. విశాలమైన ప్రవాహం, దాహార్తిని తీర్చే గుణం చూస్తే- తల్లిలాగ అనిపిస్తుంది.

తెల్ల ఆవే కాదు, మచ్చలున్న ఆవూ తెల్లటి పాలిస్తుంది. మహా మహా వృక్షాలే కాదు, చిన్న చిన్న ఔషధ మొక్కలూ మనుషులకు ఉపయోగపడతాయి. ప్రాణాలను కాపాడతాయి. లోపాలను పక్కనపెట్టి సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రతి ఒక్కరూ ఈ విశ్వ యంత్రం నడపడానికి పనిముట్టులే.

బిడ్డ అంగవైకల్యంతో పుట్టాడని తల్లి పారెయ్యదు. పెంచి పెద్ద చేస్తుంది. మిగతా పిల్లల కంటే జాగ్రత్తగా ఎక్కువ ప్రేమతో చూస్తుంది. భగవంతుడూ అంతే. ఎన్ని లోపాలతో మనలను ఈ భూమ్మీదకు తీసుకువచ్చినా వాటికి కావలసిన రక్షణ ఏర్పరుస్తూనే ఉంటాడు.

అందుకే 'నాలో ఎన్నో లోపాలున్నాయి. ఉండనీ, నేనేం చెయ్యను? విధి ఫలకంపైన చిత్ర జగత్కారుడు నన్నావిధంగా రూపొందించాడు' అంటాడు ఉమర్‌ ఖయ్యామ్‌.

- ఆనంద సాయిస్వామి

ᐅ ఆధ్యాత్మిక ఆడంబరాలు


 ᐅ ఆధ్యాత్మిక ఆడంబరాలు

లేమిని కప్పిపుచ్చుకోవటానికి మనిషి పడరాని పాట్లు పడటం మనం చూస్తుంటాం.
కొంతమంది ధనహీనులు మెరిసిపోయే వస్త్రాలు, నకిలీ నగలు ధరించి ఆడంబరాన్ని ప్రదర్శిస్తుంటారు. కొంతమంది సంపన్నులు సాధారణ దుస్తులతో నిరాడంబరంగా కనిపిస్తుంటారు. భక్తులు కానివారు ప్రదర్శన కోసం అనేక వేషాలు వేస్తారు. రంగస్థలం మీద కృష్ణ పాత్రధారి, నిజజీవితంలో సామాన్య వ్యక్తిగానే దర్శనమిస్తాడు.

ఆడంబరాలన్నీ ప్రపంచం మెప్పుకోసం పడే పాట్లు.

వాస్తవంలో ఎవరూ వాటిని విశ్వసించరు. పట్టించుకోరు. కొంతమంది అవకాశవాదులు, తమపని నెరవేర్చుకునే ప్రయత్నంలో ఆడంబరస్వాముల్ని అతిశయోక్తులతో ఉబ్బి తబ్బిబ్బులుగా చేసేందుకు ప్రయత్నిస్తారు. వారు ఆషాఢభూతులనే నిజం తెలిశాక ఆడంబరం కోసం అవస్థలు పడినవాళ్లు పశ్చాత్తాపం చెందక తప్పదు.

మనలో చాలామందికి భగవంతుడి నిజతత్వం అర్థం కావటం లేదు. దైవసేవ అంటే ఆడంబరం, ఆర్భాటం, ప్రచారం ప్రధాన అంశాలుగా చలామణీలో ఉన్నాయి.

వీటన్నింటికీ తాను అతీతుడననే సత్యాన్ని పరమాత్మ పలు సందర్భాల్లో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను తెలియజేస్తున్నా మనం వాటిమీద మనసు పెట్టడంలేదు.

నిజంగా భగవంతుడు ఆడంబరాలకు అర్రులు చాచేవాడైతే, శబరిని అనుగ్రహించడు. గుహుణ్ని మిత్రుడిగా చెప్పుకోడు. మారుతిని 'భరతుడితో సమానమైనవాడివి' అని అభినందించడు. నారచీరలు ధరించి, పాదరక్షలు లేకుండా వనసీమల్లో సంచరించడు. కుచేలుడికి పాదసేవ చేసి, అటుకులు తిని ఆనందించడు.

ఇలాంటి ఉదాహరణలు మనకు దైవగాథల్లో ఎన్నో కనిపిస్తాయి. సాధారణంగా మనం వాటిని పట్టించుకోం. పువ్వులోని మకరందాన్ని, పండులోని రుచిని, మనసులోని మంచితనాన్ని మనం గుర్తించగలగాలి.

