ᐅ సప్త వ్యసనాలు
ᐅ సప్త వ్యసనాలు
జీవితం ఓ అద్భుతం. జీవన విధానం అంతకంటే అద్భుతం. సుఖసంతోషాలను జీవితంలో అనుభవించి, ఆదర్శ వ్యక్తిగా తనను తాను తీర్చిదిద్దుకోవాలంటే మనిషి సదభ్యాసాలను ఆహ్వానించాలి. దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలి. చెడు అటవాట్లనే వ్యసనాలంటాం. మనిషిని అధఃపాతాళంలో పడేసేవి ఈ వ్యసనాలే. వీటిలో ప్రమాదకరమైనవి సప్త వ్యసనాలున్నాయని శాస్త్రం చెబుతోంది. 1. స్త్రీ వ్యసనం, 2. ద్యూతం (జూదం), 3. వేట, 4. మద్యం, 5. వదరుబోతుతనం, 6. నేరాన్ని మించిన శిక్ష విధించటం, 7. పూర్వీకులు ఆర్జించిన సంపదను విచ్చలవిడిగా ఖర్చుచేయటం. ఈ సప్త వ్యసనాల్లో ఏ ఒకటైనా చాలు- మనిషిని పతనావస్థకు దిగజార్చటానికి. వీటికి దూరంగా ఉన్న మనిషి పరిపూర్ణుడే.
స్త్రీవ్యామోహం వల్ల చరిత్రహీనులై అపఖ్యాతి పాలైనవారెందరో ఉన్నట్లు ఇతిహాస పురాణాలు చెబుతున్నాయి. కండు మహర్షి ప్రమోచని అనే స్త్రీ వలలో పడి, కామపరతంత్రుడై తొమ్మిది వందల సంవత్సరాలు వ్యర్థంగా గడిపాడట. మేనక సౌందర్యానికి వ్యామోహితుడై విశ్వామిత్రుడు వందల సంవత్సరాల తపస్సును భంగం చేసుకుని, ఆమె వెంటపడ్డాడు. రావణాసురుడు పరస్త్రీ వ్యామోహంలో పడి స్వర్ణలంకను చేజేతులా పాడుచేసుకున్నాడు. కుటుంబాన్ని, సైన్యాన్ని, అందరినీ కోల్పోయి, చివరికి తానే అసువులు బాశాడు. కామప్రకోపితుడై సుగ్రీవుడు కాలాతీతాన్ని, మైత్రీధర్మాన్ని విస్మరించాడు. కీచకుడు ద్రౌపది వ్యామోహంలో పడి ప్రాణంమీదకు తెచ్చుకున్నాడు. స్త్రీ ఆకర్షణ వల్లనే రాజులు, చక్రవర్తులు రాజ్యాల మీద దండెత్తి, యుద్ధాలు చేసి, రక్తపుటేర్లు ప్రవహింపజేశారు. గోస్వామి తులసీదాసు భార్య రత్నావళిని హద్దుమీరి ప్రేమించి, కొంతకాలం అజ్ఞానంలో గడిపాడు. 'ఎంతవారలైనా కాంత దాసులే' అన్నాడు నాదబ్రహ్మ త్యాగరాజు. మోహిని మోహంలో పడి భస్మాసురుడు భస్మమైపోయాడు. దేవేంద్రుడు పరస్త్రీల సౌరుకు జోహారులు పలికి అపఖ్యాతి పొందాడు. శంతనుడీ వ్యసనం వల్లనే తన వాళ్లనందరినీ కష్టాలపాలు చేశాడు.
జూద వ్యసనానికి బానిసలైన ధర్మరాజు, నలుడు ఎన్నో కష్టాలపాలైనారు. జూదం వల్ల గుణనిధి చేయని పాపమంటూ లేదు. జూదం అనేక హత్యలకూ, ఆత్మహత్యలకూ కారణమైంది.
మృగయా వినోదార్థం పరీక్షిన్మహారాజు అడవికి వెళ్ళి, శమీకుడి మెడలో సర్పం వేసి, ఆ ముని క్రోధానికి, శాపానికి గురైన విషయం తెలిసిందే. పాండురాజు, దశరథుడు కూడా వేటలకు వెళ్ళి ఇబ్బందులపాలైనారు. ఈ వ్యసనంవల్ల వత్సరాజు శత్రువులకు చిక్కి బందీ అయిపోయాడు. మద్యపానం వల్ల రాక్షసులంతా హీనచరితులైనారు. శుక్రాచార్యుడు, కీచకుడు మద్యానికి బానిసలైనారు. కళ్లు ఉండీ కూడా అంధులైపోయారు. వాచాలత్వానికి, ప్రగల్భాలకు ఉత్తరకుమారుడే ప్రథమ శ్రేణికి చెందినవాడిగా కనిపిస్తాడు. ఆత్మస్తుతి, ప్రగల్భాల్లవల్ల అతడు ఎంతో చులకనయ్యాడు. శిశుపాలుడు తన వదరుబోతుతనం వల్ల, అహంకారం వల్ల వాసుదేవుడి చేత చచ్చాడు.
పరుషమైన వాక్కు ఎప్పుడైనా ప్రాణాంతకమే. నేరం చేయకపోయినా, లేదా కొద్ది నేరానికైనా, కఠినమైన శిక్షలు అనుభవించినవారెందరో మనకు ఇతిహాస, పురాణాల్లో తారసిల్లుతారు. నేరం చేయని కచుడు దేవయాని శాపానికి గురైనాడు. ఏకలవ్యుడు పాండవుల శునకం మీదికి బాణంవేసిన చిన్ననేరానికి బొటనవేలిని కోల్పోయాడు. నాయకురాలు నాగమ్మ వ్యక్తిగతమైన పగ, ద్వేషం వల్ల కోడిపందాలు సృష్టించి బ్రహ్మనాయుడి మీద దాడి చేసింది. నేరమనేది చేసెరుగని ప్రహ్లాదుడు, ధ్రువుడు ఎన్నో భయంకరమైన దండనలు అనుభవించారు. హరిశ్చంద్రుడి చేత అసత్యమాడించడం కోసం విశ్వామిత్రుడు అతడికెన్నో పరీక్షలు పెట్టాడు. ఎన్నో బాధలు పెట్టాడు. అమాయకుడైన సారంగధరుణ్ని తండ్రి రాజరాజ నరేంద్రుడు కారాగారంలో పెట్టి హింసించాడు. ప్రేమించిన నేరానికి అనార్కలి- అక్బరు ఆదేశంతో సజీవ సమాధి అయింది. ఇలా నిరపరాధులకు తీవ్రమైన దండన విధించడం కూడా సప్తవ్యసనాల్లో ఒకటిగా కనిపిస్తోంది. చెప్పుడు మాటలకు చెవులొగ్గిన కృష్ణదేవరాయలు తిమ్మరుసును చెరసాలపాలు చేసి కనుగుడ్లు పెరికించాడు. రామాయణంలో జటాయువు ఏం నేరం చేశాడని ఖండితపక్షుడైనాడు? సుగ్రీవుడికీ ఉగ్రదండనమనే వ్యసనముంది. చాలామంది రాజులు ఈ వ్యసనం వల్లనే అపకీర్తిపాలైనారు.
సప్తవ్యసనాల్లో చివరిది తాతముత్తాతల సంపాదనలను విశృంఖలంగా ఖర్చుపెట్టడం. ఈ లక్షణం కూడా ఐతిహాసిక, పౌరాణిక పురుషుల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. దుర్యోధనుడు ప్రజల సొమ్మును విచ్చలవిడిగా దుర్వినియోగం చేశాడు. జీవితమంతా పాండవులను ద్వేషించడంలోను, వారిని కష్టాలపాలు చేసే కార్యక్రమాల్లోనే ఖర్చుచేసేశాడు.
ప్రస్తుత సమాజంలో మనమింతవరకు చెప్పుకొన్న సప్తవ్యసనాల బారినపడి తమ అమూల్య జీవితాన్ని బలి చేసుకుంటున్న దురదృష్టవంతులు అడుగడుగునా కనిపిస్తారు. భారతీయ సనాతన ధర్మం, ఆధ్యాత్మిక చింతన, పారమార్థికత, పాపభీతి కొరవడిన కారణంగానే స్వావలంబన, స్వాధ్యయనం, సదాచరణ, సత్సంగం, సద్గురు బోధకు దూరమై యువత పరదేశ సభ్యతా సంస్కృతులకు ఆకర్షితమవుతున్నది. ఇదెంతో శోచనీయం, గర్హనీయం. సంయమనంతో సప్తవ్యసనాలనే కాదు, సహస్ర వ్యసనాలనైనా సమాధి చేయవచ్చు.
- చిమ్మపూడి శ్రీరామమూర్తి
ᐅ మాతా పితా దైవం
ᐅ మాతా పితా దైవం
దైవమంటే అమ్మ. దైవమంటే నాన్న. అమ్మ లాలనలో, నాన్న పాలనలో అంతర్లీనంగా మనకు కనబడేది ఆ దైవతత్వమే.
ఒక్క అమ్మలోనే త్రిమాతలున్నారు. తన బిడ్డలకు విద్యాబుద్దులు నేర్పేటప్పుడు సరస్వతి, పోషణ బాధ్యత వహించేటప్పుడు లక్ష్మి, సకల శుభాలను ఆకాంక్షించేటప్పుడు పార్వతి- ఇలా త్రిమాతల త్రివేణి సంగమమే అమ్మ. అలాగే ఒక్క నాన్నలోనే త్రిమూర్తులున్నారు. తన బిడ్డలకు సకల సౌకర్యాలను సృష్టించి, సమకూర్చేటప్పుడు బ్రహ్మగాను, రక్షణ, పోషణ వహించేటప్పుడు విష్ణువుగాను, కోప్పడి, మందలించేటప్పుడు శివుడిగాను త్రిమూర్తుల అవతారాలెత్తుతాడు నాన్న.
అమ్మ ప్రియం కోరుతుంది. నాన్న హితం కోరుతాడు. అమ్మ నీకేది ఇష్టమో అదే కోరుతుంది. నాన్న నీకేది మంచో అదే కోరుతాడు. కానీ దేవుడు నీకేది ప్రాప్తమో అదే నీకు లభించేటట్లు చూస్తాడు. నువ్వు కోరినది నీకివ్వటం గాదు. నువ్వు దేనికి యోగ్యుడివో చూసి, నీకేది తగినదో, నీకేది తగనిదో ఆలోచించి అదే నీకిస్తాడు.
తల్లిదండ్రులు ఏ విధంగానైతే తమ బిడ్డల క్షేమాన్నీ, సంక్షేమాన్నీ, అభ్యున్నతినీ ఆకాంక్షిస్తారో అదేవిధంగా భగవంతుడు కూడా తన భక్తుల క్షేమాన్నీ, సంక్షేమాన్నీ, అభ్యున్నతినీ ఆకాంక్షిస్తాడు. తల్లిదండ్రులు ఏ విధంగానైతే తమ బిడ్డలు తప్పు చేసినప్పుడు క్షమించి, సహిస్తారో అదే విధంగా భగవంతుడు కూడా తన భక్తులు తప్పు చేసినపుడు క్షమించి, సహిస్తాడు.
భగవంతుడికీ, భక్తుడికీ అనుసంధానమైనది అపారమైన, అమృతతుల్యమైన అనురాగం. మనం దేవుడిపై చూపే అనురాగానికి వంద రెట్లు వాత్సల్యాన్ని దేవుడు మనపై కురిపిస్తాడు. అలాగే బిడ్డలు తల్లిదండ్రులపై చూపే అనురాగానికి వందరెట్ల వాత్సల్యాన్ని తల్లిదండ్రులు తమ బిడ్డలపై కురిపిస్తారు.
మనం దేవుడిని చూస్తే చాలదు. దేవుడు మనల్ని చూసేటట్లుగా నడచుకోవాలి. అలాగే మనం దేవుడిని ప్రేమిస్తే చాలదు. దేవుడు మనల్ని ప్రేమించేటట్లుగా నడచుకోవాలి. ఆ విధంగా ప్రేమను పొందాలంటే, ముందుగా మనం ప్రేమను పంచాలి. అయితే మనం ప్రేమించినా, ప్రేమించకపోయినా అటు దేవుడుగానీ, ఇటు తల్లిదండ్రులుగానీ మనల్ని ప్రేమిస్తూనే ఉంటారు.
మనం ఆర్తితో భగవంతుడిని చూడాలే కానీ, కంటిపాపను కంటిరెప్ప చూసుకున్నట్లుగా మనల్ని ఆయన చూసుకుంటాడు. ఒక్కోసారి మనకు కనబడినా, ఒక్కోసారి మనకు కనబడకపోయినా మన నీడ మనల్ని వెన్నంటే ఉంటుంది. అదేవిధంగా ఒక్కోసారి మనకు కనబడినా, ఒక్కోసారి మనకు కనబడకపోయినా భగవంతుడు మనల్ని వెన్నంటి ఉంటాడు. అలాగే తమ బిడ్డలు తమ దగ్గర ఉన్నా, లేకపోయినా తల్లిదండ్రులు కూడా అనుక్షణం తమ బిడ్డల గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఆరాటపడుతూ ఉంటారు.
తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు, ప్రథమ దైవాలు. ఆ దైవం ద్వితీయ తల్లిదండ్రులు. కానీ అద్వితీయమైన, అనంతమైన కరుణా వాత్సల్యాలను మనపై విస్తారంగా వర్షిస్తాడు.
సృష్టిలో అత్యంత మధురమైనది మాతా పితల ప్రేమ. దానికంటే మధురమైనది, మధురాతి మధురమైనది ఆ దైవ ప్రేమ. ఆ విధంగా తల్లిదండ్రుల్లో దేవుడిని చూడాలి. దేవుడిలో తల్లిదండ్రులను చూడాలి. ఎందుకంటే తల్లిదండ్రులు, దేవుడు వేర్వేరు కాదు. భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. అంతర్యామియై ఉన్నాడు.
- గుజ్జుల వీరనాగిరెడ్డి
ᐅ పునరుత్థానం [Good Friday]
ᐅ పునరుత్థానం
అర్ధరాత్రి సమయం. ఒక వైద్యుడి ఇంటికి రక్తసిక్తమైన గాయాలతో ప్రాణాపాయస్థితిలో ఉన్న ఒక వ్యక్తిని తీసుకువచ్చారు. ఆ వైద్యుడు అతడికి అత్యవసర చికిత్స చేశాడు. కొంతసేపటికి అతడికి స్పృహ వచ్చింది. వైద్యుడి ముఖంలోకి చూశాడు. ఆశ్చర్యపోయాడు. ఆయనను కొద్దిరోజుల క్రితం తీవ్రంగా గాయపరచి, ధనాన్ని దొంగిలించింది తానే. అయినా వైద్యుడు తనను కాపాడాడు అనుకుంటూ ఆయనకు రెండు చేతులూ జోడించాడు. ఆ మాటలకు వైద్యుడు- 'దైవకుమారుడు ఏ తప్పూ చేయకపోయినా కొరడాలతో కొట్టారు, ముఖంపై ఉమ్మివేశారు. తలపై ముళ్ళకిరీటం ఉంచారు. సిలువపై వేలాడదీశారు. అయినా వారినందరినీ క్షమించాడు. తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అంటూ దేవుడిని ప్రార్థించాడు. ఆయనే ప్రభువైన క్రీస్తు. ఆయన చూపిన క్షమార్పణే నీపై నాకు ప్రేమను పెంచింది' అన్నాడు. ఏ నేరమూ చేయకపోయినా క్రీస్తుప్రభువును సిలువపై ఎందుకు వేలాడదీశారు? రెండువేల సంవత్సరాల క్రితం జరిగిందది.
అవి, రోమను చక్రవర్తి సీజరు పాలిస్తున్న రోజులు. యూదయ దేశాధినేత పొంతిపిలాతు దగ్గరకు యేసుక్రీస్తును తీసుకువచ్చారు. కొందరు ఛాందసవాదులు, పండితులు, చక్రవర్తికి అనుకూలురు అయినవారు ఆయన మీద అనవసరమైన నేరారోపణ చేశారు. అంధ విశ్వాసాలను, గుడ్డి నమ్మకాలను వ్యతిరేకించిన క్రీస్తు తెగువను జీర్ణించుకోలేకపోయారు. కుష్ఠురోగులను, గుడ్డివారిని ఇంకా అనేకమంది రోగగ్రస్తుల్ని తన మహిమలతో ఆరోగ్యవంతుల్ని చేస్తున్న ఆయనను చూసి అసూయపడ్డారు. తన ప్రేమ, కరుణలతో ప్రజలకు చేరువవుతున్న యేసుక్రీస్తు తమకు పోటీగా వస్తాడని భయపడ్డారు. ఆయనను సిలువ వేయమంటూ పొంతిపిలాతుపై ఒత్తిడి తెచ్చారు. పొంతిపిలాతుకు యేసు చేసిన నేరం ఏమీ కనబడలేదు. ఆయన నిరపరాధి అని గ్రహించాడు. అవి పస్కా పండుగ రోజులు. ఆ పండుగ సందర్భంగా ఒక నేరస్థుణ్ని విడుదల చేసే అధికారం దేశాధినేత అయిన పొంతిపిలాతుకు ఉంది. అయినా ఆయన ప్రయత్నం ఫలించలేదు. ఒక నిరపరాధికి శిక్ష వేసినందుకు బాధపడుతూ ఆయన నీరు నిండిన పాత్రలో తన చేతుల్ని శుభ్రపరచుకున్నాడు. పాపరహితుడు, పరమపవిత్రుడు అయిన యేసుప్రభువుకు సిలువ శిక్ష వెయ్యడంలో తనను ఏ పాపమూ అంటుకోకూడదని పొంతిపిలాతు అలా చేశాడు. అలా యేసుక్రీస్తు ప్రభువుకు సిలువశిక్ష అమలైంది. అది దైవనిర్ణయం.
దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపాడు. అలా సమస్త మానవాళి పాపపరిహారం నిమిత్తం క్రీస్తు సిలువపై బలియాగం అయ్యాడు. ఆ పవిత్రమైన శుక్రవారం రోజు ('గుడ్‌ఫ్రైడే') శుభ శుక్రవారం. ఆయన తిరిగి లేచిన మూడోరోజు ఈస్టరు పర్వదినం.
ఒక ధనికుడు ఒకసారి యేసుక్రీస్తు వద్దకు వచ్చి, 'నీ రాజ్యంలోకి ప్రవేశించాలంటే నేనేం చెయ్యాలి?' అని అడిగాడు. 'ధర్మశాస్త్రంలో పేర్కొన్న ఆజ్ఞల్ని పాటించు' అన్నాడు ప్రభువు. 'అవన్నీ పాటిస్తున్నాను' అన్నాడు ఆ వ్యక్తి. అందుకు ప్రభువు 'నీ ఆస్తిని అంతటిని అమ్మి వాటిని పేదలకు పంచి, నన్ను అనుసరించు' అన్నాడు. ధనికుడికి ఆ మాటలు రుచించక వెళ్ళిపోయాడు. ఇహలోక సంబంధమైన ఆస్తులకన్నా ఆత్మీయ సంపదలను పెంపొందించుకోవాలని క్రీస్తు ఉద్బోధించాడు. నీతిని అనుసరించేవారు, న్యాయంకోసం తపించేవారు దేవుని స్వరూపం చూడగలరు అన్నాడు క్రీస్తు. 'నిన్ను ఒక మైలుదూరం రమ్మంటే ఇంకో రెండు మైళ్ల దూరం ప్రయాణం చెయ్యి. నిన్ను యాచించే వ్యక్తినుంచి నీ ముఖాన్ని తిప్పుకోకు. నీ శత్రువును ప్రేమించు, శపించేవారిని ఆశీర్వదించు, ద్వేషించేవారికి సహాయం అందించు- ఇవీ క్రీస్తు బోధనలు. అందరికీ అనుసరణీయమైనవి. ఆచరణయోగ్యమైనవి. అనుక్షణం అపనమ్మకం, అభద్రతాభావంతో కొట్టుమిట్టాడుతూ అశాంతిగా బతికేవారికి యేసుక్రీస్తు జీవితమే ఒక సందేశం. మంచివారిని, చెడ్డవారిని, పతితులను, పవిత్రులను ఒకే దృష్టితో ప్రేమించగలిగే దివ్యమైన మనసును మీలో ప్రతిష్ఠించుకోండి, అన్న క్రీస్తు ఉపదేశం ఒక్కటి చాలు- సమస్త మానవుల శాంతియుత సహజీవనానికి, విశ్వమానవ పౌరసత్వానికి.
పాపం చేసినవారిని శిక్షించడంకన్నా మనిషిలోని పాపానికి సిలువ వెయ్యాలి. ఆ క్రమంలో మనిషి ప్రేమ, క్షమ, కరుణ మూర్తీభవించిన క్రీస్తు ప్రభువులా పునరుత్థానం చెందుతాడు. అంటే తిరిగి లేస్తాడు. ఇదే, శుభ శుక్రవార పర్వదినం అందించే శుభసందేశం.
- డాక్టర్ ఎమ్.సుగుణరావు
ᐅ అభినందన
ᐅ అభినందన
మనమున్న సమాజంలో మంచి పనిచేసి యశస్వి అయిన వ్యక్తిని అభినందించడానికి ఎటువంటి పెట్టుబడీ అవసరం లేదు. కావాల్సిందల్లా హృదయవైశాల్యం. ప్రశంసకు పాత్రుడైన వ్యక్తి మిత్రుడు కావచ్చు. పొరుగింటివాడు కావచ్చు. అతడి ప్రతిభను మెచ్చుకొని రెండు మాటల్లో అభినందించడం వల్ల మన వ్యక్తిత్వానికి ఎలాంటి లోటూ ఉండదు. ఏర్పడదు.
ప్రతిష్ఠ, వయసు, పదవి మొదలైన పరిమితులను మరచి ముక్తకంఠంతో అభినందించడం మన ధర్మం. తన ప్రత్యేకతను ప్రశంసించాలని, గుర్తించాలని ప్రతి మనిషీ కోరుకుంటాడు. కాళిదాసు చెప్పినట్లు- తనలోని ప్రత్యేక గుణానికి ప్రశంస లభించినప్పుడు సాధకుడి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యక్తిలోని మాత్సర్యం, రంధ్రాన్వేషణ- ఇతరులను అభినందించడం వల్ల నశిస్తాయి. ఇతరుల సద్గుణాలను లేదా ప్రతిభను గుర్తించి, అది కొద్దిదైనా గొప్పదిగా భావించి ప్రశంసించేవారు ఎందరున్నారు? అలాంటివారు అరుదుగా ఉండవచ్చు.
వాల్మీకి రామాయణంలో ఒక సుమధుర సన్నివేశాన్ని ఇక్కడ ప్రస్తావించాలి. బాలకులైన లవకుశులు రామాయణాన్ని శ్రావ్యంగా భక్తితత్పరతతో తన్మయులై పాడుతున్నారు. జ్ఞానవృద్ధులూ వయోవృద్ధులూ అయిన మహర్షులు శ్రోతలుగా ఉన్నారు. ఆ కవల బాలల మధురగానం మహర్షులను మైమరపించింది. మహర్షులు ఆనంద బాష్పాలు రాలుస్తూ ముక్తకంఠంతో అభినందించారు. ఆలింగనం చేసుకొన్నారు. ఆ బాలకులకు ఏదైనా కానుక ఇవ్వాలనుకొన్నారు. వనవాసులు ఏమి ఇవ్వగలరు? సృష్టించి ఇవ్వగల సామర్థ్యమున్నా కాలవిలంబనం సహించలేకపోయారు. ఒక్కొక్క మహర్షి తన వద్దనున్న కమండలం, కౌపీనం, వల్కలం, కృష్ణాజినం మొదలైనవాటిని కానుకగా సమర్పించి సంతోషించారు.
ముద్దులొలికే బాలప్రతిభను ప్రశంసిస్తూ అభినందించిన ఆ మహర్షుల హృదయ సంపద అపారం. తమ తపస్సాధన, వయసు, జ్ఞానరాశి మహర్షుల అభినందనలకు అడ్డురాలేదు. వారు అందజేసిన కానుకల విలువలకు మించి వారిలోని మానవీయ విలువలు అత్యంత ప్రశస్తమైనవి. అనుకరణీయాలైనవి.
కుటుంబంలో భాగస్వామి అయిన గృహిణి విసుగు, చీకాకు లేకుండా ఇంటిగౌరవాన్ని పెంపొందిస్తుంది. కాని, చాలామంది ఆమె సేవలను గుర్తించరు. ఆమె రుచికరమైన వంటలు చేసినప్పుడు సంగీతం, నృత్యం లేదా మరే కళలోనైనా ప్రతిభను కనబరచినప్పుడు ఆమెను మనసారా అభినందిస్తే వారి జీవితాలు ఆనందమయంగా మారతాయి.
- డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి
ᐅ శ్రీకూర్మనాథ డోలోత్సవం
ᐅ శ్రీకూర్మనాథ డోలోత్సవం
మహావిష్ణువు అవతారాల్లో రెండోదైన కూర్మావతారం ప్రధాన దైవంగా వెలసిన క్షేత్రం శ్రీకూర్మం. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళానికి సమీపంలో నెలకొని ఉంది. శ్రీకూర్మనాథుడి దేవి లక్ష్మి. చతుర్భుజి. గరుడవాహన. ఆలయం పూర్వాభిముఖంగా ఉన్న స్వామి పశ్చిమాభిముఖంగా ఉండటం, గర్భాలయం మధ్య భాగంగా గాక దక్షిణ పార్శ్వంలో ఉండటం, రెండు ధ్వజస్తంభాలు ఉండటం- ఈ ఆలయం ప్రత్యేకతలు.
ప్రధానాలయం తూర్పు గాంగరాజైన అనంతవర్మ చోడగాంగుడు(క్రీ.శ. 1078-1148) కాలంలో నిర్మాణమైనట్లు తెలుస్తోంది. ఆలయం మంటప స్తంభాలపైన తూర్పు చాళుక్య, మత్స్య, వెలమ, గజపతి రాజవంశీకుల దానశాసనాలు ఉన్నాయి. క్రీ.శ. 1178లో సింహళ దేశానికి చెందిన గాయని భాగలదేవి శ్రీకూర్మనాథుడికి అఖండ దీపం నిలిపి అమూల్యాభరణాలు ఇచ్చినట్లు తెలిపే శాసనం ఉంది. క్రీ.శ. 1273నాటి ఒక శాసనం రాజరాజ నరేంద్రుడు నన్నయ చేత మహాభారతాంధ్రీకరణం చేయించిన విషయం పేర్కొంటోంది. చైతన్య మహాప్రభువు క్రీ.శ. 1512లో ఈ ఆలయాన్ని సందర్శించినట్లు తెలుస్తోంది. ఆనందతీర్థుడి శిష్యులైన నరహరితీర్థుల ప్రస్తావన ఒక శాసనంలో ఉంది. మధ్వ సంప్రదాయానికి చెందిన ఈయన పూర్వాశ్రమ నామధేయం శ్యామశాస్త్రి అని చెబుతారు.
చారిత్రక విశేషాలు ఈవిధంగా ఉండగా ఇక్కడ స్థలపురాణం భిన్నంగా ఉంటుంది. పద్మ, బ్రహ్మాండ పురాణాలు, పాంచరాత్రాగమ సంహిత- ఈ క్షేత్ర మహిమను, స్థలపురాణాన్ని విశదీకరిస్తున్నాయి.
శ్వేతపురాన్ని పాలించే రాజు శ్వేత చక్రవర్తి. ఆయన భార్య విష్ణుప్రియ మహా భక్తురాలు. ఒక ఏకాదశి రోజున ఉపవాసం చేస్తూ వ్రతనిష్ఠలో ఉండగా రాజు కామమోహితుడై అంతఃపురానికి వచ్చాడు. పూజా మందిరంలో ఉన్న రాణి రాజు ఉద్దేశం గ్రహించి శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది. 'నీవు కూర్మ రూపంలో భూమిని ధరింపలేదా, అబలనైన నన్ను ఉద్ధరించలేవా, వ్రతభంగం కాకుండా కాపాడవయ్యా' అని వేడుకోగా- శ్రీమన్నారాయణుడు కటాక్షించి గంగను 'నీవు రాణి పూజా మందిరంలో ఉద్భవించి ప్రవహించమని ఆజ్ఞాపించాడు. అంతఃపురం మధ్యగా నదీ ప్రవాహాన్ని చూసి రాజు ఆశ్చర్య భయాలతో శ్వేతగిరి వద్దకు పరివారంపాటు పారిపోయి వృద్ధ మంత్రివల్ల జరిగిన విషయం తెలుసుకున్నాడు. పాప పరిహారార్థం ఆ నదిలో స్నానం చేస్తూ, మహావిష్ణువును ధ్యానం చేసేవాడు. దేవర్షి నారదుడు ప్రత్యక్షమై ఈ నదీ ప్రవాహం వంశధార నామంతో ప్రసిద్ధమవుతుందని ఇది సాగర సంగమ ప్రదేశమని, స్నానమాత్రం వల్లనే హరి భక్తిని కలిగించే పుణ్యతీర్థంగా వాసికెక్కుతుందని తెలిపాడు. శ్వేత చక్రవర్తి నారదుడు ఉపదేశించిన కూర్మ మంత్ర జప దీక్షను సాగించాడు. కూర్మనాథుడు ప్రసన్నుడై రాజుకు దర్శనమిచ్చి తనకు ఆలయం కట్టించమన్నాడు. రాజు ఆలయం నిర్మించి కూర్మనాథుని ప్రతిష్ఠించినట్లు పురాణ గాథ.
ఈ క్షేత్రానికి తూర్పున చక్రతీర్థం ఉంది. శ్వేత చక్రవర్తి తపస్సు చేశాక శ్రీకూర్మనాథుడు ఈ తీర్థంనుంచే అవతరించాడని చెబుతారు. శ్రీకూర్మనాథుని చక్ర ప్రయోగంచే నిర్మితమై శ్రీమహాలక్ష్మి అవతరించిన శ్వేతగుండంలో- స్నానంచేసి ఆలయ శిఖరాన్ని దర్శించి కూర్మనాథుని దర్శించి, ఈ కుండంలో పిండప్రదానం చేసినవారు విష్ణుసాయుజ్యం పొందగలరని భక్తుల విశ్వాసం. సముద్ర స్నానం చేసి కూర్మనాథుని దర్శించడం ఒక సంప్రదాయం.
ఇది పంచలింగారాధ్య క్షేత్రం అయిదుగురు శివులు క్షేత్ర పాలకులు. తూర్పున కర్పూరేశ్వరుడు, ఉత్తరాన హడికేశ్వరుడు, పశ్చిమంలో కోటీశ్వరుడు, దక్షిణ దిశలో సుందరేశ్వరుడు, శ్రీకూర్మక్షేత్ర సుధాకుండ తీరాన పాతాళ సిద్ధేశ్వరుడు వెలశారు. శ్రీకూర్మక్షేత్ర ముఖద్వారాన భైరవుడు ఉన్నాడు.
వైష్ణవ ఆగమాలను అనుసరించి ఇక్కడ అర్చనలు, ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో ఫాల్గుణ పౌర్ణమి నాటి డోలోత్సవం ప్రముఖమైనది. డోల అనగా వూయల- స్వామిని వూయలలూగించే ఈ ఉత్సవం తిలకించడానికి అధిక సంఖ్యలో ప్రజలు విచ్చేస్తారు. ఈ సందర్భంగా ఇక్కడ జరిగే తిరునాళ్లను 'డోలా యాత్ర' అంటారు. ఈ పౌర్ణమి డోలా పౌర్ణమిగా ప్రసిద్ధి. వైశాఖశుద్ధ ఏకాదశినాడు స్వామివారి కల్యాణం, కార్తీకశుద్ధ ద్వాదశినాడు తెప్పోత్సవం, ముక్కోటి ఏకాదశి- ఇక్కడ నిర్వహించే ఇతర ముఖ్యమైన ఉత్సవాలు.
- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు
మహావిష్ణువు అవతారాల్లో రెండోదైన కూర్మావతారం ప్రధాన దైవంగా వెలసిన క్షేత్రం శ్రీకూర్మం. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళానికి సమీపంలో నెలకొని ఉంది. శ్రీకూర్మనాథుడి దేవి లక్ష్మి. చతుర్భుజి. గరుడవాహన. ఆలయం పూర్వాభిముఖంగా ఉన్న స్వామి పశ్చిమాభిముఖంగా ఉండటం, గర్భాలయం మధ్య భాగంగా గాక దక్షిణ పార్శ్వంలో ఉండటం, రెండు ధ్వజస్తంభాలు ఉండటం- ఈ ఆలయం ప్రత్యేకతలు.
ప్రధానాలయం తూర్పు గాంగరాజైన అనంతవర్మ చోడగాంగుడు(క్రీ.శ. 1078-1148) కాలంలో నిర్మాణమైనట్లు తెలుస్తోంది. ఆలయం మంటప స్తంభాలపైన తూర్పు చాళుక్య, మత్స్య, వెలమ, గజపతి రాజవంశీకుల దానశాసనాలు ఉన్నాయి. క్రీ.శ. 1178లో సింహళ దేశానికి చెందిన గాయని భాగలదేవి శ్రీకూర్మనాథుడికి అఖండ దీపం నిలిపి అమూల్యాభరణాలు ఇచ్చినట్లు తెలిపే శాసనం ఉంది. క్రీ.శ. 1273నాటి ఒక శాసనం రాజరాజ నరేంద్రుడు నన్నయ చేత మహాభారతాంధ్రీకరణం చేయించిన విషయం పేర్కొంటోంది. చైతన్య మహాప్రభువు క్రీ.శ. 1512లో ఈ ఆలయాన్ని సందర్శించినట్లు తెలుస్తోంది. ఆనందతీర్థుడి శిష్యులైన నరహరితీర్థుల ప్రస్తావన ఒక శాసనంలో ఉంది. మధ్వ సంప్రదాయానికి చెందిన ఈయన పూర్వాశ్రమ నామధేయం శ్యామశాస్త్రి అని చెబుతారు.
చారిత్రక విశేషాలు ఈవిధంగా ఉండగా ఇక్కడ స్థలపురాణం భిన్నంగా ఉంటుంది. పద్మ, బ్రహ్మాండ పురాణాలు, పాంచరాత్రాగమ సంహిత- ఈ క్షేత్ర మహిమను, స్థలపురాణాన్ని విశదీకరిస్తున్నాయి.
శ్వేతపురాన్ని పాలించే రాజు శ్వేత చక్రవర్తి. ఆయన భార్య విష్ణుప్రియ మహా భక్తురాలు. ఒక ఏకాదశి రోజున ఉపవాసం చేస్తూ వ్రతనిష్ఠలో ఉండగా రాజు కామమోహితుడై అంతఃపురానికి వచ్చాడు. పూజా మందిరంలో ఉన్న రాణి రాజు ఉద్దేశం గ్రహించి శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది. 'నీవు కూర్మ రూపంలో భూమిని ధరింపలేదా, అబలనైన నన్ను ఉద్ధరించలేవా, వ్రతభంగం కాకుండా కాపాడవయ్యా' అని వేడుకోగా- శ్రీమన్నారాయణుడు కటాక్షించి గంగను 'నీవు రాణి పూజా మందిరంలో ఉద్భవించి ప్రవహించమని ఆజ్ఞాపించాడు. అంతఃపురం మధ్యగా నదీ ప్రవాహాన్ని చూసి రాజు ఆశ్చర్య భయాలతో శ్వేతగిరి వద్దకు పరివారంపాటు పారిపోయి వృద్ధ మంత్రివల్ల జరిగిన విషయం తెలుసుకున్నాడు. పాప పరిహారార్థం ఆ నదిలో స్నానం చేస్తూ, మహావిష్ణువును ధ్యానం చేసేవాడు. దేవర్షి నారదుడు ప్రత్యక్షమై ఈ నదీ ప్రవాహం వంశధార నామంతో ప్రసిద్ధమవుతుందని ఇది సాగర సంగమ ప్రదేశమని, స్నానమాత్రం వల్లనే హరి భక్తిని కలిగించే పుణ్యతీర్థంగా వాసికెక్కుతుందని తెలిపాడు. శ్వేత చక్రవర్తి నారదుడు ఉపదేశించిన కూర్మ మంత్ర జప దీక్షను సాగించాడు. కూర్మనాథుడు ప్రసన్నుడై రాజుకు దర్శనమిచ్చి తనకు ఆలయం కట్టించమన్నాడు. రాజు ఆలయం నిర్మించి కూర్మనాథుని ప్రతిష్ఠించినట్లు పురాణ గాథ.
ఈ క్షేత్రానికి తూర్పున చక్రతీర్థం ఉంది. శ్వేత చక్రవర్తి తపస్సు చేశాక శ్రీకూర్మనాథుడు ఈ తీర్థంనుంచే అవతరించాడని చెబుతారు. శ్రీకూర్మనాథుని చక్ర ప్రయోగంచే నిర్మితమై శ్రీమహాలక్ష్మి అవతరించిన శ్వేతగుండంలో- స్నానంచేసి ఆలయ శిఖరాన్ని దర్శించి కూర్మనాథుని దర్శించి, ఈ కుండంలో పిండప్రదానం చేసినవారు విష్ణుసాయుజ్యం పొందగలరని భక్తుల విశ్వాసం. సముద్ర స్నానం చేసి కూర్మనాథుని దర్శించడం ఒక సంప్రదాయం.
ఇది పంచలింగారాధ్య క్షేత్రం అయిదుగురు శివులు క్షేత్ర పాలకులు. తూర్పున కర్పూరేశ్వరుడు, ఉత్తరాన హడికేశ్వరుడు, పశ్చిమంలో కోటీశ్వరుడు, దక్షిణ దిశలో సుందరేశ్వరుడు, శ్రీకూర్మక్షేత్ర సుధాకుండ తీరాన పాతాళ సిద్ధేశ్వరుడు వెలశారు. శ్రీకూర్మక్షేత్ర ముఖద్వారాన భైరవుడు ఉన్నాడు.
వైష్ణవ ఆగమాలను అనుసరించి ఇక్కడ అర్చనలు, ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో ఫాల్గుణ పౌర్ణమి నాటి డోలోత్సవం ప్రముఖమైనది. డోల అనగా వూయల- స్వామిని వూయలలూగించే ఈ ఉత్సవం తిలకించడానికి అధిక సంఖ్యలో ప్రజలు విచ్చేస్తారు. ఈ సందర్భంగా ఇక్కడ జరిగే తిరునాళ్లను 'డోలా యాత్ర' అంటారు. ఈ పౌర్ణమి డోలా పౌర్ణమిగా ప్రసిద్ధి. వైశాఖశుద్ధ ఏకాదశినాడు స్వామివారి కల్యాణం, కార్తీకశుద్ధ ద్వాదశినాడు తెప్పోత్సవం, ముక్కోటి ఏకాదశి- ఇక్కడ నిర్వహించే ఇతర ముఖ్యమైన ఉత్సవాలు.
- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు
ᐅ హోలీ
ᐅ హోలీ
దేశమంతటా వేర్వేరు రూపాల్లో, వేర్వేరు కారణాలతో, రకరకాలుగా ఉత్సవాలు జరిపే ఒకే ఒకరోజు ఉంది. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురినీ దంపతసహితంగా పూజించే రోజు కూడా సంవత్సరంలో ఈ రోజు ఒక్కటే. అదే ఫాల్గుణ పూర్ణిమ.
ఫాల్గుణోత్సవం, కల్యాణపూర్ణిమ, డోలాపున్నమి, హుతాశనీపూర్ణిమ, కామునిపున్నమి, అనంగపూర్ణిమ, హోళికాదహో, హోలికాపూర్ణిమ, వసంతపూర్ణిమ, హోలీ... ఇలా రకరకాల పేర్లతో పిలిచే రోజు ఒక్కటే. భిన్నమైన పేర్లు ఉన్నట్టే, ఈ రోజు జరిపే కార్యక్రమాలు, అనుసరించే ఆచారాలు, జరిపే పూజలు సైతం భిన్నమైనవే. అన్నింటి వెనక- ఆనందంతో పాటు, ఆరోగ్య భావన, ఆధ్యాత్మిక తత్వం, సామాజిక స్పృహ, పర్యావరణ పరిరక్షణ లాంటి అంశాలెన్నో ఇమిడి ఉన్నాయి. వాటికి అనేక కథనాలూ ఉన్నాయి.
శివపార్వతులను కలిపే ప్రయత్నంలో మదనుడు శివుడి ఆగ్రహానికి గురై దహనమయ్యాడు. అతడి భార్య అయిన రతీదేవి అభ్యర్థన మేరకు ఆమెకు మాత్రమే సశరీరుడిగా, మిగిలినవారికి అనంగుడిగా తిరిగి లేచిన దినం ఫాల్గుణ పూర్ణిమ. కాబట్టి ఈ రోజుకు కామునిపున్నమి, అనంగపూర్ణిమ అనే పేర్లు వచ్చాయని పురాణాలు వివరిస్తున్నాయి.
కళింగాంధ్ర (ఉత్తరాంధ్ర) ప్రాంతంలోని శివాలయాల్లో శివపార్వతుల (ప్రతిమల)ను డోలిక(ఉయ్యాల)లో వేసి వూపుతూ ఉత్సవం చేస్తారీరోజు. అదేవిధంగా బృందావనంలో బాలకృష్ణుడి ప్రతిమను ఉయ్యాలలో వేసి వూపుతూ రంగులు చల్లుకుంటూ ఉత్సవం చేస్తారు. పై రెండు కారణాల వల్ల డోలా (డోలికా) పూర్ణిమ అనే పేరు వచ్చింది.
మధురమీనాక్షి దేవి తపస్సుచేసి సుందరేశ్వర స్వామిని వివాహం చేసుకున్న రోజు ఫాల్గుణ పూర్ణిమే. కాబట్టి దక్షిణాది దేవాలయాల్లో ఈరోజు కల్యాణ(లక్ష్మీనారాయణ) వ్రతం చేస్తారు. కాబట్టి ఈ రోజుకు కల్యాణ పూర్ణిమ అనే పేరు వచ్చిందని విష్ణుపురాణ కథనం. ఉత్తర హిందూస్థానంలో వసంతరుతు ఆగమనాన్ని స్వాగతిస్తూ సృష్టికర్త అయిన బ్రహ్మను, జ్ఞానప్రదాత్రి అయిన సరస్వతీదేవిని పూజిస్తారు. దీనినే ఫాల్గుణోత్సవం అంటారు.
ఆ మర్నాడు (ఫాల్గుణ బహుళపాడ్యమి) కొన్ని రాష్ట్రాలకు సంవత్సరాది. కొత్త సంవత్సరానికి స్వాగత సూచకంగానూ, సంతోషాలను వ్యక్తం చేసుకునేందుకుగాను ఒకరిపై ఒకరు రంగుపొడులు, రంగు కలిపిన నీళ్ళు చల్లుకుంటారు. చల్లుకుంటూ హోలీ హోలీ రెరంగ హోలీ చమకేళిర హోలీ అని పాడతారు. ఆ పాట భావం క్లుప్తంగా- మోదుగపూలు తెచ్చి, రోట్లోదంచి, కుండలోవేసి, రసంతీసి, వెదురు గొట్టాల్లో నింపాలి (ఆ రసం ఎర్రగా ఉంటుంది). దీనికి వసంతం అనీ పేరుంది. దాన్ని వావి వరసలు పాటించకుండా అందరూ ఒకరిపై ఒకరు చల్లుకోవాలని ఆ పాట భావం. మోదుగ పూలు దంచగా ఏర్పడిన కషాయం ఈ మాస వాతావరణంలో ఒంటిమీద పడటంవల్ల శరీరానికి కాంతి, వర్ఛస్సు ఎక్కువవుతుంది. ఆరోగ్యం ఇనుమడిస్తుంది. శరీరంలో కలిగే ఉద్రేకాలు (రక్తపోటు లాంటి వాటివల్ల), మానసిక దుర్వికారాలు లాంటివి తగ్గుతాయని ఆయుర్వేదం చెబుతోంది.
- అయ్యగారి శ్రీనివాసరావు
ᐅ సర్వకళామయి
ᐅ సర్వకళామయి
దారీ తెన్నూ లేని అరణ్యాల పచ్చని నిశ్శబ్దాల్లో అంతులేని ఆనందం ఉంది. ఏకాంత తీరాల్లో నిలబడితేనే ఎంతో హాయి. ఎవరూ ప్రవేశించలేని సముద్ర నీలాల్లో తీయని సంగీతం వినిపిస్తుంది. మనిషిని ప్రేమిస్తాం సరే, ప్రకృతిని ఇంకా ప్రేమించాలి. అంతకు మించిన స్వర్గం ఎక్కడ?
ప్రకృతిని మించిన గురువు లేడు. అరణ్యవాటికల నుంచి సత్యకాముడు తిరిగి వచ్చినప్పుడు- అతడు బ్రహ్మజ్ఞాని లాగా భాసించడం అతడి తండ్రి ఉద్దాలకుడు గమనించాడు. 'నీకెవరు విద్య బోధించారు, ఈ వెలుగు ఎక్కడిది?' అని తండ్రి కొడుకును ప్రశ్నించాడు. 'మనిషి మాత్రం కాదు' అని సత్యకాముడు అన్నాడు. అంటే ప్రకృతి అని అతడి ఆంతర్యం. ఈ సంఘటన ఛాందోగ్యోపనిషత్తులోనిది.
పుష్పాలతో నవ్వే చెట్లు, గాలి తెరలతో తలలూచే పొలాలు, ప్రవక్తల వలె దివ్య ప్రబోధాలు చేస్తాయని, సుందర వనాల నుంచి వీచే ఆమని సమీరాలు మనిషిని గురించి రుషుల కన్నా ఎక్కువ బోధిస్తాయని పాశ్చాత్య కవులెందరో గానం చేశారు తమ అజరామర కవితల్లో. 'ఎందరు ముఖ్య వ్యక్తులు వచ్చినా మాట్లాడను. నాకోసం గడ్డిపరకపై మెరిసే మంచుబిందువు నిరీక్షిస్తోంది' అంటారు అమెరికన్ తత్వవేత్త థొరో.
ఉదయంపూట వాహ్యాళికి వెళ్తూ మరో తత్వవేత్త ఎమర్సన్, అందంగా విరిసిన గులాబీ పువ్వు ముందు తలవంచి అభివాదం చేసేవాడు. చెట్లు స్వర్గంవైపు భూమి చేసే ప్రార్థనలు. దురదృష్టవశాత్తు మనిషి స్వసుఖం కోసం వాటిని పడగొట్టి ప్రార్థనలు అందకుండా చేస్తున్నాడు.
పది పండ్లచెట్లను, పది పూలమొక్కలను పెంచే వ్యక్తి ఏనాటికీ నరకానికి వెళ్ళడని వరాహపురాణం చెబుతోంది.
ఉదయంవేళ చెట్ల ఆకుల సందులలోనుంచి గదుల్లోకి ప్రసరించే బంగారు కిరణాలు తత్వగ్రంథాలు చెప్పలేని దివ్యత్వాన్ని దాచుకుంటాయి.
సూర్యుణ్ని పెద్ద సోదరుడిగా, నక్షత్రాలు, చంద్రుడు, గాలి, నీరు, అగ్ని, తమ ఇతర సహోదరులుగా ఎంతమంది వూహించగలరు?
చెట్లలో, రాళ్లలో వినగలిగితే మంద్రధ్వానాలు వినిపిస్తాయి. కదిలే నదులలో కవితలు ప్రతిధ్వనిస్తాయి. నరికిన చెట్ల గుజ్జు నుంచి తెల్లకాగితాలు సృష్టిస్తాం. ఆ చెట్లకన్నా అందమైన కవిత్వాన్ని మనం ఆ కాగితాలపై రాయగలమా?
'ప్రకృతి సౌందర్యం భగవంతుడి కళావిన్నాణం. ప్రతి అందమైన వస్తువులో భగవంతుడి అదృశ్య హస్తాల అమృత స్పర్శను తనివితీరా అనుభవిద్దాం. ఆయన చేతిస్పర్శతో నదులు తుళ్లిపడుతూ ప్రవహిస్తాయి. ఆయన నవ్వినప్పుడు సూర్యుడు, చంద్రుడు కాంతులు విరజిమ్ముతారు. నక్షత్రాల్లో, పూలలో ఆయన వికాసమే ప్రకాశిస్తుంది. ఉదయించే సూర్యుడి తొలిస్పర్శకు ప్రపంచం మేలుకొంటుంది. గానం చేసే పక్షుల తీయని గీతాలతో పవనాలు పులకిస్తాయి. భగవంతుడి సృజనాత్మక వైభవం కన్న స్వప్నమే ఉదయం'- ఇంతటి అద్భుతంగా వర్ణించిన గ్రంథం రుగ్వేదమే.
అటువంటి తీయని భావసంపద జొరబడని ఉక్కు నగరాల్లో మనం వూపిరి తీస్తున్నాం. పూలపై కవితలు రాసి ఎందరో గొప్పలు చెప్పుకొంటారు. కాని, ఆ పూలను సృష్టించింది భగవంతుడే. సృష్టిలోని అందాలన్నీ భగవంతుడు నడిచి వెళ్లగా ఏర్పడిన పాద చిహ్నాలే!
