ᐅవిశ్వసందేశం




విశ్వసందేశం 

భక్తి హృదయానికి సంబంధించినది. హృదయమే భక్తికి స్థానం. ఆరాధ్యదైవంలోగల మహత్వాన్ని అంగీకరించడాన్ని శ్రద్ధ అంటారు. ఒకరిలో ఒకరు విలీనం కావడం ప్రేమ అనిపించుకుంటుంది. శ్రద్ధ, ప్రేమ- ఈ రెండూ భక్తిలో అంతర్లీనమై ఉంటాయి. ఆరాధ్యదైవం మహత్వం, ఆరాధకుని అల్పత్వం భక్తిలో కనిపించే ప్రధానాంశాలు. ఈ భక్తినే తులసీదాసు తన రామాయణంలో వ్యక్తం చేశాడు.
భయవిహ్వలుడైన భక్తుని హృదయంలోంచి బయల్వెడలిన భావ తరంగాలు భగవంతుని మహత్వం వైపు పయనిస్తాయి. ఆ మహత్వమూ భక్తునిపై దయతో ద్రవించి అతని లఘుత్వం వైపు స్రవిస్తుంది. ఈ విధంగా గురుత్వ లఘుత్వాలు ఏకమవుతాయి. భక్తుడు, భగవంతుడు ఒకరిలో ఒకరు ఇలా విలీనమైనందువల్ల భక్తునిలో భగవంతునిపై విశ్వాసం పెరుగుతుంది. అప్పుడే అతని భక్తి భగవంతునిపై స్థిరంగా దృఢంగా నిలిచిపోతుంది. భక్తుని సదాచార పరాయణతా అచంచలమై అలరారుతుంది. మనలో దైవభక్తి మొలకెత్తాలంటే దైవ మహిమపై స్పష్టమైన అవగాహన ఉండాలి. దైవంపై మనకు అచంచలమైన విశ్వాసం ఉండాలి. దృఢమైన నమ్మకం ఉండాలి. తులసీరామాయణం చెప్పిన భక్తి పద్ధతి ఇదే.

భగవంతుడు ధర్మస్వరూపుడు. చరాచర జగత్తులో వ్యాపించిఉన్న పరమేశ్వరుని ఈ ధర్మస్వరూపాన్నే- ఈ సత్‌స్వరూపాన్నే- విశ్వమందంతటా మనం చూడగలగాలి. అప్పుడే మన హృదయం దైవానికి చేరువ కాగలుగుతుంది. అప్పుడే మానవునిలో మాధవుడు, జీవునిలో శివుడు మనకు దర్శనమిస్తారు. భగవంతుని ఆ సత్‌స్వరూపాన్ని సకల జీవుల్లో మనం చూడగలిగిననాడు దైవికమైన ఆనందాన్ని అనుభవించగలుగుతాం. భగవంతుని ఆ స్వరూపాన్ని మనం దర్శించడంలోని తరతమ భేదాల వల్లనే- కుటుంబ ధర్మం, జాతిధర్మం, సమాజ ధర్మం, విశ్వధర్మం అనే నాలుగు విధాలైన భేదాలు కనిపిస్తున్నాయి. కుటుంబ ధర్మం పరిమితమైన పరిధి గలది. దీనికంటే జాతిధర్మం విస్తృతమైనది, ఉన్నతమైనది. ఇంతకంటే విశాలమైనది సమాజధర్మం. సర్వోన్నతమైనది విశ్వ (లోక)ధర్మం. కేవలం ఒక్క గృహం కాని, జాతి కాని, సమాజం కానీ- వీటి కల్యాణానికి సంబంధించిన ధర్మాల కంటే విశ్వకల్యాణానికి సంబంధించిన ధర్మం శ్రేష్ఠమైనది. కారణం అది విశ్వధర్మం కావడమే. అంటే లోకంలో గల సమస్త జీవుల హితాన్ని కోరే ధర్మమన్నమాట. అందుచేత అది పూర్ణధర్మం. భగవంతుని సత్‌స్వరూపం కూడా అదే. తులసీ రామాయణ సందేశమిదే.

రాముడు ధర్మస్వరూపుడు. రామభక్తుల్లో అగ్రగణ్యుడైన భరతుడు రాముని పట్ల పరిశుద్ధమైన ప్రేమ గలవాడు. పవిత్రమైన శీలం గలవాడు, రామవిరోధాన్ని ధర్మ విరుద్ధంగా భావించినవాడు. కాబట్టే రాముడు అడవులకు వెళ్లడాన్ని సహించలేకపోయాడు. శిష్టమైన సమాజ మర్యాదను ఉల్లంఘించాడు. పూజ్యురాలైన తల్లి కైకేయిని తిరస్కరించాడు. దూషించాడు. ఆమెకు దూరంగా ఉన్నాడు. కారణం, ఆమెవల్ల ధర్మానికి హాని కలిగింది. సాకేతనగరం శోకసాగర తరంగాలతో తల్లడిల్లింది. దశరథుడు మృత్యువాత పడ్డాడు. ధర్మహాని జరిగినందువల్లనే ఇన్ని అనర్థాలు కలిగాయని భరతుడు గ్రహించాడు. అందుకే సాక్షాత్తు ధర్మస్వరూపుడైన రాముని పట్ల మౌనం వహించలేకపోయాడు. ఉత్కృష్టమైన విశ్వధర్మాన్ని కాపాడ్డానికి సమాజ ధర్మాన్ని ఉల్లంఘించటం తప్పిదం కాబోదని గ్రహించి తల్లిపై ఆగ్రహించాడు.

విభీషణుణ్ని ఇంటిగుట్టు రచ్చకెక్కించిన భ్రాతృద్రోహిగా, కులద్రోహిగా బంధువర్గంలోనివారు తూలనాడారు. కాని విభీషణుడు ధర్మస్వరూపుడైన రాముడికి భక్తుడు. సీతాపహరణంతో రావణుడి అత్యాచారాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. హనుమంతుణ్ని చూడగానే ధర్మస్వరూపుడైన భగవంతుడు అవతరించాడని విభీషణుడు గ్రహించాడు. అన్న రావణుని చెంతకేగి ధర్మస్వరూపుడైన రాముడికి సీతమ్మను అప్పగించమని హితబోధ చేశాడు. రావణుడు వినలేదు. పవిత్రమైన విశ్వధర్మానికి హాని కలుగుతుందని గ్రహించిన విభీషణుడు పరిమితమైన కులధర్మాన్ని విడిచిపెట్టాడు. ధర్మచ్యుతుడైన రావణుణ్ని విడిచిపెట్టి ధర్మస్వరూపుడైన రాముణ్ని ఆశ్రయించాడు.

పరిమితమైన పరివార హితం కంటే విశ్వజనీనమైన విశాల లోకహితమే మానవులకు శిరోధార్యమన్నది తులసీదాసు సందేశం.

- కాలిపు వీరభద్రుడు