పూజతంతు ఒక బాహ్యప్రక్రియ.

భక్తి అందులో అనివార్యంగా ఉండాల్సిన ఆధ్యాత్మిక పరిమళం.

భగవంతుడు మనం సమర్పించే వాటిలో దేన్నీ ఆరగించకపోవటం మనం చూస్తూనే ఉన్నాం. కానీ, ఆయన భక్తి అనే ఫలాన్ని ఆప్యాయంగా స్వీకరిస్తుంటాడని మనం గ్రహించలేకపోతున్నాం.

భక్తికి మూడు దశలుంటాయి.

పువ్వు-కాయ-ఫలం.

పువ్వుగా పరిమళిస్తుంది.

కాయగా దృఢపడుతుంది.

పండుగా పరమాత్మ కైంకర్యానికి అర్హత పొందుతుంది.

ఈ మూడోదశకు చేరుకోవాలంటే కొందరికి జీవితకాలం పట్టవచ్చు. అదృష్టవంతులు, ఏకాగ్రతతో అత్యల్పకాలంలో సాధించవచ్చు. అసలు ముందుగా భక్తి అంటే ఏమిటో, దాన్ని ఎలా సొంతం చేసుకోవాలో మనకు తెలియాలి.

అందుకు వేషభాషల అవసరం ఉండదు. ఆడంబరాలతో పని ఉండదు. కేవలం అపార విశ్వాసం, అనంతమైన ప్రేమ, స్థిరబుద్ధి... వీటిని ఆశ్రయిస్తే- భక్తిమార్గం మన ఎదుట సాక్షాత్కరిస్తుంది.

సముద్రాలను సృష్టించిన పరమాత్మ కేవలం ఉద్ధరిణెడు నీటితో ఆనందిస్తాడు. ఏకతర్పణతో తృప్తి పడతాడు. సకల జీవరాసులకు ఆహారాన్ని ఏర్పాటు చేసిన చిదానందుడు చింతాకంత నైవేద్యంతో సంతృప్తి చెందుతాడు. అక్షయపాత్రలోని ఒక్క మెతుకుతోనే తన స్వభావం వ్యక్తంచేస్తూ పరమాన్నంగా స్వీకరించిన సర్వేశ్వరుడికి మనం ఏమిచ్చి ఆనందింపజేయాలి? పరమాత్మకు మనం ఇవ్వాల్సినవి ప్రాపంచిక వస్తువులు కానేకాదు. ఏ వస్తువూ భక్తికన్నా గొప్పది కాదు. కాబట్టి, కేవలం మన భక్తిఫలాన్ని ఆయనకు సమర్పించుకుందాం. అప్పుడు ఆధ్యాత్మిక ఆడంబరాలతో మనకు అవసరం ఉండదు.

- కాటూరు రవీంద్రత్రివిక్రమ్‌

ᐅ నిజం నిప్పులాంటిది


 ᐅ నిజం నిప్పులాంటిది

నిజాన్ని నిప్పుతో పోల్చటం కొంత ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. తరచి చూస్తే ఆ పోలిక సరైనదేననిపిస్తుంది. దార్శనికులు, వేదాంతులు, రుషులు, దైవజ్ఞులు- వీరంతా ఎంతో లోతుగా ఆలోచించాక, బహుశా నిజం నిప్పులాంటిదన్న ఉపమానానికి వూపిరిపోసి ఉండాలి. వారి దివ్యదృష్టికి, ఆధ్యాత్మిక ఆత్మావలోకనానికి ఈ ప్రపంచం ఒక మాయా మందిరం. ఒక విరిసిన హరివిల్లు. ఒక మెరిసే పొదరిల్లు.
చీకట్లో నడుస్తున్న మనిషి దారికి అడ్డంగా పడివున్న తాడును చూసి 'పాము పాము' అని కేకలు వేస్తూ వెనక్కు పరుగు లంకించుకుంటాడు. వెంటనడుస్తున్న నేస్తం అగ్గిపుల్ల వెలిగించి అటువైపు వెలుతురు కేంద్రీకరించగానే, అక్కడ దారికి అడ్డంగా కనిపించింది పాము కాదని, ఉత్త తాడేనని తెలుస్తుంది. భయంతో పరుగు లంకించుకున్న వ్యక్తి వెనక్కు తిరిగి వచ్చి 'ఓస్‌! తాడే. పాము అనుకుని కంగారుపడ్డాను' అంటూ సమర్థించుకోవటానికి ప్రయత్నం చేస్తాడు.