- కె.యజ్ఞన్న
ᐅ యాదగిరి నృసింహ వైభవం
ᐅ యాదగిరి నృసింహ వైభవం
సృష్టి స్థితి లయాత్మక బ్రహ్మ విష్ణు రుద్ర సమన్వయ నారాయణ పరబ్రహ్మమే నృసింహస్వామి. శ్రీహరి దశావతారాల్లో, సద్యోజాత స్వరూపాల్లో అంటే వెంటనే ఆవిష్కారమైన అవతార పరంపరలో నృసింహావతారం విశిష్టమైనది. 'న మృగం... న మానుషం' అని వ్యాస వచనం. మృగమూ కాకుండా, మనిషీ కాకుండా నరజంతు సమ్మిళిత రూపంలో స్వామి ఆవిర్భవించాడు. 'నరసింహం' అని పేర్కొంటున్నా రెండూ కాదు అని చెప్పడమంటే, ద్వంద్వాత్మక జగమంతా ఈశ్వర చైతన్య స్వరూపం అని వెల్లడించటమే! అవతరించిన మరుక్షణమే నృసింహుడు దుష్టశిక్షణకు సమాయత్తమై భక్తవాత్సల్యమూర్తిగా ప్రహ్లాదుణ్ని అనుగ్రహించాడు. హిరణ్యకశిపుడు దక్కించుకున్న వరాలకు ఎక్కడా భంగం వాటిల్లకుండా దనుజ సంహారం చేశాడు. ప్రహ్లాద వరదుడిగా అతడి పట్ల ప్రేమాస్పదునిగా, హిరణ్యకశిపుడిపై రౌద్రమూర్తిగా ఏకకాలంలో ద్వంద్వ ప్రవృత్తులు కనబరచాడు. దివ్యమైన, భవ్యమైన అవతారతత్వంలో ప్రసన్నత్వం, ప్రళయత్వాల్ని ఏకకాలంలో ప్రకటించి రెండు అంశాల్నీ ఏకీకృతం చేసి తన మూర్తిమత్వాన్ని స్వామి అనుగ్రహించాడు.
స్తంభోద్భవుడైన నృసింహుడు, ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుల గాథలతో ముడివడిన ప్రాంతాలు, ప్రసిద్ధ క్షేత్రాలు మనరాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. హిరణ్య కశిపుడి సంహరణకోసం విష్ణువు నారసింహుడిగా ఉగ్రరూపంలో వ్యక్తమైన క్షేత్రాన్ని అహోబిలంగా పేర్కొంటారు. హిరణ్యకశిపుని వధించిన తరవాత తన ఉగ్రరూపాన్ని ఉపసంహరించి ప్రహ్లాదుడికి ప్రసన్నమూర్తిగా స్వామి దర్శనాన్ని అనుగ్రహించిన దివ్య సన్నిధే యాదగిరిగుట్ట క్షేత్రమని చెబుతారు. జ్వాలామాలికలతో, అగ్నిశిఖలా నాలిక తేజరిల్లుతుండగా, ఫాలనేత్ర వదనంతో ప్రళయ భీకరంగా ఉన్న నరసింహుడు పరమ శాంతమూర్తిగా విలసిల్లిన సన్నిధానాన్ని యాదగిరిగా వ్యవహరిస్తున్నారు.
ఈ క్షేత్రపురాణాన్ని పరిశీలిస్తే, రుష్యశృంగ మహర్షి పుత్రుడైన యాదర్షి తపస్సు ఫలితంగా స్వామి అర్చావతారమూర్తిగా యాదగిరిపై కొలువుతీరాడంటారు. నరసింహుడి దర్శనాపేక్షతో యాదర్షి కీకారణ్యంలో సంచరించసాగాడు. తనకు మార్గాన్ని సూచించవలసిందిగా యాదర్షి ఆంజనేయుణ్ని ప్రార్థించాడంటారు. తరులు, జలసిరులు, ఫల పుష్పాదులతో శోభిల్లే ఓ గిరిపై హనుమ సూచన మేరకు యాదర్షి తపస్సుకు ఉపక్రమించాడు. ఆంజనేయుడి ఆశీస్సులతో యాదర్షి కొనసాగించిన తపస్సు వల్ల నారసింహుడు ప్రత్యక్షమయ్యాడంటారు. జ్వాల, యోగానంద, గండభేరుండ, ఉగ్ర రూపాలతోపాటు శ్రీలక్ష్మీ నరసింహస్వామిగా అయిదు రూపాల్లో దర్శనమిచ్చాడనీ చెబుతారు. లోక కల్యాణంకోసం ఇదే గిరిపై సదా విలసిల్లాలని స్వామిని యాదర్షి వేడుకోగా, ఆ పంచరూపాలతోనే నృసింహుడు ఇక్కడ వెలశాడనేది పురాణగాథ. యాదర్షి తపస్సు చేసిన ఆ గిరి యాదగిరి అయ్యింది. సింహాకార గుహలో యాదగిరిపై ఆవిష్కారమైన నరసింహస్వామి పంచరూపాలతో వర్ధిల్లుతుండటంతో దీన్ని పంచనారసింహ క్షేత్రంగా వ్యవహరిస్తారు. జ్వాల, యోగానంద, శ్రీలక్ష్మీ నరసింహ స్వరూపాలు గుహలో విలసిల్లుతున్న స్వరూపాలుగా చెబుతారు. గండభేరుండ నరసింహస్వామి ఈ క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామి సన్నిధిలో నెలకొని ఉంటాడనీ, ఇక ఉగ్రనరసింహ స్వరూపం యాదగిరి చుట్టూ వర్తులాకృతిలో అదృశ్యరూపంలో ఆవరించి ఉంటుందనీ భక్తులు విశ్వసిస్తారు.
'యాదః' అంటే జలం, విశేష జలనిధి ఉన్న ప్రదేశంపై భారీ ఏకశిలాగిరి ఉన్న క్షేత్రమే యాదగిరి. యోగశాస్త్రపరంగా చూస్తే, మన శరీరంలో నాభిచక్రం జలస్థానం. దీనిపై సమున్నతంగా ఉండే గిరివంటి ప్రదేశం మన శిరస్సు. ఈ శిరస్సులోనే సహస్రార చక్రం ఉంటుంది. ఈ సహస్రారంపై స్వామిని నెలకొల్పుకోవడమే యాదగిరిపై ఉన్న నృసింహస్వామిని దర్శించడం. భక్తుల పాలిట కల్పతరువుగా పూజలందుకుంటున్న యాదగిరి లక్ష్మీనృసింహస్వామిని కాకతీయులు విశేషంగా ఆరాధించారు. పదమూడో శతాబ్ది నుంచీ ఈ క్షేత్రం వైభవ ప్రాభవాలతో వర్ధిల్లుతున్నట్లు చరిత్ర చెబుతోంది. పదిహేనో శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలుకూడా ఈ క్షేత్రాన్ని దర్శించాడని చెబుతారు. కీసరగుట్టను రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించిన తూర్పు చాళుక్యరాజు త్రిభువన మల్లుడికి యాదగిరి నృసింహస్వామి ఆరాధ్యదైవం. పాంచరాత్ర ఆగమోక్త విధానంలో ఈ క్షేత్రంలో నిత్యోత్సవాలతో మొదలుకుని బ్రహ్మోత్సవాల వరకు నేత్రపర్వంగా పరిఢవిల్లుతాయి. ప్రతి ఏటా ఫాల్గుణమాసంలో 11 రోజులపాటు బ్రహ్మోత్సవాల్ని ఈ క్షేత్రంలో నయనానందకరంగా నిర్వహిస్తారు. నేటితో యాదగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి బ్రహ్మోత్సవ సంరంభం సుసంపన్నమవుతోంది.
సజ్జన శుభంకరుడిగా, దుర్జన భయంకరుడిగా ఉద్భవించిన యాదగిరి లక్ష్మీనృసింహుణ్ని ఆశ్రయించడం... భయ సంహరణం, భవ సంతరణం, సచ్చిదానంద దాయకం, సన్మంగళ కారకం!
- డాక్టర్ కావూరి రాజేశ్ పటేల్
ᐅ బ్రహ్మానందం... నిశ్చలానందం
ᐅ బ్రహ్మానందం... నిశ్చలానందం!
ప్రతీవారు జీవితంలో కోరుకునేది ఏమిటి? ఆనందంగా జీవించటం. చేసే ప్రతి పని ఫలితమూ ఆనందాన్ని ఇవ్వాలని ఆశిస్తారు. సహజమే. చేసే కర్మను బట్టే ఫలితం ఉంటుంది. కొన్ని తాత్కాలికమైన, స్వల్పకాలిక ఆనందాలను ఇస్తాయి. ఒక్కటి మాత్రమే శాశ్వతానందాన్ని ఇస్తుంది.
మూడురకాలైన ఆనందాలను 'వేదాంత పంచదశి' సూచించింది. అవి విషయానందం, విద్యానందం, బ్రహ్మానందం. ఈ మూడింటిలో బ్రహ్మానందం శాశ్వతమైందిగా చెబుతారు.
సిరిసంపదలు, భోగాలు, దాంపత్యం, బంధాలు, మమకారాలు సుఖసంతోషాలు- ఇవన్నీ విషయానందం ఇచ్చే అంశాలు. జీవనదశల్లో క్రమేపీ కనుమరుగవుతుంటాయి. ఒడుదొడుకుల జీవనగమనంలో ఆటుపోట్లకు గురవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో విషయవాంఛలు సైతం వెగటుగా తోస్తాయి.
విద్యానందం, జ్ఞానాభిలాషవల్ల కలిగేది. గౌరవాన్ని పెంపొందిస్తుంది. రాజపూజితులుగా చేస్తుంది. అహంకారం, పరిస్థితుల స్థితిగతులు ఈ ఆనందాన్ని తుంచేయవచ్చు.
మూడోదైన బ్రహ్మానందం, ఆత్మకు సంబంధించిన జ్ఞానం. ఈ సకల సృష్టిలో ఏది సత్యమై, నిత్యమై వెలుగొందుతూ, చైతన్యవంతంగా ప్రకాశిస్తుంటుందో, ఏది ఈ చరాచర జగత్తుకు మూలమో, జీవుల పుట్టుక, మరణాలకు కారణహేతువో- ఆ బ్రహ్మాండమైన వెలుగును భగవత్ స్వరూపంగా గ్రహించగలిగేదే బ్రహ్మజ్ఞానం. ఆ జ్ఞానం ఇచ్చేదే అఖండమైన బ్రహ్మానందం. అది శాశ్వతానందం. తుది అంటూ లేదు.
స్థావర జంగమాదులన్నీ పుట్టి, లయించే బ్రహ్మాండ భాండంగా విరాజిల్లే విరాట్ విశ్వరూపం. సృష్టిస్థితిలయలు ఆ భాండంలో సహజంగా జరిగిపోయేవే.
ఓ రత్నాల వ్యాపారి, పండితుడు, సన్యాసి ఓడలో కలిసి ప్రయాణిస్తున్నారు. ఉన్నట్టుండి సముద్రంలో భీకరమైన తుపాను చుట్టుముట్టింది. మహాకల్లోలం... కల్పాంతం జరగబోతోందా అన్నట్టుగా వాతావరణం తయారైంది. అలలు ఓడను ముంచేసేట్టుగా ఉన్నాయి.
సంచిలోని రత్నాలను గట్టిగా గుండెలకేసి హత్తుకున్నాడు రత్నాల వ్యాపారి. 'వీటి విలువ అపారం... అయ్యో! పోగొట్టుకోవాల్సి వచ్చిందే దేవుడా!' అని వెర్రికేకలు పెట్టాడు.
పండితుడు తన తాళపత్ర గ్రంథాలవైపు జాలిగా చూశాడు. ఎన్ని సన్మానాలందుకున్నాను! ఎంత జ్ఞానం నిక్షిప్తమైఉంది! అర్ధాంతరంగా పోగొట్టుకోవాల్సివచ్చిందే! బాధ, భయం ఆవహించాయి పండితుణ్ని.
చిద్విలాసంగా నవ్వుతూ సముద్రంలో కల్లోలాన్ని చూస్తున్నాడు సన్యాసి.
ఇంకాసేపట్లో ఈ ఓడ మునగబోతోంది. 'భయంలేదా! మనిషివి కాదా నువ్వు! ఏమిటా హాసం?' ప్రశ్నించారు ఆ సన్యాసిని.
'ఎందుకు భయం? భయపడితే వచ్చే ప్రళయం ఆగుతుందా?' అంటూ తన కమండలంలోని నీటిని సముద్రంలో పోశాడు.
'చూడండి! ఈ అనంతజలరాశి నుంచి వచ్చిన కమండలంలోని నీటిబిందువులు దానిలోనికే చేరాయి. ఎందుకు విచారం?!' అంతటి ప్రళయ సన్నివేశంలోనూ ఆ సన్యాసి మాటల అంతరార్థం బోధపడింది వారికి.
బ్రహ్మజ్ఞానికి బ్రహ్మానందమే ఏ స్థితి అయినా. విషాదంలోనూ నవ్వగలడు. వినోదంలోనూ వైరాగ్యచింతనను వీడడు. అన్నీ గ్రహించుకోగలిగిన స్థితి. అది శాశ్వతానందమయ స్థితి అది. విషయానందంకన్నా విద్యానందం మిన్న. విద్యానందం కన్నా బ్రహ్మానందం గొప్పది.
యోగులు, సిద్ధులు, మహాజ్ఞానులు బ్రహ్మానందాన్ని అనుభవించినవారే. సగటు మనుషులమైన మనకు బ్రహ్మానందస్థితి ఎలా కలుగుతుంది?
లౌకిక జగత్తులో బంధాలు తెంచుకునేవి కావుగదా! ఆశ్రమ ధర్మాలు పాటించడం అనివార్యం
ప్రజాకవి వేమన 'అనగననగ రాగమతిశయిల్లుచునుండు- తినగ తినగ వేము తియ్యనుండు' అన్నాడు.
అభ్యాస వైరాగ్యాలు అలవరచుకుంటూ భగవానుడి స్మరణ సదా కొనసాగించుకుంటూ పయనం జరగాలి. కలియుగంలో స్మరణ మాత్రం చేతనే ముక్తి లభిస్తుందంటారు! 'ఏ స్థితిలో ఉన్నా భగవన్నామస్మరణ సాగించడం, ప్రతికర్మ ఫలితమూ ఈశ్వర ప్రసాదమే' అని భావిస్తూ సాగిపోతూ ఉంటే- బ్రహ్మానందం తరింపజేస్తుందని విశ్వసించాలి.
- దానం శివప్రసాదరావు
ᐅ ప్రశ్నోపనిషత్
ᐅ ప్రశ్నోపనిషత్
పూజించడం వల్ల, ప్రార్థించడం వల్ల, ధ్యానించడం వల్ల, జపించడం వల్లకంటే ప్రశ్నించడం వల్లనే మనం ఎక్కువ తెలుసుకోగలుగుతాం. ప్రశ్నించడం మనకు సహజంగా మనసుకు ఉండే అద్భుతమైన జ్ఞానమార్గం.
ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ప్రశ్నించడం వల్లనే మానవ పురోగతి సాధ్యపడింది. ప్రశ్నించడం వల్లనే ఎన్నో విశ్వరహస్యాలు బయటపడ్డాయి. ప్రశ్నించడం వల్లనే మానవుడు దుఃఖభూయిష్ఠమైన జీవనం లోంచి సుఖసోపానాలు అధిరోహిస్తున్నాడు. ప్రశ్నించడం వల్లనే ఒకరోజు అతడు జగత్తుపై ఎక్కుపెట్టిన తన దృష్టి బాణాన్ని తనమీదకు తిప్పుకోగలుగుతాడు. జీవనపోరాటంలో ప్రతి జీవీ నేర్చుకుంటూ ముందుకు వెళ్తుంది. ఈ నేర్చుకోవటం అనేది ప్రశ్నించటం మీదనే ఆధారపడి ఉంది. బుద్ధి ఉన్నా లేకపోయినా ప్రతి జీవిలోనూ ఆర్తి ఉంటుంది. అది మానవుడిలో ప్రశ్నించే గుణంగా బయటపడుతుంది. దాన్నే జిజ్ఞాస అంటారు. దీని ద్వారా ఎంతైనా జ్ఞానసముపార్జన చేయవచ్చు.
ఇది కొందరిలో జాగృతమై ఉద్దీపనగా భాసిస్తూ ఉంటుంది. వాళ్లను వివేకవంతులుగా చేస్తుంది. మరికొందరిలో నిద్రాణమై ఉంటుంది. దాన్ని బయటకు తెచ్చుకోవాలి. కత్తిని పదును పెట్టడానికి సానపట్టే రాయి ఎలా అవసరమో, వీళ్లకు జప, ధ్యాన, ప్రార్థనాదులు అవసరం. అక్కడే ఉండిపోకూడదు. ప్రశ్నించడం నేర్చుకోవాలి. ప్రశ్నించే ఓర్పు కావాలి. ఒక క్రమమార్గంలో సత్యదర్శనం అయ్యేంతవరకు ప్రశ్నిస్తూనే ఉండాలి.
రాళ్లు ప్రశ్నించలేవు. మొక్కలు ప్రశ్నించలేవు. జంతువులు ప్రశ్నించలేవు. మానవులు ప్రశ్నించగలరు. ప్రశ్నతో సర్వాన్ని సాధించగలరు. తమ హక్కులను తాము నిలబెట్టుకోగలరు. తమ బతుకును తాము సుస్థిరం చేసుకోగలరు. భూమి అనే ఈ గొప్ప గ్రహం మీదనే కాకుండా విశ్వమంతా తమ ఉనికిని చాటగలరు. అవసరమైతే భగవంతుడినే ప్రశ్నించగలరు.
భగవంతుణ్ని ఎదిరించి, పోరాడినవాళ్లు పురాణాల్లో చాలామంది ఉన్నారు. భగవంతుణ్ని ప్రేమతో ప్రశ్నించి, ఆర్తితో విన్నపాలు చేసి, స్తుతించి, కీర్తించినవాళ్లే విజయం సాధించారు. సత్యమార్గంలో మన ప్రశ్న మన దగ్గరకు వచ్చేంతవరకు దైవం గురురూపంలో సహాయం చేస్తూనే ఉంటాడు. మనగురించి మనకు తెలియడానికి ప్రశ్న అవసరం.
ప్రశ్నించే మనసుతో పుట్టాం. ప్రశ్నిస్తూ జీవిస్తున్నాం. ప్రశ్నలకు సమాధానాలు తెలియకుండా జీవితం ముగియకూడదు. ఆఖరిప్రశ్న, అంతిమప్రశ్న జీవన పరమార్థాన్ని తెలియజేస్తుంది. అది మనసులో ప్రభవించేంతవరకూ ప్రశ్నోపనిషత్ కొనసాగాలి. ఏదో విధంగా బతికి, ఎలాగోలా జీవించి వెళ్లిపోతే శరీరాలు మారుతూ ఉంటాయి. కాని, ప్రశ్నలు అలాగే మిగిలిపోతాయి. నల్లబల్లమీద రాసి ఉంచిన ప్రశ్నను తుడిచేస్తే దానికి సమాధానం దొరికినట్లు కాదు. పట్టుపట్టి ప్రయత్నించి ప్రశ్నకు ప్రశ్న అనుసంధానించి సమాధానం రాబట్టుకోవాలి.
ప్రశ్నలను ప్రేరేపించడమే కాదు, సమాధానాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది ఈ విశాల విశ్వం... దాన్ని నడిపిస్తున్న మహోన్నత పరమ తాత్వికశక్తి. మనమే మేధోమథనం జరపాలి. లౌకిక విషయాలకే ఎంతో భౌతిక, మానసిక శక్తి ఉపయోగించాల్సి వస్తున్నప్పుడు, దైవాన్ని తెలుసుకుని, కలుసుకుని, హృదయ నిరూపణ చేసుకోవాలంటే ఎన్ని వేల ప్రశ్నలు కావాలి? ఎంత ఆధ్యాత్మికత దేహంపై జాగృతం కావాలి?
ప్రశ్నించడం వల్ల బొగ్గుముక్కలాంటి మనం వజ్రాలుగా తయారవుతాం. ప్రశ్నించడం వల్ల సృజనాత్మకత పెరుగుతుంది. ప్రశ్నించడం వల్ల పొరలు విడిపోయినట్లు యోగ రహస్యాలు బయటపడి అవగాహనకు అందుతాయి.
మానవుడి ప్రశ్నలకు ఎక్కడో పైలోకాల్లో ఉన్న భగవంతుడు ప్రత్యక్షమై సమాధానాలు చెప్పనక్కర లేదు. అతడి హృదయంలో అనంతమైన దివ్యశక్తి నిక్షిప్తమై ఉంది. అదే ప్రశ్నను సృష్టిస్తుంది. కొనసాగిస్తుంది. చిట్టచివరకు సమాధానం ఇచ్చి సత్యదర్శనం చేయిస్తుంది.
ఆ అదృష్టం మొట్టమొదట మానవుడు వేసుకునే 'నేను ఎవరు?' అనే ప్రశ్నతోనే ప్రారంభమవుతుంది.
- ఆనందసాయి స్వామి
ᐅ అమ్మకు ప్రత్యామ్నాయం లేదు
ᐅ అమ్మకు ప్రత్యామ్నాయం లేదు
భారతీయ సంస్కృతిని మనం భూతద్దంలో చూడటం లేదు. చిన్న అద్దంలో చూస్తున్నాం. ఔను. 'భారతీయ సంస్కృతి' అనే కొండను మనం చిన్న చేతిఅద్దంలో చూస్తున్నాం. అంటే, చాలా తక్కువ చేసి చూస్తున్నాం. ఆడంబరంగా ప్రదర్శించకుండా, మనకు మనం తగ్గించుకుని వినమ్రంగా చూస్తున్నాం. మేరు పర్వతంలాంటి మన సంస్కృతిని మన సంస్కారంతో, ఆడంబరంగా ప్రదర్శించకుండా వినమ్రతను ప్రదర్శిస్తున్నామా, ఆ రకంగా దాని గొప్పతనాన్ని మరింత పెంచి చూపిస్తున్నామా, లేక దాని ఔన్నత్యాన్ని గ్రహించకుండా దానిపట్ల తేలిక భావాన్ని కలిగిఉన్నామా?
మనదైన గొప్పతనాన్ని మనం గుర్తించటం లేదంటే, మీదుమిక్కిలి లోకువ భావాన్ని కలిగి ఉన్నామంటే దానికి ముఖ్యమైన కారణాలు మూడు. ఒకటి, దాని గొప్పతనం మన దృష్టిలోకి రాకపోవటం, అవగాహనలో లేకపోవటం. రెండోది, దాన్ని దూరం చేసుకుంటే ఏం కోల్పోతామో ఆ పరిణామాల పట్ల అంచనా లేకపోవటం. మూడోది, మనం ఆకర్షితమవుతున్న, ప్రభావితమవుతున్న మనకు అతకని విదేశీ సంస్కృతివల్ల ఎటువంటి దుష్పరిణామాలు కలుగుతాయన్నది గ్రహించలేకపోవటం.
సంస్కృతి అనేది ఎవరో ఒక వ్యక్తి ఏర్పాటు చేసింది కాదు. అదొక చట్టం కాదు. దేశ కాల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కాలక్రమేణా జాతికి అలవడిన అనుకూల జీవనశైలి. ఉదాహరణకు ఐరోపా దేశాల్లో చలి ఎక్కువ. మంచు కురుస్తూ ఉంటుంది. ఎప్పుడూ తలుపులు బంధించుకుని ఉంటారు. నిప్పుగూళ్లు రాజేసుకుంటారు. మనది సమశీతోష్ణ దేశం. సహజమైన గాలి వెలుతురు ప్రసరించే భాగ్యదేశం. పగలు మనం ఆ దైవదత్త అవకాశాన్ని ఆస్వాదించగలం. ఆనందించగలం. వాళ్లలా తలుపులు మూసుకుని మగ్గవలసిన అగత్యం లేదు. వాళ్లు మద్య మాంసాలు తీసుకుంటారు. ఉష్ణాన్ని కలిగించే పదార్థాలవి. వాళ్లకు నిషిద్ధం కాదు. అవసరం కూడా. మనకా అవసరం లేదు. ఇంకా వస్త్రధారణ, వివాహ వ్యవస్థ... ఇలా ఎన్నో...
మనది ఆధ్యాత్మిక దేశం. మన భావజాలానికి, ఆత్మోన్నతికి తగిన జీవన విధానాన్ని అనుసరించాలి. ఆధునికత పేరిట అనాగరికతను అలవరచుకోరాదు. ఆధునికత బాహ్య ఆడంబరాలతో వ్యక్తమయ్యేది కాదు. భావ ఔన్నత్యంతో ప్రస్ఫుటమయ్యేది.
భారతదేశం ఒక అద్భుత అద్వితీయ దేశం. దాని వైశిష్ట్యతకు సాటిలేదు. ఈ దేశ సహజ సంజాతులమైన మనం అమాయకత్వంతో మన వారసత్వాన్ని చేజేతులా పోగొట్టుకోరాదు. పరమహంస శ్రీయోగానంద తరచూ అనేవారు- 'నేను శయ్య మీద మరణించను. బూట్లు వేసుకుని ఉండగా, భారతదేశాన్ని గురించి మాట్లాడుతుండగా మరణిస్తాను' అని. (ఇక్కడ బూట్లు వేసుకుని అంటే... శీతల దేశాల్లో శయ్య మీద ఉన్నప్పుడు తప్ప మిగతా సమయాల్లో పాదరక్షలు ధరించే ఉంటారు. అంటే నేను శయ్యమీద ఉన్నప్పుడు మరణించను అని నొక్కి చెప్పటం అన్నమాట). నిజంగానే ఆయన తమ చివరి ప్రసంగం చేస్తూ 'ఎక్కడైతే గంగ, అడవులు, హిమాలయ గుహలు, మానవులు భగవంతుణ్ని గురించి కలగంటారో- నేను పవిత్రుణ్నయ్యాను... నా శరీరం ఆ నేలను తాకింది' అన్నారు. ఇక్కడ మనుషులతో పాటు గంగ, అడవులు, హిమాలయాలు కూడా భగవంతుని ధ్యానిస్తాయని భారతదేశ పవిత్రత పట్ల, ఔన్నత్యం పట్ల వారికెంత గౌరవం, విశ్వాసం, పూజ్యభావం ఉండేవో దీన్ని బట్టి అర్థమవుతుంది.
