ᐅసంతోషం
'ఉన్న స్థితిలో నువ్వు సంతోషంగా లేకపోతే నువ్వెక్కడికి వెళ్ళినా ఎలా మారినా సంతోషంగా ఉండలేవు' అనేవారు స్వామి రామతీర్థ.
జీవితంలో కొంచెం మార్పు జరిగితే పరమసంతోషం కలుగుతుందనుకునేవాళ్ళున్నారు. వూళ్ళో రోడ్లు విశాలంగా పరిశుభ్రంగా, రద్దీలేకుండా ఉండాలని; నీరు, విద్యుచ్ఛక్తి, ఆసుపత్రులు, పాఠశాలలు లాంటి ప్రభుత్వ సంస్థలిచ్చే సదుపాయాలు ఏ ఇబ్బందులూ లేకుండా సవ్యంగా ఉండాలని అనుకుంటాం. ఇంటిస్థలం కొనుక్కుని, దాన్ని కబ్జాదారుల్నించి కాపాడుకుని, డబ్బు అప్పుచేసి, అక్కడ ఇల్లు కట్టుకుని, పురపాలక సంఘం నుంచి ఏ ఆంక్షలు లేకుండా మనింట్లో హాయిగా నిశ్చింతగా ఉండాలనుకుంటాం. నిజంగా ఇవన్నీ సాధించగలిగినా మనకు అసలైన సంతోషం సమకూరుతుందా?
వేదాంతమేమంటుంది?సంతోషం ఎక్కడినుంచో రాదు. అది నువ్వు ఎంచుకునే స్థితి. కేవలం అది నీ మానసిక స్థితి. కావాలనుకుంటే పైన చెప్పిన సదుపాయాల్లో ఏది తక్కువైనా సంతోషంగా ఉండవచ్చు. అన్నీ అనుకున్నట్టు జరుగుతున్నా ఇంకా ఏదో కావాలని అనిపించినప్పుడు ఆ సంతోషం మనసులో నిలువదు.
అంటే, బాహ్యస్థితిగతులకు అతీతంగా ఉన్నప్పుడే సంతోషస్థితిని మనసు ఆస్వాదించగలుగుతుందని అర్థం. లేకపోతే- భౌతికంగా ఎన్ని సంపదలున్నా, ఎంతమంది పనివాళ్లున్నా, ఎన్ని సేవలందుతున్నా ఆనందం అందని పండే అవుతుంది!
ఈ స్థితిని అధిగమించటానికి వేదాంతం సాయపడుతుంది! చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సమగ్ర దృష్టితో చూడగలిగితే బోధపడుతుంది. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ప్రకృతి మనిషికి అపారమైన సౌకర్యాలు అందిస్తున్నందుకు మనమెంతో రుణపడి ఉండాలి. అప్పుడు ఒకరిని సంతోషపెట్టడంలో ప్రకృతి ఎంత ఆనందాన్ని అనుభవిస్తోందో అవగాహన కలుగుతుంది. అప్పట్నుంచి మనకింకా ఏదో కావాలన్న కోరికలు అణగారిపోయి ఉన్నంతలోనే ప్రతిఫలం ఆశించకుండా పరులకు మన ఆనందాలు, సుఖాలు పంచటంలోని పరిపూర్ణ ఆనందం అనుభవానికి వస్తుంది. ఆపై ఎలాంటి అసంతృప్తులూ కలగవు. కోరికలకు అతీతమైన తృప్తితో గుండె నిండుతుంది. అదే అసలైన ఆనందమయస్థితి! ఆధ్యాత్మిక నిచ్చెన కిందమెట్టుమీదే ఉన్నవాడికి ఎన్ని మేడలున్నా చాలదు. ఎంత బంగారమున్నా తృప్తి కలగదు. ఎంత ఆదాయం వస్తున్నా సరిపోదు. వారెవరికో ఇంత ఉంది కనుక, తమకు పదింతలు రావటంలేదే అన్న బాధ. ఆ అశాంతితో పంచభక్ష్యపరమాన్నాలున్నా సయించవు. హంసతూలికా తల్పాలమీదా సుఖనిద్ర రాదు.
ఆధ్యాత్మిక సంపదను పెంచుకుంటూ నిచ్చెన పైమెట్టు వైపు నడిచిపోతూంటే భౌతిక సంపదలపై కోరికలు తరిగిపోయి నశించిపోతాయి. ఆత్మానందమయస్థితికి చేరుకోగలిగినప్పుడు ప్రపంచంలోని ఏ భౌతిక సంపద మీదా ఆధారపడాలని అనిపించదు. కాళ్ళు చాచుకోవటానికి ఆరడుగుల నేల చాలు. పైన కాస్తంత కప్పుతో ఎండ వానలనుంచి రక్షణ దొరికితే చాలు. వాహనం లేకపోయినా రహదారి సౌలభ్యంగా ఉంటే చాలు. మృష్టాన్న భోజనం లేకపోయినా- ఆకలి వేసినప్పుడు పట్టెడన్నం దొరికితే చాలు. రాత్రయితే కటికనేలమీదైనా నిశ్చింతగా నిద్ర పట్టేస్తుంది. అదే సంతోషమయమైన మానసికస్థితి!
- విమలారామం