కంటికి కనిపించేదంతా నశించిపోయేదేనని బుద్ధుడు చెప్పాడు. ఈ అందమైన ప్రకృతి, ఆకృతివున్న సకల చరాచర వస్తుసముదాయం ఏదో ఒకరోజు కంటికి కనిపించకుండాపోతాయి. అందుకే బ్రహ్మసత్యం, జగత్తు మిథ్య అన్న మహావాక్యం... విశ్వాన్ని నడిపించే చైతన్యం ఒక రూపంలేని రూపంగా నిర్వచిస్తోంది. జనించి గతించే జగతి, జనన మరణాలమధ్య నలిగే మనిషి- ఈ రెండూ ఆ చైతన్యపు స్థితిగతుల ప్రతినిధులుగానే మనం అర్థం చేసుకోవాలి.

పంచభూతాల్లో ఒకటైన అగ్ని ఒక తన్మాత్ర.ఆకాశం నుంచి వాయువు, దాని నుంచి అగ్ని, అందులోనుంచి నీరు ఆ నీటినుంచి నేల- ఇవన్నీ బ్రహ్మనుంచి బయటికివచ్చాయంటారు. వాటికి ధర్మం తప్ప కర్మతో సంబంధం లేదు. ఆకాశ భూతం ఆవలిస్తుంది, వాయుభూతం విహరిస్తుంది, అగ్ని భూతం విజృంభిస్తుంది, జలభూతం ప్రవహిస్తుంది, పృథ్వీ భూతం సహిస్తుంది. అగ్నికి ఒక నిర్దిష్టమైన రూపం అంటూ లేదు. ఎదురుపడ్డ వస్తువు ఏదైనా సరే కాల్చి బూడిద చేస్తుంది. అది దాని ధర్మం. శవమైనా, ఖాండవమైనా దానికి ఒకటే. నివురుకప్పిన నిప్పు ఎప్పుడో ఒకసారి గుప్పు మంటుంది. గుప్పిట్లో దాన్ని దాచటానికి ప్రయత్నిస్తే నిలువునా దహించివేస్తుంది. నాల్కలు సాచి పైపైకి ఎగసి ప్రజ్వలించటం తప్ప తలవాల్చి కిందకు దిగటం అగ్నికి తెలీదు.

నిజాన్ని కప్పిపుచ్చటానికి ఎంత ప్రయత్నించినా అది ఏదో ఒకరోజు బయటపడి తీరుతుంది. అందుకే నిజం నిలకడమీద తెలుస్తుంది అంటారు. నిప్పులా దహించటమే కాదు, నిగ్గు తేల్చటం ఎలాగో నిప్పునకు బాగా తెలుసు. పుటం పెడితేనే అసలైన బంగారం వన్నె తేలుతుంది. అగ్నిపునీత సీత తన పాతివ్రత్యాన్ని చాటి చెప్పింది. నిజం నమ్ముకుని అన్నీ పోగొట్టుకున్న హరిశ్చంద్రుడి కీర్తిచంద్రిక ఆచంద్రతారార్కం వెలుగుతూనే ఉంటుంది. అందుకే, నిజాన్ని నిప్పుతో పోల్చటంలో ఆశ్చర్యం ఏముంది?

- ఉప్పు రాఘవేంద్రరావు

ᐅ హిత కార్యం


 ᐅ హిత కార్యం

సృష్టిలో అతిచిన్న జీవులు కూడా తమ తోటి ప్రాణుల కోసం ఎంత నిస్వార్థంగా పాటుపడతాయో తెలియజెప్పే హృదయార్ద్ర భరితమైన జపాను కథ ఒకటుంది.
భూకంపాలు ఎక్కువగా సంభవిస్తున్న కారణంగా ఆ దేశంలో చాలామంది తమ ఇంటిగోడల్ని తేలికపాటి కలప పలకలతో నిర్మించుకుంటుంటారు. అలాంటప్పుడు ఆ పలకల మధ్య అక్కడక్కడ కొంచెం సందులు ఏర్పడటం సహజం. కొన్నేళ్ల తరవాత వాటి మధ్య తేమ వల్లనో, పురుగుల వల్లనో కొన్ని పలకలు చీకిపోతుంటాయి. వాటిని తొలగించి కొత్త పలకల్ని మేకులతో కొట్టి బాగుచేసుకుంటుంటారు.

