ᐅశాక్యముని ప్రవచనాలు





శాక్యముని ప్రవచనాలు 

గౌతమ బుద్ధుడిలోని విశ్వప్రేమ ప్రపంచాన్ని విస్మయపరచింది. గడించిన జ్ఞానసంత్తిని జగత్తుకు పంచిన లోకోత్తర పురుషుడు ఆయన. ఆయన రాకతో అహింసాతత్వం తమస్సు నిండిన ధరణికి కొత్త పాఠమై వెలిగింది. అంగుళీమాలుడు వంటి దానవుల్ని కరిగించిన మానవుడాయన. ఆయన బోధలు ఆరని కాంతిపుంజాలై విశ్వవ్యాప్తమయ్యాయి. లోకం ఆచరించాల్సిన సద్ధర్మాన్ని, నిర్మల ప్రేమను వర్షించాయి. తథాగతుని కొన్ని బోధనలు.
మనసులో పేరుకొంటున్న దోషాల్ని సమూలంగా తొలగించి ఆ మనసును నిష్కల్మషం చేసే సాధనాల్లో దానానికి అగ్రస్థానం ఉంది. దాతృత్వాన్ని స్వార్థమనే పొర కప్పివేస్తుంటుంది. 'నాది' అనే గర్వరేఖ తలెత్తని సుమనస్విత గుణం మనిషికి అవసరం. మనిషిని పట్టి పీడిస్తున్న మమత్వరోగాన్ని క్రమంగా తగ్గించే ఔషధంగా దానం అద్భుతంగా పనిచేస్తుంది.

లోకంలో సత్యం, అసత్యం రెండూ ఉన్నాయి. మిథ్యాగర్వం చోటుచేసుకొంటూ ఉండటంవల్ల ప్రజలు సత్యాన్ని గ్రహించలేని అశక్తతకు లోనవుతున్నారు. అసత్యాన్ని సత్యంగా భావిస్తున్నారు. ఈ స్థితి కొనసాగుతూ ఉన్నతకాలం వారు పరమార్థాన్ని గ్రహించలేరు. కల్లోలానికి, అశాంతికి లోనవుతారు. కన్నీటి వ్యధల్ని మిగుల్చుకొంటారు.

ఇంద్రియాకర్షణకు లోనైనప్పుడు విపరీతమైన కోరికలకు బానిసలవుతారు. అసత్యం, అధర్మాల మార్గాల్లో పయనిస్తారు. అవివేకం బలపడి బంధనాలవైపు లాగుతుంది. జీవిత లక్ష్యాల్ని విస్మరింపజేస్తుంది. కర్కశ ప్రవృత్తిని ఆహ్వానిస్తుంది.

వృత్తినైపుణ్యంగల మాలాకారుడు(పూలు గుచ్చి దండలు చేసేవాడు) వివిధ పుష్పాల్ని తీసుకొని మనసును దోచే రకరకాల పూలదండలు తయారుచేస్తాడు. ఉదారభావంతో ధనికుడు తనకు ప్రాప్తించిన సంపత్తిని సద్వినియోగపరచడానికి ఎన్నో పుణ్యసుమాల్ని చేయవచ్చు. మంచిని గుర్తించడం కర్తవ్యంగా భావించి, వేదనలో కుములుతున్న నిరుపేదల కన్నీళ్లు తుడవడానికి వీలైనంతవరకు ఖర్చు చేయవచ్చు. చేసిన సహాయం ఒకరికి వూతకర్ర అయితే అంతకన్నా భాగ్యం ఇంకేముంటుంది? లోతుగా పరిశీలిస్తే- ఇవ్వడంలోని ఆనందాన్ని అభివర్ణించడానికి అక్షరాలు చాలవు.

పైకప్పు సరిగాలేని ఇంటిలోనికి వర్షం నీరు సులభంగా ప్రవేశిస్తుంది. దానివల్ల ఆ ఇల్లు నివాసయోగ్యం కాకపోవచ్చు. కంతలు లేని చక్కటి పైకప్పు ఉన్న ఇంటిలోకి నీరు ప్రవేశించడం సాధ్యపడదు. సుదృఢమైన ఉత్తమ గుణాలు కలిగిన మనసులోకి కామం, క్రోధం, భయం, లోభం లాంటి దుర్లక్షణాలు ప్రవేశించడం దుస్సాధ్యం. ఐహిక సుఖాల్ని అభిలషించే మనుషులు బలహీనమైన హృదయంతో వీటిని వశులవుతారు. స్వార్థంతోనూ, స్వలాభాపేక్షతోనూ తమ జీవితాల్ని గురించి ఆలోచిస్తారు. పరుల క్షేమాన్ని పట్టించుకోరు. ఫలితంగా జీవితమంతా ఉరుకులు పరుగులతోనే వ్యర్థమవుతుంది. చివరకు ఆవేదనలు, భయాలు, సమస్యల వలయాల్లో చిక్కుకొంటారు.

ఎంత రుచికరమైన వంటల రుచినైనా గరిటె గ్రహించలేదు. బుద్ధిహీనుడు జీవితమంతా పండితుల సన్నిధిలో గడిపినా ధర్మాన్ని గ్రహించలేడు. అలాంటి బుద్ధిహీనుడికి ఉన్నత స్థానం కల్పించి గౌరవిస్తే అది అందరి తప్పిదం. ఫలితం అందరూ అనుభవించవలసిందే.

పుడమిలాగా మనుషులు క్షమాగుణాన్ని అలవరచుకొంటే 'అహింస' విరబూస్తుంది. అందుకోసం కోపం వంటి వికారాలకు దూరంగా ఉండాలి. నిర్వికారంగా ఉండటం అభ్యసించాలి. తలుపును మృదువుగా మెల్లగా వేసినా, గట్టిగా దబాలున వేసినా నిర్వికారంగానే ఉంటుంది. మన మనసూ అలాగే ఉండాలి. బురదలేని కాసారంలాగా శోభిల్లాలి.

అర్థం పర్థంలేని మాటలు వేయికన్నా శాంతిని ఉపశమనాన్ని కలిగించే అర్థవంతమైన ఒక్క వాక్యం చాలు.

కపట ప్రవర్తనవల్ల ఏర్పడే నింద తలవంపులు తెస్తుంది. మొదట విశుద్ధమైన నడవడికను మనిషి అలవరచుకోవాలి. ఇది కష్టమైన పని కావచ్చు. మానవత్వానికి ప్రాణం పోసేది ఇదే. దీన్ని సాధించిన తరవాతే ఇతరులకు ఏదైనా మంచిని బోధించాలి. తనను అంటిఉన్న అల్పత్వాన్ని తెలుసుకోవడమే సత్యశోభితమైన జ్ఞానం.

పశువుల కాపరి కర్రపట్టుకుని పశువుల్ని తోలుకు పోతాడు. అలాగే జరామరణాలు జీవుల ఆయువును తోలుకు పోతుంటాయి. ఎప్పటికైనా మరణించక తప్పదని మనుషులు నిత్యం గుర్తుంచుకోవాలి. 'మరణం తప్పదు' అనే అవగాహన లేకపోవడంవల్ల అనవసర విషయాల్లోకి దిగుతుంటారు. భేదభావాలు సృష్టిస్తారు. ప్రలోభాలకు లోనవుతారు. ఘర్షణ పడతారు. శాంతికి విఘాతం కలిగిస్తారు. అనిశ్చిత ప్రపంచంలో నిశ్చయమైంది మరణమే. కాలం దయాదాక్షిణ్యాలు తెలియనిది. ప్రతి మనిషీ క్షణం క్షణం కరగటం తప్పదు- ఈ వాస్తవాలకు గుండెల్లో చోటు కల్పిస్తే మనుషులు వివాదాలకు, సమస్యలకు, దురాశకు స్వార్థానికి దూరంగా ఉంటారు. ఉపశమన సంపన్నులవుతారు. నిరతం శాంతి ప్రియత్వం పరిఢవిల్లుతుంది.


- డాక్టర్ షేక్ మహమ్మద్ ముస్తఫా

ᐅహృదయ వైశాల్యం





హృదయ వైశాల్యం 

గోరంతదీపం ఇంటి మొత్తానికి వెలుగునిస్తుంది. అలాగే గోరంత మంచిమనసు మనిషిని ఉన్నతుణ్ని చేయడమేకాక, చుట్టూఉన్న సమాజాన్నీ అద్భుతంగా ప్రభావితం చేస్తుంది. ఆత్మలో వెలుగుంటే మనిషిలో సౌందర్యం ఉంటుంది. అతని ఆంతరిక బాహ్యసౌందర్యాలవల్ల కుటుంబంలోని సభ్యులంతా సంతోషంగా ఉంటారు. ఇల్లు ప్రశాంతంగా ఉంటే వాడ, వాడ బాగుంటే గ్రామం, రాష్ట్రం, దేశం- ఇలా అన్నీ సుఖశాంతులతో వర్ధిల్లుతాయి. విశ్వమంతా శాంతిమయమై గోచరిస్తుంది. ఇంత జరగడానికి మానవుడి హృదయ వైశాల్యమే ప్రధానకారణం. హృదయ వైశాల్యమంటే మనసులో సర్వదా క్షమ, సహనం, శ్రద్ధ, పరోపకార బుద్ధి, ప్రేమ, అహింసవంటి సద్గుణాలకు చోటు పుట్టడమన్నమాట.
సుఖదుఃఖాలు, లాభనష్టాలు, కలిమిలేములు, చీకటి వెలుగులు జీవితంలో సహజంగానే వస్తూపోతూంటాయి. వేటికీ చలించక, అన్నిటిపట్ల సమబుద్ధి కలిగి వచ్చినదాన్ని స్వీకరించే ప్రవృత్తిని మనసు అలవరచుకోవాలి. పొరపాట్లు మానవసహజం. వాటిని సరిదిద్దుకుని, భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఎదుటి వ్యక్తిలోని లోపాలను, దోషాలను ఎత్తిచూపి, పదేపదే విమర్శించి, దూషించి వాళ్లను క్షోభపెట్టకుండా, మన్నించి ప్రేమతో అక్కున చేర్చుకునే మనస్తత్వమే హృదయవైశాల్యం. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, బుధులు, రుషులు, యోగులు, కవులు, కళాకారులు- అందరూ సమాజానికి ఈ హృదయ సంస్కార సందేశాన్నే అందిస్తున్నారు.

చెట్టు పూలు, ఫలాలు, నిలువనీడ ఇస్తోంది. నరికినా ఇంటికి కలపను ఇస్తోంది. కాల్చినా బొగ్గునిస్తోంది. దానికీ ప్రాణం ఉంది. అది పోయాక కూడా మనకు ఉపకరిస్తోంది. దానికున్న హృదయవైశాల్యం మనిషికి ఉంటే సమాజంలో ఇన్ని అనర్థాలు, ఘోరాలు, అత్యాచారాలు జరుగుతాయా? త్రికరణశుద్ధిగా హృదయాన్ని భద్రపరచుకోగలిగితే సాధించలేని కార్యముంటుందా? చెట్టు ఆకాశంలో ఎంతపైకెదిగినా తాను పుట్టిన మట్టిని వదలదు. మనిషీ తాను పుట్టిన నేలను విస్మరించరాదు. నేలనేకాదు, తనని కన్నవాళ్ళను, తనచుట్టూ ఉన్నవాళ్లను మరువకూడదు.

రాముడు మరుసటిరోజు జరగనున్న పట్టాభిషేకానికి పొంగిపోనూలేదు. తెల్లవారగానే అడవులకు వెళ్లవలసి వచ్చిందని కుంగిపోనూలేదు. దుశ్శాసనుని దుశ్చర్య, కర్ణుడి పరుషపదాలు, దుర్యోధనుడి అహంకారపూరిత వచనాలు, కీచకుడి అత్యాచారయత్నం- వంటి అవమానాలు భరించీ ద్రౌపది ఎంతటి ఆత్మస్త్థెర్యం కనబరచింది? చివరికి విజయమే పొందింది కదా! 'సుఖదుఃఖాలను సమంగా భావించి స్వీకరించేవాడే నాకు అత్యంతప్రియమైన భక్తుడు' అన్నాడు గీతాకారుడు వాసుదేవుడు.

అపజయాలు విజయాలకు సోపానాలని పెద్దలేనాడో చెప్పారు. అపజయంలో ఆదుకునేది ఆధ్యాత్మిక చింతనొక్కటే. అదే ఆత్మస్త్థెర్యాన్ని ప్రసాదిస్తుంది. మనసుకు క్షమాగుణం నేర్పుతుంది. సహనం నేర్పుతుంది. అందుకు ప్రహ్లాద చరిత్రం, రామదాసు చరిత్రమే తార్కాణాలు. ఎన్ని అవమానాలు ఎదురైనా మీరాబాయి కృష్ణభక్తిని మానుకోలేదు. ఎన్ని విపరీత విపత్కర పరిస్థితులెదురైనా మహర్షులు తమ కఠోరదీక్షను, తపస్సును విరమించలేదు. అంతటి హృదయవైశాల్యం కలవారు కనుకనే మనకు మహోత్కృష్టమైన జ్ఞానసంపదను వితరణ చేయగలిగారు.

హృదయవైశాల్యం అలవరచుకోవాలంటే ఆత్మ సంయమనం, మనోనిగ్రహం ఉండాలి. ఇంద్రియదమనంఉండాలి. అందుకు సాధన, ధ్యానం బాగా తోడ్పడతాయి. మనిషి తనను తాను తెలుసుకున్న కొద్దీ హృదయ వైశాల్యానికి చేరువవుతుంటాడు. హృదయవైశాల్యం కలవాళ్లు శత్రువుల్ని, ద్రోహుల్ని సైతం క్షమిస్తారు.

ఓ సన్యాసి భిక్షకోసం ఓ ఇంటిముందు నిలుచున్నాడు. 'భవతీ భిక్షాందేహి' అని కేకవేశాడు. లోపలినుంచి ఇల్లాలు ఆగ్రహంతో బైటికొచ్చి, బిచ్చం వెయ్యకపోగా సన్యాసిని నోటికొచ్చినట్టు దూషించింది. అవన్నీవిన్నా సన్యాసి కోపగించుకోక ప్రశాంతంగా వెనుతిరిగాడు. అది చూసి అవాక్కయిందా ఇల్లాలు. 'నా మాటలు విని నీకు కోపం రాలేదా?' అని అడిగింది ఆశ్చర్యంగా!

సన్యాసి ఇలా అన్నాడు చిరునవ్వుతో- 'ఎందుకు తల్లీ కోపం! ఈ శరీరం నాదే అనుకుంటే కోపం వస్తుంది. శరీరం నాదేకాదు. ఈ చేతిలోని కమండలాన్ని తిడితే ఎంతో నా శరీరాన్ని తిట్టినా అంతే! నా మనసు అవేమీ పట్టించుకోదు' అంటూ ప్రశాంతంగా వెళ్లిపోయాడు సన్యాసి. మనకు లేనిది ఇతరుల దగ్గర ఉందంటే, మన మనసులో ఈర్ష్య, పగ పెరుగుతాయి. హృదయ వైశాల్యానికీ దుష్టభావనే ప్రేరణ కలిగించినా చలించకూడదు. ఆహారం విషయంలో పేదవారిని దృష్టిలో పెట్టుకోవాలి. ఆచరణ విషయంలో పెద్దవారిని ఆదర్శంగా తీసుకోవాలి. అప్పుడే 'ఓర్పు' అనే సద్గుణం మనసునావరిస్తుంది. హృదయవైశాల్యానికిదే నాంది. ఈ సద్గుణాన్ని సమాదరించిననాడు మనలను ఏ విపత్తూ, ఏ అనర్థమూ ప్రభావితం చేయవు. విశ్వంలో హృదయవైశాల్యం కలవాడే అజేయుడు, అభినందనీయుడు!


- చిమ్మపూడి శ్రీరామమూర్తి

ᐅప్రేమే దైవం





ప్రేమే దైవం 

ద్వేషంతోకాక ప్రేమతోనే ఏదైనా సాధించగలం. శత్రువులను సైతం మిత్రులుగా మార్చే మహత్తర తత్వం ప్రేమలోనే ఉంది. మానసం ప్రేమమయమైతే చేతులు ఆపన్న హస్తాలవుతాయి. అరిషడ్వర్గాలను దూరం చేసి ప్రేమ మాధుర్యాన్ని విస్తరింపజేయడం కోసమే యుగయుగాల్లో మహానుభావులెందరో అవతరించారు. కులాలకు మతాలకు అతీతంగా ఆధ్యాత్మిక భావ విరులను వికసింపజేశారు. ప్రేమ ప్రాతిపదికనే సమాజానికి మార్గాలు రూపొందించారు. సమదృష్టితో రాగద్వేషాలను విడచి ఇతరుల బాధలను తీర్చేవారే దైవస్వరూపులు. అలాంటివారికి విశ్వమంతా శిష్యులే!
ప్రేమనూ, సేవాతత్వాన్నీ ఆచరించడం అంత సులభం కాదు. ప్రతి మనిషిలో దైవం ఉంటాడని అందరికీ తెలుసు. ఆ జ్ఞానాన్ని వాస్తవం చేసుకునేవారు కొందరే! ఇలాంటివారే మనలను భౌతికత్వంనుంచి ఆధ్యాత్మికత్వానికి చేర్చగలుగుతారు. ప్రేమ, ధర్మం, శాంతి- పవిత్ర జీవితానికి సోపానాలు. పరమ పావనులైన ఆ మహానుభావులకు మతం హితం కాదు, మానవత్వం తప్ప! విశ్వంలో అందరినీ ప్రేమించే వ్యక్తికి- గుడి, చర్చి, ఇతర ప్రార్థన మందిరాల మధ్య తేడా ఉండదు. వారికి జగమే ఒక ఆలయం. ఉనికే ఒక చర్చి.