ఇదంతా మనది. మనదే. మనలో పెంచి పోషించుకోవలసినది. అందరితో పంచుకోవలసినది. చెట్టు ఎక్కాలన్నా, పుట్ట తవ్వాలన్నా ముందు వాటికి పూజ చేయాలనే ఆచారం మనది. మనల్ని చేయి చాచి దీనంగా యాచించే యాచకుడికి ధర్మం చేసి మనమే తిరిగి నమస్కరించే సంస్కృతి మనది. అడుగడుగునా, అణువణువునా పూజ్యత, కృతజ్ఞత, నియతి, నిబద్ధత, సేవ, త్యాగం, అపురూపమైన వివాహ, కుటుంబ వ్యవస్థలు, అన్నింటికంటే అపురూపమైన ఆధ్యాత్మిక తత్వం- మనదేశ ప్రత్యేకతలు. అదే శ్వాసగా, భగవంతుడి సేవగా జీవితం... ఇక్కడే సాధ్యం. జీవితం పొడుగునా పరమపదం వైపే ధ్యేయం. ఎంత సనాతన సంస్కృతి! ఎంత ఆధునిక సంస్కృతి! ఎంత నాగరిక సంస్కృతి!
మంచి ఎక్కడున్నా అది అనుసరించవలసిందే. కానీ గుడ్డిగా మనది కానిదల్లా మనదిగా చేసుకోరాదు. అందంగా లేదని అమ్మ అమ్మకాకుండా పోదు. అమ్మలోని అంతర్గత సౌందర్యం మనం అవగాహన చేసుకోలేదంతే. అమ్మను నిర్లక్ష్యం చేయకూడదు. అమ్మనే పోగొట్టుకోకూడదు. లోకంలో అమ్మకు ప్రత్యామ్నాయమే లేదు. అమృతం కూడా అమ్మకు సరితూగలేదు!
- చక్కిలం విజయలక్ష్మి
ᐅ ఏదీ కష్టం కాదు
ᐅ ఏదీ కష్టం కాదు!
నీవు చేసే పనిని ప్రేమించు. త్రికరణశుద్ధిగా ఆచరించు. ఫలితాలను ఆశించకు- అనేది గీతావాక్యం. పనిని ప్రేమించినవారికి ఏదీ కష్టం కాదు. కార్యసాధకులు నిరంతరం తాము చేసే పనిలోనే నిమగ్నులవుతారు. విలువైన ప్రతిక్షణాన్ని వినియోగించుకుని మానవత్వమనే మార్గంలో ప్రయాణించి దృఢనిశ్చయంతో లక్ష్యాన్ని చేరుకుంటారు.
మనిషి ఆలోచన చాలా శక్తిమంతమైనది. అనంతమైనది. ఎవరి ఆలోచనలు గొప్పగా ఉంటాయో వాళ్లే ప్రపంచాన్ని ఏలతారు. అందుకే ఎవరైనా ఉన్నతంగా ఆలోచించుకోవడం నేర్చుకోవాలి.
ఇతిహాసాలు, మతగ్రంథాలు మానవ శక్తి అనిర్వచనీయమైనదని నిరూపించాయి.
రామాయణంలో శ్రీరాముడికి ఎదురైనన్ని అవరోధాలు ఇంకెవరికీ తారసపడవు. అయినా సరే రాముడు ధర్మాన్ని, కర్తవ్యాన్ని విడనాడలేదు. మాట తప్పలేదు. ఎవరితోనూ కోరి శత్రుత్వం పెట్టుకోలేదు. కర్తవ్య నిర్వహణలో ముందుకు సాగుతూ ఆదర్శ పురుషుడిగా, ఆదర్శ భర్తగా, ఆదర్శ కుమారుడిగా పేరు తెచ్చుకున్నాడు. అందుకే రాక్షసుడైన మారీచుడు కూడా శ్రీరాముడి గొప్పతనాన్ని గ్రహించి 'రామో విగ్రహవాన్ ధర్మః' అని కీర్తించాడు.
శ్రీకృష్ణుడు స్థితప్రజ్ఞతకు, కార్యసాధనకు నిలువెత్తు ప్రతీకగా నిలిచాడు. యుద్ధరంగంలో వికలమనస్కుడైన అర్జునుణ్ని కార్యోన్ముఖం చేసి అసాధారణ విజేతగా నిలిపాడు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చేసిన గీతోపదేశం మానవాళికి ప్రతీ క్షణం స్ఫూర్తిని కలిగిస్తుంటుంది. అసలైన వ్యక్తిత్వ వికాసమంటే ఏమిటో గీతద్వారా బోధించి చూపించాడు శ్రీకృష్ణుడు. కార్యసాధకుడికి ఏదీ కష్టం కాబోదని రుజువు చేశాడు. ప్రయత్నాన్ని ఎప్పుడూ మానవద్దని హితోపదేశం చేశాడు. మన ఆలోచనలే మనకు మేలు చేస్తాయి. మంచితనం మంచిని పెంచుతుంది. మిత్రులను సమకూర్చుతుంది. మంచిని కోరేవాడు మాన్యుడై తీరుతాడు. 'నాకు చేతకాదు' అనే పదం తన పదకోశంలో లేదు అనేవాడు నెపోలియన్. ఏ విజయానికైనా మూలసూత్రాలు మూడు. దృఢమైన కోరిక, నైపుణ్యం, విషయ పరిజ్ఞానం. ఇవి త్రిశక్తులు. వీటిలో ఏది లోపించినా పని పూర్తి కాదు. వీటన్నింటి కలయికవల్లే గాంధీజీ మహాత్ముడయ్యాడు. పరాయి పాలనను పారదోలాడు. విజయాలను కోరుకునేవారికి అపజయాలు కూడా ఎదురవుతాయి. అది సహజం. వాటికి ఎదురు నిలిచి పోరాడినవాడే లక్ష్యసాధకుడు కాగలడు.
ప్రతీ మనిషికీ పరమావధి ధనార్జన మాత్రమే కాదు. జీవిత సార్థకత చాలా ముఖ్యం. 'నేను ఈ ప్రపంచానికేం చేశాను?' అని ఎప్పటికప్పుడు ప్రశ్నించుకోవాలి. ప్రతి జీవిలో అనంతమైన శక్తి అంతర్గతంగా ఉంటుంది. దాన్ని లోకకల్యాణం కోసం వినియోగిస్తే మనిషి మహనీయుడిగా భూమ్మీద నిలిచిపోతాడు.
మానవప్రయత్నం లేకపోతే ఏ చిన్న కార్యక్రమమైనా సుసంపన్నం కాదు. ప్రయత్నిస్తే ఎలాంటి పెద్దకార్యమైనా సిద్ధిస్తుంది. దివి నుంచి గంగను భువికి రప్పించడానికి భగీరథుడు పడ్డ శ్రమ, చేసిన తపస్సు వర్ణనాతీతం. అయినా లోకకల్యాణం కోసం భగీరథుడు ఆ కార్యంలో విజయం సాధించి చిరస్మరణీయుడిగా అందరిలో నిలిచిపోయాడు. కొన్నివేల శతాబ్దాల కిందట వాల్మీకి, వేదవ్యాసుడు ఎంతగానో శ్రమించి రామాయణం, మహాభారతం లోకానికి అందించారు. వారి కృషి సామాన్యమైనది కాదు కదా! సత్కార్యాచరణంలో నిమగ్నమైన నరశ్రేష్ఠుణ్ని జయలక్ష్మి తప్పక వరిస్తుంది. దైవబలం తోడవుతుంది.
- విశ్వనాథ రమ
ᐅ జీవయాత్ర
ᐅ జీవయాత్ర
ఈ జీవయాత్రలో ఎన్నో మలుపులు... మరెన్నో మజిలీలు. ప్రతి మలుపులో ఏవేవో అనుభవాలు, అవరోధాలు అనుభూతులు! సుఖమొస్తే ఆనందంతో చిందులేస్తాం. కష్టం కలిగితే కలవరపడతాం. మానసికంగా కుంగిపోతాం. సమదృష్టి, స్థితప్రజ్ఞత వంటి మాటలు ఎంతగా ఒంటపట్టించుకున్నా... తనదాకా వస్తేకాని తత్వం తెలియదంటూ తల్లడిల్లిపోతాం. జీవితమంతా సుఖసంతోషాలతోనే గడిచిపోవాలని కలలు కంటాం. కాని ఆచరణలో, అనుభవంలో ఇది అసాధ్యమని తెలుసుకుంటాం.
'బాల్యం ఒక వరం... యౌవనం ప్రణయ ప్రలోభాల ప్రమాదం... వార్ధక్యం ఒక శాపం' అన్నది నానుడి. కాని తొలిదశనుంచే అప్రమత్తంగా మెలిగితే తుదిదశలో తీపి జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ హాయిగా గడపొచ్చు. ఆటపాటలతో బాల్యం గడచిపోతుంది. చదువులో ఒక్కొక్క మెట్టూ ఎక్కుతుంటే శ్రద్ధాసక్తులు పెంచుకోవాలి. కవ్వించే బలహీనతలకు లొంగిపోకూడదు. జీవితంలో స్థిరపడ్డాక పెళ్లి, పిల్లలు మన బరువు బాధ్యతలను ఒక్కసారిగా పెంచుతారు. అనుక్షణం పిల్లలు బాగా చదువుతారా లేదా ఉన్నత స్థానాలకు వెళ్తారా వెళ్లరా అన్న బెంగ పీడిస్తుంది. ఆ తరవాత మనం అనుకున్నది జరిగితే అది మనగొప్పగా భావిస్తాం. కాకుంటే ప్రాప్తం, తలరాత అంటూ విలపిస్తాం. ఖర్మకెవరూ అతీతులు కాదని వైరాగ్యాన్ని ప్రదర్శిస్తాం. కాని, చేయాల్సిన కర్మలు సకాలంలో సమర్థంగా చేస్తే ఈ 'ఖర్మ' వచ్చేది కాదుకదా అని ఆలోచించం.
దైవచింతనతో పాపభావన పటాపంచలవుతుంది. ఏ మత సంప్రదాయమైనా భగవంతుణ్ని భక్తితో కొలిస్తే మంచే జరుగుతుందని బోధిస్తుంది. విశ్వవిన్యాసంలో మానవాతీతశక్తి ఉందని గ్రంథాలు చెబుతున్నాయి. అంతవరకెందుకు? మానవుడి అంతశ్శరీర నిర్మాణమే ఒక అద్భుతం! జ్ఞాన కర్మేంద్రియాలు అవిశ్రాంతంగా పకడ్బందీగా పనిచేయడమే మానవ మేధస్సుకందని విడ్డూరం. అది చర్మచక్షువుకు గోచరించదు. మనోనేత్రంతోనే ఆ విన్యాసాన్ని వీక్షించాలి. ఆ శక్తిసామర్థ్యాలను సాధించడానికి ఎంతో ఆధ్యాత్మిక సాధన చేయాలి. నిత్యశోధన జరగాలి. కఠోర మానసిక పరిశ్రమ కావాలి. సమర్థతకు సంయమనం జతకలవాలి. దీన్ని షష్టిపూర్తి తరవాత ఆరంభిద్దామంటే ఆ జాప్యమే కాలసర్పమై కాటువేస్తుంది. ఏదో చేయాలని ఉంటుంది. ఏమీ చేయలేని నిస్సహాయత ఆవహించి మనల్ని నిర్వీర్యం చేస్తుంది.
ఈ జీవయాత్రలో ప్రతిక్షణమూ విలువైనది... అమూల్యమైనది... దీన్ని సద్వినియోగం చేసుకొన్ననాడే మానవుడు సాధకుడవుతాడు... విజేతగా నిలుస్తాడు. కాలం విలువ తెలుసుకున్నవాడే కార్యసాధకుడవుతాడు. మనం ఎంచుకున్న లక్ష్యం చేరుకోవడానికి సన్మార్గంలోనే పయనించాలి. అత్యాశకు పోయి అడ్డదారులు తొక్కితే అవి బెడిసికొట్టి మొత్తం జీవితమే నాశనమవుతుంది. ఆశల సౌధం పేకమేడలా కుప్పకూలిపోతుంది.
మనం మరణించాక కూడా ప్రజల మనసులలో మెలగాలి. శివాజీ, రామకృష్ణ పరమహంస, వివేకానంద, గాంధీ వంటివారు ఈ సూత్రాన్ని నియమబద్ధమైన ప్రణాళిక ద్వారా ఆచరించి చూపారు. ప్రతి దశలోనూ అత్యంత జాగరూకతతో వ్యవహరించి... వారు ఎంచుకున్న రంగాల్లో విజయాలు సాధించి చరిత్రలో మహనీయులు, మహాత్ములుగా మిగిలిపోయారు.
ప్రపంచంలో ఏ గ్రంథమైనా 'ధర్మమే జయిస్తుంది... అధర్మం అపజయం పాలవుతుంది' అన్న సిద్ధాంతాన్నే ప్రచారం చేసింది. సత్యం, ప్రేమ, ధర్మం వంటివి సన్మార్గంలో నడిచినవారందరూ పాటించి చూపారు. ఆ లక్షణాలు ఏ యుగంలోనైనా శాశ్వత మైలురాళ్లుగా నిలిచి భావితరాలకు దిశానిర్దేశం చేస్తాయి.
- కిల్లాన మోహన్‌బాబు
ᐅ అహంకారమే అంధకారం
ᐅ అహంకారమే అంధకారం
లోకమంతా చీకటిగా, ప్రపంచం ఒక దుఃఖసముద్రంలా కనిపించటానికి అసలు కారణం అహంకారం. అహంకారం అనేది ఒక రకమైన జబ్బు. నేను వేరు అనుకోవటం, ఇది నాది అనుకోవటం- ఈ రెండూ భవరోగ లక్షణాలు. ఏదైనా మూలకారణం లేనిది జబ్బు రాదు. భవరోగానికి అసలు కారణం దృష్టిలోపం. ఉన్నది ఉన్నట్లుగా చూడలేకపోవటంవల్ల, చూడలేనిది సహించలేకపోవటంవల్ల భవరోగం మరింతగా విషమిస్తుంది.
అర్జునుడు కురుక్షేత్ర రణరంగాన అడుగుపెట్టగానే అతడికి భీష్మద్రోణాది గురువులు, బంధువులు, స్నేహితులు కనిపించారు. శత్రువుల్ని చీల్చి చెండాడాలని ఉవ్విళ్లూరుతూ కృష్ణపరమాత్మను ఉభయ సేనల మధ్య రథం ఆపమని ఆజ్ఞాపించడం ఈ అహంకారపూరితమైన చర్యకు ఒక చక్కని ఉదాహరణ అని చెప్పవచ్చు. సంసారం అంటే ఇల్లు, ఇల్లాలు, పిల్లలు, తోట, పొలం, ఆస్తిపాస్తులు, చుట్టాలు, స్నేహితులు- ఇవేవీ కాదు. కనిపించేవాటితో మానసికమైన సంబంధం పెట్టుకోవటమే సంసారానికి సరైన నిర్వచనం. సన్యాసం పుచ్చుకొని హిమాలయాల్లో ముక్కు మూసుకుంటే సరిపోదు. ఇప్పుడు కనువిందు చేసి మరుక్షణం కనుమరుగైపోతున్నా వాటిని పట్టుకుని వేళ్ళాడే మనస్తత్వానికి సంసారం అని పేరు. గృహస్థుగా, కర్తవ్య కర్మలు అనుష్ఠించి తామరాకుపై నీటిచుక్కలా, నీటిమీద పయనిస్తున్న నావలా మసలుకొనే వ్యక్తికి సంసారమనే బురద అంటదు. అలాంటి వ్యక్తిని జీవన్ముక్తుడు అంటారు. మోక్షాన్ని వెతుక్కుంటూ అతడు ఎక్కడికీ వెళ్లడు. స్వర్గం అతడి భావాల్లోనే ప్రవర్తిస్తుంది.
దేహాభిమానం వదిలేసి, వస్తు విశేషాలతో మానసిక సంబంధం పెట్టుకోకపోవటంవల్లే విదేహమనే రాజ్యానికి రాజయ్యాడు జనకుడు. సచ్చిదానంద ఘనుడు అయిన పరమాత్మ ఈ జగత్తుకు మూలపురుషుడు. ఆయన సృష్టిలో భాగం అయిన మనుషులూ ఆనంద స్వరూపులే. కాని, ఈ భూమి మీద కళ్లు విప్పిన వెంటనే ఏడుపు వినిపిస్తుంది. అన్ని జీవరాశుల్లో ఒక్క మనిషికి మాత్రమే ఏడ్వటంకాని, నవ్వటంకాని సాధ్యం. అంటే, ఈ రెండూ మనిషి కొని తెచ్చుకున్నవే కాని, స్వతహాగా, జన్మతః సంక్రమించలేదన్నమాట. ఆహారం, నిద్ర, మైథునం, భయం- ఈ నాలుగూ మనిషికీ మిగతా జీవరాశులకు సమానం. తేడా ఉన్నదల్లా ఒక్క మనసు వల్లే. ఈ మనసు రెండువైపులా పదునున్న కత్తి లాంటిది. తెలివిగా ఉపయోగిస్తే, హాయిగా జీవించవచ్చు. అతితెలివిగా మితిమీరితే పీక తెగిపోవచ్చు. అందుకే, బంధానికి మోక్షానికి మనసే కారణం అంటుంది భగవద్గీత.
ఉన్నదల్లా ఆనందమే. దాన్ని అన్వేషించటానికే మనిషి పుట్టాడు. ఆలోచించే శక్తి, ఎంపిక చేసుకునే అవకాశం, అనుభవించే వెసులుబాటు- అన్నీ మనిషికి ఆ భగవంతుడు ఇచ్చిన వరాలు. వాటిని పెడతోవ పట్టించి భస్మాసురుడిలా వాటికి ఆహుతి కావటమో, ప్రకృతిని జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి- ఈ మూడింటితో అదుపుచేసి శాశ్వతమైన ఆనందం అందుకోవటమో, ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. కొత్తింటి కోడల్లా ఏడుస్తూ వచ్చి, ఇంటికి దీపం ఇల్లాలిలా జీవితాన్ని తీర్చిదిద్దుకోగల అవసరం, అవకాశం ఉన్నట్లు గ్రహించటమే కాదు- వాటిని జీవితానికి అన్వయించుకోవటమే విజ్ఞానం. ప్రపంచం అంతా తనదేనని, తనకు లోబడి నడచుకోవాలని దురాశకు పోవటంవల్లే మనిషి జీవితం శోకహతం అయిపోతున్నది. తెంచుకుంటే దుఃఖం, పంచుకుంటే ఆనందం. అన్నింటినీ కలుపుకొని ఒక నిర్దిష్టమైన గమ్యం వైపు ఈ ప్రపంచం సాగుతున్నది. సౌరశక్తి వల్ల చంద్రుడు వెన్నెల సామ్రాజ్యాన్ని ఏలుతూ, అమృత కిరణాలను భూమికి అందిస్తున్నాడు. సస్యశ్యామలమైన భూమి పైన ఆధారపడి అన్నగత ప్రాణులు జీవనం సాగిస్తున్నాయి. జీవ పరిణామక్రమంలో ఒక ఉన్నత స్థానం చేరుకున్న మానవుడు తన తెలివితేటల్ని తనకే పరిమితం చేసుకుంటున్నాడు. తన సుఖం, అందరి ఆనందంలో భాగం అని, లోకం సుభిక్షంగా ఉంటే తనూ సురక్షితంగా ఉండగలనని గ్రహించకపోవటంవల్ల చివరికి దుఃఖంపాలపడవలసి వస్తోంది. తెంచుకోవటం, ఉంచుకోవటం- ఈ రెండూ అహంకారంవల్ల మనిషిలోతలెత్తిన అవగుణాలు. అర్జునుడిలా జ్ఞానఖడ్గంతో అహంకార జనితమైన చీకటి తెరను చీల్చిన తక్షణం ఆనందం అర్ణవమై వెల్లివిరుస్తుంది. తన నిజస్వరూపం ఆనందమేనని అర్థం అవుతుంది. అహంకారానికి మూలాలు రాగద్వేషాలు. వీటి జన్మస్థలం మనసు. మనసులో చెలరేగే ఆలోచనలు కోరికలై ఈరికలెత్తుతాయి. కామం అంటే కోరిక. అది తీరకపోతే కోపం. కోపంలో ఒళ్లు మరిచిపోవడం మోహం. అందరికీ, అన్నింటికీ దూరమై ఒంటిపిల్లి రాకాసిలా బతకటమే లోభత్వం. అందువల్ల, అహంకారం, దానివల్ల చుట్టుముట్టే మోహపాశం- వీటి బారిన పడకుండా గమ్యం వైపు సాగిపోవటమే జీవిత సాఫల్యం. ప్రయాణికుడు రైలులో కూచుని ఆఖరిమజిలీ చేరేదాకా అంటిపెట్టుకున్నట్లు, మనిషి తన జీవిత యానంలో వివేకాన్ని ఆశ్రయించి ముందుకు సాగితే జయం కలుగుతుంది!
- ఉప్పు రాఘవేంద్రరావు
ᐅ హెచ్చుతగ్గులు
ᐅ హెచ్చుతగ్గులు
'చల్లగా పలకడం సజ్జన లక్షణం. ఆడంబరంగా పలకడం అల్పుడి లక్షణం' అన్నాడు వేమన. వినయంగా ఉన్నంత మాత్రాన, అందవిహీనంగా కనబడినంత మాత్రాన వారిని తక్కువ అంచనా వేయకూడదు. కులాన్నిబట్టి స్థలాన్నిబట్టి అవివేకులు మాత్రమే అధిక గౌరవం ఇస్తారు. వస్త్రాలూ ఆభరణాలూ కొన్నిచోట్లా, కొంతమందిలో మాత్రమే గౌరవం పొందుతాయి. ఉత్తమ వ్యక్తిత్వం మాత్రం అన్నిచోట్లా మన్ననలు అందుకుంటుంది. ఒక ఆధునిక కవి 'హీనంగా చూడకు దేన్నీ' అని ఉపదేశించాడు. ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్లు చిన్న పనులు చేసుకుంటూ జీవించేవారిని చిన్నచూపు చూడటం తగదు. గౌరవం ఇస్తే, గౌరవమే తిరిగి లభిస్తుంది. అవమానకరంగా మాట్లాడితే దుష్ఫలితం అనుభవించక తప్పదు.
మహావిష్ణువు ధరించే పాదుకలను చూసి శంఖ, చక్రాలూ, కిరీటమూ అపహసించాయి. 'మేము చూడు! ఎంత ఉన్నత స్థానంలో ఉన్నామో! నీవో? పాదాల కింద పడిఉన్నావు!' అని ఎగతాళి చేశాయి. 'నేను స్వామి పాదాల కింద ఉన్నందుకు సంతోషిస్తున్నాను. మహర్షులందరూ మన స్వామి పాదాలకే గదా పూజ చేసేది! మహావిష్ణువు పాదసేవా భాగ్యం లభించాలని ఎందరో తపస్సు చేస్తుంటారు. అటువంటి పాదాలను సదా స్పృశించే భాగ్యం నాకు లభించింది కదా!' అన్నవి పాదుకలు వినయంతో! యోగనిద్రలో ఉన్న స్వామి వాటి సంభాషణ విన్నాడని కథ. శ్రీమన్నారాయణుడు త్రేతాయుగంలో శ్రీరామావతారం ధరించాడు. శంఖ చక్రాలు శత్రుఘ్న, భరతులుగా అవతరించాయి. భరతుడు శ్రీరాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి, వాటికే పట్టాభిషేకం గావించి, వాటికి కిరీటాన్ని అలంకరించాడు! భరతుడు శత్రుఘ్నుడితో కలిసి ఆ పాదుకలనే పద్నాలుగేళ్లు సేవించాడు. పాదుకలు కిరీటాన్ని ధరించి ధన్యతనందాయి. రామావతారం సమాప్తమైంది. శంఖ, చక్ర, కిరీటాలు పాదుకల ప్రాధాన్యాన్ని గుర్తించాయి. దేన్నీ హీనంగా చూడకూడదని తెలుసుకున్నాయి.
ఎన్నో కులాలు, మతాలు, జాతులూ మనుషుల్లో ఉన్నాయని భావిస్తాం. ఆలోచించి చూస్తే నిజానికి ఉన్నవి రెండే జాతులు. ఒకటి 'మంచి'. రెండోది 'చెడు'. ఎన్నో వృత్తులుంటాయి. అభిరుచులూ ఉంటాయి. వీటిలో ఏది గొప్పది, ఏది తక్కువది? 'శరీరంలో శిరస్సు పైభాగాన ఉంటుంది కాబట్టి అది ఎక్కువా కాదు. పాదాలు నేలను తాకుతూ ఉంటాయి కాబట్టి అవి తక్కువా కాదు!' అనేవారు మహాత్మాగాంధీ హెచ్చుతగ్గులను గురించి మాట్లాడుతూ.