ఒకతను తన ఇంటిని ఇలా పునర్‌నిర్మించుకుంటుండగా ఒక పలక సందులో అతుక్కుపోయిన బల్లి ఒకటి కనిపించేసరికి గతుక్కుమన్నాడు. కొన్నేళ్ల క్రితం ఆ గోడను నిర్మించేటప్పుడు తాను కొట్టిన మేకు ప్రమాదవశాత్తు ఆ బల్లి కాలిగుండా దూసుకుపోవటం వల్ల అది కదల్లేక అలాగే ఉండిపోయిందని అతనికర్థమైంది. 'అయ్యో, నిష్కారణంగా దాని ప్రాణం తీశానే!' అని అతను విలవిల్లాడిపోయాడు. అయితే, చిత్రంగా అది వూపిరితీస్తూ కనిపించేసరికి అతను కుతూహలాన్ని ఆపుకోలేకపోయాడు. తన పనిని ఆపి ఇన్నేళ్లపాటు అది కదలకుండా ఏ ఆహారమూ దొరికే ఆధారం లేకుండా ఎలా బతికిఉందా అని ఆ అద్భుత దృశ్యాన్ని చూస్తూ శిలాప్రతిమలా నిలబడిపోయాడు. మరికాసేపటికి ఎక్కడి నుంచో మరో బల్లి ఆ పగిలిన పలకల మధ్యనుంచి దూరి దూరి వచ్చి తన వెంటతెచ్చిన ఆహారాన్ని ఈ బంధితురాలైన బల్లికి తినిపించటం కనిపించేసరికి అతడి ఆశ్చర్యానికి అంతే లేకపోయింది. ఈ సృష్టి చిత్రానికి అతని మనసు ఉప్పొంగి ఒళ్ళు పులకరించిపోయింది.

ఏమాత్రం జ్ఞానంలేని ఒక సామాన్య జీవి కష్టంలో ఉన్న తన తోటి ప్రాణిని కాపాడటానికి ఇన్నేళ్లుగా ఎంతగా శ్రమిస్తోంది! మేకువల్ల బంధితురాలైన బల్లి ఏ ఆశతో జీవిస్తోంది?

బుద్ధిజీవులైన చాలామంది మనుషులు తమ తోటివాళ్లు కష్టాల్లో ఉండగా ఎందుకు ఉపేక్ష వహిస్తుంటారు? చిన్న కష్టాలనే భరించలేని మరికొందరు నిస్పృహతో ఇంకొకరిని బాధిస్తూ తమ ప్రాణాలు తీసుకునేదాకా పోతారెందుకని?

ఈ అల్పజీవుల నుంచి మనుషులు ఎంతో నేర్చుకోవలసి ఉంది కదా అని అతనికి జ్ఞానోదయమైంది!

రుగ్వేదంలో మనుషులు సూర్యచంద్రుల్లా బతకాలని ఒక సూక్తి ఉంది. సూర్యుడు ఎవరినుంచీ ఏమీ ఆశించకుండా ప్రతిరోజూ తానిచ్చే వెలుగు, వేడివల్లనే సర్వప్రాణులూ భూమిమీద ప్రాణాలతో జీవించగలుగుతున్నాయి. చంద్రుడు తన హెచ్చుతగ్గులతో సముద్రాలకు ఆటుపోటుల్ని కలిగిస్తూ భూమిమీద ప్రకృతికి సమతుల్యత ప్రసాదిస్తున్నాడు. తనకు సహజమైన కాంతి లేకపోయినా తన మీద పడిన సూర్యరశ్మిలోని వేడిని తాను భరించి మనపై చల్లని వెన్నెల కురిపిస్తున్నాడు.

అలాగే మనిషి తన కర్మలతో మరొక ప్రాణికి హితకారకుడు కావాలి. అది ఎవరో పనికట్టుకుని చెప్పాల్సిన అగత్యం లేదు. అహంకారం విడనాడి వినయ సంపదతో తన విధ్యుక్త ధర్మంగా భావించి చేయాల్సిన పని అది. సృష్టిలో ప్రతి జీవినుంచి మనిషి నేర్చుకొని ఆచరించాల్సింది ఎంతో ఉంది!