గౌతమ బుద్ధుడు శాంతిని, ప్రేమను మానవుల్లో విస్తరించడం కోసం రాజభోగాలను త్యాగం చేశాడు. శాసనాలు, ఆజ్ఞలు, నైతిక సూత్రాలు, శిక్షాస్మృతులు చేయలేని గొప్ప సామాజిక చైతన్యాన్ని- బుద్ధుడి బోధనలు సాధించగలిగాయి. ప్రతి మనిషిలో... వాడెంత కఠినుడైనా కానీ... మనసులో ఏదో ఒక మూల ప్రేమ అచేతనంగా ఉంటుంది. ఆ ప్రేమతత్వాన్ని చేతనం చేయగలిగేవారే దైవస్వరూపులు.

మనుషుల్లో రెండు రకాలు ఉంటారు. ఒకరు మానవజాతిని విభజిస్తూ ఉంటారు. మరొకరు మానవజాతిని ఏకం చేసే ప్రయత్నం చేస్తారు. రెండో కోవకు చెందినవారే యుగపురుషులు.

సర్వ ప్రపంచమూ సుఖసంతోషాలతో మనగలగాలనే భావనకు ప్రేమే మూలం. పశుపక్ష్యాదులతో సహా జీవరాశులన్నింటినీ అక్కున చేర్చుకోవడమే ఆధ్యాత్మికం. ఆ ప్రయత్నానికి బాహ్య ప్రపంచంలోని ప్రలోభాలు అడ్డంకులు కావు. ఎందుకంటే... అందరూ నా వారేననే భావన అంతర్గత ఆధ్యాత్మిక ఆనందమార్గం కనుక!

ప్రేమతో జీవించే విధానంలో నవ్యత ఉందని ఆ జీవనవిధానాన్ని అవలంబించే వారెందరో ఉంటారు. ఈ విధానంవల్ల వికాసం, నైపుణ్యం, పరిణతి పొందుతారు. ఉపరితలంపై విస్తరించే లతల్లాగా కొందరు ధర్మాత్ములు మరికొందరిలో దైవత్వాన్ని నింపుతుంటారు. మానవ సమాజాన్ని చైతన్యం చేస్తారు. జీవన సాఫల్యం సాధిస్తారు. వత్తిని కాల్చి వెలుగును వికసింపజేస్తారు. వత్తి నలుపుగా వికారంగా మారుతుంది. మహానుభావుల భౌతిక శరీరాలూ అలాంటివే. వారు పరితపిస్తూ మానవుల్లో వెలుగును నింపుతారు. వారు దైవస్వరూపులు, వారి స్థావరాలే దేవాలయాలు. వారు నడయాడిన నివాసాలే ప్రశాంతి నిలయాలు.


- అప్పరుసు రమాకాంతరావు

ᐅశ్రమజీవన సౌందర్యం





శ్రమజీవన సౌందర్యం 

'కాయకమే కైలాసం' అన్నాడు వీరశైవ ప్రవర్తకుడు బసవేశ్వరుడు. శ్రమజీవనమే మానవుడికి ముక్తిని ప్రసాదిస్తుందని వీరశైవ సిద్ధాంత సారాంశం. 'సోమరిపోతు మెదడు దెయ్యాలకు నిలయం' అని ఆంగ్ల సామెత. శ్రమజీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని ఆధునికాంధ్ర మహాకవి ఉవాచ.
ఒకరిపై ఆధారపడి, వారికోసం వేచి చూడటం కంటే, మన పని మనమే చేసుకుంటే అది వెంటనే జరుగుతుంది; సక్రమంగా కూడా పూర్తవుతుంది. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూడటం కంటే, ఎవరి పని వారే చేసుకోవడానికి ప్రయత్నించాలి. పనిని కష్టపడి చేస్తున్నట్లుగా గాక, ఇష్టపడి చేయాలి. అప్పుడే ఎంత పెద్ద పనైనా శ్రమ అనిపించదు.

మన ప్రాచీనులు శారీరక శ్రమను గౌరవంగానే భావించారు. భార్యనూ పిల్లలనూ పోషించడం కోసం 'హాలికులైన నేమి, కందమూల కౌద్ధాలికులైన నేమి?' అని సంతోషంతో శ్రమజీవనాన్ని గడిపిన పోతన వంటి మహాపురుషులు మనదేశంలో ఎందరో!

సుగాత్రిని ఆభరణాలతో అలంకరించి, పట్టుబట్టలు కట్టి నాథుని వద్దకు పంపుతారు తల్లిదండ్రులు. కృత్రిమమైన ఆ సౌందర్యం ఆమె భర్త అయిన శాలీనుణ్ని ఆకర్షించదు. భార్యను ప్రేమగా చూడడు. ఒకరోజు పెద్ద గాలివాన వస్తుంది. తోటలో పూలమొక్కలు పడిపోతున్నాయని, సుగాత్రి ఆభరణాలు తీసి, ముతక వస్త్రాన్ని కట్టుకొని, వర్షంలో తడుస్తూ, మొక్కలు పడిపోకుండా నిలబెడుతూ, పాదులు తవ్వుతూ ఉండగా- ఆమెను భర్త చూస్తాడు. ఆమె సౌందర్యం శాలీనుణ్ని ఆకర్షిస్తుంది. ఆమె పట్ల ప్రేమను ప్రకటిస్తాడు. ఇలా శ్రమజీవన సౌందర్యాన్ని కళాపూర్ణోదయ కావ్యం కళాత్మకంగా చాటింది.

వివేకానందస్వామి అమెరికాలో పర్యటించిన తరవాత మిత్రులతో 'నా జీవిత సమ్మోహిని అమెరికాలో ఉన్నది' అన్నాడు. 'ఎవరామె?' అని ఆశ్చర్యంతో మిత్రులు ప్రశ్నించగా, 'శ్రమపడి పనిచేసే మనస్తత్వమే నా జీవిత సమ్మోహిని. పాశ్చాత్య దేశాల్లో ఈ సుగుణాన్ని నేను గమనించాను!' అని ప్రశంసాపూర్వకంగా పలికాడు.

ఒకచోట సైనికులు కొందరు శ్రమించి పనిచేస్తున్నారు. పెద్ద దూలాన్ని లేవనెత్తడానికి విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. ఎంత ప్రయత్నిస్తున్నా అది కదలడం లేదు. 'పట్టండి! ఎత్తండి! నెట్టండి! కట్టండి! లాగండి!' అని సమీపంలో నిలుచుని ఒక వ్యక్తి కేకలు వేస్తున్నాడు.

ఆ తోవన ఒక బాటసారి గుర్రంమీద పోతూ, ఈ దృశ్యాన్ని చూసి ఇలా అన్నాడు. 'అయ్యా! పట్టండి, లాగండి, అలా చేయండి, ఇలా చేయండి అనే బదులు తమరే నడుంవంచి వాళ్లకు సాయం చెయ్యవచ్చు గదా!'

ఆ ఆజ్ఞలిచ్చే వ్యక్తికి రోషం వచ్చింది. అధికారదర్పంతో ఇలా అన్నాడు. 'ఎవరనుకుంటున్నావు నన్ను? తారతమ్యాలు ఎరగకుండా మాట్లాడుతున్నావ్... నేను సేనాధిపతిని!'

'అయ్యయ్యో! మీరు అంత గొప్పవారని తెలియక ఏదో అన్నాను... మన్నించండి!' అని, ఆ బాటసారి గుర్రం దిగివచ్చి, సైనికులతోపాటు తానూ ఓ చెయ్యివేశాడు. దూలాన్ని కదిలించడంలో సాయపడ్డాడు. సేనాని మాత్రం దర్జాగా నడుంపై చేయి పెట్టుకొని నిలుచుని చూస్తూ ఉన్నాడు.

'అయ్యా! పని పూర్తయింది! ఇంకెప్పుడైనా ఏదైనా పని తగిలితే పిలవండి!' అన్నాడు వినయంగా బాటసారి.

'ఎవరు నువ్వు?'

'నన్ను వాషింగ్టన్ అంటారు! ఈ దేశ సర్వసైన్యాధ్యక్షుణ్ని!' అని సమాధానమిచ్చాడు అశ్వికుడు వినమ్రంగా.

సేనాపతి నివ్వెరపోయాడు. తన తప్పు గ్రహించాడు. ఉత్తములెప్పుడూ శ్రమపడటానికి వెనుదీయరని తెలుసుకున్నాడు!

- పి.భారతి

ᐅమోహనాశం





మోహనాశం 

ఉండటం ఎంత సహజమో, లేకపోవడమూ అంతే సహజం. కానీ ఉన్నది అనిపించినప్పుడు సంతోషించడం, లేదనిపించగానే దుఃఖించడం మానవనైజం. నిజానికి శాశ్వతంగా ఉండేది ఏదని ప్రశ్నించుకుంటే 'ఏదీకాదు' అనే సమాధానం వస్తుంది ఆలోచిస్తే. దేహం, జీవం, సంసారం, బంధనాలు, సంపదలు, సంపాదనలు లాంటివన్నీ మిథ్యేనని తేలుతుంది. 'లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు అనిపించడమే' మిథ్య. దీనికి మరోపేరు మాయ. ఆ మాయనే నిజమనుకుని మోహంలో పడుతుంటారు. దానివల్లనే రాగద్వేషాలకు లోనవుతుంటారు. వాటి ఫలితం దుఃఖం. మోహాన్ని వీడితేనే దుఃఖానికి అతీతులవుతారు.
ఒకచోట ఇంటిల్లపాదీ దుఃఖసాగరంలో మునిగి ఉన్నారు. అటుగా వెళుతున్న గౌతమబుద్ధుడు ఆ ఇంటిలో అడుగుపెట్టి 'ఎందుకు ఏడుస్తున్నారు?' అని అడిగాడు. ఆ ఇంటిలో ఇటీవలే జన్మించిన బిడ్డ, పురిటిరోజులైనా తీరకముందే మరణించాడని చెప్పారు వారు. 'మీలో ఎవరైనా చావు సంభవించని ఇంటిలోనుంచి చిటికెడు ఆవాలు తీసుకురండి. మంత్రించి చల్లుతాను. మీ బిడ్డడు ఇట్టే బతికిలేస్తాడు' అన్నాడు బుద్ధుడు. 'ఆవాలంటే ఎక్కడైనా దొరుకుతాయి. చావు సంభవించని ఇల్లు ఎక్కడ దొరుకుతుంది' అని వెంటనే స్ఫురించింది వారికి. వారందరినీ ఆవరించిన మాయ దానంతట అదే తొలగిపోయింది. ముఖ్యమైన వ్యక్తులు మరణించడంవల్ల ఎందరో, ఎన్ని విధాలుగానో బాధపడ్డారు. ఆ నష్టం అలాగే కొనసాగిందా? లేదు. ఆ స్థానాల్ని భర్తీచేస్తూ మరొకరు తయారవుతూనే ఉన్నారు. వారి పాత్ర ముగిసిపోగానే వారూ సమసిపోతున్నారు. నిరంతరంగా సాగే ఈ చర్యనే వ్యావహారిక సత్యం అంటారు.

'వచ్చినప్పుడు ఏమి తీసుకువచ్చావని పోయినందుకు బాధపడతావు? పోయినప్పుడు ఏది తీసుకుపోగలుగుతావని ఇంతలా ఆత్రుతపడుతున్నావు?' ఈ రెండు ప్రశ్నలూ ఎవరికివారు వేసుకుంటే దుఃఖానికి కారణమైన అజ్ఞానం తొలగిపోతుంది. దీన్నే ప్రాతిభాసిత సత్యం అంటారు. కలలో కనిపించే దృశ్యాలు, తెరపై కనిపించే అందాలు, ఒకదాన్ని చూసి మరొకటిగా భ్రమపడటం ఇవన్నీ ప్రాతిభాసిత సత్యాలే. నిజానికి అది సత్యంకాదు. అలా భ్రమింపజేస్తుంది. అది భ్రమ మాత్రమే అని తెలుసుకుని మనగలిగితే ప్రశాంతత చేకూరుతుంది.

ఒక బాటసారికి దారిలో ఒక మూట కనబడింది. నిర్మానుష్యమైన బాటలో కనబడిన మూటలో ఏముందోనని తీశాడు. బంగారు నాణాలు కనిపించాయి. వాటితో ఏమేం చేయాలో మనసులోనే ప్రణాళికలు రచిస్తున్నాడు. ఇంతలో ఆ మూట పోగొట్టుకున్న వ్యక్తి మూట ఆనవాళ్ళు చెప్పి ఇమ్మన్నాడు. అయిష్టంగానే ఇచ్చాడు. తరవాత రకరకాలుగా ఆలోచించి బాధపడ్డాడు. ఆ ఆలోచనల పరంపరలోనే వచ్చిన మరో ఆలోచన- దాన్ని సంపాదించడానికి తానేం కష్టపడ్డానని? అనిపించింది. ఒకవేళ అది తనకు దొరికి ఉండకపోతే... అప్పుడు ఈ బాధే ఉండేదికాదు కదా అనిపించింది. ఆ ఆలోచన వచ్చాక మనసు స్థిమితపడింది. దీనినే గౌడపాదుడు (శంకరాచార్యుల గురువు) 'జాగ్రత్‌స్వప్నం' అన్నారు. లోకరీతి చాలావరకు ఇలాంటిదే. సంపదలు, సంసారం, గౌరవ ప్రతిష్ఠలు, విలాసాలు, సౌకర్యాలు వద్దనుకున్నా సమకూరతాయి. 'అన్నీ అవసరమైనవేనా?' అని ప్రశ్నించుకుంటే స్ఫురించే సమాధానం, అనవసరమే అని. ఈ విషయాన్ని తెలుసుకోవడాన్నే 'పారమార్థిక సత్యజ్ఞానం' అంటారు. దాన్ని తెలుసుకున్నారు కాబట్టే ఆది శంకరాచార్యులు 'బ్రహ్మసత్యం-జగన్మిథ్య' (ప్రపంచమంతామిథ్య- బ్రహ్మమేసత్యం) అన్నారు. అంతటి జ్ఞానసంపన్నులు కనుకనే బ్రహ్మం గురించి చక్కని విశ్లేషణ ఇచ్చారు. సర్వకాల సర్వావస్థల్లోను కాదనలేనిది, లేదనడానికి వీలులేనిది; పరిమితి, సంకుచితత్వం, వివాదం లేనిది' ఎవరి ప్రమేయం లేనిది (అప్రమేయమైనది) స్వతంత్రమైనదీ బ్రహ్మం. ఆ బ్రహ్మం కోసం అన్వేషణ సాగించాలంటే సూక్ష్మదృష్టి కావాలి. రెండు కళ్ళతో చూస్తున్నప్పుడు దృష్టిపథంలో పడేది వేరు. నిజానికి చూడాలనుకునేది వేరు. అలాంటప్పుడు దృష్టిపథంలో పడినదానినంతా కాకుండా, తనకు అవసరమైనదానిమీదే మనసు కేంద్రీకరించాలి. అలా... అలా... సూక్ష్మస్థితికి వచ్చాక ఒకానొక కేంద్రానికి చేరాక దానిమీద మనసు నిలపగలగాలి. అలా నిలపగలిగినప్పుడు గోచరమయ్యేదే శుద్ధమైన సత్యం. అదే సూక్ష్మదృష్టి. అదే బ్రహ్మం. అప్పుడు ఎన్ని, ఏమి, ఎంత ఉన్నా, కావాలనిపించేది ఏదీ ఉండదు. అదే బ్రహ్మజ్ఞానం.


- అయ్యగారి శ్రీనివాసరావు

ᐅఅసలైన విజయం




అసలైన విజయం 

జీవితంలో విజయం సాధించటం అంటే అంతులేని ధనరాశులు కూడబెట్టడం, విలాసవంతమైన భవనాలు నిర్మించడమని భావిస్తారు. అవి అవసరమే కాని, వాటిని మాత్రమే సాధించడం ఘనవిజయంగా భావించడం సముచితం కాదు. మరి కొందరు, బహుశా కొద్దిమంది- చిత్రకళలు, సంగీతం, నాట్యం వంటి నిర్ణీత క్షేత్రాల్లో శ్రమించి జీవితాలను అందంగా తీర్చిదిద్దుకొంటారు. ఇవి మనసుకు అఖండ సంతృప్తి కలిగించే అపూర్వ విజయాలు. జీవితం ఏ కోణంలోనుంచి చూసినా పరిపూర్ణత్వపు మాధుర్యంగా పల్లవించాలి. అదే జీవితానికి అర్థం, పరమార్థం. సాఫల్య మకుటం. సాధారణంగా ఎన్ని ఐహిక సంపదలున్నా ఆ ఆనందంతో సరితూగలేవు.
అటువంటివారి దృష్టిలో ధనం ఒక లక్ష్యసాధనకు ఉపకరణం మాత్రమే. ధనమే ధ్యేయం కాదు. మన శరీరంలోని కాలు, చెయ్యిలాగా ధనం కూడా పనిచెయ్యాలి. లేకపోతే అది తలకు మించిన భారం అవుతుంది. మితిమీరిన ధనం అమిత ప్రమాదాలకు దారి తీయవచ్చు. ధనం బాగా సంపాదించేవారు వేదన చెందుతూనే ఉంటారు. చాలినంత సంపాదనతో జీవించేవారు మరింత తృప్తిగా రోజులు గడుపుతారు. శాంతి, సామరస్య, సౌజన్యతే వారి పొదుపు. ప్రేమానురాగాలే వారి బ్యాంకు ఖాతా.