ప్రకృతిలో ప్రతిదీ దేనికది విశిష్టమైనదే! చిన్నది కూడా కొన్నింటిలో మిన్నగానే ఉంటుందంటాడు ఆర్‌డబ్ల్యు ఎమర్సన్ తన కవితలో. పర్వతం ఉడుతను చూసి 'చిట్టి దొంగా' అని హేళన చేస్తుంది. 'నేను చిట్టి జంతువుననే బాధలేదు. నీ అంత పెద్దదాన్ని కాకపోవచ్చు. అయినా... నువ్వు నా అంత చిన్నదానివి కాగలవా? అలాగే నా అంత చురుకుదనం నీలో ఉందా? నేను నీలాగా అడవిని వీపుమీద మోయలేకపోవచ్చు. కానీ, నాలాగా నీవు గట్టికాయల్ని పటుక్కున కొరకగలవా?' అని ఉడుత పర్వతాన్ని నిలదీస్తుంది! శ్రీరామసేతువు నిర్మాణానికి మహాబలశాలురైన కపి వీరులెందరో రాళ్లు మోశారు. ఉడుత ఎంత, దాని సత్తా ఎంత? తాను అల్పజీవినని అది వెనకంజ వేయలేదు. అది మోసుకువచ్చింది కొద్దిపాటి ఇసుక రేణువుల్నే! శ్రీరాముడి కృపకు పాత్రమైంది. కేరళ దేశాధిపతి కులశేఖరుడు. పరమ భక్తాగ్రేసరుడై 'కులశేఖరాళ్వారు'గా ప్రసిద్ధుడు. 'స్వామీ! వేంకటేశ్వరా! నీ ముందు రాతి గడపగా పడి ఉంటా! అలా అయితే అనునిత్యమూ నీ ముఖారవిందాన్ని తిలకించవచ్చు!' అని ప్రార్థించాడు. నేటికీ శ్రీనివాసుడి పాదాల ముందు ఉన్న తొలి గడపను 'కులశేఖరప్పడి' అని భక్తి భావంతో అంటుంటారు. ఆధిక్యతనూ ఆడంబరతనూ నిజమైన భక్తి కోరుకోదు. ఔన్నత్యమున్నప్పటికీ ఆధ్యాత్మికవేత్తలు ఆడంబరరీతిలో ప్రచారం చేసుకోలేదు. రామానుజుడు, ఆదిశంకరుడు, గురునానక్, చైతన్య ప్రభువు, కబీరు, వేమన... నిరాడంబరంగా జీవించారు. సమాజ వికాసానికి తోడ్పడ్డారు. అందరిపై ఆశీస్సులనే వర్షించారు. ప్రభువైనా చండాలుడైనా ఒక్కటే అన్నాడు అన్నమయ్య. సూరదాస్ ఇలా గానం చేశాడు- 'ఓ స్వామీ! నా దుర్గుణాలను పరిగణించవద్దు. నీ దివ్యనామం సమదృష్టి కలది. ఒక ఇనుప ముక్క దేవాలయంలో దైవ విగ్రహంగా రూపుదాలుస్తుంది. మరొక ఇనుప ముక్క మాంస విక్రేత చేతిలో కత్తిలా తయారవుతుంది. ఆ రెండు ముక్కలూ పరసువేది తగలగానే బంగారంగా మారిపోతాయి గదా!'
అవును... దేవుడి దృష్టిలో అందరూ సమానులే- హెచ్చుతగ్గులన్నీ అల్పుల కల్పనలే!
- డాక్టర్ పులిచెర్ల సాంబశివరావు
ᐅ సద్భావనాశీలం
ᐅ సద్భావనాశీలం
'కాశీలో ఉన్నప్పుడు శివభక్తుడిలా ఉండాలి. తిరుపతిలో ఉన్నప్పుడు వైష్ణవుడిగా ఉండాలి' అనేది పెద్దలవాక్కు. అంటే, ఏ ప్రదేశంలో మనం ఉంటామో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలనేది అందులోని భావం. అంతేకాదు, మన ఉనికివల్ల అక్కడివారికి, ఆ ప్రదేశానికి మేలు జరగాలి.
జగన్నాథుడైనా, శ్రీరాముడు అయోధ్యాపతిగా ఉన్నప్పుడు ఒక మంచి రాజుగానే వ్యవహరించాడు. అరణ్యాల్లో ఉన్నప్పుడు నారవస్త్రాలు ధరించి అరణ్యవాసిగానే జీవిస్తూ, లోక కంటకులైన రాక్షసులను వధించి, తాపసులకు రక్షణతో పాటు ప్రశాంత జీవితాన్ని ప్రసాదించాడు.
శ్రీకృష్ణపరమాత్మ గురుకులంలో సాందీప మహర్షివద్ద అణకువతో, వినయవిధేయతలతో అందరిలో ఒకడిగానే వ్యవహరించాడు. అంతేతప్ప తన దైవత్వాన్ని ఆధిక్యాన్ని ప్రదర్శించలేదు.
స్వయంగా వేదమూర్తి అయిన శ్రీరాముడు- వసిష్ఠుడు, విశ్వామిత్రులనుంచి జ్ఞానబోధను సవినయంగా స్వీకరించాడు. వారి పూజలు పొందగలిగినా వారినే పూజించాడు. వీటినే లోక మర్యాదలుగా చెబుతారు. భూలోకంలోని మర్యాదల్ని పరమాత్మ కూడ పాటించడం మనకు ఆదర్శం కావాలి.
ఈ ప్రాథమిక విషయంపట్ల చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు. తమ అర్హతలను తామే అధికంగా అంచనాలు వేసుకుని, ఎక్కడికి వెళ్లినా అందరూ తమ ఘనతను గుర్తించి గౌరవ మర్యాదలు చూపాలని ఆశిస్తారు.
ఆశించినవన్నీ జరగవు గనుక, ఎవరికీ అర్హతను మించిన అధిక గౌరవాలు, మర్యాదలు లభించవు. ఇందుకు ఆక్రోశించి తమకు అవమానం జరిగిందని ఆగ్రహించడం సరికాదు. దీనివల్ల మనమే నష్టపోతాం.
తనంతటి భక్తుడు తానే అనుకుంటూ, నిత్యమూ గుడికి వెళ్తూ, అక్కడ దేవుడి దగ్గర అనేక కోరికలు కోరతారు కొందరు. అవేమీ తీరని పక్షంలో గుడికి వెళ్లడం మానె య్యడం వివేకం అనిపించుకుంటుందా?
చెరువు మీద కోపంతో స్నానం చెయ్యడం మానేస్తే- చెరువుకేమిటి నష్టం? ముందు మన మనసును కలుషితం చేస్తున్న చెడు భావాల్ని విసర్జించాలి. నిత్యమూ శరీర శుభ్రత చేసుకుంటున్నట్లే మనో మాలిన్యాలను కూడా ఆత్మవిచారం ద్వారా ఆత్మ దర్శన ధ్యానం ద్వారా క్షాళన చేసుకుంటూ ఉండాలి. ఒక గదిని కొన్నాళ్లు అలా వదిలేస్తే ధూళి పేరుకుపోతుంది. బూజు దట్టంగా పట్టుకుంటుంది. చీమలు పుట్టలు పెడతాయి. అందులోకి పాములు ప్రవేశించి, దాన్ని విషనిలయంగా మార్చివేస్తాయి.
సరిగ్గా, ఇదే విధంగా మనసులోనూ జరుగుతుంది. మనసును మందిరంగా చెబుతారు. పూజామందిరం లాగా నిత్యమూ దాన్ని పరిశుభ్రంగా, పవిత్రంగా ఉంచుకోవాలి. లేకపోతే అది పాముల పుట్టగా మారిపోతుంది. అనేక దుశ్చర్యలకు, దుర్మార్గాలకు ప్రేరణ కలిగిస్తుంది. ఏ సమాజంలో ఆధ్యాత్మిక వికాసం ఉండదో, అక్కడ సద్భావనాశీలం ఉండదు. మానవతా విలువలు ఉండవు. అక్కడ అరిషడ్వర్గాలుగా చెప్పే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలదే పెత్తనమవుతుంది. ఆ సమాజం అశాంతికి నిలయంగా నిత్య సంఘర్షణలతో, అంతర్గత విభేదాలతో కునారిల్లుతుంటుంది.
ఈ దుస్థితి నుంచి రక్షణ కలిగించేదే ఆధ్యాత్మిక వికాసం. భారతీయత సజీవంగా ఉన్నంత కాలం, ఇక్కడ ఆధ్యాత్మిక వికాసం వర్ధిల్లుతూనే ఉంటుంది. అందులోనే సద్భావనాశీలం ఇమిడి ఉంది.
మనం ప్రయత్నపూర్వకంగా ఆధ్యాత్మిక జీవితాన్ని ఆశ్రయించి, సద్భావనాశీలాన్ని పెంపొందించుకోవాలి.
అదే మనకు శ్రీరామరక్ష అవుతుంది.
- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్
ᐅ హితం కోరేదే మతం
ᐅ హితం కోరేదే మతం!
మానవజాతి అంతటినీ ఏకతాటిపై నడిపించేది పరస్పర అవగాహన. మనిషిని చూస్తే మనిషికి పడకపోతే ఎలా? అవతలి వ్యక్తి ఏ మతానికి చెందినవాడు, ఏ కులానికి చెందినవాడనే సందేహాలు, భేదభావాలు ఉన్నంతకాలం ప్రగతి కుంటువడుతుంది. ఏ మతంవారైనా సహృదయులైతే చాలు. విశాల దృక్పథం అవసరం. ప్రాథమిక నమ్మకాల విషయంలో మత గురువులు బోధించిన విషయాలను ఎంతవరకు పాటిస్తున్నాం? గురువుల బోధనలను స్వప్రయోజనం కోసం, అనుచిత కార్యకలాపాల కోసం వాటికి వక్రభాష్యం చెప్పి దుర్వినియోగం చేయడం సమంజసం కాదు.
ఏ మతమైనా జనహితమే కోరుతుంది. కత్తులు దూయమని, కుత్తుకలు కోయమని, నెత్తురు చిందించమని చెప్పదు. సాన్నిహిత్యాన్ని పెంపొందించుకొమ్మని, అందరూ ఒక్కటే అనే సద్భావన పెరగడానికి దోహదం చేసేదిగా మతం ఉండాలి. మనుగడను సక్రమ మార్గంలో నడపడానికి ఉపకరించే సాధనం కావాలి. అంతేగాని, మానవుడి ఉనికికే సవాలు కాకూడదు. నిశ్చలంగా, నిర్మలంగా, నిస్వార్థంగా ఉండటానికి ప్రయత్నించండి. అదే మతమంటే అన్నారు స్వామి వివేకానంద. మతంలో రహస్యం సిద్ధాంతాల్లో లేదు. ఆచరణలో ఉందన్నారు. మంచిగా ఉండటం, మంచి చేయడం- ఇదే మతంలో సారాంశం.
ఎవరి మతాన్ని వారు పాటిస్తూ ఇతరుల మతాన్ని గౌరవించాలి. మత మౌఢ్యాన్ని పెంచుకుంటే సమాజం ఛిన్నాభిన్నమై శాంతి, భద్రతలు కరవై చివరికి దుఃఖమే మిగులుతుంది. మతం మార్గదర్శకం చేయాలి. మత్తుమందు కాకూడదు. అదే అందరి అభిమతమై సర్వజన సమ్మతంగా, ప్రజాశ్రేయమే ధ్యేయంగా విలసిల్లాలి. మతాన్ని ఇస్లాములో 'మఝూభ్' అంటారు. అంటే ధర్మపథం. ఆ భగవంతుని, ఆ అల్లాను చేరడానికి ఆనందమార్గం.
అన్ని మతాలూ ప్రేమనే బోధించాయి. ద్వేషాన్ని నిరసించాయి. అన్ని నదులూ సముద్రంలోనే కలుస్తాయి. అన్ని మతాలూ హితాన్నే కోరతాయి. హిందూమతం, ఇస్లాం, క్రైస్తవం, బౌద్ధం, జైనం, సిక్కుమతం- వీటన్నింటినీ నిశితంగా పరిశీలిస్తే వాటి రూపంలోనే కాకుండా సారంలో కూడా సాదృశ్యం కనిపిస్తుంది. భగవద్గీత, ఖురాన్, బైబిల్ బోధించేది ఒక్కటే. అన్నింటిలోనూ ముఖ్యాంశాలు ఒక్కటే. కృష్ణుడైనా, అల్లా అయినా, ఏసయినా ఏ పేరుతో పిలిచినా అది దైవానికే చెందుతుంది. 'ఈశ్వర అల్లా తేరే నామ్' అనే అభిప్రాయంతో గీత, ఖురాన్ ఏకీభవిస్తాయి. భగవద్గీత ప్రకారం ఈశ్వరుడు ప్రజలను తమస్సు నుంచి తేజస్సులోకి గొనిపోతాడు. అలాగే అల్లా చీకటి నుంచి వెలుగులోకి తీసుకెళ్తాడు అంటుంది ఖురాన్. పరబ్రహ్మను 'ఓం తత్‌సత్' అంటే, ఖురాన్ అల్లాను అల్‌హక్ అంటుంది. రెండింటికీ అర్థం సత్యం.
కర్మకాండలు, వివిధ సంస్కారాలు, అనుష్ఠానం తదితరాల్లో మతాల మధ్య తేడాలున్నా, అవన్నీ కేవలం మన ఆత్మతృప్తికి ఏర్పరచుకున్న బాహ్య విషయాలే. వాస్తవానికి మూలంలో సాదృశ్యం ఉంది. వేదసంబంధమైన సంధ్య, ఉపాసన, క్రైస్తవుల ప్రార్థన, ముస్లిముల నమాజు ఒకటే. అన్నీ విశ్వశక్తి, మానసిక, భౌతిక బలాన్ని, సదవగాహన, రుజువర్తన, అంతర్వికాసం ప్రసాదించమని, చెడు ఆకర్షణ నుంచి రక్షణ, కర్తవ్య నిర్వహణకు తగిన మనోబలం అనుగ్రహించమని ప్రార్థిస్తాయి. అర్హులైనవారికి ధర్మం చేయడం పట్ల అన్ని మతాలూ సమానంగా స్పందించి విభిన్న మార్గాలు నిర్దేశిస్తున్నాయి. మతాల వారీగా బాహ్య చిహ్నాలు వేరైనా- వాటి గమ్యం ఒక్కటే. విభిన్న మతాల ఆరాధనా స్థలాలను వివిధ పేర్లతో వ్యవహరించినా అర్థం, పరమార్థం ఒకటే. ఎవరైనా ఆ దేవుడి ముందు, అల్లా ముందు, ప్రభువు ఎదుట మోకరిల్లవలసిందే. ప్రాథమిక సత్యాలు, నైతిక బోధనలు చెక్కుచెదరవు.
బైబిలు 'నేనే సత్యం, జీవితం, మార్గం' అంటుంది. గీతలో కృష్ణభగవానుడు 'సమస్త జీవుల హృదయాల్లో ఉండే ఆత్మను నేనే. సర్వభూతాల ప్రవృత్తి, స్థితి, ప్రళయ కారణం నేనే' అంటాడు. ఖురాన్‌లోనూ ఇదే భావం కనిపిస్తుంది. మతకలహాలు ఎప్పుడూ పనికిరానివి. మతమంటే మాటలు కాదు లేదా పేర్లు కాదు లేదా వర్గాలు కావని, ఆధ్యాత్మికతను అవగాహన చేసుకోవడమని వివేకానందుడు అన్నారు.
ఈ భూమ్మీద మానవులుగా జన్మించినందుకు ఏదైనా సత్కార్యం చేసి జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. మతం బలహీనత కాకూడదు. ఆ బలహీనత దుష్కృతాలు చేయడానికి దోహదం చేయతగదు. వ్యక్తి వికాసానికి, సమాజ శ్రేయానికి ఉపకరించేలా మతాన్ని సరైన రీతిలో అవగాహన చేసుకొని ఆశయాలను మాటలకు, ప్రసంగాలకే పరిమితం చేయకుండా అక్షరాలా ఆచరించిన నాడు అభ్యుదయం వెల్లివిరుస్తుంది.
- వి.ఎస్.ఆర్.మౌళి
ᐅ సత్యదర్శనం
ᐅ సత్యదర్శనం
నాచుకింద నిర్మలమైన నీరు ఉందని తెలుసు. రెండు చేతులతో నాచును పక్కకుపెట్టి నీటిని చూశాం. ఆ జలం అలా కనుమరుగైపోకుండా ఉండాలంటే అడ్డంపెట్టిన చేతులు అలాగే ఉంచాలి. లేదంటే నాచు తిరిగి కమ్ముకుంటుంది. నీరు అదృశ్యమైపోతుంది. సత్యదర్శనం కాగానే అంతా అయిపోయింది అనుకుంటే సరికాదు. మాయ విజృంభణను అరికట్టాలి. లేకపోతే మళ్ళీ మాయలోనే పడిపోతాం. అజ్ఞానుల కంటే జ్ఞానులకే మాయతో పోరాటం ఎక్కువ.
సత్యం తెలిసినవాడు విశ్వంలో తన స్థానం ఏమిటో తెలుసుకుంటాడు. చాలా విషయాల్లో తన అసమర్థత, నిస్సహాయతలను నిజాయతీగా ఒప్పుకొంటాడు. దైవం తాలూకు అపరిమిత, అనంత, సర్వవ్యాప్తి తత్వానికి తలవంచుతాడు. సర్వ సమర్పణ చేసుకుంటాడు. సత్యదర్శనం కాయను పండు చేస్తుంది. రాయిని శిల్పం చేస్తుంది. మూగవాడిచేత మాటలు పలికించి, పాటలు పాడిస్తుంది. సత్యదర్శనం భక్తిని ఇచ్చి, భక్తుని చేసి వినయ విధేయతలు నేర్పించి, నిరాడంబర జీవనం నేర్పుతుంది. పంక్తిలో భోజనానికి చిట్టచివరివాడిగా రమ్మంటుంది.
సత్యదర్శనం అంటే పూజలు, హారతులు కాదు. సత్యదర్శనం అంటే వూరేగింపులు, పల్లకీలు కాదు. సత్యదర్శనం అంటే మంత్రాలు, తంత్రాలు కాదు. సత్యదర్శనం అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు, విలాసవంతమైన జీవితం, అందరికంటే నేనే గొప్ప వ్యక్తిని అనే అహంకారం అసలే కాదు. సత్యదర్శనం అంటే, సాహసవంతమైన ఆధ్యాత్మిక జీవితం. కష్టాలను, కడగండ్లను తిరస్కరించకుండా ఎదురుగా వెళ్లటం. సత్యదర్శనం అంటే అత్యంత హేయమైన పరిస్థితుల్లో కూడా పూర్ణ విశ్వాసంతో జీవించటం. మరణంలోనూ ఇతరులకు సహాయం చేసే అవకాశాల కోసం తపనపడటం. సత్యదర్శనం అంటే నదిలాంటి జీవితం సముద్రంగా మారిపోవటం.
సత్యదర్శనం అంటే కాలంతో సర్దుకుపోవటం, ప్రకృతితో మమేకం కావటం. వసుధైక కుటుంబంలో తన పాత్రను అత్యంత సమర్థంగా నిర్వహించటం. దారి తప్పిపోయినవాళ్లను దారిలో పెట్టి- అంధులకు దీపమైన ఒక హెలెన్ కెల్లర్‌లాగ, బ్రెయిలీలాగ జీవితాన్ని మార్చుకోవటం. జీవనయాత్ర సాగించటం.
లోక మర్యాదకోసం పాకులాడకుండా, ఆశ, వ్యామోహం బారినపడకుండా పొందిన అనుభూతి కలకాలం నిలుపుకొంటూ కల్లాకపటంలేని భోళాశంకరుడిలా పిలిస్తే పలకటం. జ్ఞానం కలిగితే కొమ్ములు మొలవవు. సత్యం తెలిస్తే నాలుగు శిరస్సులు అదనంగా చేరవు. అదే శరీరం, అవే బాధలు. భౌతికంగా ఎంత బాధపడినా సామాన్యులను పీడించే మానసిక ఒత్తిళ్లు ఉండవు. ప్రశాంతత చెక్కుచెదరదు. అదే తేడా. దీనికి ఉదాహరణగా రమణ మహర్షి రాచపుండును, రామకృష్ణ పరమహంస రక్తగ్రహణిని చెప్పుకోవచ్చు.
సత్యం అంటే జ్ఞానం. జ్ఞానం అంటే విశ్వరహస్యం. ఇది తెలిసినవాడు లోకానికి ఉపయోగపడతాడు. లోకోపకారులను తయారు చెయ్యడానికి దైవం ఈ జ్ఞానాన్ని గురుపరంపరలో ఒకరి తరవాత ఒకరికి అందిస్తూ వస్తున్నాడు. అందుకే శ్రీకృష్ణుడు ఈ జ్ఞానాన్ని ముందు సూర్యుడికి ఉపదేశించానని చెప్పాడు. ఈ జ్ఞాన మూలం వేద వాంగ్మయంగా ప్రాచీన రుషులు తెలియజెప్పారు.
జ్ఞానం కంటికి కనిపిస్తుందా? జ్ఞానం మనసుకు కనిపిస్తుందా? జ్ఞానం బుద్దికి తెలుస్తుంది. వివేకమై ప్రకాశిస్తుంది. సత్యమై తనకు తానే సాక్షాత్కరిస్తుంది. మూడోనేత్రం ఇచ్చి అప్పుడు అర్జునుడికి విశ్వరూప జ్ఞానాన్ని శ్రీకృష్ణుడు ఇచ్చాడు. తరవాత హాయిగా యుద్ధం చెయ్యమన్నాడు. అర్జునుడిలో ఏ మార్పూ లేదు. మోహనాశనం తప్ప, భక్త స్థితి తప్ప.
- ఆనందసాయి స్వామి
ᐅ ఆత్మజ్ఞానం
ᐅ ఆత్మజ్ఞానం
ఆత్మకు లింగభేదం లేదు. గాలి, నీరు, అగ్ని, ఆయుధం ఆత్మపై ప్రభావం చూపలేవు. అదో అదృశ్య శక్తి. జీవుల్లో చైతన్యంగా ఆత్మ భాసిల్లుతుంది. తనలోని ఆత్మనే గుర్తించలేని మానవుడు సహజంగా ఎదుటివాడిలోని ఆత్మనూ చూడలేకపోతున్నాడు. తనవాళ్లు, పరాయివాళ్లు, మిత్రులు, శత్రువులు అనే ద్వంద్వాలకు దాసుడై అజ్ఞాన తిమిరంలో కొట్టుమిట్టాడుతున్నాడు. కస్తూరి మృగం పరిమళభరితమైన కస్తూరి తన బొడ్డులోనే ఉందని గ్రహించలేక ఆ సువాసన ఎక్కడినుంచి వస్తోందో తెలుసుకోవాలనే తహతహ, తపనతో నలుదిక్కులకూ పరుగులెడుతుందట! మనిషి పరమ చైతన్య స్వరూపమైన ఆత్మ. దాన్ని గుర్తించడం వల్ల కలిగే ఆనందం తనలోనే ఉన్నాయని తెలుసుకోలేక ఆనందం కోసం ప్రపంచమంతా గాలిస్తూ అది లభ్యంకాక నిరాశకు గురవుతున్నాడు. ఆత్మశక్తి మహోన్నతమైనది. ఆ శక్తి వల్లనే ఇంద్రియ కలాపాలను జీవుడు గుర్తించగలుగుతాడు.
ఎన్ని మంచి పనులు చేసినా- ఒక్క తప్పుచేస్తే లోకం మంచిని మరచిపోయి, తప్పును వేలెత్తి చూపుతుంది. భగవంతుడు అలా కాదు. ఎన్ని పాపకర్మలు ఒనర్చినా పశ్చాత్తాపం చెంది ప్రార్థిస్తే కరుణ కురిపించి అనుగ్రహిస్తాడు. క్రియ చేయాలంటే మనసు తోడ్పాటు అవసరం. ఆలోచన కార్యరూపం దాల్చాలంటే కర్మ అవసరం. వివేకవంతులు కర్మకు నమస్కరించి పని ప్రారంభిస్తారు. మనసు ఎప్పుడూ ఓ ఆలంబన కోరుకుంటుంది. ఆలంబన దొరకని పక్షంలో మనిషిలో అశాంతి చెలరేగుతుంది. పండితులు సమస్త జీవుల్లోని ఆత్మ ఒక్కటే అని భావిస్తారు. ఏకనాథుడు భక్తి సాహిత్యాన్ని ఔపోసన పట్టిన సత్కవి. ఆయన రచించిన ఏకనాథ భాగవతం ఓ విశిష్ట కావ్యం. ముందుతరంవారైన ధ్యానేశ్వరుడు, నామదేవుడు, తరవాతి కాలంలో జన్మించిన తులసీదాసుకు మధ్య వారధిగా ప్రకాశించాడు ఏకనాథుడు. ఆత్మతత్వం ఆకళింపు చేసుకొని అంటరానితనం రూపుమాపేందుకు శ్రమించాడు. సర్వజీవులపట్ల ప్రేమ కనబరచిన ఏకనాథుడు మహా శివభక్తుడు. ఒకరోజు ఆయన శివాభిషేకం కోసం పవిత్ర గోదావరి జలం తీసుకు వెళుతుండగా దారిలో ఓ జంతువు దాహార్తితో బాధపడటం ఆయన కంటపడింది. హృదయం ద్రవించిన ఆయన తను తీసుకువెళుతున్న అభిషేక జలాన్ని దానికి తాగించి ఆ జీవి ప్రాణం నిలబెట్టాడు. ఆత్మజ్ఞాని అయిన ఏకనాథుడు చివరి ఘడియల్లో పవిత్ర గోదావరి నదిలో మునిగి జలసమాధి పొంది శివైక్యం చెందాడు.