- తటవర్తి రామచంద్రరావు

ᐅ రంధ్రాన్వేషకులు


 ᐅ రంధ్రాన్వేషకులు

ఇతరుల తప్పులు ఎంచడంలో మనలో చాలామంది సిద్ధహస్తులు. ఎదుటివారిలోని లోపాలను విమర్శించడం చాలా తేలిక! అలా చేయడంలో కొందరు తగని ఆనందం పొందుతుంటారు. ఎదుటివాడు చేసిన మహత్కార్యాన్ని మాత్రం సులువుగా విస్మరిస్తుంటారు. ఆ వ్యక్తిలోని గొప్పతనాన్ని మెచ్చుకోవడానికి మనసు అసలు అంగీకరించదు.
ఇతరుల తప్పులు ఎత్తిచూపే అలవాటు సమాజంలో కొందరికి ఎక్కువగానే ఉంటుంది. ప్రతీ చిన్న తప్పునీ కొండంతలుగా చేసి చూపుతుంటారు. ఎదుటివాడిని మానసికంగా ఎంతో కొంత బాధించడమనే ప్రవృత్తి మంచి లక్షణం కాదు. విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగూర్‌ శాంతినికేతన్‌ను నిర్వహించే కాలంలో చిత్రకారుడిగా ఎంతో ఖ్యాతిని సంపాదించిన ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఒక చిన్న పిల్లవాడు తాను గీసిన చిత్రాన్ని తెచ్చి సందర్శకుడికి చూపాడు. ప్రముఖ చిత్రకారుడు ఆ పటాన్ని పూర్తిగా గమనించకుండానే- 'అబ్బాయ్‌! నీ చిత్రంలోని పువ్వు ఈ చెట్టుకొమ్మ కన్నా పెద్దదిగా ఉంది. అలా గీయడం తప్పు కదూ!' అన్నాడు. అక్కడే ఉన్న రవీంద్రులు- 'మహాశయా, ఆ చిట్టి తప్పును బాగానే గమనించారు కాని... ఆ పువ్వులోని జీవకళ మీ దృష్టిని ఆకర్షించలేదు... చిట్టి నాన్నా! నీ చిత్రంలోని అందాలను ఆయన ఆస్వాదించలేకపోతున్నారు. అంటే ఆయనకు మించిన చిత్రకారుడిగా ఎదిగే లక్షణాలు నీలో ఉన్నాయి!' అంటూ ప్రోత్సహించారు. చిత్రకారుడి మొహంలో చిరాకు అబ్బాయి కళ్లలోని ఆనందం ముందు చిన్నబోయింది.

తప్పులను సరిదిద్దలేని, ప్రత్యామ్నాయాలను సూచించలేని వ్యక్తులు ఇతరుల తప్పులు ఎత్తి చూపడానికి అనర్హులు. సముద్రం వంటి కౌరవ సేనను చూసి కొంత వేదనతో, కొంత నైరాశ్యంతో వెనకాడుతున్న పార్థుడిలో శ్రీకృష్ణుడు నిరాశనే చూసి ఉంటే, పాండవులను విజయం వరించి ఉండేది కాదు. అర్జునుడి నైరాశ్యాన్ని పారదోలి కర్తవ్యం ఉద్బోధించిన భగవద్గీత వల్ల అటు దుష్ట సంహారం జరిగింది. ముందుతరాల జీవితాలకు ప్రేరణ, దిశానిర్దేశం లభించాయి. మానవ సమాజంలోని తప్పులను ఎంచడమే మార్గదర్శకుడి లక్షణం కాదు. మహా మహులందరూ తప్పులను క్షమించి మంచికి మార్గం వేశారు. ఇతరుల్లోని తప్పిదాలనే వేలెత్తిచూపి, వారిని నిరాశకు గురిచేసే నైజం వల్ల మానవ సంబంధాలు వికటిస్తాయి. చివరికి వాళ్లు ఒంటరిగా మిగిలిపోతారు.

మనం ప్రేమించేవారిలో తప్పులను గమనించినా వాటికి పరిష్కారాలను సూచిస్తాం. అందరినీ ప్రేమించగలిగే మహానుభావుల వల్లే సమాజంలో గుణాత్మక విలువలు నిలిచి ఉన్నాయి. మనచుట్టూ మనను ప్రేమించే వారుండటం అదృష్టం! తప్పులనే చిన్న రేఖ కన్నా ఉత్సాహం పెంచే దీర్ఘరేఖ గీయడం- నిర్మాణాత్మకమైన పని. రక్తాలను ప్రవహింపజేసి రాజ్యాలను గెలవడం అనే తప్పిదం కన్నా, ప్రేమతో విశ్వాన్ని గెలవడం మంచిదనే బుద్ధుడి బోధనతో- అశోకుడు శాంతికాముకుడయ్యాడు.

కల్మషం లేని హృదయంతో ఇతరుల తప్పులను ప్రస్ఫుటం చేయడం మంచి ఫలితాలనిస్తుంది. జీవితంలో కిందపడినా తిరిగి లేచి సర్దుకొని ముందడుగు వేసేవాడే లక్ష్యసాధకుడు. అలాంటి వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలి. ఇతరుల తప్పులను భూతద్దంలో చూపే విమర్శకులకు దూరంగా ఉండాలని కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో సూచించాడు. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరుకదా...

- అప్పరుసు రమాకాంతరావు