ఆర్థికస్థితి మెరుగుపడిన కొద్దీ సుఖసంతోషాలు పెరుగుతాయని భరోసా లేదు. భద్రత అన్నది ఎండమావి. డబ్బువల్ల హంసతూలికా తల్పం కొనవచ్చు. కాని, నిద్రను కొనలేం. పుస్తకాలు కొనవచ్చు. కాని, ప్రజ్ఞాప్రాభవం బజార్లో దొరికే వస్తువు కాదు. ఆహారం కోకొల్లలుగా కొనవచ్చు. కాని, ఆకలిని కొనలేం. అందమైన వస్తువులు ఎన్నైనా కొనవచ్చు. కాని 'సౌందర్యం' ధనరాశులకు అందదు. ఎన్నో అంతస్తుల మేడ కొనవచ్చు, 'శాంతిధామాన్ని' కొనలేం. మందులు కొనగలుగుతారు. ఆరోగ్యం కొనలేరు. విలాసవస్తువులను కొనవచ్చు. సంస్కారం, సంస్కృతి అంగట్లో దొరకవు. మనిషి కేవలం ఆహారం తిని మాత్రమే బతకలేడు. అతనికి నలుగురి సానుభూతి కావాలి. సువిశాలమైన అనంత ప్రపంచంలోని మహోత్కృష్ట కాంతివైపు తలుపులు మూసివేసి, వెలుగు అనుకుంటున్న చీకటి నిశ్శబ్దంలో తనను బంధించుకున్న వ్యక్తి నిజమైన ఆనంద సముద్రాలను ఏనాటికీ చూడలేడు. జీవితాన్ని అలౌకిక విజయంగా భావించి, ఆదర్శ శిఖరాల్లో ఆశయదీప్తితో జీవించడానికి మించిన సౌభాగ్యం లేదు.

ఆనందమే చిట్టచివరి భవితవ్య తీరం కాదు. అదొక నిరంతర మహా ప్రయాణం. పరమాద్భుతమైన కాంతిపుంజాలు, కాంచన ద్వీపాల వైపు ఆ యాత్ర సాగుతుంది. ఆ ఆనంద స్వర్గాలు, విజ్ఞాన భూమికలు, పరిపూర్ణత్వం నిజంగా ఉన్నాయా? అవి మనిషి అందుకోగలడా అని చాలామంది సందేహం. అటు ఆరోహించడం సాధ్యం కాదు అనేవారున్నారు. ప్రాచీన క్రాంతదర్శులు వాటిని సిద్ధింపజేసుకున్నట్లు వారు మానవాళికి వదిలివెళ్లిన ప్రవచనాలే సాక్ష్యం... ఆధునిక కాలంలో జన్మించిన ఆత్మజ్ఞాన సంపన్నులూ చెబుతున్నారు. మృగప్రాయమైన మన జీవితం జయించలేని ఔన్నత్యాల్లో అంతులేని ఆనందాలు, తేజోమయ ప్రజ్ఞాన మహార్ణవాలు, అనంత శాంతిసీమలు మన ఆవిష్కరణకై నిరీక్షిస్తున్నాయి. క్షణంపాటు మెరిసే మెరుపును చూసినట్లు ఆ అంతర్నిక్షిప్త రత్నరాశులను ఒక్కసారి వీక్షిస్తే చాలు- వాటిని పూర్తిగా కైవసం చేసుకునేవరకు మానవాళి నిద్రించదు. వారు జీవితంలోని సర్వస్వాన్నీ త్యజించి వాటికై పరుగులు తీస్తారు. వాటికి మార్గం బాగా సన్నది. తలుపులు తెరవటం అంత తేలికకాదు. భయం, అవిశ్వాసం, సందేహం అనే చీకటి రాజభటులు కాపలాకాస్తూ మనల్ని ఆ రాజ్యంలోకి అడుగు పెట్టనివ్వరు.

చర్విత చర్వణమై విసుగు పుట్టించే జీవన నిరామయ, నిరాసక్త, కల్లోలిత జలధి తరంగాల నుంచి, అజ్ఞాన తమస్సు నుంచి విముక్తమయ్యే మనసుకు సమావిష్కృతమయ్యే బంగారు ఉషోదయాలు అవి. యుగయుగాలుగా జన్మజన్మలుగా సాగే భువన జీవన రూపకానికి సరికొత్త భాష్యం చెప్పే అంతిమ కిరణం అక్కడే దాగి ఉంది. వాటిని సాధించడమే అసలైన విజయం!


- కె. యజ్ఞన్న

ᐅసాకారం - ఓ సందేశం





సాకారం - ఓ సందేశం 

'ఈ సకల జగత్తు ఈశ్వరమయమే' అని వేదోపనిషత్తులు, శాస్త్రపురాణాలు చెబుతున్నాయి. ఎనభైనాలుగు లక్షల జీవరాశుల్లోనూ, అనంతప్రకృతిలోనూ, బ్రహ్మాండమైన విశ్వంలోనూ ఉన్న చైతన్యమే శివ స్వరూపం. నిరాకార, నిర్గుణ పరమేశ్వర తత్వానికి రుషిపుంగవులు, యోగులు, జ్ఞానసంపన్నులు ఓ సాకారం సృష్టించారు.
మంగళకరమైన ఆ రూపం, అలంకరణాదులు ఎన్నో పురాణ గాథలకు నిలయం. అంతే కాకుండా జీవరాశికి సందేశాత్మకం.

మానవాళి రుజుమార్గంలో పయనిస్తూ, శివతత్వాన్ని తద్వారా ప్రేమతత్వాన్ని గ్రహించి ఆ దేవదేవుడికి ప్రతీకగా ఉండాలన్న అంతరార్థాన్ని 'శివరూపం' తెలియజేస్తుంది.

నిరాడంబరత్వానికి నిదర్శనం శివస్వరూపం.

శుభాలను ఇచ్చేవాడే శంకరుడు. ఆయనకు ఇవ్వడమే తెలుసు. ప్రతిగా ఆయన కోరుకునేది భక్తిపూరిత హృదయాన్నే.

నిర్మలమైన మనసుతో ఇంత జలంతో అభిషేకించినా, ఓ మారేడుదళం అర్పించినా పరమానంద భరితుడయ్యే తత్వంగలవాడు ఆయన. ఎంతో ఔదార్యం, వాత్సల్యం తన సృష్టి పట్ల!

చితా భస్మమే పైపూత. 'నానుంచి ఆవిర్భవించిన జీవరాశులు తిరిగి నాలోనే లయమవుతా'యన్న కాలసత్యాన్ని తెలుపుతుంది.

తలపై గంగ- నెలవంక. దేహానికి అగ్రభాగాన ఉండే శిరస్సు ప్రధానమైంది. శిరోపైభాగాన ఉండే సహస్రారం, బ్రహ్మగ్రంధి ఆ పరమాత్మకు నెలవు. మస్తిష్కం శరీరాన్ని, నాడులను నియంత్రిస్తుంది. వ్యర్థ ఆలోచనా విధానాలతో మస్తిష్కం ఒత్తిడికి గురికాకూడదు. గంగ శీతలత్వానికి, చంద్రుడు అమృతత్వానికి ప్రతీకలు. దేహంలో జ్వలించే అగ్నిని అవి సమతుల్యంగా ఉంచుతాయి. పవిత్రమైన భావసంపద, నిగ్రహంతో కూడిన ఆలోచనా స్రవంతి శిరోభాగాన గంగ, నెలవంకల్లా విలసిల్లితే- ముఖబింబం ప్రశాంతంగా, చిత్తం శాంతిగా ఉంటుందన్న సంకేతానికి నిదర్శనం.

గంగాధరుని పాలభాగంపై విబూధి రేఖలు. జీవాత్మ-ఆత్మ-పరమాత్మలకు సంకేతాలు. జీవాత్మ తనలోని ఆత్మ స్వరూపాన్ని తెలుసుకొని పరమాత్మతో కూడి ఉండాలన్నదానికి నిదర్శనం. జీవాత్మే-పరమాత్మ అన్న సత్యాన్ని, జ్ఞానాన్ని తెలియజేసేదే త్రినేత్రం... అది మనపాలిట జ్ఞాననేత్రం.

క్షీరసాగరమధనంలో ఆవిర్భవించిన ప్రళయ భీకర హాలాహలాన్ని కంఠభాగంలో నిక్షిప్తంగావించుకొని ఆయన నీలకంఠుడయ్యాడు. ఢమరుకం ప్రణవనాదమైన ఓంకారానికి, సకల వాఞ్మయాలకు జననస్థానం. మానవశరీరంలోని నాడీ మండలాలు 'ఓంకారం'తో పునీతమయ్యేలా కంఠం ద్వారా, రెండు పెదవులతో ప్రణవోచ్చారణ చెయ్యాలి. మంగళకరమైన, మధురమైన, ప్రీతికరమైన వాక్కులు మాత్రమే కంఠంనుంచి వెలువడాలి.

కఠిన, పరుష, నిందాపూరిత మాటలు విషం లాంటివి. అవి కంఠంనుంచి బైటకు రానేకూడదు. అలాగని మనోకోశంలోకి జారనూకూడదు. నాగాభరణుడు-గజచర్మాంబరధారి. పిపీలికాది బ్రహ్మాండపర్యంతమూ ఆయనకు ప్రీతిపాత్రమైనదే. మానవుడు సృష్టిలోని జీవరాశులపట్ల ప్రేమ, కరుణ కలిగి ఉండాలన్న దివ్యోపదేశమే అది.

పంచభూతలింగాల్లోని వాయులింగం సాలీడు, సర్పం, గజరాజులతోనే ముడివడి ఉంది. శ్రీకాళహస్తీశ్వరలింగంగా పూజలు పొందుతోంది. ఆయన వాహనం నందీశ్వరుడు.

రుద్రాక్షమాలలే ఆయన ఆభరణాలు. శివునికంటి నీటి చుక్కే రుద్రాక్ష అంటూ ఐతిహ్యాలు చెబుతున్నాయి. పవిత్రతకు చిహ్నం రుద్రాక్షలు. ఔషధీయతత్వం గలవి. ఆరోగ్యప్రదమైనవి. ప్రకృతిలో లభించే అరుదైన జాతివృక్షాలవి. పరమేశ్వరుడు ప్రకృతి ప్రియుడు. పార్వతీమాత ప్రతిరూపమే ప్రకృతి. ప్రకృతి ఆరాధనే ఆదిదంపతుల ఆరాధన. పరమేశ్వరుని చేతిలోని త్రిశూలం దుష్టుల పాలిట పాశుపతం. శిష్టుల పాలిట రక్షణ కవచం. ఆయుధం జగత్తు సంరక్షణకే.

త్రిశూలం పైభాగాన ఉండే మూడు కొనలు సత్వ, రజో, తమో గుణాలకు ప్రతీకలు. ఆ మూడుకొనల్లో మధ్యభాగాన ఉండే 'కొన' పొడవుగా ఉంటుంది. అది సత్వగుణానికి ప్రతీక. సత్వగుణ ప్రధానులుగా మానవాళి చరించాలన్న సందేశం అందులో ఉంది.

శివరూపం తెలియజేసే తత్వమే జీవన పరమార్థంగా భావించాలి. కారణజన్ముడు శ్రీరామకృష్ణులు. కామార్పకూర్‌లో నాటక ప్రదర్శనలో శివుడి వేషం వెయ్యాల్సి వచ్చింది. ఎప్పుడైతే శివుని వేషధారణ తన శరీరంపైకి వచ్చిందో- ఇక సర్వమూ మరిచిపోయారు. ధ్యానముద్రలోకి వెళ్లిపోయారు. నాటకం అయిపోయింది. ప్రేక్షకులు వెళ్లిపోయారు. ఇతర పాత్రధారులు రంగులు కడిగేసుకున్నారు. రంగస్థలిపై భావసమాధిలో అలానే శ్రీరామకృష్ణులు. ఉలకరు. పలకరు. ఆ తరవాత ఎప్పటికో బాహ్యస్మృతిలోకి వచ్చారు. వేషధారణ ఆయనను శివతత్వంలోకి నడిపింది. దైవలక్షణాలు మనో మందిరాన్ని చైతన్యవంతం చేశాయి.

పరమేశ్వరుడి లీలాగాథలే కాదు, రూప వైశిష్ట్యమూ ఓ గొప్ప సందేశం. జిజ్ఞాసతో కూడిన భక్తితత్వం అలవడితేనే శివతత్వం బోధపడుతుంది. ఆ ఈశ్వరతత్వాన్ని గ్రహించి, తదనుగుణంగా చరించేవారు భువిపై నడయాడే దేవుళ్లు!


- దానం శివప్రసాదరావు

ᐅగౌరవంగా జీవిద్దాం!





గౌరవంగా జీవిద్దాం! 

'సమాజంలో గౌరవంగా బతకాలి, కీర్తిని పొందాలి, పదికాలాలపాటు లోకులు మన పేరునే స్మరిస్తూ, మెచ్చుకుంటుండాలి' అనుకుంటాం. అలా జీవించాలంటే ఏం చేయాలి? ఎలా ప్రవర్తించాలి? ఎలా మాట్లాడాలి? జీవించే కొద్దికాలం గౌరవంగా జీవించాలి. లేకపోతే మనిషికీ పశువుకూ తేడాయే లేదు. భగవంతుడు మనకు ప్రత్యేకంగా బుద్ధీ, హృదయమూ ఇచ్చాడు. ఈ రెంటినీ సద్వినియోగపరచుకుంటేనే జీవితం కల్యాణమయం. అందుకోసం సనాతన ధర్మం ఎన్నో సన్మార్గాలను సూచించింది. మన మహర్షులు పురాణాలు, శాస్త్రాలు అందజేశారు. వాటిని శ్రద్ధతో అధ్యయనం చేసినట్లయితే ఎన్నెన్నో మంచి విషయాలు అవగతమవుతాయి. వాటిని ఆచరించడం మన విజ్ఞత, సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది.
ప్రధానంగా మన జీవన సార్ధకతకు అయిదు 'వ'కారాలను సర్వదా గుర్తుంచుకుని ఆచరించడం వాంఛనీయమని పెద్దలు చెబుతారు. 1. వస్త్రం, 2. వపుస్సు అంటే శరీరకాంతి, 3. వాక్కు, 4. విద్య, 5. వినయం. ఈ అయిదింటి పట్ల శ్రద్ధ వహించాలి.

మన వస్త్రాలు పరిశుభ్రంగా, స్వచ్ఛంగా ఉండాలి. పరిశుభ్రమైన వస్త్రాలు ధరించకపోతే సంఘంలో ఆదరణ లభించదు. రెండోది, వపుస్సు అంటే 'శరీరకాంతి'. ఇది శరీరవర్ణంవల్ల ప్రాప్తించదు. శరీరం తెలుపైనా, ఎరుపైనా నలుపైనా ముఖం తేజోవంతంగా ఉండాలి. అలా ముఖసౌందర్యం తేజస్సుతో విరాజిల్లాలంటే యోగ, ధ్యానం, జపం చెయ్యాలి. కామక్రోధాది వికారాలను పూర్తిగా మనసునుంచి తరిమెయ్యాలి. మనసును ప్రసన్నంగా, శాంతంగా ఉంచుకోవాలి. ఎవరిమీదా పగ, ద్వేషం పెంచుకోకూడదు. మంచి ఆలోచనలే చేయాలి. ఫలితంగా ముఖం కాంతిమంతమై అందరినీ ఇట్టే ఆకర్షిస్తుంది.

తరవాతది వాక్కు. అంటే మాట. 'వాగ్భూషణమ్ భూషణమ్' అన్నాడు భర్తృహరి. గౌరవమయ జీవనానికి ఇది అత్యంత ప్రధానమైనది. వాక్శక్తి అసమానమైనది. అమోఘమైనది. సభ్యత, సంస్కారం కలిగిన మాట మనకు సమాజంలో అపూర్వ ఖ్యాతి తెచ్చిపెడుతుంది. మన మాట సౌమ్యంగా, ఆనందకరంగా ఉంటే ఎదుటివారు మనకోసం ఎంతటి త్యాగమైనా చేస్తారు. ఎంతగానో అభినందిస్తారు. అందుకే 'మాటే మంత్రం' అన్నారు. 'మాటనేదే గొప్ప వశీకరణ మంత్రం' అన్నాడు గోస్వామి తులసీదాసు. మన నాలుకనుంచి ఎన్నటికీ పరుషపదాలు, అసభ్య-అశ్లీల పదాలు రాకుండా చూసుకోవాలి. సమాజంలో ప్రత్యక్షంగా, అతిశీఘ్రంగా మనకు యశస్సును, కీర్తిని సంపాదించిపెట్టేది మాటే! మనసు మంచిదైతే మాట మంచిదే వస్తుంది. మనసును నియంత్రించుకోవాలి అందుకే. మాట మన్ననలిస్తుంది. మంచి మాట మానవుణ్ని దేవుడిగా మారుస్తుంది. మానవత్వంలో దైవత్వాన్ని ప్రతిష్ఠితంచేసేది మాటొక్కటే. రామకృష్ణ పరమహంస, వివేకానంద వంటి మహనీయుల మాటలు శ్రోతల్ని మంత్రముగ్ధులు చేసేవంటే- అందుకు కారణం వారి సాధన, ఏకాగ్రత, నైష్ఠికత, క్రమశిక్షణ, అధ్యయనశీలత!

నాలుగోది, విద్య. విద్య మహత్తు తెలియనివారుండరు. రాజు తన రాజ్యంలోనే గౌరవం పొందుతాడు. విద్వాంసుడికి అన్ని దేశాల్లోనూ గౌరవం లభిస్తుంది. మనిషిలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి, జ్ఞానజ్యోతిని వెలిగించి సన్మార్గానువర్తుడిగా చేసేదే విద్య. ధనం పంచిన కొద్దీ తరుగుతుంది. విద్య పంచినకొద్దీ పెరుగుతుంది. అందుకే సద్గురువులు తమ ఆశ్రమాల్లో నిస్వార్ధంగా జ్ఞానాన్ని శిష్యులకు పంచి, తమ జ్ఞానాన్ని పెంచుకునేవారు.

అయిదో ప్రధానాంశం 'వినయం'. వినయం విద్యను, క్రమశిక్షణను, విజయాన్ని ప్రసాదిస్తుంది. సకల కార్యసాఫల్యానికీ వినయమే పునాది. వినయంతో ఏదైనా సాధించవచ్చు. ఏ విద్యను, కళను నేర్చుకుని నైపుణ్యం పొందాలన్నా- మానవుడికి వినయం విధిగా ఉండాలి. అహంకారంతో తలెత్తి పెరుగుతున్న మహావృక్షాన్ని, కింద నేలమీద ప్రవహించే నీరు నిలువునా కూల్చేస్తుంది. బలహీనంగా ఉన్న గడ్డిపరక తలవంచుకునే ఉంటుంది, కనుక ఎంతటి ఉప్పెనయినా ఏమీ చేయలేదు. అలాగే వినయసంపన్నుణ్ని ఎవరూ ఏమీ చేయలేరు. పెద్దలకు, గురువులకు, పరమాత్మకు, ప్రకృతికి వినయబద్ధులమైఉంటే- అది ఆత్మన్యూనత, అవమానం కాదు. పైగా అది గౌరవప్రాప్తికి ముఖ్యసాధనం కూడా. వ్యక్తి సౌశీల్యానికి అలంకారప్రాయం వినయగుణం.