ఆత్మజ్ఞాన ప్రస్తావన శ్రీకృష్ణ భగవానుడి ఉటంకింపు లేకుండా పరిపూర్ణం కాదు. కురుక్షేత్రంలో తనవారిని చంపవలసి రావటంతో విషాదంలో కూరుకుపోయిన అర్జునుడికి గీతోపదేశం చేసిన భగవానుడు అర్జున సముఖంగా మానవాళికి మహోపకారం చేశాడు. పురందరదాసు, త్యాగయ్య, అన్నమాచార్యుడు, మీరాబాయి, కబీరు, సూరదాసు, రామదాసు, తుకారాం వంటి వారందరూ భక్తకోటికి ఆత్మజ్ఞానం అందించిన మహనీయులు. పడమరకు వెళ్లేకొద్దీ తూర్పు దూరమైనట్లు ప్రాపంచిక విషయాల వైపు సాధకుడు మక్కువ చూపేకొద్దీ దైవానికి దూరమవుతాడు. ఈ స్పృహ తెలియడంవల్ల జీవుడికి దేవుడితోగల అభేదం బోధపడుతుంది. నీటిలో వృక్షం ప్రతిబింబాన్ని చూసినప్పుడు కొమ్మలు, ఆకులు కిందకు, మూలం పైకి కనబడినట్లు- భక్తి జ్ఞాన వైరాగ్యాల సహాయంతో వాస్తవాన్ని భిన్నంగా చూపే మాయను గుర్తించి, ప్రాపంచిక ఆకర్షణలపైకి మనసు మరలకుండా పరమాత్మ పైకి దృష్టి సారించమంటాడు గీతాచార్యుడు.
- గోపాలుని రఘుపతిరావు
ᐅ జ్ఞాన పేటికలు
ᐅ జ్ఞాన పేటికలు
భారతీయ రుషులు... జ్ఞాన పేటికలు, త్యాగ వాటికలు. వారు పెట్టిన జ్ఞానభిక్షతో ప్రపంచం సుసంపన్నమైంది. వేదాలుతప్ప మిగిలిన భారతీయ వాంగ్మయమంతా వారి భావధార. జీవితాలకు జీవితాలను పణంగా పెట్టి వారు చేసిన ధ్యానయోగం, ఆంతరిక ప్రయోగం ద్వారా లోక కల్యాణ కారక ఫలాలను ప్రపంచానికి అందించాయి. వేదాలు కూడా నేరుగా సాధారణ మానవ మాత్రులకు అందినవి కావు. ధ్యానంలో రుషులు గ్రహించి ప్రపంచానికి అనుగ్రహించినవి.
ప్రపంచం ప్రయోజనం పొందుతున్న శాస్త్రాలు రుషులు ప్రసాదించినవే. ప్రతి విషయానికి సంబంధించిన ప్రమాణ గ్రంథాలుగా శాస్త్రాలు రూపొందాయి. అగోచర విషయాలను కూడా 'త్రీ డీ'లో భూతద్దంలో పెట్టి మన అవగాహనకు అందుబాటులో ఉంచిన ఉదారులు రుషులు. ముఖ్యంగా ప్రపంచానికే ఆచార్యత్వం వహిస్తున్న భారతీయ ఆధ్యాత్మిక జ్ఞానపీఠం భారతీయ రుషుల కృషి సదనం. వారి తపో ఫలదానం. ఆధ్యాత్మిక విషయాలే కాదు- సామాజిక రాజకీయ అంశ ప్రధానాలుగా చిత్రీకరించిన వాల్మీకి, వ్యాస మహర్షి ప్రోక్తాలైన రామాయణ, మహాభారతాది ఇతిహాసాలూ మానవ జీవన సౌభాగ్యానికి కరదీపికలు, రత్నపేటికలు, ప్రమాణ గ్రంథాలు, శాస్త్ర సమానాలు. మానవ జీవన ప్రయాణంలో ప్రతి మజిలీనే కాదు, ప్రతి ప్రయాణ పథం, పదం... వీటికి సంబంధించిన కూలంకష జ్ఞానాన్ని రుషులు శాస్త్రాల పేరిట మనకు అందించారు. ఇక ఆధ్యాత్మిక అంశాల సంగతి చెప్పనే అక్కర్లేదు. అగమ్యగోచరులైన భగవంతుని ఆనుపానులతో సహా రూప విశేషాలు, సాధనారహస్యాలు... ఒకటనేముంది? బొమ్మగా మన హృదయంలో నెలకొనివున్న భగవంతుని బ్రహ్మగా మన కట్టెదుట ప్రత్యక్షం చేసేవరకు అన్ని క్రియా సాధనలను అరటిపండులా ఒలిచి మన మనో జిహ్వకు అందించారు. ఒక వాల్మీకి, ఒక వ్యాసుడు, ఒక పతంజలి, ఒక శంకరాచార్యులు, ఒక కణ్వుడు, ఓ కణాదుడు... ఎందరు, ఎందరని! ఆ ఆధ్యాత్మిక మణి మంజూషలు, ఆ జ్ఞాన శిఖరాలు మనకేమిచ్చాయో మనకు తెలుసా? ఆ ఆధ్యాత్మిక మణి మంజూషల్లో ఎన్ని జ్ఞానమణులు! మనకోసం మనమూ అధిరోహించాలని శ్రమదమాదుల కోర్చి మెట్లు పేరుస్తూ పారమార్థిక శిఖరాగ్రాలను చేరుకున్న రుషులు నిష్కామాగ్రగణ్యులు. భగవత్ సమానంగా ప్రాతఃస్మరణీయులు.
అరణ్యాల్లో ఒక చిన్న పర్ణశాలలో కౌపీనధారులై, దుంపలు, కాయకసరులు తింటూ, కటిక నేలమీద పవళిస్తూ తపమాచరించే రుషివరులు ప్రపంచ శాంతికి పవన రాజాలు సృష్టిస్తున్నారు. లోకకల్యాణానికి పవిత్ర సంబారాలు సమకూరుస్తున్నారు. వారి సాధనాసారాన్ని మన అవగాహనకోసం శాస్త్ర రూపంలో అక్షయ అక్షరబద్ధం చేశారు. ప్రాచీనులే కాదు. ఆధునిక రుషులూ మనకోసం శ్రేయోదాయక రచనలతో మన జ్ఞాన నాడిని స్పృశిస్తున్నారు. ఒక యోగి ఆత్మకథరాసి ఆధునిక ఆధ్యాత్మిక రంగాన్ని ఒక్క కుదుపు కుదిపిన పరమహంస యోగానంద, స్వామి వివేకానంద, స్వామి చిన్మయానంద, స్వామి శారదానంద, స్వామి శివానంద, స్వామి రంగనాథానంద, స్వామి రామా, మలయాళ స్వామి, దయానంద సరస్వతి, శ్రీరామకృష్ణులను యథాతథంగా ప్రపంచానికి అందించిన 'మ' (మహేంద్రనాథ్ గుప్త)... ఎందరో మహాపురుషులు, రుషులు! కానీ మనం వారు వండిపెట్టిన మృష్టాన్నాన్ని ఆచమనం చేసి ఆస్వాదించకుండా భిక్షుకుల్లా పరాయి కూటికి దోసిలి చాపుతున్నాం. రాచఠీవితో తపోజీవనం గడిపిన మానవోత్తములు మన పూర్వులు. ప్రపంచం ఉన్నంతకాలం వారి వారసులకు భుక్తికి, భక్తికి, ముక్తికి కూడా లోటు లేకుండా రాకుండా సాహిత్య రూపంలో, శాస్త్రాల రూపంలో నిధులను నిక్షిప్తం చేసిపోయారు. చిరునామా ఇచ్చారు. తాళం చెవీ ఇచ్చారు. కానీ... ఏమైంది మనకు? ఏమైపోతున్నాం మనం?! సనాతనం, సదా అధునాతనం అయిన మన సంస్కృతిని ప్రపంచ దేశాలన్నీ అత్యంత ఆసక్తితో, ఆరాధనతో అధ్యయనం చేస్తూ ఉంటే, ఆచరించే ప్రయత్నం చేస్తూ ఉంటే- మనం మాత్రం పాత చింతకాయ పచ్చడిలా అటకెక్కించిపెట్టాం. మన ధ్యానం, మన యోగం, మన హోమం... ఇప్పుడు ప్రపంచ ఆరాధ్యాలైనాయి. మన వేదాలు విశ్వానికే శిరోధార్యాలైనాయి- మనకు తప్ప!
డి.డి.టి, ఫినాయిల్ విష వాసనలు వదిలి గంధం, పసుపు, అగరొత్తులు, ఆవుపేడల పరిమళాలను ఆఘ్రాణిద్దాం. మత్తుపదార్థాలు వదిలి పాలు, తేనె, తులసితీర్థం పానం చేద్దాం. పిజ్జాలు, బర్గర్ల పిచ్చి వదిలి జొన్నరొట్టె, రాగి గంజి, పచ్చిధాన్యాల మొలకలు, తాజా పండ్లు, కూరలు ఆనందిద్దాం. 'యోగ' చేసి యోగులమైపోదాం. దేవుణ్ని అన్వేషించే శ్రమ చేయలేకపోతే ప్రత్యక్ష దైవాలు తల్లి, తండ్రి, గురువు, సూర్యుడు... ఉండనే ఉన్నారు. ప్రతి మనిషిలో ఒక రుషి దాగి ఉన్నాడు. కృషితో వెలికితీద్దాం. రుషి జీవనం సాగు చేద్దాం.
- చక్కిలం విజయలక్ష్మి
ᐅ హనుమాన్ చాలీసా
ᐅ హనుమాన్ చాలీసా
సుప్రసిద్ధ హిందీ ప్రాచీన భక్తకవి, శ్రీరామ భక్తుల్లో అగ్రగణ్యుడు 'రామచరితమానస్' అనే పేరుతో రామాయణం రచించిన గోస్వామి తులసీదాసు తీర్థాటన చేస్తూ పండరీపురం చేరి, అక్కడ కొంతకాలం నివసించాడు. నిత్యకృత్యాల్లో భాగంగా ఓ రోజున 'చంద్రభాగా'నదిలో స్నానం చేసి, విఠలనాథుని ధ్యానిస్తూ నదీ తీరాన కూర్చుని ఉన్నాడు. అదే సమయంలో ఒక అంధుడు ఇంట్లో తగాదాపడి, నదిలో దూకి ఆత్మహత్య చేసుకుందామని అక్కడికొచ్చాడు. ధ్యానంలో ఉన్న తులసీదాసును ఆ అంధుడి పాదాలు తగిలాయి. అతడు పడిపోయాడు. తులసి వెంటనే ఆ అంధుణ్ని పైకిలేపి, ఆలింగనం చేసుకుని 'క్షమించు నాయనా! నీ కృపాదృష్టిని నాపైన ప్రసరింపజెయ్యి... ఇటు చూడు' అన్నాడు. అంతే... అంధుడికి చూపు వచ్చింది. పరమానందంతో తులసీదాసు పాదాలపైనపడి 'స్వామీ! మీరు నా పాలిట సాక్షాత్తు పాండురంగస్వామే. నాకు దృష్టిని ప్రసాదించారు. మరో జన్మకు నన్ను అర్హుణ్ని చేశారు. ఈ పునర్జన్మను ఆధ్యాత్మిక సేవతో సద్వినియోగం చేసుకుంటాను'. తులసీదాసు అన్నాడు- 'నాయనా. ఇది నా మహిమ కాదు. నేను సామాన్యుణ్ని. విఠల ప్రభువు అనుగ్రహ ప్రాప్తి కలిగింది నీకు. అది దివ్యదృష్టి. నీ శేష జీవితాన్ని దైవచింతనతో ధన్యం చేసుకో!'
తులసీదాసు జీవిత చరిత్రలో ఇలాంటి సంఘటనలెన్నో సంభవించాయి. అవన్నీ భగవంతుడు ఆయన ద్వారా వ్యక్తం చేయించినవే. ఈ విషయం ఆ కాలంలో భారతదేశాన్ని పాలిస్తున్న అక్బరు పాదుషాకు తెలిసింది. తన కొలువుకు రావాల్సిందిగా ఆహ్వానించాడు. 'నీకు చాలా మహిమలున్నట్లు తెలిసింది... నాకు కొన్ని చూపించు, మెప్పించి, పారితోషికాలు స్వీకరించు' అని కబురంపించాడు. 'పాదుషా చక్రవర్తీ! క్షమించు నేను రామదాసును. నాలో ఏ మహిమలు లేవు. నిమిత్తమాత్రుణ్ని. ఏమైనా ఎప్పుడైనా వ్యక్తమైతే, అవి శ్రీరామచంద్రమూర్తి లీలలు!' అని బదులిచ్చాడు. అక్బరుకు ఆగ్రహం కలిగింది. 'ఏమిటీ, పాదుషానే ధిక్కరిస్తున్నావా! నా మాట వినని వాళ్లకు మరణదండన తప్పదన్న సంగతి నీకు తెలుసా?' అని గద్దించాడు. తులసీదాసు వినమ్రుడై బదులు పలికాడు- 'మరణమే శరణ్యమని రాముడి సంకల్పమైతే ఆ తరుణం ఆపినా ఆగదు' అన్నాడు.
అక్బరు క్రోధం తీవ్రస్థాయికి చేరుకుంది. తన ఆజ్ఞను ధిక్కరించినందుకు భటుల్ని పిలిచి తులసీదాసును కొరడాలతో కొట్టవలసిందిగా ఆదేశించాడు. తులసి రెండు చేతులు జోడించి రామనామ స్మరణం చేశాడు. భటుల చేతుల్లోని కొరడాలు లేచినవి లేచినట్లే ఉండిపోయాయి. అక్బరుతో సహా భటులను భయంకరమైన చూపులతో, అరుపులతో అసంఖ్యాకమైన కోతులు బెదిరించసాగాయి. అంతా నిలువునా కంపించిపోసాగారు. చుట్టూ చేరిన కోతులు వాళ్లను అడుగైనా కదలనివ్వడం లేదు. అక్బరు దిగ్భ్రాంతి చెంది దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాడు. తన పొరపాటు తెలుసుకున్నాడు. తులసీదాసు పాదాల మీద పడిపోయి కన్నీరు, మున్నీరుగా విలపించసాగాడు. తులసికేమీ అర్థం కాలేదు. కారణమడిగితే తన దయనీయస్థితిని వివరించాడు అక్బరు. తనకే కోతులు కనిపించడం లేదే. భక్తి ప్రపత్తులతో హనుమను ప్రార్థించాడు- 'స్వామీ! నాపైన ఎందుకింత నిర్దయ? వీరందరికీ దరిసెనమిచ్చి కరుణించావు కదా, నాకెందుకా సౌభాగ్యం ప్రసాదించవు? నేను చేసిన అపరాధం ఏదైనా ఉంటే క్షమించు' అంటూ దుఃఖ బాష్పధారలు స్రవిస్తూంటే, ఎలుగెత్తి వాయునందనుణ్ని అనేక విధాల స్తుతిచేశాడు. పవనసుతుని దరిసెనమంది పరమానందభరితమైనాడు.
అదే హనుమాన్ చాలీసాగా జగత్ప్రసిద్ధి పొందింది. మారుతి కటాక్ష వరమహిమచేత తులసీ విరచిత 'హనుమాన్ చాలీసా' మోక్ష తులసీదళమై రామనామ జపసాధకులను పునీతం చేస్తోంది.
- చిమ్మపూడి శ్రీరామమూర్తి
ᐅ దివ్యాభిరుచి
ᐅ దివ్యాభిరుచి
ఆత్మజ్ఞాన సాధన అత్యంత కఠినం. కానీ... అంత కఠినం కాదు. ఇది ఎలా సాధ్యం!? మన మనసుకు నచ్చిన పని ఆయాసాన్నివ్వదు. ఆనందాన్నిస్తుంది. ఇష్టమైన పని కష్టం అనిపించదు. అది ఎంత కష్టమైనా, క్లిష్టతరమైనా. ఆంగ్లంలో 'హాబీ' (అభిరుచి) అని ఒక మాట ఉంది. అలాంటిదన్నమాట. మరోమాట ఉంది- వృత్తిపర సంతృప్తి అని. చేసేపనిలో ఆనందాన్ని పొందటం. ఏదైనా ఒక పని ఉంది. ఆ పని చేయక తప్పదు. ఆ పనే మనకు ఆనందాన్నిచ్చేదయితే?! అద్భుతంగా ఉంటుంది. ఆత్మజ్ఞాన సాధన... మనకు జన్మోద్దేశం అదే అయినప్పుడు, మనం దాన్ని సాధించే తీరవలసి ఉన్నప్పుడు, అప్పుడు... దాన్ని మన అభిరుచిగా కూడా మలచుకోగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది!!! అప్పుడు, అప్పుడే అత్యంత కష్టతరమూ, క్లిష్టతరమూ అయిన ఆత్మజ్ఞాన విద్య సులభతరమూ, ఆసక్తికరమూ, ఆనందదాయకమూ అయిపోతుంది.
దీనికంతా కారణమూ, పరిష్కారమూ కూడా మనసే. మనసు దృష్టిలో భగవంతుడు పడేలా చేయాలి. అలా, భగవంతుడి దృష్టిలో మన మనసు పడే అవకాశం లభిస్తుంది. ఎప్పుడైనా ఒక విషయాన్ని, ఒకే ఆలోచననే భావన చేసే మనసుకు ఆ ఒకే అంశం, ఆలోచన భగవంతుడే అయ్యేలా ప్రయత్నించాలి. వివిధాంశాల ఆకర్షణలతో, అనుసరణలతో సదా సందడిగా, తెరిపిలేకుండా ఉండే మనసును ఏకాగ్రపరచే ఉపాయం అంతర్ముఖసాధన మాత్రమే. అంతర్ముఖమయ్యే మనసు బాహ్యరూప విశేషాలను చిత్రించటం మానేస్తుంది. జరిగిన, జరగబోయే సంఘటనలను చర్చించటం మరచిపోతుంది. దాన్ని మాయపుచ్చి ఆంతర్య ద్వారాల్లోకి ప్రవేశపెట్టే ప్రయత్నం మనం చేయాలి. కనీసం దానికి అభిముఖమయ్యే ప్రయత్నం చేయాలి.
మనసు చాలా ఉత్కృష్టమైంది. దాని విలువ దానికి తెలియదు. ఎందుకంటే ఇతరం మీద వాలడమే దానికి అలవాటు. ఆంతర్యంలోకి ఒదిగి చూసుకోవటం దానికి తెలీదు. మనసుకు మనం ఆత్మగౌరవాన్ని నేర్పించాలి. ఔన్నత్యాన్ని మప్పాలి. దాని క్రమ పరిణతిని గుర్తుచేయాలి.
పిల్లలు పసివాళ్లుగా ఉన్నప్పుడు బొమ్మలతో ఆడుకుంటారు. ఆ తరవాత గోలీలు, బిల్లంగోడు ఆడతారు. ఆపై క్రికెట్‌లాంటి క్రీడలు లేదా బుద్ధిని శక్తిని ఉపయోగించి ఆడే చదరంగంలాంటి ఆటలు. జీవితం ఎప్పుడూ పరిణామ శీలం. మనసుకు మనం ఆ విషయాన్ని తెలియజేయాలి. పసిపిల్లల్లా పెద్దయ్యాక కూడా బొమ్మలు పట్టుకు ఆడుకుంటే బాగోదు. మనసైనా అంతే. తెలియని వయసులోలా అర్థం, ప్రయోజనంలేని విషయాల వెంట పరుగులు పెడితే దాని గౌరవానికే లోటు. పరిణతికే చేటు.
ఎంతో ఉన్నతమైనవారికి కొంత అమాయకత్వం ఉంటుంది. పసి మనస్తత్వం ఉంటుంది. మనసూ అంతే. మనసెంతో ఉన్నతమైనది. మనల్ని ఉద్ధరించేది. మనసు ఆసరాతోనే మనం ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాం. ఉత్తమ భూమికలను చేరుకుంటాం. అలాంటి మనసుకు హనుమంతుడిలా దాని శక్తి, ప్రయోజనం దానికి తెలీదు. దాని హుందాతనాన్ని మరచిపోయి పసిదానిలా పరుగులు పెడుతుంది. అది చేయగల ఘనకార్యాన్ని గుర్తించకుండా చిలిపి విషయాలమీద వాలుతుంది. అందువల్ల దాన్ని మచ్చిక చేసుకుని, బడి ఎగ్గొట్టి ఆటలవైపు మళ్లుతున్న పసిపిల్లాణ్ని పాఠశాలవైపు మళ్లించి, అక్కడ వదిలేసినట్లు మనమూ దారి మళ్లించాలి. మాటవినని పసివాడిలా దాన్ని మందలించేందుగ్గానీ, రెండు దెబ్బలు వేసేందుగ్గానీ వీలు లేదు. ఎందుకంటే మనసు చాలా సున్నితమైంది. అలాగే మహాబలీయమైంది. ఓపిగ్గా, మృదువుగా... నీటి ప్రవాహాన్ని ఆపకుండా ఉపాయంగా మనకు కావలసిన దారిలోకి మళ్లించినట్లు... మనసును అంతరంగంలోని అంతర్యామి వైపు మళ్లించాలి.
పదేపదే ఆ మహత్ సౌందర్యాన్ని దర్శింపజేస్తే, ఆ అనన్య 'రుచిరసనాన్ని' ఆస్వాదింపజేస్తే కొంతకాలానికి మనసు భగవత్ స్పృహను, స్మృతిని ఇష్టపడటం, ఆ మాధుర్యం నచ్చి, రెచ్చి ప్రేమించటం ప్రారంభిస్తుంది. మనసుకు భగవత్ చింతన ఒక అభిరుచిలా, అమృతపానంలా, ఆనంద రసాస్వాదనలా మారుతుంది. ఇంకేముంది! రోగీ పాలే కోరాడు. వైద్యుడూ పాలే పథ్యంగా సూచించాడన్నట్లు- మానవుడికి ఏది అత్యవసరమో, అనివార్యమో, ఏది జన్మోద్దేశమో అదే అతడికి అత్యంత ప్రియమైనదైపోయినప్పుడు... ఆత్మజ్ఞాన సాధన మరెంతో సులభమూ, సౌఖ్యవంతమూ అయిపోతుంది.
- చక్కిలం విజయలక్ష్మి
ᐅ మహా శివరాత్రి
ᐅ మహా శివరాత్రి
వినాయకుడు చవితినాడు, రాముడు నవమి రోజు, కృష్ణుడు అష్టమి నాడు పుట్టారు. కాబట్టి, ఏటేటా ఆ పేర్లతో పండుగలు జరుపుకొంటున్నాం. మాఘమాసంలో బహుళ చతుర్దశి నాడు శివోదయం అయినా, శివ చతుర్దశి అనకుండా- శివరాత్రిగా పేర్కొనటం విశేషం. మహా శివరాత్రి ఏడాదికోసారి వచ్చినా, ప్రతి నెలా అదేరోజు శివదీక్ష సాగించటం మరో విశేషం. దేవ, రుషి, మానవ, రాక్షస గణాలు భక్తిపూర్వకంగా ఉపవాస జాగరణలు పాటించటం వెనక పారమార్థికమైన అంతరార్థం ఉంది. జాతి, కుల, మత విచక్షణ లేకుండా ఎవరికి వారే శివరాత్రులు జరుపుకొనే వెసలుబాటు ఉండటం మరింత విశేషం. మహా, మాస శివరాత్రులు జ్ఞాన, ధ్యాన, కార్మిక రూపంలో ఉపయోగించుకోవచ్చు.