ఈ అయిదు రకాల ఆవశ్యక లక్షణాలను ఆకళింపు చేసుకుని, ఆధ్యాత్మిక భావనతో మేళవింపు చేసి, ఆత్మసంతృప్తితో గౌరవమయ జీవనం కొనసాగించి, జన్మను చరితార్థం చేసుకోవడం మన విధ్యుక్తధర్మం!


- చిమ్మపూడి శ్రీరామమూర్తి

ᐅలోభి నీతి





లోభి నీతి 

లోభం అంటే పిసినారితనం. అది ఉన్నవాడు లోభి. లోభాన్ని, లోభులను గురించి పెద్దలు చాలా విషయాలే చెప్పారు. 'లోభివాని నడుగ లాభంబు లేదయా' అంటాడు వేమన. లోభికి దానభోగాలు శత్రువులు. అందుకే వాటి జోలికి వాళ్లు పోనేపోరు. పుణ్యం రాకపోతే రాకపోనీ. సుఖం లేకపోతే లేకపోనీ. ఒక్క రూపాయి కూడా చేజారిపోకూడదు. ఇదే లోభినీతి. లోభి గురించి పూర్వం ఒక కవి ఏమన్నాడో తెలుసా?- 'లోభి వంటి దాత లోకంలో లేడు, ఉండబోడు. ఎందుకంటారా? అతడు తన సంపదలను చేతితో ముట్టకుండానే చివరికి ఇతరులకు చెందేటట్లు చేస్తాడు'. ఈ మాట పరమసత్యమే కదా!
భర్తృహరి అందుకే అన్నాడు- ఆర్జించిన ధనానికి దానం, భోగం, నాశం అనే మూడు మార్గాలే ఉన్నాయని. తాము సంపాదించిన డబ్బును ఎవరు దానధర్మాలు చేసి ఖర్చుపెట్టరో, ఎవరు ఆ డబ్బును సుఖాలకోసం వాడుకోరో, అలాంటివారి ధనానికి మూడో మార్గం అయిన నాశనం తప్పనే తప్పదని స్పష్టంగా చెప్పాడు. చలినుంచి, గాలినుంచి, ఎండనుంచి తన శరీరాన్ని కాపాడుకుంటున్న మనిషిని చూసి మృత్యువు పరిహాసంగా నవ్వుకొంటుందట. వీడు తన శరీరాన్ని ఎంతగా రక్షించుకున్నా చివరికి నన్ను చేరక తప్పదు అని. అలాగే డబ్బును పెట్టెల్లోపెట్టి దాచుకొనే లోభులను చూసి, భూదేవి పరిహాసంగా హసిస్తుందట. ఈ డబ్బు అంతా నాలో కలిసిపోవలసిందేకదా అని.

ధనాన్ని సంపాదించడం అంటే అంత సులువైన పని కాదు. అహోరాత్రాలు కష్టపడాలి. బాధలను తట్టుకోవాలి. సహనంతో పనిచేయాలి. ఎంతో నేర్పు ప్రదర్శించాలి. ఇతరులను మెప్పించాలి. అప్పుడుగానీ ధనం రాదు. అలా సంపాదించుకొన్న డబ్బును శరీర రక్షణ కోసం, శరీర సంవర్ధనం కోసం, కుటుంబ సుఖంకోసం, భుక్తికోసం ఖర్చుచేస్తే సంపాదించిన డబ్బుకు సార్థకత ఏర్పడుతుంది. శరీర రక్షణను పట్టించుకోకుండా, తిండి సరిగా తినకుండా, మంచి బట్ట కట్టుకోకుండా, సుఖంగా నివసించకుండా కూడబెట్టిన సొమ్మువలన ఏం ప్రయోజనం ఉంటుంది? అలాంటి సొమ్ము మరణానంతరం ఇతరులకే ఉపయోగపడుతుందిగానీ సంపాదించినవాడికి ఎంతమాత్రం అక్కరకురాదు. అలాంటి ధనం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే.

చాతకపక్షి వర్షపు చినుకులు తాగి బతుకుతుంది. అలాంటి ఆ పక్షి ఎప్పడు మేఘాలు వస్తాయా, ఎప్పుడు వానపడుతుందా అని ఆకాశం వైపు చూస్తుంది. వర్షకాలంలో తప్ప ఇతర కాలాల్లో వచ్చే మేఘాలు వాన కురిపిస్తాయని కచ్చితంగా చెప్పలేం. శరత్కాలంలో వచ్చే మేఘాలు తెల్లగా, దూదిపింజల్లా ఉంటాయేగాని, ఒక్క వాన చినుకునూ రాల్చవు. అలాంటి శరత్కాలమేఘాన్ని చాతకపక్షీ నీటికోసం యాచించదంటాడు కాళిదాసమహాకవి రఘువంశ మహాకావ్యంలో. లోభి శరత్కాల మేఘంలాంటివాడు కనుక, అతణ్ని ఎంత కోరినా ఏ ప్రయోజనమూ ఉండదని భావం. లోభి వలన లోకానికి ఏ లాభమూ కలగదని పెద్దలమాటగా గుర్తుంచుకోవాలి.

ఔదార్యం అనేది దేవుడు ప్రసాదించే గొప్ప వరం. అది అందరిలోనూ ఉండాలని భగవంతుణ్ని ప్రార్థించాలి. ఆ సుగుణం పేదవానికి ఉంటే ఏం లాభం? ఇవ్వడానికి వాడికి ఏమీ ఉండదు. ఉన్నవాడికి ఔదార్యగుణం లేకుంటే ఏం లాభం? వాడు ఎవరికీ ఏదీ ఇవ్వడు. ధనవంతుడి ఔదార్యమే ఫలిస్తుంది గానీ, పేదవాడి ఔదార్యం ఫలించదు.

ధనం ఒక స్త్రీ వంటిది. దాన్ని చేపట్టినవాడు భర్త వంటివాడు కనుక, అనుభవించడం పురుషలక్షణం అవుతుంది. కానీ లోభి అయినవాడు తాను సంపాదించిన ధనాన్ని దానమూ చేయడు, తానూ అనుభవించడు కనుక- కేవలం చేతులతో తాకుతూ ఆనందించే నపుంసకుని వంటివాడేనని నీతికోవిదుల ఉపదేశం.

'బొచ్చె పట్టుకొని ఇంటింటికీ తిరిగి బిచ్చం అడుక్కునే బిచ్చగాళ్ళు లోకానికి ఏమని సందేశం ఇస్తున్నారో తెలుసా? బిచ్చం వేయకుంటే ఇలా బొచ్చె పట్టుకొనే గతి పడుతుందని'- ఒక కవి చమత్కారమది.

బిర్రబిగుసుకొన్న పిడికిలిపట్టుతో ఒరలో ఎప్పుడూ దాగిఉండే కత్తికీ, లోభికీ ఏ తేడాలేదనీ, అవి రెండూ కఠినమైనవే అనీ అంటాడొక కవి. 'లోభి, దాత ఇద్దరూ దారిద్య్రానికి భయపడతారట. దానం చేస్తూపోతే దరిద్రం రావచ్చునని లోభికి భయం. కనుక దానం చేయడు. దాత దానంచేసే అవకాశం ఎప్పుడూ ఇలాగే ఉండాలనీ, దరిద్రం ఎప్పుడూ రాకూడదనీ భయపడుతూ దానం చేస్తాడు' అని ప్రబోధిస్తాడొక నీతికారుడు. లోకంలో ధనానికి కొదవలేదు. ధనవంతులకూ కొరతలేదు. కానీ దానగుణానికి మాత్రమే ఎక్కడలేని కరవు ఏర్పడింది.


- డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ

ᐅభక్తాగ్రేసరుడు హనుమాన్





భక్తాగ్రేసరుడు హనుమాన్ 

ఏ నామాన్నయితే తాను నిత్యం జపిస్తుంటాడో ఆ రామనామానికి శాశ్వతత్వం కలిగించటానికే శ్రీరామావతారానికంటే ముందుగా హనుమంతుడి జన్మకు అంకురారోపణ చేశాడు పరమశివుడు. తన అంశను తీసుకుపోయి అంజనాదేవి గర్భాన చేర్చమని వాయుదేవుణ్ని నియోగించాడు. అందుకనే వాయుపుత్రుడు, పవనసుతుడు, మారుతి అనే వివిధ నామాలతో ప్రస్తుతి పొందుతున్నాడు హనుమంతుడు.
విషయ స్పష్టతతో, స్ఫుటంగా విస్పష్టంగా మళ్ళీమళ్ళీ వినిపించేలా ప్రతి అక్షరాన్నీ పలుకగల ఉత్తమ హనువులు (దౌడలు) కలవాడు కనుక ఆయనకు 'హనుమాన్' అన్నపేరు సార్థకమైంది. సన్యాసి వేషంలో రామలక్ష్మణుల ముందుకు వచ్చి ఆయన మొదటిసారి మాట్లాడినప్పుడు 'లక్ష్మణా! రుగ్వేదంలో మహాపండితుడు కాకపోతే, యజుర్వేదాన్ని ఔపోసన పట్టకపోతే, సామవేదంలో దిట్ట కాకపోతే- ఇంత స్పష్టంగా ఇంకా ఇంకా వినాలనిపించేలా మృదుమధుర కంఠంతో ఇలా ఇతడు పలకలేడు సుమా! ఇంతసేపు మాట్లాడినా ఒక్క అపశబ్దం లేదు. ముఖంలో, కళ్ళల్లో, నుదుటిలో, హస్త విన్యాసంలో వ్యంగ్యంలేదు. ఇతను తప్పక హనుమాన్ అయి ఉంటాడు' అన్నాడు శ్రీరాముడు.

కేవలం అంజనకు జన్మించడం వల్లనే ఆయన ఆంజనేయుడు కాలేదు. ఏ వ్యక్తి అయినా మాట్లాడేటప్పుడు నాభి నుంచి మొదలైన వాయువు హృదయాన్ని దాటి శ్వాసనాద తంత్రుల్ని స్పృశించి అంగుడుని అంటే అంజనను తాకుతుంది. ఈ వాయువుకు, అంజనకు పుట్టినవాడు- అంటే 'ప్రశస్తమైన వాక్కు' కలవాడు కనుక ఆంజనేయుడు!

ప్రత్యక్ష నారాయణుడైన సూర్యదేవుడి వద్ద సర్వవేద శాస్త్రాలు అభ్యసించిన పండితుడు, దేవతల ఆశీస్సులతో సిద్ధులు పొందిన సిద్ధపురుషుడు. వజ్రశరీరుడు. ఒక్క బ్రహ్మాస్త్రానికి తప్ప ప్రపంచంలో ఏ ఆయుధానికీ తల వంచనివాడు. సుగ్రీవుడిలా రాజరికాన్ని సమర్థించగలడు. రామలక్ష్మణులతో సమానంగా ఒంటరిగా ధైర్య సాహసాలతో యుద్ధం చేయగల వీరుడు. గరుడునిలా ఎంతో ఎత్తుకు ఎగిరి సుదూర ప్రాంతాలకు చేరగలడు.

ఆత్మ పరిశీలన, మానసిక ఏకాగ్రత, ఇంద్రియ నిగ్రహం, వస్తుమయ ప్రపంచంపై వైరాగ్యం, సత్వసాధనం మొదలైన ఉత్కృష్ట గుణాలతో- ఆ మహాదేవుడితో సమానమైన రామభక్తుడు.

ఇంతటి మహాధీశాలికూడా లంకలో మొదట సీతాదేవి కానరాక నిరాశా నిస్పృహలకు గురై, రిక్తహస్తాలతో వెనుదిరిగితే శ్రీరాముడితో సహా అంతా హతాశులవుతారని చింతించి- ప్రాణత్యాగం చేసుకుందామనుకున్నాడు. కేవలం అది లిప్తకాలం పాటు. 'చనిపోతే దోషం, బతికుంటేనే కదా శుభాలను బడయవచ్చు' అని తనను తాను సముదాయించుకొని- ఆశావాదంతో సీతాన్వేషణలో సఫలీకృతుడయ్యాడు. రావణాసురుడు తన కళ్ళెదుటే సీతను బెదిరించి వెళ్ళిపోతే ఆమె తన జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు ఉద్యుక్తురాలైనప్పుడు రామ కథాగానంతో సీతాదేవిని ఊరడించి రామ సందేశాన్ని వినిపించాడు. హనుమంతుడి పాత్రలేని శ్రీరామకథ అసంపూర్ణమయ్యేది.

సీత బహూకరించిన మాలలోని ముత్యాలను కొరికి పారేసినప్పుడు ఆయన భక్తిని శంకించిన వాళ్ళకు దివ్య సందేశమిస్తూ- తన గుండెల్ని చీల్చి అక్కడ ప్రతిష్ఠించుకున్న సీతారాముల్ని చూపించిన భక్తశిఖామణి ఆంజనేయుడు. పితృవాక్య పరిపాలనలో శ్రీరాముడికి ఎంత పేరొచ్చిందో, మాతృవాక్య పరిపాలనలో శరణాగతుడికి రక్షణ కల్పించి తన దేవుడితోనే పోరాటానికి సంసిద్ధుడై- తానూ అంత పేరు తెచ్చుకున్నాడు. రామ బాణాన్ని మించినది రామనామమని లోకానికి చాటిన దివ్యుడు.

సృష్టి మిగిలినంతకాలం రామనామ జపం ఆగదు. రామశబ్దం వినిపించిన చోటల్లా ప్రత్యక్షమయ్యే చిరంజీవి భక్తాగ్రేసరుడు... భక్త జన రక్షకుడు హనుమాన్!


- తటపర్తి రామచంద్రరావు

ᐅదృష్టిని బట్టి సృష్టి





దృష్టిని బట్టి సృష్టి 

మానవ జీవితం సంసార సాగరంలో పయనించే ఓ పడవ. అలలు, తిమింగలాలు, తుపానులు... పయనం మొత్తం భయానకం, భీభత్సం. ఇలాంటి అనిశ్చిత పయనంలో పడవ గమ్యానికి చేరుతుందా, మనిషి ఒడ్డున పడతాడా? మానవ జీవితానికి రెండు రకాల గమ్యాలు. సాధారణ మానవుడు, పారమార్థిక పామరుడు వూహించే మరణం... ఒక గమ్యం. రెండోది- మహా అదృష్టవంతుడైన పారమార్థికతను ఆశించే పరమపదం. ఆధ్యాత్మిక స్పర్శ ఏమాత్రం లేని సాధారణ మానవుడి దృష్టిలో జీవితానికి ఉద్దేశం, చివరి అంకం, గమ్యం అంటూ ఉన్నది కేవలం మరణం మాత్రమే. అనివార్యమని తెలిసినా అనుక్షణం మరణానికి భయపడుతూ, ఉన్న కొద్ది వ్యవధిలోనే అంతా సొంతం చేసుకోవాలనే తాపత్రయంతో జన్మోద్దేశాన్ని గ్రహించక వృథా చేసుకునే నిర్భాగ్యుడు. నిజంగానే అతని జీవితం కల్లోలిత భవసాగరంలో ఓ ఓటిపడవ. నిలకడ లేక, కుదుపులకు వ్యధ చెందుతూ అనిశ్చిత, అశాంతిమయ జీవితం గడిపే ఈ అభాగ్యుడు, 'పెనం మీంచి పొయ్యిలోకి పడాలే' అనేంత భయవేదనతో మరణానికై చూస్తూ ఉంటాడు. అతని జన్మోద్దేశం, దానికి తగిన జీవన శైలి, గమ్యం అదే. అంతే. అయితే మరో అదృష్టవంతుడున్నాడు. క్షామసదృశమైన జీవితాన్ని క్షీరమయం చేసుకున్నవాడు, మరుభూమిని మల్లెతోటగా మలచుకున్నవాడు, భవసాగరాన్ని భవ్యసాగరంగా మార్చుకున్నవాడు. అతడే ఆధ్యాత్మికపరుడు. జీవితం అతనికి ఓ యజ్ఞం... మనోజ్ఞం! జీవితం అతనికి ఓ పాట... పూతోట! జీవితం అతనికి శ్రీకారం, ఎడతెగని ఓంకారం. ప్రతివ్యక్తిలో అతను చూసేది అవ్యక్తమైన అంతర్యామిని. అందుకే అతనికి ఎవరిని చూసినా భయం లేదు... చివరికి, మరణమన్నా! మరణం అతనికి ఓ మార్పు. ఆధ్యాత్మిక ప్రగతికై కొత్త వసతుల కూర్పు. ఈ జన్మలో చేసిన సాధనలకు భగవంతుడిచ్చిన మరిన్ని బహుమతుల ఓదార్పు. అతడు ఆశాజీవి. అతనిది శతకోటి జన్మల తదనంతరమైనా 'ఆయన' తన పాదపీఠానికి చేర్చుకుంటాడనే మధురమైన ఆశ. మన్నికైన ఆశ. అందుకే మరణం అతణ్ని బాధించదు. నిరాశపరచదు. అతనికి తెలుసు తనకు మరణం లేదని. తాను ఆత్మనని. ఆత్మ శాశ్వతమని. జన్మాంతరాల అతని ప్రయత్నమల్లా ఈ జీవాత్మను ఆ పరమాత్మలో లయం చేయాలని మాత్రమే. ఈ జన్మ పరంపరలు, మరణవేదనలు అతనికి భయాన్ని, విసుగును కలిగించవు. ఎందుకంటే జీవితాన్నొక వేడుకగా భావించినవాడతడు. మరణాన్నొక మార్పుగా స్వీకరించినవాడతడు. వేదనను సాధనగా మార్చుకున్నవాడతడు. అతని సంయమనం ముందు, అతని వైరాగ్యం ముందు, అతని ముముక్షత్వం ముందు సమస్త సంక్లిష్టతలు, సంవేదనలు సోదిలోకి కూడా లేకుండా, అతని ఛాయల వరకూ కూడా రాకుండా పొట్టులా కొట్టుకుపోతాయి.
ఏ మనిషికైనా జీవితం ఒకటే. ద్వంద్వాలు ఒకటే. అయితే స్వీకరించటంలోనే, అర్థం చేసుకునే విధానంలోనే సౌభాగ్య, దౌర్భాగ్యాలు మనకు దక్కుతాయి. జీవన సాఫల్యం చేజిక్కుతుంది.

- చక్కిలం విజయలక్ష్మి

ᐅఆత్మతత్వం




ఆత్మతత్వం 

నిత్యమైనది ఆత్మ. సత్యమైనది ఆత్మ. దేహి నిత్యుడు. తోలుతిత్తిలాంటి దేహం అనిత్యమైనది. ప్రాపంచిక విషయాల మీద అత్యంత ఆసక్తి కనబరుస్తూ, దైహిక సుఖాలు తీర్చుకోవడంలోనే తన్మయం చెందే ప్రాణి అత్యంత అల్పుడని చరిత్ర నిరూపించింది. అరిషడ్వర్గాలను జయించగలిగితేనే సామాన్యుడు మాన్యుడవుతాడు. తనలో కలిగే క్రోధం, కామం తాత్కాలిక సుఖాన్నిచ్చేవే కానీ- శాశ్వత సుఖాలకు మార్గదర్శనం చేయించేవి కావని మానవుడు గ్రహించాలి.
ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటం అత్యంత ఆవశ్యకమని భారతీయ సనాతన సంస్కృతినుంచి నేటివరకు ఉదాత్త జీవనం గడిపిన ఎందరో మహనీయుల చరిత్ర చెబుతోంది.

బయటపడ్డ తన అవయవాలను అనుకూల పరిస్థితిలేనప్పుడు తాబేలు ఎట్లా లోపలికి ముడుచుకుంటుందో, స్థితప్రజ్ఞుడు తన విషయ వాంఛలను వెనక్కు మరలిస్తాడు. కోరికలను ఎవడు అణచగలడో వాడినే ధీరుడిగా శాస్త్రాలు పేర్కొంటున్నాయి. అటువంటివాడు రజోగుణం లేక ముక్తిమార్గాన్ని దర్శించగలుగుతాడు.

ఇంద్రియాలను నిగ్రహించటం అంత సులవైన విషయం కానేకాదు. ఆత్మ నియంత్రణతో, ఆత్మ సంయమనంతోనే అది సాధ్యపడుతుంది. ఇంద్రియాలను సమిధలుగా కలిగి ఆత్మ అనే అగ్ని వెలుగుతూ ఉంటుంది. ఈ ధరిత్రిలోని సమస్త ప్రాణుల నూతన ఆత్మలో దర్శించగలిగినవాడికి సూక్ష్మతత్వ దర్శనం కలుగుతుందంటారు. ఆత్మను అత్యంత పరిశుద్ధంగా ఉంచుకుని జ్ఞానదీపం హృదయంలో ప్రకాశవంతంగా వెలిగే రుషులూ, తపోధనులూ ఎందరో ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో తేటతెల్లం చేశారు.

శరీరమనేది ఒక సముద్రంలాంటిది. ఇంద్రియాలనే ఉత్తుంగ తరంగాలు ఇందులో పడిలేస్తూ కల్లోలం చేస్తూ ఉంటాయి. వాటికి కామక్రోధ లోభాది అరిషడ్వర్గాలు ప్రభువులు. వాటిని జయించినప్పుడే ఈ సముద్రాన్ని దాటి జ్ఞానతత్వం వైపు మళ్ళగలుగుతాం! ఆ పథంలోకి పురోగమించడానికి ఆత్మ నియతి చాలా అవసరం.

గీతాచార్యుడు ఆత్మ తాలూకు నిజమైన వర్తన, స్వరూపాన్ని అందరికీ దర్శింపజేశాడు- పాండవ మధ్యముడైన అర్జునుడితోపాటు.

'ఈ ఆత్మ ఏ కాలమందునూ పుట్టదు, గిట్టదు. ఉత్పత్తి, అస్తిత్వం, వృద్ధి, విపరిణామం, అపక్షయం, వినాశం అనే భావ వికారాలు లేనిది. జన్మలేనిది. మానవుడు జీర్ణ వస్త్రాలను త్యజించి, నూతన వస్త్రాలు ధరించినట్లు జీవాత్మ పాత శరీరం వీడి నూతన శరీరాన్ని పొందుతుంది. ఆత్మ ఛేదించటానికి, దహించటానికి వీలులేనిది. ప్రతి దేహంలో ఉండే ఈ ఆత్మను వధించటం ఎవరికీ వీలు కాదు' అని హితబోధ చేస్తూ, దుష్ట శిక్షణకు అర్జునుణ్ని ముందుకు నడిపాడు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణుడి ధర్మబోధతో ముందుకు కదిలిన పార్ధుడు మరో ఆలోచన లేకుండా యుద్ధంలో వీరవిహారం చేసి పాపభారాన్ని తగ్గించటంలో ప్రధాన పాత్ర పోషించాడు.

ఇది ద్వాపర యుగానికే కాదు, ఏ యుగానికైనా వర్తిస్తుంది. ఆత్మను పవిత్రంగా ఉంచుకుని, ఇంద్రియ నిగ్రహంతో ముందుకు సాగుతూ మానవులంతా సత్కర్మలను ఆచరించాలి. ఆ విధంగా మానవాళికి మంచి జరుగుతుంది. విషయ వాంఛలపై ఆసక్తిని విడనాడి, జ్ఞాన సముపార్జనపై దృష్టి సారించిన జీవుడు ధీరుడవుతాడు. అందరిలో మహితమైన ఆలోచనలు వెలిగించి మహనీయుడవుతాడు.

- వెంకట్ గరికపాటి

ᐅజీవన వసంతం




జీవన వసంతం 

ప్రకృతి పరిణామ శీలం కలిగి ఉంటుంది. రుతువులు, కాలాలు, గ్రహప్రభావాలు తమ ముద్రల్ని ప్రకృతిమీద వేస్తుంటాయి. తీవ్ర ఉష్ణం, శీతలం, వర్షం, తుపానులు ప్రకృతిమీద తమ ప్రతాపం చూపిస్తుంటాయి. ఇన్నింటినీ తట్టుకుని ప్రకృతి వసంతంలో కొత్త ఆశల చిగుళ్లు వేస్తుంది. రాలిపోయిన ఆకుల స్థానంలో కొత్తవి పుట్టుకొస్తాయి. ఈ ప్రక్రియ ఒకసారే కాదు- ప్రతి ఏడాదీ మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటుంది.
మనిషికి ప్రకృతి అందిస్తున్న అమూల్య సందేశంగా దీన్ని మనం స్వీకరించాలి. మనిషి సుఖసంతోషాల్ని ఎంత కోరుకున్నా, ఎన్నిపాట్లు పడినా కష్టాలు, కన్నీళ్లు తప్పవు. అంతటితో బెంబేలు పడిపోయి, నిస్పృహకు లోనై జీవితాన్ని అర్ధాంతరంగా చాలించుకునే యత్నాలు చేయకూడదు. మరణం ఒక్కసారే సంభవించాలి. కలతలతో, కన్నీళ్లతో మనసును దిటవుపరచుకోలేని బలహీనతలతో దినదిన గండంగా బతుకును నరకప్రాయం చేసుకోకూడదు. రోజూ చస్తూ బతికే వారు ఏ లక్ష్యాన్నీ సాధించలేరు.

భారతీయ ఆధ్యాత్మికతలోని గొప్పదనం ఏమిటంటే- అది విజ్ఞానంతో పాటు వివేకాన్నీ కలిగిస్తుంది. ఏది అశాశ్వతమో అది 'మాయ' అని చెబుతుంది. ఏ లక్షణాలవల్ల మనిషి పతనమవుతాడో తెలియజెప్పి హెచ్చరిస్తుంది. కేవలం బోధలతో సరిపెట్టకుండా అందుకు సంబంధించిన గాధల్నీ మనకు చెబుతుంది. కథలపట్ల మనిషికి సహజ కుతూహలంతోపాటు, మానవ మేధ సహజలక్షణం వల్ల అవి స్మృతికోశంలో పదిలంగా నిక్షిప్తమవుతాయి.

సముద్రజలాల్ని పైనుంచి చూస్తే కెరటాలుగానో, ఇంకాస్త ముందుకు వెళితే నిశ్చలజలంగానో కనిపిస్తాయి. కానీ, లోపల ఒక అద్భుత ప్రపంచమే ఉంది. సాధారణ నేత్రాలతో దాన్ని మనం చూడలేం. అందుకు ప్రత్యేక ప్రయత్నాలు చెయ్యాలి. భారతీయ ఆధ్యాత్మిక జ్ఞానమూ అలాంటిదే. సాధారణ దృష్టికి ఎలాంటి ప్రత్యేకతలూ కనిపించవు. ప్రత్యేక శ్రద్ధ, కృషితో పరిశీలించినప్పుడు అమూల్యమైన, అద్భుతమైన విషయాలు మన ఎరుకకు వస్తాయి. జ్ఞానం అమూల్యమే కాదు, అపారమనీ మనకు అర్థమవుతుంది. అందుకే జ్ఞానాన్ని మహాసాగరంతో పోలుస్తారు. భరద్వాజ మహర్షి వేదజ్ఞాన శిఖరాలను బ్రహ్మ అనుగ్రహంతో దర్శించాకగానీ, సమస్త జ్ఞానాన్ని కైవసం చేసుకోవటం అసాధ్యమని గ్రహించలేకపోయాడని పురాణ కథనం.

మనకు మనమే జ్ఞానులమని భ్రమించటం కన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదు. చీకటిని వెలుగుతోనే జయించాలి. అజ్ఞానాన్ని జ్ఞానంతోనే జయించాలి. ముందు మన అజ్ఞానమేమిటో మనకు తెలియజెప్పేదేజ్ఞానం.

అజ్ఞానాన్ని గుర్తిస్తున్న కొద్దీ, దాన్ని దూరం చేసుకుంటున్న కొద్దీ- మనలో సుఖదుఃఖభావన, లాలస క్రమంగా నశించిపోతూ నిజమైన ఆనందం అనుభవానికి వస్తుంది. వసంతం ఉల్లాసానికి సంకేతం. జీవన వసంతం ఆధ్యాత్మిక వికాసానికి సంకేతం. ఎవరు ఆధ్యాత్మిక వికాసం పొందుతారో వారు సర్వకాలాల్లోనూ జీవన వసంతాన్ని అనుభూతిగా పొంది, ఎటువంటి మనోవికారాలూ లేని స్థిరమైన ప్రశాంతమైన జీవితాన్ని గడపగలుగుతారు.

అప్పుడే వారికి ఆధ్యాత్మిక ఫలాలు లభిస్తాయి. ఆత్మజ్ఞానులై 'అంతర్యామి'ని దర్శించగలుగుతారు.


- కాటూరు రవీంద్రత్రివిక్రమ్

ᐅసిలువపై సప్త సందేశాలు





సిలువపై సప్త సందేశాలు 

ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసే ఒక బోధకుడు కాలినడకన వూరికి ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో అడవి. పట్టపగలే అయినా ఎక్కడా నరసంచారం లేదు. భక్తిగీతాలు పాడుకుంటూ అడుగులు వేస్తున్న అతడికి 'ఆగు!' అనే కేక వినిపించడంతో వెనక్కు తిరిగాడు. అతడి వెనక గుర్రం మీద వస్తున్న ఒక బందిపోటు. ఆ వ్యక్తి గుర్రం దిగి తన నడుముకు తగిలించిన కత్తి తీసి ఆ బోధకుణ్ని భయపెడుతూ 'నీ దగ్గరున్న డబ్బంతా ఇవ్వు...' అన్నాడు. ఆ మాటలకు బోధకుడు ఏమీ చలించకుండా చిరునవ్వుతో 'స్నేహితుడా! నువ్వింత కష్టపడి దారిదోపిడులు సాగిస్తూ పాదచారులనుంచి సంపదను దోచుకుంటున్నావ్, ఇదంతా ఎవరికోసం?!' అన్నాడు.
'నా భార్య, ఎదిగిన ఇద్దరు పిల్లలు, వృద్ధాప్యంలో ఉన్న నా తల్లిదండ్రులు, వీరంతా సుఖంగా జీవించేందుకు ఈ దోపిడి సాగిస్తున్నాను...' అన్నాడు బందిపోటు. 'నీ ప్రాణాలకు తెగించి ఇలా దోపిడి చేస్తున్నావు... నువ్వు ఈ విధంగా మూటగట్టుకుంటున్న పాపభారాన్ని నీవాళ్లు మొయ్యగలరా...' అన్నాడు బోధకుడు.

ఆ మాటలకు అవాక్కయిన బందిపోటు వేగంగా అక్కడినుంచి కదిలాడు. బోధకుడు తన ప్రయాణం కొనసాగించాడు. కొద్దిసేపటి తరవాత ఆ అడవి మార్గంలోనే ఇంకా నడుస్తున్న బోధకుడికి గుర్రపుడెక్కల శబ్దం వినిపించింది. వెనక్కు తిరిగాడు. గుర్రంమీదనుంచి దిగివచ్చిన బందిపోటు అతడికి ఎదురుగా నిలబడి తలొంచుకున్నాడు. అతడి కళ్ళల్లో నీళ్లు. 'మీరన్నది నిజమే... నేనిప్పుడే నా వాళ్ళను కనుక్కున్నాను. ఇన్ని సంవత్సరాలుగా ప్రాణాంతకమైన దోపిడి వృత్తిని సాగిస్తున్నా... నా కోసం వాళ్ళు ఏ త్యాగానికీ సిద్ధంగా లేరు. ఈ లోకంలోనే కాదు, పైలోకంలోనూ నా పాపఫలితాన్ని భరించేందుకు ఒప్పుకోవడం లేదు...' అన్నాడు దుఃఖపడుతూ. అందుకు ఆ బోధకుడు, 'దిగులుపడకు, నీ నుంచి ఏ ప్రతిఫలం ఆశించకుండా నీ పాపభారాన్ని తనపై వేసుకున్న పరమ ప్రభువు గురించి నీకు తెలుసా?' అన్నాడు.

'ఎవరా మహానుభావుడు?' అన్నాడా బందిపోటు.

వెంటనే బోధకుడు- సమస్తజనుల పాపభారాన్ని మోయడానికి సిలువపై మరణించిన క్రీస్తు ప్రభువు బలియాగం గురించి బోధించాడు. యేసు ప్రభువు సిలువపై పరమపదించిన పవిత్రమైన రోజు శుభ శుక్రవారం. ఆయన తిరిగి లేచిన మూడోరోజుగా ఈస్టరు పర్వదినాన్ని భావిస్తారు.

ఇశ్రాయేలీయులు తమ నాలుగువందల ఏళ్ళ బానిస బతుకు నుంచి విముక్తి లభించినందుకు 'పస్కా' అనే పండుగ జరుపుకొనేవారని బైబిలు చెబుతోంది. ఆ పండుగలో ప్రతీ ఇంటి నుంచి ఒక గొర్రెపిల్లను బలి ఇచ్చేవారు. బలికి ఇచ్చే గొర్రెపిల్ల శుద్ధమైనదిగా, దోషరహితంగా ఉండాలి. అలా సమస్త మానవాళిని వారి పాపాలనుంచి విముక్తులను చేసే పరమ ప్రభువైన క్రీస్తు పాపరహితుడిగా, పరిశుద్ధుడిగా సిలువ ఎక్కాడు. సిలువపై వేలాడదీసినప్పుడు ఆయన చెప్పిన ఏడు మాటలు అజరామరంగా నిలిచిపోయే దివ్యమైన సందేశాలు.

తనను సిలువపై మేకులతో కొట్టి వేలాడదీసి, ఎంతో హింస పెట్టినవారిని సైతం క్షమించమంటూ-

'తండ్రీ... వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు' అనేది సిలువపై నుంచి ఆయన మాట్లాడిన మొదటి మాట.

తనతోపాటు సిలువ శిక్షకు గురైన ఒక దొంగ కనబరచిన విశ్వాసంతో ఆయన, 'నేడు నీవు కూడా నాతో పరలోక రాజ్యంలో ఉంటావు' అని చెప్పిన మాట రెండోది.

తన తల్లిని శిష్యులకు అప్పగిస్తూ 'అమ్మా ఇదిగో నీ కుమారుడు... సహోదరా! ఇదిగో నీ తల్లి' అన్నది మూడో మాట.

తన తండ్రి ఆజ్ఞానుసారం సిలువపై బలియాగమై పడుతున్న శ్రమలను భరిస్తూ, 'నా దేవా, నా దేవా నన్నేల చేయి విడిచితివి' అని పలికిన మాట నాలుగోది.

ఆత్మల రక్షణ నిమిత్తం, దాహార్తుడనై ఉన్నాననే అర్థంతో, 'నేను దాహం గొనుచున్నాను' అని సిలువపై పలికిన మాట అయిదోది.

తండ్రి తనకు అప్పగించిన ఆ మహాయజ్ఞాన్ని పూర్తిచేస్తూ ఆయన పలికిన ఆరోమాట 'సమాప్తమైనది'

సిలువపై పరిశుద్ధ రక్తాన్ని చిందిస్తూ, మానవాళి పాప పరిహారార్థం చనిపోతూ ఆయన చెప్పిన ఏడో మాట, 'తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను'

ఈ ఏడు మాటలూ సిలువపై నుంచి యేసు మానవాళికి అందించిన సప్తసందేశాలు. ఈ మాటల వలన మనకు ఏం అర్థం అవుతుంది?! హింసించినవారిని సైతం క్షమించిన ఆయన కరుణ మనకు కనబడుతుంది. తనపై నమ్మకం, విశ్వాసం ఉంచిన దొంగను సైతం ఆయన తన అక్కున చేర్చుకున్న విషయం అవగతమవుతుంది. వృద్ధురాలైన తల్లిని తన శిష్యులకు అప్పగించడంలో, ఆయనకు ఆమెపై ఉన్న అవ్యాజ ప్రేమ మనకు తెలుస్తుంది. అలాగే ప్రతి కొడుకూ తండ్రి అప్పగించిన బాధ్యత నెరవేర్చాలని ఆయన సూచనప్రాయంగా పలికిన ఆరోమాటలో తెలియజేస్తాడు.