'శివ' అన్న పదానికి మంగళకరం, శుభం అని అర్థం. శివుడు అంటే నిత్యమంగళకరమైన వస్తువు కాని మరొకటి కాదు. శ్రుతులు కూడా శివ స్వరూపమైన పరబ్రహ్మాన్నే ప్రతిపాదిస్తున్నాయి. సత్యం, స్వప్రకాశం, అనంతం, అమృతం, ఆత్మ, బ్రహ్మ... అన్నీ శివమే! ఆ శివ స్వరూపమైన జ్ఞానమే కైవల్యం. చిత్రం ఏమిటంటే, మంగళకరమైన శివుడికి దోషరూపంగా భావించే రాత్రికి ఉన్న సంబంధం. అజ్ఞాన రూపమైన చీకటిరాత్రిని జ్ఞానరూపమైన శివ శబ్దానికి అన్వయించటం అసంబద్ధం అనిపించవచ్చు. ఇంద్రియ ప్రవృత్తులు వాటి వ్యాపారాలు అణగిమణిగి ఉండటానికి రాత్రి సమయమే అనుకూలమైంది. రాత్రి అంటే జీవకోటి అలసి సొలసి నిద్రలో జోగే నిశిరాత్రి కానక్కర్లేదు. ఇంద్రియ నిగ్రహం ఉన్న మునికి, వ్యవహార రూపమైన పగలు- రాత్రిలాంటిదని; అవ్యవహార రూపమైన రాత్రి పగలు వంటిదని భగవద్గీత చెబుతోంది. ఇంద్రియ మనోబుద్ధుల్ని శివార్పణం చేయటానికి ఇదొక చక్కని అవకాశం. ఉత్తమ, మధ్యమ, అధమ జీవులందరికీ ఉపయోగకరంగా శివరాత్రిని జ్ఞాన శివరాత్రి, ధ్యాన శివరాత్రి, కార్మిక శివరాత్రి అని మూడు విధాలుగా యథాశక్తి వాడుకోవచ్చు. శివవస్తువును గురించిన విచార ప్రస్థానం జ్ఞాన శివరాత్రి. తైల ధారలా శివవస్తువుపైన శరీర, ఇంద్రియ, మనో బుద్ధులను ఏకాగ్రం చేయటం ధ్యాన శివరాత్రి. అశివ కర్మలకు దూరంగా, నియతితో కర్మాచరణకు పూనుకోవటం కార్మిక శివరాత్రి. ఇది సదా ఆచరించటంవల్ల ఎలాంటివాడైనా శివ సాన్నిధ్యాన్ని పొందవచ్చునని చెబుతారు. అలా కుదరని పక్షంలో నెలకు ఒక్కసారైనా శివకర్మలు ఆచరించటానికే మాస శివరాత్రి నిర్దేశితమైంది. అందుకూ నోచుకోని ఏ జీవి అయినా మహా శివరాత్రినాడు ఏడాదికి ఒక మారు శివరాత్రిని పాటించగలిగితే ధన్యత చేకూరుతుందని చెబుతారు. ఇంత వెసులుబాటు ఉండటం వల్లే పారమార్థిక, సాంస్కృతిక, భౌతిక జీవితాల్లో శివరాత్రి ఇంతగా ప్రత్యేకత సంతరించుకుంది.
- వి.రాఘవేంద్రరావు
ᐅ శని త్రయోదశి
ᐅ శని త్రయోదశి
నవగ్రహాల్లో అతిశక్తిమంతుడిగా, ప్రభావశీలిగా శనీశ్వరుణ్ని పరిగణిస్తారు. శని మకర కుంభరాశులకు అధిపతి. మార్గశిర బహుళ నవమి రోహిణీ నక్షత్రంలో శని జన్మించినట్లు పురాణ కథనం. శనీశ్వరుడి గురించి వివిధ పురాణాలు భిన్న గాథలు వివరిస్తున్నాయి. నవగ్రహాలు సూర్యుడివల్ల ఉద్భవించినవేవని, యముడే శనైశ్చరుడని వాయుపురాణం చెబుతోంది. సూర్యుడి కిరణాలు అనంతమని, వాటిలో ఏడు ప్రధాన కిరణాల నుంచి ఏడు గ్రహాలు అవతరించాయని, స్వరాట్టు అనే కిరణం నుంచి శనైశ్చరుడు ప్రభవించాడని వాయుపురాణం వివరిస్తోంది.
బ్రహ్మపురాణం ప్రకారం సూర్యుడి భార్య సంజ్ఞాదేవి. సూర్యుడికి ఆమెకువైవస్వతుడు, శ్రాద్ధదేవుడు, యముడు-యమున అనే కవలలు జన్మించారు. సంజ్ఞాదేవి సూర్యుడి తేజాన్ని భరించలేక తననుంచి ఛాయను సృజించి తాను పుట్టింటికి వెళ్లిపోయిందట. ఛాయ ద్వారా సూర్యుడికి సావర్ణుడు, శనైశ్చరుడు జన్మించారు. ఆలెక్కన శని సూర్యపుత్రుడే. శని మందగమనం గలవాడు కనుక 'మందుడు' అంటారు. అతడి వాహనం కాకి. ఇష్టమైనవి జిల్లేడు ఆకులు, నువ్వులు, తైలాభిషేకం. శని భార్య జ్యేష్ఠాదేవి.
సర్వజీవరాశిని సత్యమార్గంలో నడిపించడానికి శని అవతరించాడని విజ్ఞుల భావన. సాధారణంగా శని కష్టాలకు పర్యాయపదమని, విఘ్నాలు కలిగిస్తాడని భయపడతారు. శని చీకటిని, రహస్యాలను, కప్పినవాటిని, వయస్సు మళ్లినవారిని ఆవేశిస్తాడని, శని శ్రమసూచక గ్రహమని, దేహంలోని ఎముకలు, మూత్రపిండాల ఆరోగ్యంపై శనిప్రభావం ఉంటుందని విశ్వాసం. వాస్తవంలో- శని శుభకరుడేనని, శని దూషణ కూడదని పెద్దలు చెబుతారు. శనీశ్వర దూషణ సర్వదేవతా దూషణతో సమానమని, శని కృప సకలదేవతా కృపతో సమానమని పండితాభిప్రాయం. సత్యాహింసలు ఆచరిస్తూ, పవిత్రంగా మానవధర్మాన్ని అనుసరించేవారికి శని ఎల్లప్పుడూ అండగా ఉండి శుభాలు కలిగిస్తాడని, ఆ కారణంగా ఎవరినీ బాధించడని విజ్ఞులంటారు. శని బాధ ఆయా మానవుల పూర్వ కర్మ ఫలమని, వారి వారి కర్మలను అనుసరించి శని ఆయా వ్యక్తులను ప్రేరేపించి వారితో ఆ కర్మల ఫలితాలను అనుభవింపజేస్తాడని చెబుతారు.
గనులు, బావులు తవ్వేవారికి, చమురు అన్వేషణ చేసేవారికి శని అనుకూలత లభించగలదని విశ్వాసం. శనిదానంలో ఇనుము, ఆవనూనె, చెప్పులు, గేదె, నల్లటి వస్త్రం, నల్ల ఆవు ప్రాముఖ్యం వహిస్తాయి. త్రయోదశి తిథి, శనివారం శనీశ్వరుడికి ప్రీతిపాత్రం. లోహమయమైన శని ప్రతిమను తైలంగల పాత్రలో ఉంచి నల్లని వస్త్రం కప్పి, నీలిపుష్పాలు, తిలాన్నాలతో పూజించి ప్రతిమను దానం చేయాలంటారు. పద్మపురాణంలో దశరథకృత శనిస్తోత్రం ఉంది. భృగు సంహితలోనూ ఉంది. పరమేశ్వరుడు మునులకు 'శనైశ్చర కవచం' బోధించాడు. అందుకే శనీశ్వరుని 'శివశక్తి'గా కొందరు పేర్కొంటారు. దశరథుడు, నలమహారాజు, ధర్మరాజు మొదలైనవారు శనిని పూజించి తరించారని పురాణాలు చెబుతున్నాయి.
నవగ్రహ యజ్ఞంలో శనిగ్రహ మండలం ధనురాకారంలో ఉంటుంది. జమ్మి ఆకులు సమిధలని, అప్పాలు నైవేద్యమని అగ్ని పురాణం చెబుతోంది. నువ్వులు శని సంబంధ ధాన్యవిశేషం. శనిగ్రహప్రీతి కోసం ఇంద్రనీలం ధరిస్తారు.
సింగణాపురంలో శిలామూర్తిగా వెలసి గుడి గోపురాలు లేని దేవతగా శని భక్తుల పూజలందుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో తూర్పుగోదావరి జిల్లాలోని మందపల్లి శనీశ్వరాలయం ప్రసిద్ధం. ద్రావిడ శైలిలో నల్లరాతిపై మలచిన ఈ విగ్రహాన్ని శని త్రయోదశినాడు అభిషేకిస్తారు.
- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు
ᐅ యత్ర నార్యస్తు పూజ్యంతే
ᐅ యత్ర నార్యస్తు పూజ్యంతే...
మానవ జీవితం అనే విహంగానికి రెండు రెక్కలు. ఒక రెక్క స్త్రీ, రెండో రెక్క పురుషుడు. ఒక్క రెక్కతో పక్షి ఎగరలేదు. మానవ జీవితం కూడా అంతే! స్త్రీ సహాయం లేనిదే మానవుడు ముందడుగు వేయలేడు. ఆత్మ ఒకే తేజస్సుతో సర్వత్రా వ్యాపించి ఉన్నదని మన వేదాంతం ఘోషిస్తోంది. స్త్రీపురుష భేదాన్ని, విచక్షణను సనాతన ధర్మం ఏ కోశానా అంగీకరించదు. ఈ ధర్మపన్నాన్ని ఇటీవల సరిగా అనుసరించకపోవడం వల్ల సమాజంలో పెక్కు అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సత్యాన్ని లోకానికి చాటడానికై రామకృష్ణ పరమహంస ఒక స్త్రీని తన గురువుగా స్వీకరించారు. స్త్రీలను జగన్మాతలుగా అభివర్ణించారు. భార్యను దేవతగా ఆరాధించారు.
ప్రాచీన కాలంలో స్త్రీలను గౌరవించలేదనీ, ఆధునిక యుగంలో అమితంగా గౌరవిస్తున్నామనీ కొందరు భ్రాంతి పడుతుంటారు. వేదకాలంలో మైత్రేయి, గార్గి మొదలైన విదుషీమణులు బ్రహ్మపదార్థాన్ని గురించి లోతైన చర్చలు గావించారు. మహర్షులతో దీటుగా నిలిచారు. గార్గి యాజ్ఞవల్క్య మహర్షితో వాదించగలిగింది. మధ్యయుగాల్లో మనల్ని ఆవరించిన అంధకారం స్త్రీ గౌరవాన్ని అధఃపాతాళానికి నెట్టివేసింది. అదే ఇప్పటికీ కొన్ని రంగాల్లో కొనసాగడం విచారకరం. మన అసమానతలకు మనమే కారకులం. నారీలోకాన్ని గౌరవిస్తేనే దేవతలు హర్షిస్తారనే ఆర్యోక్తిని విస్మరించాం. శక్తికి సజీవ స్వరూపాలైన స్త్రీలను సగౌరవంగా చూడని కారణంగానే భారతజాతి హీనస్థితికి దిగజారిందని వివేకానందులు ఎన్నడో నిర్ధారించారు.
బిడ్డలు తల్లిని దేవతలాగా గౌరవిస్తారు. లోకులు ఇల్లాలిలో తల్లిని దర్శించి గౌరవిస్తారు. మరి భర్త?
స్వామి రామతీర్థకు చిన్నతనంలోనే వివాహం జరిగింది. లాహోర్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. కొంతకాలం తరవాత సన్యసించాలని ఆయన హిమాలయాలకు బయలుదేరారు. భార్య అన్నది- 'నన్ను గుర్తుపెట్టుకుంటారా?' అని. రామతీర్థులు ఇలా జవాబిచ్చారు- ''నేను నిన్ను ప్రత్యేకంగా గుర్తు పెట్టుకోను. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? ముక్కు, చెవులు, కళ్లు నాకున్నాయి. వీటిని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలా? నాలో భాగాలైన అవయవాలు అవి. నీవూ అంతే! నీవు నాలో భాగానివి!' ఇదీ భార్యకు భర్త ఇచ్చే స్థానం. ఇదీ మన సంప్రదాయం.
వాల్మీకి మహర్షి సీత పాత్రను అత్యంత ఉన్నతంగా తీర్చిదిద్దాడు. ఒక సంపూర్ణ పవిత్ర భారత స్త్రీమూర్తిని ప్రపంచం సీతమ్మలో చూడగలుగుతుంది. మంచికి, స్వచ్ఛతకు, పవిత్రతకు మారుపేరుగా ఆమె కనబడుతుంది. ఆమె సహనాన్ని, కష్టమయ గాథను స్మరించినంత మాత్రాన కన్నులు చెమ్మగిల్లుతాయి. సీత ఔన్నత్యం ముందు పురుషుడి పాత్ర నిలవలేదు. స్త్రీజాతి పట్ల గౌరవాన్ని పెంచే విధంగా సీత, సావిత్రి, ద్రౌపది, దమయంతి, చంద్రమతి వంటివారు జీవించారు. భర్తల ఔన్నత్యానికి ఈ సాధ్వీమణులు దోహదం చేశారు. వారిని ఆదర్శంగా భావించే స్త్రీలు నేటికీ సమాజంలో ఉన్నారు. శ్రీరాముడు సత్య ధర్మాలకు నిలయుడు, ఆదర్శ సుతుడు, ఆదర్శ పతి- అయినప్పటికీ, ఈనాటికీ ఆయనలో లోపాల్ని ఎంచడానికి కొందరు ప్రయత్నిస్తూనే ఉన్నారు. సీతమ్మను అగ్నిపరీక్షకు గురిచేసినందుకు శ్రీరామచంద్రుణ్ని తప్పు పడుతున్నారు. ఇదీ ఒక ఉత్తమ స్త్రీకి మన సమాజం ఇచ్చే గౌరవం!
ఆధునిక యుగంలో స్త్రీకి అధిక గౌరవం ఇచ్చిన దేశాలే గొప్ప ఉన్నతిని సాధించాయి. స్త్రీని హీనంగా చూసే జాతులు దుష్ఫలితాలు అనుభవిస్తున్నాయి. స్త్రీలను దైన్య స్థితిలో ఉంచే కుటుంబం ముందడుగు వేయలేదు. స్త్రీల పట్ల కేవలం దయ కాదు చూపవలసింది! వారిని శక్తి స్వరూపిణులుగా భావించి, గౌరవించాలి. ఈ విషయాన్ని వివేకానందస్వామి తమ ప్రసంగాల్లో ఇలా పేర్కొన్నారు-
భగవంతుడు సర్వవ్యాపకుడు. మాతృమూర్తి అయిన స్త్రీలో శక్తి స్థాపకతను దర్శించి ఆరాధించాలి. అలా ఆరాధించగలవాడే నిజమైన మానవుడు. స్త్రీలను గౌరవించే కుటుంబాల్లోనే సుఖశాంతులుంటాయి. వారికే భగవంతుడి ఆశీస్సులు దక్కుతాయి. పాశ్చాత్య దేశాల్లో పురుషులు స్త్రీలను ఉచిత రీతిన గౌరవిస్తారు. అందువల్లనే వారు సంపన్న సౌభాగ్యులై, విజ్ఞానవంతులై, పుష్టితో స్వేచ్ఛాయుతులై వర్ధిల్లుతున్నారు. మన దేశం ప్రపంచ దేశాల్లో బలహీనంగా, వెనకబడి ఉండటానికి కారణం 'మన శక్తి'ని నిరాదరించి అగౌరవపరచడమే!
- డాక్టర్ పులిచెర్ల సాంబశివరావు
ᐅ జీవన సాఫల్యం
ᐅ జీవన సాఫల్యం
కొందర్ని సమాజం 'ధన్యజీవి'గా చెబుతుంది. సంతానంలో అందరూ అభివృద్ధిలోకి రావటం, ఉన్నతమైన వృత్తి ఉద్యోగాలు, సమృద్ధిగా సిరిసంపదలు, ప్రేమగా తల్లిదండ్రుల్ని చూసుకునే సంతానం, బాధ్యతలన్నీ ముగించుకుని ఆలుమగలిద్దరూ తీరుబడిగా తీర్థయాత్రలకు వెళ్లిరావటం వంటి అదృష్టం ఉన్నవారిని లోకం ధన్యజీవులుగా చెప్పటం రివాజు.
వాస్తవానికి, ధన్యత అంటే ఇది కాదు.
తమ వరకు తాము సుఖసంతోషాలతో బతికేందుకు మనుషుల్ని సృజించలేదు భగవంతుడు. విస్తరించే మానవ సమాజాన్ని సృష్టించాడు. పృధివి మీద ధర్మఫలాలు పండించి అందరికీ అవి సమంగా అందేలా మనిషి ప్రవర్తించాలని పరమాత్మ అపేక్షించాడు. వృత్తులు కులాలు అయినాయి, ప్రాథమికంగా ఏ పేచీ రాలేదు. ఆధిక్యతాభావాలు, స్వార్థం పెరిగాక అన్నీ కలగలిసిపోయి అర్థాలు మారిపోయాయి. చెట్టుమీద ఉన్న కోతి గొప్పదీ కాదు. నేలమీద ఉన్న ఏనుగూ తక్కువకాదు. సమభావన కోసం ఆరాటపోరాటాలు పెరిగాయి.
శత్రుభావన లేకపోతే చాలు, అపకారం చెయ్యకపోతే చాలు- అన్నంతగా రాజీపడిపోయారు ప్రజలు. సమభావన అంటే ప్రేమభావన. అందర్నీ సమంగా ప్రేమించి, ఆదరించి గౌరవించే గొప్పగుణం. దానికి వేరే నిర్వచనాల అవసరం లేదు. మనం ఎక్కడ చూసినా కల్తీలేని స్వార్థంతో ప్రవర్తించే మనుషులే దర్శనమిస్తుంటారు. ప్రపంచం ఒక ప్రేమ ఎడారిగా మారిపోయింది. ఎక్కడో ఒక నిజాయతీగల ఆధ్యాత్మికవేత్త, ఒక పుణ్యమూర్తి ఒయాసిస్సులా కనిపిస్తుంటారు. ఇలాంటి పరిస్థితిలో కూడా పరమాత్మ అలవాటుగా కరుణవర్షం కురిపిస్తూనే ఉన్నాడు. చందన వృక్షాలతో పాటు ముళ్లచెట్లకు సైతం ఆ దయాజలం లభిస్తూనే ఉంది.
మనిషి వేగవంతమైన జీవన ప్రయాణంలో ఒక్క క్షణం నిలబడి తనను తాను ప్రశ్నించుకోవాలి. తాను సరిగ్గా జీవిస్తున్నాడో లేదో తరచి చూసుకోవాలి. నిజానికిది, నిద్రకుపక్రమించే ముందు ప్రతిరోజూ చేసుకోవాల్సిన సమీక్ష. ఉదయ ప్రార్థనలో దేవుడిముందు చేయాల్సిన వాగ్దానాల్లో నీతినిజాయతీలతో ప్రవర్తిస్తాననేది ఉండి తీరాలి.
భార్యాబిడ్డలు, మిత్రులు, బంధువులు... వీరందర్నీ సంతోషపరచేందుకు అనేక పనులు చేస్తాం. భగవంతుడు సంతోషించే పనులు ఏం చేస్తున్నాం? ఈ ప్రశ్న ప్రతిరోజూ మనకు మనం వేసుకోవాలి. భగవంతుడు తమ బిడ్డలమైన మనల్ని ఎలా చూస్తున్నాడో, మనం మనతోటివారినీ అలాగే ప్రేమ, కరుణ, దయ, ఉపకారం వంటి దైవీగుణాలతో ఆనందపరచాలి. ఇలా ప్రవర్తించాలనే దృఢసంకల్పం, నియమంతో జీవించగలవారే ధన్యులు. అలాంటివారు కొద్దిమంది ఉన్నా ఆ సమాజం వారిని ప్రత్యేకంగా గుర్తించి గౌరవిస్తుంది. ఏదో విధంగా బతకటం కాదు- ఉత్తమంగా, ఉన్నతంగా జీవించటం వల్లనే జన్మ ధన్యమవుతుంది. వారిదే జన్మసాఫల్యం. ఇతరులది కాదు.
- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్
ᐅ చింత-నిశ్చింత
ᐅ చింత-నిశ్చింత
చింత మనసును దహించివేస్తుంది. నిశ్చింతగా ఉండాల్సిన మనసు చింతతో స్థిరత్వాన్ని కోల్పోతుంది. పాతాళానికి జారిపోతుంది. భవిష్యత్తును నిరాశానిస్పృహలతో నింపుతుంటుంది.
ప్రధానంగా పన్నెండురకాలైన దుర్లక్షణాలవల్ల చింత కలుగుతుంది. వేదనకు గురి చేస్తుంది.
సాధు, సజ్జనులను దూషించడం, కపట సాక్ష్యం చెప్పటం, చేసినమేలును దెప్పటం, సాయంమందిస్తానని తప్పించుకుపోవడం, శరణన్నవారిని వ్యాధిగ్రస్తులను స్త్రీలను పండితులను తూలనాడటం, పరసతులను కూడటం, శత్రువుల దగ్గర తలవాల్చటం, సరిసాటి వారిదగ్గర మానధనాన్ని వీడటం, జ్ఞానవంతులను తిరస్కారభావంతో చూసి అగౌరవపరచటం, పిల్లలకు వృద్ధులకు పెట్టకుండా తన ఆకలి చల్లార్చుకోవడం, నీవే దిక్కు అనుకున్నవారిని విడిచిపెట్టడం, పరుల విత్తాన్ని దొంగిలించడం... ఇవన్నీ చింతకు గురిచేస్తాయి- ఏదో ఒకనాడు. తప్పదు.
దైనందిన జీవితంలో తెలిసో తెలీకో, ఆవేశకావేషాలవల్ల, సరిగ్గా సరైన దృష్టి సారించకపోవడంవల్ల పొరపాట్లు, తప్పులు జరిగిపోతూనే ఉంటాయి.
అందుకే ప్రతిరోజూ 'మనోసమీక్ష' అవసరం. నిదురించే సమయంలో ఆ రోజు చేసిన మంచి చెడులను విశ్లేషించుకోవాలి. ఇదొక దిద్దుబాటు చర్య. దొర్లిన పొరపాట్లు మరుసటిదినం నుంచి పునరావృతం కాకుండా చూసుకోవడం వివేకవంతుల లక్షణం. ప్రవర్తనలో ఏ మార్పు అవసరమో గుర్తెరగాలి. మానవుడు ధర్మంపట్ల అనురక్తి కలిగి ఉండాలి.
ధర్మ జీవనం నిశ్చింతను కలగజేస్తుంది. ధర్మజీవనానికి అంతరభేదాలు, కలిమిలేములు ప్రతిబంధకాలు కావు. అగ్నిలా దహించివేసే చింతను దూరంచేసుకోవాలంటే సత్ ప్రవర్తన ఒక్కటే మార్గం. అందచందాలు, ఆలుబిడ్డలు, ఆస్తిపాస్తులు కలిగినంత మాత్రాన చింతలకు దూరం కాలేరు. ఏదో ఒకచింత కాలుస్తూనే ఉంటుంది. ఇది నాణేనికి రెండో పార్శ్వం. తీరనికోర్కెలూ చింతకు గురిచేయక మానవు.
పురాణేతిహాసాల్లోనూ, చరిత్రలోనూ ఎన్నో పాత్రలు దర్శనమిస్తాయి. సామ్రాజ్యాధీశులు సైతం చింతతో కునారిల్లిన ఘట్టాలు కనిపిస్తాయి.
దశరథుడు శ్రీరాముణ్ని అరణ్యవాసానికి వెళ్ళమని ఆజ్ఞాపించాక, ఎడతెగని చింత ఆ తండ్రి మనసును దహించివేసింది. వరాలడిగిన కైకేయి సైతం సుఖించినదేమీలేదు. చింతతోనే కాలం గడిపింది.
అమేయ పరాక్రముడైన ఇంద్రజిత్తు యుద్ధరంగంలో మరణించాడు. కుమారుడు దూరమైన చింతే రావణుణ్ని తొంభైశాతం చంపేసింది. పుత్రవ్యామోహ పీడనం, లక్ష్యాలు సాధించలేకపోయామన్న అసంతృప్తి, సుఖ సౌఖ్యాలు పొందలేకపోయామన్న బాధ బతుకంతా గానుగెద్దు చందంగానే గడిచిపోతోందన్న వేదన... చింతకు సవాలక్ష కారణాలు!!
చాలామంది వైరాగ్యంతో జీవితాన్ని గడిపేస్తుంటారు. నిజానికది వైరాగ్యచింతన కానేకాదు.
వైరాగ్యచింతన జ్ఞానసిద్ధులకు మాత్రమే కలుగుతుంది. సుఖదుఃఖాలు అంటకపోవడం, వైరాగ్యస్థితి. అది అహంకార, మమకారాలకు చిక్కుపడని స్థితి. పరమహంస పరివ్రాజకాచార్యులకు మాత్రమే ఆ మాట వర్తిస్తుంది.
జీవితంలో ఎదురయ్యే చింతలకు 'దేవుడా, నీదేభారం!' అంటూ వాపోవడం కూడా సరైంది కాదు.
సుఖమైనా, దుఃఖమైనా, చింతైనా, నిశ్చింతైనా మన కర్మల ఫలితమేనన్న సత్యాన్ని గుర్తెరగాలి.
ఉన్నంతలో తృప్తిపడుతూ, ఆశలకు, వ్యామోహాలకు లొంగకుండా సదాచరణతో జీవనం సాగించేవారు ఎందరు లేరు!
నిశ్చలతత్వాన్ని మించిన సుగుణం మరొకటి లేదు. ఓ సాధువు చేస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమాలను వీక్షించిన ఓ మహారాజు 'సంవత్సరానికి సరిపడా ద్రవ్యాన్ని పంపిస్తాను. మీ కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగించండి' అన్నాడు. సాధువు సున్నితంగా తిరస్కరిస్తూ- 'రోజుకొకరు అన్నదానానికి సహకరిస్తున్నారు. అందరికీ తృప్తిగా ఉంటుంది. అందరూ భాగస్వాములైనట్టుగా ఉంటుంది... మన్నించండి!' అన్నాడు.