ఇలా సప్త సందేశాలు అందరూ ఆచరించదగ్గ, అనుసరణీయమార్గాలు. వీటిని అనుసరించే ప్రతి వ్యక్తీ ప్రేమ, కరుణ, క్షమ మూర్తీభవించిన క్రీస్తు ప్రభువులా పునరుత్థానం చెందుతాడనేది శుభశుక్రవార పర్వదినం అందించే శుభ సందేశం.

- డాక్టర్ ఎమ్.సుగుణరావు

ᐅఏ దేశమేగినా





ఏ దేశమేగినా... 

వివేకానందస్వామి గొప్ప దేశభక్తుడు. ఆధ్యాత్మికశక్తితోపాటు ఆయనలోని దేశభక్తి దేశప్రజలపట్ల అత్యంత ఆర్ద్రతను కలిగించింది. బాధ్యునిగా చేసింది. ఆయన విదేశీపర్యటన తరవాత ఎవరో ప్రశ్నించారు- 'భారతదేశం పట్ల మీకు గొప్ప భక్తి, గౌరవం. మరి సకల సౌకర్యాలతో, సుఖభోగాలతో ఓలలాడే దేశాలు చూశాక ఇప్పుడు భారతదేశం పట్ల మీ అభిప్రాయం ఏమిటి?' అని. 'ఇదివరకటికంటే ఇప్పుడు నా దేశం పట్ల నాకు మరింత ఆరాధన, పూజ్యభావన పెరిగాయి' అన్నది ఆయన సమాధానం.
చాలామంది అడిగే ప్రశ్న- 'ఏమిటి భారతదేశం గొప్పదనం? పేదరికం, అనాగరికం, మూఢవిశ్వాసాలు... ఇవేగా?' అని. స్థూలదృష్టితో చూస్తే అలాగైనా, ఎలాగైనా కనిపించవచ్చు. కానీ, భారతీయులది అంతర్‌నేత్రం. జ్ఞానదృష్టితో చూస్తే, భారతం ఒక ఆధ్యాత్మిక దేశం. సాత్విక దేశం. సర్వశ్రేష్ఠదేశం. మనిషి జన్మరహస్యాన్ని తెరిచే తాళం చెవి ఇక్కడుంది. ధనం, సుఖభోగాలు, సౌందర్యపోషణ, ఆహారం, అధికారం, ఆర్భాటం... ఇవి కాదు- మానవ జన్మ ఉద్దేశం. నిరంతర పర శ్రేయోకామన, వైరాగ్యం, యజ్ఞభావనా జీవితం, ఆత్మసాక్షాత్కారం, పరమపదప్రాప్తి... ఇవి. ఇదీ మానవ జన్మోద్దేశం. వీటి సాధనకు భారతదేశం వాకిళ్లు తెరుస్తుంది. పూలబాట పరుస్తుంది. ఉత్తమోత్తమ జీవిక గమనానికి, ఉత్కృష్ట జీవన గమ్యసాధనకు భారతాన్ని మించిన దేశం భూతలంమీదే లేదు. ఇది వేదాలు పుట్టిన దేశం. ముక్కోటి దేవతల నిలయమైన గోవులు అలరారే దేశం. అష్టాదశ శక్తిపీఠాలతో ద్వాదశ జ్యోతిర్లింగాలతో తానే పరమాత్మ పీఠమై పునీతమైన దేశం. హరిపాదాల పుట్టిన గంగ, ఆయన పాదాలు కడిగి తాను మొత్తం పావనమైపోయిన గంగ, ఆ పుణ్యజలాల ప్రవాహాలతో భారతం మొత్తాన్ని నిత్యపుణ్యావచనం చేస్తోంది. పంచభూత సమన్వితమైన ఈ సృష్టికి ప్రతీకగా ఆకాశలింగం (చిదంబరం), వాయులింగం (శ్రీకాళహస్తి), అగ్నిలింగం (అరుణాచలం), జలలింగం (జంబుకేశ్వరం), పృధ్వీలింగం (శ్రీశైలం) రూపంలో వెలసి తనకు, ఈ చరాచర సృష్టికీ అభేదభావాన్ని స్పష్టంచేశాడు భగవంతుడు. ఆ లింగాలతో ఈ దేశం కైలాసమే అయింది. ఇంకా కాశీ, రామేశ్వరం, పూరి, కేదారనాథ్, బదరీనాథ్ వంటి పవిత్ర క్షేత్రాలు, దేవాలయాలు, పుణ్యతీర్థాలు... భారతం సర్వం దేవతామయం. హిమాలయాలు, వింధ్య, మేరు... పర్వతాలే ధ్యానమూర్తులుగా తపోదీక్షలో మునిగిపోయిన దేశం ఇది. ఔను. ఇక్కడ నదులు, పర్వతాలు, ప్రకృతి ధ్యానం చేస్తాయి. సదా తపోనిష్ఠలో ఉంటాయి. పురుగును కూడా పుణ్యజీవిగా ఆరాధించే దేశం. ఇంతకంటే గొప్పదేశం ఎక్కడుంది? ముక్కులో కదలాడే గాలి ముక్కంటివరకు తీసుకువెళ్తుందనే రహస్యాన్ని కనుగొన్న దేశం. అప్రమేయుడైన పరమాత్మ మన ఆంతర్యంలో, పిడికెడంత హృదయమధ్యంలో విరాజమానుడై ఉన్నాడనే పరమసత్యాన్ని లోకానికి చాటిన దేశం. ఇదీ భారతదేశం!

బ్రాహ్మీముహూర్తం సాధనకు ఉపయుక్తమైన కాలం. భారతీయులకు అత్యంత ప్రీతిపాత్రమైన సమయం. చాలాదేశాల్లో ఆ సమయం నిద్రలేచేందుకు కాదు. కనీసం కదిలేందుక్కూడా వీలుకానంత శీతలత్వంతో ముణగదీసుకుని ఉంటుంది. అక్కడ నదీస్నానాలు, నదీతీర సాధనలు... ఊహకు కూడా అందని విషయం. మాఘస్నానాలు, ఏకాదశి, శివరాత్రుల పవిత్రస్నానాలు, పుష్కర పుణ్యస్నానాలు... భారతీయుల జీవితంలో మమేకమైన అంశాలు. మన జీవిత ప్రవాహాలు, నదీప్రవాహాలు సమాంతరంగా ప్రవహిస్తూ ఉంటాయి. సూర్యభగవానుడు మన ప్రత్యక్షదైవం. సూర్యనమస్కారాలు చేయాలన్నా, గాయత్రి జపించాలన్నా, సంధ్యావందన విధులు నిర్వహించాలన్నా సూర్యదర్శనం కావాలి. ఆ దేశాల్లో ఆ సమయాల్లో ఏడీ సూర్యుడు? కొన్ని దేశాల్లో అయితే ఆరు నెలలు సూర్యుడే కనిపించడు. మరికొన్ని దేశాల్లో మధ్యాహ్నానికిగానీ ఆదిత్య దర్శనం కాదు. సాధనకేం కావాలో, ఏది అవసరమో పువ్వుల్లో పెట్టి అందించే దేశం ఇది. అజ్ఞానిని అనంతుని వరకు చేయిపట్టి నడిపించే గురువులు. సాధనకు అనుకూలమైన ఆశ్రమాలు, అరణ్యాలు, పాము పుట్టలు, పంచవటులు...! అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్లు పరమపద మార్గాన్ని వ్యాసపీఠంమీద పెట్టి అందించిన వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, ఉద్గ్రంథాలు... ఎన్ని! ఎన్నని!

మనిషి రుషిగా జీవించేందుకు, ఆరుషిగా నిష్క్రమించేందుకు పెద్దపీట వేసిన భారతదేశం ఇది. రుషికానివాడు అద్వైతాన్ని అనుభూతించలేడు మరి. ఎంతో, మరెంతో, ఇంకెంతో, అంతులేనంత ఉంది భారతదేశ చరిత, ఘనత, విమలత. దీన్ని అర్థం చేసుకోవాలంటే- ఎంతో కొంత మనలో కూడా ఉండాలిమరి.

- చక్కిలం విజయలక్ష్మి

ᐅజీవన సాఫల్యం





జీవన సాఫల్యం 

మనిషికి లోకంలో అన్నింటికన్న ప్రధానమైంది జీవితమే. తన జీవితం కోసం ఎన్నిపాట్లు అయినా పడటానికి మనిషి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడేగాని, పోతేపోనీ అని ఉదాసీనత చూపడు. ఇది మానవనైజం. కొందరికి తాము కోరిన వ్యక్తి లభించడం జీవన సాఫల్యానికి నిదర్శనమైతే- మరికొందరికి కీర్తి, డబ్బు, అధికారం, ఉపాధి... ఇలా ఎన్నో, ఎన్నెన్నో!!
ఇవి మాత్రమే మనిషి బతుకు పండటానికి చిహ్నాలా, వీటిని మించినవి లేవా? కచ్చితంగా ఉన్నాయనే సమాధానాన్ని మన ప్రాచీనులు నొక్కి వక్కాణించారు. సరసంగా మాట్లాడగల చాతుర్యం, చక్కని సంతానాన్ని అందించిన భార్య, దానం చేయగలిగినంత స్థాయిలో ధనలాభం అనేవి జీవిత సాఫల్యానికి గుర్తులని ఒక కవి అంటాడు. అసలు లోకంలో ఎవడు జీవించి ఉండటంవల్ల అన్ని ప్రాణులూ సుఖసంతోషాలతో ఉంటాయో అలాంటివాడే జీవిత సాఫల్యాన్ని పొందినవాడు అవుతాడని విష్ణుశర్మ పంచతంత్రంలో అంటాడు. కాకి కూడా నూరేళ్లు బతుకుతుంది గానీ ఏం లాభం? జీవితమంతా ఎంగిలి మెతుకుల్ని ఏరుకొని తిని, పొట్ట నింపుకోవడం తప్ప ఇంకేమైనా చేయగలుగుతోందా? అందుకే పొట్ట నింపుకోవడం కోసం బతికేది బతుకు కాదు. తన పొట్ట నింపుకోవడంతోపాటు తోటివారి ఆకలి తీర్చినప్పుడే తిన్న అన్నం జీర్ణమవుతుందని గ్రహించాలి. ప్రాణాపాయ పరిస్థితిలో సైతం 'అన్నమో రామచంద్రా!' అని ఆకలితో దగ్గరకు వచ్చేవారికి తాను తినకున్నా సరే పెట్టాలనే రంతిదేవుడు ఆదర్శం కావాలేగాని, 'చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష' అనుకొంటూ అన్నంమీద పడి మెక్కకూడదని మన శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి. డబ్బు శాశ్వతమా? కానే కాదు. జీవితం శాశ్వతమా? అసలే కాదు. యౌవనం చిరస్థాయిగా ఉంటుందా? ఏమాత్రం ఉండదు. ఇలాంటి అశాశ్వత విషయాల కోసం మనిషి ఇస్తున్న ప్రాధాన్యాన్ని చూస్తే ఏవగింపు కలగక మానదు. మంచి గుణాలు గలవాడు మరణించినా, కీర్తితో జీవించే ఉంటాడు. చెడు నడక గలవాడు జీవించి ఉన్నా మరణించినవాడితో సమానమే అంటారు మన పెద్దలు. కేవలం చావుపుట్టుకలతోనే గణన పొందే మనిషి జీవితానికి ఏ సార్థకతా ఉండదు. తన పుట్టుకవల్ల తన వంశానికీ, చుట్టూ ఉన్న సమాజానికీ, విశాల ప్రపంచానికీ ఎవడు మేలు కలిగిస్తాడో వాడే నిజంగా పుట్టినవాడి కింద లెక్క. లేకుంటే అలాంటివాడు వ్యర్థజీవే.

'తాబేలు జన్మ గొప్పది. అది తన వీపుపై సకల భువనాలనూ వహిస్తున్నది... ధ్రువనక్షత్రం ఎంతో గొప్పది. దాన్ని ఆలంబనగా చేసుకొని కోట్లకొద్దీ నక్షత్రాలు పరిభ్రమిస్తున్నాయి. జీవిస్తే తాబేలువలె, ధ్రువనక్షత్రంవలె జీవించాలి. మేడిపండులోని పురుగులా జీవించకూడదు. ఎందుకంటే- మేడిపండులోని పురుగు ఆ పండును పాడుచేయడంతోబాటు, ఇతరులకు ఆ పండును పనికిరానిదానిగా మారుస్తోంది' అని వర్ణించాడు ఒక ప్రాచీనకవి. జీవితాన్ని సఫలంగా మార్చుకోవాలంటే సద్గుణాలను ఆశ్రయించక తప్పదు. ఔషధాలు సేవించకపోతే రోగం తగ్గదు కదా. అలాగే ఎప్పుడూ మంచినే కోరుకోవడం, కోరుకున్న మంచిని ఆచరించడానికి పూనుకోవడం అనే విద్యను మనిషి నేర్చుకుంటే- అతని జీవితం సఫలం కాగలదనడంలో ఎలాంటి సందేహం లేదు.

- డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ

ᐅఆత్మస్త్థెర్యం




ఆత్మస్త్థెర్యం 

ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మహత్య భావన కలగకుండటమే ఆత్మస్త్థెర్యం. కష్టాలు, సుఖాలు గాలితెమ్మెరలాంటివి. ఒకప్పుడు చల్లనిగాలి, మరొకప్పుడు వేడిగాలి వీస్తున్నట్లే- కష్టసుఖాలు కూడా మన జీవనయానంలో అతిథుల్లా వచ్చిపోతుంటాయి. సుఖం వచ్చినప్పుడు కలిగిన ఆనందం కష్టం వచ్చినప్పుడు ఉండదు. కష్టంలోని భయం సుఖంలో కలగదు. నిజానికి భయం, అభయం రెండూ భగవంతుడు ఏర్పరచేవి. ఎవరైతే కష్టాల్లో ఆత్మస్త్థెర్యం కోల్పోరో వారే ఆత్మనిగ్రహం కలిగినవారు.
శ్రీరాముడికి వచ్చిన కష్టాలు మానవులకు ఎవరికీ కలగవనేది యథార్థం. రాజు కావాల్సిన రాముడు అరణ్యవాసానికి సిద్ధపడి ఏరికోరి కష్టాలను తెచ్చుకొన్నాడనుకుంటారు కొందరు. నిజానికి శ్రీరాముడు తండ్రి ఆజ్ఞను పరిపాలించాడు. తల్లికి తన తండ్రి ఇచ్చిన మాటను నిజం చేశాడు. అవి కష్టాలుగా ఆయన భావించనేలేదు. పూలమ్మినచోట కట్టెలమ్మే పరిస్థితి విధి వైపరీత్యంతో సంభవించినా- ఆత్మస్త్థెర్యం కోల్పోకూడదు. సమస్య లేని స్థలమే లేదు. కష్టం రాని గృహమే లేదు. కానీ లోకంలో తామే కష్టాలనుభవిస్తున్నట్లు కలత చెంది బలవన్మరణానికి పాల్పడటం ఏరకంగానూ సమర్థనీయం కాదు. సుఖదుఃఖాలు రెంటినీ స్వీకరించకుండా ఉంటే ఆత్మస్త్థెర్యం నీ వెన్నంటే ఉంటుంది.

కారడవిలో తన భార్య సీతను అపహరించాడని గ్రహించిన శ్రీరాముడు కుంగిపోలేదు. అన్వేషణ మొదలు పెట్టాడు. ఆ అన్వేషణలో జటాయువు తోడైంది. శబరి కలిసింది. సుగ్రీవుడి పరిచయం కలిగింది. వానరుల సఖ్యత దొరికింది. ఇది శ్రీరాముని ఆత్మస్త్థెర్యం. ఇక దుస్సాహసమైన సముద్ర లంఘనంలో హనుమంతుడు సముద్రాన్ని దాటింది కూడా ఆత్మస్త్థెర్యంతోనే. వాలితో చావుదెబ్బలు తిన్నా వాలి వధ జరిగి, తనకు న్యాయమే జరుగుతుందని శ్రీరాముడిపై విశ్వాసంతో ఉన్న సుగ్రీవుడిదీ ఆత్మస్త్థెర్యమే.

కొందరు అధికారులు స్వార్థంతో చేసిన మోసానికి బలైనవారు సుగ్రీవుడిలా ఆత్మస్త్థెర్యాన్ని బూనాలి. మొదటిసారి కాకపోయినా, రెండోసారైనా విజయం సాధిస్తారు. ప్రతిసారీ అన్యాయంపై న్యాయం గెలుస్తూనే ఉంటుంది. కొందరు అన్యాయానికి సుగ్రీవుడిలా బలవుతూనే ఉన్నారు. అయినా చివరికి సుగ్రీవ విజయమే! అంతవరకూ మనకు కావాల్సింది ఆత్మస్త్థెర్యం. మనోనిగ్రహంతో కూడిన ఒక నమ్మకం, పట్టుదల కావాలి. దైవంపట్ల విశ్వాసం ఏర్పడాలి. 'అసహనంతో ఒరిగే ప్రయోజనమేమీ లేదు, ఓర్పు వహించండి- విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుంది'- అంటారు స్వామి వివేకానంద.

నవమాసాలు నిండిన తల్లి ప్రసవవేదన ఆత్మస్త్థెర్యంతో కూడినదే. తాను తల్లినవుతున్నాననే దృఢనమ్మకమే అన్ని నొప్పులను సహించేలా చేస్తుంది. బంగారంపై ఎన్ని దెబ్బలు వేసినా అది హారమవుతుందే తప్ప బూడిద కాదు.

మోసంతో జయించామని కొందరు భుజాలు ఎగరేసినా కడకు రావణాసురుడిలా అంతమొందక తప్పదు. అంతవరకూ మోసపోయినవారు కోల్పోకూడనిది ఆత్మస్త్థెర్యం.


- డాక్టర్ మరింగంటి మధుబాబు

ᐅసేవాప్రవృత్తి




సేవాప్రవృత్తి 

ఈ లోకంలో సేవాధర్మంకన్న మించిన ధర్మం లేదు. సృష్టి అంతా సేవలోనే నిబిడీకృతమె ఉంది. చెట్టు, చేమ, గుట్ట, పుట్ట... అన్నీ సేవాధర్మాన్ని ఎవ్వరూ గుర్తుచేయకుండానే నిర్వర్తిస్తున్నాయి. పశుపక్ష్యాదులూ తమకు చేతనైన సేవచేస్తూ మానవుణ్ని తృప్తిపరుస్తున్నాయి. ఎటొచ్చీ శ్రేష్ఠమైన జన్మపొంది, గొప్ప హృదయాన్ని, బుద్ధిని పొందిఉన్న మానవుడే సేవాధర్మం విస్మరిస్తున్నాడు లేదా అలక్ష్యం చేస్తున్నాడు. సేవాప్రవృత్తిని స్వార్థచింతన కబళించేస్తోంది. అహంకారం దహించివేస్తోంది. చదివినకొద్దీ, వివేకం పెరిగినకొద్దీ మనిషి ఇతరులనుంచి సేవను అపేక్షిస్తూనే ఉన్నాడు కాని- తాను సేవచేయాల్సింది విస్మరిస్తున్నాడు. ఇది ఎంతటి హేయమైన విషయం? ఏదైనా పొందాలంటే- ముందు ఇవ్వడానికి సంసిద్ధులం కావాలి! 'ఇస్తేనే వస్తుంది' అన్నది సామాన్య సూత్రం.
సేవచేయటంలో ఉన్న ఆత్మానందం, సంతృప్తీ, సంతోషం అనిర్వచనీయమైనవి. శక్తివంచన లేకుండా నిస్సహాయులకు, అనాధలకు, ఆర్తినిండిన కళ్లతో నిరీక్షిస్తున్న వాళ్లకు సహాయపడితే కలిగే ఆనందానికి సాటి లేదు. 'దరిద్రులు, దుఃఖితులు, దుర్మార్గులే నా ఆరాధ్య దైవాలు. ఇతరులకు ఏ కొద్దిపాటి సేవచేసినా అది మనలో ఉన్న శక్తిని జాగృతం చేస్తుంది. క్రమంగా అది మన హృదయంలో సింహసదృశమైన బలాన్ని నింపుతుంది' అంటారు స్వామి వివేకానంద. ఇతరులకు సేవ చేయటంవల్ల జాగృతమయ్యే అంతశ్శక్తితో మనం ఎంతటి విషమ సమస్యలనైనా అవలీలగా ఎదుర్కోగలం. పగలంతా పొలంలో పనిచేయటంవల్ల కలిగే అలసటకన్న ఒక్క గంట ఇతరుల్ని ద్వేషిస్తూ దూషిస్తూ పొందే అలసట దేహానికీ, హృదయానికీ మహాప్రమాదకరమైనదంటారు. ఆ అలసటలో ఆనందం ఉంది, తృప్తి ఉంది. ఈ అలసటలో మాలిన్యం ఉంది, పతనం ఉంది.

మనకు కలిగే కొన్ని చేదు అనుభవాల ఆధారంగా సమాజంలోని మానవులంతా స్వార్థపరులేననుకోవడం పొరపాటు. వెలుగునీడల్లాగే మంచీచెడులూ సహజం. దీర్ఘవ్యాధిగ్రస్తుడై మరణశయ్యపై పడి వున్న రోగిని చూసే వందమందిలో ఒకరిద్దరు కరుణాహృదయులూ ఉంటారు. దాహార్తితో విలవిల్లాడుతున్న బాటసారిని చూస్తూ చాలామంది వెళ్లిపోయినా, గుక్కెడు నీళ్లు పోసి కాపాడే మహానుభావులు ఎవరో ఒకరుంటారు. కొద్దిమంది స్వార్థపరుల్ని, దుర్మార్గుల్ని చూసి సమాజమంతా ఇలాగే ఉంటుందనుకోవడం పుట్టుమచ్చను చూసి పర్వతమని వూహించుకోవడంలాంటిది. అనాదిగా మానవజాతిలో ఎందరో మహాత్ములు అవతరించి, నిరంతర సేవాధర్మపరాయణులై జాతిని జాగృతం చేస్తూనే ఉన్నారు. ఇతరులకు సేవ చేయడమంటే మనకు మనం సేవచేసుకోవడమేనన్న మహత్తర సందేశాన్నిచ్చే పాత్రలెన్నో!

ఆర్తితో అలమటిస్తున్నవారికి కావలసింది ఓ చిన్న పలకరింపు. ఓ ప్రేమ చిలకరింపు. కనీసం అదైనా మనం చేయలేకపోతే- మానవజన్మే వ్యర్థం. బుద్ధుడు, రామకృష్ణ పరమహంస, మదర్‌థెరెసా, మార్గరెట్ ఎలిజబెత్, అబ్రహాం లింకన్ వంటి మహనీయుల సేవాదృక్పథం మనం మరువగలమా? నిజమైన సేవకుడికి కులం, మతం, వర్గం, ప్రాంతం, సమయం-ఇవేమీ అడ్డుకావు. అలాగే మనిషి, పక్షి, పశువు- ఇలాంటి తారతమ్యాలు కూడా చూడడు. ఒక్క అన్నం ముద్దవేస్తే తిన్న కుక్క మన లోగిలిలోనే ఎంత విశ్వాసంగా పడి ఉంటుంది? ఒక అద్భుతమైన సుగుణం చాలు- మనిషిని మనీషిగా తీర్చిదిద్దేందుకు! శక్తి, వనరులు, అవకాశాలు, వివేకం, విచక్షణ- అన్నీ ఉండి కూడా ఈ జీవితాన్ని దీనజన సేవకు కొంతలో కొంతయినా వినియోగించలేకపోతే ఇంక ఈ జన్మకు అర్థమే లేదు. పరమార్థం అంతకన్నా లేదు. మనసు, మాట, విద్య, విత్తం, ఆహారం... ఏ రూపేణా అయినా సేవచేసి ఆదుకోవచ్చు. సంకల్పం ఉండాలేకాని, సేవా పరాయణత్వానికి ఎన్నో మార్గాలు. ఈ సత్యం తెలుసుకుని మన జీవితాన్ని సేవామయంగా విరాజిల్లజేసుకుందాం!

- చిమ్మపూడి శ్రీరామమూర్తి

ᐅజీవితం అపురూపం





జీవితం అపురూపం 

జీవితం జీవించేందుకు. గెలిచేందుకు. గెలిపించేందుకు. అపురూపమైనవి లభించినప్పుడు అపురూపంగానే చూసుకుంటాం. గడ్డిపువ్వును పట్టించుకోని మనం గులాబీ పువ్వు దొరికితే ఆనందపడిపోతాం. అపురూపంగా చూస్తాం. జీవితం లోకంలోని అన్నింటిలోకీ అపురూపమైంది. దాన్ని ఆ ఎత్తునే స్వీకరించాలి. గౌరవించాలి. ఆస్వాదించాలి. మన రుషులు జీవితంలోని ప్రతి క్షణాన్ని ఒక 'వర'సమానంగా, మహాప్రసాదంగా భావించారు. నిజానికి, జీవితంలోని ప్రతి క్షణానికి శాస్త్రమే, వేదమే ప్రమాణం. రుషులు చేసిందదే. శాస్త్రప్రమాణంతో, వేదవిహితంగా జీవించారు. అది రుషి సంస్కృతి. అదే వేదవిహిత సంస్కృతి. మరి మనం ఏం చేస్తున్నాం, మనకేది ప్రమాణం? జీవితం తాలూకు విలువల్ని తెలిపే ప్రమాణం ఏది? సమయం విలువ తెలీదు. శాస్త్రం విలువ తెలీదు. జీవితం విలువ అసలే తెలీదు.
ప్రకృతిని చూడండి. ఎంతో సామరస్యత, స్వారస్వత కనిపిస్తుంది. పరస్పర ఆధారత, పరస్పర సహకారం కనిపిస్తాయి. నిర్ణీత ఆహారం కోసం తప్ప అనవసరంగా శత్రుప్రాణిని సైతం హింసించటం కనిపించదు. ప్రకృతి, ప్రపంచం మొత్తం ఏకాత్మతా భావంతో కనిపిస్తాయి. సూర్యుడు రాగానే తామరలు తమ రేకుల కళ్లను విప్పార్చుకుని చూస్తాయి. రవికిరణాల స్పర్శతో పులకించిపోతాయి. చంద్రుడు ఉదయించగానే 'వెన్నెల జలపాతం'లో స్నానమాడుతున్నట్లు కలువలు కమనీయంగా వికసించి కలకలం చేస్తాయి. సూర్యుడు కనిపించనంత మేరా ఉదయం నించి సాయంకాలం దాకా పొద్దుతిరుగుడు పువ్వు అటే చూస్తూ ఆ దిక్కుకే ముఖాన్ని ఎత్తిపెట్టుకుని ఉంటుంది. ఎక్కడి సూర్యుడు! ఎక్కడి పొద్దుతిరుగుడు పువ్వు! ఆకాశంలోంచి జాలువారే స్వాతి చినుకు, సముద్రంలోని ఆల్చిప్ప కలసి పొదిగే ఆణిముత్యం! కాకి గూటిలో పురుడు పోసుకునే కోకిల పాపాయి! ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఉరుకులు పరుగుల పరవశాలతో వచ్చే నది, నిబ్బరంగా నిలకడగా ఉన్నచోటు నుంచే ఆకర్షించే గంభీర సముద్రం... ఈ రెంటి సంగమవైభవం! ఈ ప్రేమ, ఈ అనుబంధం, ఈ ఆత్మైక్య భావన... ప్రకృతి ప్రతి అణువులో కనిపిస్తుంది. ప్రకృతి సహజంగా అనిపిస్తుంది. మనం మాత్రమే ప్రకృతి నుంచి విడిపోయి ఉన్నాం- ముఖ్యంగా వేదవిహిత జీవనానికి విముఖంగా.

నిజమే. ఇది కలియుగం. ఇరవై ఒకటో శతాబ్దం. పూర్వంలా లేదు. ఉండదు. నేడు రోజూ నదీస్నానాలు చేయలేం. యజ్ఞయాగాదులూ సంతర్పణలూ నిర్వహించలేం. కనీసం మట్టిపొయ్యి అలికి కట్టెలతో వంట చెయ్యలేం. ఇంటి ముందు ఆవుపేడతో కళ్లాపి చల్లి ముగ్గులు వెయ్యలేం. కానీ ఎన్నో చేయవచ్చు. కేవలం మెదడుతో కాకుండా హృదయంతో బతకవచ్చు. బ్రాహ్మీముహూర్తంలో లేవవచ్చు. ఉదయం కాసేపు- షోడశోపచార పూజ కాకపోయినా- ప్రార్థన చేసుకోవచ్చు. సాత్వికాహారం తీసుకోవచ్చు. దరిద్ర నారాయణుల సేవ చేయవచ్చు... మనం రుషులం కాదు. నిజమే. కానీ రుషి అంటే ఏమిటి? జఠాధారులా, అరణ్యవాసులా? కాదు. అంతమాత్రమే కాదు. అబద్ధాలాడనివాడూ రుషే. ఇతరులకు హాని చేయనివాడూ రుషే. సామాజిక స్పృహతో జీవించేవాడూ రుషే. నిజమైన భారతీయుడిగా చరించేవాడూ రుషే. ఆధునిక జీవన విధానంతోనే అయినా జీవిత సార్థక్య దృష్టితో జీవించేవాడు రుషే. ప్రతి క్షణాన్నీ అమృతకణంగా భావించేవాడూ, భాసించేవాడూ నిజమైన రుషి.

- చక్కిలం విజయలక్ష్మి

ᐅఅయోధ్య - రాముడు




అయోధ్య - రాముడు 

శ్రీరామకథను మూడు దృక్కోణాలతో దర్శించి, ఆరాధించడం భారతీయ సంప్రదాయం. ఒకటి- ధార్మిక దృష్టి, రెండు- ఉపాసనాదృష్టి, మూడు- తాత్విక దృష్టి, ఈ మూడింటి భావాలతో శ్రీరాముని అవతారకార్యం నడిచింది.
మానవ జీవన సరళిని మహోన్నతంగా మలచే 'ధార్మికత' మంత్రమయ భక్తిభావనతో పునీతులను చేసే 'ఉపాసనారీతి'పరమార్థతత్వాన్ని పట్టిచ్చే 'తాత్వికత'లు శ్రీరామునిలో మూర్తీభవించాయి. వ్యక్తి సాధించవలసిన అనేక ధర్మాల్లో ఒక్కొక్క సందర్భంలో పరస్పర ఘర్షణ ఏర్పడుతుంది. ఒక ధర్మాన్ని నిలిపేటప్పుడు, మరోధర్మం దెబ్బతినే పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో ఒకదాన్ని మరోదానితోఎలా సమన్వయించాలి, దేనికి ఎంత ప్రాధాన్యమివ్వాలి అనేది 'సూక్ష్మధర్మం'. అది తెలియడమే ధర్మసూక్ష్మం. ఆ సూక్ష్మజ్ఞానమే రాముడి వ్యక్తిత్వం. పాలనా ధర్మరక్షణ, వ్యక్తిగత కుటుంబ ధర్మనిర్వహణ... రెండింటికీ పొంతన కుదరనప్పుడు దేనికీ విఘాతం కలగకుండా కాపాడిన రాముడు.... దశరథ రామునిగా, సీతారామునిగా, అయోధ్య రామునిగా విజయశీల వ్యక్తిత్వాన్ని ప్రతిష్ఠించాడు.

శ్రీరాముడు కౌమారదశనుంచే తన రక్షణ స్వభావాన్ని ప్రకటించాడు. అధర్మాన్ని శిక్షించడంలో కాఠిన్యం, ధర్మ రక్షణలో కారుణ్యం... ఈ రెండింటి పొందిక శ్రీరాముడిలోని కరుణ వీర రస సమన్వయం. ప్రసన్న, ప్రతాప మూర్తిమత్వం. యువరాజయ్యే అర్హత కలిగిన వయస్సులోనే శ్రీరాముని దివ్యగుణాలకు అయోధ్య వాసులు ఆకర్షితులయ్యారు. ఆరాధించారు. ఆ దశలోనే రామచంద్రుడు వారి బాగోగులను గమనించడం, తండ్రి తనయులను ఆదరించినట్లుగా మన్నించడం... ఇవన్నీ ఉత్తమ పాలక స్వభావాలను స్పష్టం చేశాయి. ఒకవైపు పూర్వీకులనుంచి అనుసరిస్తున్న పటిష్ఠమైన ధర్మపరంపరకు రాముని ప్రత్యేకత తోడయ్యింది.

యుక్తవయసు రాగానే- వ్యవహారంగా దశరథుడు పాలకుడైనా, ప్రజల మనసుకు మాత్రం రాముడే ప్రభువు. అది గమనించే దశరథుడు యువరాజ్య పట్టాభిషేకానికి నిర్ణయించుకున్నాడు. జగద్రక్షణకై, వనవాసం నెపంతో రాముడు రాజ్యాన్ని త్యజించాడు. ఆ సమయంలో అయోధ్య కన్నీరు మున్నీరయ్యింది. రాముని వదలలేక అయోధ్యలో అనేకమంది ఆయన వెంటవెళ్లారు. వెళ్లే అవకాశంలేనివారు కేవలం శరీరాలే అక్కడ మిగిలినట్లయ్యారు. వెనక్కివచ్చిన వారితో ఇంటివారంతా 'రామునివదలి, రాముడులేని రాజ్యంలో ఏం సాధిద్దామని వచ్చారు?' అని వాపోయారు. 'అయోధ్యలో చరితార్థుడైన సత్పురుషుడు లక్ష్మణుడు మాత్రమే. అతడొక్కడే రామునితో వెళ్లాడు. రాముని వదలనివారే సత్పురుషులు' అని తీర్మానించుకున్నారు. బీడు పడ్డట్టుగా అయింది అయోధ్య.

శ్రీరాముని తిరిగి అయోధ్యకు రప్పించి రాజ్యాన్ని అప్పగించాలనుకున్న తన ప్రయత్నాలు వ్యర్థమయ్యాక, పాదుకలు తీసుకుని అయోధ్యకు చేరాడు భరతుడు. శ్మశానసదృశంగా గోచరించడంతో, భరతుడు అయోధ్యను వీడి నందిగ్రామంలో పాదుకాపట్టాభిషేకం చేశాడు. అక్కడినుంచే అయోధ్యను పాలించాడు. తిరిగి రాముడు వచ్చాకే అయోధ్యకు కళ వచ్చింది.

'అయోధ్య' అంటేనే 'ఇతరులు (శత్రువులు) దెబ్బ తీయలేనిచోటు' అని అర్థం. సాకేతం- అంటే 'జ్ఞానస్థలం' అని ప్రధానార్థం, శ్రీరామచంద్రమూర్తి ఏ హృదయంలో ఉంటాడో వారి జీవితమే రామభక్తి సామ్రాజ్యం. ఆ మానసంలో దుర్గుణాలనే అంతశ్శత్రువులు ప్రవేశించలేవు కనుక అదే 'అయోధ్య'. అది జ్ఞానమయస్థానం కనుక అదే 'సాకేతం'. అందుకే రామభక్తులు 'రాముని వారము మాకేమి విచారము' (రామదాసు) అని ధీమాగా పలుకుతారు. 'తక్కువేమిమనకు రాముండొక్కడుండు వరకు' అని నిర్భయంగా కీర్తిస్తారు. 'సీతమ్మ మాయమ్మ- శ్రీరాముడు మాకు తండ్రి' అని (త్యాగయ్య) తృప్తిగా జీవిస్తారు.