'అయితే స్వామీ! మా ఆస్థానంలో ప్రజాసంక్షేమాధికారిగా ఉండండి. విస్తృతంగా సేవాకార్యక్రమాలు నిర్వహించండి' అని సూచించాడు రాజు.
'అధికారం నా మనసును ఎప్పుడెలా మారుస్తుందో తెలీదు మహారాజా! నన్ను ఇలాగే ఉండనివ్వండి' అన్నాడు.
సూక్ష్మాన్ని గ్రహించిన మహారాజు సాధువును అభినందించాడు. మనసుకు కట్టుబాటు, లోటుపాట్ల దిద్దుబాటు- నిశ్చింతతో కూడిన జీవితాన్ని ప్రసాదిస్తుంది. దాన్ని మించిన స్వర్గం ఏముంటుంది!
- దానం శివప్రసాదరావు
ᐅ నీ జీవితానికి నీవే సృష్టికర్తవి
ᐅ నీ జీవితానికి నీవే సృష్టికర్తవి!
'అనుక్షణం మంచి కోసం నిరీక్షించు. నీకు మంచే జరుగుతుంది. ఎందుకంటే, ఆ మంచి జరగటానికి నీ మనసే విత్తు నాటింది కనుక. నీవు ఏ విత్తనం వేస్తే ఆ మొక్కే మొలుస్తుంది. ఏదైనా చెడు జరిగితే అనాలోచితంగానే ఆ ప్రమాదం జరగటానికి నీవే కారకుడివయ్యావని అర్థం!
ఒక్కోసారి మనకు ఏదో తప్పు జరిగినట్టనిపిస్తుంది. దానికి కారణం... మనం అనుకున్నట్లుగా అది జరగలేదు కనుక. ఒకటిచేసి మరొకటి జరగాలని ఆశించినప్పుడే ఇలాంటి ఆశాభంగం కలుగుతుంది. ఒకరకం పూలమొక్కను వేసి మరోరకం పూలు పూయలేదని విచారించటంలో అర్థం ఉందా?
నీ చుట్టూ ఉన్న ప్రపంచానికి నీవే సృష్టికర్తవి! 'మనకేదో ప్రమాదం ముంచుకొస్తుంది' అని పదేపదే భయపడేవాళ్లు కొందరుంటారు. తప్పకుండా ఏదోటి జరుగుతుంది. అప్పుడది భరించలేని బాధకు కారణమవుతుంది. నీ చుట్టూ ఉన్నవారిని ప్రేమిస్తూ అందరికీ సాయపడుతూ నీ ప్రపంచాన్ని ఆనందమయం చేసుకుంటూ వెడితే... ఎలాంటి ఇబ్బంది కలిగినా అది కష్టమనిపించదు. అదికూడా జీవితంలో ఒక భాగమైపోతుంది. కేవలం తాత్కాలిక మనఃక్లేశం అనిపిస్తుంది. దాన్ని తట్టుకునే శక్తి నీకు అంతర్గతంగా ఉంటుంది. ఆ ఇబ్బంది తప్పిపోతుంది... కొన్నాళ్లకు అదసలు జరిగిన విషయమే మరుగున పడిపోతుంది.
అసలు మానవజీవితమే ప్రణాళికాబద్ధంగా ఆరంభమవుతుంది. మనల్ని దేవుడు సర్వస్వతంత్రులుగా సృష్టించాడు. ఏం చేయాలనుకున్నా అది మన చేతుల్లోనే ఉంది. నువ్వొక సాహితీవేత్తవి, సంగీతకారుడివి, రాజకీయ నాయకుడివి- స్వయంకృషితో ఏదైనా కాగలవు. అలాగే- హిట్లరువి కావాలన్నా, గౌతమ బుద్ధుడివి కావాలన్నా... నీ చేతుల్లోనే ఉంది. నువ్వు వేసే ప్రతి అడుగూ నీ జీవితపథాన్ని నిర్దేశిస్తుంది. నీ జీవితంలో ఏం జరిగినా ఎలాంటిది జరిగినా దానికి పూర్తిగా నువ్వే కారకుడివి, బాధ్యుడివి. ఆ పరాత్పరుడు నీకలా అన్ని అవకాశాలూ ఇస్తూనే ఉంటాడు కనుక!
జీవితంలో అన్నీ సంతోషపెట్టేవే జరగవు. ఒక్కోసారి దుఃఖపెట్టేవీ సంభవించవచ్చు. రెంటికీ ఆ దేవుడికి కృతజ్ఞత చెప్పటం మరిచిపోకు. ఎందుకంటే, నీ ఎదుగుదలకు ఒక్కోసారి బాధకూడా అవసరం. అంతిమ గమ్యం కొండశిఖరమైతే, నడిచే దారిలో రాళ్లురప్పలు తప్పవు. అందువల్ల జీవితంలో ఏది జరిగినా అది నీ ఉన్నతికి దొరికిన సదవకాశంగానే భావించు. అక్కడినుంచి ఇంకా ఇంకా పైపైకి చేరటానికి కృషి చెయ్యి.
'మీ ప్రాణస్నేహితుడు హఠాత్తుగా మరణించాడు. అది బాధాకరమే! కానీ, ఆ సంఘటన మిమ్మల్ని కుంగదీయకూడదు. నీ గమ్యాన్ని అయోమయం చేయకూడదు. దేవుడిచ్చిన జీవితం ఎంత? చాలా చిన్నది. డెబ్భై ఏళ్లనుకోండి. దానిలో మూడోవంతు నిద్రలోనే గడిచిపోతుంది. మరోవంతు సంపాదన కోసం తాపత్రయపడటంతో గడిచిపోతుంది. తక్కిన మూడోవంతు తప్పులు చేస్తూ, చేసిన తప్పులు దిద్దుకుంటూ గడిపేస్తుంటారు. చివరి క్షణం సమీపించినప్పుడు- అయ్యో, జీవితాన్ని ఇంత చిన్న విషయాలకోసం ఎంత వృథాగా గడిపేశానని వగచి ప్రయోజనమేముంది? చేద్దామనుకున్న మంచి పనులు చేయకుండానే కాలయాపన చేశానే అని గిజగిజలాడి లాభమేముంటుంది?
'పుట్టిన ప్రతి జీవికీ మృత్యువు తప్పదు. ఆ మృత్యువుతో పోలిస్తే వృథా అయిన సమయం గొప్పది కాదు... దానికి ఏ క్షణానైనా సంసిద్ధుడివి కాగలగటమే గొప్ప! అంతకు ఎంతముందైనా చేద్దామనుకున్న మంచి పనులు త్వరత్వరగా చేయటం మరీ గొప్ప! ఏం చేయాలనుకున్నా అంతా నీ చేతుల్లోనే ఉంది...' అని ముగించారు ఆచార్యులు.
శిష్యుల మనసులు విచ్చుకున్నాయి. ఉత్తేజితమయ్యాయి. వారి మస్తిష్కాల్లో జ్ఞానజ్యోతులు వెలిగాయి.
- తటవర్తి రామచంద్రరావు
ᐅ స్తుతి
ᐅ స్తుతి
సూర్యోదయం ఎంతో మనోజ్ఞంగా ఉంది. చంద్రోదయం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. పక్షుల కిలకిలారావాలు శ్రవణానందకరంగా ఉన్నాయి. ప్రకృతి నిశ్చలంగా రుషిలాగ ఉంది... మనసు ఇలాంటి భావాలను కలిగిస్తూ ఉంటుంది. ఈ భావాలకు వశమై పరవశించనివాళ్లు ఉండరు.
ఆనందింపజేయటం, ఆనందంలోకి తీసుకు వెళ్లటం, చివరికి ఆనందమే పరమావధి అని తెలియజేయటం ప్రకృతి ముఖ్య ఉద్దేశం. అదే విశ్వ మౌలిక సూత్రం. జగత్తు మనలను దీవిస్తే, ఆ ఆశీర్వచనాలు అందుకోవడానికి తహతహలాడతాం. ఎవరైనా మనలను స్తుతించడం మొదలుపెడితే, అపరిమితంగా ఆస్వాదించడానికి సిద్ధపడతాం. ఏ స్థితిలోనూ అడ్డు చెప్పడానికి ఇష్టపడం. కాని, మనకు సంబంధించని అద్భుత విషయాలు చెప్పినప్పుడు, కొంతసేపు విని ఆ తరవాత, ఆ విషయం నుంచి మనసు మళ్లిస్తాం. కొందరైతే ఇతరుల గొప్పతనాన్ని వినటానికే ఇష్టపడరు.
ఒక మంచి కవితను, గొప్ప తైలవర్ణచిత్రాన్ని, చక్కటి పద్యాన్ని, హృద్యమైన కథను, ప్రేరణ కలిగించే నవలను, విశేష స్ఫూర్తి అందించే దివ్య భావాన్ని, నలుగురికి ఉపయోగపడే మంచి కార్యాన్ని- మనం ఎందుకు హృదయపూర్వకంగా, విశేషంగా స్వీకరించి, స్పందించి గౌరవ అభినందనలు తెలుపలేం? పనికట్టుకుని ఈ పని చెయ్యాలి. కాని, చెయ్యం. ఎప్పటికో ఏ విదేశంలోనో గౌరవం పొందితే, అప్పుడు స్వదేశంలో ఎత్తిపడేస్తాం. ఎవడో పొగిడితేనే తప్ప మనమూ పొగడలేని దుస్థితి మనది. మనకు ప్రమాణాలు కావాలి. ఫలానా గొప్ప వ్యక్తి చెప్పాడు కాబట్టి గొప్పది కాబట్టి మనం గొప్పది అని అంగీకరించకతప్పదు కాబట్టి గొప్పది అంటుంటాం. ఇటువంటి వ్యక్తులు సహస్ర నామాలతో భగవంతుణ్ని ఎలా పూజిస్తారు, ఎలా స్తుతిస్తారు, ఎలా కీర్తిస్తారు? దైవగుణ విశేషాలు ఎప్పటికి మనకు తెలుస్తాయి? సచ్చిదానంద సముద్రుడిలో సత్యం, చైతన్యం, ఆనందం సముద్రంలా మనల్ని ముంచెత్తినప్పుడే భగవంతుణ్ని స్తుతిస్తామంటే, నిజంగా ఆ పని జరిగితే మనం ఉంటామా? అప్పుడు పొగిడేవాడు ఎవడు? పొగిడించుకునేవాడు ఎవడు?
ఎదగాలి. నదిలాంటి మనం ఎప్పటికైనా సముద్రంగా మారాలి. మారక తప్పదు. చెట్టులాంటి మనం అడవిగా మారాలి. పచ్చదనం అంతటా పరచుకోవాలి. మనసు విశాలమవుతున్న కొద్దీ హృదయంగా మారిపోతుంది. మనిషి పూర్తిగా వికసించినప్పుడు మానవత్వం వెల్లివిరుస్తుంది. దైవత్వం పెల్లుబుకుతుంది. అనుభూతి చెందడం తెలుస్తుంది. స్పందన గుణం పెరుగుతుంది. సత్యం శివం సుందరం అంటే- అర్థం తెలుస్తుంది.
దైవ సౌందర్యమే వివర్తనం చెంది లోకమంతా కనిపిస్తుంది. ఆశ, మోహం వదిలిపెట్టినవాడికి గడ్డిపువ్వులో కూడా ఈశ్వరుడు దర్శనమిస్తాడు. గుడ్డివాడిలో కూడా ఈశ్వరుడు నడిచి వస్తాడు. అంతటా అన్నింటా సత్యాన్ని గ్రహించినప్పుడు వైవిధ్యాలు, వైరుధ్యాలు ఎందుకుంటాయి?
వజ్రం చీకట్లోనూ ప్రకాశిస్తుంది. గొప్పతనాన్ని ఒప్పుకొని తీరాలి. అలా ఒప్పుకోవటంలో మన హృదయ నిర్మలత్వం బయటపడుతుంది.
అన్నమయ్య వేంకటేశ్వరుణ్ని కీర్తించాడు. ఇందులో ఎవరు లాభపడ్డారు? కబీర్ శ్రీరాముణ్ని దోహాలతో అలరించాడు. ఇందులో ఎవరు నిర్మల యశస్సును పొందారు? మీరా శ్రీకృష్ణుణ్ని భజించింది. ఇందులో ఎవరు తరించారు?
అంతా మన కోసమే. విమర్శించినా, నిందించినా, స్తుతించినా, నిర్లిప్తంగా ఉన్నా- భగవంతుడికి ఏమీ అక్కరలేదు. ఏదో విధంగా మనం అతడికి దగ్గరగా ఉన్నామా లేదా అన్నదే... ఆయన చూపు.
విచ్చలవిడిగా మన భావాలను ఖర్చుచేసి, లోకమంతా విస్తరించుకుని ఉన్న సర్వవ్యాపిని పట్టుకోవాలి. అతడు ఏ క్షణాన్నైనా దొరకొచ్చు- పసిపాప నవ్వులో, అందమైన పువ్వులో, నిర్మల పవనంలో, అమ్మ ఆశీర్వచనంలో...
- ఆనంద సాయి స్వామి
ᐅ గమ్యం
ᐅ గమ్యం
ఉన్నతమైన గమ్యం మనిషిని మహోన్నతుణ్ని చేస్తుంది. శాశ్వతమైన కీర్తిని అందిస్తుంది. ఆ గమ్యం చేరుకోవడానికి మనిషి రుషితుల్యుడు కావాలి. దీనికి సాధన ఎంతైనా అవసరం. అలలు తీరాన్ని చేరుకోవాలని ఉబలాటపడినట్లుగా ఆశించిన గమ్యాన్ని చేరుకోవాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. మనసు శక్తిమంతమైనప్పుడు మాత్రమే మనిషి కోరుకున్న గమ్యాన్ని చేరుకోగలుగుతాడు. గమ్యాన్ని చేరాలనే దృఢనిర్ణయమే మనిషిని ముందుకు నడిపిస్తుంది.
భర్తృహరి చెప్పినట్లు ధీరులైనవారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా తలపెట్టిన పనిని పూర్తి చేయకమానరు. ఆకాశగంగను దివి నుంచి భువికి తీసుకువచ్చిన భగీరథ ప్రయత్నం అటువంటిదే కదా! ప్రాచీన వాఞ్మయంలో కూడా ఉన్నతమైన గమ్యంతో కీర్తిశిఖరాలను చేరిన పురాణ పురుషులెందరో మనకు కనిపిస్తారు.
తండ్రి ఆజ్ఞ ప్రకారం శ్రీరాముడు అరణ్యవాసానికి బయలుదేరితే తానూ అన్నవెంట వెళ్ళడానికి సిద్ధమయ్యాడు లక్ష్మణుడు. అటువంటి సమయంలో ఏ తల్లి అయినా మానసిక క్షోభకు గురి అవుతుంది. సుమిత్ర కొడుకును ఆశీర్వదించి 'నాయనా! నీవు వనవాసం కోసమే పుట్టి ఉంటావు. విచారించకు, నీకు తండ్రి తరవాత తండ్రి వంటివాడు శ్రీరాముడు. ఓ తల్లిలా సీత నిన్ను చూసుకుంటుంది. నీవు కూడా నన్ను సీతలో చూసుకోవాలి. సీతారాముల రక్షణను జాగ్రత్త! సుఖంగావెళ్ళిరా నాయనా!' అంటూ కుమారుణ్ని అడవులకు సాగనంపుతుంది. అందుకే ముల్లోకాలలోను లక్ష్మణుడిని మించిన సోదరుడు లేడని రామాయణం చెబుతోంది.
క్రమం తప్పని గమనానికి, గమ్యానికి ప్రతీక అయిన సూర్యుడి సంకల్పబలం ఎంతో గొప్పది. సూర్యోదయ, సూర్యాస్తమయ దృశ్యాలు సుమనోజ్ఞ సృష్టి విన్యాసానికి అద్దంపడుతూ సమస్త ప్రాణికోటికి స్ఫూర్తి కలిగిస్తాయి. ప్రపంచాన్ని జాగృతపరచి కర్మాచరణకు ప్రోత్సహిస్తాయి. మనం చూసే ప్రకృతి నిత్యం చైతన్యవంతమై నియమబద్ధంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటుంది. తెలతెలవారుతుంటే పక్షులు మేల్కొని తమ పని ప్రారంభించి తిరిగి గమ్యం చేరుకుంటాయి. ఆహారం కోసం ఎంతదూరమైనా ప్రయాణిస్తాయి. చీమలు, పిచ్చుకలు, సాలెపురుగులు... నిరంతరం శ్రమిస్తూనే ఉంటాయి. విజయ తీరాలు చేరాలనే కాంక్ష ప్రకృతిలో ప్రతి ప్రాణిలో కనిపిస్తుంది.
మనిషి మాత్రం సహజత్వాన్ని యథాతథంగా స్వీకరించలేక లక్ష్యసాధనలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంటాడు. తెగిన గాలిపటంలా ఎక్కడెక్కడో తిరుగుతాడు. దీనికి కారణం సరైన ఆలోచన లేకపోవడమే. ప్రయత్నం, ధైర్యం, సాహసం, బుద్ధిబలం, కార్యదీక్ష ఉన్నప్పుడు మనిషి ఎలాంటి కార్యాన్ని అయినా సాధించగలుగుతాడు.
తాత్వికచింతనలో నిమగ్నమయ్యే సాధకుడు గమ్యం చేరేవరకు ఎదురయ్యే కష్టసుఖాలన్నింటినీ సమానధర్మంతో స్వీకరిస్తాడు. కటిక నేలపైన సేదతీరి ఎలాంటి ఆహారాన్నయినా భగవంతుడి ప్రసాదంగా తీసుకుంటాడు. ఇలా ఆత్మజ్ఞానం కోసం అన్వేషించే సాధకుడు ఎన్నో అనుభవాలు ఎదుర్కొని చివరికి ఆత్మసాక్షాత్కారం పొందుతాడు. నచికేతుడు దృఢసంకల్పంతో యముడి ద్వారా ఆత్మస్వరూపాన్ని, ఆత్మజ్ఞానాన్ని పొందిన తరవాత బ్రహ్మజ్ఞానిగా మారాడు ఆ బాలుడి పట్టుదల ఎంత అద్భుతమైనదో కదా! మానవాళి శ్రేయస్సు కోసం ముందుకుసాగే వాళ్లకు భగవంతుడి అనుగ్రహం వెన్నంటే ఉంటుంది. బుద్ధుడు అష్టాంగ మార్గం ద్వారా, శ్రీకృష్ణుడు యోగ, జ్ఞాన మార్గాల ద్వారా ప్రజలకు మార్గదర్శకులుగా నిలిచిపోయారు. మంచి గమ్యం నిర్ణయించుకుని ముందుకుసాగితే మనిషి తప్పక కీర్తిశిఖరాలను చేరుకుంటాడు.
- విశ్వనాథ రమ
ᐅ ఆహ్వానిద్దాం
ᐅ ఆహ్వానిద్దాం...
మన ఇంట్లో ఏదైనా శుభకార్యమైతే, ముందుగా మన బంధుమిత్రులను, శ్రేయోభిలాషులను ఎంతో ప్రేమతో, ఆదరణతో ఆహ్వానిస్తాం. వారి రాకకు సంతోషించి, చక్కటి ఆతిథ్యమిచ్చి వీడ్కోలు పలికి మంచివాళ్లమనిపించుకుంటాం. ఎంతెంతో ఖర్చుపెట్టి మన హోదాలు, స్థితిగతులు ఆడంబరంతో, అట్టహాసంగా ప్రకటించుకుంటాం.
ఇదికాక, మన జీవన పర్యంతం ఆహ్వానించదగినవెన్నో ఉంటాయి. ఆహ్వానించి మన మనసులో, మాటలో, ఆచరణలో పదిలపరచుకోదగినవి ఎన్నో ఉంటాయి. వాటితో మనం మమేకమైపోవాలి.
భగవంతుడు మనకు మనసు అనే మహావరాన్ని ప్రసాదించాడు. ఈ మనసులోకి మంచి ఆలోచనలను, మంచి సంస్కారాలను ఆహ్వానించాలి. అప్పుడు మనసు పవిత్రంగా ఉంటుంది. మంచి మనసు ఎదుటివారి ప్రేమను, అభిమానాన్ని ఆహ్వానిస్తుంది. సదభ్యాసాలను, సరస వచనాలను, సత్సాంగత్యాలను ఆహ్వానిస్తుంది. మంచివాక్కునిస్తుంది. ఆ వాక్కు వేదజ్ఞుల్ని, సాధువుల్ని, ఉపదేశికుల్ని సమాదరించి, సంస్కారవంతంగా పలకరిస్తుంది. వాక్కు ద్వారా ఆహ్వానమందుకున్న పౌరాణిక బ్రహ్మలు, బుధులు, సజ్జనులు మనిషిలో మహోన్నతమైన ఆలోచనలకు పునాదులు వేస్తారు. ఎందుకంటే మహాత్ములు, మహర్షులు మానవజాతి సముద్ధరణకు ఎన్నెన్నో త్యాగాలు చేశారు. ఎన్నో హితోక్తులు అందజేశారు. వాటిని మనం మన జీవితాల్లోకి ఆహ్వానించి ఉజ్జ్వల భవితకై సద్వినియోగపరచుకోవలసి ఉంది.
నదులు, వృక్షాలు, పశువులు తమ సుఖంకోసం ఏమీ చేయటంలేదు. పరహితం కోసమే ఉన్నాయి అవన్నీ. అటువంటి పరహిత వ్రతం మనం అలవరచుకోవాలి. అష్టాదశ పురాణాలు తమ పాత్రల ద్వారా మనకెన్నో మంచి మాటలు చెబుతున్నాయి. రామాయణ, భారత, భాగవతాలు, భగవద్గీత అందజేస్తున్న సుభాషితాలను మన జీవితానికి అన్వయం చేసుకోవలసి ఉంది. ధర్మార్థ కామమోక్షాలు, సాత్వికగుణాలు, సత్యాహింసలు, ప్రేమ, త్యాగం, పరోపకారం మొదలైన సులక్షణాలను మన కార్యక్షేత్రంలోకి ఆహ్వానించవలసి ఉంది. ఆర్ష సంస్కృతి, సత్సంప్రదాయాలు, మన పండుగలు, ఆచార వ్యవహారాలు ఆకళింపు చేసుకుని భావితరాలవారికి అవగాహన కలిగించాలి. తల్లిదండ్రులు, ఆచార్యులు, మిత్రులు, పెద్దలపట్ల వ్యవహరించవలసిన తీరు నేర్చుకుని మన నడతను మెరుగుపరచుకోవాలి.
రామకృష్ణ పరమహంస, వివేకానంద, గౌతమబుద్ధుడు, బాపూజీ, అనిబిసెంట్, మదర్ థెరెసా, అల్లూరి, భగత్‌సింగ్, ఝాన్సీ వంటి మహనీయుల గుణ సంపదను మననం చేసుకోవాలి.
వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు, యాగవిశేషాలు, మన మాతృభాషావైశిష్ట్యాలు, ధ్యాన, యోగ, సంధ్యావందనాది పవిత్ర కార్యాల ఆవశ్యకతలు, భరతభూమిపైన అవతరించిన భక్త శిఖామణులు, సాధ్వీమతల్లులు, వాగ్గేయకారులు, మహానాయకులు, మహాపండితుల జీవితచరిత్రల్లో విశేషాంశాల మన హృదయవేదికపైకి ఆహ్వానించుకోవాలి.
'పర్యావరణమే పరమాత్మ' అన్నారు. నేటి స్థల, జల, వాయు కాలుష్యాల మధ్య పర్యావరణాన్ని సంరక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
కౌటిల్యాది అర్థ శాస్త్రవేత్తలు, రాజనీతిజ్ఞుల మేధస్సును మన కార్యక్షేత్రాల్లోకి ఆహ్వానించుకోవాలి.
వివిధ లలితకళల మెలకువలను అవగాహన చేసుకోవలసి ఉంది. దేశవిదేశాల్లోని విభిన్న దర్శనీయ స్థలాలను సందర్శించి, జ్ఞాన సంపదను పెంపొందించుకోవలసి ఉంది.
మానవీయ విలువలకు పట్టంగట్టే నిస్వార్థ మానవాళితో సర్వదా మైత్రినే కోరాలి. కుటుంబంలో సత్సంబంధాలను, అనుబంధ బాంధవ్యాలను ఆహ్వానించాలి. నీతి, నిజాయతీ, నిరాడంబరత, నిరహంకారతత్వం, పారమార్థికత, సమదర్శిత్వం, వినయవిధేయతలు, మన జీవన విధానంతో రంగరించుకోవాలి. జీవకోటే కాదు, ప్రకృతిలోని ప్రత్యణువునుంచీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మనకు మేలే జరుగుతోంది. దాన్ని మనం స్వీకరించేందుకు ఎల్లవేళలా సంసిద్ధులమై ఉండాలి. అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది. జాగరూకులమై తెరిచేందుకు సిద్ధపడాలి. సమయజ్ఞత లేకుంటే జీవితాంతం పశ్చాత్తప్తులమైపోవలసి వస్తుంది.
- చిమ్మపూడి శ్రీరామమూర్తి
Subscribe to:
Posts (Atom)