- సామవేదం షణ్ముఖశర్మ

ᐅపుష్కర పట్టాభిషేకం





పుష్కర పట్టాభిషేకం 

మూర్తీభవించిన ధర్మ స్వరూపుడు శ్రీరామచంద్రుడు. విశ్వశాంతికి, సమాజ ప్రగతికి ధర్మమొక్కటే మార్గమని రాముడు ఆచరించి చూపాడు. వ్యక్తి ధర్మానికి, రాజధర్మానికి రాముడు ప్రతీక. రాజ్యమంటే రామరాజ్యం, రాజంటే శ్రీరాముడే అనే రీతిలో రాఘవుడు యుగయుగాలకు తరగని ఖ్యాతి అందుకున్నాడు. తన రాజ్యంలోని ప్రజల్ని అభిమానిస్తూ, ఆదరిస్తూ రాముడు ధర్మ నిరతితో, నిజాయతీ, నిబద్ధతలతో పాలన సాగించాడు. సర్వకాల సర్వావస్థల్లో ధర్మావలంబనతో రాఘవేంద్రుడు ధర్మరక్షకుడిగా వినుతికెక్కాడు. అలాంటి జగదేక సార్వభౌముడికి సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాన్ని భద్రాచల దివ్యక్షేత్రంలో చైత్ర శుద్ధ దశమినాడు నిర్వహిస్తారు. రాముడికి పట్టాభిషేకం జరపడమంటే, ధర్మానికి పట్టం కట్టడం. ప్రజలంతా ధర్మాచరణకు కట్టుబడి ఉంటామని ప్రతిన బూనడం. అలనాటి రామరాజ్య పరిస్థితుల్ని మళ్ళీ ఆహ్వానించడం. అందుకే ఈ సంబరం... ఈ సంరంభం.
పట్టాభిషేక మహోత్సవమనేది కేవలం శ్రీరామచంద్రుడికి తప్ప మరే ఇతర దైవానికీ జరపని కమనీయ వేడుక. నవమినాడు కల్యాణరాముడిగా, దశమినాడు పట్టాభిరాముడిగా రఘువీరుడు భాసిల్లుతాడు. రామపట్టాభిషేక వేడుక నాలుగు విధాలుగా విలసిల్లుతుంది. శ్రీమద్రామాయణ నిత్యపారాయణను అనుసరించి ప్రతినెలా పుష్యమి నక్షత్రంనాడు పట్టాభిషేకం నిర్వహిస్తారు. శ్రీరామనవమినాటి మరుసటి రోజు శ్రీరామ మహాపట్టాభిషేకం జరుపుతారు. ప్రతి పుష్కరానికి అనగా పన్నెండేళ్లకోసారి శ్రీరామ మహాసామ్రాజ్య పుష్కర పట్టాభిషేకాన్నీ, అరవై సంవత్సరాలకోసారి ప్రభవ నామ సంవత్సరంలో శ్రీరామ మహాసామ్రాజ్య పట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు. 1999 సంవత్సరంలో ప్రథమ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకాన్ని జరపగా, ఇప్పటిది రెండో పుష్కర పట్టాభిషేకం. జగదానంద కారకుడైన, జనప్రియుడైన, జానకీ వల్లభుడైన రామచంద్ర మహాప్రభువుకే మళ్లీ పాలనను అప్పగించడం, శ్రీరామ కరుణ, కృపాకటాక్షాల్ని అర్థించడం- ఈ పట్టాభిషేక నిర్వహణలోని ఆంతర్యం.

త్రేతాయుగంలో విభవావతారమూర్తిగా సంచరించిన శ్రీరాముడు, అర్చావతార మూర్తిగా వెలసిన అపూర్వ సన్నిధానం భద్రాచల క్షేత్రం. తెలుగువారి అయోధ్యాపురిగా పరిఢవిల్లుతున్న భద్రాద్రిలో రాముడు వైకుంఠరామునిగా, రామనారాయణమూర్తిగా గోచరిస్తున్నాడు. ఈ క్షేత్రంలో జరిగే పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం 'నవాహ్నిక పంచకుండాత్మక పంచేష్టి సహిత చతుర్వేద హవన పురస్కృత శ్రీరామాయణ మహా క్రతువు'గా ఆవిష్కృతమవుతుంది. పన్నెండు పుష్కర నదులనుంచి, నాలుగు సముద్రాలనుంచి పావన జలాల్ని తీసుకొచ్చి సార్వభౌమ వర్చస్కంగా పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహిస్తారు. నవాహ్నిక దీక్షతో, 108మంది రుత్విక్కులతో, రామచంద్రుడికి సమస్త రాజలాంఛనాలతో సాగే ఈ వేడుక ఆసాంతం ఓ నేత్రోత్సవం. సకల గుణాభిరాముడి గుణగణాల్ని మనం అన్వయించుకోవడం కోసం, రామరాజ్యం నాటి ఆహ్లాదకర పరిస్థితులు వర్తమానంలో కూడా వర్ధిల్లాలని సంభావించడం కోసమే ఈ పట్టాభిషేక మహోత్సవం.

- డాక్టర్ కావూరి రాజేశ్‌పటేల్

ᐅఖాల్సాపంథ్




ఖాల్సాపంథ్ 

ప్రపంచంలో మరేదేశంలోనూ జరగని అద్భుత ఘట్టం భారతదేశంలో పంజాబ్‌లోని ఆనందపూర్ సాహెబ్‌లో 1699వ సంవత్సరం మార్చి 30న జరిగింది. సింహాలను శౌర్యానికి ప్రతీకగా చెబుతారు. సాధారణ వ్యక్తుల్ని సింహబలులుగా, శౌర్యధనులుగా, మహాయోధులుగా రూపొందించిన ఘనత సిక్కుల చివరి గురువు గురుగోబిందసింగ్‌దే! ఆయన పూర్వనామం గోబిందరాయ్. తొమ్మిదో గురువైన గురుతేగ్ బహదూర్ కుమారుడాయన.
కాశ్మీరు పండితులను మతం మారాల్సిందిగా అక్కడి గవర్నరు తీవ్రంగా ఒత్తిడి చేయడంతో వారు గురుతేగ్ బహదూర్‌ని శరణువేడారు. వారిని కాపాడే ప్రయత్నంలో గురుతేగ్ బహదూర్ తన శిరస్సునే అర్పించాడు. అప్పటికి కేవలం తొమ్మిదేళ్ల వయస్సుగల గోబిందరాయ్ పాలకుల దమనకాండను సమర్థంగా ఎదుర్కోగల యోధులుగా 'ఖాల్సా'లను రూపొందించాడు. 'ఖాల్సా' అంటే జీవితకాల పవిత్రయోధుడు. ధర్మరక్షణే అతని కర్తవ్యం.

సిక్కుల్ని సులభంగా గుర్తుపట్టగల విధంగా గురుగోబిందరాయ్ కకార పంచకాలు అనే అయిదు నిబంధనలు విధించాడు (1). కేశాలు, (2). కృపాణ్, (3). కచ్ఛా, (4). కడ (కడియం), (5). కంఘా (దువ్వెన). వీటిని ప్రతి సిక్కూ ధరించాలి.

ఖాల్సా ధర్మ స్వీకరణ 'పహుల్' (అమృతస్వీకరణ) ద్వారానే జరుగుతుంది. ఒక కళాయిలో 'పటాషా'లనే తీపి గుళికలు వేసి, అందులో పవిత్ర జలాలను పోసి, పంచబాణీలు పఠిస్తూ, గురువు తన 'ఖండ' (ఖడ్గం)తో ఆ మిశ్రమాన్ని బాగా కలియబెట్టాడు. గురువు ఆజ్ఞమీద తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి ముందుకు వచ్చిన అయిదుగురు శిష్యులకు (వీరినే పంచప్యారీలంటారు) ముందుగా మంత్రపూరితం, మధురమైన ఆ అమృతాన్ని (పహుల్) తీర్థంగా ఇచ్చి, తిరిగి వారినుంచి గురుగోబిందరాయ్ అమృతాన్ని స్వీకరించాడు. అదే సమయంలో 'పహుల్' స్వీకరించినవారి పేర్లను 'సింగ్' అనే గౌరవనామంతో జతచేశాడు. తన పేరును గోబిందసింగ్‌గా మార్చుకున్నాడు. తన 'ఖాల్సాలు' ఒక్కొక్కరు లక్షా పాతిక వేలమంది శత్రువులను సంహరించగలరని, పిచ్చుకలు డేగల్ని వేటాడిన రీతిలో సంఖ్యలో తక్కువైనా శౌర్యంలో అసమానులుగా ఉంటారని గురుగోబిందసింగ్ ప్రకటించాడు. ఆయన ఆకాంక్షను ఖాల్సాలు అనేక ధర్మయుద్ధాల్లో నిజంచేసి చూపించారు. శత్రువులకు 'ఖాల్సా'లు సింహస్వప్నమైనారు.

గురుగోబిందసింగ్ ఎంతటి మహాయోధుడో అంతటి సాధువు. మీరీ-పీరీ (యోధుడు-సాధువు)గా ఆయన ప్రసిద్ధి చెందాడు. కులమతాలకు అతీతమైన సిక్కుధర్మాన్ని ఆయన మరింత ప్రతిభావంతంగా, శక్తిమంతంగా తీర్చిదిద్దాడు. గురుగోబిందసింగ్ ఒక అలౌకిక దివ్య తేజస్సుతో, వెయ్యి సింహాల శౌర్యంతో, పటిష్ఠమైన శరీరంతో రాచఠీవితో, ప్రేమ నిండిన హృదయంతో, విలక్షణమైన అపూర్వమైన వ్యక్తిత్వం కలిగి ఉండేవాడు.

ఖాల్సాలు ఉచ్ఛనీచ విచక్షణగానీ, పూర్వకుల, మత వివక్షగానీ చూపరు. అందరూ ఒకే పాత్రలోని ఆహారం స్వీకరిస్తారు. గురుద్రోహులు, పుత్రికా హంతకులు, ఖల్సాపంథ్‌లోకి చేరకుండా గురుగోబిందసింగ్ నిషేధం విధించాడు. వారితో సిక్కులు వైవాహిక సంబంధాలు పెట్టుకోకూడదని ఆంక్షలు విధించాడు. తన తరవాత శాశ్వత గురువుగా శ్రీ గురు గ్రంథ్ సాహిబ్‌ని నిర్ణయించి 1708వ సంవత్సరం అక్టోబరు ఏడోతేదీన గురు గోబిందసింగ్ పరమాత్మలో లీనమయ్యాడు.

'ఖాల్సాపంథ్' ఉత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా సిక్కులు ఏప్రిల్ 14వ తేదీన వైభవంగా జరుపుకొంటారు. ఆ రోజు గురుద్వారాలకు జాతిమతకుల భేదాలు లేకుండా ఎవరైనా వెళ్లి- ఉత్సవాల్లో పాల్గొనవచ్చు.

- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్

ᐅవిద్య పరమార్థం





విద్య పరమార్థం 

కమనీయమైన విద్య తాను కామధేనువులాగా కామితార్థాలు కలగజేస్తుంది. ఎన్ని దేశాలకు ఏగినా తల్లి చందంగా కాపాడుతుంది. సజ్జన సంఘంలో తనను సమ్మాన్యునిగా చేస్తుంది. తన పుణ్యపాపాలను ఎరిగిస్తుంది. ఇహపరాలను సాధిస్తుంది. అగ్నిలో కాలనిదీ, నీళ్లలో నాననిదీ, చోరుల పాలుగానిదీ, అన్నదమ్ముల ఆస్తి విభాగాలతో సంబంధం లేనిదీ విద్యే! విద్యాధనానికి ఎన్నటికీ చేటు రాదు. విద్యను నిగూఢ గుప్తమగు విత్తంగా, యశస్సు కలిగించేదానిగా, భోగకరిగా, విదేశాలకు ఏగినప్పుడు ఆప్తబంధువుగా, విశిష్ట దైవతమంగా భావిస్తారు. పంచతంత్రం, భర్తృహరి సుభాషిత రత్నావళి విద్యను బహుధా ప్రశంసించాయి. కేశపాశాలు, పుష్పసుగంధాలు, ఆభరణాలు నిజమైన భూషణాలు కావనీ, వాగ్భూషణానికి మూలమైన విద్యే నిజమైన విద్య అనీ చెబుతారు. విద్యను ధన సంపాదనకు ఒక దారిగా చెప్పిన మాట నిజమే గాని, అదే ప్రధాన ధ్యేయంగా పేర్కొనలేదు. 'విద్య భోగకరి'గా మాత్రమే గుర్తిస్తే లోకానికి విద్య వలన మేలుకంటే కీడే ఎక్కువ కలుగుతుంది. విద్య విచక్షణాజ్ఞానాన్ని పెంచే ఉత్తమ సాధనం. విద్య పరమార్థం లోక హితం. సాటివాడికి తోడుపడని విద్య నిరర్థకం.
ఒక గురువు ముగ్గురు శిష్యులకు విద్య బోధించారు.

'గురువుగారూ... మా విద్యాభ్యాసం పూర్తయింది! మాకు సెలవిప్పిస్తారా?' అని ప్రార్థించారు శిష్యులు. గురువుగారు ఆశీర్వదించారు. శిష్యులు మూటాముల్లే సర్దుకొని ఇళ్లకు పోవడానికి సిద్ధమయ్యారు.

'నాయనలారా! మీ వూరికి పోవడానికి అనేక మార్గాలున్నా, నేను చూపే దారిగుండానే మీరు వెళ్లండి!' అని గురువు ఒక బాట చూపారు.

ఆ రోజుల్లో విద్యార్థులు చెప్పులు వేసుకొనేవాళ్లు కాదు.

ఆ దారి అంతా కంటకమయంగా ఉంది. అజాగ్రత్తగా అడుగేస్తే ముళ్లు గుచ్చుకుంటాయి! మొదటి శిష్యుడు తన పాదాలకు ముల్లు గుచ్చుకోకుండా జాగ్రత్తగా నడుస్తూ ఎలాగో ఆ బాట దాటాడు. రెండో శిష్యుడు ఈ బాట ఎలా దాటాలా అని దీర్ఘంగా ఆలోచించగా ఒక ఉపాయం తట్టింది. చెట్టు బెరళ్లను పాదాలకు కట్టుకొని, ముళ్లు గుచ్చుకోకుండా ఆ దారిన నడిచి అవతలకు చేరాడు.

మూడో శిష్యుడు ఇలా అనుకున్నాడు. 'నేనూ ఏదో ఒక ఉపాయంతో ఈ కంటక మార్గంపై నడుచుకుంటూ ముందుకు సాగిపోవచ్చు. కానీ, నా తరవాత ఎవరైనా పొరపాటున ఈ మార్గాన నడిస్తే వాళ్లకు ఈ ముళ్లు గుచ్చుకుంటాయి. నేను ఇప్పుడే ఈ ముళ్లనన్నింటినీ ఏరివేస్తే భవిష్యత్తులో ఎవరికీ బాధకలగదు...అందరికీ మేలు జరుగుతుంది!'

వెంటనే అతడు పని ప్రారంభించాడు. వరసగా కనబడిన ముళ్లనన్నింటినీ ఏరిపారవేశాడు. దారిని నిష్కంటకం గావించాడు. మిగిలిన ఇద్దరు శిష్యులు ఎగతాళి చేస్తున్నా పట్టించుకోలేదు. ముళ్లు ఏరేటప్పుడు అవి కాళ్లకూ చేతులకూ గుచ్చుకొంటున్నా లెక్కచేయలేదు. తాను అనుకొన్న పని పూర్తిచేస్తూ ఆ ముళ్ల బాటను దాటాడు.

గురువుగారు వేగంగా వచ్చి అక్కడకు చేరారు. మూడో శిష్యుణ్ని ప్రశ్నించారు.

'ఎందుకు దారిలోని ముళ్లు ఏరివేశావు?'

'గురుదేవా! వ్యక్తి వేరూ, సమాజం వేరు కాదు. వ్యక్తి సమాజ శ్రేయం కోరుకోవాలి. అప్పుడే వ్యక్తులందరూ సుఖంగా ఉంటారు. సమాజం లేనిదే వ్యక్తి లేడు. సమాజ స్వరూపమే సర్వేశ్వరుడు. సమాజ సర్వేశ్వరుణ్ని పూజించిన వ్యక్తికి ఇహపరాల్లో సుఖాలు కలుగుతాయి. కొండల్లో, కోనల్లో, నగరాల్లో ప్రజలు- పండితులైనా, పామరులైనా, కుబేరులైనా, కుచేలురైనా తరతమ భేదం లేకుండా ఆ సమాజం అనే సర్వేశ్వరుడికి సేవ చేయాలి. ఇన్నాళ్లూ మీరు బోధించిన విద్య పరమార్థం ఇదే అని నేను అర్థం చేసుకున్నాను. దాన్ని ఆచరణలోకి పెట్టాలని ప్రయత్నం ప్రారంభించాను. ఈ దారిలోని ముళ్లను ఏరివేసి, ఇకపై ఈ దారిలో నడిచేవారికి కష్టం కలక్కుండా చేశాను. ఈవిధంగా నా చేతనైనంతలో సమాజ సర్వేశ్వరుణ్ని ఆరాధించాను' అన్నాడు వినయంగా.

గురువుగారన్నారు-

'నాయనలారా! చదువు అయిపోయింది, సెలవు ఇప్పించండి అన్నారు. నిజానికి మొదట ఈ దారిన వచ్చిన ఇద్దరికీ చదువు పూర్తికాలేదు. విద్య పరమార్థం తెలియనిదే చదువు పూర్తి అయినట్లు కాదు. ఈ మూడో విద్యార్థికే అది తెలిసింది. లోకహితం కోసమే విద్య అని ఇతడు గ్రహించాడు!'

- పి. భారతి